Rama Seshu Nandagiri

Drama

4.1  

Rama Seshu Nandagiri

Drama

కొలీగ్

కొలీగ్

6 mins
1.0K


"రాధా, ఆఫీస్ టైం అవుతోంది. త్వరగా రా." నవీన్ పిలుపు కి "ఇదిగో, వస్తున్నా." అని జవాబు చెప్తూనే గబగబా ఇంటికి తాళం వేసి మెట్లు దిగింది రాధ.


వెంటనే స్కూటర్ తీసి పోనిచ్చాడు నవీన్. నవీన్ రాధని ఆఫీస్లో దిగబెట్టి తన ఆఫీసు కి వెళతాడు. ఇద్దరివీ ఒకే టైమింగ్స్ కావడం కూడా బాగా కలిసివచ్చింది. వెళ్ళేటప్పుడు కూడా తనే పికప్ చేసుకుని వెళ్తాడు.


రోజులేవో సాఫీగా వెళ్తున్నాయి అనేసరికి నవీన్ కి చెన్నై వెళ్ళి అక్కడ ఆఫీస్ లో ఒక నెల పని చేయాలని ఆర్డర్స్ వచ్చాయి. రాధకి దిగులేసింది. ఈ నెల అంతా ఒక్కర్తే ఉండాలని. దానికి సమాధానంగా తన తల్లి దండ్రులను పిలిపించాడు నవీన్. ఇంట్లో వాళ్ళు తోడుంటారు, ఆఫీస్ కి ఎలాగా అని ఆలోచనలో పడింది రాధ. ఏమాలోచించినా అప్పుడే ఏదో ఒక దారి చూసుకోవచ్చని, నవీన్ ని ఇంకా ఇబ్బంది పెట్టలేక తాను ఆఫీస్ కి వెళ్ళగలనని ధైర్యం చెప్పి పంపించేసింది. కానీ, నిజానికి తాను రోజూ ఆటో కానీ, కేబ్ కానీ ఎక్కి వెళ్ళాలి. అవి ఎక్కాలంటేనే రాధకి భయం.


మరునాడు రాధ ఆటో బుక్ చేసుకొని ఆఫీస్ కి వెళ్ళింది. వెళ్ళి రావడానికి అంత డబ్బులు పెట్టాలంటే బాధ అనిపించింది. కానీ ఏం చేయాలి. తప్పదు, అనుకుంటూ ఆఫీస్ లో అడుగు పెట్టింది.


తిరిగి వెళ్ళే టైం అవుతూండడం తో మళ్లీ ఏదో ఒకటి బుక్ చేయాలని రాధా ఫోన్ చేతిలోకి తీసుకుంది.


ఇంతలో కొలీగ్ సురేష్ వచ్చి " ఏం మేడం, ఇంకా బయలుదేర లేదా. సార్ గురించి వెయిటింగా?" అన్నాడు.


"లేదు సురేష్. ఆయన‌ చెన్నై వెళ్ళారు. ఆటో కోసం ట్రై చేస్తున్నా." అంది రాధ.


"మేం ఉన్నాంగా. మాతో రావచ్చుగా. అయినా మీ లాంటి గొప్ప వాళ్ళు మా బండి ఎక్కుతారా!" నిష్టూరంగా అన్నాడు సురేష్.


"అలా ఎందుకనుకుంటారు సురేష్! " నొచ్చుకుంది రాధ.


"అప్పుడేదో తెలియక మీ వెంట పడినందుకు ఇంకా మీరు నన్ను క్షమించినట్లు లేదు." అన్నాడు సురేష్.


"అయ్యో, అదేం లేదు. నేను అప్పుడే ఆ విషయం మర్చి పోయాను." అంది రాధ చిన్నగా ‌నవ్వి.


"అదే నిజమైతే మీరు నాతో రావచ్చుగా. నేను మీ ఇంటి వైపే కదా ఉండేది." అన్నాడు సురేష్.


"ఎందుకు రాకూడదు, రావచ్చు. విషయ మేమిటంటే, మీరు మా ఇంటికి దగ్గరగానే ఉన్నారన్న విషయం మర్చిపోయాను. మీరడిగే వరకు నాకు గుర్తు లేదు. మీకేం ఇబ్బంది కాదంటే రాను, పోను మీతోనే వస్తాను. సరేనా." అంది రాధ నవ్వుతూ.


"అంతకన్నా భాగ్యమా! అది మా అదృష్టం. దేవీ గారు అంగీకరిస్తే రెండు పూటలా మా అదృష్టం ఉన్నంత కాలం సేవ చేసుకుంటాం." అన్నాడు సురేష్ నాటకీయంగా.


"ఆ అతి వద్దు. ఇద్దరం ఒకే ఆఫీస్, ఒకే‌ దగ్గర ఉంటున్నాం, కాబట్టి ఒకరి కొకరు‌ సహాయం చేసుకుంటే మంచిది. దానికింత డ్రామా అవసరమా." అంది రాధ కొంచెం ‌కోపంగా.


"సారీ, సారీ రాధా, అలవాటు లో పొరపాటు. ఏదో ‌ఫ్రైండ్స్ తో అన్నట్లు అనేసాను. ఏమనుకోకండి. ఇంక మీదట ఎటువంటి తప్పు నా మాటల్లో కానీ, చేతల్లో కానీ దొర్లదు. మళ్ళీ మళ్ళీ సారీ చెప్తున్నాను." అన్నాడు సురేష్.


"ఇంక వదిలేయండి. సరే, మీ పని అవగానే చెప్పండి. బైలుదేరదాం. నా పని అయిపోయింది." అంది రాధ.


"నాదీ అయిపోయింది. వెళ్దామా." అడిగాడు సురేష్.


"సరే, పదండి." అంటూ సురేష్ ని అనుసరించింది రాధ.


ఇంటికి చేరే వరకు ఏమీ మాట్లాడలేదు ఇద్దరూ. దిగిన వెంటనే అతనికి థాంక్స్ చెప్పి మర్నాడు ప్రొద్దున్న బైలుదేరేముందు ఫోన్ చేయమంది రాధ. సరేనంటూ గుడ్నైట్ చెప్పి వెళ్ళి పోయాడు సురేష్.


ఇంటికెళ్శగానే అత్తగారు ఇచ్చిన టీ తాగి కొంచెం రిలాక్స్ అయి ఆవిడతో కబుర్లు చెబుతూ వంట పూర్తి చేసింది రాధ. భోజనాలు అయ్యాక వంట గది సర్ది బెడ్ రూం లో కి వెళ్ళి ఫోన్ చేతిలోకి తీసుకుందో లేదో నవీన్ కాల్ వచ్చింది. వెంటనే కాల్ తీసి ఆరోజు జరిగిన విషయాలన్నీ ఏకరువు పెట్టింది రాధ. సురేష్ విషయం కూడా పొల్లు పోకుండా చెప్పింది.


అంతా విన్న నవీన్ " సురేష్ విషయం లో జాగ్రత్త రాధా. వాడిని నేను కాలేజీ డేస్ లో కూడా ఎరుగుదును. నీకొచ్చిన భయం లేదనుకో. నీ వెనక నేనున్నాను. వాడు దుర్మార్గుడు కాక పోయినా పట్టుదల కలవాడు. వాడు కోరింది సాధించేదాకా

వదలడు. నీ విషయంలో ఒక‌సారి భంగ పడ్డాడు. నేను కూడా అక్కడ లేను. అందుకే జాగ్రత్త చెపుతున్నాను." అన్నాడు


"ఫర్వాలేదండీ. నేను జాగ్రత్తగా ఉంటాను. ౕమీరు

టెన్షన్ పడకండి." అంటూ అలాగే ఏవో కాసేపు

మాట్లాడు కొని పడుకున్నారు.


కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచి పోయాయి. రాధ సురేష్ తో కలిసి ఆఫీసు కి వెళ్లి వస్తోంది. మూడు వారాలు గడిచాయి. వచ్చే వారంలో చెన్నై లో పని పూర్తి చేసుకుని నవీన్ తిరిగి వచ్చేస్తాడు.


ఆరోజు సోమవారం. సురేష్ తను శెలవు తీసుకున్నానని ఫోన్ చేయడం తో రాధ ఆటో లో ఆఫీస్ కి వెళ్ళింది. ఆటో దిగి లోపలికి వెళ్తుంటే "ఈ రోజు లిఫ్ట్ దొరికినట్లు లేదు, అమ్మగారు ఆటో లో వచ్చారు ." ఏవరివో మాటలు చెవిన పడ్డాయి.


చురుగ్గా అటువైపు చూసింది రాధ. ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు పక్క ఆఫీస్ వాళ్ళేమో కామెంట్స్ ‌చేస్తున్నారు. ఆవేశంగా వాళ్ళ దగ్గర కు వెళ్లి తిడదామనుకుంది. అంతలో మళ్లీ ఆ ఆలోచన విరమించుకొని ఆఫీస్ లోకి దారి తీసింది.


వాష్ రూమ్లో కి వెళ్లి చేతులు, ముఖం కడుక్కుని ‌యథాలాపంగా బైటికి చూసింది. ఇందాకటి కుర్రాళ్ళతో సురేష్ నవ్వుతూ మాట్లాడుతూన్నాడు. పథకం అర్థమైంది. వీళ్ళని ప్రవేశ పెట్టింది సురేష్. తన దారిలో వాళ్ళ చేత అడ్డమైన వాగుడు వాగించి తనని ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నాడు. తన భర్త ఊరిలో లేక పోవడం, తను అతని‌ సహాయాన్ని కొలీగ్ అనే ఉద్దేశ్యంతో అంగీకరించడం అతనికి అవకాశం ఇచ్చినట్లైంది. దీనికి విరుగుడు ఏదైనా చేయాలని ఒక నిశ్చయానికి వచ్చింది. వెళ్ళి తన జాగా లో కూర్చుంది.


ఇంతలో పక్క సీటు కావేరి వచ్చి "చూసావా, మంచి వాడన్నావ్. ఇలాగే ఏదో ఒక పని చేస్తాడని అనుకుంటూనే ఉన్నా. చూడు, ఎలా చేశాడో. ఆ పక్కనే ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు నీ గురించి కామెంట్స్ ‌చేస్తున్నారు. ఇదంతా వాడి ప్లాన్." అంది రాధతో కోపంగా.


"ఎవరో ఏదో అనుకుంటే ఈ రాధ భయపడదు. నువ్వు కూడా ఏ టెన్షన్ పడకు." అంది రాధ ప్రశాంతంగా.


"అసలు భయం లేదేమే నీకు?". అంది కావేరి ఆశ్చర్యంగా.


"భయపడితే ఇంకా భయపెడతారు. చూస్తూ ఉండు. నేనేం చేస్తానో. " అంటూ తన సీట్లో కి వెళ్లి కూర్చుంది రాధ.


కాసేపు తర్వాత ‌సురేష్ ఆఫీస్ ‌కి వచ్చాడు. రాగానే ‌రాధ దగ్గరికి వెళ్లి ‌"సారీ రాధ ‌గారూ. పని మీద బైటికి వెళ్ళాను. అందుకే శెలవు ‌కూడా‌ పెట్టాను. కానీ ఈ రోజు ‌పని కాలేదు. రేపు వెళ్ళాలి. సాయంత్రం కలిసి ‌వెళ్దాం లెండి. ఉదయం మీకు ఇబ్బంది కలీగించాను." అన్నాడు ‌అపాలజిటిక్ గా.


"అయ్యో, దాందేముందండీ. ఎవరి పనులు వారికి ఉండవా. అంత ‌మాత్రానికేనా!" అంది నవ్వుతూ.


మధ్యాహ్నం లంచ్ తర్వాత సురేష్ కి ‌రాధ కనపడలేదు. సాయంత్రం ‌వెళ్ళేటప్పుడు‌ ఎవరినడగాలా ‌అని ఆలోచిస్తూండగా‌ కావేరి వచ్చి "ఏమిటి సురేష్, రాధ కోసమా. తాను ఈ రోజు లంచవర్లో పర్మిషన్ తీసుకుని వెళ్లి పోయిందే. మీకు చెప్పలేదా. అయినా వెళ్ళేటప్పుడు మీరు కనపడలేదు తనకి. బైట కనపడితే చెప్తానంది, మీరు బైట కూడా లేరేమో, వెళ్ళి పోయుంటుంది." అంది.


"ఆ. అదేం‌లేదు. రోజూ వస్తున్నారు కదా‌అని..." అంటూ నసుగుతూ వెళ్ళి పోయాడు సురేష్.


అతను ఇంటికి వెళ్ళేసరికి ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి తన భార్య శశి ది. రెండో గొంతు కూడా తెలిసినట్లు గానే ఉందే అనుకుంటు న్నాడు.


ఇంతలో తన భార్య శశి గొంతు "వదినా, మీరేం బాధ పడకండి. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. అవన్నీ పట్టించుకో కూడదు. అయినా ఈ కాలం ఎలా ఉంది? అన్నా చెల్లి వెళ్తుంటే నే పేర్లు పెడతారు. మీరిద్దరూ ఒకే ఆఫీస్ కదా మరి. మీరేం అనుకోకండి. ఇక్కడ నేను అక్కడ అన్నయ్య గారు మీ ఇద్దరినీ మనస్ఫూర్తిగా నమ్ముతాం. మీకేం ఫర్వాలేదు." అంటూ ఠంగున

వినిపించింది.


ఏదో అర్థం చేసుకోబోయేంతలో రాధ మాట "వదినా, మీరు నన్ను నమ్మారు, కాబట్టి సరి పోయింది. మావారికి నా మీద నమ్మకముంది. నేనే స్వయంగా వచ్చి మీకు చెప్పాను కాబట్టి సరిపోయింది. అదే మరెవరైనా వచ్చి మా గురించి చెప్తే, మీరు నమ్మారనుకోండి. నా పరిస్దితి ఏం కాను? ఆఫీస్ లో తలెత్తుకుని తిరగద్దు! ఉద్యోగం మానేసే పరిస్థితి ఏర్పడునేమో!." ఏడ్పు గొంతు తో వినిపించింది.


శశి ఊరడిస్తూ "అయ్యో, వదినా, అంత మాటనకండి. మనం ఒకే ఏరియా లో ఉన్నాం. అలా బాధ పడకండి." అంటూ బైటికి చూసింది. అక్కడే ఉన్న సురేష్ ని చూసి "అదుగో, మీ అన్నయ్య వచ్చారు. వాళ్ళ గురించి ఆయనకు చెప్పండి. ఒక చూపు చూస్తారు." అంటూ


"అదేమిటి, అలా ఉండి పోయారు! రాధ గారు. రండి లోపలికి." అంటూ ‌చేతిలోని బ్యాగ్ ‌అందు కొనే సరికి ఏమనలేక "అరే మీరా, ఇల్లెలా తెలిసింది! భలే వచ్చారే." అన్నాడు నవ్వలేక నవ్వుతూ సురేష్. "ఏదో పని ఉందని లీవ్ తీసుకున్నారట. ఇక్కడ తేలేరేంటి?" మళ్ళీ తనే ఆరా గా అడిగాడు.


"మా ఫ్రెండ్ అర్జెంటుగా రమ్మంటే వెళ్ళాను. నేను, తను కలిసి పని మీద బైటికి వెళ్ళాల్సి ఉంది. కానీ నేను వెళ్ళేసరికి ఇంటికి చుట్టాలు ‌రావడంతో మా ప్రోగ్రాం ‌వాయిదా పడింది. మా ఇంటికెళ్ళే సరికి అత్త గారు, మామ గారు బైటికి వెళ్ళినట్లు న్నారు, తాళం ఉంది. సరే, ఏం చేయాలో తోచక మీ ఇంటికి వచ్చాను. సారీ అండి. మీకు ముందుగా చెప్పకుండా వచ్చాను." అంది రాధ.


"అయ్యో, దానికేముంది". అని నసిగాడు సురేష్.


కాఫీ ట్రే తో వచ్చిన శశి "అదేంటి వదినా, ఆ వెధవల గురించి చెప్పడానికి మొహమాటం దేనికీ. ఏవండోయ్, మీ పక్క ఆఫీస్ లో వాళ్ళెవరో మీ ఇద్దరినీ చూసి కామెంట్స్ ‌చేస్తున్నారుట. కాస్త వాళ్ళ సంగతి చూడండి. అన్నయ్య ఊరిలో లేరనే కదా, పాపం‌మీతో ఆఫీస్ కి వెళ్ళేది! ఆవిడ ఆ విషయం నాకు చెప్పడానికే చాలా బాధ పడ్డారు. ఇంక ముందు ఇలాంటి మాట రాకుండా మా ఆడపడుచుని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడే చెప్తున్నా." అని ఆర్డర్ వేసింది.


సురేష్ కి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లైంది. కక్క లేక, మింగ లేక "అయ్యో శశీ, నువ్వంతగా చెప్పాలా. మా చెల్లి బాధ్యత నాది కాదూ." అన్నాడు.


వెళ్ళొస్తానని చెప్పి రాధ ఇంటి కెళ్ళి బాగా నవ్వుకుంది. రాత్రి ఫోన్ లో ఈ విషయాలన్నీ భర్త ‌నవీన్ కి చెప్పి మళ్ళీ నవ్వుకుంది.

మర్నాటి నుండి సురేష్ ఆమెని "చెల్లెమ్మా" అని పిలవడం గమనించి మనసారా నవ్వుకుంది.


మరునాడు ఆఫీస్ లో కూడా చాలా మర్యాదగా చెల్లెమ్మా అంటున్న సురేష్ ని చూసి కావేరి "ఏం చేశావే తల్లీ, ఏమిటింత మార్పు!" అంది ఆశ్చర్యంగా.


జరిగిన విషయం అంతా రాధ చెప్పగా విన్న కావేరి బాగా నవ్వింది. " మంచి గుణపాఠం చెప్పావే. మంచి పనైంది గురుడికి." అంటూ మళ్ళీ నవ్వింది. రాధ ఆలోచనను మెచ్చుకుంది.Rate this content
Log in

Similar telugu story from Drama