శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Action Inspirational

4.5  

శ్రీనివాస్ మంత్రిప్రగడ

Drama Action Inspirational

ఎక్కడి మానుష జన్మము

ఎక్కడి మానుష జన్మము

5 mins
1.2K


సాయంత్రమయ్యింది...రోడ్డంతా వాహనాలతో రద్దీగా ఉంది... ఆ రద్దీ కి ధీటుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు సందడి చేస్తూ రోడ్డు కనిపించకుండా చేస్తున్నారు…

కొంత మంది రోడ్డు పక్కనే బల్లలు వేసి రంగు రంగుల బట్టలు అమ్ముతున్నారు...

కొన్ని దుకాణాల్లో వివిధ ఆకారాల్లో, రంగుల్లో ఉన్న బాగ్ లు వేలాడేసి రోడ్డున పోయే వాళ్ళని ఆహ్వానిస్తున్నారు,

ఈ దుకాణాల మధ్య అక్కడక్కడా చిన్న చిన్న హోటళ్ళ వాళ్ళు చిరుతిళ్ళు నోరూరించేలా పరిచి పెట్టి రోడ్ల మీద పోయేవాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు...

అక్కడి ఒక కూడలి లో రోడ్డుకి అటూ ఇటూ పానీ పూరీ తట్టలు పెట్టుకుని జయ విజయుళ్ళ లా నిలబడిన కుర్రాళ్లు నాకంటే నాకని తొందర పడుతున్న జనాల ఆకు దొన్నెల్లో మసాలా నింపి నీళ్లలో ముంచిన పానీ పూరీలు గబా గబా పెడుతూ లెక్క గుర్తు పెట్టుకుంటున్నారు...

మెల్లగా వెళ్తూ వెనకవాళ్లను చిరాకు పెట్టే వాళ్ళూ...హడావుడి గా హారన్ మోగిస్తూ ముందుకు దూసుకు పోవడానికి ప్రయత్నించే వాళ్ళూ...తప్పు దారి లో వస్తున్న వాళ్ళు... రోడ్డు మీద అడ్డంగా వాహనాలు ఆపుకుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్న వాళ్ళూ…చిరాకు పడుతున్న వాళ్ళూ...రోడ్డు మీద బట్టలు బేరమాడుతున్న వాళ్ళూ...పక్కగా పెట్టి ఉన్న అనుకరణ వాచీలు, రేడియోలు చిత్రంగా చూస్తూ నించున్న వాళ్ళూ...రకరకాల మనుష్యులతో రోడ్లన్నీ రద్దీ గా ఉన్నాయి

ఆ రోడ్ల గుండా మెల్లిగా పోతున్న ఒక క్యాబ్ లో కూర్చున్న వీర్రాజు నిదానంగా ఉన్నాడు ...ఈ టైములో ఇలాగే ఉంటుందని అతనికి తెలుసు...

“రైలు ఎన్ని గంటలకు సార్” అనడిగాడు క్యాబ్ డ్రైవర్...

“ఇంకా రెండు గంటలుందిలే కంగారేమి లేదు..నువ్వు ప్రశాంతం గా పోనీ" అన్నాడు వీర్రాజు

“దూకుడుగా వెళదామన్నా రోడ్డేది సార్” అన్నాడు క్యాబ్ డ్రైవర్ నవ్వుతూ...వీర్రాజు కూడా నవ్వాడు ”నీ పేరేమిటి.. ఏ ఊరు” అనడిగాడు

“నా పేరు కృష్ణ సార్... ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పల్లెటూరు సార్…ఇంటర్ వరకు చదివాను...ఇప్పుడు ప్రైవేటుగా డిగ్రీ చేస్తున్నాను...నా బతుకు నేను బతకాలి కదా సార్ దానికి తోడు నన్ను నమ్ము కున్న రెండు ప్రాణాలు...వాళ్ళని కూడా పోషించాలి కదా...అందుకే ఈ క్యాబ్" అన్నాడు కృష్ణ 

"మంచి పని చేస్తున్నావ్...ఎవరినో తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా మనం చెయ్యగలిగే పని చెయ్యడం గొప్ప విషయం" మెచ్చుకోలుగా అన్నాడు వీర్రాజు

"ఇంత ముందు గా బయల్దేరారు...ఒక గంట స్టేషన్లో నిరీక్షించాలి పరవాలేదా" అనడిగాడు కృష్ణ

"ఏమి పరవాలేదు...ఆఖరి క్షణంలో హడావుడి పడడం నాకిష్టం ఉండదు...అందువల్లే రైలు సమయం కన్నా ఒక గంట ముందే చేరేలా బయల్దేరాను ...అదృష్టం బావుండి తొందరగా చేరిపోతే ఆ గంటా స్టేషన్ లో గడపవచ్చు...కొంచం లేటైనా రైలు అందదేమో అనే కంగారు ఉండదు..."అన్నాడు వీర్రాజు

క్యాబ్ నెమ్మదిగా పోతోంది...వెనక నుంచి, పక్క నుంచి హారన్లు మోత పెడుతున్నాయి ....ఈ మధ్య జనానికి ఆగలేని తనం ఎక్కువై పోయింది అనుకున్నాడు రోడ్డు మీదకు చూస్తూ...

అకస్మాత్తుగా రోడ్డుకి రెండో వైపు ఒక పక్కగా నడుస్తున్న బక్క పలుచని ముసలమ్మని గుద్దేసి ఒక మోటార్ సైకిల్ కుర్రాడు తుర్రు మన్నాడు...ముసలమ్మ కింద పడింది.. తలకు దెబ్బ తగిలింది...కొద్దిగా నెత్తురు వస్తోంది...

రోడ్డు మీద వెళ్తున్న మిగతా వాహనాలు ఆమెను తప్పించుకుని వెళ్లే ప్రయత్నం లో ఒకళ్ళకి మరొకళ్ళు అడ్డువచ్చి హారన్ ల మోత పెడుతున్నారు కానీ ఆమెకు చెయ్యి ఇచ్చి లేవదీసే వాళ్ళెవ్వరూ లేరు...

వాహనాలకు అడ్డు వచ్చినందుకు తానేదో తప్పు చేసినట్టు ఎంతో సిగ్గు పడుతూ ..మెల్లిగా లేచేందుకు విఫల యత్నం చేస్తోంది ముసలమ్మ ...

అది చూసి ఊరుకోలేక వీర్రాజు "ఆపు ఆపు అంటూ కంగారు పెట్టాడు కృష్ణ ని "రోడ్డుకి అటువైపు ఆపు"అంటూ అరిచాడు

"మనకెందుకు సార్...మీ రైలు టైం అయిపోతుంది...ముందుగా బయలు దేరిన ఫలం దక్కదు ...మళ్ళీ కంగారు పడాలి...ఇలాంటివి ఇక్కడ మాములే సారూ...ఆ ముసలిదాన్ని వాళ్ళ కుటుంబమే వదిలేసింది... మీరూ నేనూ ఏమి చెయ్యగలం?" అడిగాడు కృష్ణ

"చెప్తా...ముందు పక్కన ఆపు...ఆగలేక పొతే ఇక్కడ తో ట్రిప్ పూర్తి చేసేయ్ డబ్బులు ఇచ్చేసి దిగిపోతాను" అన్నాడు వీర్రాజు కొంచం కోపంగా

"సరే సార్ ఆగుతాను" అన్నాడు క్యాబ్ డ్రైవర్ కొంచం విసుగ్గా

అతని విసుగుని పట్టించుకోకుండా క్యాబ్ దిగి ముసలమ్మ దగ్గరకు వెళ్ళాడు వీర్రాజు ...చెయ్య ఇచ్చి లేవదీశాడు...పక్కకు తీసుకెళ్లాడు...అక్కడున్న టీ స్టాల్ బల్ల మీద కూర్చో పెట్టాడు

టీ స్టాల్ యజమాని అడ్డం చెప్తుంటే..అతని వైపు శాంతంగా చూసాడు వీర్రాజు... అతని కళ్ళలోని శక్తి టీ స్టాల్ యజమానిని ఆపేసింది...

"కంగారు పడకు...ఒక గ్లాస్ లో కొంచం వేడి నీళ్లు ఇవ్వు" అన్నాడు వీర్రాజు టీ స్టాల్ యజమానితో...

కృష్ణ కూడా తలాడించాడు...అదిచూసి కొంచం తగ్గి ఒక గ్లాస్ లో వేడి నీళ్లు ఇచ్చాడు టీ స్టాల్ అయన

తన రుమాలు వేడి నీళ్ళల్లో ముంచి ముసలమ్మ నుదిటిమీద తగిలిన గాయాలు నెమ్మదిగా తుడిచాడు వీర్రాజు...తన లాప్ టాప్ బాగ్ లోంచి చిన్న ఫస్ట్ ఎయిడ్ బాగ్ తీసి ఆంటిసెప్టిక్ క్రీం తీసి ఆ దెబ్బలకు రాసాడు ...ఒక బ్యాండేజ్ అంటించాడు..

"రెండు టీలు ఇవ్వు కాకా" అన్నాడు టీ స్టాల్ యజమాని వైపుకి తిరిగి...

ఒక టీ తాను తీసుకుని రెండోది క్యాబ్ డ్రైవర్ కి ఇచ్చాడు...తన చేతిలోని టీ ముసలమ్మకు ఇచ్చాడు...ఒక పెయిన్ కిల్లర్ మాత్ర ఇచ్చి టీ తో వేసుకోమన్నాడు...

మాత్ర వేసుకుని టీ తాగి కొంచం కుదుట పడింది ముసలమ్మ...

టీ స్టాల్ యజమాని చేతిలో వంద రూపాయలు పెట్టి "నేనివ్వాల్సిన డబ్బులు పోను మిగిలిన డబ్బులోంచి ఈ అమ్మకు రాత్రి భోజనం పెట్టు...తరువాత ఆమె ఎక్కడికి వెళ్లాలంటే అక్కడకి వెళ్తుంది.".అన్నాడు

"మిగిలిన చిల్లర బాబూ"అనడిగాడు టీ స్టాల్ ఆయన...వీర్రాజు చూపించిన సహృదయత చూసి కొంచం కదిలాడు…మెత్త పడ్డాడు…

"అది నీకే..నీ టీ స్టాల్ బల్ల ఒక ఇరవై నిముషాలు వాడుకున్నాం కదా" అంటూ నవ్వాడు వీర్రాజు...

ఆ ముసలమ్మ తల మీద ఒక సారి చెయ్యి పెట్టి...వెనక్కొచ్చి క్యాబ్ లో కూర్చున్నాడు...

ఆ ముసలమ్మ తల ఎత్తి చూడలేదు...తల దించుకుని దిగులుగా కూర్చునే ఉంది...

క్యాబ్ తీసి బయల్దేరాడు కృష్ణ "మీరింత సాయం చేస్తే కనీసం దణ్ణమైన పెట్టలేదు ఆ అమ్మ" అన్నాడు

"దణ్ణం పెట్టించుకునే అంత సాయం మనమేమీ చెయ్యలేదులే...బతికి చెడ్డ మనిషి అనుకుంటాను...తప్పనిసరై మన సాయం తీసుకుందేమో...పోనిలే" అన్నాడు వీర్రాజు

"మనం ఇక్కడ దాదాపు అరగంట గడిపాము...నాకు ఒక బేరం...మీకు విలువైన సమయం వృధా అయ్యాయి...పోనీ ఆ అమ్మకు ఏమైనా పెద్ద సాయం జరిగిందా అంటే అది లేదు" అన్నాడు క్యాబ్ డ్రైవర్

"ఈ సాయం ఆవిడ జీవితాన్ని మార్చేది కాదు...అసలు ఎవరూ వేరొకరి జీవితాన్ని మార్చలేరు…ఎవరికి వాళ్లే మార్చుకోవాలి " అన్నాడు వీర్రాజు

"మరి మనకెందుకు సార్ ఈ బాధ...ఎందుకు ఈ ట్రాఫిక్ లో ఆగడం...ఆ టీ స్టాల్ కాకా కు వంద రూపాయలు ఇవ్వడం, అయినా ఇలాంటి వాళ్ళు లక్షల్లో ఉంటారు...మీరు చేసిన ఈ చిన్న సాయం వల్ల ఆ జీవితాలు మారవు కదా" అనడిగాడు కృష్ణ

"ఈవిడ జీవితం మారుతుంది కదా...అది చాలు…ఆ వయసు వాళ్ళకి ఎవరూ తనని పట్టించుకోరు అనే భావన చాలా దుర్భరంగా ఉంటుంది...ఈ ప్రపంచం లో ఎదో ఒక సమయంలో ఆవిడ కూడా ఒక కుటుంబం లో ముఖ్య పాత్ర అయ్యుంటుంది కదా...

పరిస్థితుల ప్రభావం వల్ల ఈ పరిస్థికి చేరింది…ఇప్పుడు తనీ ప్రపంచానికి అక్కరలేదు అనే భావన ఆవిడ జీవించినంత కాలం వేధిస్తుంది...తనకు తానే భారమౌతుంది "అన్నాడు వీర్రాజు

నిజమే అన్నట్టు చూసాడు కృష్ణ...అతని మొహం లో వీర్రాజు పట్ల చాలా గౌరవం ఏర్పడినట్టు కనిపిస్తోంది

"ఇప్పుడు కనీసం ఆవిడకు మనుషుల మీద కొంచమైనా సదభిప్రాయం ఉంటుంది...అదే ఆవిడ బతకడానికి ఆలంబన” అన్నాడు వీర్రాజు

"అవును సార్...మనిషి కి మనిషే సాయం" అన్నాడు కృష్ణ

“నిజమే…కానీ ఏ మనిషీ ఇంకొకళ్ళని జీవితాంతం భరించలేడు... అందరికీ వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటాయి కదా " అన్నాడు వీర్రాజు

“నిజమే సార్...తనకు మాలిన ధర్మం కూడ దంటారు...కానీ మనం చేయగలిగినంత సాయం చెయ్యడం చాలనుకుంటాను సార్" అన్నాడు కృష్ణ 

"అవును...ఈ ప్రపంచం అన్నా ఈ సమాజం అన్నా మనకి నమ్మకం గౌరవం ఉండాలి...అది లేక పొతే మానవ జీవితం దుర్భరమైపోతుంది" అన్నాడు వీర్రాజు

"నేనిలా ఆలోచించలేదు సారూ...ఇప్పుడు మీరంటుంటే గుర్తుకొస్తోంది...ఒక్కోసారి సరైన బేరాలు రావు...ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లి మా పాపకు ఏమి పెట్టాలా అని బాధపడుతుంటాను...

ఆ క్షణంలో ఈ ప్రపంచం మీద ఒక పెద్ద బాంబు వేసి నేను కూడా చచ్చి పోవాలనుకుంటాను...

అంతలో నా స్నేహితుడో...ఈ కారు ఓనర్ గారో వాళ్ళ జేబులోంచి కొంత డబ్బు సద్దుతారు...

మళ్ళీ జీవితం మీద ఆశ కలుగుతుంది...పోరాడదామనే ధైర్యం వస్తుంది...

నేనెప్పుడూ ఆ విషయాన్ని ఇంత స్పష్టం గా ఆలోచించలేదు...ఇప్పుడు మీరంటుంటే అనిపిస్తోంది" అన్నాడు కృష్ణ

"మనకే ఆలా ఉంటే...బలం లేక...ఆదుకునే దాతలు లేక ఆ ముసలి ప్రాణాలు ఎంత బాధ పడతాయో ఆలోచించు...వాళ్ళను బిచ్చగాళ్లలాగా డబ్బులు చేతిలో పెట్టి అవమానించకూడదు...

వాళ్ళు జీవితాల్లో ఎన్నో చూసి ఉంటారు కదా…వాళ్ళ వ్యక్తిత్వాలు ఎంతో బలంగా ఉంటాయి…

వాళ్ళకి కావాల్సిన ధైర్యం ఇవ్వాలి...వాళ్ళు తమ జీవనం కోసం ఈ ప్రపంచంతో పోరాడతారు…అదే ఇప్పుడు నేను చేసిన పని" అన్నాడు వీర్రాజు

"మంచి మాట చెప్పారు సార్" అన్నాడు కృష్ణ

స్టేషన్ వచ్చింది...క్యాబ్ దిగి వచ్చిన బిల్లు చూసాడు...బిల్లు కంటే ఒక వంద రూపాయలు ఎక్కువ ఇచ్చాడు...

"వద్దు సార్...ఆ అమ్మను చుస్తే మా అమ్మ గుర్తుకొచ్చింది...ఆమెకి నా సాయం అనుకుంటాను" అన్నాడు కృష్ణ

"మంచి ఆలోచనే...కానీ ఈ డబ్బు తీసుకో...ఇది నీకు అలాంటి పరిస్థితులలో మనిషికి మనిషే సాయం అని గుర్తుచేస్తుంది"అన్నాడు వీర్రాజు స్టేషన్ లోపలకి నడుస్తూ

టాక్సీ ముందుకు సాగి పోయింది మరో మనిషిని వెతుక్కుంటూ...ఈ సంఘటన వల్ల కనీసం ఈ టాక్సీ డ్రైవర్ కృష్ణ అయినా మారితే మంచిదే అనుకున్నాడు వీర్రాజు

రైల్వే స్టేషన్ లో లౌడ్ స్పీకర్ లోంచి "ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది

నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను" అంటూ అన్నమాచార్య అద్భుత గీతం బాల కృష్ణ ప్రసాదు గారి గంభీరమైన గొంతులో శ్రావ్యంగా వినిపిస్తోంది


Rate this content
Log in

Similar telugu story from Drama