శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Inspirational

4.0  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Drama Inspirational

చిక్కుముళ్ళు

చిక్కుముళ్ళు

13 mins
946


టాక్సీ దిగి రైల్వే స్టేషన్ లోకి నడిచాడు వీర్రాజు...కోవిడ్ కాలం కావడం తో పెద్దగా జనం లేరు ...ఉన్న కొందరూ అటూ ఇటూ తీరూ తెన్నూ లేకుండా మసలుతూ రద్దీ భావన కలగ జేస్తున్నారు ..

చాలామంది మొహాలకి ముసుగులు తగిలించుకున్నా...అస్సలు ముసుగు లేనివాళ్లు కూడా కొందరు కనిపిస్తున్నారు..ముసుగు ముక్కు కిందకి లాక్కున్న వాళ్ళు...గడ్డం కిందకి లాక్కున్న వాళ్ళు...మెడలో వేళ్ళాడేసుకున్నవాళ్ళు కూడా తిరుగుతున్నారు...

ప్లాట్ ఫారం మీద అన్ని దుకాణాలు తెరిచి లేవు...ముఖ్యంగా బొమ్మలూ, పుస్తకాలూ లాంటి అత్యవసరం కాని వస్తువులమ్మే వాళ్ళు లేరు... ఆహారం అమ్మే దుకాణాలు అక్కడక్కడ కనిపిస్తున్నా చాల తక్కువగా ఉన్నాయి...పాలు, పాల పదార్థాలు అమ్మేదుకాణాలు, పళ్ళ రసాల దుకాణాలు కూడా మూసి ఉన్నాయి...

మందుల దుకాణాలు మాత్రం రెండు మూడు ఉన్నట్టున్నాయి.. కొంచం పక్కగా ఒక కార్పొరేట్ ఆసుపత్రి వారి చిన్న క్లినిక్ దేదీప్యమానంగా అందరిని ఆకర్షిస్తోంది..అక్కడ ఎలాంటి వైద్యం చేస్తారో? బహుశా ప్రాంతకమైన గుండె నొప్పి లాంటివి వస్తే ప్రధమ చికిత్స చేస్తారేమో అనుకున్నాడు

మొహానికి పెట్టుకునే రంగు రంగుల ముసుగులు వేళ్ళాడుతూ ఒక కొత్త దుకాణం కనిపించింది...ప్రయాణం లో కొత్త ముసుగు కొనుక్కుని దాన్ని ఉతక కుండా తగిలించుకునే వాళ్ళు ఉంటారా అనుకున్నాడు…ఏమో...ఈ కోవిడ్ వల్ల తనకు తెలిసిన ప్రజా మనస్తత్వ శాస్త్రం ఎందుకు పనికిరాకుండా పోతోంది 

మైక్రోఫోన్ లో ఏవో శబ్దాలు వస్తున్నాయి...బహుశా రైల్వే వారు చేస్తున్న ప్రకటనలు అయ్యుండొచ్చు...

భాష తెలుగే అయినా జాగర్తగా విన్నా కూడా ఎవరికీ ఏమి అర్ధం అవకుండా ఏర్పాటు చేసినందుకు వీళ్ళని అభినందించాలి ..రైల్వే స్టేషన్లు అభివృద్ధి కి కేటాయించే నిధుల్లో కొంత భాగం ఈ ప్రకటనల కోసం వాడే సామాగ్రిని అభివృద్ధి చెయ్యడం పై పెట్టేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి….ఈ సారి కుదిరి నప్పుడు ఈ సూచన రైల్వే వారికి అందించాలి అనుకున్నాడు

చేతిలోని బాగ్ కింద పెట్టి ఒక పక్కగా నిల్చున్నాడు...అప్పుడప్పుడు తనని రాసుకుంటూ వెళ్లే ప్రయాణికులు, కూలీ కావాలా అని మాటి మాటి కి అడిగే కూలీలు, చుట్టూ వినిపిస్తున్న రణగొణ ధ్వనులు వీర్రాజునేమి బాధించటం లేదు...

ఈ రైల్లో బెంగుళూరు కి ప్రయాణం చెయ్యడం అతనికేమి కొత్త కాదు...ప్రజా సమూహం మధ్యలో తన ఆలోచనల్లో తాను ములిగి ఉండడం అతనికి అలవాటే...

నువ్వెక్క బోయే రైలు ఒక జీవితకాలం లేటు అన్న ఆరుద్ర గారి మాటలు గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు...ఇప్పుడు జీవిత కాలం మనం జీవించి ఉండగానే వస్తోంది...ఈ మధ్య కాలంలో రైల్వేల సామర్ధ్యం పెరిగిందని ఒప్పుకోవాలి అనుకున్నాడు

వీర్రాజు ఎక్కబోయే రైలు ఈ స్టేషన్ నుంచే బయలుదేరుతుంది...టైం అవుతోంది కాబోలు ప్లాట్ ఫారం కి ఒక చివర నుంచి ఖాళీ రైలు వెనక్కి వస్తోంది...

రైలు బయలు దేరడానికి అరగంట పైనే సమయం ఉంది…అయినా కొంతమంది నెమ్మదిగా వెనక్కి వస్తున్న రైలు లోకి ఆగే లోగానే ఎక్కేసి తమ తమ సీట్లు వెతుక్కుంటున్నారు...

మనుషులకి తమ హక్కులు తమకు దక్కుతాయనే విశ్వసం లేకుండా పోయినట్టుంది .. తాము రిజర్వు చేసుకున్న సీట్లు తమ కోసం అక్కడే ఉంటాయంటే నమ్మకం కుదరటంలేదు అనుకున్నాడు వీర్రాజు...

కొంచం గుండె ధైర్యం తక్కువ ఉన్నవాళ్లు రైలు ఆగ గానే తోసుకుంటూ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు...

రైలు వస్తూనే తమ తమ సీట్ల లో కూర్చుంటే గాని మనశ్శాంతి ఉండడం లేదు ఎవరికీ..దాని వల్ల ఆధునిక సామజిక కార్యాకర్తల్లా సమస్య తీరు తెన్నులు అర్ధమయ్యే లోగానే యుద్ధానికి సిద్ధమై పోతున్నారు... తాము రిజర్వు చేసుకున్న సీట్లను తామే సాధించి విజయగర్వం తో కూచుంటున్నారు అనుకున్నాడు ఆ తోసుకుంటున్న సమూహాన్ని చూస్తూ   

కాస్త ఖాళీ అయ్యాక ఏ సి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపుకి నడిచాడు...తనకి రెండు బెర్తులు ఉండే చిన్న కూపే లో ఇచ్చారు...సామాను బెర్త్ కింద పెట్టుకుని కూర్చున్నాడు వీర్రాజు...

ఆ కూపేలోకి వచ్చే రెండో వ్యక్తి ఎవరో? అనుకున్నాడు...ఒక్కో సారి చాల మంచి సహ ప్రయాణికులు దొరుకుతారు...ఒక్కో సారి ముభావంగా ఉండేవారు వస్తారు...అత్యుత్సాహం చూపించే వాళ్ళు, అహంకారంగా కనిపించే వాళ్ళు రకరకాల మనుషులు వస్తుంటారు...

ఇంతకు ముందు కంపార్ట్మెంట్ గేట్ పక్కన చార్ట్ అంటించే వాళ్ళు...ఇప్పుడు ఆ పధ్ధతి తీసేసారు.. దాని వల్ల వచ్చే మనిషి ఎలా ఉంటాడో తెలిసే అవకాశం లేదు కానీ , పేరు వయసు చూసి కొంచం గెస్ చెయ్యడం సరదాగా ఉండేది…

ఎవరైతే మనకేం లే...ఒక గంట కాలం గడిపి..తెచ్చుకున్న రెండు రొట్టెలూ తినేస్తే ఇంక పడుకోవడమే అనుకుంటూ…విశ్రాంతిగా కూర్చుని తన బాగ్ లోంచి సగం చదివిన థామస్ ఫ్రిడ్మాన్ రాసిన మీ ఆలస్యానికి మా ధన్యవాదాలు (థాంక్స్ ఫర్ బీయింగ్ లేట్) పుస్తకం తీసుకుని నిదానంగా చదువు కుంటూ కూర్చున్నాడు…

ఇంతలో తన కూపే బయట ఎదో అలికిడి అయింది...లోపలకి రాబోతూ వీర్రాజుని చూసి గతుక్కుమని ఆగిపోయింది ఒకావిడ...

సొగసైన ఆవిడ బట్టలూ, అందంగా నిగ నిగ లాడుతున్న చర్మం రంగూ చూసి ఎవరో విదేశాల్లో చాలాకాలంగా ఉంటున్న భారతీయురాలు అనుకున్నాడు వీర్రాజు

సామాను పెట్టుకుని కూర్చోకుండా గబా గబా బయటకు వెళ్లి కంపార్ట్మెంట్ కండక్టర్ ని పిలిచి..."ఇదేమిటి నా కూపేలో మగవాళ్లకు బెర్త్ ఇచ్చారు...ఈ బెర్త్ ఇచ్చేందుకు పద్ధతులేమి ఉండవా" అనడుగుతోంది అసహనంగా

"ఆడవాళ్ళ కూపేలు అని విడిగా ఉండవు మేడం...అయినా ఆ సారు తరుచుగా ప్రయాణిస్తారు ...చాలా మంచి వారు" అంటూ సద్ది చెప్ప బోయాడు కండక్టర్

"నువ్వేమీ క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇవ్వక్కర లేదు...టీ టీ ఈ ని పిలు"అందావిడ...ఆవిడ

అసహనమూ, సభ్యతలేని పంధా కొంచం నవ్వు తెప్పించాయి వీర్రాజుకి...ఇదేమీ చాలా కొత్త విషయం కాదు అతనికి..ఉద్యోగం కోసమూ, తన స్వంత ఆసక్తి కోసమూ స్వదేశంలోనూ... విదేశాల్లోనూ ప్రయాణం చెయ్యడం అతనికి అలవాటే...ఆ ప్రయాణాల్లో రకరకాల వ్యక్తులని కలవడం కూడా అలవాటే

ఆవిడ విషయం పట్టించుకోకుండా తన పుస్తకం లో ములిగి పోయాడు...ఒక పావుగంట వరకు ఆవిడ లోపలకు రాకుండా కారిడార్ లోనే నిలబడింది...

వచ్చే పోయే వాళ్లకు అడ్డమవుతున్నాని గమనించకుండా వాళ్ళు తనల్ని దాటుకు వెళ్తున్నందుకు చిరాకు పడుతోంది ...

టీ టీ ఈ వచ్చాడు..."ఏమయ్యా...ప్రయాణికులకు మీరిచ్చే గౌరవం ఇదేనా? నాకు సమస్య వచ్చిందని కబురు పెట్టినా మీ ఇష్టం వచ్చినట్టు వస్తారా" అంది దూకుడుగా

టీ టీ ఈ గారు ఒక్క క్షణం నివ్వెర పోయాడు...తన వయసు కైనా గౌరవం ఇవ్వని ఆవిడ పైన అతనికి ఏమి సదభిప్రాయం కలగలేదు...అందం కూడా ఒక్కో సారి వికారంగా ఉండవచ్చు అనుకున్నాడు ...కానీ తన ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ "ఏమయ్యింది మాడం...మీ బెర్త్ లో ఏమైనా సమస్యా?" అనడిగాడు నెమ్మదిగా

"నాకు ఇచ్చిన కూపే లో రెండే బెర్తులు ఉన్నాయి...రెండోది ఒక మగవాడికి ఇచ్చారు...ఆలా ఎలా కుదురుతుంది?" అనడిగింది

"అందులో తప్పేముంది? ఇదే పద్ధతిలో బెర్త్ లు ఇవ్వడం నేను గత పాతికేళ్లుగా చూస్తున్నాను...అదే రైల్వే రూలు" అన్నాడు టీ టీ ఈ

"మా దేశం లో అయితే పరవాలేదు..ఇక్కడ మగవాళ్ళకి సభ్యత తెలియదు...ఒంటరి ఆడవారి తో

అసహ్యంగా ప్రవర్తిస్తారు...అలంటి పరిస్థితుల్లో నేను ఒక తెలియని మగవాడి తో కూపే లో డోర్ మూసుకుని ఎలా ప్రయాణిస్తాను? అతని సీట్ మార్చండి" అంది విసురుగా

"అది కుదరదు ... మీకు కావాలంటే ఏసీ టు టైర్ లో ఇవ్వగలను...అక్కడంతా ఓపెన్ గా ఉంటుంది...మీకు సమస్య ఉండదు" అన్నాడు టీ టీ ఈ

"నేను ఫస్ట్ క్లాస్ టికెట్ కొంటే నన్ను అందరి తోనూ కూర్చో బెడతారా?" అనడిగింది కోపంగా

"ఒక్క నిముషం" అని మిగతా కూపే ల లో చూసాడు...అవి ఫ్యామిలీలు బుక్ చేసుకున్నారు ...అందువల్ల వాటిల్లో ఏర్పాటు చెయ్యలేం అని అర్ధమైంది టీ టీ ఈ కి....అదే విషయం చెప్పాడు...

ఒక కూపే లోకి తొంగి చూసి ఆవిడ...మీలో ఒకళ్ళు నా సీట్లోకి మారగలరా...నేను ముక్కు మొహం తెలియని మగవాడితో ప్రయాణం చెయ్యలేను" అనడిగింది

"మేమందరు ఒక కుటుంబం...పైగా మేము కూడా అందరమూ ఆడవాళ్ళమే...మాకు కూడా అదే సమస్య వస్తుంది" అన్నారు వాళ్ళు

"కొంచం సద్దుకో లేదా" అనడిగింది విసుగ్గా…వాళ్ళు సారీ అని తలలు తిప్పేసు కున్నారు

"మాడం ఆ సారు తరుచుగా ప్రయాణం చేసేవారే...పెద్దాయన...అయన వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు" అన్నాడు టీ టీ ఈ

"ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వకండి...నాకు సొల్యూషన్ కావాలి" అందావిడ తన అసభ్యతను కొనసాగిస్తూ

టీ టీ ఈ కి సహనం తగ్గి పోతోంది..."నేను చెయ్యగలిగే మార్గాలు చెప్పాను ...ఇక మీ ఇష్టం...మాకు అందరు ప్రయాణికులు సమానమే...మీకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చెయ్యలేను..ఏమి చెయ్యాలో మీరే తేల్చుకోండి" అన్నాడు నెమ్మదిగా

"ఇదే దరిద్రం ఈ దేశంలో...నేను మీమీద కంప్లైంట్ చెయ్యాల్సి ఉంటుంది" అంది కోపంగా

టీ టీ ఈ గారు కంప్లైంట్స్ బుక్ ఇచ్చి...తన వివరాలు - పేరు, నంబరు లాంటివన్నీ ఒక చిన్న కాయితం మీద రాసి ఇచ్చాడు... మీకేమి కావాలో ఈ కంప్లైంట్ బుక్ లో రాసుకోండి అని వెళ్లి పోయాడు

ఆవిడకి ఎలా స్పందించాలో తెలియలేదు...ఒక్క క్షణం ఆలోచించింది...కంప్లైంట్ పుస్తకాన్ని కండక్టర్ కి ఇచ్చి ఆ కూపేలోకి వచ్చింది...తన తో తెచ్చిన భారీపరిమాణం గల పెట్టిని గుమ్మానికి అడ్డంగా పెట్టి తన సీట్లో కూర్చుంది...

ఒకసారి తల ఎత్తి ఆ పెట్టిని, ఆవిడనూ చూసాడు వీర్రాజు...మళ్ళీ తన పుస్తకం లో ములిగి పోయాడు 

ఆవిడ అహం దెబ్బతింది... ఎదో ఇంగీష్ లో గొణుక్కుంది...

వీర్రాజు వైపు నించి ఏ స్పందనా కనిపించక పోవడం ఆవిడ కోపాన్ని పెంచేసింది...

ఇంతలో రైలు కదిలింది...సమయం గడుస్తున్న కొద్దీ ఆవిడ లో భావోద్వేగం తగ్గుతుందిలే అనుకున్న రైల్వే ఉద్యోగులకు ఆవిడ పధ్ధతి ఆశ్చర్యాన్ని కలిగించింది..అలాగే విసుగ్గా గొణుక్కుంటోంది

కొంతసేపటి తరువాత టీ టీ ఈ వచ్చాడు టిక్కెట్లు చూడడానికి..."నమస్కారం సార్...ఈ మధ్య కనపడటల్లేదు" అన్నాడు నవ్వుతూ

"చెప్తాను...ముందు మీరు ముసుగు సరి చేసుకోండి"అన్నాడు వీర్రాజు నవ్వుతూ…

"సారి సార్..చాలా సేపు పెట్టుకుంటాం కదా...ఆక్సిజన్ అందడం తగ్గుతుంటే ఉక్కిరి బిక్కిరి అయి కొంచం వదులు చేసుకుంటాం" అన్నాడు టీ టీ ఈ

"మనుషుల దగ్గరకి వెళ్ళేటప్పుడు మాత్రం పూర్తిగా మూసుకోండి...మీవల్ల మా కంటే మా వల్ల మీకే ప్రమాదం ఎక్కువ" అన్నాడు వీర్రాజు

ఇద్దరి టిక్కెట్లు చూసి టిక్ పెట్టి వెళ్లబోతుంటే..."అసలు ఇదేమి పధ్ధతి అండీ...ఆడ వారికి గౌరవం లేదా..తెలియని వ్యక్తుల తో ప్రయాణం చెయ్యడం ప్రమాదం కదా...మనదేశం ఇంకా చాలా నేర్చుకోవాలి" అంది

"మేడం..ఈ మొత్తం వ్యహారం లో ఇబ్బంది ఎవరికైనా జరిగితే అది ఆ సార్ కి...అయన ముప్పై రోజుల క్రితమే టికెట్ రిజర్వు చేసుకున్నారు...మీరు నిన్న కొని ..మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎమర్జెన్సీ కోటాలో రిజర్వు చేసుకున్నారు...మీరు చెప్పిన పధ్ధతి పాటించాలంటే మీకు బెర్త్ లేదని చెప్పాలి...కానీ మీరు ఎవరో పెద్దవారితో చెప్పించడం వల్ల ఈ బెర్త్ ఇచ్చారు" అన్నాడు టీ టీ ఈ

ఆవిడ కి ఆ జవాబు నచ్చక పోయినా అది నిజమే అవడంతో ఏమి మాట్లాడ లేదు ...

ఒక గంట గడిచింది...ఆవిడ అటూ ఇటూ చూస్తోంది...కండక్టర్ ని పిలిచి...మంచి నీళ్లు దొరుకుతాయా? అనడిగింది

ఒక్క క్షణం మాడం అని వెళ్లి ఒక వాటర్ బాటిల్ తో తిరిగి వచ్చాడు...అది రైల్వే వారికోసం ప్రత్యేకంగా చేసిన నీరు...

దాన్ని చూసి ఆవిడ..వద్దులే అనేసింది

ఇది సీల్డ్ బాటిల్ మాడం...మంచిదే అన్నాడు కండక్టర్

"వద్దులే...వెళ్ళిపో " అందావిడ విసురుగా...కండక్టర్ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు

తన బాగ్ తెరిచి దాంట్లోనించి ఒక నీళ్ల బాటిల్ తీసి ఆవిడకు ఇచ్చాడు వీర్రాజు...అది చాలా ఖరీదైన కంపెనీ నీళ్ల బాటిల్...వీర్రాజు తాను బస చేసిన నక్షత్రాల హోటల్ వారిని తెప్పించమంటే ఇచ్చినది ...

ఒక్క క్షణం నివ్వెరపోయింది ఆవిడ...ఆ ఖరీదైన బాటిల్, వీర్రాజు వేసుకున్న ఆధునికం గా తయారు చేసిన చేనేత చొక్కా అవీ చూసి కొంచెం మెత్త బడింది

"తీసుకోండి...ఇది ఇంకా తెరవలేదు" అన్నాడు వీర్రాజు మృదువు గా

ఆవిడ ఆ బాటిల్ తీసుకుని గబ గబా నీళ్లు తాగి కొంచం కుదుట పడింది... "థాంక్ యు" అంది పొడిగా

వీర్రాజు తలాడించాడు... మళ్ళీ తన పుస్తకంలో ములిగి పోయాడు...

ఆవిడ కొంచం విశ్రాంతిగా కూర్చుని ఫోన్లో ములిగి పోయింది...ఒక అరగంట తరువాత "హలో... ఇందాక జరిగిన దానికి సారీ" అంది వీర్రాజుతో

తల తిప్పి చూసాడు వీర్రాజు...అంతవరకూ ఆవిడ ధరించి ఉన్న లావుపాటి పెద్ద చలవ కళ్లద్దాలు తీసేసింది...మొహానికున్న సొగసైన ముసుగుని కూడా కొంచం కిందకు చేసుకుంది...

నలభైల్లో ఉంది ఉంటుంది ...అందమైన మనిషే అనుకున్నాడు వీర్రాజు... 

"మీరంత సారీ కావాల్సినదేమి లేదండి" అన్నాడు ఆవిడతో తన ముసుగు కూడా వదులు చేసుకుంటూ...ఎక్కడో చుసిన మొహమే...గుర్తు రావట్లేదు...

"సాధారణంగా మేము మన దేశం గురించి వార్తలు చదివితే డెబ్బై శాతం ఆడవారి మీద జరిగే అత్యాచారాలే...అందుకనే కొంచం భయపడ్డాను"అంది ఆవిడ

"ఆడవారి మీద అఘాయిత్యాలు చాలా ఎక్కువ అని నేను అంగీకరిస్తాను...డెబ్బై శాతం అన్నది కొంచం అతిశయోక్తి" అన్నాడు

"ఎన్ని రకాల కేసులో...ఒక్కో సారి ఇండియా రావాలంటేనే భయం వేస్తుంది" అంది ఆవిడ

 "మీరు కొంచం సెలెక్టివ్ గా చెప్తున్న న్యూస్ చూస్తున్నట్టున్నారు...సగం కంటే ఎక్కువ అత్యాచారాలు మగవాడు తన శక్తిని అధికారాన్ని చూపించడానికి చేస్తాడు...అవి సెక్సు కు సంబందించిన విషయాలు కావు.. చాలా అనాగరికమైన ఆలోచన విధానం వల్ల అలాంటి పనులు చేస్తారు... ఆ కారణం వల్ల సాధారణం గా రేప్ లు అస్సలు తెలియని వాళ్ళు చెయ్యరు...నేరస్తుడికి ఆ నేరంలో బాధితురాలు తెలిసే ఉంటుంది… 

అసలు అత్యాచారాలు ఇళ్లల్లో దగ్గర బంధువుల వల్ల జరుగుతాయి అలాంటివి అసలు బయటకు కూడా రావు...ఇలా ఒకరికొకరు తెలియకుండా జరిగే కేసులు చాలా తక్కువ ఉంటాయి"అన్నాడు వీర్రాజు

తలూపి "మీరంటుంటే నిజమే అనిపిస్తోంది...దీనికి విరుగుడు లేదా?"అనడిగింది ఆవిడ

"మన సమాజంలో ఆడవారంటే చిన్నచూపు పోయే వరకు ఈ పవర్ స్ట్రగుల్ తప్పదు"అన్నాడు వీర్రాజు 

నవ్వి ఊరుకుంది...ఆవిడ పంధా కూడా ఎవరో తెలిసిన వాడే అని ఆలోచిస్తున్నట్టు ఉంది

"నువ్వు వీరా కదా" అందావిడ అకస్మాత్తుగా 

"అవును" అన్నాడు వీర్రాజు....తనకన్నా ముందు ఆవిడకి గుర్తు రావడం అతనికి నచ్చలేదు...

ఆవిడ తన పేరు ఉచ్చరించే పధ్ధతి వల్లో లేక ఆవిడ పలకరింపు వల్ల కలిగిన ఉత్సాహం వల్లో వీర్రాజుకి కూడా ఆవిడ గుర్తుకు వచ్చింది...శ్రీలత వర్మ...ఇరవై ఏళ్ల క్రితం తాను కొత్తగా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం లో చేరినప్పుడు శ్రీలత ట్రైనీ..

"ఓహ్, నువ్వా లతా...గుర్తు పట్టలేక పోయాను...ఈ ముసుగులలో ఎలాగూ గుర్తుపట్టలేం ...తెలియని ఆడవాళ్ళ కళ్ళల్లోకి చుస్తే అపార్ధం చేసుకుంటారేమో అని అనుమానం...అందుకని సాధారణంగా నేను నా ప్రపంచం లో ములిగి ఉంటాను" అన్నాడు వీర్రాజు సంజాయిషీ ఇస్తున్నట్టు

"పరవాలేదు...అర్ధం చేసుకోగలను...నువ్వేం మారలేదు...ఎక్కడుంటున్నావ్... ఏం చేస్తున్నావ్" అనడిగింది లత

"నా జీవితంలో పెద్ద మార్పులేమీ జరగలేదు..ఇప్పటికీ అదే కాలనీ లో ఉంటున్నాను...నువ్వు అప్పట్లో మా ఇంటికి వచ్చావు కదా దాని పక్కనున్న రెండు ఇళ్ళు పడగొట్టి అపార్టుమెంట్లు కట్టారు...వాటిల్లో ఉంటున్నాను" 

ఉద్యోగం మానేసి నా సొంత కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకున్నాను...దీని వల్ల నాకు చాలా వెసులుబాటు కలుగుతుంది...అప్పుడప్పుడు మీటింగుల కోసం ఇలా ప్రయాణాలు చేస్తుంటాను" అన్నాడు వీర్రాజు

సాలోచనగా నవ్వింది లత...అప్పట్లో తాను వీర్రాజు ఇంటికి వెళ్లడం గుర్తు చేసుకుంటున్నట్టు...

"నువ్వు చాల మారిపోయావు...అందంగా కూడా ఉన్నావు" అన్నాడు వీర్రాజు నవ్వుతూ

పగలబడి నవ్వింది లత "నీ తలకాయ...ఆ రోజుల్లో నన్ను పెళ్లిచేసుకోరా మగడా అని నీ వెనక పడినప్పుడు కూడా చెప్పని విషయాలు ఈ వయసులో అవసరమా?" అనడిగింది

"నా ఉద్దేశ్యం అది కాదు...రంగు తేలావు..చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు...దాన్ని గురించి" అన్నాడు వీర్రాజు కొంచం నొచ్చుకుంటూ

"ఈ మాత్రానికే ఫీల్ అయి పోకు" అంది లత చిలిపిగా

ఇద్దరు గత కాలపు అనుభవాలు గుర్తుకు తెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు...

టైం ఎనిమిదయ్యింది...వీర్రాజు తన బాగ్ లోంచి రెండు ఫలహారం పొట్లాలు తీసి ఒకటి లత కు ఇచ్చాడు ...అది కూడా ఆ నక్షత్రాల హోటల్ వారిచ్చినదే...

"ఇప్పటికీ నువ్వు ఎక్స్ట్రా ఫుడ్ తెచుకుంటావా...ఏమి మారలేదు" అంది లత నవ్వుతూ

వీర్రాజు కూడా నవ్వాడు...ఇద్దరు తిని స్థిమిత పడ్డారు...

వీర్రాజు తన పాత స్నేహితుడే కావడం లతకు ఎంతో సంతోషాన్నిచ్చింది...ఎక్కినప్పుడున్న అనుమానం భయం పోయాయి...

సీటు మీద విశ్రాంతిగా కూర్చుని ఫోన్ చూసుకోవడం ప్రారంభించింది....మధ్యలో రెండు మూడు ఫోన్లు వచ్చాయి...ఇంటి నుంచి అనుకుంటాను.. ఒక కాల్ లో అమెరికన్ ఉచ్చారణ తో కూడా మాట్లాడింది…

ఫోన్లో అర్ధంకాని విషయాలేవో చూస్తున్న లత తన తల బయటకు తీసి "నిన్ను చూస్తే జీవితం బావున్నట్టుంది....ఏమాత్రం సంపాదించావు?" అనడిగింది వీర్రాజుని 

నవ్వాడు వీర్రాజు....”ఒక అపార్ట్మెంట్ కొన్నాను...అంతే...ఇంక పెద్దగా వెనక వేసుకున్నదేమి లేదు" అన్నాడు

"అయినా అంత నెమ్మదిగా సంతోషంగా ఎలా ఉన్నావ్? నేనలా చెరిగేస్తూ ఉంటే నువ్వేమి తొణకలేదు బెణకలేదు....పైపెచ్చు నేను లోపలికి వచ్చాక మాములుగా నీళ్లు ఇచ్చావు " అనడిగింది

"అది పుట్టుకతో వచ్చిన లోపం లే...నీ సంగతి చెప్పు... మీ అయన ఎలావున్నాడు...బాగా సంపాదించినట్టున్నారు" అనడిగాడు. లత అప్పట్లో వీర్రాజు సహాధ్యాయి రాజాను పెళ్ళిచేసుకుని అమెరికా చెక్కేసింది... 

ఆమాట విని పెద్దగా నిట్టూర్చింది లత...."సంపాదన డబ్బులే అయితే చాలానే సంపాదించాము.. ఇప్పుడు కూడా ఇండియా వచ్చింది రెండు మూడు ప్రోపర్టీలు కొనడానికి " అంది

ఆవిడ గొంతులో ఏభావమూ లేదు...

"అద్భుతం....మీ ఇద్దరికీ చాలా మంచి టేస్ట్ ఉంది...మంచి ఇల్లే కొని ఉంటారు" అన్నాడు వీర్రాజు ఉత్సాహంగా  

"అద్భుతమైన స్క్రీన్ సేవర్లు" అంది లత....గొంతులో ఏమాత్రము సంతోషం లేదు 

"అంత నీరసంగా మాట్లాడుతున్నావేమిటి? నీలోని ఉత్సాహమంతా ఏమైపోయింది? అప్పట్లో నువ్వు వచ్చి కాసేపు మాట్లాడి వెడితే మా అందరికి చాల బలంగా, సంతోషంగా ఉండేది.. వాయిదా వేద్దామనుకునే పనులు కూడా చేసేసే వాళ్ళం" అన్నాడు వీర్రాజు కొంచం బాధతో

"టైము వీరా... కాలం ఎన్నోరకాల మార్పులు తెస్తుంది...ఇది కూడా ఒకటి" అంది లత

"నువ్వు కోరుకున్న జీవితం సాధించావు...మేమందరం ఎంతో సంతోషించాము...మీ అయన కూడా నా స్నేహితుడే కదా...మీ ఇద్దరి గురించి మేము ఎప్పుడు గొప్పగా తలుచుకుంటూ ఉంటాము" అన్నాడు వీర్రాజు

"అది మీ అందరి మంచితనం...మేము అందరిలాంటి వాళ్ళమే" అంది లత ...తనకీ సంభాషణ ఏమాత్రం సంతోషం ఇవ్వటల్లేదని స్పష్టంగా తెలుస్తోంది

"అది సరేలే...మీ పిల్లల సంగతేమిటి?" అనడిగాడు వీర్రాజు మాట మార్చేందుకు...సాధారణంగా పిల్లల విషయం వస్తే ఎవరికైనా సంతోషమే కదా

"మాకొక అమ్మాయి...అక్కడే పుట్టింది...అక్కడే పెరిగింది....హార్వర్డ్ లో చదువుతోంది" అంది లత... ఆవిడ మాటల్లో గర్వం, సంతృప్తి లాంటి భావాలేమి ధ్వనించనందుకు ఆశ్చర్యం వేసింది వీర్రాజుకి

"లతా...అంతా బానే ఉంది కదా...నీ పంధా చుస్తే చాలా అసంతృప్తిగా ఉన్నట్టుంది" అన్నాడు

లత ఏమీ పలకకుండా తల దించుకుని కూర్చుంది...ఆవిడ కళ్ళలో నీళ్లు కనిపిస్తున్నాయి...

స్వతహాగా అభిజాత్యపు మనిషైన లత అలా బేలగా ఉండడం చూసి కంగారు పడిపోయాడు వీర్రాజు....నిశ్శబ్దంగా తల దించుకుని కూర్చున్నాడు

అతన్నుంచి ఎటువంటి స్పందనా కనిపించనందువల్లో లేక అతని సాహచర్యం లో తన మనసు దాచుకో లేకనో లత కాళ్ళు ముడుచుకుని మోకాళ్ళ మీద తల వాల్చి గట్టిగా ఏడిచేసింది...

పదినిముషాల తరువాత కొంచం తేరుకుని తలెత్తింది... ఏడుపు వల్ల దీనంగా తయారైన ఆవిడ మొహం చూస్తే చాల జాలి వేసింది వీర్రాజుకి...కానీ ఏమనాలో తెలియలేదు 

గబా గబా రుమాలు తో మొహం తుడుచుకుని హ్యాండు బాగ్ తీసుకుని బాత్రూం వైపుకి వెళ్ళింది...మొహం చన్నీళ్ళ తో దొలుచుకుని, తుడుచుకుని తన పెద్ద హ్యాండ్ బాగ్ లో ఉన్న సామాగ్రిని వాడి నీట్ గా తయారై వచ్చింది..

.ఆవిడ హావభావాలు బాగా తెలిసిన వాళ్ళు తప్పితే ఎవ్వరు కూడా కాసేపటి క్రితం చంటి పిల్లలా వెక్కి వెక్కి ఏడిచిందని అనుకోరు...

అంత తొందరగా తేరుకుని తయారైన ఆవిడ వైపు మెచ్చుకోలుగా చూస్తూ "క్షమించు లతా, నా మాటలు నిన్నింత బాధపెడతాయని నేను అనుకోలేదు .మీ జీవితం లో అంతా బావుంది కదా, అనారోగ్యం సమస్యలేమీ లేవు కదా ..లేక రాజా ఏమైనా దారి తప్పాడా" కొంచం ఆందోళనగా అడిగాడు వీర్రాజు 

"నెవర్ మైండ్...అలాంటి సమస్యలేమీ లేవు...రాజా ఒక అద్భుతమైన తోడు...మేమంటే పిచ్చ ఇష్టం ...చాలా కాలం తరువాత నా మనసులో మాట చెప్పుకోదగిన స్నేహితుడు కనిపించడం వల్ల కొంచం ఆపుకోలేక పోయాను" అంది లత

కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది...

"అప్పుడు నేను ప్రొపోజ్ చేసి నప్పుడు నువ్వు ఒప్పుకుని నన్ను చేసుకుని ఉండాల్సింది" అంది లత అకస్మాత్తుగా 

గట్టిగ నవ్వేసాడు వీర్రాజు..."అప్పుడు నువ్వు ప్రొపోజ్ చేసింది నాకు కాదు...విదేశాల్లో సులభంగా ఉద్యోగమూ, వీసా సంపాదించగలిగిన ఒక సహాధ్యాయి వీర్రాజుకి మాత్రమే"అన్నాడు

"అంటే..నేను నీలోని అసలు మనిషిని గుర్తించలేక పోయనంటావా" అంది లత కోపంగా

"దాన్ని గురించి కోపం తెచుకోవాల్సినది ఏమి లేదు...ఆ లత ఒక ఇరవై మూడేళ్ళ పడుచు పిల్ల...జీవితం మీద ఎన్నో ఆశలు కోరికలు ఉన్న మధ్యతరగతి పిల్ల... ఎంతో కష్టపడి ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీ లో ఉద్యోగం సంపాదించుకుని తన ముందు జీవితం రంగుల్లో ఊహించుకున్న పిల్ల ...అందువల్ల భావుకత కన్నా ఆశలకు ఆకాంక్షలకు ఎక్కువ విలువ ఉంటుంది" అన్నాడు వీర్రాజు

"డబ్బూ, విదేశాలు అవన్నీ తరువాత వచ్చాయి...నీ పధ్ధతి నచ్చి నీకు ముందు ప్రొపోజ్ చేశాను" అంది లత

"నీ నిర్ణయం మంచి కెరియర్ ఎటుంటే అటు వెళ్లాలని...నీ వైపు నించి తప్పేమి లేదు" అన్నాడు వీర్రాజు

"నీతో ఉంటే ఇప్పుడు నువ్వున్నట్టే ఎంతో సంతృప్తి గా ఉండేదాన్ని కదా..మా కుటుంబం లో ముగ్గురము మూడు దేశాల్లో ఉంటున్నాము...తల్లి తండ్రులు, సోదరి సోదరులు ఎవ్వరి బంధాలు మమల్ని కదిలించలేక పోతున్నాయి...ఈ జీవితాలకి అర్థమేముంది" అనడిగింది

"మానసిక సంతృప్తి స్వతహాగా రావాలి...ఇదేమి డబ్బు, పరపతి, ఆస్తి కాదు కదా...నిజానికి ఆ పరిస్థితి లో మనం పెళ్లి చేసుకుని ఉంటే తప్పకుండా విడి పోయే వాళ్ళం....ఎందుకంటే అప్పట్లో నీ జీవితాశయం విదేశాల్లో సెటిల్ అవడం...నాకు అర్ధం లేని చాదస్తం వల్ల అది నచ్చని కోరిక...

ఇప్పుడు నువ్వు ఆ జీవితాన్ని అనుభవించి చూసావు ...దాని నుంచి నీక్కావలసిన సంతృప్తి దొరకటం లేదని గ్రహించావు... అసలు నువ్వు విదేశాలకు వెళ్ళ కుండా ఉంటే ఎంతో అసంతృప్తికి లోనై నీజీవితాన్ని నాశనం చేసుకుని ఉండేదానివి"అన్నాడు వీర్రాజు

"నువ్వు వెళ్ళడానికి ఇష్టపడలేదు కదా అని విదేశాలకు వెళ్లిన వాళ్ళందరూ తప్పంటావా? అన్యాయం కదా" అంది లత

గట్టిగా నవ్వాడు వీర్రాజు..."నా ఉద్దేశ్యం అది కాదు...విదేశాలకు వెళ్లి సెటిల్ అవడం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం...దాన్ని గురించి మంచి గాని చెడ్డ గాని ఉండవు...ఆ మాటకొస్తే ఒక కొత్త ప్రాంతానికి వెళ్లి అక్కడ సంస్కృతి పద్ధతులు నేర్చుకుని...ఆ సమాజం లో ఇమిడి ముందుకు వెళ్లడం సులభమైన విషయమేమి కాదు...నేను అంటున్నది నీ జీవితాన్నుంచి నువ్వు కోరుకున్న విషయాన్ని గురించి" అన్నాడు

"ఇప్పుడు క్లియర్ గా చెప్పలేను కానీ అప్పుడు నీకు ప్రొపోజ్ చేసినప్పుడు విదేశాలలో సెటిల్ అవడమా లేక ఒక మంచి తోడును కోరుకోవడమా అనే సందిగ్ధం లో ఉండే దాన్ని...చివరకు విదేశాలు ఎన్నుకున్నాను...నేను అడిగిన విషయం గురించి నీ నుంచి స్పందన ఏమీ రాలేదు.. దాంతో రాజా ను ఎన్నుకున్నాను" అంది లత 

"అది విధి రాత...ఇప్పుడు వెనక్కు వెళ్లడం ఎందుకు...నేను చెప్తున్నది ఈ పరిణతి చెందిన లత గురించి కాదు..ఆ మంకు పిల్ల లత గురించి...నువ్వు చాలా తొందరగా నిర్ణయాలు తీసుకునే దానివి...అందువల్ల నువ్వు ఇబ్బందుల్లో పడే దానివి" అన్నాడు వీర్రాజు

"నిజమేనేమో" అంది లత ఆలోచనల మధ్యనుంచి

"నువ్వు చాల మంచి స్నేహితురాలివి...అప్పట్లో మన ఉషకు సమస్య వస్తే నువ్వు కలగ జేసుకుని అందరినీ పోగేసి చేసిన సహాయం నాకు గుర్తుంది…... నీకు గుర్తుందా అప్పట్లో మనం అందరం వెన్నెల రాత్రుల్లో హుస్సేన్ సాగర్ వడ్డున కూర్చుని తలత్ మెహమూద్ పాటలు వినేవాళ్ళం ...అసలు లత ఆ అమ్మాయి...

నీ ఇష్టాలు కోరికలు అవన్నీ బయట నుంచి అంటుకున్నవి అందువల్లే నీక్కావలసినవి అన్నీ దొరికినా నీలో సంతృప్తి లేదు" అన్నాడు వీర్రాజు

"అవునా వీరా...ఈ అనవసరమైన విషయాల కోసం నేను నా అసలు జీవితాన్ని వదిలేసుకున్నాను...ఆ లత నాకు మళ్ళీ కావాలి...ఏం చేస్తే దొరుకుతుంది?" అనడిగింది...

అప్పటి రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి లత మోహంలో కొంచం పారవశ్యం ఒక్క కమ్మ తెమ్మెరలా కనిపించి మాయమయింది

"ఆ లత ఒక ఊహా సుందరే...దొరకదు... కానీ నీకు కావాలంటే అలాంటి చిన్న చిన్న అనుభవాలు ఇప్పుడు కూడా పొందొచ్చు"అన్నాడు వీర్రాజు

"కుదరదు వీరా..మా ఆయనకి అలంటి ఇష్టాలేమి లేవు..బిజినెస్, మీటింగ్ లు, పార్టీలు అవే" అంది లత

"రాజా తో నాకు మంచి పరిచయమే ఉంది...అప్పట్లో అతను మంచి పాటలు పాడే వాడు... నీకు గుర్తుందా, ఒకసారి నేను, రాజా ఇంకా ముగ్గురు కలిసి నెథర్లాండ్స్ లో ట్రైనింగ్ కోసం మూడు నెలలు ఉన్నాం...అప్పుడు మేము రోజూ డ్రింక్ చేసే వాళ్ళం...ఆరోజుల్లో రాజా మా కోసం రోజు పాడేవాడు...సాలూరి రాజేశ్వర రావు గారి ప్రైవేట్ పాటలు అతను ఎంతో భావయుక్తం గా పాడే వాడు" అన్నాడు వీర్రాజు

"రాజా పాడతాడా?" ఆశ్చర్యంగా అడిగింది లత

"మీ పెళ్ళై ఇరవై ఏళ్ళు అయ్యింది... నీకు తెలియక పోవడం ఆశ్చర్యమే...మీరిద్దరు మీ జీవితాలని ఎలా పోగుట్టు కున్నారో అర్ధం అవుతోంది" అన్నాడు వీర్రాజు

నిశ్శబ్దం గా కూర్చుంది లత...ఎదో తెలియని బాధ తన మోహంలో స్పష్టంగా కనిపిస్తోంది

"లతా, నీకు ఒక రకమైన జీవితం కావాలని కోరిక ఉండేది...దాని కోసం నువ్వు చాల కష్టపడ్డావ్ కూడా...రాజా కు నీ ప్రేమ తప్ప ఇంకేమి అక్కర లేదు...

నువ్వు నాకు ప్రొపోజ్ చేసిన విషయం రాజా కు తెలుసు...నన్ను ఒప్పించాడనికి తను ప్రయత్నించాడు కూడా"అన్నాడు వీర్రాజు

షాక్ తింది లత...ఈ విషయం తనకు వీర్రాజుకి తప్ప ఎవ్వరికి తెలియదనుకుంది..."రాజా కెలా తెలిసింది? నువ్వు చెప్పావా"అనడిగింది వీర్రాజుని

"నువ్వే చెప్పావు...ఒకసారి నువ్వు ఉషకు చెప్పావు..తను రాజాకు చెప్పింది" అన్నాడు వీర్రాజు

లత ఏమి అనకుండా మొహం తిప్పుకుని కూర్చుంది

"లతా...నీ కోరికలు నీ పర్సనాలిటీకి సహజంగా కుదిరేవి కాదు...నువ్వు స్వతహాగా భావుకురాలివి... శ్రావ్యమైన సంగీతం...మంచి కవిత్వం...కథలు...నటన లాంటివి నిన్ను ఆకర్షించి నట్టు మిగతా విషయాలు నిన్ను ఆకర్షించవు…. నువ్వు కోరుకున్న మెటీరియలిస్టిక్ జీవితం దానికి పూర్తిగా విరుద్ధం"ఆపాడు వీర్రాజు

సీసాలోంచి కొంచం మంచినీళ్లు తాగి మళ్ళీ మొదలు పెట్టాడు "నువ్వు రాజాకు ప్రొపోజ్ చేసిన తరువాత వాడు నా దగ్గరకొచ్చాడు సలహా కోసం...

నేను వాడికి ఇందాక నీకు చెప్పినట్టే చెప్పాను... నువ్వు భావుకతో, మెటీరియలిజమో ఎదో ఒకటే తీసుకోవాలి...ఒకే జీవితంలో రెండూ కుదరవు...

మనం గొప్ప కళాకారులం కాదు..వాళ్ళకే ఈ రెండు ప్రపంచాల మధ్య యుద్ధం సాగుతుంటుంది ...భగవత్ప్రసాదమైన కళలు పొందిన వాళ్ళు ఆ యుద్ధం కొనసాగిస్తూనే తమ కళా జీవితాల్ని ముందుకు తీసుకెళ్తారు....మనలాంటి సామాన్యులు ఆ యుద్ధాన్ని చెయ్యలేరు..అందుకనే ఎదో ఒకటి ఎన్నుకోవాలి...

నువ్వు తీసుకున్న నిర్ణయం తో సమాధాన పడక పోవడం...ఆవిషయం నీకు అంతా స్పష్టంగా అర్ధం కాక పోవడం వల్ల నీ జీవితంలో చిక్కుముళ్లు పడ్డాయి "అన్నాడు వీర్రాజు

"రాజా కావాలనే ఈ జీవితాన్ని ఎన్నుకున్నాడు కదా…తానెందుకు బాధ పడుతుంటాడు?" అడిగింది లత

"నేను ఈ రెండు ప్రపంచాల్లో ఎదో ఒకటి ఎన్నుకో మంటే ఏమన్నాడో తెలుసా? నేను మూడో ప్రపంచాన్ని ఎన్నుకుంటాను..అదే లత అన్నాడు" అన్నాడు వీరా

నమ్మలేనట్టు చూసింది లత...మళ్ళీ కళ్ళలోంచి నీళ్లు వచ్చాయి

"అంటే నేను ఈ జీవితం తో సమాధాన పడి సంతృప్తి గా లేక పోవడం వల్ల రాజా సంతృప్తి ని కూడా భగ్నం చేసానా" బాధగా అడిగింది లత

"అవును...అది దురదృష్టం...మీ ఇద్దరు ఎంతో మంచి వాళ్ళు, తెలివైన వాళ్లును...మీ జీవితాలు ఇలా అపభ్రంశంగా ఉండకూడదు " అన్నాడు వీర్రాజు..అతని గొంతు కొద్దిగా వణికింది

"అంటే మేము శాశ్వతంగా ఆ ప్రపంచంలోనే ఉంది పోవాలా? వేరే మార్గమే లేదా?" అనడిగింది లత కళ్లు తుడుచుకుంటూ

"ఉంది...కానీ కొంత కృషి చెయ్యాలి...మీ భవిష్యత్తు ప్రణాళికలన్నీ మార్చు కోవాలి....కొంచం వేగం తగ్గించుకుని ప్రయత్నం చేస్తే తప్పకుండా కుదురుతుంది...

మీరు మీ మెటీరియలిస్ట్ ప్రపంచం లో కొంత దూరం వచ్చారు...ఇప్పుడు మీకు డబ్బు సమస్య లేదు...ఇక్కడ నుంచి మీరు పెట్టుబడి పెడుతూ..మీ జీవితాన్ని మీరు కోరినవిధంగా గడపవచ్చును" అన్నాడు వీర్రాజు

అర్ధమైనట్టు తలాడించింది లత ...చీకట్లు చీల్చుకుంటూ రైలు వేగంగా పరుగెత్తునే ఉంది...


Rate this content
Log in

Similar telugu story from Abstract