Jyothi Muvvala

Comedy Drama Action

4.7  

Jyothi Muvvala

Comedy Drama Action

ఉచిత సలహా

ఉచిత సలహా

7 mins
339


అబ్బబ్బా తెల్లారు లేచిన దగ్గర్నుంచి టీవీ ముందే అతుక్కుపోతావు. కాస్త మెడిటేషనో ,యోగానో ఏదో ఒకటి చేసుకోవే ఆ బుర్రైనా ప్రశాంతంగా ఉంటాది. ఆ పిచ్చి సీరియల్స్ అన్ని చూసి అక్కడ ఆ ఆడవాళ్లు ప్రయత్నిస్తున్న సైకో పనులన్నీ నామీద ప్రయోగిస్తున్నావు నీతో వేగలేక చస్తున్నా అని తలబాదుకున్నాడు  వెంకటేశ్వర్లు.


చాలెండి సంబరం. మీకేం !ఆఫీస్ అంటూ ఊరు మీద బలాదూర్లన్నీ  తిరిగి వస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉండి నాకు బోర్ కొడుతుంది. ఎంతసేపని ఇంట్లో వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతాను. ఈమధ్య మా ఇంట్లో వాళ్ళు నేను ఫోన్ చేస్తేనే హడలిపోతున్నారు.

 

మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఏవరు ఫోన్ చేయకపోయినా ఏదో ఫోన్ వచ్చిందని అబద్ధం చెప్పి మరి నా ఫోన్ కట్ చేస్తున్నారు.

 

ఇంట్లో మాట్లాడడానికి ఎవరూ లేక కనీసం ఫోన్ లో కూడా ఎవరూ మాట్లాడక మెదడు పిచ్చెక్కిపోతుంది.ఆ టీవీ పెట్టుకుంటే కాస్తయినా టైం పాస్ అవుతుంది.

మీకేం తెలుసు మా ఆడవాళ్ళ బాధలు అంటూ ముఖం తిప్పుకుంది తిలోత్తమ.


నీ కన్వీనెంట్ కోసం ఏదైనా చెప్తావే నువ్వు! ఏ పుస్తకమో ,నవలో చదువుకోవచ్చు కదా! 

మనం చేసే పని ఉపయోగపడేలా ఉండాలి అంతేగాని సమయాన్ని వృధా చేసుకోకూడదు.

మీలాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే టీఆర్పి రేట్లు కొసం కంటెంట్ లేకపోయినా వారానికి ఒక కొత్త సీరియల్  పుట్టుకొస్తుంది.

నీతో మాట్లాడి గెలవటం నావల్ల కాదు నిన్ను కదిపి తప్పు చేశాను అని తనని తాను తిట్టుకున్నాడు వెంకటేశ్వర్లు.


నాతో పోట్లాడ్డానికి అయితే మీకు సమయం ఉంటుంది  గాని నాతో మాట్లాడడానికైతే మీకు సమయం ఉండదు. ఎప్పుడు చూడండి ఆఫీసు నుండి వచ్చిన తర్వాత కూడా ఆ ఫైల్స్ ముందేసుకుని ఉంటారు తప్ప నాతో ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడుతారా? ఏదో ఇంట్లో వండి పెట్టడానికే వంట మనిషి లాగా ఉన్నాను గానీ నాతో మీకు మాట్లాడే తీరికే లేదు అంటూ కళ్ళు ఒత్తుకుంది తిలోతమ.


అబ్బా!మళ్లీ మొదలెట్టవా? కదిపితే చాలు టాప్ ఇప్పినట్టు కలలో నుంచి బడపడ ఆ కన్నీళ్లు వదిలేస్తావు. సరేలే నీకు నచ్చింది చేసుకో అని చెప్పి ఆఫీసుకు వెళ్లిపోయాడు వెంకటేశ్వర్లు.


ఎప్పట్లాగే తిలోతమ ఇంటి పని అంతా ముగించుకొని సీరియల్ పెట్టుకుని చూస్తుంది.

 ఎప్పుడు సాయంత్రం 6 గంటలకే ఆఫీస్ నుంచి వచ్చే వెంకటేశ్వర్లు

ఆరోజు ఎనిమిదైనా ఇంకా ఇంటికి రాలేదు.

సీరియల్ గొడవలో పడి తిలోతమ టైం కూడా చూసుకోలేదు.

సీరియల్స్ అన్నీ అయిపోతున్నాయి. అప్పుడు తిలోత్తమకు తన భర్త ఇంకా ఇంటికి రాలేదని గుర్తొచ్చి భర్తకు ఫోన్ చేసింది.


కానీ వెంకటేశ్వర్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు.

 రెండు మూడు సార్లు ప్రయత్నించింది. అయినా ఫోన్  ఎత్తకపోయేసరికి కోపం వచ్చి చేయటం మానేసింది.


అక్కడ వెంకటేశ్వర్లు ఫోను కూడా ఎత్తలేని స్థితిలో ఉన్నాడు.

ఆఫీసులో ఎంతో ఇంపార్టెంట్ అయిన ఫైల్ ఒకటి పోయింది. అదే ఫైల్ ని ఆరోజు తన బాస్ తనని అర్జెంటుగా తీసుకురమ్మన్నాడు.

తీరా చూస్తే ఆ ఫైలు కనిపించడం లేదు. ఆ సంగతి చెప్పగానే, బాసు వెంకటేశ్వర్ల పైన మండిపడ్డాడు. నైట్ ఏ టైం అయినా సరే తనకా ఫైల్ ఇచ్చి తీరాల్సిందే అని ఆర్డర్ వేశాడు. అందుకే ఆఫీసు మొత్తం జల్లెడ పట్టి తన క్యాబిన్ మొత్తం వెతుకుతున్నాడు.


అలా ఫైల్ వెతికి, బాసుకి అందజేసి ఇంటికి బయలుదేరేసరికి వెంకటేశ్వర్లకి రాత్రి 11 అయింది.

అప్పటికే భర్త కోసం ఎదురుచూసి ఎదురుచూసి బోర్గా ఫీల్ అయిన తిలోత్తమా మెల్లగా నిద్రలోకి జారుకుంది.


అంతలో ఇంటి వెనుక భాగంలో ఉన్న డోరు తెరిచిన శబ్దం వినబడింది. కానీ నిద్ర మత్తులో తిలోత్తమ పట్టించుకోలేదు.

బాగా ఎత్తుగా బలంగా ఉన్నా ఒక దొంగ తిలోత్తమ ఇంటిలోకి దొంగతనానికి దూరాడు.

హాల్లో సోఫాలో పడుకున్నా తిలోత్తమను చూసి శబ్దం రాకుండా మెల్లగా బెడ్ రూమ్లోకి వెళ్లి  బీరువా తాళం తెరిచి తనకు కావాల్సినవన్నీ సర్దుకుంటున్నాడు. అలా ఇల్లు మొత్తం కనిపించిన కాస్ట్లీ వస్తువులు అన్నిటిని సర్దేశాడు.

వెళ్ళిపోతూ ఉండగా డైనింగ్ టేబుల్ మీద ఉన్న వంటలు ముక్కు పుటారాలను అదరగొట్టడంతో రుచి చూడాలని నాలుక పీకేసింది.

ఆరాటం ఆపుకోలేక సర్ధుకున్న బ్యాగ్ పక్కన పెట్టి కూర్చొని తినటం ఆరంభించాడు.


గిన్నెల శబ్దం రావడంతో మెలకువ వచ్చింది తిలోతమకు.

అదేంటి  తలుపు తియ్యకుండా తన భర్త ఇంట్లోకి ఎలా వచ్చాడు అని అనుకుంది.

లేచి గబగబా డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చింది.

టేబుల్ మీద కూర్చొని లొట్టలు వేసుకొని తింటున్న దొంగను చూసి

కెవ్వుమని కేక వేసింది.

ఇంతలో బొడ్డులో ఉన్న కత్తిని తీసి దొంగా "చూడు నా పని అయిపోయింది నేను ఇది తినేసి వెళ్ళిపోతాను.ఇలోగ నువ్వు అరిచి గోల చేస్తే చంపేస్తాను అన్నాడు."

ఇక భయంతో ఏం చేయాలో తెలీక నెమ్మదిగా నోరు మూసుకొని ఉండిపోయింది.

చక్కగా  వండిన వంటలన్నిటిని ఆరగిస్తున్నా దొంగ

ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. కళ్ళల్లో గిరిమని నీరు తిరిగాయి. అతనిని ఆ పరిస్థితుల్లో చూసిన తిలోత్తమకు ఏమీ అర్థం కాలేదు. చిన్న పిల్లోడిలా గుక్క పెట్టి ఏడుస్తున్న దొంగను చూసి ఎలా సమదాయించాలో తెలియలేదు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని  "ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగింది."


"నీ వంటలు చాలా బాగున్నాయి మా అమ్మని గుర్తు చేశాయి అని చెప్పాడు."

"నీకు నచ్చాయా ? అని ఆత్రుతగా అడిగింది."

"నచ్చటమా! ఇప్పటివరకు ఇలాంటి వంట నేనెప్పుడూ తినలేదు మా అమ్మ చేతి వంట తర్వాత  నీ చేతివంటే !

 అమృతంలా ఉంది అని చెప్పాడు."

"ఆ మాటలకు మురిసిపోయింది తిలోత్తమ."


వండినవి ఇంకా ఫ్రిడ్జ్ లో ఉన్నవి కూడా తీసుకొని వచ్చి వడ్డించింది. మాట మాట కలిపింది. అలా మాటల్లో మునిగిపోయారు.

అలా మాట్లాడుతూ మాటల సందర్భంలో" ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావాఅమ్మ అని అడిగాడు దొంగ."

"లేదు మా ఆయన వస్తాడు ఇంకా రాలేదు ఈరోజు అని చెప్పింది."


"మరి రోజంతా ఇలా ఒక్కదానివే ఏం చేస్తావు అని అడిగాడు దొంగ."

నాతో ఎవరూ మాట్లాడరు ,నాకు రోజంతా బోర్ కొడుతుంది అందుకే టీవీ సీరియల్స్ చూస్తాను.

 కానీ మా  వారికి నేను టీవీ చూడటం ఇష్టం లేదు. నన్ను పుస్తకాలు చదవమని చెబుతూ ఉంటారు కానీ నాకే చదవడం అంటే ఇష్టం లేదు అని చెప్పింది.


 చదవడం ఇష్టం లేకపోతే నువ్వే కొత్తగా ఏదైనా రాయు అన్నాడు దొంగ.

"అమ్మో నేనా? నాకు రాయటం రాదు అయినా రాయాలంటే ఏదైనా సబ్జెక్టు తెలిసి ఉండాలి కదా నాకు దేనికోసం తెలియదు అని అన్నాది తిలోత్తమ."


"రాయడం ఏమైనా బ్రహ్మవిద్య? నాకంటే చదువు రాదు. అందుకే దొంగతనాలు చేసుకుంటున్నాను.నువ్వు చదువుకున్నావు కదా! ఏదైనా కొత్తగా రాసి పంపిస్తే నీ స్టోరీ కూడా సీరియల్స్ లో వస్తాది అని చెప్పాడు."


అతని మాటలు కొత్తగా ,ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి తిలోత్తమకి.

మనలాంటి వాళ్ళు కథలు రాస్తే సీరియల్స్ తీస్తారా అని ఆశ్చర్యంగా అడిగింది.

ఎందుకు తీయరు ?ఎవరికీ తెలియని  కొత్త కథ రాస్తే తప్పకుండా తీస్తారు అని చెప్పాడు దొంగ.


కానీ కొత్త కథ ఎవరికీ తెలియని కథ ఎలా తెలుస్తుంది? అని అడిగింది తిలోత్తమ.


హో ఎందుకు ఉండవు. మా గల్లీలో ఇంటింటికో స్టోరీ అని చెప్పాడు.


అతని మాటలు విన్న తిలోత్తమకు ఒక ఆలోచన వచ్చింది. ఈమధ్య సినిమాలన్నీ కూడా దొంగల మీద తీసిన స్టోరీలే. అవి కూడా చాలా బాగా హిట్ అయ్యాయి. అవార్డులు కూడా వచ్చాయి. కనుక ఇతడికి  తెలిసిన కథలన్నీ కలిపి  సీరియల్ కింద రాసి పంపిస్తే తన సీరియల్ కూడా హిట్ అవుతుందని బలంగా నమ్మింది.


అందుకే తనకి ఒక సాయం చేయమని కోరింది దొంగని.

ఏమిటని అడిగాడు దొంగ.

నన్ను నోరారా చెల్లమ్మ అని పిలిచావు కదా! చెల్లమ్మ ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తారా ? నీకు కొంత డబ్బు ఇస్తాను తీసుకొని వెళ్ళిపో కానీ రోజూ నువ్వు నీకు తెలిసిన స్టోరీలన్నీ నాకు చెప్పాలి అవన్నీ నేను కథగా రాసి సీరియల్కి ఇస్తాను అని చెప్పింది.


ఆ మాటలు విన్న దొంగ ఆలోచనలో పడ్డాడు.వచ్చామా దొంగతనం చేసుకొని వెళ్ళిపోయామా అన్నట్టు ఉండక ఎందుకు నాకు ఈ తలనొప్పి అనుకున్నాడు.

అతని ముఖ కవళికలు బట్టి ఒప్పుకోవటానికి తిరస్కరిస్తాడని గమనించిన తిలోత్తమ.


"ఎన్నాళ్ళని ఇలా దొంగతనం చేసుకుంటావు.దొరికిన ప్రతీసారి ఒళ్ళు హూనమయ్యేలా కొడతారు.

నీకు వయసు అయిపోతుంది కదా నేను సీరియల్స్ రాసి డబ్బు సంపాదించడం మొదలుపెడితే నీ కథలకు నా అక్షరాల తోడైతే మనమే పెద్ద రైటర్లు అయిపోవచ్చు ఇప్పుడు అన్ని దొంగల మీద తీసిన సినిమాలే బాగా హీట్ అయిపోతున్నాయి. అని దొంగని సతవిధాల ఒప్పించడానికి ప్రయత్నించింది."


ఆమె మాటలు విన్న దొంగ ఇలా అనుకున్నాడు.రోజు దొంగతనానికి వెళ్లినా దొంగతనం చేయడం చాలా కష్టం. ప్రాణాలకు తెగించి చేయాల్సిన పని. పిలిచి ఈమె డబ్బులు ఇస్తాను అంటే ఎందుకు కాదనాలి ? ఈమె ఇచ్చే డబ్బులతో నాకు ఒక రోజు తిండి కర్చు గడిచిపోతుంది. అలా కాకపోయినా ఈ తింగరిది నిజంగా కథ రాస్తే అది బాగా సక్సెస్ అయితే నాకు పేరు కూడా వస్తుంది అని అనుకున్నాడు. అందుకే తిలోత్తమకి కథ చెప్పటానికి ఒప్పుకున్నాడు. 


  కానీ ఈరోజు కాదు నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను. నాకు  తెలిసిన స్టోరీలన్ని చెప్తాను ఇప్పటికే చాలా లేట్ అయింది అని  ఇంట్లో తీసిన బంగారం నగలు వదిలేసి తిలోత్తమ ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.


 అలా రోజు రాత్రిపూట తిలోత్తమ దొంగకు ఇష్టమైన వంటలన్నీ చేసి తనకోసం ఎదురు చూస్తూ ఉండేది.

ఆ దొంగ రోజు వచ్చి  కథలను కొద్ది కొద్దిగా చెబుతూ వండినవన్నీ కడుపునిండా తిని వెళ్లిపోతూ ఉండేవాడు.

ఇలా ఉండగా ఒకరోజు వెంకటేశ్వర్లకు తన భార్య మీద అనుమానం వచ్చి  తిలోత్తమ మీద ఒక కన్నేసి ఉంచాడు.




ఎప్పటిలాగే దొంగ అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు తిలోత్తమ దొంగ కోసం వండిన వంటకాలు అన్ని సిద్ధం చేసి పెట్టింది. మొదటిసారి వెంకటేశ్వర్లు దొంగని చూడగానే కంగారు పడ్డాడు. చేతిలోకి కర్ర తీసుకొని దాడి చేయడానికి సంసిద్ధుడయ్యాడు. ఇంతలో తిలోత్తమా నవ్వుకుంటూ వెళ్లి దొంగను పలకరించి తినటానికి పెట్టింది.దొంగ తినటం పూర్తి కాగానే తన కథను చెప్పడం ఆరంభించాడు.

ఇదంతా వెంకటేశ్వర్లు చాటుగా ఉండి గమనిస్తున్నాడు.


మొదట వెంకటేశ్వర్లు భార్య తప్పుడు త్రోవ పడుతుందని బ్రమ పడ్డాడు. కానీ అతడు తినేసి కథ చెప్పి వెళ్లిపోవడం చూసి వెంకటేశ్వర్లుకి ఏమీ అర్థం కాక ఆర్చర్యపోయాడు.


మరుసటి రోజు భార్యను నిలదీశాడు." మీరే కదండీ చెప్పారు ఏదైనా పనికొచ్చే పని చేయమని అందుకే నేనే కొత్తగా కథలు రాయడం మొదలు పెట్టాను. అందరిలా రొటీన్గా కాకుండా వెరైటీగా ఒక దొంగ జీవిత కథను సీరీస్గా రాసి టీవీ చానల్స్ కి పంపిస్తాను.

ఇది జరిగిన కథ కనుక తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది నా కథ సీరియల్గా తీస్తారు నాకు మంచి పేరు వస్తుంది అని గొప్పగా చెప్పింది." అంతా బానే ఉంది గాని అతడు నీకెందుకు అతని కథ చెబుతున్నాడు ?అసలు అతను నీకు ఎలా పరిచయం? అని అడిగాడు వెంకటేశ్వర్లు.


అదా మొన్న మన ఇంటికి దొంగతనానికి వచ్చాడు లెండి. దొంగతనం చేయకు నేనే రోజు నీకు డబ్బులు ఇస్తాను నీ కథ చెప్పు అన్నాను అని చావు కబురు చల్లగా చెప్పింది.

భార్య చెప్పిన మాటలు విన్న వెంకటేశ్వర్లు 

భార్య తెలివితక్కువదనానికి ఏడవాలో లేక తాను బుద్ధిలేని సలహా ఇచ్చినందుకు చెప్పుతో కొట్టు కావాలో తెలియక  మూర్చ పోయాడు.



శుభం!


జ్యోతి మువ్వల





Rate this content
Log in

Similar telugu story from Comedy