సాకు - బేకు
సాకు - బేకు


గోపాలపురం లో రామశర్మ, దేవకి అనే దంపతులు ఉండేవారు. రామశర్మ కి సరిగ్గా చదువు వంటబట్టక పోవడంతో బ్రాహ్మణత్వం చేసుకుంటూ, పెద్దలిచ్చిన స్వంతింట్లో కాలం గడుపుతున్నాడు. అతని భార్య కూడా బాగా తెలిసిన వారిళ్ళకి వెళ్ళి అవసరమైన సాయం చేసి పదో పరకో తెచ్చేది.
ఓసారి రామశర్మ చెల్లెలి భర్త విశ్వనాథ శర్మ అతనిని వాళ్ళ ఊరికి ఆహ్వానించాడు. అప్పటికే 'నాలుగు సార్లు పిలిచినా వెళ్ళలేదు, ఈసారైనా వెళ్ళాలనుకొని భార్యతో సహా చెల్లెలి ఊరు బళ్ళారి వెళ్ళాడు.
వెళ్ళిన రెండు రోజులు బావగారి వెనుక తిరుగుతున్న రామశర్మకి అక్కడంతా బాగున్నట్లనిపించింది. ఆరోజు విశ్వనాథ శర్మ బైల్దేరుతూ "బావా, మీరూ రండి. ఈరోజు రాఘవేఃద్ర గారింట్లో భోజనాలు. భోజనాలు, సంభావనలు రెంఢూ దండిగానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు కన్నడిగులు. అయినా నేనున్నాను కదా. మీకిబ్బంది కలగదు."
అంటూ ధైర్యం చెప్పి తీసుకెళ్ళాడు.
అక్కడికెళ్ళాక విశ్వనాథ శర్మ పూజా కార్యక్రమంలో ఉండిపోయాడు. పాపం రామశర్మకేమీ తోచలేదు. అపరాహ్ణానికి భోజనాల వడ్డింపు మొదలైంది. చాలా మంది బ్రాహ్మలు ఉన్నారు.
ఇంతలో గబగబా విశ్వనాథ శర్మ , రామశర్మ దగ్గరకొచ్చి "బావా, ఏమనుకోకండి. పూజలో ఉన్న మాకు లోపల వడ్డిస్తున్నారు. మీకు ఆందరితో పాటు పందిట్లో విస్తరేస్తారు. చక్కగా నిర్మొహమాటంగా తినండి."అని చెప్పాడు.
"అదిసరే బావా. నాకు భాష రాదే, ఎలాగ మరి." అడిగాడు రామశర్మ.
"ఏముందీ మీదగ్గరకి రాగానే మీకు కావాలనుకుంటే 'బేకు' అనండి, వాళ్ళే వేస్తారు. మీకు చాలనుకుంటే సాకు' అనండి." ఆని చెప్పి లోపలికి హడావుడిగా వెళ్ళి పోయాడు విశ్వనాథ శర్మ.
'సాకు' 'బేకు' పదాలను వల్లె వేసుకుంటూ కూర్చున్నాడు రామశర్మ. కాసేపటికి వడ్డన మొదలై భోజనాలకి పిలపు వచ్చింది. అన్ని వంటకాలు కొంచెం కొంచెం వడ్డించారు. అందరూ లొడలొడా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ తింటున్నారు.
పదార్థాలు వస్తున్నాయి. రామశర్మ 'సాకు' అంటున్నాడు. వాళ్ళు వెయ్యకుండా వెళ్ళి పోతున్నారు. పక్కవాళ్ళు కూడా అదే మాటన్నా
ఒకసారి ఆగి ఇంకెవరో ఏదో అనగానే నవ్వుతూ వాళ్ళ విస్తట్లో వడ్డించి మరీ వెళ్తున్నారు.
రామశర్మ ఎన్నిసార్లు 'సాకు' అన్నా వెయ్యడం లేదు. ఆకలితో అలమటించి పోతున్నాడు రామశర్మ. కోపం నషాళానికి అంటుకుంది.
వడ్డించడొనికి వచ్చిన వాడి మీద "నీ 'సాకు' చట్టుబండలు గానూ, రెండు 'బేకులు' బేకవయ్యా" అని అరిచాడు.
వాడు బిత్తరపోయి వాడి చేతిలోని పదార్థాలు వడ్డించాడు భయంభయంగా. ఆ తర్వాత మిగిలిన వడ్డన వాళ్ళు కూడా అతనేమీ అడగకుండానే వడ్డిస్తూ వెళ్ళారు. మొత్తానికి మన రామశర్మ సుష్టుగా భోంచేసి తృప్తిగా తేన్చాడు. సంభావన కూడా దండిగా ముట్టడంతో మరింతగా ఆనందించాడు.
జరిగిన విషయం విశ్వనాథ శర్మకు చెప్తే పడిపడి నవ్వి " 'సాకు' అంటే చాలు అని. మీరు ప్రతిసారీ 'సాకు అంటే వాళ్ళు వద్దన్నారని వేయలేదు. మొత్తానికి వడ్డించేవాళ్ళని గజగజలాడించారనమాట." అన్నాడు.
"మరి నా పక్కవాళ్ళు "సాకు' అన్నా వేశారుగా." అన్నాడురామశర్మ ఆశ్చర్యంగా.
"అక్కడ వాళ్ళంతా స్నేహితులు, చుట్టాలు. వాడికి తినిపించాలని వీడు, వీడికి తినిపించాలని వాడు
పోటీల మీద తింటారు. మామూలేగా. మీకు భాష రాక ఈ రభస."
"అవును కదా. అయినా నాకేం తక్కువ కాలేదులే." అన్నాడు రామశర్మ ఆనందంగా.
"సంతోషం " అన్నాడు విశ్వనాథ శర్మ.
😊కృష్ణార్పణమస్తు😊