Venkata Rama Seshu Nandagiri

Inspirational

4  

Venkata Rama Seshu Nandagiri

Inspirational

లక్ష్యం

లక్ష్యం

2 mins
485


"ఒరేయ్ విశ్వం, నువ్వు చేసేది నాకు నచ్చలేదురా. అంతవసరమా! ఎందుకు చెప్పు?" అంటున్నాడు విశ్వం స్నేహితుడు రఘు.


"తప్పేంటి రా. నా మనసుకి అనిపించింది చేస్తున్నాను. ఇందులో నచ్చకపోవడానికేముంది? అయినా నేను చేసేదానిలో నీకేం తప్పు కనిపిస్తోంది" అన్నాడు విశ్వం.


"అదికాదురా. నువ్వు ఒక్కడివే కొడుకువి. నువ్వేదో పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో ఉంటే

చూడాలని ఎంతో ఆశపడుతున్నార్రా బాబాయ్, పిన్ని. నువ్వు వాళ్ళ గురించి ఆలోచించవేం." అన్నాడు రఘు.


ఇంతలో అక్కడికి మరో స్నేహితుడు వాసు హడావుడిగా వచ్చాడు.


"ఒరేయ్ విశ్వం, పావనికి పెళ్ళి కుదిరిందటరా.

ఇప్పుడే మా చెల్లి, మా అమ్మతో చెపుతూంటే

విన్నాను. " అన్నాడు వగరుస్తూ.


రఘు తీక్షణంగా విశ్వంవైపు చూశాడు. "అయితే నీ నిర్ణయానికి కారణం ఇదన్న మాట. పావని నిన్ను కాదన్నాదని, తన మీద కోపంతో ఊరొదిలి పోవడానికి ఈ దారి ఎన్నుకున్నావన్నమాట." అన్నాడు కోపంగా.


"ఒరేయ్ వాసూ, ఎక్కడ లేని కబుర్లు నీకే కావాలిరా. అందరికీ కబుర్లు మోస్తూంటావు. నీకేం పనిలేదు." విసుక్కున్నాడు విశ్వం.


"సిగ్గులేదురా. అమ్మాయి కాదన్నాదని కోపంతో

ఇల్లుని, తల్లిదండ్రులని వదిలి పోవడం! నీ పైనే కోటి ఆశలు పెట్టుకున్నారు నీ తల్లీతండ్రి. నువ్విలా చేయడం సరియైన పనేనా...!? మీ అమ్మకైతే గుండాగి పోతుంది. మీనాన్న సంగతేంటిరా. ఒకే కొడుకువని ముద్దుగా పెంచుకున్నాడు." అప్పుడే అక్కడికొచ్చిన విశ్వం బాబాయ్ మూర్తి కోపంగా అడిగాడు


"అరే! ఏమ్మాట్లాడుతున్నారు మీరంతా! అమ్మాయి

కాదన్నదనే నిస్పృహతో ఊరొదిలి పోతున్నాననా! దేవుడా!! ఎవరింత గొప్పగా ప్రచారం చేస్తున్నారు? అసలు విషయం తెలుసుకోకుండా ఏదేదో అంటున్నారు. ఏరా రఘూ, నువ్వు కూడా అదే అనుకుంటున్నావా?" అనడిగాడు విశ్వం ఆశ్చర్యంగా."మరి! నువ్వు పావనిని ఇష్టపడడం నిజం కాదా!తను నిన్ను కాదనబట్టే కదా, తనకి వేరే సంబంధం చూసి పెళ్ళి నిర్ణయించారు!" అన్నాడు రఘు.


"బాగుంది. అందరికీ బాగానే తలకెక్కింది. చూడు బాబాయ్, నేను ఎవరిమీదనో కోపంతో ఊరొదిలి పోవడం లేదు. తను నన్ను కాదనలేదు. మా రెండిళ్ళల్లో ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ మాటలు ఎవరు పుట్టించారో తెలియదు. అసలు విషయం..." అంటూ చెప్పబోతుంటే విశ్వం తండ్రి రామారావు వచ్చి...


"నువ్వాగు బాబూ, నేను చెబుతాను. మీరన్నది నిజమే. వాడు పావనిని ఇష్టపడ్డాడు. మా రెండు కుటుంబాలు వాళ్ళకి పెళ్ళి జరిపించాలని నిర్ణయించాం. కానీ, ఈ పెళ్ళికి ముందు వాడు ఉద్యోగం లో స్థిరపడాలని కోరుకున్నాడు. అనుకోకుండా వాడికి ఆర్మీ లో ఉద్యోగం వచ్చింది. అందుకు వాడు పెళ్ళికి రెండు సంవత్సరాల సమయం కోరాడు. ఆడపిల్ల వారికి అన్నాళ్ళు ఆగడం కష్టం. అందుకే అమ్మాయి కి వేరే సంబంధం చూసుకోమని చెప్పాడు." అని ఆగాడాయన.


"మరి నువ్వు పావనిని ఇష్టపడ్డావు కదరా." గొణిగాడు రఘు.


"అయితే. పెళ్ళికోసం ఆర్మీ లో చేరి దేశసేవ చేయాలనుకున్న నా లక్ష్యాన్ని వదులుకోవాలా తనంటే ఇష్టమే. కానీ చిన్ననాటి నుండీ నాన్న నాకు దేశభక్తికి సంబంధించిన కథలు, దేశ నాయకుల సాహసాలు చెప్తూంటే, ఎప్పటికైనా నేను కూడా దేశసేవ చేయా‌లనుకున్నాను. రాజకీయాలలో చేరి చేద్దామనుకుంటే అక్కడ

మనం చేయగలిగిందేమీ లేదని ప్రస్తుత రాజకీయాలు చెప్పకనే చెప్తున్నాయి. అందుకే సైన్యంలో చేరాలనుకున్నా. అనుకోకుండా అవకాశం కలిసి రావడంతో, అమ్మానాన్నల అంగీకారంతో ఉద్యోగంలో చేరుతున్నా. ఇప్పుడు అర్థమైందా." అన్నాడు విశ్వం.


"అన్నయ్యా, నీకు వాడొక్కడే. వాణ్ణి వదిలి వదినా, నువ్వు ఉండగలరా." అడిగాడు మూర్తి.


"వదిలి ఉండాలని ఎవరికుంటుందిరా? కానీ వాడేమీ కాని పని చేస్తాననడం లేదు. కొంతకాలం దేశ సేవ చేస్తానంటున్నాడు. ముందు బాధనిపించినా మాతృదేశానికి సేవ చేయడానికి అనుమతి నివ్వకపోతే నేను ఇన్నేళ్ళువాడికి నేర్పినది వృథావే కదా. అందుకనే ఒప్పుకున్నాం." అన్నాడు రామారావు.


అందరి మొహాల్లో ఆనందం తొంగిచూసింది. అందరూ మెచ్చుకుంటూ అభినందించారు విశ్వాన్ని.


                        ...జైహింద్...


Rate this content
Log in

Similar telugu story from Inspirational