PVV Satyanarayana

Horror

3.6  

PVV Satyanarayana

Horror

దయ్యాల లాడ్జ్

దయ్యాల లాడ్జ్

8 mins
3.8K


                                                                                                                          హారర్ స్టోరీ

                                                             దయ్యాల లాడ్జ్

                                                               రచనః

                                                             తిరుమలశ్రీ

                                                               ***

     ఇండొనేషియాలోని డెన్సపర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది విమానం. ఆ దేశానికి చెందిన బాలీ ఐలెండ్ యొక్క రాజధాని డెన్సపర్.

     విమానం దిగి ఎయిర్ పోర్ట్ లోకి నడిచారు కపిల్, మైథిలీలు...కపిల్ కు పాతికేళ్ళుంటాయి. మైథిలి అతనికంటె మూడేళ్ళు చిన్నది. హైదరాబాద్ లోని ఓ ఎమ్మెన్సీలో కపిల్ హార్డ్ వేర్ ఇంజనీరు గాను, మైథిలి సాఫ్ట్ వేర్ ఇంజనీరు గాను పనిచేస్తున్నారు. రెండేళ్ళ ప్రేమాయణం అనంతరం, వారం క్రితమే వారి వివాహమయింది. హనీమూన్ కోసం సుందర ద్వీపం ఐన ఇండొనేషియా లోని బాలీ దీవికి వచ్చారు.

     ఎయిర్ పోర్ట్ వద్దనున్న ఓ పెద్ద మ్యూరల్ పెయింటింగ్ ఆ దంపతుల్ని అమితంగా ఆకర్షించుకుంది... మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తూన్న చిత్రం అది!

     ఎయిర్ పోర్ట్ వద్ద షాపులలో గణపతి, విష్ణువు, శివుడు మున్నగు హిందూ దేవుళ్ళ విగ్రహాలు అమ్ముతూండడం వారిని చకితుల్ని చేసింది. ఎయిర్ పోర్ట్ పరిసరాలలోని రమణీయ ప్రకృతి ఆ దంపతుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అక్కడ ఉన్న అతిపెద్ద షాపింగ్ సెంటర్ ను ఓసారి చుట్టివచ్చి, క్యాబ్ ఎంగేజ్ చేసుకునేసరికి రాత్రి ఏడు గంటలయింది. ఓ మంచి హోటల్ కి తీసుకువెళ్ళమని క్యాబ్ డ్రైవర్ కు చెప్పాడు కపిల్.

     క్యాబ్ డ్రైవర్ ముస్లిమ్. తన పేరు రసూల్ అని చెప్పాడు. ముప్పై ఐదేళ్ళుంటాయి. కోరచూపులతో, చూపులకు డ్రాకులాలా భయానకంగా ఉంటాడు. మాట మాత్రం సున్నితం. మనిషి జెంటిల్. అది టూరిస్ట్ ప్లేస్ కావడంతో హిందీ, ఆంగ్లం కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అతగాడి యాసను అర్థం చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే. ఆ దంపతుల్ని ఇండియన్స్ గా గుర్తించగానే హిందీలో మాట్లాడనారంభించాడు.

     క్యాబ్ వెళ్తూంటే కనువిందు చేస్తూన్న ప్రకృతి ఆ దంపతుల హృదయాలకు ఆహ్లాదం కలిగించింది. త్రోవలో ఫస్ట్ ఇంటర్ సెక్షన్ దగ్గర ప్రతిష్ఠింపబడియున్న గదాధరుడైన భీమసేనుడి నిలువెత్తు విగ్రహాన్ని చూపుతూ, "అది మహాభారత్ లోని భీమసేన్ విగ్రహం" అని చెప్పాడు రసూల్. వారి ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇండియాలో అలాంటి, అంత పెద్ద స్టాచ్యూని ఎక్కడా చూసిన గుర్తులేదు.          

     క్యాబ్ ముందుకు దూసుకుపోతూంటే ప్రతి ఇంటర్ సెక్షన్ దగ్గరా శ్రీరాముడు, విష్ణువు, శివుడు - ఇలా హిందూ దేవతలు, పురాణాలు ఇతిహాసాలలోని ప్రముఖుల నిలువెత్తు విగ్రహాలు దర్శనమివ్వడం వారి అచ్చెరుపాటును అధికం చేసింది. అన్నిటికంటె ఆ యువ దంపతుల్ని మిక్కిలి చకితుల్ని చేసిన విషయం - ఆ పట్టణంలో ఎక్కడా రాజకీయ నాయకుల స్టాచ్యూస్ కానరాకపోవడం!! 

పొలిటీషియన్స్ విగ్రహాలను తాము పబ్లిక్ ప్లేసెస్ లో ఆవిష్కరించం అని చెప్పాడు రసూల్.

కొంతదూరం వెళ్ళాక హఠాత్తుగా అడిగాడు, "సాబ్! మీరు హనీమూన్ కపుల్. రైట్?" అని.  ఔనన్నాడు కపిల్.    

     "ఐతే మిమ్మల్ని ‘డెవిల్స్ ఇన్’ కి తీసుకువెళ్తాను. ఎడ్వంచరస్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. యువత ఫస్ట్ ఛాయిస్ హోటల్ అది! హనీమూన్ కపుల్స్ కి టారిఫ్ లో డిస్కౌంట్ కూడా ఉంటుంది" అన్నాడు రసూల్.

     ఊరి చివర ఒక హాంటెడ్ కొండ పైన వున్న ఇల్లు అది. ఇప్పుడు ‘ఇన్’ గా మార్చబడింది.

     "ఆ హోటల్ కి వీడు బ్రోకర్ లా ఉన్నాడు!" అంది మైథిలి తెలుగులో మెల్లగా.

     "బట్ ఇట్ సౌండ్స్ ఇంటరెస్టింగ్. లెటజ్ గో దేర్" అన్నాడు కపిల్ ఉత్సాహంగా.

     "డెవిల్స్ ఇన్. అంటే, దయ్యాల లాడ్జ్ అన్నమాట!" భయం నటించింది మైథిలి.   

     వారి పలుకుల్ని అర్థం చేసుకున్న రసూల్ నవ్వాడు. "నో ఫియర్ మేమ్! ఆల్ ఫన్ దేర్" అన్నాడు.

     మనసులను అలరించే ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ సుమారు అరగంట డ్రైవ్ తరువాత పట్టణపు శివార్లలో ఉన్న ఓ కొండపైన ప్రవేశించింది క్యాబ్. దట్టంగా అలముకున్న చీకట్లను మార్గానికి ఇరువైపులా ఉన్న దీపాల కాంతులు పారద్రోలుతున్నాయి. రమణీయ ప్రకృతి మధ్య ఒంటరి చెట్టులా నిలచియుంది హోటల్. ’డెవిల్స్ ఇన్’ అన్న రంగుల సైన్ బోర్డ్ నియోన్ లైట్లలో మెరుస్తోంది.

     ఆ దంపతుల్ని క్యాబ్ లోనే ఉండమని చెప్పి హోటల్లోకి వెళ్ళాడు రసూల్. కొద్ది క్షణాల తరువాత తిరిగి వచ్చాడు. "పదే పది గదులు వుంటాయి ఇందులో. ప్రస్తుతం ఇది ఆఫ్ సీజన్ కావడంతో టూరిస్టుల రద్దీ ఎక్కువగా లేదు. గదులు కొన్ని ఖాళీగానే ఉన్నాయి," అని చెప్పి, లగేజ్ తీసుకుని మళ్ళీ హోటల్లోకి వెళ్ళాడు అతను.

     కపిల్, మైథిలి క్యాబ్ దిగి పరిసరాలను పరిశీలనగా చూసారు... ఆ రాక్ గార్డెన్ లో వివిధ ఆకృతులలో కట్ చేయబడ్డ చెట్లకు అల్లబడ్డ రంగుల బల్బులు ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతం చేస్తున్నాయి. హోటల్ కి వెనుక పక్క చిన్న రాక్ (కొండ) ఉంది. 

ఆ సుందర వనం మధ్య దిష్టిబొమ్మలా కనిపించింది హోటల్...మూడు అంతస్థుల భవనం. చుట్టూ అడ్డదిడ్డంగా మొలచిన చెట్లు, పిచ్చి మొక్కలు, తుప్పలు. పాడుబడ్డ భవంతిలా...భయానకంగా...ఉంది!

     "మై గాడ్! ఇదేదో నిజంగానే భూత్ బంగళాలా ఉంది!" అంది మైథిలి భయంగా.

     రసూల్ రాగానే, "క్యోం భాయ్, హోటల్ అన్నావు. చూస్తూంటే ఎదో హాంటెడ్ ప్లేస్ లా ఉంది. ఇందులో బసచేయడం సేఫే నంటావా?" అనడిగాడు కపిల్.  

     రసూల్ నవ్వాడు. "డరో మత్ సాబ్! పేరుకు తగ్గట్టు ఉండాలనే బైటి అప్పియరెన్స్ అలా ఏర్పాటుచేసారు. ఇది థీమాటిక్ హోటల్. సౌకర్యాలు, సర్వీసూ బావుంటాయి. లోపలి వాతావరణం థ్రిల్లింగ్ గా ఉంటుంది" అన్నాడు.

     భుజాలు ఎగరేసాడు కపిల్. పేమెంట్ చేయడంతో, తన బిజినెస్ కార్డ్ కపిల్ కు ఇచ్చాడు రసూల్. మర్నాడు వారు సైట్ సీయింగ్ కు బయలుదేరేముందు తనకు ఫోన్ చేస్తే వెహికిల్ తెస్తానని చెప్పాడు. వారికి ’హేపీ స్టే...గుడ్ నైట్...’ చెప్పేసి వెళ్ళిపోయాడు.

     చేతులు పెనవేసుకుని, సిమెంట్ బాట గుండా హోటల్లోకి నడిచింది ఆ నూతన జంట.  

హాలంతా కన్సీల్డ్ లైటింగ్ డిమ్ గా వ్యాపించియుంది. సోడియం వేపర్ లైటింగ్ కావడంతో లేత పసుపు రంగులో కనులకు ప్లెజంట్ గా ఉంది.

     లోపల అడుగిడిన మైథిలి కట్టెదుట కానవచ్చిన ఆ భయానక దృశ్యం చూసి పక్కలో బాంబు ప్రేలినట్టు అదిరిపడింది. ‘కెవ్వు’ మని అరచి, భయంతో భర్త చేయి గట్టిగా పట్టుకుంది.

     రిసెప్షన్ లో - ఆపాదమస్తకం తెల్లటి ముసుగులో... దయ్యం రూపంలో ఉన్న ఆకారం కూర్చునియుంది! కళ్ళ వద్ద రెండు కంతలు మాత్రం ఉన్నాయి. 

"వెల్ కమ్ సర్! వెల్ కమ్ మేమ్!... వెల్ కమ్ టు బాలి!..." అంది ఆ ఆకారం లేచి నిల్చుంటూ. మాట నూతిలోంచి వస్తున్నట్లున్నా, స్పష్టంగా అర్థమౌతోంది. "నేను ఈ హోటల్ మేనేజర్ని. వెల్ కమ్ టు డెవిల్స్ ఇన్!"

     "నువ్వు మనిషివా, దయ్యానివా?" అడిగాడు కపిల్ అనుమానంగా చూస్తూ.

     "ఇది మా హోటల్ ట్రెడిషన్, సర్!.." అంటూ వివరంగా చెప్పుకువచ్చింది ఆ ఆకారం -

     ‘పేరుకు తగ్గట్టుగా ’డెవిల్స్ ఇన్’ లో ’దయ్యపు’ వాతావరణం నెలకొనియుంటుంది. స్టాఫంతా డెవిల్స్ వేషధారణలో మసలుతూంటారు. వారికి పేర్లు ఉండవు. ’డెవిల్స్’ (దయ్యాలు) అనే సంబోధించాలి! గుర్తింపు కోసం, ’డెవిల్ వన్...టూ...త్రీ...’ అలా నంబర్లు ఉంటాయి... హోటల్ లోపల, వెలుపల కూడా ’దయ్యపు’    

 వాతావరణం ప్రతిబింబించేలా అలంకరింపబడియుంది. గదులు, ఫర్నిచరు సైతం థీమటిక్ గా ఉంటాయి. అదంతా అతిథుల ఫన్ కోసం చేయబడ్డ ఏర్పాటు. ఒక్కోసారి అందలి వాతావరణం కొంత భీతి గొలిపినా అతిథులు బాగా ఎంజాయ్ చేస్తారు. వృద్ధులకు, హృద్రోగులకు ఆ హోటల్లో గదులు ఇవ్వరు. పిల్లలకు ప్రవేశం లేదు. ముఖ్యంగా విదేశీ యాత్రికులు, యువత ఆ హోటల్లో బసచేయడానికి ఉత్సాహపడుతూంటారు. టూరిస్ట్ సీజన్లో అక్కడ గదులు దొరకడం కష్టం. హనీమూన్ కపుల్స్ కు సెపరేట్ టారిఫ్, ఎంటర్టెయిన్మెంట్ ఉంటాయి...’

     రెజిస్ట్రేషన్ పూర్తిచేసి, హాలంతా కలయజూసారు కపిల్, మైథిలీను...అచ్చటి ఫర్నిచరు, ఫర్నిషింగ్సు, గోడలకు ఉన్న చిత్రాలు, ఆర్టిఫేక్ట్సూ...అన్నీ పారా నార్మల్ ఇమేజెస్, దయ్యాలు, అస్థిపంజరాలు, కపాలాలు, ఎముకల థీమ్స్ తో...అంతటా స్పూకీ అప్పియరెన్స్ తాండవమాడుతోంది!   

ఓ ’దయ్యం’ వచ్చి లగేజ్ తీసుకుంటే, తమ రూమ్ కి బయలుదేరారు ఆ దంపతులు. మూడు అంతుస్థుల హోటల్ అది. ఒక్కో అంతస్థులోనూ మూడేసి గదులు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓ గెస్ట్ రూము, మేనేజర్ రూమ్, ఆఫీసు గది, కిచెన్, డైనింగ్, స్టోర్ రూమ్, లౌంజ్ ఉన్నాయి. గదుల తలుపులు అస్థిపంజరాల ఆకృతిలో ఉంటే... కిటికీలు పుర్రెలు, ఎముకల రూపంలో మలచబడ్డాయి. ఎటు చూసినా దయ్యాలు, అస్థిపంజరాలు, కపాలాలు, ఎముకల గుర్తులతో...భయానకంగా కనిపించింది.

     వారి గది థర్డ్ ఫ్లోర్ లో ఇవ్వబడింది, అక్కణ్ణుంచి బైటి వ్యూ బాగా కనిపిస్తుందని. గది విశాలంగా, ఖరీదైన ఫర్నిచర్ తో చక్కగా అలంకరింపబడియుంది. ఐతే అందులో కూడా డెవిల్స్ థీమ్ ప్రతిబింబిస్తోంది. అదంతా ఓ పక్క థ్రిల్లింగ్ గా అనిపించినా, మరో పక్క అనూహ్యమైన భీతిని కలిగిస్తోంది. ముఖ్యంగా మైథిలికి!

     ఆ డిమ్ లైట్ లో రూమ్ సర్వీస్ స్టాఫ్ దయ్యాల వేషాలలో కదలుతూంటే తమాషాగా అనిపించింది వారికి. కాని, అన్ని ’దయ్యాలు’ కళ్ళముందు కదలాడుతూంటే మదిలో ఏ మూలో బిక్కు బిక్కు మనక మానలేదు మైథిలికి. ఫ్రెషప్ అయ్యి నైట్ డ్రెస్ లోకి మారారు భార్యాభర్తలు. గ్రౌండ్ ఫ్లోర్ లోని డైనింగ్ హాల్ కి వెళ్ళారు డిన్నర్ కోసమని.

     అక్కడ మూడు జంటలు ఉన్నాయి. ఒకటి చైనీస్, మరొకటి ఆస్ట్రేలియన్, ఇంకొకటి ఆఫ్రికన్. అన్నీ ఆ హోటల్లో బస చేస్తూన్న యువ జంటలే. వివిధ ఫ్లోర్స్ లో ఉంటున్నాయి.

     జంటలు మూడూ ఇండియన్ కపుల్ తో పరిచయం చేసుకున్నాయి... కబుర్లు చెప్పుకుంటూ, ఆ హోటల్ థీమ్, ప్రత్యేకతలను గురించి ముచ్చటించుకుంటూ భోజనాలు ముగించారంతా. తరువాత అంతా డిస్పర్స్ అయ్యారు. కపిల్ దంపతులు తమ గదికి బయలుదేరారు.

     హోటల్ లోపల నిశ్శబ్ద గంభీరంగా ఉంది. అది మైథిలి భయాలకు ఆజ్యం పోస్తోంది.

     పడుకునే ముందు అంది ఆమె, "నాకెందుకో ఇక్కడ భయం వేస్తోంది, కపిల్!" అని.          

     కపిల్ నవ్వి, "ఎంతైనా నువ్వు సాఫ్ట్ వేర్ వి కదా! ఇలాంటి చోట ఇమడడం కొంచెం కష్టమే మరి!" అన్నాడు. అతన్ని గట్టిగా గిల్లింది ఆమె.

     "ఈ హోటల్ నావెల్టీ థ్రిల్లింగ్ గానే ఉన్నా...ఉలుకూ పలుకూ లేకుండా తిరిగే దయ్యపు ఆకారాలు, భయంకర నిశ్శబ్దత...ఎంతటి గుండెదిటవు కలవారినైనా భయపెట్టక మానవు" అంది.

     "డోంట్ ఫియర్, మై డియర్! అయామ్ హియర్!” అంటూ ఆమెను కౌగిట్లో బంధించేసాడు అతను.

                                                          ***

     ఎవరో తట్టి లేపినట్టుగా హఠాత్తుగా మెలకువ వచ్చింది మైథిలికి.                     

     గదిలో బ్లూ కలర్ నైట్ ల్యాంప్ వెలుగుతోంది.

     పక్కలో కపిల్ గాఢ నిద్రలో ఉన్నాడు.

     అదే సమయంలో గదిలోని గడియారం భయానక దయ్యంలా పన్నెండు సార్లు వికృతంగా అరచింది.

     మైథిలికి దాహంగా ఉంది. బెడ్ పక్కనున్న వాటర్ జగ్ ఖాళీగా ఉంది. లేచి వెళ్ళి ఫ్రిజ్ తెరచింది. మంచినీళ్ళు అందులో కూడా లేవు. దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది.

     ‘ఇది డెవిల్స్ ఇన్! అర్థరాత్రి ఐనా బజర్ నొక్కగానే మా దయ్యాలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి’ అన్న మేనేజర్ పలుకులు జ్ఞప్తికి రావడంతో, బజర్ నొక్కింది. 

     తక్షణమే ఓ దయ్యం అక్కడ ప్రత్యక్షమయింది!

     మంచినీళ్ళు కావాలందామె.  

     మంత్రం వేసినట్టు దయ్యం చేతిలో వాటర్ జగ్ వెలసింది.

     నీళ్ళు త్రాగుతూంటే హఠాత్తుగా స్ఫురించింది మైథిలికి, తాను గది తలుపు తెరవలేదని!

     ఆ దయ్యం లోపలికి ఎలా వచ్చింది!?... వాటర్ జగ్ ఎలా ప్రత్యక్షమయింది??

     నోట్లో పోసుకుంటూన్న నీళ్ళు చల్లగా, ఉప్పగా, వెగటుగా తగిలాయి. త్రాగడం ఆపి నీటి వంక చూసింది.

     అంతే! ’కెవ్వు’ మంది...

     ఎర్రటి రక్తం! ఆమె నోటి నిండా!!

     "ఎ...ఏమిటిది? ఇవి... నీళ్ళు కాదు...రక్తం...!" అరచింది. 

దయ్యం వికృతంగా నవ్వింది.

     "ను...నువ్వు...గదిలోకి ఎలా వచ్చావ్?" మైథిలి కంఠం ఒణికింది.

     ఇప్పుడు ఆ ఆకారం మెడపైన తలకాయ లేదు...!!

     భయంతో గదంతా దద్దరిల్లేలా ‘కెవ్వు కెవ్వున’ అరచింది మైథిలి.

     గాఢ నిద్రలో ఉన్నాడేమో, ఆమె అరుపులు కపిల్ ని లేపలేకపోయాయి. 

     తల లేని మొండెం మైథిలి వైపు అడుగులు వేసింది.

      భయంతో కొయ్యబారిపోయిన మైథిలికి నోరు పెకలడం లేదు. భర్తను చేతులతో కుదిపింది. అతనిలో కదలికలేదు.

     జారిపోతూన్న ధైర్యాన్ని కూడగట్టుకుందామె. మంచం పైనుంచి ఉరికి గుమ్మం వైపు పరుగెత్తింది. తలుపు తెరచుకుని వరండాలోకి దూసుకుపోయింది.

     ’కొంపదీసి అది కపిల్ కి ఏ హానీ కలిగించదు కదా!’...ఆ ఆలోచన తట్టిందే తడవుగా మళ్ళీ గది వైపు పరుగెత్తింది.

     కపిల్ ఇంకా నిద్రపోతూనేయున్నాడు. అతని పక్కలో - మొండెపు దయ్యం!!

     తృళ్ళిపడింది మైథిలి. అది భర్తను ఏం చేస్తుందో!?...అతన్ని రక్షించుకోవాలి!...

     ఎక్కడలేని తెగువా వచ్చేసింది ఆమెకు. గదిలో ప్రవేశించి పళ్ళు కోసుకునే కత్తిని అందుకుంది. పూనకం వచ్చిందానిలా ఒక్క ఉరుకులో బెడ్ ను సమీపించి, దయ్యాన్ని పొడవబోయింది. 

     అది మాయమైపోయింది.

     "కపిల్!...కపిల్! లే..." భర్తను గట్టిగా కుదిపింది.

     చటుక్కున కళ్ళు తెరిచాడు అతను. కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి!

     భర్త ఆకారంలో వచ్చిన మార్పును చూసి ‘కెవ్వు’ న అరచి వెనక్కి గెంతింది ఆమె.             

      కపిల్ ముఖం వికృతంగా తయారయింది. మిడిగ్రుడ్లు వచ్చాయి. నోట్లోంచి ఇరువైపులా కోరలు మొలిచాయి! పళ్ళు పెద్దవయ్యాయి. శరీరపు రంగు సైతం మారిపోయింది.

     పైకి లేచి బెడ్ దిగాడు అతను. వికృతంగా నవ్వుతూ ఒక్కో అడుగే వేసుకుంటూ ఆమె వైపు రాసాగాడు.

     భర్తలో వచ్చిన ఆ మార్పు మరింత భయపెట్టింది మైథిలిని.

     "కపిల్! ప్లీజ్! నాకు భయమేస్తోంది. ..." అంటూ ఒక్కో అడుగే వెనక్కి వేయసాగింది.

     కపిల్ కి ఆమె అర్థింపు అర్థమౌతున్నట్టులేదు. కోరచూపులు కాస్తా క్రూరంగా మారాయి. ఆమె గుండెలు అవిసిపోయేలా బిగ్గరగా నవ్వసాగాడు.

     హఠాత్తుగా అనిపించింది ఆమెకు - అతను దయ్యంగా మారిపోయాడని...!

     అంతే! దిక్కులు పిక్కటిల్లేలా ’కెవ్వు కెవ్వున’ అరుస్తూ బైటకు పరుగెత్తింది. రెండేసి మెట్లు చొప్పున దిగుతూ క్రిందకు పరుగెత్తింది.

     భయంకర నిశ్శబ్దం రాజ్యమేలుతోంది అంతటాను. మిగతా అతిథులను లేపుదామంటే, ఎవరు ఏ గదిలో ఉన్నారో తెలియదు.

     రిసెప్షన్లో ఉన్న ఆకారాన్ని చూడగానే, "మేనేజర్! ద...దయ్యం...మొండెం..." ఓ పక్క భయం, మరో పక్క ఆయాసం. మాట సరిగా రావడం లేదు.

     ఆకారం మైథిలి వంక తిరిగింది. అది హఠాత్తుగా అస్థిపంజరంగా మారిపోయింది!

     దాని ముఖం క్యాబ్ డ్రైవర్ రసూల్ ది...!!

     ఆ దృశ్యం గాంచి భయంతో చేయి నోటికి అడ్డు పెట్టుకుని ’కెవ్వు’ మంది మైథిలి. "ర...సూ...ల్...!"  

     వికటంగా నవ్వుతూ అస్థిపంజరం ఆమె వైపు కదలింది.

    వింటి నుండి సంధించి విడిచిన శరంలా హోటల్ బైటకు పరుగెత్తింది ఆమె. భయంతో గుండెలు అవిసిపోతున్నాయి. అలసటతో శరీరం తూలుతోంది. మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురయింది. మెదడు మొద్దుబారిపోతోంది. తోచిన దిక్కుకు పరుగిడుతూ వెనుకపక్కనున్న రాక్ ని చేరుకుంది.

     అలసటగా ఆగిపోయింది. గుండె వేగంగా కొట్టుకుంటోంది. రాతికి జేరబడి తనను తాను కంపోజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

     ’కపిల్ కి ఏమయిందో? అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో? అతనికి ఆ దయ్యపు రూపు ఎలా వచ్చిందో!?...’ భర్తను తలచుకుంటే ఆమె మది తీవ్రసంక్షోభానికి గురయింది.

     అంతలోనే కొండపై నుంచి ఏదో గోల వినిపించింది. శబ్దాలు వినవచ్చిన వైపుకు చూసింది. రాక్ పైన కనిపించిన దృశ్యం ఆమెను మరోసారి అదిరిపడేలా చేసింది.                

     కపిల్ గాలిలో తలక్రిందులుగా వ్రేలాడుతున్నాడు...!

     అస్థిపంజరాలు కొన్ని అతన్ని చుట్టుముట్టి గోలగా తిరుగుతున్నాయి. కుంభాలతో రక్తమాంసాలను అతని పైన గ్రుమ్మరిస్తున్నాయి!

     "నో!...ప్లీజ్...లీవ్ మీ..." అంటూ అరుస్తున్నాడు అతను. 

     కపిల్ ఆపదలో ఉన్నాడు!

     మైథిలిలో ఆవేశం ముంచుకువచ్చింది. భయం, స్వీయరక్షణ విస్మరించింది. ఉన్మాదినిలా అరుస్తూ చేతికందిన రాళ్ళతో అస్థిపంజరాలను ఎటాక్ చేసింది.

     అస్థిపంజరాలు ఆమె వైపుకు తిరిగాయి.

     "మైథీ...! పారిపో...ఈ పిశాచాలు నిన్ను చంపేస్తాయి..." అరచాడు కపిల్.

     "నో...!" హిస్టిరికల్ గా అరచింది ఆమె. "నువ్వు లేకుండా నేను తిరిగివెళ్ళను".

     అస్థిపంజరాల బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో కొండ చివరికి చేరిన విషయం మైథిలి గమనించలేదు. కాలు జారి వెనుకనున్న అగాధంలోకి పడిపోయింది!

                                                          ***

     ’కెవ్వు’ మంటూ కళ్ళు తెరచింది మైథిలి. ఆమె హృదయస్పందన వేగంగా ఉంది. ముచ్చెమటలు పోసిన శరీరం లతలా కంపిస్తోంది. చటుక్కున లేచి కూర్చుంది.

     తృళ్ళిపడి మేల్కున్నాడు కపిల్. "మైథీ!...ఏమైంది? ఎందుకలా అరిచావ్? ఎందుకు వణికిపోతున్నావ్? టేకిట్ ఈజీ..." భార్య స్థితి చూసి కంగారుపడుతూ, సముదాయించడానికి ప్రయత్నించాడు. 

     ఆమె వెర్రి చూపులు చూస్తోంది.

     కౌగిట్లోకి తీసుకున్నాడు. "ఏమయింది డియర్? ఎందుకలా భయపడిపోతున్నావ్? పీడకల ఏదైనా వచ్చిందా?" ఆమె వీపు నిమురుతూ అడిగాడు.

     చుట్టూ పరికించింది మైథిలి. హోటల్ సూట్ అది!

     "అదంతా పీడకలా...!?" విభ్రాంతి చెందింది.

ఆమె చేత మంచినీళ్ళు త్రాగించాడు కపిల్.

     తెల్లవారినట్టు సంకేతంగా కిటికీ అద్దాల లోంచి గదిలో సూర్యరశ్మి పడుతోంది.

     తనకు వచ్చిన కలను గురించి వివరించింది ఆమె, భయంతో ఒళ్ళు జలదరిస్తూంటే.

     అంతలో డోర్ బెల్ మ్రోగింది. మైథిలి ఉలికిపడి చూసింది. భయం లేదన్నట్టు భుజం తట్టి, వెళ్ళి తలుపు తెరచాడు కపిల్.

     గుమ్మంలో ‘దయ్యం’. "గుడ్ మాణింగ్, సర్! గుడ్ మాణింగ్, మేమ్!" అంటూ వారిని విష్ చేసి, బ్రేక్ ఫాస్ట్ ట్రేని టేబిల్ పైన పెట్టింది

     "ఇఫ్ యూ డోంట్ మైండ్, ఓసారి నీ ముసుగు తొలగించగలవా?" అడిగాడు కపిల్.

     ఓ క్షణం తటపటాయించి ముసుగు తొలగించింది దయ్యం.

తెల్లటి, చక్కటి అమ్మాయి ప్రత్యక్షమయింది!               

     ఆమెను చూడడంతో మైథిలి గుండెలు కుదుటబడ్డాయి.

"యూ ఆర్ క్వైట్ గుడ్ లుకింగ్!" అన్నాడు కపిల్, ఆ పిల్లతో.

కాంప్లిమెంటుకు ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. "థాంక్యూ సర్!" అంటూ వెళ్ళిపోయింది.

     "చూసావా డియర్! నీ కలకు మూలం నీలో అంతర్లీనంగా వున్న భయాలే. మన మదిలో చెలరేగే ఆలోచనలు, కోరికలు, ఆశలు మనం నిద్రావస్థలో ఉండగా కలల రూపంలో వెలికి వస్తూంటాయి. అదంతా కేవలం మెదడుకు సంబంధించిన ప్రక్రియ... ఈ హోటల్ పేరు, వాతావరణం, దయ్యాల ముసుగులోని సిబ్బందీ వగైరాలన్నీ నీలో భయాన్ని రేకిత్తించాయి. ఆ భయమే రాత్రి పీడకలగా రూపు దిద్దుకుని నిన్ను భయోత్పాతానికి గురిచేసింది. సో, ఫియర్ ఈజ్ ద కీ!" అంటూ వివరించాడు కపిల్. "ఎనీ వే, ఒక్క రాత్రి అనుభవం చాలు. ఇవాళే హోటల్ మారిపోదాం".

     భర్త పలుకులు వాస్తవాలు అనిపించింది మైథిలికి. సిగ్గుతో భర్త వక్షంలో ముఖం దాచుకుంది.

                                                                 ******


Rate this content
Log in

Similar telugu story from Horror