PVV Satyanarayana

Drama Tragedy Inspirational

5.0  

PVV Satyanarayana

Drama Tragedy Inspirational

కృష్ణమ్ వందే...

కృష్ణమ్ వందే...

10 mins
599


కృష్ణమ్ వందే...

రచనః తిరుమలశ్రీ

***

     డోర్ బెల్ మ్రోగడంతో వెళ్ళి తలుపు తెరిచాను. గుమ్మంలో ఓ బాలిక.

     ఏం కావాలన్నట్లు చూసాను. "మీకు పనిపిల్ల కావాలా, అమ్మగారూ?" అనడిగింది.

     అంతవరకు పనిఛేస్తూన్న పనిమనిషి, జీతం పెంచలేదని నెలక్రితం చెప్పా పెట్టకుండా పని మానేసింది. ఈ నెల్లాళ్ళనుండీ సరైన మనిషి దొరక్క పనంతా నేనే చేసుకోవలసి వస్తోంది.

     "పనిపిల్ల అంటున్నావ్, మీ అక్క ఉందా?" అడిగాను ఆ పిల్లను. "లేదమ్మగారూ! నేనే..." అంది.

     విస్తుపోతూ ఆ పిల్లను పరీక్షగా చూసాను...పట్టుమని పదేళ్ళు ఉండవు. బక్కగా, చామనచాయలో ఉంది. కన్నుల్లో కాంతి, ముఖంలో ఏదో ఆకర్షణ. పోషణ లోపించిన శరీరం. ఇస్త్రీది కాకపోయినా, ఉతికిన గౌను తొడుక్కుంది. తల చక్కగా దువ్వుకుని జడలు వేసుకుంది.

     "నువ్వా...!?" అన్నాను సంభ్రమంతో. ఔనన్నట్లు తలూపింది.

     "చిన్నపిల్లవు...నువ్వేం పనిచేస్తావ్?"

       "ఏ పని చెప్పినా చేస్తాను, అమ్మగారూ! ఇల్లు ఊడుస్తాను, అంట్లు తోముతాను, బట్టలు ఉతుకుతాను. బైటినుండి సరుకులవీ తెచ్చిపెడతాను. మీరు ఏ పని చెప్పినా చేస్తాను" అంది హుషారుగా.

     "ఇవన్నీ నువ్వు చెయ్యగలవా!" సందేహం వ్యక్తం చేసాను.

     "ఔనమ్మగారూ! మా అమ్మ నాకు పనులన్నీ నేర్పించింది" అంది.

     చదువుకోవలసిన వయసులో పనిమనిషిగా మారాలనుకోవడ మేమిటి!?...అదే మాట నేనంటే, "చదువుకుందామనే, అమ్మగారూ!" అంది.

    తన పేరు గిరిజ అని చెప్పింది. ఐదవ తరగతి చదువుతోంది. బాగా చదువుకోవాలన్న ఆశ. కాని, తండ్రికి తాను చదువుకోవడం ఇష్టం లేదు. ’ఆడపిల్లకు చదువేమిటీ?’ అంటూ తిడతాడు. పుస్తకాలు కొనివ్వడు. క్లాసులకు వెళ్ళనివ్వడు. కేవలం ఉచితంగా పెట్టే మధ్యాహ్నపు భోజనం కోసం బళ్ళో చేర్పించాడు. భోజనం వేళకు వెళ్ళి తినేసి వచ్చేయమంటాడు. ఎక్కడైనా పనిలో చేరి డబ్బులు సంపాదించమంటాడు.          "క్లాసులకు వెళ్ళకుండా ఉత్తనే భోజనం చేయడం నాకు ఇష్టం ఉండదు, అమ్మగారూ!" దైన్యంగా అంది ఆ పిల్ల. "వెళ్ళనంటే అయ్య తిడతాడు. ఆ పూట ఇంట్లో తిండి లేదు పొమ్మంటాడు. క్లాసులకు వెళ్ళని రోజున పస్తులుంటాను".

     జాలి వేసింది నాకు. లోపలికి వెళ్ళి వంద రూపాయల నోటొకటి తెచ్చి ఆ పిల్ల చేతిలో పెట్టబోయాను.

     దెబ్బ తిన్నట్టు చూసింది. "నాకు డబ్బులు ఊరకే వద్దు, అమ్మగారూ! పని కావాలి" అంది.

     ఆ పిల్ల ఆత్మాభిమానానికి అవాక్కయ్యాను.

    "అమ్మగారూ! చిన్నపిల్లనని సందేహించకండి. పెద్దవాళ్ళలా పని చేస్తాను. దయచేసి నన్ను పనిలో పెట్టుకోండి...పని చేసుకుని సంపాదించే డబ్బులతో నేను చదువుకోవాలనుకుంటున్నాను, అమ్మగారూ!" ప్రాధేయపూర్వకంగా అంది.

     నేను ఆలోచిస్తూంటే, "ఒక్క అవకాశం ఇవ్వండి, అమ్మగారూ! నా పని నచ్చకపోతే మానిపించేద్దురుగాని" అంది.

     ఆ పిల్ల అంతగా అర్థిస్తూంటే నా మనసు కరిగిపోయింది. "జీతం ఎంతివ్వమంటావ్?" అనడిగాను.

     "మీ ఇష్టం, అమ్మగారూ!" అంది.

      మునుపటి పనిమనిషికి ఇతరత్రాలు కాక నెలకు వేయి రూపాయలు ఇచ్చేదాన్ని. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయాయంటూ జీతం ఐదు వందలు పెంచమంది. ధరలు పెరిగినా, పని పెరగలేదు కనుక జీతం పెంచడానికి ఒప్పుకోలేదు నేను. రావడం మానేసింది... ఆ పనిమనిషి పెద్దది. ఈ పిల్ల చిన్నది. పెద్దవాళ్ళలా పనిచేయలేదుగదా!...అందుకే, నెలకు ఐదు వందలు ఇస్తానన్నాను. ఏనుగు అంబారీ ఎక్కినంతగా సంబరపడిపోయింది ఆ పిల్ల. సంతోషంతో నాకు నమస్కరించింది.

     గిరిజ ఆ రోజు నుండే పని మొదలుపెట్టేసింది. చీపురు తీసుకుని ఇల్లంతా ఊడ్చేసింది. అంట్లు శుభ్రంగా తోమింది. చిన్నపిల్ల కదా అని ఉతకడానికి బట్టలు వేయలేదు నేను. తనంతట తానే అడిగి తీసుకుని నా చీరలు, లంగాలవీ సబ్బు పెట్టి ఉతికేసింది. హుషారుగా పనులన్నీ చేసేసింది. ఎక్కడా అలసట చాయలు కనిపించనివ్వలేదు. ఆడుతూ పాడుతూ తిరగవలసిన ఆ వయసులో పెద్దవాళ్ళను మించిన ఆ పిల్ల పనితీరు నన్ను ఆకట్టుకుంది. మనసులో ఏ మూలో చిన్న అపరాధ భావన కూడా మెదిలింది, మునుపటి పనిమనిషికి ఇచ్చేదానిలో సగమే ఆ పిల్లకు ఇస్తూన్నందుకు.

      పనంతా అయిపోయాక తినడానికేదో పెట్టి, చేతిలో వంద రూపాయలు పెట్టాను.

     తెల్లబోయి, "నా పని నచ్చలేదా, అమ్మగారూ? నన్ను పనిలో పెట్టుకోరా?" అనడిగింది, తీసుకోకుండా.

     "అదేం కాదులే" అన్నాను. నెలాఖరున జీతం ఒకేసారి ఇద్దురుగాని అంది.

     "పరవాలేదు, ఉంచుకో...ఏదైనా కొనుక్కుందువుగాని" అంటూ బలవంతంగా చేతిలో పెట్టాను.     

     గిరిజ రోజూ ఉదయమే వచ్చి పనులన్నీ చకచకా చేసేసి, పెట్టిందేదో తిని వెళ్ళిపోయేది. నన్ను ఏ పనీ ముట్టుకోనిచ్చేది కాదు. వాళ్ళ అయ్య బడికి వెళ్ళనివ్వడు కనుక, మధ్యాహ్నం ఏదో ట్యూటోరియల్లో చేరి చదువుకుంటుందట. ఆ పిల్ల పరిస్థితిని చూసి తక్కువ ఫీజు తీసుకోవడానికి ఒప్పుకున్నారట వాళ్ళు. నేను ఇచ్చే జీతంలో కొంత తన చదువుకు వినియోగించి, మిగతాది వాళ్ళమ్మ చేతిలో పెడుతుందట. తాను చదువుకోవడం వాళ్ళమ్మకు సంతోషమేనట.

     చదువు గురించి మాట్లాడుతూంటే ఆ పిల్ల కన్నులలో విరిసిన మెరుపులు నాదృష్టిని దాటిపోలేదు. చదువుపైన ఆ పిల్లకున్న శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల ముచ్చట గొలిపాయి నాకు. కొద్ది రోజుల్లోనే తన పనితో, ప్రవర్తనతో నా అభిమానాన్ని చూరగొంది.

     ఐతే గిరిజను పనిలో పెట్టుకున్నప్పటినుంచీ నాకు, మా వారికీ మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది... బళ్ళోకి వెళ్ళవలసిన పిల్లను పనిలో పెట్టుకోవడం అన్యాయమేకాక, నేరం కూడా నన్నది ఆయన వాదన. ’పదిహేనేళ్ళ లోపు పిల్లను పనిలో పెట్టుకున్నట్టు తెలిస్తే బాల కార్మిక చట్టం క్రింద నిన్ను, నన్నూ కూడా తీసుకువెళ్ళి జెయిల్లో పడేస్తారు, జాగ్రత్త!" అంటారాయన.

     ’పాపం, చదువుకోవాలన్న అభిలాషతో పనిచేసి సంపాదించుకుంటోందండీ. ఆ పిల్ల ఆశయంలో సహకరిస్తున్నామే కాని, మనమేమీ బలవంతంగా పనిలో పెట్టుకోలేదు కదా! అన్నది నా వాదన.

     ’నీ లాజిక్ చట్టం ముందు చెల్లదు, అమ్మడూ! చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవడం మంచిది’ అంటారాయన.

     గిరిజ ఓసారి మా చర్చ ఆలకించినట్టుంది, "నేనిక్కడ పని చేస్తున్నట్టు ఎవరికీ చెప్పను, అమ్మగారూ! మీకు మాట రానివ్వను. దయచేసి నన్ను పనిలోంచి తీసేయకండి" అంది దైన్యంగా.

     నేను చేస్తూన్న పని చట్ట విరుద్ధమని ఎరిగినా, ఆ పిల్లను మాన్పించేయడానికి మనస్కరించలేదు నాకు.                                                          

   గిరిజకి ఉన్నవి రెండే జతలు కాబోలు, వాటినే ఉతుక్కుని రోజూ మార్చి తొడుక్కుంటూ నీట్ గా పనిలోకి వచ్చేది. అది గమనించి రెండు జతల బట్టలు కొనిపెట్టాను. వాటిని చూసుకుని ఆ పిల్ల మురిసిపోతూంటే, అది నాకు సంతృప్తిని కలిగించింది. రోజూ పనంతా అయ్యాక ఓ అరగంటసేపు ఆ పిల్లకు చదువు కూడా చెప్పనారంభించాను. ఆ పిల్ల తెలివితేటలు, చదువుపట్ల గల దీక్ష నన్ను అబ్బురపరచేవి.

     ఓసారి హఠాత్తుగా అడిగింది నన్ను గిరిజ, "మిమ్మల్ని నేను అక్కా అని పిలవొచ్చునా?" అని.    విస్తుపోయాను నేను. నాకు అక్కచెల్లెళ్ళు లేరు. తమ్ముడొక్కడే ఉన్నాడు. అందుకే కాబోలు, ఆ పిల్ల అలా అడగ్గానే నా కళ్ళలో నీళ్ళూరాయి. "పరవాలేదు, పిలు" అన్నాను. "ఇకనుంచి మీరు, అండీలు మానెయ్యాలి మరి...” ఆ మాటతో దాని ముఖం చాటంత అయింది.                                మా బెడ్ రూమ్ లో ఉన్న ఓ ఫోటోని తదేకంగా చూస్తూ, "నువ్వు డాన్స్ చేస్తావా అక్కా!?" అనడిగిందోసారి గిరిజ సంభ్రమంతో.

      పెళ్ళికి ముందు నృత్యం నేర్చుకున్నాను నేను. కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుని స్కూలు, కాలేజ్ ఫంక్షన్స్ లో ప్రదర్శన లిచ్చాను. మా నాట్య గురువు సాంస్కృతిక కార్యక్రమాలలో నాచేత సాంప్రదాయ నృత్యాన్ని చేయించేవారు. అన్నిటిలోనూ ’కృష్ణమ్ వందే జగద్గురుమ్...’ అన్న పాట నాకు అత్యంత ప్రియమైనది. ఆ పాటకు నృత్యం చేస్తూ మైమరచిపోయేదాన్ని. అందుకే డాన్స్ ఫోటోలు ఎన్ని ఉన్నా, ఆ నృత్యం చేస్తూన్నప్పటి ఫోటోని మాత్రం లేమినేట్ చేయించి పడగ్గదిలో పెట్టుకున్నాను.

     మందహాసంతో ఔనన్నాను, ఆ పిల్ల ప్రశ్నకు సమాధానంగా.

     ఆ ఫోటో క్రింద రాసియున్న వాక్యాన్ని చదివి, "కృష్ణమ్ వందే జగద్గురుమ్...అంటే ఏమిటక్కా? అనడిగింది.

     ’యావత్ జగతికి పరమగురువైన శ్రీకృష్ణ పరమాత్మకు ప్రణామాలు’ అని అర్థం చెప్పాను.

     "కృష్ణుడంటె నాకూ ఇష్టమే అక్కా!" అంది.

     దాని కుతూహలం గమనించి నా డాన్స్ ఫొటోల ఆల్బమ్స్ ఇచ్చాను. కళ్ళు విప్పార్చుకుని వాటిని ఎంతో ఆసక్తితో, ఆరాధనతో చూసింది. నృత్యకళ గురించి ఏవేవో ప్రశ్నలు వేసి సందేహాలు తీర్చుకుంది. ఏడాది క్రితం వివాహమై విశాఖపట్టణానికి వచ్చాక నా హాబీకి ఫుల్ స్టాప్ పడిందని ఆలకించి తెగ బాధ పడిపోయింది.

    "కొన్నిటికోసం మరి కొన్నిటిని వదులుకోక తప్పదు మరి" అని నేనంటే, "అదేం మాటక్కా? మనలో దీక్ష, పట్టుదలా ఉంటే ఏదైనా సాధించవచ్చని మా అమ్మ చెబుతుంది. అందుకేగదా, మా అయ్య వద్దంటున్నా నాకిష్టమైన చదువుకోసం పనిలో చేరాను!" అంది.

      నేను నృత్యం చేయడం నా అత్తమామలకు ఇష్టం లేదని పెళ్ళిచూపులలోనే తెలిసిపోయింది.  

     ’మా అమ్మాయికి భరతనాట్యం, కూచిపూడి నేర్పించాం. ప్రదర్శనలు కూడా ఇచ్చింది’ అని మావాళ్ళు గొప్పగా చెప్పుకోబోతే… ’ఆడపిల్ల వేదికలెక్కి ఒళ్ళంతా కుదుపుకుంటూ నాట్యం చేయడం మాకిష్టం ఉండదు’ అంది మా అత్తగారు నిర్మొహమాటంగా. మామగారు ఆవిడకు వత్తాసు పలికారు. శ్రీవారు మాత్రం తటస్థంగా ఉండిపోయారు.

     ఆ తరువాత అదే విషయం నేను నాన్నతో ప్రస్తావించబోతే, ’ఎవరి అభిప్రాయాలు వారివమ్మా! కేవలం కళకోసం చక్కటి సంబంధాన్ని వదులుకుంటామా?’ అంటూ ఆ సంబంధం ఖాయం చేసేసారు.

      ’నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి వద్దు. కొన్నాళ్ళపాటు నేను నేర్చుకున్న కళను సార్థకం చేసుకుని ఆనక పెళ్ళి చేసుకుంటాను’ అంటూ అమ్మ దగ్గర ఏడ్చాను.                                    ’నృత్యం ఓ అపూర్వమైన కళ. కాదనను. కాని, అంతకంటె జీవితం ముఖ్యం కదా! వచ్చిన అవకాశం వదులుకుంటే, మనం కావాలనుకున్నప్పుడు ఇంత మంచి సంబంధం వస్తుందన్న నమ్మకమేమిటీ?’ అంటూ నన్ను ఓదార్చి ఒప్పించింది అమ్మ.

     ఏ కళకైనా నిరంతర అభ్యాసం అవసరం. పెళ్ళైన ఆ ఏడాదిలోను రెండు మూడు సార్లు నా నృత్యం గురించి మా వారి దగ్గర కదపబోతే, తెలివిగా దాటవేసేసారు, తన అయిష్టాన్ని చెప్పకనే చెబుతూ. దాంతో నా దురదృష్టంతో రాజీపడి మిన్నకుండిపోయాను...

     "ఈ విశాఖపట్నంలో డాన్స్ స్కూళ్ళు చాలానే ఉన్నాయి. మళ్ళీ చేరొచ్చుకదా అక్కా?" అంది గిరిజ. "నువ్వు డాన్స్ చేస్తూంటే చూడాలని ఆశగా ఉంది నాకు".

    ఆ పిల్ల పలుకులు నా మదిలో నూతనపు టాలోచనలకు తెర లేపాయి... చిన్నపిల్ల అయ్యుండీ తండ్రి వ్యతిరేకతను లెక్కచేయకుండా చదువుకోవాలన్న పట్టుదలతో, ఆటపాటలతో గడపవలసిన వయసులో పనిమనిషిగా మారింది. ఆ పిల్ల నాకెందుకు ఆదర్శప్రాయం కాకూడదు?!

    ఈసారి మావారితో నా నిశ్చయాన్ని ధైర్యంగా చెప్పేసాను...ఆయన ఉదయం ఆఫీసుకు వెళ్ళిపోయి సాయంత్రం గాని తిరిగిరారు. ఆ మధ్యకాలంలో ఖాళీగా ఉండడం నాకు బోర్ గా ఉంటుంది. టీవీ సీరియల్స్ చూడడం నాకు ఇష్టం ఉండదు. కనుక ఏదైనా డాన్స్ స్కూల్లో చేరబోతున్నట్టు చెప్పేసాను. అందువల్ల ఆయనకు ఎటువంటి ఇబ్బందీ కలుగదని హామీ కూడా ఇచ్చాను... నా కన్నుల్లో ప్రతిఫలిస్తూన్న నా దృఢ నిశ్చయాన్ని గమనించారో ఏమో భుజాలు ఎగురవేసారు... మంచి రోజు చూసి పేరున్న ఓ నృత్య కళాశాలలో చేరిపోయాను నేను.  

   గిరిజ పనిలో చేరి ఆర్నెల్లయిపోయింది. నా మెప్పు పొందడమేకాక, మా వారి అభిమానాన్ని కూడా చూరగొంది... ఓసారి గిరిజ వారం రోజులుగా పనిలోకి రాలేదు. చెప్పకుండా పని మానేయదు. ఏ జ్వరమో ఏదో వచ్చుంటుం దనుకున్నాను. అదే సమయంలో గెస్టులు రావడం ఇబ్బంది అనిపించింది. ఇంటి పని చేసుకునే అలవాటు తప్పిపోవడంతో, ఒంటరిగా చేసుకోవడం కష్టమయిపోయింది. చెప్పకుండా మానేసినందుకు గిరిజ మీద కోపం కూడా వచ్చింది.

   వారం తరువాత హఠాత్తుగా ప్రత్యక్షమయింది గిరిజ. లంఖణాలు చేసిందానిలా ముఖమంతా పీక్కుపోయి నీరసంగా కనిపించింది. ముఖంలో మునుపటి కళ లేదు. కళ్ళలో కూడా జీవం లేదు. చంకలో ఓ ఐదేళ్ళ పిల్లాడు మాత్రం ఉన్నాడు.

   దాన్ని చూడ్డంతో నాకు తెలియకుండానే కోపం పొంగుకు వచ్చింది. "ఇన్ని రోజులనుండీ ఏమైపోయావ్? సరిగా గెస్టులు వచ్చే సమయానికే పనికి డుమ్మా కొట్టాలనిపించిందా నీకు?" అంటూ విరుచుకుపడ్డాను.                                                   

    బిక్కమొగం వేసింది ఆ పిల్ల. కళ్ళమ్మట నీళ్ళు జల జల రాలాయి. నా అరుపులకు జడుసుకుని కాబోలు పిల్లాడు ఆమెను బల్లిలా అంటుకుపోయాడు.

   ఆ వారం రోజులూ తాను పనిలోకి రాలేకపోవడానికి కారణం ఆ పిల్ల చెబుతూంటే...షాక్ తో నా మెదడు మొద్దుబారిపోయింది... గిరిజ తండ్రికి ఓ పనంటూ లేదు. రాత్రయ్యేసరికి పూటుగా తాగి వస్తాడు. ఆ పిల్ల తల్లి నాలుగిళ్ళలో పాచి పని చేసుకుని గుట్టుగా నెట్టుకొస్తోంది. తాను సంపాదించి పెట్టవలసింది పోయి, త్రాగుడుకు డబ్బులివ్వమని ఎదురు పెళ్ళాన్ని వేధిస్తాడు. అందినంతమటుకు లాక్కుపోతాడు. లేని నాడు నానా రభసా చేసి పెళ్ళాన్ని, పిల్లల్నీ చితగ్గొడతాడు.

   వారం క్రితం ఓ రాత్రి వేళ బాగా తాగొచ్చి పెద్ద గొడవ చేసాడు గిరిజ తండ్రి ఏ కారణమూ లేకుండానే. పెళ్ళాన్ని తిట్టి కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెకు రంకు కట్టాడు. ఆ అవమానం భరించలేని ఆమె తెల్లవారేసరికి ఉరేసుకుని చచ్చిపోయింది. ఆ బాధేమీ లేకుండా, చిన్న పిల్ల లిద్దర్నీ ఇంటినుండి గెంటేసాడు అతను. తల్లిని పోగొట్టుకుని, తండ్రి దౌష్ట్యానికి గురై వీధిన పడ్డ ఆ పసివాళ్ళను ఇరుగుపొరుగులు చేరదీసారు.

    చంకనున్న పిల్లాడు తన తమ్ముడని చెప్పింది గిరిజ. "నన్ను క్షమించక్కా! దయచేసి నన్ను పనిలోంచి తీసేయొద్దు. ఇంకెప్పుడూ మానను...అమ్మ లేదుగా! తమ్ముడు, నేనూ ఆకలితో చచ్చిపోతాం, అక్కా!" అంటూ భోరున ఏడ్చేసింది.

   నాకూ దుఃఖం ముంచుకొచ్చింది. తమాయించుకుంటూ, "నీకు జరిగిన అన్యాయానికి నాకు చాలా బాధగా ఉంది. నాలుగు రోజులు రానందుకే నిన్ను పనిలోంచి తీసేస్తానని ఎలా అనుకున్నావే పిచ్చిదానా!" అంటూ ఓదార్పుగా తల నిమిరాను.

   గిరిజ తండ్రి ఆ సంఘటన తరువాత మళ్ళీ ఇంటికి రాలేదట. గిరిజ తమ్ముడితో పొరుగింట్లోనే ఉంటోందట. రోజూ ఎప్పటిలాగే క్రమం తప్పకుండా పనిలోకి వస్తూండేది. ఐతే మనిషిలో మునుపటి హుషారు ఇప్పుడు మృగ్యం. అంతటి కష్టంలోనూ తాను చదువుకోవడం మానలేదు. తమ్ముడంటే ప్రాణం తనకు. వాణ్ణి బాగా చదివించి మంచి ఉద్యోగస్థుణ్ణి చేయాలన్న తన తపనను వెలిబుచ్చేది. వాడే తన జీవిత లక్ష్యం అన్నట్టు మాట్లాడేది. నేను ఏం పెట్టినా తినకుండా తమ్ముడికోసం పట్టుకువెళ్ళేది.

   పని చేస్తూ హఠాత్తుగా అడిగేది నన్ను, ’నేను, తమ్ముడు అంటే అమ్మకు ప్రాణం, అక్కా! నాన్న ఎన్ని బాధలు పెట్టినా మాకోసమే బతుకుతున్నాననేది. మరి మమ్మల్ని వదిలేసి ఎందుకు చచ్చిపోయిందక్కా?’ అని. ఏం సమాధానం చెప్పాలో తోచేది కాదు నాకు. మాట మార్చడానికి ప్రయత్నించేదాన్ని. తల్లి గుర్తుకు వచ్చేది కాబోలు, అప్పుడప్పుడు పెరట్లో ఒంటరిగా కూర్చుని నిశ్శబ్దంగా ఏడ్చేది... నేను దాని జీతం రెట్టింపు చేయడంతో ఆనందంతో పొంగిపోయింది.                                           కష్టాలు ఒంటరిగా రావంటారు. మా అదృష్టమో, ఆ పిల్ల దురదృష్టమో... మా వారికి నోయిడాలో ఓ ఎమ్మెన్సీలో పెద్ద ఉద్యోగం వచ్చింది.

   మేము వెళ్ళిపోతున్నామని తెలిసి కొయ్యబారిపోయింది గిరిజ. "నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అక్కా!" అంటూ బేర్ మంది, నా కాళ్ళకు చుట్టుకుపోయి. నాకూ దుఃఖం ఆగలేదు.

   దానికీ, దాని తమ్ముడికీ కొత్త బట్టలు, కొంత సొమ్ము చేతిలో పెట్టబోతే, ఓ పట్టాన తీసుకోలేదు ఆ పిల్ల. ధారాపాతంగా కారుతూన్న కన్నీటితో మాకు వీడ్కోలు చెప్పింది.

   నోయిడా వచ్చిన చానాళ్ళ వరకు నా తలపులు ఆ పసిదాని చుట్టూనే తిరుగుతూండేవి. మనసు బరువెక్కేది. కాలక్రమాన నా నృత్య వ్యాపకాలలో పడి ఆ ఙ్ఞాపకాలు మసకబార సాగాయి...

    కాలచక్రంలో పదిహేనేళ్ళు గిర్రున తిరిగిపోయాయి...ఆ కాలంలో నా కళకు మెరుగులు దిద్దుకున్నాను. దేశ విదేశాలలో నా నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ, జనాలను రంజింపజేసాను. ఒక్కోసారి, ’నా ప్రగతికి గిరిజే కారణం’ అన్న ఓ భావ వీచిక నా మదిని అలవోకగా తాకేది.

   నోయిడాలో పదేళ్ళు పనిచేసాక, మా వారు పనిచేసే కంపెనీ చెన్నైలో బ్రాంచ్ ఒకటి ప్రారంభించి, మా వారిని దానికి హెడ్ గా వేయడం జరిగింది. దాంతో గత ఐదేళ్ళుగా చెన్నైలోనే ఉంటున్నాం మేము.

  చెన్నై సాంస్కృతిక కేంద్రం కావడం నాకెంతో ఉపకరించిందని చెప్పాలి. టీవీలో, స్టేజ్ పైనా పలు ప్రదర్శనలు ఇస్తూ అందరిచేతా ’శెభాష్’ అనిపించుకోవడం నాకు తృప్తి కలిగించింది. మా వారి సహకారంతో అడయారులో ఓ డాన్స్ స్కూలు ఆరంభించాను. నృత్యం పట్ల ఆసక్తిగల చిన్నారులకు శిక్షణ నివ్వసాగాను. దాంతో బాగా బిజీ అయిపోయాను. అందుకే పన్నెండేళ్ళ మా పాపను, తొమ్మిదేళ్ళ బాబును రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాము... గిరిజ అప్పుడప్పుడు నా స్మృతిపథంలో మెదలుతూండేది.’పాపం, ఇప్పుడు ఆ పిల్లలు ఎలా ఉన్నారో!’ అన్న ఆలోచన వెంటాడేది.

  విశాఖపట్టణంలో ఉండగా నా నృత్యకళకు సానపెట్టిన నాట్యాచార్యులకు ఆ మధ్య పక్షవాతం వచ్చిందని తెలిసి, చూడాలని వెళ్ళాను. పదిహేనేళ్ళ తరువాత అదే వెళ్ళడం ఆ ఊరికి. ఆయన్ని పరామర్శించాక, గిరిజ ఎలా ఉందో తెలుసుకోవాలనిపించి ఆ పిల్ల ఉండే బస్తీకి వెళ్ళాను.  

  గిరిజ కోసం విచారిస్తే, తెలిసిన విషయాలు నన్ను నిశ్చేష్ఠురాలిని చేసాయి... తల్లి పనిచేసే ఇళ్ళలో పాచిపనికి కుదిరి కష్టపడి తమ్ముణ్ణి పెంచి పెద్ద చేసింది గిరిజ. తన చదువు అటకెక్కితే, తమ్ముడికి చదువబ్బలేదు. అంతలో ఓసారి తండ్రి ఊడిపడ్డాడు. కూతురు సంపాదిస్తోందని తెలిసి, త్రాగుడుకి డబ్బుల కోసం ఆమెను వేధించేవాడు. పోర్ట్ లో కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో యాభై వేలు అడిగితే, గిరిజను పెళ్ళాడాలనుకున్న ఓ రౌడీ షీటర్ కి ఆమెను అరవై వేలకు అమ్మేసి, కొడుక్కి ఉద్యోగం వేయించాడు. తాను అప్పుడే పెళ్ళి చేసుకోనంటూ ఏడ్చిన అక్కకు తోడుగా నిలవ్వలసిన తమ్ముడు స్వార్థంతో తండ్రికి వత్తాసు  పలికాడు. ఆ తరువాత ఆ పిల్ల ఎక్కడుందో, ఏమయిందో ఎవరికీ తెలియదు...ఇక ఇంకో క్షణం అక్కడ నిలుచో బుద్ధి కాలేదు నాకు. భారంగా వెనుదిరిగాను...

   హైదరాబాద్ లో నా నృత్య ప్రదర్శన ఉంది. ఆటిక్ చిల్డ్రన్ సహాయార్థం ఆ బెనెఫిట్ షో ఏర్పాటు చేయబడింది. వచ్చిన కలెక్షన్ ఆ అభాగ్య బాలబాలికల సంక్షేమం కోసం వినియోగింపబడుతుంది. అందుకే ఆ

 ప్రద్సర్శనను ఉచితంగా ఇస్తున్నాను నేను.

   ప్రదర్శన ఆటిక్ సొసైటీ ఆడిటోరియంలో జరిగింది. నాకు అత్యంత ప్రియమైన ’కృష్ణమ్ వందే జగద్గురుమ్...’ హై లైట్. ఆ పాటకు నేను తన్మయంతో నాట్యం చేస్తూంటే, ప్రేక్షకులతో పాటు ఆసక్తితో తిలకించారు ఆ బాలబాలికలు కూడా.

   ప్రదర్శన పూర్తయ్యాక నేను గ్రీన్ రూమ్ లో దుస్తులు మార్చుకుంటూంటే, గుమ్మం పక్క నుండి ఎవరో తొంగి చూస్తున్నట్లనిపించింది. అటువైపు వెళ్ళాను.

  హఠాత్తుగా నన్ను కట్టెదుట కాంచడంతో తత్తరపాటు చెందిన ఆ యువతిని అంతకు మునుపు ఎక్కడో చూసినట్లనిపించింది. పరీక్షగా చూసాను... ఇంచుమించు పాతికేళ్ళుంటాయి. మీడియం హైట్ తో సన్నగా, చామనచాయలో ఉంది. కురచ జుత్తు. లైట్ బ్రౌన్ ప్లెయిన్ శారీ ధరించింది.

    "గిరిజా...!" అన్నాను సంభ్రమంగా. చటుక్కున వెనుదిరిగి వెళ్ళిపోబోయింది.

    సందేహం లేదు. ఒకప్పటి ’అక్కా’ అంటూ నా చుట్టూ తిరిగిన చిన్నారి గిరిజే-ఆమె! ఎంత పెద్దదయింది!... నా మది ఆనందంతో పొంగిపోయింది. చేయి పట్టుకుని ఆపాను.

    "సారీ, మేడమ్!" అంది మెల్లగా. "మీరు చేసిన ’కృష్ణమ్ వందే జగద్గురుమ్’ నృత్యం ఎంతో హృద్యమంగా ఉంది. మిమ్మల్ని చూడాలనిపించింది".

    "మేడమ్ కాదు, అక్క. ఎప్పటికీ నేను నీకు అక్కనే!" అంటూ లోపలికి లాక్కుపోయాను. "ఊఁ, చెప్పు. ఆ పాట నీకంతగా నచ్చిందా?"

    చిన్నగా తల ఊపింది. "నువ్వు నాట్యం చేస్తూంటే చూడాలన్న నా చిననాటి కోరిక...ఇలా ఫలిస్తుందనుకోలేదక్కా! నాకు చాలా సంతోషంగా ఉంది".

    ఆ మధ్య నేను విశాఖ వెళ్ళినప్పుడు ఆమె కోసం విచారించినట్లు చెప్పాను.

    "ఈ పేదపిల్ల నీకింకా గుర్తుందంటే...అది నాఅదృష్టం!" అంది.

    "చెప్పమ్మా, ఎలా ఉన్నావ్? ఎక్కడ ఉంటున్నావ్?" తన చేతిని నా చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా అడగడంతో, శివుడి తలపైనుంచి దుమికిన గంగలా ఒక్కసారిగా దుఃఖం ఉబికి రావడంతో ముఖం చేతుల్లో కప్పుకుని భోరున ఏడ్చేసింది గిరిజ.

    వెక్కిళ్ళ మధ్య ఆమె చెబుతూన్నది వింటూంటే, నాకు తెలియకుండానే నా చెంపలు తడిచిపోయాయి.

   ’తన ఇష్టానికి వ్యతిరేకంగా తండ్రి తనను ఓ రౌడీ షీటర్ కి అమ్మేసాడు. వాడు తనను విజయవాడ తీసుకుపోయి బలవంతంగా అనుభవించాడు. తరువాత తన స్నేహితులకు అప్పగించాడు. తిరగబడిన తనను చిత్రహింసలకు గురిచేసారు వాళ్ళు. వాడుకున్నన్నాళ్ళూ వాడుకుని ఆనక హైదరాబాద్ తీసుకొచ్చి ఓ వ్యభిచార గృహానికి అమ్మేసారు. మూణ్ణెల్లపాటు అక్కడ నానా యాతనా అనుభవించి ఎలాగో తప్పించుకోగలిగింది. తనను తరుముతూన్న గూండాల బారినుంది తప్పించుకునే ప్రయత్నంలో ఆ ఆటిక్ సొసైటీ కాంపౌండ్ లో దాక్కుంది... ’ఫాదర్’ చూసి విషయం తెలుసుకుని తనకు అక్కడ ఆశ్రయమిచ్చారు...అది జరిగి రెండేళ్ళయింది. అప్పట్నుంచీ ఆ పిల్లలకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది...’

     ’భగవంతుడు ఎంతటి నిర్దయుడు!’ అనుకోకుండా ఉండలేకపోయాను నేను. ఆ పిల్లను ఓదార్చడానికి మాటలు రాలేదు నాకు.

   కాసేపటికి తేరుకుని కన్నీటిని తుడుచుకుంది గిరిజ. "సారీ, అక్కా! ఇన్నేళ్ళ తరువాత కలుసుకున్న ఆనందం అనుభవించకుండా నా బాధలతో నీ మనసు కష్టపెడుతున్నాను" అంది. ప్రేమగా తల నిమిరాను.

     "అమ్మే బతికుంటే నా జీవితం ఇలా అయ్యేదా, అక్కా? ప్రాణం కంటె ఎక్కువగా చూసుకున్న మమ్మల్ని వదిలి అంత నిర్దయగా ఎలా వెళ్ళిపోగలిగింది అమ్మ!" అంది మళ్ళీ గద్గద స్వరంతో. అనునయంగా ఆమె తలను నా వక్షానికి అదుముకున్నాను ఉబికివస్తూన్న కన్నీటిని అదిమిపెట్టుకుంటూ.

     "నువ్వు ఉన్నంతవరకు నాకు కొండంత ధైర్యంగా ఉండేది, అక్కా! నువ్వు వెళ్ళిపోయాక మేం అనాథలమన్న భావన మొదటిసారి కలిగింది నాలో" అని ఆమె అంటూంటే, నా మనసు పిండేసినట్టయింది.

     "కష్టాలు కలకాలం ఉండవమ్మా! నాతో చెన్నై వచ్చెయ్. అక్కడ నీ బ్రతుక్కి ఓ మార్గం చూపిస్తాను. తగినవాణ్ణి చూసి పెళ్ళి చేసుకుందువుగాని" అన్నాను.

     "చెడిపోయిన ఆడదానికి పెళ్ళేమిటక్కా?" అంది నిర్వికారంగా.

     "చెడిపోయింది నువ్వు కాదు, గిరిజా! ఈ సమాజం!!" కించిత్తు ఉద్వేగంతో అన్నాను. "నీ గాధ తెలుసుకుని, నిన్ను అర్థం చేసుకుని, నిన్ను నిన్నుగా మనస్ఫూర్తిగా అంగీకరించేవాడినే చేసుకుందువుగాని".

    శుష్కహాసంతో తల అడ్డుగా త్రిప్పింది గిరిజ. "ఒద్దక్కా! ఇక నాకు ఏ ఆశలూ లేవు. ఆ అభాగ్యపు పిల్లలకు సేవ చేస్తూంటే నా మనసుకెంతో శాంతిగా, తృప్తిగా ఉంటుంది. ఆలోచిస్తే, ఈ పిల్లలకు సంభవించిన కష్టం ముందు, నాదెంత అనిపిస్తుంది. అభం శుభం ఎరుగని ఈ చిన్నారులకు సేవ చేసుకుంటూ నా శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపేయాలన్నదే నా కోరిక!" అంది.

     పాతికేళ్ళకే ఈ పిల్ల ఎంత ఎదిగిపోయింది! కష్టాల పుటమి తెచ్చిన పరిణితి, మనో పరిపక్వతా కాబోలు!’అనిపించింది.                                                            "జీవితంలో నిన్ను మళ్ళీ చూస్తానో లేదోనని బాధపడేదాన్ని. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందనేది మా అమ్మ. దాన్ని నిజం చేస్తూ భగవంతుడు ఇన్నాళ్ళకు నా కోర్కె తీర్చడం నాకెంతో ఆనందంగా ఉందక్కా! కృష్ణమ్ వందే జగద్గురుమ్..." ఆంటూ చేతులు జోడించి గిరిజ మెల్లగా గదిలోంచి బైటకు నడుస్తూంటే, చిత్తరువే అయ్యాను నేను.


#######


Rate this content
Log in

Similar telugu story from Drama