PRASHANT COOL

Abstract Horror Inspirational

5  

PRASHANT COOL

Abstract Horror Inspirational

అప(ర)శృతి

అప(ర)శృతి

4 mins
1.1K


అప(ర)శృతి

అక్కడ ఏవో సంబరాలు జరుగుతున్నాయి. లోకమ్మీద జనమంతా అక్కడే ఉన్నారో, అదే లోకమో అన్నంత సందేహం కలగడం సహజమే. అది శ్రీమంతమో, పుట్టినరోజో, బారసాలో, పుష్పాలంకరణో, పెళ్ళో అనేది స్పష్టంగా తెలియట్లేదు. స్వర్గలోకంలో ఇంద్రుడితో నారదులవారు ఈ సంబరాల గురించే చర్చిస్తూ ఉండచ్చు. ఒక మాటకి నాలుగు కలిపి చెప్పే నారదులవారికి ఉన్నమాటలు చెప్తేనే ఉల్లేఖనంలా ఉండి ఉంటుంది. ఆకలిదప్పుల్లో ఏబీసీడీ ఎరుగని ఊర్ధ్వలోకవాసులకే ఎసిడిటీ పుట్టించిన ఘనత ఈ సంబరాలదే కావచ్చు అని నా సందేహం. అంబరాన్ని దాటి స్వర్గలోకానికి చేరిన సంబరాల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఆ పార్టీలో ఎవరికి వారు తమకు ఏమి తెలియదో తెలుసుకునే ధ్యాస ఏ కోశానా లేకుండానే, అన్ని తెలిసినట్లు కనిపించాలని అరాటపడుతుండడం స్పష్టంగా కనిపిస్తుంది అందరి ముఖాల్లో. ఎందుకంటే అక్కడంతా పిల్లలు...పిల్లలేనా ....అయ్యుండాలి లేకపోతే... గెంతుతూ, కేరింతలు కొడుతూ, ఆడుకుంటూ, అల్లరి చేస్తూ, ఒకరినొకరు ఏడిపించుకుంటూ నవ్వుతూ ఇంకెవరుంటారు ? పెద్దలు కూడా ఉన్నారు కానీ పిల్లల్లో ఉన్నంత చురుకు, చలనం లేనందువల్ల పిల్లలే ఎక్కువున్నట్లు కనిపిస్తుంది. ఆ ప్రదేశం నిండా రంగురంగుల బుడగలు రకరకాల పరిమాణాలలో, చిత్రవిచిత్రాల ఆకారాలలో జీవపరిణామక్రమమంతా ప్రదర్శనకు కొలువుదీరినట్లే కనిపించడం విపరీతంగా అనిపించినా అదే నిజం అని గుండె దిటవు చేసుకోవడం ఖాయం నమ్మినా, నమ్మకపోయినా. మంద్రంగా సాగే శ్రావ్యమైన సంగీతంలో సాధకబాధకాలు తేలుతూ, తూలుతూ ప్రవహిస్తున్నాయి. ఎవరిని వారు చూసుకోవడానికి ఉపయోగపడని తమ కళ్ళతో అందరి కళ్ళల్లో తమని తాము చూసుకుంటున్నట్లున్నారు అందరూ. మనసుందిగా... మనసుతో ఎవరికి వారే చూసుకునే సావకాశం ఉందనే విషయం కూడా ఆలోచించనంత యాంత్రికంగా గడుపుతున్నారు. అంత బద్ధకమేమిటో ....ఒంటికి వ్యాయామం మీద ఉన్న శ్రద్ధ, మనసు విషయంలో ఆలోచించడంలో ఎందుకు లేదు...? మనసుకి కొలెస్ట్రాల్ పట్టదన్న ధీమా కావచ్చు. క్షణక్షణానికి రాత్రిపగళ్ళు వచ్చి పోతున్నట్లే ఉన్నాయి డిస్కో లైట్ల కాంతుల భ్రాంతుల్లో...అందరూ ఎందుకలా ఊగుతున్నారు..? ఇదేమి అంతుచిక్కని, అంతవరకూ చూడని అతీత రోగమా..? ప్రతివారి చేతిలో రంగు రంగుల ద్రావకాలు కూడా గ్లాసుల్లో ఉండి తమ వంతు నాట్యం నటిస్తూ అనుకరిస్తున్నాయి. అవే వారి ప్రాణాంతకమైన రోగాలకు మందులు కాబోలు..లేకపోతే గుటక గుటకకి ముఖాలు ఎందుకలా చిట్లించుకుంటారు...? వారి ముఖాల్లో వికారానికి కారణం ఆ ద్రావకాల రుచి చేదుగానో, వగరుగానో ఉండడంచేత కావచ్చు. ఎంతైనా ఔషధం కదా తప్పదు ...రోగం అలాంటిది మరి.

మేము విగ్రహాలం కాదు అని నమ్మించడం కోసమే అన్నంతగా ఉన్న చోట ఉండక, నిలకడగా ఆగక, తమ చేతుల్లో ఉన్న హీలియం బెలూన్లతో పోటీ పడి మరీ కలియతిరుగుతున్నారు పిల్లలు. వీళ్ళ చేతుల్లో గ్లాసుల బదులు తేలిపోయే బెలూన్లు ఉన్నాయంటే వీరికింకా ఏ రోగమూ అంటలేదనుకుంటా.

ఎందుకు జరిగిందో తెలీదు అకస్మాత్తుగా పెద్ద శబ్దం అందరి దృష్టిని ఆకర్షించింది. అంతవరకూ వారివారి పనుల్లో లీనమైపోయిన వారంతా అవన్నీ ఉన్నపళంగా వదిలిపెట్టి నిశ్శబ్దంగా శబ్దం ఆచూకీ చూసే పనిలో పడ్డారు. శబ్దం వల్ల ఇంత నిశ్శబ్దమా...? ఆ నిశ్శబ్దత వల్ల నిర్మానుష్యమా అని భ్రమించేలా చేసిన మాయనా ...? ...ఆ శబ్దం, అక్కడున్న ఒక పిల్లవాడి చేతిలో అదృశ్యమవుతూ బెలూన్ చెప్పిన బై బై అని మెల్లగా అర్థమైంది జనాలకు. అప్పటివరకు కేరింతలు కొట్టడానికి ఎగిరిన అవే కాళ్ళతో నేలని గుద్దుతూ, అదృశ్యమైన బెలూన్ కోసం ఆర్తనాదాలు, హాహాకారాలు, అంగలార్పులు, పెడబొబ్బలతో ఏడుపు లంకించుకున్నాడు ఆ పిల్లాడు. తన చేతిలోనిది పగిలినందుకో, అందరి చేతుల్లో బుడగలు పగలకుండా ఎగురుతూ ఉన్నందుకో అనే విషయం మీద విశాల హృదయం, సంకుచిత చిత్తం పందెం వేసుకున్నాయి. తేలేదెప్పుడో....గెలిచేదెవ్వరో....కాలం ఆర్డర్..ఆర్డర్ అంటూ సుత్తితో కొడుతూనే ఉంది వాయిదాలకు (ఈ ఎం ఐ)లకు రుచిమరిగిన మధ్యతరగతి మనిషిలా తీర్పివ్వడానికి తీరుబడి చేస్తూ. చుట్టూ ఉన్న మిగిలిన పిల్లలు తమ చేతుల్లో ఎగిరే బుడగలను చూపిస్తూ ఆ పిల్లాడిని హేళనగా ఏడిపిస్తున్నారు. కొన్ని క్షణాల పాటు అందరూ ఆ పిల్లవాడిని పరికించి ఎవరి పనుల్లో వాళ్ళు యధాలాపంగా మునిగిపోవడంతో, ఆ పిల్లాడు వాడి బంధువుల దగ్గరకు వెళ్లి ఏడుపుని ఉదృతం చేసాడు. అయినవాళ్ళు మాత్రమే తన సొంతమని, సమాజం పరాయిదని ఆ చిట్టిగుండెకి ఎంత చాకచక్యంగా బోధించింది చూశారా లోకం ...!! ఆ కుర్రాడి బంధువులు, వాడిని ఎలా ఊరడించాలో తెలియక పక్కనే ట్రే లో ఉన్న డ్రింక్ గ్లాస్ తీసి వాడి నోటికందించారు. దాని రుచి నాలుకని చేరగానే వాడు కూడా ఊగడం ప్రారంభించాడు. ఆ అంతుచిక్కని రోగం అంటుకుందని నాకు అర్థమైంది. వాడికి కూడా పెద్దరికం పట్టా వచ్చేసింది.

ఏడ్చినప్పుడు వెంటనే ఆ రోగం అంటించకుండా నాకొక అవకాశమిచ్చి ఉంటే ఆ పిల్లాడిని నేను శాశ్వతంగా ఊరడించేవాడిని. 'ఎందుకు ఏడుస్తావు బాబూ...సంతోషించాల్సిన విషయమే కానీ బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే...బెలూన్ లో బంధించబడి, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన గాలికి ఇన్నాళ్లకు స్వేచ్ఛ దొరికింది. ఇంతసేపు అది నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వెంత కేరింతలు కొట్టావో ఇప్పుడు అది కూడా అంతలా సంబరాలు చేసుకుంటుంది. బానిసకు విడుదల దొరికినట్లు, తేలుతూ, తూలుతూ ఊరేగుతుంది. నీ చేతుల మీదుగా స్వాతంత్ర్యం ఇచ్చినందుకు సంతోషించు. ఇంతవరకు జరిగింది కాదు సంబరం. ఇదే సంబరం. ఇదే సంతోషం. ఇప్పుడు చేయండి ఉత్సవం ఉత్సాహంగా' అని చెప్పాలనిపిస్తుంది. 'వింటాడంటారా...? ఏమో...ఔషధం త్రాగి రోగంతో ఊగుతున్నాడు. పిల్లాడు ఎదిగిపోయాడు...ఉహూ..ఎగిరిపోయాడు.... దొరకడు... స్వేచ్ఛ లేని గాలి ఇంకా చాలా బెలూన్ లలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతూనే ఉంది....ఒకేసారి అర్ధాంతరంగా టప్ మని బై చెప్పి ఎగిరిపోతుందో లేక ముదుసలి ముడుతలు మిగిల్చి, నెమ్మది నెమ్మదిగా, కొంచెం కొంచెం బయటకొస్తుందో శతాబ్దాల స్వాతంత్ర్య సమరంలో పోరాటం చేస్తూ' .... నాలో నేను మధన పడుతుండగా...టప్ మని మరో బెలూన్ పేలింది ఇది సత్యం అని నిరూపించడానికి తాపత్రయ పడుతూ. 'ఆ శబ్దం అపశృతి కాదు... అపర శృతి అని ఈ మానవమాత్రులకి ఏనాటికి ఎరుకకొస్తుందో.....!!' అనుకుంటూ అప్పుడే బయటపడ్డ మిగిలిన మిత్రబృందంతో సహా ఆనంతవాయువుల్లో కలిసి అంతర్ధాన మయ్యాను విముక్తి ప్రసాదించిన బాలుడికి కర్టెన్లను కదిలిస్తూ కృతజ్ఞతలు చెప్పుకుని.

- మీ ప్రశాంత్

( అప్పటివరకు జీవితం సంధించిన సమస్యలలో ఉక్కిరిబిక్కిరైన లోపల జీవుడికి ఉన్నత లోకాల ప్రాప్తి దొరికినందుకు ఎంత సంతోషిస్తాడో, అసలైన స్వేచ్ఛని ఎంత హాయిగా ఆస్వాదిస్తాడో ఆనంతవాయువుల్లో కలిసిపోయే ఆత్మ ద్వారా చెప్పాను. బెలూన్ పగిలినప్పుడు (ఆత్మీయులు చనిపోయినప్పుడు) తన వారిని పోగొట్టుకుని చిన్నపిల్లల్లా ఏడుస్తారు ఆ తర్వాత సమాజం నెమ్మదిగా పెద్దరికం అంటగట్టడం వల్ల, బ్రతుకు పోరాటంలో తమ వారి లోటుని మర్చిపోతారు. మద్యం మత్తు కవ్వించే లోకపు ఆశలకు సూచిక. లోకం కవ్వించే మోజులలో పడి తను కూడా ఏదో ఒకరోజు అలా లోకాన్ని విడిచిపెట్టాలని తెలుసుకోడు. పెద్దరికం అంటే లోకం చేసే మాయలో పడడమో, అయినవాళ్ళ లోటుని మర్చిపోవడమో కాదు జీవితం శాశ్వతం కాదు అని తెలుసుకుని సార్ధకం చేసుకోవడం. చనిపోయిన తర్వాత జీవుడు (ఆత్మ) ఎలాంటి స్వేచ్ఛ పొందుతాడో, అంతకుమించిన స్వేచ్చని బ్రతికున్నప్పుడు కూడా సంకుచిత మనస్తత్వం, స్వార్ధం, ద్వేషం లాంటి అవలక్షణాలనుంచి విముక్తి చెందితే పొందుతాడు..కాదంటారా..!!)



Rate this content
Log in

Similar telugu story from Abstract