దేశభక్తులు
దేశభక్తులు
"తాతగారూ, రేపు మా స్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ఈసారి నేను పెరేడ్ లో పాల్గొంటున్నాను." ఉత్సాహంగా చెప్పాడు రోహిత్, ఆరోజే ఊరినుండి వచ్చిన తన తాతగారు నరసింగరావు గారితో.
"చాలా సంతోషం బాబూ. చాలా మంచి విషయం." ఆనందంగా భుజం తడుతూ అన్నారు తాతగారు.
తండ్రికి కాఫీ ఇవ్వడానికి వచ్చిన అంజన, ఆయనకి కాఫీ అందించి "నాన్నా రోహీ, తాతగారు ఇప్పుడే వచ్చారు కదా. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. విశ్రాంతి తీసుకోనీ. రేపు స్కూల్ నుండి త్వరగా వచ్చేస్తావుగా. బోలెడు కబుర్లు చెప్దువుగాని." అంది నవ్వుతూ.
"అదేంటమ్మా అలా అంటావు? మా తాతామనవల్ని మాట్లాడుకోనీ. నేను మా మనవడి కబుర్ల కోసమేగా వచ్చింది." అన్నారు రావుగారు నవ్వుతూ.
"మీకు విశ్రాంతి కావాలేమోనని అన్నాను నాన్నా. కబుర్లు చెప్పుకోండి. నేను వంట మొదలు పెడతాను." అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది అంజన.
"తాతగారూ, మీరు మిలిటరీ లో చేశారు కదా. మీరు ఎప్పుడైనా పెరేడ్ లో పాల్గొన్నారా!" అడిగాడు రోహిత్ కుతూహలంగా.
"నేను 28 సంవత్సరాలు పని చేశాను బాబూ.
ఇంచుమించు 20 సంవత్సరాలు, ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే పెరేడ్ లో పాల్గొనే వాడిని.
అయితే నా అదృష్టం కొద్దీ రెండు సార్లు ఢిల్లీలో పెరేడ్ లో పాల్గొన్నాను. ఆ అవకాశం ప్రతిసారీ రాదు." అన్నారు నాటి విషయాలను తలచుకుంటూ సంతోషంగా.
"మీరు చాలా గొప్పవారు తాతగారూ. మిలిటరీ లో పని చేశారు. మిలిటరీ లో పని చేసేవాళ్ళు ఎన్నో కష్టాలు పడతారట కదూ. అందరికీ దూరంగా ఉంటారు. ఎండా, వాన, చలి అనకుండా కష్టపడతారు కదూ. మీరంతా గొప్ప దేశభక్తులని మా టీచర్ గారు చెప్పారు." ఆన్నాడు రోహిత్ సంబరంగా.
"అవును నాన్నా, నిజమే, చాలా కష్టాలు పడతాము. కానీ మిలిటరీ లో పని చేసే వారు మాత్రమే దేశభక్తులు కారు. పోలీసులు, శాస్త్రవేత్తలు, టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, రకరకాల ఉద్యోగస్తులు, ఆటగాళ్లు అందరూ దేశభక్తులే. కాకపోతే వీరంతా తమ స్వార్థం వదిలి పెట్టి నీతిగా, నిజాయితీగా దేశం కోసం పని చేయాలి. తాము చేసిన పని వలన తమ దేశానికి మంచిపేరు తేవాలి, కానీ తలవంపులు తేకూడదు. దేశభక్తి ఉన్నవారు, దేశాన్ని ప్రేమించేవారు ప్రతి ఒక్కరూ దేశభక్తులే బాబూ." అన్నారు రావు గారు.
కొంత తడవ ఆలోచనలో ఉండిపోయిన రోహిత్ "మీరన్నది నిజమే తాతగారూ, ఎవరికి వీలైన దిశలో వారు తమ దేశభక్తిని
నీతిగా, నిజాయితీగా ఉంటూ నిరూపించుకోవాలి. తాతగారూ మీరీరోజు నాకు చాలా మంచి విషయాలు తెలియ చేశారు. ధన్యవాదాలు తాతగారూ. వస్తాను తాతగారు, చదువుకోవాలి." అన్నాడు రోహిత్.
"వెళ్ళు నాన్నా, బాగా చదువుకో." అంటూ నవ్వుతూ రోహిత్ భుజం తట్టారు రావుగారు.
💐జైహింద్💐