Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.
Read #1 book on Hinduism and enhance your understanding of ancient Indian history.

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Comedy Drama


4.7  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Comedy Drama


శాస్త్రీయ జోస్యం

శాస్త్రీయ జోస్యం

6 mins 334 6 mins 334

ఈ విశాల భారత దేశంలోని వేల వేల ఊళ్లలో అదొకటి...అన్ని ఊళ్ళలాగానే అక్కడ కూడా మంచీ చెడూ కలగాపులగమై అక్కడి ప్రజల జీవితాలు పూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాయని గానీ, లేవని గానీ అనడానికి వీలు లేదు...

ఊళ్ళో పనులు చాలావరకు మామూలు గా ఎవరి ప్రోద్బలమూ లేకుండా జరిగిపోతుంటాయి... ఎంతో మంది మధ్యతరగతి ప్రజల్లగానే ఆ ఊళ్ళో ప్రజలు కూడా ఈవీవీ పట్టించుకోకుండా ఉదాసీనంగా ఉంటూ తమ జీవితాలు విడి విడి గా బాగుపడతాయని కలల్లో గడిపేస్తుంటారు. 

ఆ ఊళ్ళో ఉన్న ధనిక కుటుంబానికి చెందిన ఒక కుర్రవాడు రాజకీయ చైతన్యం చూపించి ఎన్నో ఎత్తులకు ఎదిగాడు. ఆ ఊరిలో వార్డు మెంబరు గా రాజకీయ జీవితం ప్రారంభించి, తన చురుకుతనం తోనూ, స్వశక్తి తోనూ ఎమ్మెల్యే వరకూ ఎదిగారు. అయన నమ్మిన వారికి దేముడనీ, ఎదురొచ్చిన వారికి వీర విక్రముడనీ అందరూ అనుకుంటుంటారు.

ఆయనను ఎవరూ పేరుతొ పిలవరు...గౌరవంగా శ్రీవారు అని అంటుంటారు…

శ్రీవారి ఊరికే చెందిన రామచంద్రం ఒక అనాధ. అతను శ్రీవారి ప్రోద్బలంతో ఎంతో కష్టపడి బాగా చదువుకుని గవర్నమెంట్ పాఠశాల లో టీచర్ అయ్యాడు.

శ్రీవారి కోరిక మేరకు తన ఆదర్శాలను కొద్దిగా పక్కకు పెట్టి ఇప్పటికీ వారి పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి రోజూ శ్రీవారి ఇంటికి వెడుతుంటాడు.

ఒకరోజు పాఠాలు చెప్పేందుకు రామచంద్రం శ్రీవారి ఇంటికి చేరేటప్పడికి అక్కడ గురువు గారు కనిపించారు.

అయన శ్రీవారికి ధర్మ సూక్ష్మాలు వివరిస్తూంటారు. అన్నిరకాల మత గ్రంధాల్లోంచీ మంచి విషయాలు చెప్తుంటారు. అవి శ్రీవారు తన ఉపన్యాసాల్లోనూ, ప్రెస్ నోట్ ల లోనూ వాడుకుంటుంటారు.

"ఏమయ్యా రామచంద్రం, బావున్నావా...ఇవాళ పిల్లలకు కొంచం సుస్తీ గా ఉంది. పాఠాలు చెప్పోద్దులే. నువ్వుకూడా కాసేపు కచేరీలో కూర్చో" అన్నారు గురువుగారు

"అయ్యో, డాక్టర్ కి చూపించారా? నేను కచేరీ లో ఏం చేస్తాను గురూజీ, నాకు సెలవిప్పించండి" అన్నాడు రామచంద్రం చేతులు జోడించి

"కాసేపు కూర్చో. నీ నుంచి ప్రజలేమనుకుంటున్నారో వినాలని ఉంది మా అందరికీ" అన్నారు గురువుగారు

ఇక కచేరీ లోపలకు నడవక తప్పలేదు రామచంద్రానికి.

అతను శ్రీవారికి నమస్కారం చేసి కుర్చీలో కూర్చో బోతుండగా శ్రీవారి ముఖ్య భృత్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతని చేతిలో ఒక బకెట్ ఉంది...ఒంటి చేత్తో గురువు గారి కి నమస్కారం చేసి "అన్నా, స్వామీజీ ని కలిసాను. అయన ఎన్నికల సమయం కదా ఈ చేపను దగ్గర పెట్టుకోమని అని ఇచ్చారు" అన్నాడు వగరుస్తూ

"స్వామీజీ బ్రామ్మలాయన కదా, అయన చాప ఎందుకు ఇచ్చారు" అనడిగారు శ్రీవారు ఆశ్చర్యంగా

"ఇది మామూలు చేప కాదన్నా, దీనికి ఎనిమిది చేతులున్నాయి, ఒక తలుంది. చూడు…ఈ ఎన్నికల సమయం లో గెలుపు ఓటముల గురించి ఈ చేప చాలా రూఢిఅయిన సంకేతాలిస్తుందట" అంటూ బకెట్ శ్రీవారి దగ్గరకు తీసుకెళ్లాడు 

"అవున్నిజమే, ఇదెందుకు ఇచ్చారో...గురువు గారూ మీకేమైనా అర్ధం అయ్యిందా" అనడిగారు శ్రీవారు

"దీన్ని ఆక్టోపస్ అంటారు...మనదేశంలో దొరకవు. స్వామీజీ ఎక్కడ నుంచి తెప్పించారో" అన్నారు గురువు గారు

"ఇది మామూలు చేప కాదటయ్యా, పూర్వ జన్మలో ఈ చేప విదేశాల్లో ఉండేదట. అది ఫుట్ బాల్ ఆటలో ఎవరు గెలుస్తారో ఖచ్చితంగా జోస్యం చెప్పేదట.

ఆ పుణ్య ఫలం వల్ల ఆ చేప ఇప్పుడు మన అధ్యక్షుల వారి ఊరి పక్కనుంచి ప్రవహిస్తున్న నదిలో పుట్టిందట. దీన్ని తెప్పించటానికి స్వామీజీ తన పలుకుబడి చాలా వినియోగించాల్సి వచ్చిందని ఆశ్రమంలో చిన్న స్వామి చెప్పారు" అన్నాడు భృత్యుడు

"చేప మందు గురించి విన్నాం గాని చేప జోస్యం గురించి వినలేదు. అయినా మనకు శాస్త్రీయం గా ప్రజాభిప్రాయాన్ని గురించి చెప్పే ప్రజా కుమార్ ఉన్నాడు కదా. ఆయనకూ ఇతర సభ్యులకూ బోళ్ళంత డబ్బు పోస్తున్నాం...మళ్ళీ ఇదో ఖర్చా" అన్నారు శ్రీవారు...

"ఆలా అనుకోకూడదు, స్పేస్ లోకి రాకెట్లను పంపించే ఇస్రో వారు కూడా ఎందుకైనా మంచిదని భగవంతుడిని కూడా ప్రార్ధిస్తారు. అంత ముఖ్యమైన ప్రయోగాలు చేస్తప్పుడు ఏ చిన్న అడ్డంకీ రాకూడదనీ, ఒకవేళ అలాంటి అడ్డంకి రావడానికి దేవుడు కారణం అనుకుంటే ఆ దేవుడినికూడా వేడుకుంటామనీ అంటారు శాస్త్రవేత్తలు. మన విషయం కూడా అంతే" అన్నారు గురూజీ

"అంటే మనం ప్రజా కుమార్ చేసే శాస్త్రీయ మైన జోస్యం తో బాటు ఈ అశాస్త్రీయమైన జోస్యం కూడా చూద్దామా?" అనడిగారు శ్రీ వారు

"తప్పేం లేదు. ప్రజలు మారి పోయారు. వాళ్ళకెన్నో సమాచార సాధనాలు ఏర్పడ్డాయి. దాని పైన మిగిలిన ప్రపంచం ఏమనుకుంటోందో కూడా తెలిసి పోతోంది. దీని వల్ల వాళ్ళెప్పుడెలా వ్యవహరిస్తారో అర్ధం కావటం లేదు. మనం అన్ని శక్తులూ ఎన్నికల మీదే కేంద్రీకరించాలి...అందులో ఇదొకటి. ఈ రెండూ కాకుండా అసలు ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలని రామచంద్రాన్ని రమ్మన్నాను" అన్నారు గురువు గారు

"మంచి పని చేసారు...ఒరేయ్ ఈ చేపను పెట్టడానికి ఒక తొట్టి ఏర్పాటు చెయ్యండి...ఈ చేప జోస్యం తెల్సుకుందుకు స్వామీజీ ఆశ్రమం నుంచి వచ్చిన చిన్న స్వామికి ఉండేందుకు ఏర్పాటు చెయ్యండి" అంటూ గురూజీ వైపుకి భావయుక్తం గా చూసారు శ్రీవారు

"సరే, స్వామీజీ కి తాంబూలం పంపుతాను" అన్నారు గురూజీ తల తాటిస్తూ

"రామా, ప్రజలేమనుకుంటున్నారు...ప్రజా కుమార్ గారి జోస్యం ప్రకారం మనకి కొంత వ్యతిరేకత ఉందని తెలుస్తోంది" అనడిగారు శ్రీవారు

"మేము ఈ మధ్య ప్రభుత్వం వారి సర్వే కోసం మీ నిజయోజక వర్గం లోని కొన్ని ప్రాంతాల్లో తిరిగాం...చాలా మంది మీ క్షేమ సమాచారాలు అడిగి తెలుసు కున్నారు...ఒకటి రెండు చోట్ల తప్ప అంత వ్యతిరేకత ఏమీ కనిపించలేదు. అయితే ఆ మధ్య తమరు రామాయణ కాలం లో విమానాలు లాంటి విషయాల మీద చేసిన కొన్ని వ్యాఖ్యలు చెయ్యకుండా ఉంటే మంచిదేమో అన్నారు...మీ అంత గౌరవనీయమైన నాయకుడు ఆలా భూతకాలం లోకి వెళ్లిపోవడం ఇప్పడి కుర్రాళ్లకు నచ్చలేదు" అన్నాడు రామచంద్రం

"అంతే వాళ్ళ ఓట్లు మనకు పడవా" అనడిగారు శ్రీవారు కొంచం కంగారుగా

"వాళ్ళు నచ్చలేదు అని అన్నారు గాని అందులో వ్యతిరేకత ఏమీ లేదయ్యా...మనకెంతో ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తే ఎలా నొచ్చుకుంటామో అలాగే ఉంది...ఓట్ల మీద దాని ప్రభావం పడక పోవచ్చు" అన్నాడు రామచంద్రం

"ఆలా అనుకుని ఊరుకోలేం కదా మాస్టారూ...ప్రజా కుమార్ గారు స్పష్టం గా చెప్పారు, కుర్రవాళ్ళల్లో దాదాపు అరవై శాతం అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని...ఇప్పుడు మీరు కూడా అదే మాటను రూఢి చేసారు కదా" అన్నాడు భృత్యుడు

"అయ్యో, నేనన్నది అది కాదు. కొందరు కుర్రాళ్ళు కొంచం నొచ్చుకున్న మాట నిజమే గాని అది వ్యతిరేకత కాదు...వాళ్ళన్నదేమిటంటే మన నాయకుడు శ్రీవారే. అయితే అయన కొంచం మన మనస్సులో ఏముందో ఉహించకుని పనులు చెయ్యడం కంటే తెలుసుకుని చేస్తే బాగుంటుంది అని" అన్నాడు రామచంద్రం భయంగా

"ఇంత పెద్ద నియోజకవర్గంలో ప్రజాభిప్రాయం సాంతం తెలుసుకోవడం చాలా కష్టం. అందుకనే ప్రజా కుమార్ గారు తమ సభ్యుల్ని పంపి సర్వే చేయిస్తారు...ఆ వచ్చిన సమాధానాలను క్రోడీకరించి మనకు చెప్తారు...ప్రస్తుతానికి అదే మార్గం" అన్నారు గురువు గారు

"అంతా తిరగలేక పోయినా, శ్రీవారు పుట్టిన గ్రామం, దాని చుట్టూ పక్కల నాలుగైదు గ్రామాల్లో తిరిగినా చాలు. శ్రీవారిని చూస్తూ ఎవ్వరు అబద్ధం చెప్పలేరు. దాని పైన ఆయన తమను మర్చిపోలేదనే భావన వాళ్ళను ఉత్సాహ పరుస్తుంది" అన్నాడు రామచంద్రం

"అవన్నీ సత్యకాలం వ్యవహారాలు. తాను పుట్టిన గ్రామంలో అన్నకు తిరుగే లేదు. అక్కడి నాయకుడు తరచుగా గ్రామంలో అన్నకు సపోర్ట్ గా కుర్రవాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించీ, వాటిని పొగుడుతూ గ్రామస్తులు అనే మాటలూ కూత కూస్తూనే ఉంటాడు...

చుట్టు పక్కల గ్రామాల్లో కూడా అదే తంతు...అక్కడికి తూర్పు వైపున్న గ్రామాల్లోనే వ్యతిరేకత బాగా ఉందనీ, అందులో ప్రతిపక్ష నాయకుడి గ్రామం లో ఇంకా ఎక్కువనీ ప్రజా కుమార్ గారన్నారు" అన్నాడు భృత్యుడు

"నాకలా అనిపించలేదండి. ఆ మాటకొస్తే శ్రీవారి రామాయణం మాటల గురించి ఎక్కువ విమర్శలు శ్రీవారు పుట్టిన గ్రామం నుంచే వచ్చాయి" అన్నాడు రామచంద్రం

"సరే లెండి...మీరు బయలుదేరండి. స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పే టైమయినట్టుంది " అన్నారు గురువుగారు తొందర చేస్తూ

"ఇవాళ పాఠాల తొందరేమీ లేదండీ. శ్రీవారికి నామనసులోమాట చెప్పే అవకాశం దొరికింది కదా, కాసేపుంటాను" అన్నాడు రామచంద్రం

"ఇంకేం చెప్పాలి?" అనడిగారు శ్రీవారు. రామచంద్రం చెప్పిన విషయాలు తాము ఎంతో డబ్బు ఖర్చు చేసి శాస్త్రీయం గా తెలుసుకున్న విషయాల కంటే భిన్నం గా ఉండడం ఆయనకు నచ్చలేదు. దానికి తోడు రామచంద్రం తాను నమ్మిన సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నాడు…

"రెండు విషయాలయ్యా...ఒకటి తమ నియోజక వర్గం లో ప్రజలకు తామంటే ఎంతో ఇష్టం. మీరు వాళ్ళ కుటుంబం లో ఒక ముఖ్యమైన సభ్యుడిలా అనుకుంటున్నారు.

కానీ ప్రభుత్వం ఇస్తున్న పధకాలు అందించేందుకు ముందు వరసలో ఉన్న కింది స్థాయి నాయకులు ఆ రకమైన అభిమానాన్ని సంపాదించ లేక పోతున్నారు. వాళ్ళ వల్ల తమకు నష్టం కలుగుతోంది.

రెండోది తమరు ప్రజలకు దూరం గా ఉండడం...మీరు కనీసం వీడియో లో అయినా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడటం లేదు. మీ సందేశాలన్నీ కూతల రూపం లో వస్తున్నాయ్. అవి రాసేవాళ్లకు ప్రజల మీద మీకున్నంత అభిమానం ఉండదు అందువల్ల ఆ మాటలు ప్రజల్ని స్పృశించ లేక పోతున్నాయి.

ఈ రెండు విషయాలనీ మీరు సరిచేసుకుంటే మీకు తిరుగు లేదు" అన్నాడు రామచంద్రం

శ్రీవారి మొహం కొంచం ఎర్రబడింది...అయన ఎదో అనేలోగా బయటనుంచి చిన్న స్వామి వచ్చాడు...

శ్రీవారి తో సహా అందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారం చేసారు...

శ్రీవారిని ఆశీర్వదిస్తూ అయన "మీకు జయం కలగాలి...మనం మన అష్టభుజి మాతను రాబోయే ఎన్నికల గురించి అడిగి తెలుసుకుందాం" అన్నారు

"తప్పకుండా స్వామీ...మేము ఇప్పుడే రెండు వ్యతిరేక మైన జోస్యాలు విన్నాము. ప్రజా కుమార్ గారు మనకు వ్యతిరేకత ఉంది అంటున్నారు...మాస్టారు అలాంటిదేమీ లేదు, కొద్దిపాటి నిరాశ మాత్రమే ఉంది, శ్రీవారు ప్రజల్లో కొంచం తిరిగితే అది పోయి ఆయనకు తిరుగుండదు అంటున్నారు...వాటిలో ఏది నిజమో తెలుసుకోవాలి" అన్నారు గురువు గారు

"సరే" అని అష్టభుజిని ఉంచిన అద్దాల పెట్టి దగ్గరకు వెళ్లారు చిన్న స్వామి

అష్టభుజికి నమస్కారం చేసి, ఆ పెట్టి లోకి రెండు రంగుల పెద్ద గోళీలు వేశారు "అమ్మా, శ్రీవారి కి తమ నియోజక వర్గం లో ప్రజాదరణ మరియు వ్యతిరేకత గురించి అనుమానాలూ, భయాలూ ఉన్నాయి...తమ భవిష్యవాణి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు..పలుకు తల్లీ" అన్నారు

అష్ట భుజి కాసేపు కదలకుండా ఉంది...అకస్మాత్తుగా కదిలి తన ఎనిమిది కాళ్లలో రెండింటిని చాపి ఒక గోళీని అందుకుని దగ్గరగా లాక్కుంది.

కచేరీలో అందరూ హర్షధ్వానాలు చేసారు..

"దానర్ధం ఏమిటి స్వామీ, అష్టభుజీ మాత ఏమంటోంది" అనడిగారు శ్రీవారు కొంచం కంగారుగా

"ఓం తత్సత్, మాత ఏమంటోందంటే, మీరు పుట్టిన ఊళ్లోనూ దాని చుట్టు పక్కల పదకొండూళ్లలో మీకు తిరుగు లేదు...ఆ ఊరికి తూర్పున ఉన్న గ్రామాల్లో వ్యతిరేకత ఉంది...పడమర గ్రామాల్లో తటస్థ వైఖరి ఉంది...మీరు పడమర గ్రామాల మీద దృష్టి కేంద్రీకరించండి...ప్రస్తుతానికి మీరు ఏ మీటింగు కీ స్వయానా వెళ్ళకండి...అది మీ ప్రాణాలకే ప్రమాదం" అన్నారు చిన్న స్వామి

చిన్న స్వామికీ జై...అష్ట భుజీ మాతకూ జై, శ్రీవారికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేసారు భృత్యులు,దాసులు అందరూను

ఈ దృశ్యం చూసి నిశ్చేస్తుడైన రామచంద్రాన్ని తట్టి మేలుకొలికిపి "కొంచం నిజానికి దగ్గరగా ఉండండి...ఎంతసేపు పుస్తక ప్రపంచం లో ములిగి ఉండకండి...శ్రీవారికి విపరీతమైన విషయాలు చెప్పి కంగారు పెట్టకండి...వీలయితే మళ్ళీ మన శ్రీవారి కచేరీకి రాకండి"అంటూ సాగనంపాడు భృత్యుడు

శ్రీవారు స్వీయ సహాయం కోసం రాసే పుస్తకాల్లో లాగా ఎవరేం చెప్పినా అవి తన మనసులోని ఊహలకు దగ్గరగా ఉంటేనే అంగీకరిస్తున్నారు...ఇంక ఆయనకు సమస్యలు తెలుసుకునే సౌలభ్యమూ లేదు, అయన పెరిగే అవకాశమూ లేదు...అంతా మాత అనుగ్రహం…అష్టభుజీ మాతకూ జై అనుకుంటూ బయటకు నడిచాడు రామచంద్రం.  


Rate this content
Log in

More telugu story from శ్రీనివాస్ మంత్రిప్రగడ

Similar telugu story from Abstract