PVV Satyanarayana

Drama

4.7  

PVV Satyanarayana

Drama

నీరు

నీరు

8 mins
662


కథ

నీరు

రచన: తిరుమలశ్రీ

***

     రాయలసీమలోని రంగురాళ్ళపల్లి గ్రామం పొలిమేరల్లో ఏటేటా అమ్మవారి జాతర ఘనంగా జరుగుతూంటుంది. మూడు రోజులపాటు సాగే ఆ జాతరలో చుట్టుపక్కల పలు గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో పాల్గొంటూంటారు.

    ఆ జాతరలోనే కలుసుకున్నారు రఘురాం, వైదేహిలు...జలగానపల్లెకు చెందిన రఘురాంకి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాయి. కండలు తిరిగిన శరీరంతో, నిగారింపైన ఒంటి రంగుతో, చుక్కల్లో చంద్రుడిలా ఉంటాడు...వైదేహి ఇరవై ఏళ్ళ పడచు. సన్నగా, పొడవుగా, పిటపిటలాడే పరువంతో, అందానికి నిర్వచనంలా ఉంటుంది. పురుషుల హృదయాలలో పులకింతలు రేపే రూపం. భూపాలపురం ఆడపడచు. చలాకీ ఐన పిల్ల.

     కలసిన చూపులు ఆ ఇరువురి హృదయాలలోనూ అలజడి రేపాయి. ’ఎంత అందంగా ఉంది ఈ పిల్ల!’ అని రఘురాం అనుకుంటే...’కోడెకారు కుర్రోడు...తొలిచూపులోనే నా గుండెల్లో గుడి కట్టేసుకున్నాడు. గడుసోడే!’ అనుకుంది వైదేహి. అతని చొరవ, ఆమె చలాకీదనమూ వారిని దగ్గరకు చేర్చాయి. మాటలు కలిపాయి. జాతరకు దూరంగా పొలం గట్టు పైన కూర్చుని ఊసులాడుకున్నారు. జాతర మూడు రోజులూ అదే వరుస!

     చివరి రోజున రఘురాం ఆమె చేతులు పట్టుకుని, "వైదేహీ! నన్ను పెళ్ళాడుతావా?" అనడిగాడు హఠాత్తుగా. తొలి సంగమంలోనే మనసులు పెనవేసుకున్నా, అతనలా సూటిగా అడిగేసరికి, అతని వేగానికి సిగ్గు ముంచుకువచ్చింది ఆమెకు. చటుక్కున చేతులు వెనక్కి తీసేసుకుని లేచి నిల్చుంది. "ఫోఁ, పోకిరి పిల్లోడా!" అనేసి, ముఖం చేతుల్లో కప్పుకుని అక్కణ్ణుంచి తుర్రుమంది.

#


      జలగానపల్లె చిన్నదైనా చక్కని గ్రామం. ’జలం’ పేరులోనే కాని ఊరిలో లేనందున, ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఎక్కువ. సాగునీటికే కాక త్రాగునీటికి, వాడకపు నీటికి కూడా కరవే.

   ఒకప్పుడు రాయలు పాలించిన ఆ రతనాల సీమలో ఇప్పుడు రాళ్ళు పేరుకుపోయి, రాజకీయ దుర్గంధంతో నిండిన ఆ గ్రామాలలో...ఎండి బీటలువారిన భూములే కాక, తడారిపోయిన గొంతుకలు తడుపుకోవడానికి సైతం నీటిచుక్క గగనమైపోవడం మిక్కిలి శోచనీయం! వర్షాభావంతో చెరువులు, కాలువలు ఎండిపోతే...నదులలోని నీటిని గ్రామాలకు తరలించగల రాజకీయ సంకల్పం లోపించి...వ్యయప్రయాసలకోర్చి త్రవ్వించిన బావులలో బండలు పడడంతో...ఆడంగులు కడవలతో నీటికోసం ఎండలో నిత్యమూ మైళ్ళకొద్దీ నడవవలసిన దుస్థితి!

     జలగానపల్లెకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్రాయిపురం గ్రామంలో ఓ పెద్ద మంచినీటి చెరువు ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు జీవధార అది. ఐతే రోజుకు మనిషికి ఒక్క బిందె కంటె ఎక్కువ తీసుకోకూడదన్న ఆంక్ష!

    జలగానపల్లికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువ నుండి మగవాళ్ళు కావిళ్ళతో వాడకపు నీటిని తెస్తూంటారు. ఆ నీరు మనుషులు త్రాగడానికి పనికిరాదు. గతిలేక త్రాగే పశువులు తరచు వ్యాధులకు గురికావడం కద్దు. వేసవికాలం వస్తే ఆ నీరూ ఇగిరిపోతుంది.

    పొలంలో త్రవ్వించిన ఒకటీ, అరా బావులలో నీరు పడ్డా, దాన్ని పొలాలకు తోడడానికి విద్యుత్తు ఉండదు. రోజుకు ఏడు గంటలసేపు రైతులకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ జరిగే ప్రచారంలో - నేతిబీరకాయలో నేయి ఎంత ఉంటుందో, అంతే నిజముందన్న సంగతి క్షేత్రస్థాయిలో కాని అవగతం కాదు. మెట్ట పొలాలు దిట్టంగా ఉన్నా, పొట్టలు నింపలేకపోవడానికి కారణం - సాగునీటి సమస్యను పట్టించుకోని ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణే కారణమంటే అతిశయోక్తి కాదు...నీటి ఎద్దడి కారణంగా తమ కూతుళ్ళు కష్టపడడం ఇష్టంలేని తండ్రులు ఆ గ్రామాలలోని యువకులకు తమ ఆడపిల్లల్ని ఇవ్వడానికి విముఖత చూపడం కొసమెరుపు!

                                                                #


    భూపాలపురానికి చెందిన భూమయ్య ఓ చిన్న భూస్వామి. అతని ఏకైక సంతానం వైదేహి. కూతురు పుట్టాకే అతనికి కలసివచ్చింది. తండ్రి నుండి సంక్రమించిన ఐదెకరాల పొలాన్ని పాతిక ఎకరాలు చేయగలిగాడు. అందుకే కూతురంటే ప్రాణం. జలగానపల్లెకు చెందిన రఘురాం అనే కుర్రాణ్ణి ప్రేమించాననీ, అతన్నే పెళ్ళి చేసుకుంటాననీ కూతురు పట్టుపట్టడంతో కాదనలేకపోయాడు.

     ఆ కుటుంబం గురించి వాకబు చేస్తే కుర్రాడి తండ్రి లక్ష్మయ్యకు పదెకరాల పొలం, పాడీ ఉన్నాయనీ...ఇద్దరు కొడుకులు, ఓ కూతురూననీ...ఓ కొడుక్కీ కూతురికీ పెళ్ళిళ్ళైపోయాయనీ...రఘురామ్ చిన్న కొడుకనీ, బుద్ధిమంతుడనీ, డిగ్రీ పాసై వ్యవసాయంలో తండ్రికీ అన్నకూ సాయం చేస్తున్నాడనీ...గౌరవనీయమైన కుటుంబమనీ తెలిసింది. సంబంధం మాట్లాడడానికని కూతురి ఫోటో, వివరాలూ తీసుకుని జనగానపల్లెకు వెళ్ళాడు.

     గ్రామంలో ప్రవేశిస్తూంటే నీళ్ళ బిందెలు ఎత్తుకుని చీమలబారులా నడచి వస్తూన్న కొందరు స్త్రీలు కనిపించారు అతనికి. వారిని సమీపించి లక్ష్మయ్య ఇంటి గురించి అడిగాడు. ’మీరెవరని’ అడిగితే, ఆ     

కుటుంబంతో వియ్య మందుకోవడానికి వచ్చానన్నాడు. తరువాత కుతూహలం ఆపుకోలేక వాళ్ళంతా ఆ మండుటెండలో నీళ్ళు ఎక్కణ్ణుంచి తెస్తున్నారని అడిగాడు అతను. వాళ్ళు చెప్పిన సమాధానం ఖంగుతినిపించింది. అప్పటికప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేసాడు - అల్లారుముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ఆ దుస్థితికి గురిచేయలేడని! ఆ గ్రామంతోనే వియ్యం అందుకోరాదని నిశ్చయించుకుని, అటునుండి అటే తిరిగి వెళ్ళిపోయాడు.

#


     మనుగడే గడ్డు ఐన ఈ రోజుల్లో ఎంతటి సమస్యనైనా సర్దుబాటుతనంతో మౌనంగా భరించడం అలవాటైపోయింది సామాన్యుడికి అది తీవ్రరూపాన్ని దాలిస్తే తప్ప దాన్ని పెద్దగా పట్టించుకోడు .. రఘురాం కోసం పొరుగూరినుండి వచ్చిన పెళ్ళి సంబంధం, ఆ గ్రామపు స్త్రీలు మంచినీటి కోసం పడే అగచాట్లను చూసి తప్పిపోయిందన్న సంగతి గ్రామమంతా ప్రాకిపోయింది. ఆ కారణంగానే ఎవరూ ఆ గ్రామంలో తమ కూతుళ్ళను ఇవ్వడంలేదనీ, చాలమంది యువకులు అవివాహితులుగానే ఉండిపోయారన్న చేదు నిజం మరోసారి ఆ గ్రామస్థుల మదులలో మెదిలింది.

     విషయం ఆలకించిన రఘురాం నిశ్చేష్ఠుడయ్యాడు. ఆ వచ్చింది వైదేహి తండ్రేనని ఊహించడం కష్టం కాలేదు అతనికి. గ్రామానికి పట్టిన ఆ సమస్యను ఎలా పరిష్కరించాలాయని తీవ్రంగా యోచించిన మీదట, ఊళ్ళోని యువకులందర్నీ సమావేశపరచాడు. "నీటి సమస్య మన పెళ్ళి సమస్యగా మారడం దురదృష్టకరం. మన అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, వదినలు త్రాగునీటి కోసం పడుతూన్న కష్టాలను చిన్నప్పట్నుంచీ మనం చూస్తూనే ఉన్నాం. ఇన్నేళ్ళైనా మన పంచాయితీ పెద్దలు దాన్ని పరిష్కరించలేకపోయారు. ఈ విషయంలో మనమే పూనుకుని ఏదో చేయాలి" అన్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడో అతను వివరించడంతో, ’సై’ అన్నారంతా.

     తొలుత సర్పంచ్ వద్దకు వెళ్ళి గ్రామంలోని నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు పంచాయతీ ఏం చర్యలు చేపట్టిందో చెప్పమని అడిగాడు రఘురాం. నిధులు లేవంటూ పెడసరంగా జవాబిచ్చాడు సర్పంచ్ నరసారెడ్డి. పంచాయితీరాజ్ నిధులు మంజూరు చేయలేదన్నాడు.

     పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్ళాడు రఘురాం. తమ గ్రామం ఎదుర్కొంటూన్న సమస్యను వివరించి, కనీసం త్రాగునీటి సరఫరాకోసం ఏదైనా చేయమని కోరాడు. అంతా ఓపికగా ఆలకించిన అధికారి తన చిఠ్ఠా తెరచి చూపించాడు. దాని ప్రకారం - గత రెండేళ్ళలో జలగానపల్లెలో మంచినీటి బావిని, సాగునీటి కోసం బోరు బావులను త్రవ్వించే నిమిత్తం పది లక్షల రూపాయలు మంజూరు చేయడమైంది. ఆ సొమ్ము గ్రామ పంచాయతీకి చెల్లించబడింది. ఆ సొమ్ముతో ఓ మంచినీటి బావి, బోరు బావులు త్రవ్వించినట్టు రికార్డులో నమోదయిందికూడాను!                                               "గ్రామంలో బావులు కనిపించకపోతే అది మా బాధ్యత కాదు. మీ నియోజకవర్గపు ఎమ్మెల్యే సిఫారసు మీదే ఆ నిధులు మంజూరు చేయబడ్డాయి. ఏవైనా తేడాలుంటే ఆయనతో చెప్పుకోండి" అన్నాడు అధికారి.

      విభ్రాంతికి గురైన రఘురామ్, అతని మిత్రులూ మళ్ళీ సర్పంచ్ వద్దకు వెళ్ళారు. తాము తెలుసుకున్న విషయాలు చెప్పి, "బావులెక్కడ? ఆ పది లక్షలూ ఏమయ్యాయ్?" అంటూ నిలదీసాడు రఘురాం.

      "పిల్లొచ్చి గ్రుడ్డును వెక్కిరించినట్టు, నువ్వెవడివోయ్ నన్ను ప్రశ్నించడానికి?" అంటూ కన్నెర్రజేసాడు నరసారెడ్డి.

     "పంచాయతీకి పన్నులు కడుతూన్న పౌరుణ్ణి. ప్రభుత్వం ఇచ్చిన నిధుల లెక్కలు అడిగే హక్కు మాకుంది" అన్నాడు రఘురాం తీవ్రంగా.

     కుర్రాళ్ళ ఆవేశం చూసి సర్పంచ్ తగ్గాడు...మంజూరు చేయబడ్డ నిధులతో రెండు బావులు త్రవ్వించబడ్డాయి. ఆ కాంట్రాక్ట్ తీసుకున్నది ఎమ్మెల్యే బావమరదే. బావులలో నీళ్ళు పడలేదు. బండలు పడ్డాయి. అందువల్ల ఒకదాన్ని మళ్ళీ పూడ్చేసారు. రెండోదాన్ని పూడ్చడానికి నిధులు చాలక అలాగే వదిలేసారు. గత ఏడాది ఓ వ్యవసాయ కూలీ యొక్క నాలుగేళ్ళ పిల్లాడు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించిన సంగతి అందరూ ఎరిగినదే. దాంతో వాడి కుటుంబానికి లక్ష రూపాయలు నష్టపరిహారం ఇవ్వడమైంది. ఎలాగో ఆ బావి కూడా పూడ్చేయబడింది. మళ్ళీ కొత్తగా బావులు త్రవ్వే కార్యక్రమాన్ని చేపట్టాలంటే నిధులు కావాలి. వాటిని పంచాయతీరాజ్ శాఖ మంజూరుచేయాలి...

     సర్పంచి వివరణ ఆ యువకులను నిర్ఘాంతపరచింది. అదంతా సర్పంచి, మిగతా పంచాయతీ సభ్యులూ కలసి ఆడుతూన్న నాటకంగా అర్థమయిపోయింది వారికి. ఆ గ్రామపెద్దల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన చంటోడి కుటుంబానికి నష్టపరిహారంగా లక్ష రూపాయలు ప్రకటించినా, తమకు ఇచ్చింది మాత్రం పాతికవేలే నంటూ లోగడ ఓసారి వాడి తండ్రి తన తండ్రి దగ్గర లోపాయకారిగా చెప్పుకుని వాపోయిన సంఘటన గుర్తుకువచ్చింది రఘురాంకి. ఆ నిజం వారిచేత చెప్పించాలనిపించినా, బహిరంగంగా వెల్లడించేందుకు ఆ పేదలకు ధైర్యం ఉండదని ఊరుకున్నాడు. మిగతా సొమ్మును పంచాయతీ సభ్యులు నిస్సిగ్గుగా పంచేసుకుని ఉంటారనుకున్నాడు... నేరుగా ఎమ్మెల్యేతోనే ఆ వ్యవహారం తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు.

      ఇష్టం లేకపోయినా, ఆ కుర్రాళ్ళతో ఎందుకొచ్చిన కుమ్మరం అనుకున్న సర్పంచి వారితో పాటు వెళ్ళాడు ఎమ్మెల్యే దగ్గరకు.

      "ఐదేళ్ళకోసారి ఎన్నికలప్పుడు వచ్చి ఆకాశం నుండి గంగను గ్రామంలోకి దింపుతామంటూ

వాగ్దానాలతో ప్రజల్ని మోసగిస్తున్నారు మీరు. రెండేళ్ళ క్రితం పంచాయతీరాజ్ శాఖ మంజూరుచేసిన పది లక్షల రూపాయలూ హుష్ కాకి ఐపోయాయే తప్ప మా గ్రామాన్ని పట్టిన నీటి బెడద తీరనేలేదు. బిందెడు నీళ్ళ కోసం మా ఆడాళ్ళు ఎండనక వాననక మైళ్ళకొద్దీ నడవాల్సివస్తోంది. మా నియోజకవర్గపు ప్రతినిథిగా ఇందుకు మీ సమాధాన మేమిటి?" సూటిగా ప్రశ్నించాడు రఘురాం ఎమ్మెల్యేని. 

     ఎమ్మెల్యే అంజిరెడ్డికి సుమారు యాభై ఏళ్ళుంటాయి. అర్థబలం, అంగబలం, రాజకీయబలం పుష్కలగా కలవాడు అతను. ఆ ప్రాంతాలలో అతని సామాజిక వర్గమే ఆధిక్యతలో ఉన్నందున ప్రతిసారీ ఎన్నికలలో అతనే గెలుస్తూ వస్తున్నాడు. ఎదురుచూడని ఆ దాడికి కించిత్తు తొట్రుపడ్డా, వెంటనే తమాయించుకున్నాడు. పిల్ల కాకుల్ని చూసినట్టు చూసాడు, ఆ కుర్రాళ్ళ వంక.

      నవ్వేస్తూ, "రాబోయే ఎన్నికల్లో నిలుచోవాలనుకుంటున్నావా ఏమిటీ, ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళందర్నీ పోగేసుకుని ఆఫీసులమ్మటా తెగ తిరుగుతున్నావట?" అన్నాడు రఘురాంతో.

      "మాకు పదవులూ వద్దు, పార్టీలూ వద్దు సార్! త్రాగడానికి గ్రుక్కెడు నీళ్ళుంటే చాలు!" అన్నాడు రఘురాం. "ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ రాళ్ళపాలయ్యాయంటున్నారు సర్పంచ్ గారు..."

      "ఔనోయ్. నీళ్ళకు బదులు బండరాళ్ళు పడడం మా తప్పు కాదు కదా! నిజానికి ఆ కాంట్రాక్ట్ లో మా బావమర్దికి నష్టం కూడా వచ్చింది" అన్నాడు అంజిరెడ్డి.

     "బావులు త్రవ్వేముందు నిపుణులను తీసుకొచ్చి గ్రౌండ్ వాటర్ లభ్యమయే ప్రదేశాలను గుర్తించి మరీ పని మొదలుపెడతారట. కాని అలా చేయలేదని తెలిసింది మాకు. అందుకే నిధులు వృధా అయ్యాయి. దానికెవరు బాధ్యులు?"

     రఘురాం పలుకులు అంజిరెడ్డికి ఆగ్రహం తెప్పించాయి. వారి మధ్య మాటా మాటా పెరిగింది. తిడుతూ ఏదో బూతుమాట నోరు జారాడు అంజిరెడ్డి. దాంతో ఆవేశానికి గురైన రఘురాం అతని చెంప పగులగొట్టాడు.

     ఆ తరువాత ఏమయ్యుంటుందో చెప్పనవసరంలేదు. ’రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా!’ అన్నట్టు, పోలీసులు రఘురాంని అరెస్ట్ చేసి లాకప్ లో పడేసి చిదగ్గొట్టారు. ఆనక మేజిస్ట్రేట్ కోర్ట్ ’పబ్లిక్ సర్వెంట్’ ని అస్సాల్ట్ చేసాడంటూ అతనికి ఆరు మాసాల సామాన్య ఖైదు శిక్ష విధించింది!

#


     జలగానపల్లెతో సంబంధం వద్దనడానికి తండ్రి చెప్పిన కారణాన్ని వైదేహి హర్షించలేకపోయింది. ఆ ఊళ్ళోని అందరు ఆడవాళ్ళతోపాటే తానూనంది. రఘురాంనే పెళ్ళాడుతానని మొండిపట్టు పట్టింది.

    కూతురి మనసు కష్టపెట్టడం ఇష్టంలేక మళ్ళీ జలగానపల్లెకు వెళ్ళాడు భూమయ్య. లక్ష్మయ్యను కలుసుకున్నాడు. ఐతే రఘురాం ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేని కొట్టి జైలుకి వెళ్ళాడని తెలియడంతో, అతని మనసు మళ్ళీ మారిపోయింది. జైలుకు వెళ్ళొచ్చిన వాణ్ణి తనకు అల్లుడిగా తెచ్చుకోలేడు. కూతురు ఏడ్చి మొత్తుకున్నాసరే! సంబంధం కలుపుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు భూమయ్య.

#


    జైలు అనుభవం రఘురాం పట్టుదలను ఇనుమడింపజేసింది. జైలునుంచి తిరిగిరాగానే గ్రామంలోని యువకులందర్నీ సమావేశపరచాడు. "యువత తలచుకుంటే సాధించలేనిది ఉండదు. మన గ్రామపు నీటి సమస్యను తీర్చడానికి మనమంతా కృషిచేయాలి" అన్నాడు. అతనికి తోడుంటామన్నారంతా.

   జిల్లా పరిషత్ కి వెళ్ళాడు రఘురాం. తమ గోడు చెప్పుకున్నాడు. పంచాయతీరాజ్ నిధులు ఇస్తే తప్ప తామేమీ చేయలేమన్నారు వాళ్ళు. పంచాయతీరాజ్ కార్యాలయానికి వెళ్ళాడు. అప్పట్లో జలగానపల్లెకు నిధులు వచ్చే అవకాశంలేదనీ స్పష్టంచేసారు అధికారులు.

    రఘురాం నిరాశ చెందలేదు. గ్రామీణ బ్యాంకును ఆశ్రయించాడు. బావి త్రవ్వడానికి ఋణాలు ఇవ్వడానికి తాము సిద్ధమేననీ, ఐతే అది పంచాయతీలకే ఇస్తామనీ చెప్పారు. వ్యక్తులైతే స్థిరాస్థి ఏదైనా బ్యాంక్ కి తనఖా పెట్టవలసి వస్తుందన్నారు. బ్యాంకిలో ఋణానికి ప్రయత్నించమని సర్పంచ్ ని అడిగితే నిబంధనలు ఒప్పుకోవన్నాడు. గ్రామపెద్దలను కలిసి విషయం వివరించాడు రఘురాం. వ్యక్తిగత ఆస్థుల్ని తనఖా పెట్టాడనికి ఎవరూ ముందుకు రాలేదు. బావులు తవ్వించడం పంచాయతీ బాధ్యత అన్నారు.

     రఘురాం చలించలేదు. ఓ సమాజ సేవకుణ్ణి కలిసాడు. తమ సమస్యను వివరించాడు. ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు రఘురాంని పరిచయం చేసాడు అతను. రఘురాంలోని ఆత్మవిశ్వాసాన్నీ, పట్టుదలనూ అర్థంచేసుకున్న ఆ సంస్థ సాయంచేయడానికి అంగీకరించింది...తొలుత గ్రామంలో ఓ మంచినీటి బావిని త్రవ్వడానికి నిర్ణయం జరిగింది. స్థల నిర్దేశపు బాధ్యతను, పరికరాలు తదితర అవసరాలకు కావలసిన నిధులను సంస్థ ఇస్తుంది. బావిని మాత్రం శ్రమదానంతో ఆ యువకులే స్వయంగా త్రవ్వుతారు.

   సంకల్పబలం ఉంటే ఎంతటి క్లిష్టతరమైన పనైనా సులభంగా తోస్తుంది. గ్రామంలో నిపుణులు సూచించిన ప్రదేశంలో ఓ శుభదినాన బావి త్రవ్వకాలు ఆరంభమయ్యాయి. రఘురాం, అతని మిత్రులు రేయింబవళ్ళు విడవకుండా త్రవ్వడంతో ఎదురుచూసినదాని కంటె త్వరగానే బావి త్రవ్వకం పూర్తయింది. బావిలో జల పడింది. భూగర్భం నుండి నీరు పొంగుకువస్తూంటే ఆ యువకుల ఆనందోత్సాహాలు వెల్లువయ్యాయి. తీయటి నీటిని త్రాగి చూసిన గ్రామస్థులంతా, ముఖ్యంగా స్త్రీలు, తమను కొనియాడుతూంటే పడ్డ శ్రమంతా మరచిపోయారు...ఐతే, నీటిచుక్క పడని చోట బావులు త్రవ్వుతూ ఏటేటా నికరాదాయాన్ని పొందుతూవస్తూన్న ఎమ్మెల్యే, అతని మనుషులూ మాత్రం ఆ కుర్రాళ్ళను లోలోపలే తిట్టుకున్నారు. ఈసారి సాగునీటి పైన దృష్టి పెట్టిన రఘురాం మళ్ళీ ఆ స్వచ్ఛంద సంస్థనే ఆశ్రయించాడు. తొలివిడతగా పొలాలలో మూడు బోరుబావుల త్రవ్వకానికి ఒప్పుకుంది సంస్థ. ఐతే, తామిచ్చే ఆర్థిక సహాయానికి తోడు, పొలాలుగల రైతులంతా ’ఎకరానికి ఇంత’ అని తమ వంతుగా కొంత ఖర్చు భరించవలసియుంటుందని షరతు పెట్టింది. త్రవ్వకాలు మాత్రం శ్రమదానంతోనే జరుగుతాయి. రైతుల్ని ఒప్పించిన రఘురాం నిపుణులు సూచించిన ప్రదేశాలలో త్రవ్వకాలు ఆరంభించాడు. ఈ సారి పెద్దలు కూడా ఆ శ్రమదానంలో పాల్గొనడం విశేషం. కొద్ది రోజులలోనే బావులు తయారయ్యాయి. ఐతే రెండు బావులలో నీరు పుష్కలంగా పడినా, మూడోదానిలో మాత్రం అంతంతమాత్రంగానే ఉంది జల. వర్షాకాలం వస్తే దాని పరిస్థితి మెరుగవుతుందన్నారు నిపుణులు.

     ఎవరో వచ్చి ఏదో చేస్తారని చేతులు ముడుచుకు కూర్చోకుండా, పట్టుదలతో తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలమని నిరూపించాడు రఘురాం. మరో మూడు బోరుబావుల త్రవ్వకానికి ప్రణాళిక తయారుచేయబడింది.

     అంతలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి యువతను నిలబెట్టారు గ్రామస్తులు. నరసారెడ్డి, అంజిరెడ్డిల మనుషులు ఆ యువకుల చేతుల్లో చిత్తుగా ఓడిపోయారు. రఘురాం సర్పంచ్ గా ఎన్నుకోబడ్డాడు. ఆ తరువాత గ్రామాభివృద్ధి చకచకా జరిగింది. త్రాగునీరు, సాగునీటి సమస్య చాలావరకు పరిష్కృతమైంది. చుట్టుపక్కల గ్రామాలలో జలగానపల్లే ఆదర్శ గ్రామంగా నిలచింది... శాసనసభ ఎన్నికలలో అంజిరెడ్డి ఓ యువకుడి చేతిలో ఘోర పరాజం పొందాడు.

     గ్రామాభివృద్ధి పనులతో తీరికలేకుండా ఉన్నా, వైదేహిని మాత్రం మరచిపోలేదు రఘురాం. ఆమెను చూడాలని కోరికగా ఉన్నా, జైలుకు వెళ్ళొచ్చినవాడికి తన కూతుర్ని ఇవ్వనని భూమయ్య తేల్చి చెప్పిన సంగతి ఆలకించడంతో, సాహసించలేకపోయాడు. వైదేహి తారసపడుతుందేమోనని జాతర్లకు వెళ్ళడం కూడా మానుకున్నాడు.


#


     చూస్తూండగానే కాలచక్రంలో ముప్పయ్యేళ్ళు దొర్లిపోయాయి. రఘురాంకి ఇప్పుడు యాభైరెండేళ్ళు. గ్రామస్థుల అభీష్టం మేరకు జలగానపల్లెకు రఘురామే సర్పంచిగా కొనసాగుతున్నాడు. వైదేహిని మరవలేక అవివాహితుడిగా మిగిలిపోయాడు.

     ఆ ఏడు మిత్రుల బలవంతంతో రంగురాళ్ళపల్లి జాతరకు బైలుదేరాడు రఘురాం.. ముప్పయ్యేళ్ళ తరువాత అదే వెళ్ళడం...జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ తిరుగాడుతూన్న రఘురాం - భుజం నిండుగా చీరచెంగు కప్పుకుని, నుదుటిపైన కుంకుమబొట్టుతో, కళకళలాడుతూన్న వదనంతో, మెరిసే కన్నులతో తనవంకే దీక్షగా చూస్తూన్న యాభయ్యేళ్ళ స్త్రీని చూసి చిన్నగా ఉలికిపడ్డాడు. 

      "వైదేహీ...!?" అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో.                               

      "రఘురాం...!" అందామె సంతోషంగా.

      అన్నేళ్ళ తరువాత కలుసుకున్న ఆ ప్రేమజంట హృదయ స్పందన వర్ణనాతీతం.

     మునుపటిలాగే జాతరకు దూరంగా పొలం గట్టు పైన కూర్చున్నా రిద్దరూ. కొద్ది క్షణాలపాటు వారి నడుమ నిశ్శబ్దం తాండవించింది. ఉన్నట్టుండి ముఖం చేతుల్లో కప్పుకుని భోరున ఏడ్చేసిందామె. ఎలా ఓదార్చాలో తెలియలేదు అతనికి. కొంతసేపటికి తేరుకుంది. వారి మనసులు విచ్చుకోవడంతో ఊసులు దొర్లాయి. అతను వివాహం చేసుకోలేదని ఆలకించి తెల్లబోయింది ఆమె.

      "నా సంగతి సరే. మీ ఆయన ఏం చేస్తూంటాడు? పిల్లలు ఎంతమంది?" అని అతను అడుగుతూంటే, పడి పడి నవ్వింది వైదేహి.

    ఆమె చెప్పింది ఆలకించి నిర్ఘాంతపోయాడు రఘురాం...జైలుకు వెళ్ళాడన్న కారణంగా రఘురాంతో తన పెళ్ళి అసంభవమనీ, అది తమ కుటుంబ పరువు ప్రతిష్ఠలకు సంబంధించినదనీ తండ్రి తెగేసి చెప్పడంతో, రఘురాంని తప్ప వేరెవరినీ పెళ్ళి చేసుకోనంటూ వైదేహి కూడా భీష్మించుక్కూర్చుంది. తండ్రి ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. భూమయ్య ఆ బెంగతోనే కన్నుమూసాడు. ఇప్పుడు వైదేహి, తల్లి ఉంటున్నారు. పొలాన్ని కౌలుకు ఇచ్చేసారు...

     ఆమె త్యాగం రఘురాంని కదలించివేసింది. చటుక్కున ఆమె ముందు మోకరిల్లి, "వైదేహీ! ఇప్పుడు మా గ్రామంలో నీటి ఎద్దడి లేదు. మా ఆడవాళ్ళు నీళ్ళకోసం మైళ్ళకొద్దీ నడవనవసరంలేదు...నేను మళ్ళీ ఎప్పుడూ జైలుకు వెళ్ళలేదు. ప్రస్తుతం మా గ్రామానికి సర్పంచిగా పనిచేస్తున్నాను...నన్ను పెళ్ళి చేసుకుంటావా?" అనడిగాడు.

     హఠాత్తుగా అతను అలా అడిగేసరికి ఎనలేని సిగ్గు ముంచుకువచ్చింది ఆమెకు. ఐతే మునుపటిలా ముఖం చేతుల్లో కప్పుకుని అక్కణ్ణుంచి పారిపోలేదు. ’బే షరం!’ అంటూ పిడికిళ్ళతో అతని గుండెలపైన చిలిపిగా కొట్టి, అతని వక్షంలో ముఖం దాచుకుంది. ఆమెను బిగియార గుండెలకు హత్తుకున్నాడు అతను.

      ఆ జంటను ఆశీర్వదిస్తున్నట్లుగా అమ్మవారి గుళ్ళో జేగంటలు మ్రోగాయి.

                                                                 ******



Rate this content
Log in

Similar telugu story from Drama