శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

నాన్న ఆలోచన

నాన్న ఆలోచన

2 mins
533



           నాన్న ఆలోచన

           -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి

           

  "మా మంచి నాన్న..." అన్నది ప్రియ.


   శ్రీధర్ కూతురు ఆనందమే తన ఆనందమనుకున్నాడు కాబట్టే...భార్య మాటను కొట్టి పారేయడంతో ప్రియ ఆనందానికి అంతులేకుండా పోయి...తండ్రిని గట్టిగా వాటేసుకుని ఆ ప్రశంస ఇచ్చింది.


  తండ్రీ కూతుళ్ళిద్దరూ ఒక్కటై పోయి...తన మాట కాదంటున్నందుకు మరింతగా ఉడుక్కుంది రాజ్యం.


   "అంతేలెండి...! నేను చెప్పింది మీరెప్పుడు విన్నారు గనుక..? ఈడొచ్చిన పిల్ల కదాని ఓ తల్లిగా త్వరగా పెళ్లిచేసేయాలనే నా తపన తప్పంటే ఎలా...? బంగారం లాంటి సంబంధం కాదంటున్నారు. వాళ్ళబ్బాయికి మనమ్మాయిని కోరుకుని మరీ అడుగుతున్నారు... ఆ అబ్బాయికి చక్కటి ఉద్యోగంతో పాటూ ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఇంతకంటే మంచి సంబంధం మనకు రాదండీ. దానికి మంచి మాటలతో చెప్పి ఒప్పించాలి గానీ...అది ఎలాగంటే అలా వెనకేసుకురావద్దని ఎన్నోసార్లు చెప్తూనే వున్నాను" భర్తపై విరుచుకుపడింది రాజ్యం.


  "పోన్లేవే...! అది ఇంకా చదువుకుంటానన్నప్పుడు బలవంతం పెట్టి పెళ్లిచేయకపోతే ఏమైంది? ఈరోజుల్లో ఆడపిల్లలకు చదువెంత ముఖ్యమో నీకర్థం కావడం లేదు." అన్నాడు భార్యకు నచ్చచెప్తూ శ్రీధర్.


  " అయితే...మా రోజుల్లో ఆడపిల్లకు చదువు ముఖ్యం కాదనుకునే మీకు నన్ను కట్టబెట్టారంటారా? పెద్దల మాట విన్నాను కాబట్టే...ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆవయసులో జరిగాయి. పుట్టాల్సిన వయసులో మనకు పిల్లలు పుట్టారు. ఇప్పుడు సుష్మకు వయసేమీ తక్కువకాదు. దాన్నింకా చదివిస్తూ పోతే మంచి చదువులు చదువుకోవచ్చు. పెద్దపెద్ద ఉద్యోగాలు చేయచ్చు. కానీ కరిగిపోతున్న యవ్వనం మళ్ళీరాదు. పాతికేళ్ల లోపు అవ్వాల్సిన పెళ్లిళ్లు చదువులూ, ఉద్యోగాలూ అంటూ ముప్ఫైఏళ్లకు అవుతుంటే పిల్లల్ని కనడంలో కూడా జాప్యం అయిపోతూ ప్రసవాలు కష్టమవుతున్నాయి. కొంతమందికైతే అసలు పిల్లలే కలగడం లేదు. ఒకవేళ కలిగినా...ఆపిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యేసరికి వీళ్ళకి అరవయ్యేళ్లు దగ్గర్లోకి వస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనమ్మాయి పెళ్లికోసం కంగారుపడుతుంటే అసలు నన్నర్థం చేసుకోరేంటీ...?" నోరు పడిపోయేలా చెప్పుకొచ్చింది రాజ్యం.


  ఇంత చెప్పినా...తన భర్త గానీ, కూతురు గానీ వినిపించుకోకపోయేసరికి, నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోయింది.


  కొన్ని రోజులు సాగాయి...


  ప్రియ తాను అనుకున్నట్టుగా చదువు పూర్తిచేసి...మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. ఉద్యోగం చేస్తుంది కదాని పెళ్లి మాటెత్తితే...అప్పుడే కాదు... రెండేళ్లు నా అంతట నన్ను స్వతంత్రంగా గడపనిస్తూ ఎంజాయ్ చేయనీయండి అంది. 


   మళ్లీ తల్లి రాజ్యం గోలపెట్టినా...తండ్రి శ్రీధర్ నీ ఇష్టమే నాఇష్టమమ్మా అన్నాడు కూతురుతో. 

   

   "మా మంచి నాన్న" అంది మళ్లీ తండ్రిని ప్రశంసిస్తూ ప్రియ.


   తండ్రీ కూతుళ్ళకి చెప్పిచెప్పి విసిగిపోయింది రాజ్యం. జరిగేది జరగక మానదని నిర్లిప్తంగా ఊరుకుంది.


   మరి కొన్ని రోజులు గడిచాయి...

   ప్రియ మనసు మారింది. పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంది. ఆనందంగా సంబంధాలు వెతికారు. అబ్బాయి వాళ్ళకి ప్రియ నచ్చితే....ఆ అబ్బాయి చదువు, ఉద్యోగం వీళ్ళకి నచ్చేవి కాదు. తనకన్నా చదువులో తక్కువో... ఉద్యోగం తక్కువో అయ్యేది.


  ప్రియకి అబ్బాయి సంబంధం నచ్చితే...ప్రియ వయసు అబ్బాయి కంటే ఎక్కువై పోయేది. లేదా జాతకాలన్నా కుదరలేదని చెప్పేవారు. ఇలా మరికొన్నాళ్లు సాగింది పెళ్లి సంబంధాల వేట.


   ఎట్టకేలకు ఓ అబ్బాయితే పెళ్లయింది. ఇద్దరూ దాదాపు ఒకే వయసు, సంపాదనా సమానమే. కొన్నాళ్ళు ఇద్దరూ అన్యోన్యంగా గడిపారు. ఆలూమగల మధ్య చిన్నచిన్న గొడవలు మామూలే అయినా...ఇద్దరికిద్దరూ సర్దుకోలేదు. ఎవరికెవరూ తీసిపోలేదు. చిలికి చిలికి పెద్ద గొడవ చేసుకున్నారు. ప్రియకు ఏ మాత్రం భర్తతో కలిసుండానికి ఇష్టపడలేదు. ఇంటికి వచ్చేసిన కూతురుని అల్లుడితో కలపడానికి ఎంతో ప్రయత్నించింది.


   "నేనూ సంపాదించుకుంటున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడగలను. అతని దగ్గరకు వెళ్లే ప్రసక్తి లేదు" అంది ప్రియ స్థిరనిశ్చయంతో.


   "చూసారా! ఇప్పుడేమయ్యిందో...? అందుకే పెళ్లీడు రాగానే పెళ్లిచేసేద్దాం అని నేనేంత గోల పెట్టినా...మీరు ఆనాడు కూతురు ఎలా అంటే అలాగే వెనకేసుకొచ్చారు. ఇప్పుడు చూడండి దాని జీవితాన్ని ఎలా నాశనం చేసుకుందో" భర్తతో అంటూ కళ్ళు తుడుచుకుంది రాజ్యం.


   ఆ పరిస్థితిలో భార్యను చూస్తే జాలేసింది శ్రీధర్ కి. 

   "నువ్వు తల్లివి కాబట్టి...పాతవాళ్లలా అలా ఆలోచిస్తున్నావు గానీ...ఈ తరం పిల్లలకి ఏ వయసులో పెళ్లిచేసినా గానీ...మునిపటిలా భార్యాభర్తలు సర్దుకుపోయేతత్వం ఉండటం లేదు రాజ్యం. కనీసం వారి చేతుల్లో చదువంటూ ఉంటే వారి బ్రతుకు వాళ్ళైనా బ్రతుకుతారనే ఆలోచనలో నేనుండేవాడినంతే" అన్నాడు తనను తప్పు పడుతున్న భార్యకు తాను ఇప్పటికైనా అర్థం కావాలని.


   ఆ మాటలు రాజ్యం మనసుని కరిగించాయో లేదో గానీ...ప్రియ మనసుకెంతో నచ్చాయి.


   "మా మంచి నాన్న..." అంటూ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకుంది ప్రియ !!*

    


    

    

   


   

    


    


Rate this content
Log in

Similar telugu story from Inspirational