మళ్ళీమొదటికే
మళ్ళీమొదటికే
మళ్లీ మొదటికే
-శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి
"మళ్లీ మొదటికొచ్చింది కథ!
ఇంత జరిగినా ఇంకా బుద్ధి రాలేదు వాడికి. ఇక వాడు మారడు. నాకళ్ళతో నేను చూసాను కాబట్టి నమ్మకుండా వుండలేకపోతున్నాను. చిన్నవాడైతే నాలుగు తగిలించొచ్చు. తాడిలా ఎదిగిపోయినవాడిని మనమేం చేయలేం. ఓసారి జైలుకెళ్లొచ్చి కూడా వాడి ప్రవర్తనలో మార్పు రాలేదంటే, వీడిని కన్నందుకు ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నాను."
బయటనుంచి లోపలికి వస్తూనే కొడుకుపై రుసరుసలాడుతూ భార్య కామాక్షికి వినిపించేలా అనేసి.. చెదిరిన మనసుతో కుర్చీలో కూలబడ్డాడు కామేశ్వరావు.
అతని కళ్ళలో దివ్య కదలాడుతుంది...
తన కొడుకు చేసిన నేరానికి ఈలోకంలో లేకుండా పోయిన అమాయకురాలు ఆమె. ఆమెకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవాలంటే, కొన్ని రోజుల క్రితం....
"దివ్యా!"
ఆ గొంతు దివ్యకి పరిచితమే...
వెనుతిరగలేదు. తడబడకుండా అడుగులు ముందుకు వేస్తుంది.
"దివ్యా! ఐ లవ్ యు...!"
ఆపై అల్లరిమూక నవ్వులు.
దివ్యకి ధైర్యం సన్నగిల్లింది. ఆ పాడుమూక అల్లరికి అడుగులు తడబడినా... ధైర్యం కూడదీసుకుని నడుస్తుంది. ప్రతిరోజూ ఆ కాలేజీ ఆవరణలో జరిగే తతంగమే అది. ఆమెను వెంటాడుతూ ఏడిపిస్తున్నారంటే... అందం ఆమె శాపమా...?
* * *
ఫోటో స్టూడియో నుంచి బయటపడిన దివ్య ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తుంది. ఆమె మనసంతా కలతగా ఉంది.రోజూ అల్లరి పెడుతున్న ఆమూక ఆమెను విడవడం లేదు. ముఖ్యంగా ఆ మదన్. అతను తన కళ్ళముందు కదలాడేసరికి కసి, కోపంతో ఆమె ముఖం ఎర్రబారింది.
"దివ్యా...!"
మళ్లీ అదే పిలుపు, అదే గొంతు, అవే నవ్వులు.
ఏ రోడ్డున తగలడ్డా వీళ్ళే... ఇడియట్స్. పళ్ళు పటపట కొరికింది.
అలా ఒంటరిగా నడుస్తున్న ఆమె భుజంపై పడింది ఓచేయి. తల తిప్పి చూసింది. తననే కామంతో చూస్తున్న మదన్.
ఛీఛీ...ఎప్పుడూ నాలో ఏదో వెతుకుతున్నట్టే ఉంటాయి వీడి చూపులు అనుకుంటూనే...అప్రయత్నంగానే అతని చెంప చెళ్లు మనిపించింది.
మదన్ అహం దెబ్బతింది. ఇంకా షాక్ నుంచి తేరుకోకముందే అక్కడ నుండి మాయమయ్యింది దివ్య.
ఆమె సుకుమారమైన చేయి కూడా బలంగా తగులుతుందనుకోలేదు. అతని కళ్ళల్లో క్రోధం... శరీరంలో ప
్రతి అణువూ కసితో మండిపోయింది. పళ్ళు పటపట లాడించాడు. ఏదో నిర్ణయం తీసుకుని అక్కడ నుంచి వెనుతిరిగాడు.
* * * *
" ప్లీజ్ !" మదన్ కళ్ళు అర్థిస్తున్నాయి....
"సారీ సర్! మీరెంత బ్రతిమాలినా... ఆఫోటో ఇవ్వడం జరగదు. అందునా లేడీ ఫోటో".
నిరాశతో వెనుతిరిగిన మదన్ కి ఫ్లాష్ లా ఒక మెరుపు మెరిసింది.పర్స్ తీసి పచ్చనోటు బయటకు తీసాడు.
ఎథిక్స్ గాలికెగిరిపోయాయి.
నోటు ఒకరి చేతిలోకి, ఫోటో ఒకరి చేతిలోకి మారిపోయాయి. వెనుతిరగబోయిన మదన్...మరో వంద కూడా తీసి..అతని చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు.
అతను ఆనోటందుకున్నాడు.పైకి మొఖం ముడుచుకున్నా...లోపల ఆనందం కొట్టొస్తూనే ఉంది.
* * * *
సర్! నాచావుకు కారకుడు, ఈ ఉత్తరంతో పాటూ జత చేసిన ఫొటోలో ఉన్న వ్యక్తి. ఇతను మదన్ అనే కాముకుడు. నన్ను తన రూమ్ కి నన్ను రమ్మన్నాడు. అలా రాని పక్షంలో ఈఫోటో అందరికీ చూపించి యాగీ చేస్తానన్నాడు.శత విధాల బ్రతిమలాడాను. లాభం లేకపోయింది. అతని మూర్ఖత్వమే నన్నీ పని చేయించింది.నిజానికి పై ఫోటో అతనితో కలిపి నేను ఏనాడూ తీయించుకోలేదు. దాన్ని అతనెలా సృష్టించాడో...? ప్లీజ్...అతన్ని అరెస్ట్ చేసి, నాలాంటి కన్నెల జీవితాన్ని కాపాడండి.
- దివ్య
పోలీసు స్టేషన్ కొచ్చిన లేఖ అది.
* * * *
కటకటాల నుంచి వచ్చిన మదన్ ప్రవర్తనలో మార్పు లేదు. మళ్లీ అదే వేట. తన గేలానికి చిక్కే మరో అమ్మాయి కోసం.
కథ మళ్ళీమొదటికే...!
అందుకే కామేశం బాగా ఆలోచించాడు. చట్టానికి కూడా లొంగని నీచమైన కొడుకుని కన్నందుకు నేనే వాడికి సరైన శిక్ష వేయాలనుకున్నాడు.
కొడుక్కి పెట్టబోయే అన్నంలో విషాన్ని కలపాలనే నిశ్చయానికొచ్చి...ఊపిరి పీల్చుకున్నాడు..!*