జ్ఞాపకాల వంతెనలు
జ్ఞాపకాల వంతెనలు


కిటికీ దగ్గర కూర్చుని, మంచి పాటలు వింటూ బయటకు చూస్తూ ఉంటే మ్యూజిక్ కి తగ్గట్టు ఆలోచనలు రేగిపోతుంటాయు. అవి మనల్ని ప్రస్తుతంలోనే వదిలేసి, మనసుపొరపై వదిలి వెళ్ళిన జ్ఞాపకాల చారికాలను కళ్లముందుంచుతాయి.
గతానికి ప్రస్తుతానికి మధ్య కట్టిన వంతెనలు, ఒక్కో జ్ఞాపకం ఒక్కో వంతనై కూలిపోతూ ఉంటుంది. చేసిన తప్ఫలు, తప్పిన పరీక్షలు, దూరమైన స్నేహితులు, ఆదుకున్న ఆత్మబంధువులు, కొనకంటిన జారిన కన్నీళ్ళు, పెదవంచు నవ్వులు, దాగుడుమూతలు, దొంగ ముద్దులు, గెలుపోటములు, చేదు నిజాలు, నిట్టూర్పులు, అన్నీ ఫ్లాష్ కట్స్ లా కదిలిపోతాయి.
రోలర్ కోస్టర్ లా ఎక్కడ మొదలైందో అక్కడకు ఒక్క కుదుపులో మెలితిప్పి, మలుపులు తిరిగి, తల్లకిందులై, పైకి లేచి, కిందకు జారీ ప్రస్తుతంలో వదిలేస్తాయి.
ఆత్మావలోకనం మనం ఎక్కడున్నామో చెప్తుంది.
మొదటి నవల "మనసు పలికింది ఈ మాట" ప్రచురణ అయిన తరువాత నవల ఏమి రాయాలా అని ఆలోచిస్తున్నపుడు ఒక థ్రిల్లర్ సబ్జెక్టు రాయాలని అనుకున్నాను. నేను అసలు సస్పెన్సు రాయగలనో లేదో కూడా ఈ దెబ్బతో తేలిపోతుందని , ఒక ప్రయత్నం అయితే చేయాలనీ అనుకున్నాను.
*#మీరు ఒక కథ రాయాలని అనుకున్నారంటే దానికి సంబంధించినవన్నీ మీకు ఎదురుపడుతుంటాయి. ఇది నాకు అనుభవం.*
సో నేనేదో లైన్ అనుకుని దాన్ని చిన్నగా డెవెలప్ చేయడం మొదలెట్టాను. ఆల్రడీ మొదటి నవల పబ్లిష్ అయిన ఉత్సాహం ఒకటి తోడుంది. అప్పుడు మా ఆఫీస్ లైబ్రరీలో ఒక ఆర్టికల్ చదివాను. అది నేను రాస్తున్న నవలకు చాలా హెల్ప్ ఫుల్ అయింది. నేను ఎంచుకున్న థ్రిల్లర్ జోనర్ కి ఆ ఆర్టికల్ ఒక ఆయువుపట్టులా మారింది.
త్రివిక్రమ్ డైలాగ్ చెప్పినట్టు మొదటి నవల్లో పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించి ఈ నవల అంతా రక్తపాతాలతో కించెం వైలెంట్ గా రాయాలని అనుకున్నాను. ఆ సన్నివేశాలు ఆ నవల వరకు అవసరమని కూడా అనిపించాయి. పైగా మా సతీష్ ఉన్నాడుగా, ఏదైనా తేడా ఉంటే ముందే చెప్పేస్తాడు. కానీ సతీష్ కూడా ఉంచేయమని చెప్పాడు. ఇంక దైర్యంగా ఏది అనిపిస్తే అది రాసాను. ఆ నవలే "వైకుంఠపాళి".
వైకుంఠపాళి నవల మొదలవ్వడమే ఒక కుక్క ఓ మానవపిండాన్ని పీక్కు తింటూ ఉంటే ఓ వ్యక్తి గోడ చాటున నిలబడి చూసి, ఇంటికి పరిగెత్తుకెళ్ళు వాంతులు చేసుకుంటాడు.
ప్రారంభంలోనే ఎలాంటి రచన చదివించబోతున్నారనేది ముందే పాఠకులకు రుచి చూపించి, వారి మైండ్ ని ట్యూన్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. అందుకోసం అలాంటి ఓపెనింగ్ సీన్ తో నవల ప్రార
ంభించాను.
ఈ నవల రాస్తున్నప్పుడు నేను చేసిన పెద్ద తప్పు , పూర్తీ కథ అనుకోకుండా నవలను ప్రారంభించడం. రాసుకున్న పాయింట్స్ వరకు అన్ని రాసుకుంటూ వెళ్లిపోయాకా , సడన్ గా డెడ్ ఎండ్ ఎదురైనట్టు నవల ఆగిపోయింది. ఇప్పుడు నేను సొరంగం మధ్యలో ఉన్నాను. ముందుకెళ్లినా వెనక్కెళ్ళినా ఒకటే దూరం. ఆ 'సగం నవల' ఒకటికి పది సార్లు చదివాను.
అక్కడక్కడా మార్పులు చేర్పులు చేసాను. రెండు నెలలు టైం తీసుకుంది. మొత్తానికి ఓ రాత్రి పడుకునే ముందు బల్బ్ వెలిగింది. ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం విలన్ కి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ రెడీ అయింది. రాయడం మొదలు పెట్టాను. అప్పటికి నా దగ్గర లాప్టాప్ లేదు. నా కొలీగ్ ఓ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి సండే రోజు తీసుకుని ఉదయం నుండి ఎంత టైం వీలుంటే అంత టైం నవల రాస్తూ (టైపు చేస్తూ) కూర్చున్నాను. ఆఫీస్ లో ఉన్న ఫ్రెండ్స్ కి ఈ నవల కథ చెప్పి బుర్ర తినేసేవాడిని. ఇక్కడ స్టక్ అయిపోయాను. ఇక్కడ నుండి ఎలా రాయాలో అర్ధం అవడం లేదు అని చెప్పేవాడిని. వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలి. నిజానికి వారిచ్చే సలహాను నేను తీసుకోవాలని కాదు చెప్పింది. నేను అదే పనిలో దాని గురించే ఆలోచిస్తే ఏమన్నా థాట్ వస్తుందేమో అన్న ఆశ అంతే! మొత్తానికి కిందా మీదా పడి నవల పూర్తీ అయింది. ఐడియా వచ్చినప్పటి నుండి పూర్తీ చేసేసరికి దాదాపు తొమ్మిది నెలలు పట్టింది. ప్రింట్ ఇచ్చి స్వాతికి పంపించాను. స్వాతి ప్రతిష్టాత్మక పదహారువారాల నవలల పోటీల్లో నా నవల వైకుంఠపాళి కూడా బహుమతి గెలుచుకుంది. బహుమతి విలువ లక్ష రూపాయలు. నా జీవితంలో అంత డబ్బు చూడటం అదే మొదటిసారి. నాకున్న ఎడ్యుకేషన్ లోన్ 80% తీరిపోయింది.
ఈ నా గోలంతా సంగ్రహిస్తే , మీకు రాయాలనే సంకల్పం ఉంటే దానికి సంబంధించిన విషయాలన్నీ ముందు సేకరించుకోండి. మీకు తెలియకుండానే మీకు కొన్ని ఎదురవుతాయి. వాటిని ఒడిసి పట్టుకోండి. మొత్తం సబ్జెక్టు రెడీ అయ్యాకనే రాయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు పూర్తి అవగాహన ఉంటుంది కనక మార్పులు చేర్పులు చేయడం సులువు అవుతుంది.
రచయితగా సక్సస్ కొట్టాలంటే ముందు మీరు రాసిన కథలు / నవలలు/ ఏదైనా సరే ముందు తగు మాధ్యమాలకు మీరు పంపించాలి. టాలెంట్ ఉంటే చూపించి ప్రూవ్ చేసుకోండి. మీ టాలెంట్ ని మీరు గుర్తించడం మొదటి మెట్టు. దాన్ని అక్కడే ఆపేస్తే మీరు మొదటి మెట్టులోనే నిలబడిపోతారు. మీ రచనలన్నీ మీ బ్యాగ్ ల్లోనే మిగిలిపోతాయి..
My Youtube Channel - Rachanayanam by Kusa
https://www.youtube.com/channel/UCys8tG2ns3gB8btQsOohToQ