Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

4.8  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Abstract Fantasy Inspirational

భగవత్ దర్శనం

భగవత్ దర్శనం

6 mins
377


వైకుంఠ ఏకాదశి పర్వదినం...ఊరంతా సందడిగా ఉంది...ఆ రోజున ఎదో రకంగా భగవంతుని దర్శనం చేసుకోవాలని తహతహలాడి పోతున్నారు...కుదిరిన వాళ్ళు తిరుమలకు వెళ్లి వైకుంఠ ద్వారం తెరుచుకోవడం చూసి తరించి పోతుంటే... కుదరని వాళ్ళు ఊళ్లోని వేంకటేశ్వరుని దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని పొంగిపోతున్నారు...

ప్రతీవారూ ఎదో రకంగా భగవంతుడి ధ్యాసలో ఉండే ప్రయత్నం చేస్తున్నారు...మరచి పోయిన వాళ్ళనీ, బద్ధకించిన వాళ్ళనీ మెత్తగా మందలించి దార్లో పెడుతున్నారు...

ఊళ్లోని ఒక పెద్దాయన సోమయ్య మాత్రం ఇవేవీ పట్టనట్టు పొలానికి వెళ్లి పనిచేసుకుంటున్నాడు ... అతని పొలం మీదుగా గుడిలోకి, పుట్టల దగ్గరకి వెళ్లి పూజలు చేసుకునే వాళ్ళు చిరాకు పడ్డారు... కొందరు అతడి మీద కోపం వ్యక్తం చేశారు కూడా...ఇంత గొప్ప పర్వదినం నాడు కూడా ఈ విధమైన భౌతిక వాంఛలతో కూడిన పనులా, ఒకరోజు పని చెయ్యక పొతే పైరేమీ ఎండి పోదు కానీ ఇలాంటి పుణ్యదినం మళ్ళీ రాదు కాబట్టి అద్భుతమైన భగవత్ కృపను పొందే అవకాశం మాత్రం సోమయ్య కోల్పోతాడు...కొందరు అతని మీద అరిచారు కూడా...కొంతమంది అతన్ని దార్లో పెట్టడానికి ఉపన్యాసాలు ఇచ్చే ప్రయత్నం చేసారు...

ఎవరేమన్నా సోమయ్య తొణకలేదు బెణకలేదు...తన పని లో నిమగ్నమయ్యాడు...

అతని స్నేషితుడూ, ఊరి పెద్ద అయినా రాజయ్య కలగజేసుకుని "ఒరే సోమా, నీ సంగతి నాకు చిన్ననాటి నుంచే తెలుసు...కానీ సమయంతో బాటు మనం కూడా మారాలి, నీ స్వార్ధం కోసం కాకపోయినా ఊరి కోసం ప్రార్ధించ వచ్చు కదా" అనడిగాడు

"రాజా, నేను చేస్తున్నది కూడా ప్రార్ధనే, మీరు రకరకాల రూపాల్లో ప్రతిష్టించిన భగవంతుడి శక్తిని పూజిస్తుంటే, నేను ప్రాణమున్న జీవులను మొక్కల రూపం లో, చెట్ల రూపం లో గోవుల రూపం లో ఇంకా చిన్న చిన్న పురుగుల రూపం లో ఉన్న భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...మన పూర్వికులు పెట్టిన పండుగ రోజుల్లో సమస్త జీవులకూ మంచి శక్తి పాతం కలిగి బాగుంటారు, ఆ శక్తిని మంచి పనులకు వినియోగించడం కన్నా గొప్ప పూజ ఇంకేమి ఉంటుంది...నువ్వేం చింత పడకు, చక్కగా ప్రార్ధన చేసుకో" అన్నాడు సోమయ్య

అతడు అందరూ నడిచే దారిలోకి రాకపోవడం నిరాశకలిగించినా, మొండివాడిని రాజు కూడా ఏమీ చెయ్యలేడని అతడిని వదిలేసి తమ పూజల్లో నిమగ్నమయ్యారు అందరూ...  

ఊరి చివర ఆశ్రమం లో కూడా సందడి గా ఉంది...ప్రత్యేక పూజలూ. ప్రజా క్షేమం కోసం హోమాలూ, అభిషేకాలూ ఎన్నో చేస్తున్నారు స్వాముల వారు...శిష్యులందరూ ఈ మహా ఘట్టాన్ని కనులారా చూడడమే కాకుండా అందులో తాము కూడా భాగమైనందుకు సంతోషిస్తున్నారు...

ఆ సాయంత్రం స్వామి ప్రజలను ఉద్దేశయించి ప్రసంగించారు...

"నాయనలారా, ఈ వైకుంఠ ఏకాదశీ పర్వదినాన మీ అందరిమీదా ఆ దేవదేవుడు అనుగ్రహం ఉండాలని మనసారా ప్రార్ధిస్తున్నాను...మీ అందరూ కూడా మీ మీ ప్రార్ధనలు స్వామి వారికి నివేదించడం చుస్తే ఎంతో సంతోషం కలిగినా...కించిత్తు అసంతృప్తి కూడా కలుగుతోంది.. ఎవరి జీవితాన్ని వాళ్ళు బాగుచేసుకోవడం చాలా ముఖ్యం...ఆలా వ్యక్తి సౌఖ్యం చూసుకోవడం తో సమాజ సౌఖ్యం కూడా కలుగుతుంది....

అయితే మనలో కొందరు జీవులు పూర్వ కర్మలను క్షయం చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడే జన్మను పొందుతారు...దానివల్ల తరువాత జన్మలలో సౌఖ్యం కలిగినా ఈ జన్మలో ఆ కష్టాలు అనుభవించడానికి అవస్థలు పడుతుంటారు...

మనమందరమూ మన జీవితాలు దిద్దుకుంటూనే, అలాంటి వాళ్లకు సేవచేయడం ఎంతో గొప్ప విషయం...

మేమందరమూ అలాంటి సేవ చెయ్యడానికి గొప్ప జీవితాలు వదిలి వచ్చాము...నేను దేశంలోనే గర్వించదగ్గ విద్యాలయం నుంచి గొప్ప డిగ్రీలు సంపాదించి ఎన్నో మంచి ఆవిష్కరణలు చేసి సన్యసించాను...ఇక్కడున్న శిష్యగణం లో వైద్యం అభ్యసించిన వారున్నారు, ఇతర రకాల గొప్ప విద్యలు నేర్చుకున్నవారున్నారు...మేమందరమూ ఆ మిరుమిట్ల ప్రపంచం వదిలి కష్టాల్లో ఉన్నవారికి సేవచెయ్యడానికి పూనుకున్నాం...

భౌతిక మైన పనులు మీకు మీరే చేసుకోగలరు, మీకు భగదనుగ్రహం కలగడానికి మేం ప్రార్ధన చేస్తాం...

మీరు కూడా అలాగే భౌతికమైన విషయాలను ఎంతకావాలో అంతే చేసి ఆధ్యాత్మిక విషయాల మీదకు దృష్టి మళ్ళించు కోండి...

మీ గ్రామంలో కొందరి లాగ నాకు తోచినదే ప్రార్ధన, నేను చేసేదే సేవ అంటూ విపరీత ధోరణులు తీసుకోకండి" అన్నారు గురువు గారు

తమకు ఎన్నో మంచి విషయాలు చెప్పడమే కాకుండా సోమయ్య లాంటివాళ్ల జీవితాలు పాడవుతాయేమో అన్న ఆందోళన అయన మాటల్లో ధ్వనించి ప్రజలను ముగ్ధులను చేసింది...

స్వామి వారి ఉపన్యాసం విని వెనక్కొస్తుండగా, ఊరి టీచర్ గారి అబ్బాయి, పదేళ్ల వాడిని పాము కరించింది...

జనం అందరూ హాహాకారాలు చేస్తూ పాముని చంపే ప్రయత్నం చేస్తున్నారు... అక్కడున్న బండరాళ్ల మధ్యకు వెళ్లి దాక్కుంది పాము...

గిల గిల లాడుతూ ప్రాణాపాయంలో ఉన్నాడు పిల్లవాడు, రాళ్ల మధ్యలో ప్రాణభయం తో ఉంది పాము...

ప్రజల హాహాకారాలు విని స్వామీ అయన శిష్యులూ కూడా అక్కడకు చేరుకున్నారు...

ప్రజలను శాంతింప జేసి పిల్లవాడి నోట్లో విభూతి వేశారు గురువు గారు...ప్రయోజనం ఏమీ కనపడ లేదు...

లేచి నిలబడి కళ్ళెర్ర జేసి "ఒసే పామూ ఇలా అకారణంగా పిల్లవాడి జీవితం అకస్మాత్తుగా ముగించే హక్కు నీకు లేదు, ఆ పనిని మేము అంగీకరించటం లేదు, నీ విషం నీవు తీసుకో" అంటూ నీళ్లు జల్లుతూ గర్జించారు స్వామి

పాము మాత్రం ఇంకా లోపలకు దూరి ముడిచి పెట్టుకుని కూర్చుంది...ఏం చెయ్యాలో ఎవ్వరికీ అర్ధం కావటం లేదు...దగ్గరలో ఆస్పత్రీ లేదు, ఊళ్ళో డాక్టర్ కూడా లేదు

గ్రామ పెద్ద రాజయ్య కలగజేసుకుని, స్వామీ మీ ఆశ్రమం లో వైద్య విద్య తెలిసిన వాళ్ళున్నారన్నారు కదా, వాళ్ళేమీ సాయం చేయలేరా" అనడిగాడు

"వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళదగ్గర వైద్య పరికరాలూ, మందులూ ఏవీ లేవు కదా, మనందరమూ ప్రార్ధన చేద్దాం, ఆ శివుని అనుగ్రహం తో పాము తన విషాన్ని తీసేసుకుంటుంది" అన్నారు స్వామి

అందరూ భగవన్నామాన్ని భక్తి తో జపించ సాగారు...కొంత సమయం గడిచింది...పిల్లవాడి మీద ఈ ప్రార్ధనల ప్రభావం ఏమీ కనబడటం లేదు...బాధతో, వికారంతో పొర్లుతున్నాడు కుర్రవాడు...

ఇంతలో విషయం తెలిసిన సోమయ్య అక్కడకొచ్చాడు...భగవన్నామాన్ని జపిస్తున్న ఊరి ప్రజలనూ, ఆశ్రమవాసులనూ చూసాడు, నేల మీద పడి నొప్పితో మూలుగుతున్న కుర్రవాడిని చూసాడు, రాళ్ల మధ్యలోని పాముని చంపేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు కుర్రాళ్లను చూసాడు...

ఒక్క క్షణం అలోచించి, పెద్ద గొంతుకతో అందరినీ కొంచం దూరం జరగమన్నాడు సోమయ్య...

దైవ భక్తి చూపించుకోవడం విషయం లో కోపం ఉన్నా, ఊళ్ళో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కలుగజేసుకునే సోమయ్యంటే అందరికీ గౌరవం... మాట్లాడకుండా దూరం జరిగారు...

పాముని చంపడానికి ప్రయత్నించే మూకను దూరం గా పొమ్మని కసిరాడు...అందరూ దూరం జరిగారు....

కుర్రవాడి దగ్గర కూర్చుని పాము కరిచిన చోట చూసాడు, అక్కడ రెండు కోరల గుర్తులు లేవు, అనేక వరసల పళ్ళ గాట్లు ఉన్నాయి. తన చేతుల్లోని మరచెంబు తెరిచి నీళ్లు తీసి ఆ పళ్ళ గాట్లను బాగా కడిగాడు...లేచి రాళ్ల మధ్యలోంచి చెట్లలోకి వెళ్ళాడు...అందరూ నివ్వెరపోయి చూస్తున్నారు...ఆ రాళ్ల మధ్యలోనే పామున్నది, ఈ సోమయ్య ఆ రాళ్ల వెనక్కి ఎందుకు వెళ్ళాడో అని భయపడ్డారు...

కాసేపట్లో తిరిగి వచ్చాడు సోమయ్య, అతని చేతిలో ఏవో ఆకులున్నాయి...ఆ ఆకులను తన బలిష్టమైన చేతులతో నలిపి ముద్ద చేసాడు, ఆ ముద్దలోంచి ఒక చిన్న ముక్క తీసి పిల్లవాడి తల్లికి ఇచ్చి పట్టుకో మన్నాడు...

మిగిలిన ముద్దను ఎక్కడైతే పాము పళ్ళ గుర్తులున్నాయో అక్కడ దట్టంగా రాసి, తన పైపంచె లోంచి ఒక గుడ్డ ముక్క చింపి గట్టిగా కట్టు కట్టాడు...

పిల్లవాడి తల్లి దగ్గర నుంచి ఆ ఆకు ముద్ద తీసుకుని, చిన్న చిన్న గుళికల్లాగా చేసాడు.

పిల్లవాడిని కూర్చో పెట్టి, ఒక గుళిక నోట్లో వేసి చప్పరించి రసం పీల్చ మన్నాడు...ఒకసారి చెయ్యగానే పిల్లవాడు భళ్ళున వాంతి చేసుకున్నాడు...ఆశ్రమం లో తిన్న ప్రసాదం బయటకు వచ్చేసింది...

కొద్దిగా నీరు తాగించి, కుర్రవాడు కొంచం స్థిమిత పడగానే మరో గుళిక వేసాడు...పిల్లవాడు మళ్ళీ వాంతి చేసుకున్నాడు, ఈ సారి కొంచం ముద్దగా కొన్ని రసాలు బయటకు వచ్చాయి...

మళ్ళీ నీళ్లు తాగి కూర్చున్నాడు కుర్రవాడు...అతని మోహంలో వెలుగు కనిపిస్తోంది, ఇబ్బంది లేకపోవడం వల్ల అతని మోహంలో నవ్వు తిరిగి వస్తోంది...

ఆ పని అవ్వగానే, సోమయ్య లేచి రాళ్ల దగ్గరకు వెళ్ళాడు...నెమ్మదిగా ఏవో మాట్లాడుతూ ఆ రాళ్ల మధ్యలో చెయ్యదూర్చి కాసేపట్లో పాముని బయటకు తీసాడు...

అందరూ హాహాకారాలు చేసారు...సోమయ్య చెయ్య ఎత్తి ఆపమన్నాడు...

రాళ్ల వెనక్కు వెళ్లి ఆ పాముని దూరంగా చెట్లలో వదిలి వచ్చాడు...

"పిల్లవాడిని రక్షించి మంచి పని చేసావు, కానీ ఆ పాముని వదిలెయ్యడం ఎంత ప్రమాదమో తెలుసా, మళ్ళీ ఎవరినైనా కాటేస్తే?" అనడిగాడు రాజయ్య కోపంగా...

"ప్రకృతిలో ఎటువంటి ప్రచోదనమూ లేకుండా హాని తలపెట్టేది మానవుడు మాత్రమే...ఆ పాములు జీవిస్తున్న ప్రాంతాల్లోకి మనం వచ్చి మసలాము, తమకు ప్రాణహాని ఉందేమో అని ఆ పాములు భయపడి కాటు వేసేందుకు వచ్చాయి" అన్నాడు సోమయ్య

"మనిషి ప్రాణం కన్నా పాములెక్కువా, అన్యాయం కదా" అన్నాడొక మధ్యవయస్కుడు

"ఈ సృష్టిలో అన్ని జీవులూ సమానమే. మనిషిని సృష్టించిన దైవమే అన్నిరకాల జీవులను సృజించాడు. ఆ జీవ వైవిధ్యం మానవ సౌఖ్యానికి కూడా చాలా ముఖ్యం...మానవుడే మహా శక్తిమంతుడు కానీ అంత ప్రమాద కారి కూడా...మానవుడు ఈ ప్రకృతికి చేసే అపకారం కన్నా ఎక్కువ అపకారం ఏ శక్తీ మానవుడికి చెయ్యలేదు...మనం ఈ కొత్త జీవితం లో ప్రకృతి నుంచి దూరమై పోవడం తో మనకు మిగిలిన అన్ని జీవుల్లోనూ శత్రువులు కనిపిస్తున్నారు...ఆ భయం వల్ల మనం మిగిలిన జీవులను చంపే ప్రయత్నం చేసి జీవ వైవిధ్యానికి దిద్దుకోలేని ప్రమాదం తలపెడుతున్నాం" అన్నాడు సోమయ్య

"అంటే విషప్పురుగులు కూడా దేవుడి సృష్టే కాబట్టి ఏమీ చెయ్య వద్దంటావు...మా పిల్లలని చూస్తూ చూస్తూ ప్రమాదాలకు లోను చెయ్యలేం కదా" అన్నాడో మధ్యవస్కుడు

"వీరయ్యా, ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఈ కుర్రవాడిని కరిచిన పాము విషపూరితమైనది కాదు, ఈ కుర్రవాడి కాళ్ళ మీద చూడు, కోరల ముద్రలు లేవు, పళ్ళగుర్తులు ఉన్నాయి...అలాంటి పాముని శత్రువుగా భావిస్తున్న మీకు మనశాంతి ఏ భగవంతుడూ ఇవ్వలేడు" అన్నాడు సోమయ్య

"అది నిజమేనయ్యా, కానీ పరంధాముడే అవసరమైనప్పుడు శత్రువులని చంపాడు కదా...మనిషికి తన మనుగడను మించిన ధర్మం ఏముంటుంది" అనడిగారు స్వామి

"మనిషి మనుగడకు ప్రకృతి కూడా అవసరమే స్వామీ...పరంధాముడు శత్రువుని చంపాడు...కానీ సాధారణ జీవులను చంపలేదు...ఇప్పడి మనిషికి అన్ని జీవులూ శత్రువుల్లాగానే కనిపిస్తున్నాయి, ఎందుకంటే ప్రకృతి శక్తులతో దూరం పెరిగిపోయింది, మనిషికి మనిషి సాయమే ఉండటం లేదు, ఇక ఇతరజీవులకు సాయం అందుతుందా? " అన్నాడు సోమయ్య

"అందరూ ఆలా ఉండరు...మా ఆశ్రమం లో అందరూ గొప్ప గొప్ప జీవితాలు వదులుకుని సేవ చెయ్యడానికి వచ్చారు, అంతకన్నా గొప్ప విషయం ఏముంది?" అనడిగారు స్వామి 

"మీ అందరూ నిజంగా ఇతరుల మంచి కోరుకుని ఉంటె ఇక్కడ ఒక గొప్ప శక్తి తయారయ్యేది, మేమందరమూ ప్రకృతి తో లయించి పోయి మనశాంతితో బతికే వాళ్ళం కానీ ఆలా జరగటం లేదు, మా నమ్మకాలు మా శక్తుల మీద కాకుండా దైవం మీద, మంచి రోజులమీద, ముహూర్తాల మీద పెరుగుతున్నాయంటే మీ శక్తి మాకు మనోధర్యం ఇవ్వటం లేదనే కదా స్వామీ" అన్నాడు సోమయ్యా

నివ్వెర పోయారు గురువు గారు...కళ్ళు మూసుకుని చేతులు జోడించి నిలబడ్డారు

 "మిమ్మల్ని అనాలని కాదు గాని స్వామీ, ఒకసారి సన్యసించి దీక్ష నామం తీసుకున్నాక ముందు జీవితంలోని గొప్పకు విలువ ఉండదు, మీ చదువులన్నీ మీరు సాధారణ మానవులుగా ఉన్నప్పటివి, ఇప్పుడు దీక్ష తీసుకున్నాక మీరు ప్రకృతి లో లీనమై జీవించాలి, కానీ మీరు ఆ పాత గొప్పలు వదులుకో లేకపోతున్నారు. దాని వల్ల మీ దీక్ష ఫలించి భగవత్ దర్శనం దొరకటం లేదు " అన్నాడు సోమయ్య

"ఎంత ధైర్యం నీకు, మానవజాతి సంక్షేమం కోసం సన్యసించిన స్వామినే అంత మాట అంటావా" అంటూ కోపంగా ముందుకొచ్చారు శిష్యులు

చెయ్య ఎత్తి వాళ్ళను వారించారు గురువుగారు...చేతులు జోడించి నమస్కారం చేస్తూ "సోమయ్యా, నువ్వు మా అందరికన్నా ధన్యమైన సాధకుడివి....ప్రకృతిలో లీనమైన నీకు అర్ధం అయినట్టు జీవిత రహస్యాలు మాకు అర్ధం కాలేదు....నువ్వు ప్రకృతి లోంచి మందులు తీసి ప్రమాదాన్ని తప్పించావు, మాలో వైద్య విద్య అభ్యసించిన వాళ్ళు ఆ విద్యకు అవసరమైన సాధనాలు లేకపొతే ఏమీ చెయ్యలేక పోతున్నారు...ఇకపైన మేము మా ఆశ్రమంలోని పద్ధుతులు మర్చి ప్రకృతికి దగ్గరవుతాం...మా వైద్యులు మీతో బాటు తిరిగి ప్రకృతి విద్య అభ్యసిస్తారు...ఈ విధంగా మీరు మాకే గురువులయ్యారు" అన్నారు నమస్కరిస్తూ

"అంత మాట అనకండి స్వామీ, మీ వల్ల సమాజం సంఘటితం అవుతోంది...ఆ సమూహ బలాన్ని సరైన దారిలో నడిపిస్తే అదే విశ్వ మానవ శ్రేయస్సుకి దారి తీస్తుంది...మీ పద్ధతులూ, అభిజాత్యపు ఉపన్యాసాలూ విని బాధపడి మీ ఆశ్రమానికి వచ్చే వాడిని కాదు...

కానీ మీ మారిన మీ మాటలు వింటుంటే మీలో ఇప్పుడు నిజమైన దైవం కనిపిస్తున్నాడు...ఈ కొత్త మార్గం మన ఊళ్ళో అందరూ పాటించేలా చేద్దాం, దానికోసం నావంతు సాయం చేసేందుకు నేను కూడా ఆశ్రమానికి వచ్చి పనిచేస్తాను" అన్నాడు సోమయ్య గురువుగారికి నమస్కరిస్తూ

"శుభం" అన్నారు గురువుగారు...ప్రజలందరూ ఇళ్ళదారి పట్టారు 


Rate this content
Log in

More telugu story from శ్రీనివాస్ మంత్రిప్రగడ

Similar telugu story from Abstract