STORYMIRROR

PVV Satyanarayana

Inspirational

5.0  

PVV Satyanarayana

Inspirational

జననీ జన్మభూమిశ్చ…

జననీ జన్మభూమిశ్చ…

8 mins
280


జననీ జన్మభూమిశ్చ…

రచనః తిరుమలశ్రీ

***

     ఆలీకి మనసంతా చికాకుగా ఉంది. ఉదయంనుంచీ మశీదులో పనిచేసి అలసిపోయి మధ్యాహ్నం నమాజు ముగించుకుని అప్పుడే ఇంటికి వచ్చాడు. మశీదులో పెట్టిన కాస్తంత ప్రసాదము, గుక్కెడు ఛాయ్ తప్పిస్తే ప్రొద్దుట్నుంచీ ఏమీ తినలేదేమో కడుపులో ప్రేగులు ఆకలితో అరుస్తున్నాయి. వచ్చేసరికి ఇంట్లో గొడవగా ఉంది. తండ్రి జలీల్ మళ్ళీ త్రాగొచ్చినట్టున్నాడు, ఖానా లేదని గొడవ చేస్తున్నాడు. తల్లినీ, అక్కల్నీ బూతులు తిడుతున్నాడు. తండ్రి వరస చూస్తే రక్తం ఉడికిపోయింది. ఏదో చేయాలన్న ఆవేశం. కానీ, అతను తన కన్నతండ్రి!

     పాతబస్తీలోని చాలా ముస్లిం కుటుంబాలలాగే జలీల్ దీ పెద్ద కుటుంబం. ఐదుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడూను. కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానంటే అమీషాబీని తిట్టాడు జలీల్. ఇస్లాం ఒప్పుకోదన్నాడు. పిల్లల్ని ఎలా పోషిస్తావని అడిగితే, అది అల్లా బాధ్యత అంటూ భుజాలు ఎగరేసాడు.

     జలీల్ పెద్దకూతురికి ముప్పై ఐదేళ్ళు. ఆఖరు పిల్లకు పాతికేళ్ళు. ఆలీకి పదిహేనేళ్ళు. ఆ మధ్యలో నలుగురు పిల్లలు పుట్టి పోయారు. ఆలీ పుట్టాక మొగుడికి తెలియకుండా ఆపరేషన్ చేయించేసుకుంది అమీషాబీ.

     ఆలీ మదరసాలో పదో తరగతి వరకు చదివాడు. మశీదులో ఎలాగో పని సంపాదించాడు. తండ్రి సైకిల్ రిక్షా త్రొక్కుతాడు. వచ్చిన కాసిని డబ్బులతో త్రాగేస్తాడు. తల్లి నాలుగిళ్ళలో పని చేస్తుంది. పెద్ద అక్కలిద్దరూ పనికి వెళ్ళేవారు కానీ, ఆయా ఇళ్ళలోని పురుషుల చూపులు పురుగులు ముట్టినట్టు తమనే అంటుకుపోతూండడంతో మానుకోవలసివచ్చింది. మూడో అక్కను, నాలుగో అక్కనూ అరబ్ షేక్ ల కిచ్చి నిఖా జరిపించేసాడు తండ్రి. ఆ షేక్ లిచ్చిన సొమ్ముతో కొన్నాళ్ళపాటు ఇంటిల్లపాదీ కడుపునిండా తిన్నా, ఆనక ఆ అక్కల సమాచారం ఏమీ తెలీనేలేదు. ఆఖరి అక్క కుట్టుమిషన్ నేర్చుకుంటోంది.

     కుటుంబపోషణ కోసం తాపత్రయపడే తల్లీ, బాధ్యత ఎరుగని తండ్రీ, వయసు కోర్కెలను లోలోనే అణచుకుని కనిపించని ఆశాజ్యోతి కోసం ఎదురుచూసే అక్కలూ! కుటుంబ పరిస్థితి ఆలీని ఎంతగానో బాధిస్తూంటుంది…ఓపక్క కష్టపడదామన్నా దొరకని పని, మరోపక్క అడపాదడపా వచ్చి ఏదో కారణంతో ముస్లిం యువకుల్ని బలవంతంగా స్టేషన్ కి లాక్కుపోయి రకరకాలుగా వేధించే పోలీసులు…జీవితం నానాటికీ దుర్భరంగా తోస్తోంది. కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏదో చేయాలన్న ఆరాటం, ఏమీ చేయలేని అసహాయత! సమాజం మీద ద్వేషం, పగ! మనుషులందరినీ ఒకేలా కాక కొందరిని అమీరులుగాను, మరికొందరిని గరీబులుగాను పుట్టించిన అల్లా మీద కోపం, కక్ష!

     ఓరోజున ఆలీ స్నేహితుడు కరీం, ఆలీని ఓ చోటుకు తీసుకువెళ్ళాడు. పాతబస్తీలోనే ఏవేవో గల్లీలు తిరగ్గా ఓ అండర్ గ్రౌండ్ లో ఉన్నదది. ముగ్గురు వ్యక్తులు ఉన్నారక్కడ. ఒకడు తెల్లగా, పొడవుగా ఉన్నాడు. గెడ్డం నున్నగా గీచుకున్నాడు. గాంభీర్యమైన వదనం. నలభై ఐదేళ్ళుంటాయి… రెండోవాడు చామనచాయలో పొట్టిగా ఉన్నాడు. నల్లటి గడ్డం ఉంది. కళ్ళలో తీక్ష్ణత. ముప్పై అదేళ్ళుంటాయి…మూడో మనిషి ఆ ఇద్దరి కంటె చిన్నవాడు. ముప్పై లోపే ఉంటాడు. సన్నగా, కావిరంగులో ఉన్నాడు. ముఖంలో కరకుదనం.

     తెల్లగా, పొడవుగా ఉన్న వ్యక్తి ఆలీ కుటుంబపు వివరాలు, వ్యక్తిగత విషయాలు చెబుతూంటే ఆశ్చర్యపోయాడు ఆలీ. అతని తెలివితేటలు సిన్సియారిటీ గురించి ఆలకించి ఆలీకి ఓ మంచి ఉద్యోగం ఇవ్వడానికి నిశ్చయించుకున్నట్టు చెప్పాడు ఆ వ్యక్తి. వాళ్ళెవరో తెలియకపోయినా, ఉద్యోగం అనేసరికి ఆలీకి ఆశ పుట్టింది. ఆ వ్యక్తి ఓ అరగంట సేపు అనర్గళంగా మాట్లాడాడు. అతని పలుకులు వింటూంటే ఓపక్క ఆశ్చర్యమూ, మరోపక్క భయమూ కలిగాయి ఆలీకి.

     ‘అమెరికా అర్థరాత్రి వేళ పాకిస్తాన్ లో దొంగలా ప్రవేశించి ఒసామా బిన్-లాడెన్ ని మట్టుపెట్టిన ఉదంతం ఉటంకించి, అమెరికా ముస్లింల పైన ఉగ్రవాదులన్న ముద్ర వేసి నాశనం చేయాలని చూస్తోందని చెప్పాడు. హిందువులు తమ బద్ధశత్రువులన్నాడు. ముస్లిమ్స్ ని పైకి రాకుండా అణగద్రొక్కేస్తున్నారన్నాడు. ఆ ‘కాఫిర్ల’ మీద కక్ష తీర్చుకోవడానికి, ఒసామా హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికీ, ముస్లిం జాతినీ మతాన్నీ ఉద్ధరించడానికీ తమ సంస్థ అవతరించిందన్నాడు…’

     అనంతరం ఆలీ చేతిలో ఐదువేల రూపాయలు పెట్టాడతను. “ఈ సొమ్ముతో మీ కుటుంబమంతా కడుపునిండా తినండి. ఇది ఆరంభం మాత్రమే. మేము నీకు పని ఇవ్వగానే మీ కుటుంబపు దశే మారిపోతుంది. అల్లా మిమ్మల్ని చల్లగా చూస్తాడు” అన్నాడు.

     ఆలీ అంత సొమ్ము ఎన్నడూ కళ్ళజూడలేదు. అనుమానంగా కరీం వంక చూసాడు. తీసుకోమన్నట్టు చూపులతోనే సైగ చేసాడు అతను. డబ్బు తీసుకుని జేబులో దాచుకున్నాడు ఆలీ. తరువాత మళ్ళీ కబురుపెడతామని చెప్పి ఆ కుర్రాళ్ళను పంపేసారు ఆ వ్యక్తులు.

     కొడుకు తెచ్చిచ్చిన సొమ్ము చూసి ఆశ్చర్యము, ఆనందము, అనుమానమూ కలిగాయి అమీషాబీకి. తనకు ఉద్యోగం దొరికిందనీ, జీతం అడ్వాన్సుగా ఇచ్చారనీ కొడుకు చెప్పడంతో కుదుటపడింది. ఆ వారం రోజులూ ఆ ఇంట్లో పండుగే అయింది. మిగతా సొమ్ము జలీల్ కంట్లో ఎలా పడిందో, అడ్డుపడ్డ పెళ్ళాన్ని కొట్టి మరీ త్రాగుడుకు పట్టుకుపోయాడు…..

     ఆ వ్యక్తుల నుండి పిలుపు రావడంతో కరీంతో పాటు వెళ్ళాడు ఆలీ. ఆ ముగ్గురు వ్యక్తులే దర్శనమిచ్చారు అక్కడ. స్థలం మాత్రం వేరు. ఉద్యోగంలో చేరేముందు ఆలీకి, కరీంకీ ఆర్నెల్లు ట్రెయినింగ్ ఇవ్వబడుతుందని చెప్పారు.

     “ట్రెయినింగ్ పూర్తి అయ్యేంతవరకు మీరు మీ ఇళ్ళకు వెళ్ళడం కుదరదు. కనుక ఈ సొమ్ము మీ ఇంట్లో ఇచ్చి చెప్పేసి రండి,” ఆ కుర్రాళ్ళకు చెరో పాతికవేలూ చేతిలో పెట్టారు. “ఇది మీరు ఆర్నెల్లు మీ కుటుంబాలకు దూరంగా ఉంటున్నందుకు. ట్రెయినింగ్ పీరియడ్ లో నెలనెలా పదేసి వేలు మీ కుటుంబాలకు అందుతాయి”.

     ఆలీ ఆనందానికి మేర లేకపొయింది. తన కుటుంబానికి సుఖసంతోషాలు కలిగించాలని ఎన్నో కలలు కన్నాడు. అవి ఇప్పుడు నిజం కాబోతున్నాయి!

#

     వారం తరువాత ఓ వ్యాన్ వచ్చి చార్మినార్ దగ్గర నుండి ఆలీ, కరీంలను పికప్ చెసుకుంది. ఇంచుమించు ఆలీ వయసున్న కుర్రాళ్ళే మరికొందరు ఆ ట్రెయినింగులో పాల్గొంటున్నారు. రోజూ ఓ పూట థియరీ, మరో పూట ప్రాక్టికల్ క్లాసూ జరుగుతున్నాయి. క్లాసులు నడిపే వ్యక్తులు వేరు. ఆలీకి డబ్బులిచ్చిన పొడవాటి వ్యక్తి, అతని ఇద్దరు సహచరులూ మొదటి రోజున వచ్చి ట్రెయినీస్ ని ఉత్తేజపరచే ప్రసంగాలు చేసారు. ఆ ట్రెయినింగ్ యొక్క ఉద్దేశ్యాన్నీ, స్వరూప-స్వభావాలను, ముస్లిం యువతపైనున్న బాధ్యతనూ గూర్చి వివరించారు.

     తెల్లగా పొడవుగా ఉన్న అతని పేరు రషీద్ అనీ, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐ.ఎస్.ఐ. కి చెందిన ఏజెంట్ అనీ…పొట్టిగా ఉన్నతని పేరు రజాక్ అనీ, బంగ్లాదేశ్ స్థావరంగా చేసుకున్న పాకిస్తానీయుడనీ, ఆ ఉగ్రవాద సంస్థకు నాయకుడనీ…మూడో యువకుడు హైదరాబాదుకు చెందిన షబీర్ అనీ, స్థానిక యువకుల్ని ఆ సంస్థలో చేర్పించడం అతని డ్యూటీ అనీ తెలుసుకున్నాడు ఆలీ.

     థియరీ క్లాసులు ఎక్కువగా హిందువుల పైన, భారతదేశం పైన ద్వేషాన్ని రగల్చడానికి, ‘జీహాడ్’ లో పాలుపంచుకునేందుకు మోటివేట్ చేయడానికి, మతం కోసం ప్రాణాలను అర్పించేందుకు వారిని సిద్ధంచేయడానికీ ఉపయోగపడేవి. ప్రాక్టికల్ క్లాసెస్ లో గన్ హ్యాండ్లింగ్, బాంబ్స్ తయారీ, వాటి ప్రయోగం, విద్రోహక చర్యలలో శిక్షణ లభించేది.

     ఆలీకి అంతా అయోమయంగా ఉండేది. కారణం – వాడు ఇతర పిల్లల్లా కాదు. తమ దుస్థితికి కారకులు హిందువులేనంటూ తన మిత్రులంతా ఆడిపోసుకుంటూంటే…తాను మాత్రం తమ పేదరికానికి హేతువు నిరక్షరాస్యత, అధిక సంతానం, మూఢాచారాలే ననేవాడు. వాడికి హిందూ మిత్రులు ఎందరో ఉన్నారు. వారు తనను ఎప్పుడూ మతపరంగా వేర్పాటుగా చూడలేదు, తన మతాన్ని కించపరచలేదు. తననెంతో ఆప్యాయంగా చూస్తారు. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అనేవారు అన్ని మతాలలోను, జాతులలోనూ ఉంటారనేది వాడి నిశ్చితాభిప్రాయం.

ఐతే ట్రెయినింగ్ లోని బ్రెయిన్-వాషింగ్ ఎంత పటిష్ఠంగా ఉండేదంటే, వారు చెప్పేదంతా నిజమే ననిపించేది ఆ లేత మనసులకు. అందుకే ట్రెయినింగ్ పూర్తయేసరికి ఆలీ వంటి వాడు సైతం వారి మాటల గారడీలో బురిడీలు కొడుతూ స్వజాతి కోసం, మతం కోసం ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధమవడంలో ఆశ్చర్యం లేదు.

ట్రెయినింగ్ చివరి రోజున రషీద్, రజాక్, షబ్బీర్ లు వచ్చారు. ఆ కుర్రాళ్ళను ఉత్తేజపరుస్తూ మరిన్ని విషయాలు చెప్పారు. ట్రెయినింగ్ విజయవంతంగా ముగించుకున్నందుకు వారిని అభినందించారు. వారు తమ ఇళ్ళకు వెళ్ళవచ్చనీ, తరువాత అసైన్మెంట్లు ఇవ్వబడతాయనీ చెప్పారు. అందరికీ పెద్ద మొత్తాలలో సొమ్ములు అందజేసారు. ఆ విషయాలన్నీ అత్యంత రహస్యంగా ఉంచాలనీ, బైటకు పొక్కితే వారి ప్రాణాలకే ముప్పనీ తీవ్రంగా హెచ్చరించారు కూడా.

ఆ కుర్రాళ్ళకు మతం ఓ మోటివ్ ఐతే, వారిచ్చే సొమ్ములు ఆ మోటివ్ ని ఇనుమడింపజ

ేసాయని చెప్పవచ్చును. ఆ ట్రెయినింగ్ అనంతరం – సున్నితమనస్కుడు, మంచిచెడుల వివక్షణాజ్ఞానం కలవాడూ నైన ఆలీ – కరడుగట్టిన పాషాణహృదయుడిగా, హిందూద్వేషిగా మారిపోవడం విశేషం!

#

భారత స్వాతంత్ర్య దినోత్సవం మరో నెలాళ్ళలో రానుంది. ఆ రోజున రాష్ట్ర రాజధానిలో విధ్వంసం సృష్టించడానికి పూనుకుంది ఆ ఉగ్రవాద సంస్థ. మానవబాంబులతో నగరంలో పలుచోట్ల సీరియల్ ప్రేలుళ్ళకు ప్రణాళిక సిద్ధం చేసింది. అందుకుగాను పదిమంది టీనేజ్ కుర్రాళ్ళను మానవబాంబులుగా మార్చే పథకంలో భాగంగా నెల్లాళ్ళపాటు ఓ రహస్యస్థావరంలో ఉంచి తగు శిక్షణనిచ్చింది. వారిలో ఆలీ, కరీమ్ లు కూడా ఉన్నారు. ఆ శిబిరాన్ని చేరుకునేముందు తమకు ఇవ్వబోయే అసైన్మెంట్ ఏమిటో ఎరుగరు ఆ కుర్రాళ్ళు. ఆ మిషన్ గురించి ఆలకించి నిర్ఘాంతపోయాడు ఆలీ.

ఆ సందర్భంగా ఆ పిల్లల కుటుంబాలకు పాతికేసివేలు ముట్టాయి. నిజం ఎరుగని అమీషాబీ కొడుకు ప్రయోజకుడయినందుకు తెగ మురిసిపోయింది. అల్లాకి షుక్రియా చెప్పుకుంది…

మతం కోసం ప్రాణాలు అర్పిస్తున్నందుకు విచారంగా లేదు ఆలీకి. ఆవిధంగా అల్లాకి ప్రీతిపాత్రుడు కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. అంతకుమించి, తన త్యాగానికి ప్రతిఫలంగా తన కుటుంబానికి పదిలక్షల రూపాయలు ముట్టజెప్పబడతాయని ప్రకటించాడు రషీద్. తాను పోయినా, ఆ సొమ్ముతో తన కుటుంబం సుఖసంతోషాలతో ఉంటుంది. తన అక్కల పెళ్ళిళ్ళవుతాయి…

ఐతే, మదిలో ఏ మూలో అసంతృప్తి, అశాంతీ ఆలీనీ తొలిచివేయసాగాయి. తాను చేస్తూన్న పని ఎంతవరకు సమంజసం అన్న మీమాంస మదిలో సూదిలా పొడవసాగింది. ఎటూ నిర్ణయించుకోలేని వయసు. ఎవరితోనూ చెప్పుకోలేని విషయం.

మర్నాడే స్వాతంత్ర్య దివసం. ఆ రాత్రంతా ఆలీకి నిద్రపట్టలేదు. ఏదో అనీజీనెస్. తాను చేస్తున్నది తప్పేమోనన్న భావన ఒక వంకా, హోమ్ సిక్నెస్ మరో వంకా నెమ్మది లేకుండా చేసాయి.

తొలికోడి కూయకముందే కాలకృత్యాలు తీర్చుకున్నాడు ఆలీ. నాయకులు వచ్చి తమకు బెల్ట్ బాంబులను అమర్చుతారు. ఎవరు, ఏ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాలో నిర్ణయిస్తారు. ఆయా ప్రాంతాలకు తమను తరలిస్తారు. నగరం ఉత్సాహంతో జెండా పండుగ చేసుకునే తరుణంలో పలు ప్రాంతాలలో అల్లకల్లోలం సృష్టింపబడుతుంది. కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు, ఇంకెందరో సామాన్య ప్రజలూ అసువులు కోల్పోతారు.. కొన్నేళ్ళ క్రితం లుంబినీ పార్కులోను, ఛాట్ భాండార్ వద్దా సంభవించిన సీరియల్ ప్రేలుళ్ళు గుర్తుకువచ్చాయి. వాటిలో ఎందరో అమాయకులు మృతిచెందడం జరిగింది.

#

నగరమంతటా సందడి సంతరించుకుంది. కళ్ళారా చూళ్ళేకపోయినా, ఆనాటి పండుగ వాతావరణం ఆలీ కళ్ళకు కడుతోంది. ఎక్కణ్ణుంఛో దేశభక్తి గీతాలు మైక్ లో హోరెత్తిపోతున్నాయి. ఒడలు పులకరింపజేస్తున్నాయి.

‘హై మేరే వతన్ కి లోగోం

జర ఆంఖ్ మె భర్దో పానీ

జో షహీద్ హుయే హై ఉన్కీ

జర యాద్ కరో కుర్బానీ…’ 

లత సుమధుర స్వరం గాలినే ఉత్తేజపరుస్తూ హృదయాలను తాకుతోంది. తన్మయత్వంతో

వింటూవుండిపోయాడు ఆలీ.

      “కర్ చలే హమ్ ఫిడా జానో తన్ సాథియోఁ

      అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియోఁ…”

మొహమ్మద్ రఫీ గొంతుక ఆలీ చెవులకు విందు చేసింది.

“సాంస్ థంతీ గయీ…

సబ్జ్ జంతి గయీ

ఫిర్ భీ బడ్తే కదమ్ కో సరుకే దియా…”

తరువాత కవితా కృష్ణమూర్తి, అజీజ్ అందుకున్నారు.

“ఏ వతన్ తేరే లియే

దిల్ దియా హై జాన్ భీ దేంగే

ఏ వతన్ తేరే లియే…”

ఆలీ ముగ్ధుడై ఆలకించసాగాడు.

“హిందూ ముస్లిమ్ శిఖ్ ఈసాయీ

హమ్ వతన్ హమ్ నామ్ హై…”

అన్నీ ఆలీకి ఇష్టమైన పాటలే. అవి ఎప్పుడు, ఎక్కడ వినిపించినా ఆగిపోయి ఆసక్తిగా ఆలకిస్తూంటాడు. వాటి భావానికి కదలిపోతాడు.

ఈసారి తెలుగులో వినిపించింది –

“పుణ్యభూమి నా దేశం నమో నమామి

కర్మభూమి నా దేశం సదా స్మరామి.

నన్ను కన్న నా దేశం నమో నమామి

అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి…” 

మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని ఆ పాటన్నా, దానికి అభినయం చేసిన సీనియర్ ఎన్టీయార్ అన్నా ఆలీకి అత్యంత ప్రీతిపాత్రం. ఒళ్ళంతా చెవులు చేసుకుని, కన్నులు మూసుకుని సినిమాలోని ఆ సన్నివేశాన్ని ఊహించుకుంటూ పరవశించిపోయాడు. ఆ గీతాలు వింటూన్నంతసేపూ మైమరచిపోయి ఏదో ఉద్విగ్నతకు లోనయ్యాడు.

ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఎలా ప్రభావితులవుతారో చెప్పడం కష్టం. ఎవర్ని, ఏ అంశం కదలిస్తుందో చెప్పలేం. ఆ గీతాలు ఆలీలోని దేశభక్తిని హఠాత్తుగా తట్టి లేపాయి. చైతన్యం కలిగించాయి. ఆ పాట పూర్తయ్యేసరికి మదిలో సన్నగా కంపన ఆరంభమయింది. జబ్బుపడ్డవాడిలా అయిపోయాడు. అంతరాళాల్లో ఏదో సిక్నెస్ ఫీలింగ్, అలజడి, అశాంతి, అపరాధభావన నెమ్మది లేకుండా చేసాయి.

ఆలీ మనసు హఠాత్తుగా ఎదురుతిరిగింది…తానేం చేయబోతున్నాడు? తమ విధ్వంసక చర్యల వల్ల నష్టపోయేదెవరు? అమాయకులైన సామాన్య ప్రజలు కాదా? వారి ప్రాణాలును హరించే హక్కు తమకు ఎవరిచ్చారు? అందువల్ల తమ మతానికి గాని, జాతికి గాని ఒరిగేదేమిటి?...అసలు ఆ అకృత్యానికి తాను ఎందుకు అంగీకరించినట్టు? వారిచ్చే సొమ్ముకు ఆశించా? అమ్మాజాన్ కి అసలు విషయం తెలిస్తే తనను క్షమిస్తుందా? తన వంటి దుర్మార్గుణ్ణి కన్నందుకు అవమానంతో కృంగిపోదూ? లోకులు కాకులై పొడుస్తూంటే, ఆత్మహత్య చేసుకోదూ?...ఎన్నో ఆలోచనలు, భయాలు ఆలీ మదిని కందిరీగల్లా కుట్టాయి.

‘ఈ దేశం నాది! నేను పుట్టింది ఈ మట్టిలోనే. పెరిగి పెద్దయిందీ ఈ గడ్డ పైనే. మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే. హిందువులు, ముస్లిమ్ లు ఒకే దేశమాత కన్నబిడ్డలే…ఈ దేశం అందరిదీను. ఏ దేశానికో చెందిన ఉగ్రవాదులు మతోన్మాదంతోనో, రాజకీయ కుతంత్రంతోనో నా దేశాన్నీ, ప్రజలనూ నాశనం చేయబూనుకుంటే…మా వ్రేళ్ళతో మా కళ్ళనే పొడుస్తూంటే…అందుకు నేనెందుకు సహకరించాలి? ఎలా సహించాలి?’ – ఆవేశం పొంగుకువచ్చింది ఆలీకి. ఆ దుశ్చర్యలో తాను పాలుపంచుకోనని వారికి చెప్పలనుకున్నాడు. వారి కుట్రను వెల్లడిచేయాలనుకున్నాడు.

ఐతే, అంతలోనే రజాక్ పలుకులు జ్ఞప్తికి రావడంతో గాలి తీసేసిన బెలూన్ లా అయిపోయాడు. ఆవేశం ఆవిరయిపోయింది.

‘ఒకసారి సంస్థలో అడుగుపెట్టాక వెనుదిరగడమంటూ ఉండదు ఎవరైనా సరే. అలా ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు కోల్పోతారు. అంతేకాదు. మన రహస్యాలు బైటపెట్టినా, చివరి క్షణంలో మోసం చేసినా వారి కుటుంబం యావత్తూ సర్వనాశనం చేయబడుతుంది…’ అంటూ హెచ్చరించాడు రజాక్.

కృంగిపోయాడు ఆలీ. తెలిసో తెలియకో ఆ ఉచ్చులో తగులుకున్నాడు తాను. ఏమాత్రం తప్పటడుగు వేసినా తనకెంతో ప్రీతిపాత్రమైన అమ్మ, నాన్న, అక్కలు ప్రాణాలు కోల్పోతారు… కానీ, తన దేశం, ప్రజలు విద్రోహులకు బలయిపోతూంటే తాను చూస్తూ ఊరుకోగలడా? ఆ విపత్తును తప్పించేందుకు ఏమీ చేయలేడా??

ఆలీ ఆలోచనలు ఓ కొలిక్కి రాకముందే రషీద్, రజాక్, షబ్బీర్ లతో పాటు అరడజను మంది ఇతర నాయకులు వచ్చారు అక్కడకు. జరుగబోయేదాన్ని తలచుకుని ఎక్సైటింగ్ గా ఉన్నారంతా. ఆలీ, కరీంలతో సహా మిగతా ఎనిమిది మంది యువకుల నడుములకు బెల్ట్ బాంబ్స్ అమర్చబడ్డాయి. భయంకర నిశ్శబ్దం, గంభీర వాతావరణం నెలకొంది అక్కడ.

అందరినీ వలయాకారంలో నిలబెట్టి మధ్యలో నిలుచున్నారు నాయకులంతా. ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళబోతున్నారో వివరిస్తున్నాడు రజాక్. ఎప్పుడు ఏం చేయాలో చెప్పాడు. పాటించవలసిన జాగ్రత్తలను మరోసారి సూచించాడు.

ఆలీ మదిలో ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగెడుతున్నాయి…అక్కణ్ణుంచి ఎలా తప్పించుకోవాలి? పోలీసుల్ని ఎలా హెచ్చరించాలి? ఆ విధ్వంసాన్ని ఎలా ఆపాలి? తాను ఆడి, పాడి, తిరుగాడిన ఆ నగరం మండి మసైపోకుండా ఎలా రక్షించుకోవాలి? అమాయకప్రజల ప్రాణాలు ఎలా కాపాడాలి???...

ఆ మానవబాంబులను తీసుకువెళ్ళేందుకు వ్యాన్ వచ్చిందన్న కబురు వచ్చింది. “కమాన్ బాయ్స్! ఈ జెహాడ్ లో పాలుపంచుకుని అల్లా దయకు పాత్రులు కాబోతూన్న మిమ్మల్ని అభినందిస్తున్నాను…ఖుదా హఫీజ్!” అంటూ వారికి వీడ్కోలు చెప్పాడు రషీద్. నాయకులు అక్కణ్ణుంచి కదలబోయారు.

అదే క్షణంలో ఓ నిర్ణయానికి వచ్చేసాడు ఆలీ. ఎట్టి పరిస్థితులలోనూ ఆ మానవ బాంబులు బైటకు వెళ్ళకూడదు. ఆ దుండగుల పథకం ఫలించకూడదు.

అంతే!... ‘జై హింద్!’ అంటూ ఎలుగెత్తి అరచి రెప్పపాటులో తన నడుం కి ఉన్న బెల్ట్ బాంబ్ మీటను నొక్కేసాడు.

మరుక్షణంలో – ఆలీ ట్రిగ్గర్ చేసిన బాంబ్ ఇంపాక్ట్ కి అక్కడున్న మానవబాంబులన్నీ భయంకర శబ్దంతో ఒక్కసారిగా ఎక్స్ ప్లోడ్ అవడమూ, నాయకులందరితో సహా ఆ రహస్య స్థావరం నామరూపాలు లేకుండా ప్రేలిపోవడమూ జరిగిపోయాయి…

                                                           *******


Rate this content
Log in

Similar telugu story from Inspirational