"Tirumalasree" PVV Satyanarayana

Crime

5.0  

"Tirumalasree" PVV Satyanarayana

Crime

ఎలిబీ

ఎలిబీ

6 mins
35.2K


ఎలిబీ

రచనః తిరుమలశ్రీ

***

డోర్‌బెల్ మ్రోగడంతో వెళ్ళి తలుపు తెరిచింది ఆమె.

గుమ్మంలో ప్రత్యక్షమైన అతన్ని చూసి ఓ క్షణం నిశ్చేష్ట అయింది.

ఆమెను చూసి అతనూ అలాగే అయిపోయాడు.

అతని చూపులు తనను ఆపాద మస్తకం తడుముతూంటే ప్రక్కకు వైదొలగిందామె.

బెడ్‌మీద కూర్చున్నారిద్దరూ.

పాతికేళ్లుంటాయి ఆమెకు. చామనఛాయ. అయినా ముఖంలో కళ ఉట్టిపడుతోంది. వెడల్పయిన కాటుక కన్నులు మీనాల్లా ఉన్నాయి. సంపెంగ లాంటి నాసిక, కవ్వించే పెదవులు...బంగారు కలశాలవంటి ఎద ఎత్తులు... ఆమె సొత్తులు. చాయ తక్కువైనా అందము, ఆకర్షణ వుట్టిపడుతున్నాయి. సన్నగా, నాజూకుగా ఉంది… ఆమె ధరించిన ఎల్లో కలర్ గోల్డ్ జరీ శారీ, జాకెట్లు ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి అనుకున్నాడు అతను.

అతనికి ముప్పైయ్యేళ్ళుంటాయి. సన్నగా, పొడువుగా ఉన్నాడు. ఉంగరాల క్రాపు, సన్నటి మీసకట్టు... వదనంలో ఏవో నీలినీడలు. కళ్ళ లోతుల్లో అగాథాల ఛాయలు.

"ఏదైనా మాట్లాడండి" మెల్లగా అందామె హఠాత్తుగా.

ఉలిక్కి పడ్డట్టు ఆమె కళ్ళలోకి చూశాడు అతను.

ఆ చూపుల్ని తట్టుకోలేనట్టు తల దించుకుందామె.

"నా పేరు సంఘర్ష్. జీవితమంతా సంఘర్షణమయమైపోయింది" నవ్వడానికి ప్రయత్నించాడు అతను. "నీ పేరు?"

చివాలున తలయెత్తి చురుగ్గా చూసిందామె "మీకు తెలియదా?"

కించిత్తు తడబడ్డాడు. "ఫలానా హోటల్లో రూమ్ బుక్ చేస్తున్నాను. మీరు కోరినట్టే ఓ అందాలభామ మీ పొందు కోసం అందులో ఎదురుచూస్తూంటుంది అని చెప్పాడు బ్రోకర్. పేరు చెప్పలేదు" అన్నాడు.

"నాపేరు... ప... పద్మ" అందామె మెల్లగా.

అతను అస్పష్టంగా గొణుక్కున్నాడు.

వారి మధ్య మౌనం చేరింది.

మౌనాన్ని ముందుగా అతనే ఛేదించాడు. "వేలు పోసి కొనుక్కున్న ఈ రాత్రిని ఇలా మౌనానికి బలిచేయడానికి కాదనుకుంటాను..."

అతని వదనంలో ఏదో వెదకడానికి వృథాయత్నం చేసిందామె.

ఆమెను దగ్గరకు లాక్కుని ఆర్తిగా కౌగిలించుకున్నాడు అతను. తన వక్షానికి అంటుకుపోయిన ఆమె జడలోని పూలను ఆఘ్రాణించాడు. ఆమె పయ్యెదను తొలగించి జాకెట్‍కీ చీరకూ మధ్య నడుమును చేతితో సున్నితంగా నిమిరాడు. పులకింతకు గురయిందామె. ఆమె వక్షంపైన ముఖం పెట్టుకున్నాడు. ఆ స్పర్శకు ఆమె చనుగుబ్బలు పొంగాయి. ఆమె చీర కుచ్చెళ్ళపైన చేయి వేశాడతను. చటుక్కున ఆపి వెనుకకు జరిగిందామె.

అతను తెల్లబోయి చూసాడు.

మృదువుగా నవ్వుతూ చీర సరిచేసుకుని పైట సర్దుకుందామె. "ఈ ఏసీ రూమూ, ఈ మధురమైన రేయీ, ఈ మల్లెపూలూ... తెల్లవారేంతవరకూ మనవే. ఆరంభంలోనే తొందరపడి ఔటయిపోతే ఎలా? ముందుగా మనసులు కలబోసుకుంటే... బావుంటుందేమో!" అలవోకగా చూసింది.

"విటుడికీ, విటురాలికీ నడుమ మనసుల ప్రమేయం ఏముంది!" సాశ్చర్యంగా చూసాడు. అతని పలుకులలో కించిత్తు కటుత్వం తొంగి చూసింది.

"నా దగ్గరకు వచ్చేవారంతా నా గురించి తెలుసుకోవాలని ఉబలాట పడుతూంటారు... అదే, నేనెవరు, ఈ జారుడు మెట్ల పైన కాలు ఎలా మోపాను, ఈ మురికి కూపంలో ఎలా పడ్డాను వగైరాలు. కాని, అటువంటి ఉద్దేశ్యమేమీ మీకు వున్నట్టు లేదు" అందామె. "అందుకే వెరైటీగా... నేను మీగురించి తెలుసుకోవాలనుకుంటున్నాను."

"అంటే?"

"పెళ్ళికాని యువకులో... పెళ్ళయీ భార్యవల్ల సుఖపడలేని పురుషులో... లేదా ఇంటి భోజనంతో సరిపెట్టుకోలేక బయటి చిరుతిళ్ళకోసం ప్రాకులాడేవారో... నాలాంటి కాల్‍గర్ల్స్ వద్దకు వస్తుంటారు సాధారణంగా. వారిలో మీరు ఏకోవకు చెందినవారో... తెలుసుకోవాలని..."

అతని దవడలు చిన్నగా బిగుసుకున్నాయి "నా భార్య లేచిపోయింది!"

జాలిగా, బాధగా చూసిందామె. అతన్ని ఒళ్ళోకి తీసుకుని అతని ముఖాన్ని తన వక్షానికి హత్తుకుని ఓదార్చాలనిపించింది ఓ క్షణం. తమాయించుకుంది.

"నాకు డ్రింక్ కావాలి!" అని అతను అనడంతో, "మరిచేపోయాను. మీకోసమని బీర్ బాటిల్సు తెచ్చి ఫ్రిజ్‍లో పెట్టాడు బ్రోకర్. తెస్తాను వుండండి" అంటూ లేచి వెళ్ళి బీర్ బాటిలూ, గ్లాసు తెచ్చి టీపాయ్ మీద పెట్టిందామె. గ్లాసులో డ్రింక్ పోసి అతనికి అందించింది. జింజర్ చికెన్ ఫ్రై ప్లేటు తెచ్చి ముందుంచింది.

చికెన్ ఫ్రై నంజుకుంటూ మౌనంగా బీర్ సిప్ చేయసాగాడు. ఆమెను తీసుకోమంటే, తనకు డ్రింక్ అలవాటు లేదంది.

సాశ్చర్యంగా చూసాడు. "కాల్‍గర్ల్స్ డ్రింక్స్‍లో కూడా కస్టమర్స్‍కి కంపెనీ ఇస్తారని ఆలకించాను" అన్నాడు. మందహాసం చేసిందామె.

బాటిల్ ఖాళీ అయ్యేసరికి అతని ముఖంలో, మాటలో కొద్దిగా మార్పు వచ్చింది. బాత్‍రూంకి వెళ్ళి కొంత సేపటి తర్వాత తిరిగి వచ్చాడు.

సిగరెట్ వెలిగించి రెండు దమ్ములు లాగి, నోరు విప్పాడు. "నేను ఓ చిన్న కారు మెకానిక్‍ని. నా భార్య కోరికల్ని తీర్చే తాహతు లేనివాణ్ణి. అందుకే ఖరీదైన జీవితాన్ని వెదుక్కుంటూ నన్ను విడిచి వెళ్ళిపోయింది నా భార్య..." కసిగా మరో రెండు దమ్ములు లాగి పొగను గాలిలోకి ఊదాడు.

తలవంచుకుని మౌనంగా వుండిపోయిందామె. "నా భార్య పవిత్రను నేనెంతో ప్రేమించాను. తనకోసం తనను సుఖపెట్టడం కోసం ఎంతో తహతహలాడాను. రేయింబవళ్ళు కష్టించాను..." ఖాళీ అయిన బీర్‍బాటిల్ ఓవర్‍టైమ్ వర్క్ ఆరంభించడంతో గుండెల్లోని బాధంతా ఉప్పెనలా పెల్లుబికింది.

"కాని...కాని... నా పవిత్ర... నన్ను కాదని... ఏడాది క్రితం... ’ఏమండీ! ఈ పేదరికం భరించడం నా వల్ల కావడంలేదు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను’ అంటూ ఓ ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది..."

అతన్ని ఎలా అనునయించాలో తెలీలేదు ఆమెకు. వస్తూన్న దుఃఖాన్ని పంటి బిగువున ఆపుకుంది. "మరి మీరు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదా?"

తల అడ్డంగా త్రిప్పాడు అతను. "పవిత్రను నా ప్రాణంకంటే మిన్నగా ప్రేమించాను. నా పేదరికాన్ని ఎద్దేవా చేస్తూ ఎగిరిపోయింది. అయినా ఆమె స్థానంలో మరొకరిని వూహించుకోలేను" అన్నాడు.

"అందుకని... ఇలా... వేశ్యల చుట్టూ తిరిగితే... మీ ఆరోగ్యం ఏం కాను?" ఆమె స్వరంలో సన్నటి జీర.

ఆమె వంక చురుగ్గా చూశాడతను. "ఓ నిజం చెప్పనా? నా పవిత్ర వెళ్ళిపోయాక మరో స్త్రీవంక కన్నెత్తైనా చూళ్ళేదు నేను."

"మరి... ఇప్పుడు...!?" ఆశ్చర్యంగా అడిగింది.

మరో బీర్‍బాటిల్‍ను మౌనంగా ఖాళీ చేసాడు అతను. చికెన్ పీసెస్‍ని కసిగా నమిలాడు. "నేనిక్కడికి వచ్చింది సుఖంకోసం కాదు, ఎలిబీ... ఎలిబీ కోసం!" అన్నాడు.

అయోమయంగా చూసింది "ఎలిబీయా?"

"ఔను ఎలిబీ గురించి చెప్పేముందు నీకో విషయం చెప్పాలి..." చెప్పుకు పోయాడు అతను. "ఈ మధ్యే అనుకోకుండా పవిత్ర డైరీ దొరికింది నాకు. తాను డైరీ రాస్తుందన్న సంగతి నాకు అంతవరకు తెలియదు. ఆ డైరీలోని చివరి సంగతులు చదువుతూంటే నా మనసు బాధతో గిలగిలలాడిపోయింది. నా రక్తం మరిగి పోయింది..."

అతను ఉద్వేగంగా చెప్పుకుపోతూంటే నిశ్శబ్దంగా వింటూ వుండిపోయిందామె.

"ఓ సారి ఓ షాపింగ్‍ మాల్ లో ఆయేషా బేగం అనే ఓ యాభై ఏళ్ళ స్త్రీతో పరిచయమైంది పవిత్రకు. మాటలలో పెట్టి పవిత్రను తన ఇంటికి తీసుకువెళ్ళిందామె. కూల్ డ్రింక్ ఆఫర్ చేసింది. దాన్ని త్రాగిన పవిత్రకు స్పృహ తప్పింది. తెలివి వచ్చాక జరిగిన ఘోరం తెలుసుకుని కొయ్యబారి పోయింది....

ఆయేషా బేగం కాల్‍గర్ల్ రాకెట్ నడుపుతోంది. పవిత్రను మంచి మాటలతో మాయచేసి ఇంటికి తీసుకువెళ్ళి డ్రింక్‍లో మత్తుమందు కలిపి ఇచ్చింది. తెలివిలో లేని పవిత్ర ఒంటిమీది దుస్తులన్నీ తొలగించి నగ్నంగా వివిధ కోణాలలోంచి ఫోటోలు తీసింది. వాటిని చూపించి పవిత్రను తన రాకెట్‍లో సభ్యురాలిని కమ్మంది. భర్తతో కాపురం చేసుకుంటూనే రహస్యంగా కాల్‍గర్ల్‍గా వ్యవహరించవచ్చనీ, పుష్కలంగా డబ్బు సంపాదించవచ్చుననీ నచ్చజెప్ప జూసింది. పవిత్ర ఒప్పుకోలేదు. ఛీకొట్టింది.

 ఆమె ఫోటోలను ’యూట్యూబ్’ వగైరా సోషియల్ నెట్‍వర్క్స్‍లో పెడతాననీ, మొబైల్ ఫోన్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తాననీ బెదిరించింది ఆయేషా బేగం. ఆత్మహత్య అయినా చేసుకుంటాను గాని, కాల్‍గర్ల్‍గా మారనంది పవిత్ర. ఆమె చచ్చినా, ఆ ఫోటోలను విడుదల చేస్తాననీ, అందువల్ల ఆమె భర్త అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోక తప్పదనీ ఆయేషా బేగం హెచ్చరించింది... దాంతో పవిత్ర తీవ్ర మానసిక సంఘర్షణకు గురయింది.

భర్త చాటున వుంటూ వ్యభిచరించడం అతన్ని వంచించడమే అవుతుంది. అందుకే గత్యంతరం కానక నిస్సహాయ స్థితిలో... పేదరికాన్ని భరించలేక వెళ్ళిపోతున్నట్టు ఓ అబద్ధపు ఉత్తరం రాసిపెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయిందామె - ఆయేషా బేగం అనే భయంకర సాలెపురుగు గూటిలోకి...నా పవిత్ర తప్పు చేయలేదు. ఆ పరిస్థితిలో ఏ ఆడది వున్నా ఏం చేయగలదు?"

ముఖం చేతుల్లో కప్పుకుని చిన్నగా రోదించాడు అతను.

సజల నయనాలతో అతని వంక చూసిందామె. అనునయంగా అతని తల నిమురుతూ అతని ముఖాన్ని తన ఎదకు ఆన్చుకుంది.

చివాలున తలెత్తాడు అతను. "అందుకే...అందుకే... ఆ పాతకి ఆయేషా బేగాన్ని హతమార్చేశాను!" అన్నాడు ఆవేశంగా.

ఉలిక్కి పడిందామె. "ఆయేషా బేగాన్ని చంపేసారా!?"

"ఔను. అది పవిత్ర ఒక్కదాని సమస్యే కాదు. అలాంటి అమాయకపు యువతులు ఎందరు బలయిపోతున్నారో దాని స్వార్థానికి! ఆయేషా వంటి చీడపురుగులు జీవించి యుండకూడదు..." అన్నాడు ఆవేశంగా. "అందుకే వలవేసి పట్టుకున్నాను దాన్ని. వారం క్రితం కలుసుకుని నా పవిత్ర గురించి ఆరా తీసాను. తనకేమీ తెలియదంది. దాంతో గొడవపడి చంపేస్తానని బెదిరించాను... ఈ రోజు రాత్రి దాని చావుకు ముహూర్తం పెట్టాను. నా మీదకు అనుమానం రాకుండా ఎలిబీ సృష్టించుకునేందుకే బ్రోకర్‍తో చెప్పి ఈ రాత్రికి నాకో వేశ్య కావాలని చెప్పాను..."

అవాక్కయి వింటూ వుండిపోయిందామె.

"...గంట క్రితం ఆయేషా బేగం ఇంటికి వెళ్ళాను. నా చేతిలో పిస్టల్ చూసి భయంతో బిగిసి పోయింది ఆమె.

కసిగా పిస్టల్‍తో షూట్ చేసేసాను. ఆ దెయ్యం సోఫాలో ఒరిగి పోగానే మరోక్షణం అక్కడ వుండకుండా ఇక్కడికి వచ్చేసాను. వస్తూ వస్తూ పిస్టల్‍ని ఓ మురికి కాలువలో పడేసాను..."

ఓ క్షణం భయంకర నిశ్శబ్దం ఆవరించుకుంది వారి మధ్య.

ఇప్పుడు అతని గుండెలో బరువు దిగిపోయినట్టు తేలికగా వుంది.

ఆమె వదనంలో మాత్రం టెన్షన్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. "మీరు తొందర పడ్డారేమో..."

ఆమె పలుకులు పూర్తికాకుండానే డోర్‍బెల్ మ్రోగింది. బెల్‍తోపాటే తలుపు దబదబ బాదడం వినిపించింది.

"పోలీసులు!" తాపీగా అన్నాడతను ఆమె ప్రశ్నార్థక చూపులకు సమాధానంగా.

"పోలీసులా...!?" విభ్రాంతి చెందింది. ఆమె కన్నులలో భీతి తళుక్కుమంది.

"ఔను. నేనే ఫోన్ చేసాను" కూల్‍గా అన్నాడు.

అయోమయంగా చూసింది.

మందహాసం చేసాడు "ఆయేషా బేగం హత్యానేరం నా నెత్తి మీద పడకుండా వుండాలంటే బలమైన ఎలిబీ వుండాలి నాకు. వ్యభిచార నేరం క్రింద అరెస్టయి రాత్రంతా నేను సెల్‍లో గడిపితే... అంతకు మించిన ఎలిబీ ఇంకేముంటుంది? నువ్వు, పోలీసులే నా ఎలిబీ!"

ఆమె ఆశ్చర్యంనుండి తేరుకోకుండానే లేచి వెళ్ళి తలుపు తెరిచాడు అతను.

క్షణంలో ఆమెతో సహా వ్యభిచార చట్టం క్రింద అరెస్టయి పోలీసు స్టేషన్‍కి తరలింపబడ్డాడు.

#

రాత్రంతా పోలీస్ లాకప్‍లో గడిపిన అతను, ఆమె - మర్నాడు వ్యభిచార నేరం క్రింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచ బడ్డారు. నేరం వొప్పుకోవడం వల్ల జరిమానా విధించబడింది ఇద్దరికీను. జుల్మానా చెల్లించి బయటకు వచ్చారు ఇద్దరూ.

అక్కణ్ణుంచి తమ దారులు వేరు అన్నట్టు... ఆగి, లిప్తపాటు అతని కళ్ళలోకి చూసిందామె. చేతులు జోడించి నమస్కరించింది. తరువాత తలవంచుకుని భారమైన మనసుతో అక్కణ్ణుంచి వెళ్ళిపోబోయింది.

"పవిత్రా!" అన్న పిలుపు ఆర్ద్రంగా ఆమె కాళ్ళకు బంధం వేసింది.

రెండడుగులు ముందుకు వేసి ఆమెను సమీపించాడతను. "రా, పవిత్రా! మన ఇంటికి వెళదాం" అన్నాడు.

ఓ క్షణం తెల్లబోయిందామె. అనంతరం ఏరు కట్టలు త్రెంచుకున్నట్టు దుఃఖం పొంగి పొర్లింది. "ఏమండీ!" అంటూ అతన్ని కావలించుకుని భోరున ఏడ్చింది.

అనునయంగా ఆమె వీపు మీద రాస్తూ వుండిపోయాడతను, కట్టలు త్రెంచుకుంటున్న దుఃఖాన్ని అదుపు చేసుకుంటూ.

రెండు నిముషాల తరువాత అతని నుంచి దూరంగా జరిగిందామె. "క్షమించండి. నేను మీకు తగినదాన్ని కాను. చెడిపోయినదాన్ని. పూజకు పనికిరాని పుష్పాన్ననే నిన్న రాత్రి మీకు దగ్గర కాలేక పోయాను... నా మూలంగా మీ జీవితం నాశనం కావడమే కాక, హంతకుడిగా కూడా మారారు."

"లేదు, లేదు. జరిగిన దానిలో నీ తప్పేమీ లేదు... పవిత్రా! నాడు, నేడు నువ్వు పవిత్రవే!"

"మీరు పవిత్రా అని పిలిచినప్పుడల్లా నా అపవిత్రమైన జీవితం గుర్తుకు వచ్చి నన్ను తీవ్ర మనఃక్షోభానికి గురిచేస్తుంది. ఆ పవిత్రమైన పేరును పంకిలం చేయలేకనే పద్మగా మారాను. ఈ అభాగ్య జీవితాన్ని ఇలాగే సాగిపోనివ్వండి. మీరు మరో మంచి అమ్మాయిని పెళ్ళాడి సుఖంగా వుండండి" అంటూ నోట్లో చెంగు క్రుక్కుకుని వెళ్ళిపోబోతూంటే, చేయి పట్టుకుని ఆపాడు అతను.

"పవిత్రత అనేది మనసుకు చెందినది కాదు. నిజం తెలిసాక కూడా నువ్వు లేకుండా నేను ఇంటికి ఎలా తిరిగి వెళ్ళగలననుకున్నావ్?"

’మగవాళ్ళంతా మీలాగే విశాల హృదయులైతే ఎంత బావుణ్ణు!’ అనుకుందామె మదిలో

 అంతలో ఇద్దరు యువతులు ఆమె వద్దకు వచ్చారు. "పద్మక్కా! ఈ విషయం నీకు తెలుసా? రాత్రి ఆయేషా మేడమ్ ని ఎవరో పిస్టల్‍తో కాల్చారట!" అని ఒకామె అంటే –

"కాని, అంతకు ముందే ఆవిడ హార్ట్ ఎటాక్‍తో చనిపోయినట్టు పోస్ట్‍మార్టంలో తేలిందట!" అంది రెండో యువతి.

పవిత్ర విస్తుపోయి "ఆ విషయం మీకెలా తెలుసు?" అనడిగింది.

"ఆ బ్రోకర్ ఎవరితోనో ఫోన్‍లో చెబుతోంటే విన్నాం."

"అయితే ఆమెది సహజ మరణం అన్నమాట!" అంటూ మెరిసే కన్నులతో భర్త వంక చూసింది పవిత్ర.

అతని మదిలో హఠాత్తుగా ఏదో మెదిలింది... రాత్రి తాను వెళ్ళేసరికి ఆయేషా బేగం హాల్లో సోఫాలో ఒంటరిగా కూర్చునివుంది. చేతిలో సెల్ ఫోన్ వుంది. తనను చూసినా మనిషిలో చలనం లేదు. పిస్టల్ చూసి కొయ్యబారి పోయిందనుకున్నాడు. బులెట్ తగలగానే పక్కకు వొరిగిపోయింది. వెనుదిరిగి చూడకుండా బైటకు పరిగెత్తాడు తాను, పిస్టల్ శబ్దానికి ఆమె మనుషులు వస్తారన్న భయంతో...

ఆ వార్తతో తేలిక పడ్డ మనసులో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు అతను. ఆప్యాయంగా భార్య భుజం చుట్టూ చేయివేసి నడిపించాడు - సరికొత్త జీవితంలోకి…..

                                                   ******


Rate this content
Log in

Similar telugu story from Crime