STORYMIRROR

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Comedy Drama Action

4.7  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Comedy Drama Action

పోనీ డైరెక్షన్ చెయ్యమనరాదా

పోనీ డైరెక్షన్ చెయ్యమనరాదా

6 mins
394


భళ్ళున తెల్లారింది... ఈ కోవిడ్ కాలం లోమనుషులు ఇళ్లల్లో కలుగుల్లోలా ముడుచుకోవడం కలుగుల్లోని జీవులు రోడ్లమీద స్వేచ్ఛగా విహరించడం జరగడంతో అక్కడక్కడా ముసుగు వీరులు కనిపిస్తున్నా.... రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి

ఈ లోకం మనిషిదొక్కడిదేకాదు కాదు సమస్త జీవరాసులదీ అనిపిస్తోంది ... పాల్ గిల్డింగ్ ఏమంటాడో ... ఎదో అనేవుంటాడు ఈ గృహనిర్బంధం వల్ల మనం వినలేదు...

శ్రీ శ్రీ గారైతే అననే అన్నారు "మహారణ్యాల్లో మధ్యాహ్నం లాగా ఒక స్తబ్దత నిశ్శబ్దత అని ... ఎప్పుడేనా ఒక పక్షి ఎగిరితే ఒక ఆకు రాలి చప్పుడు,...

ఎలాగూ ఆఫీసుకు పోవక్కర్లేదు కాబట్టి తాపీగా బాల్కనీ లో కుర్చీ వేసుక్కూచుని ఉదయపు పిల్ల గాలి పీలుస్తూ పుస్తకం చదువుకుంటూ నవ్వుకుంటున్నాడు రామరాజు

ఇంతలో ఫోన్లో వీడియో కాల్ వచ్చింది ... వీరాజు దగ్గరనించి

"ఏరా ...ఫోన్ తీసి పలకరంచాడు రామరాజు ... అతని మొహంలోనూ గొంతులోనూ కొద్దిగా నవ్వు ధ్వనిస్తోంది

"పొద్దున్నే అంత మంచి విషయమేం దొరికిందిరా... హాయిగా నవ్వుకుంటున్నావ్?" అడిగాడు వీర్రాజు

"ముళ్ళపూడి వారి కథొకటి చదువుతున్నా ... ఎన్నోసారో గుర్తులేదు.. భలే మాట దొరికింది ..." అన్నాడు రామరాజు

"ముళ్ళపూడి వారి కథల్లో అలాంటివి కోకొల్లలుగా దొరుకుతాయి ...మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిశితంగా పరిశీలిస్తూ పొతే అయన రాసిన ప్రతీ లైను కీ ఉదాహరణలు దొరుకుతాయి" అన్నాడు వీర్రాజు "ఇంతకీ ఇవాళ నిన్ను ఆకట్టుకున్నదేమిటి?" అడిగాడు

"విక్రమార్కుడి మార్కు సింహాసనం లోని పోనీ డైరెక్షన్ చెయ్యమనరాదా నాన్నా అనే ఒక్క స్టేట్మెంట్ చాలు .. మన ఉద్యోగ పర్వమంతా విశ్లేషించడానికి " అన్నాడు రామరాజు

“అది నాక్కూడా ఇష్టమైన డైలాగే ..నువ్వు ఏ సందర్భం లో పరవశిస్తున్నావ్" అడిగాడు వీర్రాజు

"లాలారాం పడిన సమస్యలో పడిన శేషుగారు ఆ సమస్యని లాలారాం కొడుకు సలహా వాడుకుని పరిష్కరించాడు .. ఆ విషయం గుర్తుకొచ్చి " అన్నాడు రామరాజు

"వెనుకబెంచి శేషు అనేవారు ఆయనే కదా?" అడిగాడు వీర్రాజు

"అవును ఆయనే.., నిజానికి అయన అద్భుతమైన స్టూడెంట్ .... కాలేజీలో ఆయనే ఫస్ట్...కానీ ఆయనకి స్టేజి మీద మాట్లాడటం అంటే చచ్చే భయం ... అందుకనే వెనకాల దాక్కునే వాడు ... అందుకని ఆయన్ని వెనుకబెంచి శేషు అనేవారు" విశ్లేషించాడు రామరాజు

ఆయనకోసారి ఒక సమస్య వచ్చింది ... పార్థ అనే ఒక స్నేహితుడు ఒక అభ్యర్థి ని పంపించి "మన స్నేహం కోసం నువ్వు ఈ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి తీరాలి " అని ఒక చిన్న చీటీ కూడా పంపించాడు...

పార్థ మన శేషుగారికి గ్లాసు మిత్రుడు ... అంత ముఖ్యుడి కోసం ఏమైనా చెయ్యాలి ... ఉద్యోగం చాల చిన్న విషయం “ వివరించడం ప్రారంభించాడు

"మంచి కాండిడేటే అయ్యుంటుంది... ఉద్యోగం ఇచ్చేసాడా?" కుతూహలంగా అడిగాడు వీర్రాజు

“ముళ్ళపూడి వారి కథలోని లాలారాం లాగానే శేషుగారికి ఇదో చిక్కు అయి కూర్చుంది..ఆ అమ్మాయికి తనక్కావలసిన ఏ విషయంలోనూ ప్రవేశం లేదు" ఆపాడు రామరాజు

"ఆ అమ్మాయి కూడా ఏదైనా సరే చేసేస్తాను అందా" అనడిగాడు వీర్రాజు 

తలూపాడు రామరాజు...తన కథను కొనసాగించాడు "శేషు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చేసాడు ...అక్కడ్నించి మొదలైయింది సర్కస్ ...

ఆ పిల్లని అందరితో బాటు ట్రైనింగ్ లో పెట్టేసాడు ...అది అయిపోయిన తర్వాత అందరూ వాళ్ళవాళ్ళ పనులు చెయ్యడం మొదలెట్టారు ...

మన అమ్మడుకి మాత్రం శిక్షణ ఒక శిక్ష లా అనిపించినట్టుంది... ఆవిడ గడియారం ఎక్కువ , బోర్డు కంప్యూటర్ స్క్రినూ తక్కువ చూసేది .... ట్రైనింగ్ అయ్యేటప్పడికి ఆవిడ ఏమీ నేర్చుకోలేదు"

అవిడకు అప్పగించిన పనులు అయ్యేవి కాదు ... కస్టమర్లు గొడవచేసే వారు" గాలి పీల్చుకోవడానికి ఒక్క క్షణం ఆగాడు రామరాజు

"అంత ఆవేశం ఎందుకురా? మెల్లిగా చెప్పు " అన్నాడు వీర్రాజు

"కొన్నిసంఘటనలు అంతేలే ... పారవశ్యం కలిగించేస్తాయి ... "నవ్వాడు రామరాజు

"ఆ పిల్లకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇవ్వమని తన టీంలో ఉన్న మంచి కుర్రాళ్లకు అప్పగించాడు... రెండు... మూడు... అయిదు వారాలై పోతోంది ..ఆవిడకి ఒక్క ముక్క కూడా ఒంట బట్టలేదు" కథని ఒక రసత్తవర ఘట్టానికి తీసుకెళ్లాడు రామరాజు

"ఆ పిల్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి పెట్టిన కుర్రాళ్లు సెలవులు పెట్టి పారిపోయారు ... శేషు ఇరుక్కున్నాడు" అన్నాడు రామరాజు…బాగా అయ్యిందిలే అన్న భావన అతని మొహం లో కొట్టొచ్చినట్టు కనపడుతోంది

“శేషు కి ఇద్దరు జూనియర్ మేనేజర్ లు ఉండేవారు ... వాళ్ళు ఆయనకి ఎంత భక్తులంటే వాళ్ళని కుడి ఎడమ భుజాలు అనేవారు" ముందుకు సాగాడు రామరాజు

"నాకు తెలుసు ... సుందోపసుందులు అనేవాళ్ళం " అన్నాడు వీర్రాజు

"ఆ పిల్లకు ఎటువంటి పని ఇవ్వొచ్చు...ఆవిడకి ట్రైనింగ్ ఎలా ఇవ్వొచ్చు అనేవిషయమై శేషు కుడి ఎడమ భుజాలతో అత్యవసర సమావేశం నిర్వహించాడు ...

అప్పటి వరకు ఏమి చెయ్యాలో పాలుపోని కుడి ఎడమ భుజాలు "ఆవిడకి ట్రైనింగ్ ఇవ్వడం అంత అవసరమా సార్? " అడిగారు ముక్తకంఠం తో

"మరి ఎలా వాడుకోవడం? ఊరికే కూర్చోపెట్టి జీతం ఇస్తే మిగతావాళ్ళు ఏడుస్తారు" అన్నాడు శేషు

"ఓ పని చేద్దాం సార్ " మొదెలెట్టాడు కుడి భుజం "ఆవిడకు కొన్ని ప్రోగ్రామ్లు ప్లాన్లో వేసేద్దాం ... కానీ అవి మనమందరం పంచుకుని చేసేద్దాం" అని ముగించాడు. ఒక అద్భుతమైన సలహా ఇచ్చిన హావ భావాలూ అతని మొహం లో స్పష్టంగా కనపడుతున్నాయి

“శభాష్ అది చాల మంచి ఐడియా" మురిపెంగా చూస్తూ అన్నాడు శేషు

"మరి రేపు పెద్దాయన చుస్తే? ఆవిడేమీ చెయ్యటం లేదని గొడవచేస్తారేమో? అదీగాక మనకు కొన్ని తలనెప్పులు కూడా ఉన్నాయి కదా?" అన్నాడు ఎడమ భుజం…ఆ సంఘటను తలచుకుని నవ్వాపుకుంటూ కథ చెప్పడం ఆపాడు రామరాజు

"ఆ తలనెప్పివి నువ్వేనా?" ముసిముసి నవ్వులు నవ్వుతూ అడిగాడు వీర్రాజు . నవ్వుతూ తలూపాడు రామరాజు

“మరేంచేసారు శేషుగారు?" అడిగాడు వీర్రాజు

“ఒక్క నిముషం ... అది కొంచం సుదీర్ఘంగా చెప్పాలి ... మధ్యలో డిస్టర్బ్ చెయ్యకు" అన్నాడు రామరాజు కాసిని నీళ్లు తాగుతూ...కథను కొన సాగించాడు

"శేషు

ఆషామాషీ మనిషి కాదు .. అపర చాణ్యుక్యుడు ... ఒక ఎత్తేసాడు...తరవాతి వారం మేనేజ్మెంట్ మీటింగులో ఒక ముఖ్యమైన విషయం లేవదీశాడు

"మన ఇంజినీర్లు బ్రహ్మాండం గా పనిచేస్తున్నారు ... ఒక్కొక్కొడు ఒకటిన్నర మంది పెట్టు " అని ప్రారంభించాడు

"అద్భుతం శేషూ ... టీం నుంచి పని తెచ్చుకోవడంలో నీకు నువ్వే సాటి " పొగడ్తల్లోకి దిగాడు జీతభత్యాలు చూసే అబ్బరాజు

"కానీ ఒక సమస్య వస్తోంది, వీళ్లకి కేవలం పనే కానీ ఇంకేం ఇవ్వటంలేదు మనం " అన్నాడు శేషు

"అంటే? జీతాలు ఇస్తున్నాం కదా " అని ప్రారంభించాడు పెద్దాయన...వాళ్లకు వినోదం కూడా ఇవ్వాలంటావా? " అని కంప్లీట్ చేసాడు

"అవును, నెలొక్కసారి ఒక హోటల్ కి తీసుకెళ్లడం లాంటివి కొంత తాజాతానం ఇస్తాయి కానీ ఇలాంటి ఎక్కువ పని చేసే టీంలకు అదొక్కటే చాలదు…కొంచం ఎక్కువసార్లు కలగజేసుకుని ఏదైనా చెయ్యాలి " అన్నాడు శేషు

"అది కష్టం మాత్రమే కాదు ... చాల ఖర్చుతో కూడుకున్న పని " అన్నారు ఆర్ధిక శాఖ చూసే రెడ్డిగారు

"మొదట్లో చిన్నచిన్న పనులు చేద్దాం .... కొంచం బడ్జెట్ ఇవ్వండి ... నేను ఆలోచిస్తాను " అన్నారు శేషు గారు

"శేషు ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి... బడ్జెట్ ఇచ్చేశాం " అన్నారు అబ్బరాజు గారు" గొంతు సరిచేసుకోవడానికి ఆపాడు రామరాజు

"శేషుగారు దేవాంతకుడురా" ఆరాధనగా అన్నాడు వీర్రాజు

కథని ముందుకు సాగించాడు రామరాజు 

“మర్నాడు శేషు టీం మీటింగ్ పెట్టాడు ... దాంట్లో మొదట టీం ను పొగిడాడు , పెద్దాయన చేస్తున్న సేవ త్యాగం గురించి చెప్పాడు, అబ్బరాజు గురించి కూడా నాలుగు మంచి మాటలు చెప్పాడు ... ఇంటెగ్రేషన్ చూసే నరసింహం ఎంత గొప్పవాడో గుర్తు చేసాడు..వాడు అబ్బరాజుగారికి పెంపుడు కొడుకు లాంటివాడు కదా అందుకు కొంచం అసందర్భమైనా వాడి విషయం చెప్పాల్సినదే ... ఆ తరవాత అసలు విషయానికి వచ్చాడు”

"మనమందరం చాలా కష్టపడి పనిచేస్తున్నాం ... దానివల్ల మన టీం పేరు విదేశీ కస్టమర్ల దగ్గర మారుమోగిపోతోంది .. మనం అది నిలబెట్టుకోవాలి .. అంటే మనకు కొంచం ఎక్కువ ప్రేరణ కావాలి " అన్నాడు

అవును అవును అంటూ అరుపులు సాగించారు కుడి ఎడమ భుజాలు ... ఆ కేకలతో ఉత్సాహం వచ్చి మిగిలిన వాళ్ళు కూడా కేకలు వేశారు

"అద్భుతం... మనం ఒక కమిటీ వేద్దాం .. దానికి నేను పెద్దాయన దగ్గర్నుంచి కొంత బడ్జెట్ తెస్తాను .. మనం రోజూ ఒక సరదాయైన పని పెట్టుకుందాం ... చిరుతిళ్ళు తినడం .. అందరం కలిసి రోడ్డు చివర్న వున్నటీ స్టాల్ లో టీ తాగడం... టీం సినిమాలు ఆలా చాలా చెయ్యొచ్చు " ఊరించాడు శేషు

"భలే ఐడియా సార్ ... మాకు ఇలాంటి విషయాలు తట్టవెందుకో " పొగడ్తలు అందుకున్నాడు కుడి భుజం” నవ్వాపుకోలేక కథను ఆపుచేసాడు రామరాజు

"ఈ సుందోపసుందులు మనుగడ తెలిసిన వాళ్ళు రా" కొంచం చిలిపిగా నవ్వాడు వీర్రాజు

"మరి కుడి ఎడమ భుజాలవ్వాలంటే అంత సులభం కాదు" అన్నాడు రామరాజు

"ఇంకావినూ” ఉత్సాహంగా సాగించాడు...”ఇది అంత సులభమైన విషయమేం కాదు ... మనకు చాలా పని వుంది ... బిజీ గా వున్నాం ... ఇదంతా కొంచం ప్లాన్ చేసి చెయ్యాలి" అన్నాడు శేషు గారు

అందరు అంగీకరించారు ... మీటింగ్ ముగిసింది

తరవాత రెండురోజులు శేషు , కుడి ఎడమ భుజాలూ , ఆ పిల్లా మీటింగులు చెయ్యడం కనపడింది అందరకూ

మూడ్రోజుల తరువాత మరో టీం మీటింగు పెట్టాడు శేషు

“మనం అనుకున్న చిన్న చిన్న వినోద కార్యక్రమాలకి ఒక ప్లాన్ చేద్దాం .. పెద్దాయన బడ్జెట్ కూడా ఇచ్చేసారు " అని ప్రారంభించాడు.

అందరూ సంతోషించారు ... శేషుగారి ముందుచూపుకి పెద్దాయన దయాగుణానికి డంగై పోయారు

ఇదంతా మన కోసం చెయ్యడానికి మన కొత్త సహాధ్యాయి ఆ పిల్ల అంగీకరించింది ...అందరూ అభినందించండి " అంటూ చప్పట్లు కొట్టాడు శేషు

“అద్గదీ మాట ... శేషుగారు ఒక అద్భుతం" అన్నాడు వీర్రాజు టీవీ రీ ప్లే లో అయినా పాకిస్తాన్ బాట్స్మన్ భారత బౌలర్ చేతిలో అవుటైతే చూపించేలాంటి సంతోషం తో

“నిజం... అలాంటి ఐడియాలు అయనకి మాత్రమే వస్తాయి" అన్నాడు రామరాజు. అతని మోహంలో కూడా కొంత ప్రశంసాత్మకమైన భావాలూ కనిపిస్తున్నాయి

“ఆలా ఆ పిల్ల ఏ పని చెయ్యకుండానే గొప్ప పేరు సంపాదించుకునే ఏర్పాటు జరిగింది ... ఆవిడకు సమన్వయకర్త అనే గంభీరమైన పేరు పెట్టి మాన్యుల్లో కలిపేసాడు శేషు " కథను ముగించాడు రామరాజు

"ఇందులో సమస్య ఏముందిరా? అంతా బాగానే ఉందిగా? " అడిగాడు వీర్రాజు

"ముందు బాగానే మొదలైయింది ...తరవాత ఆవిడ పెద్దలకు దగ్గరవడం చూసి ఆవిడ ద్వారా తమ విన్నపాలు పెద్దలకు సమర్పించుకోవచ్చునని కొందరు మేధావులు కనిపెట్టారు ... దానివల్ల ఆవిడ ఇంకా మాన్యురాలైపోయింది ..."ఆపాడు రామరాజు

"ఇదే బావుంది అని కొందరు పనిచేసే కుర్రాళ్ళు పని తగ్గించుకుని సమన్వయం చేసే ప్రయత్నాలు చేసి భంగ పడ్డారు " నవ్వుతూ కొనసాగించాడు

"అంటే ఈ ఉదంతం వల్ల మనకేం తెలుస్తుందంటే,

బాగా పనిచెయ్యడం చేతనైతే "ఎవరున్నారు బ్రోవ" లాంటి త్యాగరాజు కీర్తనలు పాడుకుంటూ పని చెయ్యాలి ...

కొంచం పని తెలిసి “ఎంతని నుతియింతు” లాంటి అన్నమాచార్యుల కీర్తనలు బాగా వస్తే కుడి ఎడమ భుజాలు అవ్వొచ్చు...

అసలేం చేత కాకపోతే సమన్వయం చేస్తూ మాన్యుల్లో కలిసిపోవచ్చు" అన్నాడు వీర్రాజు

"నిజం!!! కొంతమంది సిన్సియర్ గా పనిచేసే సామాన్యులు ఇది చూసి చిరాకుపడి పని తగ్గించుకుని మరింత సామాన్యుల్లో కలిసిపోయారు " అన్నాడు రామరాజు

"టాలెంట్ పిరమిడ్ కిందనుంచి పైకెళ్తుందనుకొంటా ...బాగా పైన పెద్దాయన లెవెల్లో తెలివైనవాళ్లు వుంటారు...ఆకింద కుడి ఎడమ భుజాలూ , సమన్వయకర్తలూ అలాంటివాళ్ళు ఉంటారు ...

బాగా ప్రోగ్రామింగ్ చెయ్యగలిగే వాళ్ళు అన్నిటికంటే కింద వరసలో ఉంటారు...

అది నడిచిన్నాళ్ళు బానేవుంటుంది .. కింద వాళ్ళకెవరైనా తలనెప్పులు తెప్పిస్తే ఇబ్బంది " నవ్వాడు వీర్రాజు కొంచం వేళాకోళంగా

“శేషుగారు తలనెప్పులకే తలనెప్పి ... అంచేత సమస్యేమీలేదు" ముగించాడు రామరాజు

"ముచ్చట బ్రహ్మాదులకు దొరకునా" అని పాడుకుంటూ ఫోన్ కట్ చేసాడు వీర్రాజు 


Rate this content
Log in

Similar telugu story from Comedy