మడిబట్ట
మడిబట్ట


"ఏమండోయ్, ఈరోజు కూడా ఎవడో మన పెరట్లో మామిడికాయలు తెంపుకు పోయాడండీ. మూడు రోజుల నుండీ ఇదే వరస. మీరు పట్టించుకోరు. మొన్న ముగ్గబోతున్న అరటి పళ్ళు, నిన్న పరువుకొచ్చిన జాంకాయలు, ఈవేళ మామిడి కాయలు." అంటూ ప్రొద్దున్నే నస మొదలెట్టింది నా భార్యామణి మాణిక్యం.
"అయితే ఏంటంటావు? పోలీసులకి ఫిర్యాదు చేయాలా? ఈ వస్తువులెవరైనా పట్టుకోగలరా?
ప్రొద్దున్న లేచిన దగ్గర నుండీ ఇదే మాయదారి గోల రోజూ. కాస్త కాఫీ అయినా తగలేసుందా లేదా నా మొహాన " కావాలనే కాస్త విసుగు ప్రదర్శించాను. అక్కడితో మా ఆవిడ నోరు కడుతుందని.
అనుకున్నట్లుగానే మా ఆవిడ మారు మాట్లాడకుండా కాఫీ తెచ్చిచ్చి అందిస్తూ "అది
కాదండీ, ఎవర్నైనా కుర్రాణ్ణి కాపలా పెట్టచ్చుకదండీ." కొంచెం గొంతు తగ్గించి అడిగింది, నన్ను ఎలాగైనా ఒప్పించాలనే ఉద్దేశ్యంతో.
"చూడు మాణిక్యం, కుర్రాణ్ణి పెట్టుకుంటే తడిసి మోపెడవదుటే. వాడికి జీతం, రాత్రంతా ఉన్నందుకు రాత్రి భోజనం, ఉదయం కాఫీ ఇవన్నీ
అదనపు ఖర్చులు కాదూ. నాలుగు కాయలకోసం అంతవసరమా." అని మందలించాను
"మీరెప్పుడు నా మాట పడనిచ్చారు గనుక!" అంటూ మూతిని ముచ్చటగా మూడువంకలు తిప్పి కాఫీ గ్లాసు పట్టుకెళ్ళింది.
మా ఆవిడలా వంటింట్లోకి వెళ్ళగానే వీధరుగు మీద కూర్చున్న మా అమ్మొచ్చి నా పక్కన చేరింది.
"ఏంట్రా శివుడూ, దాని గోల?" అనడిగింది.
ఈ ఇద్దరూ ఒకరకం. కొన్ని సార్లు ఒకటైపోయి
నామీద దాడి చేస్తారు. కొన్ని సార్లు శత్రువుల్లా
ఒకరిమీదొకరు నాదగ్గర చెప్పుకుంటారు. నాకూ అలవాటై పోయి సందర్భానుసారం ప్రవర్తించడం అలవాటు చేసుకున్నా. ఆవిడకి జరిగిందంతా ఏకరువు పెట్టాను.
"అదేదో మతిమాలి కాపలాలు, అవీ పెట్టమంటుంది. అదేం వద్దు. బ్రహ్మాండమైన పథకం వేశాను. ఈ రాత్రికే అమలు చేస్తాను. ఏం గాభరా పడకు." అంటూ ఆవిడ కూడా లేచి వెళ్ళింది. ఇంక నేను కూడా నా పన్లలో పడి ఆ విషయం అప్పుడే మర్చిపోయాను.
మర్నాడు పొద్దుటే మా అమ్మ గొంతు గట్టిగా వినిపిస్తోంది. ఎవడికో శాపనార్థాలు పెడుతోంది.
ఎవడికి మూడిందో అనుకుంటూ లేచి పెరట్లోకి
వచ్చాను. మాణిక్యం అక్కడే ఉంది. ఏమైందన్నట్లు కళ్ళతో అడిగాను. 'మీరే అడగండి' అన్నట్లు చూసి లోపలికెళ్ళి పోయింది.
అమ్మ వాక్ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ "ఏమైందమ్మా?" అనడిగాను.
"లేచావా. వెధవలు. పిదప కాలం పిదప బుద్ధులు. ఇదెక్కడైనా ఉందా! రాన్రాను మనుషులకు భయం-భక్తి, మడీ మశానం లేకుండా పోయాయి." అంటూ వగుస్తోంది.
"జనాలు ఎలా పోతే నీకెందుకు? నీ ఇంట్లో నువ్వు కోరినట్లే జరుగుతోంది కదా! ఇంకేంకావాలి?" అన్నాను.
"దొంగతనాలు జరుగుతున్నాయని మీ ఆవిడ గోలెడుతోందా? పోనీలే, అయితే అయిందని రాత్రే స్నానం చేసి మడిబట్ట కొబ్బరి చెట్టుకి, మామిడి చెట్టుకి కలిపి కట్టాను. మడిబట్ట ఆరేశానా. కాస్త వెనక్కి తగ్గాలా! ఆ దొంగ వెధవ నా బట్టను ముట్టుకోడమే కాకుండా దాన్లోనే మరిన్ని కాయలు కూడా మూటగట్టుకుని నా.మడిబట్టను కూడా తీసుకు పోయాడ్రా. ఆ దొంగవెధవ!" అంటోంది ఆమ్మ.
హతవిధీ! ఈవిడకేం నచ్చచెప్పాలి? మడి తడి అన్న భయాలే కాదు, చాలా చోట్ల ఆచరించే వాళ్ళు కూడా తగ్గిపోయారని. ఇదా నిన్న ఈవిడ వేసిన బ్రహ్మాండమైన పథకం!
అమ్మకి నచ్చచెప్పి మళ్ళీ మడిచీర కొనిస్తానని మాటిచ్చి ఆరోజు అన్నం తినేలా చేయడం గగనమైంది నాకు. నేనిలా అవస్థలు పడుతూంటే
మా ఆవిడ ముసిముసి నవ్వులు మరింతగా
ఉడికించాయి నన్ను. మా అమ్మ అమాయకత్వం తలుచుకున్నప్పుడల్లా నవ్వు తెప్పిస్తుంది.
---శుభం---