శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

4  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Inspirational

బంగారు బాట

బంగారు బాట

2 mins
548


              బంగారు బాట

            -శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి


   "బామ్మ మాట బంగారు బాట...' అనే నానుడి నా విషయంలో నిజంగానే జరిగింది".


   "ఎవరా బామ్మా? ఏంటా బాట?" అనుకుంటున్నారా?


   "ఇంకెవరు మా బామ్మే! మా బామ్మ కాలం చేసి చాలా రోజులైపోయింది. ఇంకా బతికి ఉంటే గనుక మా అన్యోన్యత చూసి ఎంత ఆనందించేదో".


  ఇక మా బామ్మ చెప్పిన మాట వినబట్టే...మా జీవితం బంగారు బాటయ్యింది. ఆమాట నాకు పెళ్లిచేసిన మొదటిరోజే చెప్పింది.అదేంటంటే...

   

   "ఒరేయ్...బడుద్దాయి! పెళ్లైపోతే సంబడం కాదు. ఇప్పుడే వచ్చిన భార్యనీ, నిన్ను కన్న అమ్మనీ కూడా సమానంగా చూసుకోవాలి. అలా చూసుకోగలిగినప్పుడే నువ్వు నీ సంసారంలో చిక్కులు రాకుండా ఉంటాయి" అంది.


   బామ్మ మాటలకు బుద్దిగా 'ఊ' కొట్టాను. కానీ...సమానంగా చూసుకోవడం ఎలాగో అప్పుడు అర్థం కాలేదు. మా పెళ్ళైన కొద్దిరోజులకే బామ్మ కన్ను మూసినా ...బామ్మ చెప్పిన మాట మాత్రం మర్చిపోలేదు. నాన్నగారు కూడా నేను కాలేజీ చదివే రోజుల్లోనే పోవడంతో నాకు అమ్మ మాత్రమే మిగిలింది. అమ్మతోటే నేనుండేవాడిని. నాతోపాటూ నాభార్య తోడయ్యింది. అందుకే నా దగ్గరే అమ్మ ఉంటుంది అనుకోను. అమ్మ దగ్గరే మేము ఉంటున్నాం అని చెప్తూ ఉంటాను ఎవరికైనా.


  అలా ముగ్గురం ఒకే ఇంట్లో ఉంటూ...అటు తల్లికి కొడుకుగా, ఇటు భార్యకు భర్తగా న్యాయం చేయాలనుకుంటూ...అమ్మకి ఇష్టమయ్యే గుడులూ, పుణ్యక్షేత్రాలకు అమ్మని తిప్పేవాడిని. భార్య సరదాపడే బీచ్, సినిమాలకు భార్యను తిప్పేవాడిని. ఇద్దరినీ నేనెంత బాగా చూసుకున్నా...అత్తా కోడళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారంటే ఇద్దరిమధ్యా ఏదోరకంగా మాటామాటా వచ్చేది. 


   ఆ విషయం ఆఫీసునుంచి ఇంటికొచ్చాక ఎవరికి వారు విడివిడిగా నాకు చెప్పుకున్న రోజులు చాలా వున్నాయి. ఇద్దరివీ విన్న తరువాత అవేమీ పెద్ద మాటపట్టింపు గొడవల్లా నాకేమీ అనిపోయించేవి కాదు. అలాగని వాళ్ళ మధ్య రాజీ కూడా కుదర్చలేదు. అమ్మ చెప్పినదంతా విని...భార్య మీద కోపం తెచ్చుకోలేదు, అమ్మని ఏదో అన్నావట అని కూడా నా భార్యనెప్పుడూ అడగలేదు. భార్య అమ్మ మీద చెప్పిన మాటలు కూడా అమ్మనెప్పుడూ అడగలేదు. ఇద్దరి మధ్యా మౌనవ్రతుడులా ఉండేవాడిని. నా భార్య అయితే నాకు చెప్పినా, గోడకు చెప్పినా ఒక్కటే అనుకుని ఇక రాను రాను వాళ్లేమనుకున్నా చెప్పడమే మానేసింది.


  నిజానికి అత్తా కోడళ్ళు అవ్వడం వల్ల చిన్న మాటకూడా పెద్ద మాటలా వాళ్ళకనిపిస్తుంది గానీ ,అదే తల్లీ కూతుళ్లు అయితే అసలు పట్టించుకునేవారే కాదు.


  నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే...వారిద్దరి మధ్యా నేను కల్పించుకుని ఏమీ మాట్లాడకపోవడం వల్లే...పెద్దగా గొడవలెప్పుడూ సాగలేదనుకుంటూ ఉంటాను. ఒకరోజు ఇద్దరికిద్దరూ ముభావంగా వున్నా మర్నాడు మళ్లీ మామూలై పోయేవారు. 


  నా పెళ్లై మూడు పదుల దాటినా...నా తల్లితో పాటూ, నేనూ, నా భార్యా, పిల్లలు ఎంతో ఆనందంగా వుంటున్నాము. అన్నట్టు పెళ్ళైన కొన్నాళ్ళు వాళ్లిద్దరూ అత్తాకోడళ్లే అయినా...ఇప్పుడు తల్లీ కూతుళ్లా బాగా కలిసిపోయారు. 


  అందుకే, మా బామ్మ నాకు గుర్తుకొస్తూ వుంటుందెప్పుడూ...

   

   మా బామ్మ చెప్పిన మాటతో తల్లినీ, భార్యనూ సమానంగా చూసుకున్నాను కాబట్టే...నాజీవితం బంగారు బాట అయ్యిందిప్పుడు!!*


   

    


Rate this content
Log in

Similar telugu story from Inspirational