kiran kumar satyavolu

Comedy

3.7  

kiran kumar satyavolu

Comedy

నో క్రెడిట్

నో క్రెడిట్

7 mins
1.5K


నో క్రెడిట్

'సెకెండ్ వైఫ్ బార్ & రెస్టారెంట్' లో అప్పటికే నా నాలుగో బీర్ గ్లాస్ ఖాళీ అయింది. 

నా ఫ్రెండ్ అజయ్ "చాలురా తాగింది. ఇప్పటికే ఎక్కువైంది." అన్నాడు.

"నా బాథ నీకేం తెలుసు..." అన్నాను ఇంకో బీర్ గ్లాస్ పుచ్చుకుంటూ. 

"నీకేం బాథ ఉందిరా? అన్ని సమయానికి అమరాయి. రేపో మాపో తండ్రివి కూడా కాబోతున్నావ్." అన్నాడు.

"నువ్వు నా చెప్పుల్లో నిలబడి చెప్పు..." అన్నాను.

"నీ కాలు సైజ్ తొమ్మిది. నాది ఏడు. అయినా నీకోసం నిలబడతాను." అని వాడు నా చెప్పుల్లో నిలబడి "చెప్పు.. అసలేం జరిగింది." అన్నాడు. 

నా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం కోసం గ్లాస్ ఎత్తి నోట్లో పోసుకుని, దాన్ని బల్ల మీద ధన్ మని పెట్టాను.

వాడివైపు వాలిపోతున్న రెప్పలతో చూస్తూ 

"ఒరేయ్, నువ్వెంత కష్టపడినా నీకు క్రెడిట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో తెలుసా? నా జీవితంలో నేను చేసిన ఏ పనికీ నాకు క్రెడిట్ ఇవ్వలేదు. ఇది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి విధి నాతో సైలెంట్ గా ఆడుతున్న వైలెంట్ ఆట." అన్నాను. 

వాడు నా చెప్పుల్లో సద్దుకుని నిలబడి చెవులప్పగించాడు.

* * *

అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు..

అమ్మకి వంటలో సాయం చేయడం చిన్నప్పటి నుండీ నాకు ఇష్టం. నాకో చెల్లి కూడా ఉండేది. దాని పేరు వసంత. ఇదే నా కథలో లేడీ విలన్. అది ఎనిమిదో తరగతి చదువుతుండేది. దాన్ని మా నాన్న ఎక్కువ గారాం చేసేడు. అమ్మకు కూడా చెల్లి వైపే! ఇంట్లో ఎప్పుడూ 1:3 ఉండేది. ఏమి జరిగినా వాళ్ళ ముగ్గురు ఏకమైపోయి నన్ను ఏకేసేవారు.

నేను క్లాస్ ఫస్ట్ వచ్చినా నాన్న నాకు ఏమీ తెచ్చేవాడు కాదు. అదే చెల్లికి పాస్ మార్క్ వస్తే చాలు! దానికి చాకొలెట్స్ ఇచ్చేవాడు. సినిమాలు, షికార్లు తిప్పేవాడు. బట్టలు, బంగారం కొనేవాడు.

నాకెందుకు ఇవ్వలేదు అనడిగితే "నువ్వు తెలుగు మీడియంరా.. అది ఇంగ్లీష్ మీడియం" అని చెప్పేవాడు.

నాకు ఉక్రోషం కలిగి, తరువాతి సంవత్సరం ఇంగ్లీష్ మీడియం మారతానన్నాను. మా స్కూల్ లో ఒప్పుకోలేదు. స్కూల్ మారిపోయాను. వాళ్ళేదో చిన్న టెస్ట్ పెట్టారు. పాస్ అయ్యాను. 

అలా నేను ఇంగ్లీష్ మీడియం మారి ముక్కిమూలిగి 10th గట్టెక్కాను. 55% వచ్చింది. ఏదేమైనా ఇంగ్లీష్ మీడియం మారి పాస్ అయ్యానని గర్వంగా "నేను ఇంగ్లీష్ మీడియం లో చదివి పాస్ అయ్యాను" అని చెప్పాను నాన్నతో. 

"నువ్వు తెలుగు మీడియంలో చదివుంటే 90% వచ్చేది. ఇంకెప్పుడూ ఇలాంటి పనికిమాలిన పనులు చేయకు." అని చివాట్లు పెట్టాడు నాన్న. 

ఆ మాటకు నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అయినా అందులోనూ నిజం లేకపోలేదు.

"నేను అన్నయ్యకు హెల్ప్ చేసాను నాన్న." అంది నా చెల్లి ఒత్తి వెలిగిస్తూ.

"ఏరా హెల్ప్ చేసిందా?" అనడిగాడు నాన్న.

"నిజమే చేసింది. అది ఇంగ్లీష్ మీడియం అని నాకు తెలియనివి అడిగి తెలుసుకున్నాను." అన్నాను నిజాయితీగా.

"అలా చెప్పు. నా బంగారు తల్లి సాయం చేయబట్టి నీకు ఆ 55% అయినా వచ్చాయి. లేకపోతే అన్ని ఫెయిల్ అయ్యేవాడివి." అన్నాడు నాన్న. 

నా నోట మాట రాలేదు.

నా కష్టానికి మొదటి క్రెడిట్ నా చెల్లెలు తీసుకుంది.

* * *

నేను, చెల్లి ఒకే కాలేజీ లో జాయిన్ అయ్యాం. నేను సీనియర్ , అది జూనియర్. నన్ను చూసి నా ఫ్రెండ్స్ దాన్ని ఏమి అనేవారు కాదు. నేనున్నానన్న ధైర్యంతో అది ఇష్టమొచ్చినట్టు చేసేది. నాకంటే వసంతే ఎక్కువ అల్లరి చేసేది. ప్రేమికుల మధ్య పంచాయితీలు చేసి ఇంటికి తీసుకొచ్చేది. నేను కవర్ చేయలేక చచ్చేవాడిని. అంత చేసినా 'అన్నయ్యా., థాంక్యూ' అని ఒక్క మాట కూడా చెప్పేది కాదు. 

కాలేజ్ లో ఉన్నపుడే వసంత క్లాస్మేట్ రంజిత్ ని లవ్ చేసింది. అందరికంటే ఆఖరిలో నాకు తెలిసింది. నేను నిజమా అని అడిగితే లేదని అబద్ధం చెప్పింది. వసంత నాకు కూడా భయపడుతుందా?! నాకే ఆశ్చర్యం! 

"అంత ఓవర్ చేయకు.. నిజం చెప్పు." అన్నాను.

"అవును. కానీ రంజిత్ కి ఇంకా తెలియదు." అంది.

"సరే, నేను మాట్లాడుతాను." అన్నాను.

"వద్దు.. నా ప్రేమ..నేను డీల్ చేసుకుంటాను." అంది.

"సరే నీ ఇష్టం. అవసరమైతే చెప్పు." అన్నాను.

"రంజిత్ మీద నీ అభిప్రాయం ఏంటి?" అనడిగింది.

"పాపం అమాయకుడు. నిన్ను చేసుకున్నాక చాలా ఫీల్ అవుతాడు." చెప్పాను.

"పోరా... ఎదవ.. నిన్ను అడిగాను చూడు. నాది బుద్ది తక్కువ!" అంది. 

* * *

కొంతకాలం దాని వన్ సైడ్ లవ్ చూడలేక చచ్చాను. 

విసుగుపుట్టి వన్ ఫైన్ ఈవినింగ్ రంజిత్ ని కలిసి వసంత ప్రేమ గురించి చెప్పేసాను. 

వాడు అంతా విని "నేను నమ్మలేకపోతున్నాను." అన్నాడు.

"ఏం నమ్మలేకపోతున్నావ్.? ఇలా ఒక అన్నయ్య తన చెల్లెలి ప్రేమ కోసం మాట్లాడటం కొత్తగా ఉందనా?" అడిగాను.

"కాదు. వసంత చెప్పినట్టే జరిగింది." అన్నాడు.

నా ఉత్సాహం నీరుగారిపోయింది.

"ఏం చెప్పింది?" అనడిగాను.

"నిన్ను బావ అని పిలవనా?" 

"పిలవచ్చులే గాని, ముందు విషయం చెప్పు." అన్నాను.

"అదే బావా, నిజానికి నేనే వసంతకి ప్రపోస్ చేసాను. కానీ అది నీకు తెలిస్తే గొడవ అవుతుందని, తన వైపు నుంచి ప్రేమ ఉన్నట్టు బిహేవ్ చేసింది. నువ్వు ఎలా అయినా తనకు సాయం చేయాలని చూస్తావని ఇలా నన్ను ఇగ్నోర్ చేస్తున్నట్టు ఉండమంది. అలా ఉంటే నువ్వే నన్ను వచ్చి అడుగుతావ్ అని చెప్పింది. నిజంగా తను చాలా గ్రేట్ బావా.. థ్యాంక్యూ బావా.." అన్నాడు హగ్ చేసుకుంటూ.

నా చెల్లి పెళ్ళికి సాయం చేస్తున్నాను అనుకున్న క్రెడిట్ కూడా దాని ఎకౌంట్ లోనే వేసుకుంది.

వసంత చేసిన పనికి నాకు తనపై చాలా కోపం వచ్చింది. నెలరోజులు పాటు నేను తనతో మాట్లాడలేదు. తను మాట్లాడాలని చూసినా నేను పట్టించుకోలేదు. 

* * *

ఓ రోజు ఇంటికి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉంది. నేను చూసి చూడనట్టు ఉన్నాను. 

నాన్న కూడా అప్పుడే వచ్చి వసంతని చూసి కంగారుపడిపోయాడు.

"ఏమైందిరా?" అంటూ పక్కనే కూర్చున్నాడు.

"అన్నయ్య నాతో మాట్లాడటం లేదు." అంది.

"రాజా...." నాన్న పిలిచాడు. కాదు అరిచాడు.

నేనెళ్ళి నాన్న ముందు నుంచున్నాను. 

నాన్నేదో క్లాస్ పీకబోయారు. నేను నా కాళ్ళ మీద నిలబడటం మొదలెట్టాను కదా, బాగా బెట్టు చేసాను. చివరికి నన్ను ఒప్పించలేక, చెల్లికి సద్ధిచెప్పారు. అదో రకమైన గెలుపులాంటి గెలుపు.

* * *

చెల్లిని ఆ రంజిత్ గాడికి ఇచ్చి పెళ్ళి చేసి పంపేసామ్. ఇక్కడినుంచి నా క్రెడిట్ కార్డ్ బిల్ నేనే కట్టుకోవచ్చు. నా క్రెడిట్ నేనే తీసుకోవచ్చని ఆనందించాను. మూడు నెలలు బాగానే గడిచాయి.

ఓ రోజు ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళే సరికి చెల్లి అమ్మతో కూర్చుని కబుర్లు చెప్తోంది.

"ఏంటి అప్పుడే గెంటేసాడా?" అనడిగాను.

"ఛి.. ఏంటా పిచ్చి మాటలు. నువ్వు మావయ్య అవుతున్నావ్" అంది అమ్మ. 

"నిజమా?" 

వసంత సిగ్గు పడింది. 

నా చెల్లి సిగ్గు పడటం అదే మొదటిసారి చూడటం. నాకు చాలా కొత్తగా అనిపించింది. 

"బావ ఎక్కడ?"

"బయటకు వెళ్ళాడు వచ్చేస్తాడు." అంది చెల్లి.

మా బావ గాడు లోపలికి వస్తూనే 'హాలో బావా, ఎలా ఉన్నావ్?" అరుస్తూ పలకరించాడు.

"ఇప్పటివరకు ఒకే." అన్నాను. 

మా బావగాడు నవ్వి "నేను ప్రాజెక్ట్ పని మీద నాలుగైదు నెలలు యు.ఎస్ వెళ్తున్నాను. డెలివరీ టైం కి వచ్చేస్తాను." అని చెప్పాడు.

వాడి చెవి దగ్గరకు వెళ్ళి "నువ్వు యు.ఎస్ వెళ్ళొచ్చాక ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు కదరా! అంత అర్జెంట్ గా నన్ను మావయ్యని చేయమని నీ మెడ మీద కత్తి పెట్టానా?" అనడిగాను.

"హహ.. మన చేతుల్లో ఏముంది బావ. నీకు పెళ్ళి అయితే తెలుస్తుంది. అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరిగిపోతుంటాయ్. నీ ప్రమేయం ఉండదు." అని నవ్వాడు.

* * *

మా బావ గాడి నాలుక మీద పుట్టుమచ్చ మహిమో ఏమో నేను మావయ్యని కాకముందే నాకు పెళ్ళి చేసేసారు. ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళా ముప్పై ఏళ్ళవరకు పెళ్ళి అవదని ఎవరో సిద్ధాంతి చెప్పారట అమ్మకి! అమ్మ నన్ను ఆజన్మ బ్రహ్మచారిగా చూడటం ఇష్టం లేక తత్కాల్ లో టికెట్ బుక్ చేసినట్టు హడావిడిగా పెళ్ళి జరిపించేసింది.

* * *

పెళ్ళైన నెలరోజులకి నాకు వేరే జాబ్ కి ఆఫర్ లెటర్ వచ్చింది. ఇప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ జీతం. అంతా కొత్త కోడలు వచ్చిన వేళా విశేషం అని నా గెలుపుని నా భార్య ఎకౌంట్ లో వేసేశారు.

నిజానికి నేను పెళ్ళికి ఆరు నెలల ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. అప్పుడే నేను సెలెక్ట్ అయ్యానని చెప్పారు. కానీ ఆఫర్ లెటర్ లేట్ గా వచ్చింది. ఈ పెళ్ళి టైం లో ఆఫర్ లెటర్ రాకూడదు అని బలంగానే కోరుకున్నాను. పెళ్ళి, ఉద్యోగం ఒకేసారి వస్తే ఎటుపోవాలో తెలియక నలిగిపోవాల్సి వస్తుందని భయపడ్డాను. అదృష్టం కొద్దీ పెళ్ళి అయ్యాకా కాల్ లెటర్ వచ్చింది. అయినా ఇక్కడ నా కష్టాన్ని గుర్తించే నాధుడే లేకుండాపోయాడు. పైగా నా భార్య "చూసారా.. నేను మీ ఇంట్లో అడుగు పెట్టాను. మీకు కొత్త జాబ్ వచ్చింది." అంది.

‘నీ మొఖం.. నాకు ఈ జాబ్ వస్తుందని నాకు ముందే తెలుసు’ అందామనుకున్నాను. కొత్త పెళ్ళాన్నీ బాధ పెట్టడం ఎందుకు అని నవ్వి ఊరుకున్నాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అని తరువాత నాకు తెలిసొచ్చింది. 

వారం రోజుల్లో జాయినింగ్ ఉంది.

ఈ వారంలో ఇల్లు ఆఫీస్ కి దగ్గరగా మారిపోవాలని నిర్ణయించుకుని ఆఫీస్ కి దగ్గరలో ఒక అపార్ట్మెంట్ లో ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఓనర్ కి అడ్వాన్స్ ఇచ్చాక, "ఇంతకు ముందు ఎంత వెతికానో ఇల్లు.. ఈరోజుకి దొరికింది..." అన్నాను నా భార్యతో.

"చూసారా.. నేను వచ్చాక, అన్ని ఒకదాని తరువాత ఒకటి అమరిపోతున్నాయ్ మీకు" అంది.

నాకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కానీ కొత్త పెళ్ళాం కదా,, "అవును. నువ్వు నా అదృష్టదేవతవి.." అన్నాను. 

ఆ మాటకు ఆమె మెలికలు తిరిగిపోయింది. ఎన్ని మెలికలు తిరిగిందంటే కళ్ళు తిరిగి పడిపోయేవాడు కూడా అన్ని మెలికలు తిరగడు. 

ఇలా మొదలైన నా ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్టు ప్రతి విషయంలోనూ నా పెళ్ళాం క్రెడిట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఓ రోజు కర్రీ బాగా వండాను. ఇద్దరం లొట్టలేసుకుని మరీ తిన్నాం.

"టేస్ట్ ఎలా ఉందో చెప్పనేలేదు." అన్నాను.

"సూపర్ ఉందండి." అంది.

నా ముఖం మతాబులా వెలిగిపోయింది.

"నేను కూరకు తగ్గట్టుగా తరగబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఇంత టేస్ట్ ఉండేది కాదు." అంది.

'చి,, నోర్ముయ్.. మనిషివేనా నువ్వు? కనీసం ఈ విషయంలో కూడా నా క్రెడిట్ ఇవ్వవా? దుర్మార్గురాలా!!' అందామనుకున్నాను.

కొత్త పెళ్ళాం కదా!! ఊరుకున్నాను.

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు నా పెళ్ళానికి ఈ క్రెడిట్ పిచ్చి పీక్స్ కి వెళ్ళిపోయింది. బట్టలు ఆరడానికి కారణం తను ఆరేసిన విధానమే అని, రూమ్ స్ప్రే వలన రూమ్ లో సువాసన రావడం లేదని - తను దాన్ని స్ప్రే చేసిన పధ్ధతిలో ఉన్న టెక్నిక్ వలన సువాసన వస్తోందని చెప్పింది. నాకు పిచ్చి రావడం ఒక్కటే తక్కువ అనే స్టేజ్ కి నన్ను తీసుకుపోయింది.

ఇక నాకు భయమేసి తను మాత్రమే నీళ్ళు పోయడం వలెనే పెరుగుతున్న మొక్కల ముందు నిలదీసాను.

"నేను పోసినా మొక్క పెరుగుతుంది. నేను అన్నం పెట్టినా కుక్క తోకూపుతుంది. నేను వండితేనే వంటకు రుచి వచ్చింది. ఎవడు స్ప్రే చేసినా రూమ్ స్ప్రే సువాసన ఇస్తుంది. ఎండ వల్ల బట్టలు ఆరుతున్నాయ్, గుండె కొట్టుకోవడానికి కారణం నువ్వు గుండెల్లో ఉండటం కాదు. నేను బతికుండటం." సింగల్ టేక్ లో డైలాగ్ చెప్పి వగర్చాను.

"అవన్నీ నాకు తెలుసు." అంది.

"మరెందుకు అలా అన్నీ చేసినట్టు బిల్డప్ ఇచ్చావ్"

"మీకు అలా క్రెడిట్ ఇస్తే నచ్చదట కదా!"

"ఎవరు చెప్పారు?"

"వసంత"

"అర్థమైంది..."

* * *

"వసంతా..." పెంకులెగిరిపోయేలా అరిచాను. కుర్చీలో కూర్చుని పిల్లాడిని ఆడిస్తున్న నా చెల్లి వసంత వీసన్మాత్రం కూడా కదలకుండా నన్ను చూసి కాలు మీద కాలు వేసుకుంది.

"అన్నయ్యంటే ప్రేమ లేదు. భయం లేదు. కనీసం గౌరవం కూడా లేదా?" గట్టిగా అరిచి ఖళ్ ఖళ్ మని దగ్గాను.

"గౌరవాలు, ప్రేమలు అడిగి పొందేవి కావు." అంది వసంత.

"చెల్లెలవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. ఇంక ఎప్పుడూ నా జోలికి రాకు. నా కష్టానికి ఫేమ్ అయినా బ్లేమ్ అయినా నాకే చెందాలి. ఇదే లాస్ట్ వార్నింగ్." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను.

* * *

"అంతే బానే ఉంది కదారా, చెల్లికి వార్నింగ్ ఇచ్చేసావ్. భార్యకు క్లారిటీ ఇచ్చేసావ్. ఇంకేంటి హ్యాపీగా ఉండచ్చు కదా!" అన్నాడు అజయ్.

"అక్కడే నా చెల్లెల్ని తక్కువ అంచనా వేసాను. నాకు కూతురు పుట్టాకా, చుట్టరికంగా నా ఇంటికి వస్తూ పోతూ ఉండేది. నేను పనుల బిజీ వలన పట్టించుకోలేదు. కానీ ఓ రోజు ‘నేను పుట్టాకనే నీకు ప్రమోషన్ వచ్చింది కదా నాన్నా’ అని అడిగించింది. నేను ‘అవున’ని చెప్పక తప్పలేదు."

"వెయిట్,,, ఇప్పుడు మీ వైఫ్ కన్సీవ్ అయింది సెకెండ్ చైల్డ్ కా?"

"అవును."

"యా.. గాట్ ఇట్. గో ఎహెడ్."

* * *

నిన్న మళ్ళీ వస్తే ఇదే విషయంపై నాకు వసంతకు సంతలో గొడవైనంత గొడవ అయింది. చివరగా అది వెళ్ళిపోతూ “రేపు నీకు పుట్టబోయే కొడుకు కూడా ఇలానే ఉంటాడు. ఉండేలా చేస్తాను. లేకపోతే నేను నీ చెల్లినే కాదు." అని శపథం చేసింది.

"ఎందుకే నేను అంటే ఇంత కక్ష?" ఏడుపులేని ఏడుపు ముఖంతో అడిగాను.

"నేను సారీ చెప్పినా నువ్వు నాతో మాట్లాడలేదు. నాన్నతో చెప్పించినా పట్టించుకోలేదు. అమ్మ బ్రతిమాలినా ఖాతరు చేయలేదు. అప్పుడే డిసైడ్ అయ్యాను నీకింక ‘నో క్రెడిట్’ అని " అంది.

* * *

"మరీ ఇంత సైకో ఏంటి భయ్యా నీ సిస్టర్"అన్నాడు అజయ్.

రజినీకాంత్ లా నవ్వి "బాబు ఇంకో బీర్ ...." అని అరిచాను.

* * *Rate this content
Log in

Similar telugu story from Comedy