దేశసేవ
దేశసేవ


ఏమండీ, మన హేమూ కూడా సైన్యంలో చేరతానంటున్నాడండీ." దుఃఖంతో గొంతు జీరబోతుండగా భర్త రామచంద్రం గారికి చెప్పింది
సుజాత.
"తెలుసు సుజాతా. వాడు ముందుగా నాకు చెప్పే నీకు చెప్పాడు. నేను సరేనన్నాను." అన్నారాయన సాధ్యమైనంత సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ.
"మీరు ఒప్పుకున్నారా! ఎలా అనగలిగారండీ ఆ మాట. వాళ్ళు పుట్టినప్పుడు ముగ్గురు రత్నాలలాంటి బిడ్డలని ఎంతో మురిసిపోయాం కదండీ. పెద్దవాడు వెళ్తానన్నప్పుడు మీ మాట కాదనలేక, రవిచంద్రని పంపించాను. శశికి ధైర్యమెక్కువ. వాడు తన మాటే చెల్లించుకొని అన్నని అనుసరిస్తూ వాడూ సైన్యంలోనే చేరాడు. ఇప్పుడు వీడు. వీడిని మీరు గట్టిగా ఆగమంటే
అగుతాడు కదా. మరి ఎందుకు ఆపరు? ఉన్న ముగ్గురు పిల్లలు పిలుపుకందనంత దూరంలో..." ఇక దుఃఖంతో ఆమె మాట్లాడలేక పోయింది.
ఆయన ఆమె దగ్గరగా వచ్చి పొదివి పట్టుకుని "సుజీ, ఇది మనమెంతో గర్వించదగ్గ విషయం. నేను సైన్యంలో చేరి దేశసేవ చేద్దామని ఎంతగానో అనుకున్నాను. కానీ నాన్నగారు అకాల మరణం చెందడంతో పెద్దకొడుకుగా ఇంటి బాధ్యత వహించక
తప్పలేదు. నాకు ముగ్గురు కొడుకులు కలగగానే ఒక్కరినైనా పంపి దేశమాత ఋణం తీర్చుకుందామనుకున్నాను. అందుకే చిన్ననాటి నుండీ వారికి దేశభక్తుల కథలు చెప్పేవాడిని. నా అదృష్టం ముగ్గురు పిల్లలలోనూ దేశభక్తి వేళ్ళూనుకుంది. అందుకే నేను వారికి అడ్డు చెప్పను." అన్నారు రామచంద్రం గ
ారు.
"అదికాదండీ. ముగ్గురు పిల్లలున్నా ఏ ఒక్కరూ మనకి చేరువలో లేకుండా..." అర్థోక్తిలో ఆగిపోయిందామె.
"నిజమే సుజీ, నువ్వన్నది కాదనను. పిల్లలు మన చేరువలో ఉండాల్సిన సమయం ఆసన్నమైనపుడు వాళ్ళే వస్తారు. ఈ ముగ్గురే ఆకతాయిలై మనని పట్టించుకోకుండా తలవంపులు తీసుకొచ్చే వారైతే మన దగ్గరే ఉన్నా అది నరకం కదూ. ఇప్పుడు, మన పిల్లలు దేశమాత సేవలో తరించి మనని తరింపచేస్తున్నారని గర్వపడవచ్చు. అవునా." అన్నారు సముదాయిస్తున్నట్లు.
ఇంతలో కొడుకు హేమచంద్ర వచ్చి తల్లి భుజం చుట్టూ చేయివేసి అమ్మా దేశమాత నీకు, నాకు అందరికీ తల్లే కదమ్మా. మన తల్లి సేవ చేయడానికి వెళ్తున్న నన్ను నవ్వుతూ ఆశీర్వదించి పంపవమ్మా."
అంటూ చటుక్కున పాదాలమీద వాలాడు హేమచంద్ర.
ఆవిడ అతని భుజాలుపట్టి లేవదీసి హృదయానికి హత్తుకొని "వెళ్ళుబాబూ, తప్పకుండా వెళ్ళు. ముగ్గురు దేశభక్తులను కన్న వీరమాతగా గర్విస్తాను.
మీర దిగ్విజయంగా, ఆ తల్లి సేవను ముగించుకొని వచ్చి ఈ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించండి." అంటూ తలనిమిరి నుదుటను ముద్దు పెట్టుకుంది.
తల్లిదండ్రులిద్దరినీ చెరో చేత్తో పట్టుకుని "అమ్మా మీ బిడ్డలుగా పుట్టడం మా అదృష్టం. జన్మజన్మలకీ మేము మీ బిడ్డలుగానే జన్మించాలి." అన్నాడు
కళ్ళల్లో నీరు నింపుకొని.
ఇద్దరూ తమ బిడ్డని మనసారా హత్తుకున్నారు.