SATYA PAVAN GANDHAM

Crime Inspirational Others

5.0  

SATYA PAVAN GANDHAM

Crime Inspirational Others

స్వప్నిక I A S(ఓ వేశ్య కథ) - 4

స్వప్నిక I A S(ఓ వేశ్య కథ) - 4

6 mins
574


గమనిక: ఇంతకముందు ఈ కథను చదవని వారు దయచేసి ముందు భాగాలు చదవగలరు.

"స్వప్నిక I A S (ఓ వేశ్య కథ) - 3" కి

కొనసాగింపు...

"స్వప్నిక I A S (ఓ వేశ్య కథ) - 4"

అలా తన జీవితం చిద్రమైన స్వప్నిక... చివరికి డీజీపీ సహాయంతో కోలుకుని, ఒక ఐఏఎస్ లాంటి గుర్తింపు కలిగిన జాబ్ లో స్థిరపడ్డాక...

చాలా మందికి తన ద్వారా సహాయమందించిందని మనమందరం ఇదివరకు తెలుసుకున్నాం.

తను సర్వీస్ లోకి వచ్చిన తర్వాత...

తను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో మాత్రమే కాక, చుట్టు పక్కల చాలా జిల్లాల్లో మొత్తానికి రాష్ట్రంలో కూడా చాలా వరకూ పరిస్థితులు చక్కబడ్డాయి. తను ఒక ఆఫీసర్ గానే కాకుండా ఓ మహిళగా ఎంతో మంది యువతకు, మహిళలకు ఆదర్శంగా మరియు స్ఫూర్తిగా నిలిచింది.

ఇలా ఉండగా...

ఒక రోజు తన ఆఫీసుకు వెళ్తూ కార్లో న్యూస్ పేపర్ చదువుతుండగా, తనని ఒక వార్త కలచివేసింది.

"ప్రేమకు యువతి బలి!"

ఇది ఆ న్యూస్ హెడ్ లైన్

దాని సారాంశం ఏంటంటే,

తోటి విద్యార్ధిని ప్రేమించిన ఇంజనీరింగ్ విద్యార్ధినిని!

ప్రేమికుడు నో చెప్పడంతో వెంటపడి వేధించి బెదిరించిన ప్రేమికురాలు.

అతను మరింత మందలించడంతో అవమానభారం సహించలేక, మనస్తాపంతో హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆ విద్యార్థిని ఆత్మహత్య!

సూసైడ్ నోట్ లో తన చావుకి ఎవరూ కారణం కాదంటూ వివరణ!

ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కూతురు ఇలా చేయడంతో కన్నీరుమున్నీరవుతున్న యువతి తల్లిదండ్రులు!

ఈ వార్త, అది కూడా తన జిల్లాకు సంబంధించిన పత్రికలో చూసి ఖంగుతిన్న స్వప్నిక...

ఒక్కసారిగా ఉలిక్కిపడడంతో... తన కార్ డ్రైవర్ ఒక్కసారిగా కార్ ఆపి,

"ఏమైందమ్మా..!" అంటూ ఆమెను ప్రశ్నించాడు.

"ఏంటి రంగయ్య ఇది!

ఒక పక్క నాకు జరిగిన అన్యాయం, మన రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి జరగకూడదని ఇన్ని సవరణలు తీసుకొస్తూ, అందరిలో స్ఫూర్తిని నింపుతుంటే...

ఇంకా ఇలాంటి బలహీన మనస్తత్వం గల అమ్మాయిలు ప్రేమ..! గీమ...! అంటూ తమకున్న ఆశయాలను, తమ వారు పెట్టుకున్న ఆశలను పక్కన పెట్టి, ఈ ప్రేమనే ఉచ్చులో పడి మరీ... ఇంత అవివేకంతో ప్రాణాలు తీసుకుంటున్నారు." అంటూ బదులిస్తూ తన చేతిలోనున్న ఆ పత్రికను అతడికిస్తూ ఆ వార్తను చూపించింది.

అది చూసిన రంగయ్య...!

"మీ కథ తెలిసి ఈ రాష్ట్రంలోని అమ్మాయిలందరూ ధైర్యంగా ముందుకు కదులుతారనుకుంటే, ఇదెంటమ్మా..! ఇంకొన్ని సంవత్సరాలు వెనకకి వెళ్లిపోతున్నారు!" అంటూ ఒక ఆడపిల్ల తండ్రిగా తన ఆవేదనని కూడా వెళ్ళబుచ్చుతాడు.

ఇక ఆ యువతి తల్లిదండ్రుల ఊరు తనకి సమీపంలోనే ఉండడంతో రంగయ్యని తన కార్ ని నేరుగా ఆ యువతి ఇంటికి తీసుకెళ్లమని చెప్పింది స్వప్నిక.

అలా వాళ్ళు ఆ యువతి ఇంటి అడ్రస్ కనుక్కుని సరిగ్గా అక్కడికి వెళ్ళేసరికి, దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న ఆ యువతి తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆ వీధి చివరి వరకూ వినిపిస్తున్నాయి.

అప్పటికే అక్కడి నుండి ఆ యువతి శవాన్ని, స్మశాన వాటికకు తరలించెందుకు ప్రయత్నిస్తూ ఆమెకు దహన సంస్కారాలు చేసే కార్యక్రమం చేపట్టారు అక్కడున్న వారు.

జరుగుతున్న తంతును చూసి చూడనట్లు గా వ్యవహరిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడే ఉండడం, తన కార్ ను చూసి వాళ్ళు ఒక్కసారిగా ఖంగుతినడం గమనించింది స్వప్నిక.

ఇంతలో కారు లో నుండి దిగుతున్న ఆమెను చూస్తూ, కొంచెం కంగారు పడుతూ గుటకలు మింగుతున్నారు ఆ కానిస్టేబుల్స్!

షాక్ నుండి తేరుకుని వెంటనే ఆమె డోర్ దగ్గరకు వచ్చి,

"మేడం..! మేడమ్..!!

మీరెంటి మేడం ఇలా వచ్చారు...?

ఇది...ఇదంతా మేము చూసుకుంటాం మేడం ...!

ఇది చాలా చిన్న విషయం..! అంటూ ఆమె లోపలకి వస్తుంటే, ఆమెకు అడ్డు తగులుతూ.. వాళ్లు తడబడుతున్న తీరు చూస్తుంటే, అప్పటికే స్వప్నికకి వారిపై సందేహం కలిగింది.

వెంటనే స్వప్నిక

"హుమ్...

ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు తెలుసు..!

ఇంతకీ బాడీకి పోస్టుమార్టం చేయించారా...?"

అంటూ ఆ ఇద్దరి కానిస్టేబుల్ నీ నిలదీసీంది.

దానికి వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకపోగా...

"ఇది చాలా చిన్న విషయం మేడం!

పైగా ఆ అమ్మాయి తల్లి దండ్రులు కూడా ...

ఈ కేసులు, పోస్టుమార్టాలు మాకొద్ధంటూ జరగాల్సిన దహన సంస్కారాలు చేయించడానికి వాళ్ళే ఒప్పుకున్నారు మేడం!" అంటూ స్వప్నికకి నచ్ఛ చెప్పే ప్రయత్నం చేశారు.

ఒక సీరియస్ లోక్ తో చెయ్యెత్తి వాళ్ల మాటలకు అడ్డుకట్ట వేసింది. వెంటనే ఆ డెడ్ బాడీ నీ పోస్టుమార్టం కి పంపమని ఆదేశించింది.

ఆమె నేరుగా ఆ యువతి తల్లి దండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని ఓదారుస్తూ...

పోస్ట్ మార్టం గురించి ఎందుకు వద్దన్నారొనని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయగా...

వాళ్లు ఆ పోలీసులు వంక చూస్తూ నోరు మెదపలేక తల దించుకున్నారు. భయపడుతూ మరింత బోరున విలపిస్తున్నారు.

ఇది గమనించిన స్వప్నిక...

మీకేం భయం లేదు పెద్దాయన, నేనొక కలెక్టర్ ని మీరు ఎవరికీ భయపడకుండా నిజం చెప్పండంటూ వాళ్ళకి ధైర్యాన్ని కలిగిస్తూ భరోసాను కల్పించింది.

బిక్కు బిక్కు మంటూనే, వాళ్ళలో దుఖం కట్టలు తెంచుకుని,

"ఇదిగో ఈ పోలీసోల్లే తల్లి ..!

మా బిడ్డ ఎవరో గొప్పింటోరిని పేమించిందని, అతడు కాదనేసరికి హాస్టల్లో ఊరేసుకుందని సెప్పారు.

ఇదిగో తెల్లారి ఈడకి తీసుకొచ్చి, మా బిడ్డ సవాన్ని మా ముందుంచారు.

పెద్దోళ్ల యవ్వారం...

కాటికి తీసుకెళ్లకుండా ఆలస్యం సేసేకొద్దీ మాకే సెడ్డని సెప్పారు..

ఎంత తొందరగా సవాన్ని కాటికి తీసుకుపోతే అంత మంచిదని ఒప్పించారమ్మా..!

అసలే నేను, మా ఇంటి ఆడది దిక్కూ మొక్కూ లేనోల్లం.

ఉన్న ఒక్కగానొక్క దిక్కు ఇలా అర్ధంతరంగా మమ్మల్ని ఒంటరోల్లని సేసి పోయింది కల్లక్టరెమ్మా!"

అంటూ బోరున విలపిస్తూ...

ఇదిగో ఏదో లెటర్ రాసి పోయిందంట నా కూతురు అంటూ ఈ కాగితం మా సేతిలో ఎట్టారు..

అంటూ ఆ లెటర్ స్వప్నికకి ఇచ్చాడు ఆ యువతి తండ్రి.

                    ****************

"అమ్మా..!

నాన్నా ..!!

నన్ను క్షమించండి..!

మధ్యతరగతి వారికి కూడా ఆడపిల్ల భారమవుతున్న ఈ రోజుల్లో...

కటిక భీదవారైన మీరు నన్ను పురిటిలోనే తుంచకుండా, ఇంత కాలం ఎంతో అల్లారు ముద్దుగా దేనికి లోటు లేకుండా నన్ను పెంచారు.

తినడానికి సరైన తిండి లేకపోయినా...

నాకు మూడు పూటలా తిండి పెట్టడం కోసం, మీరు ఒక్క పూటతోనే సరిపెట్టుకునేవారు.

మీ రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టి ఇన్నాళ్లు నన్ను చదివించారు.

నేనొక పెద్ద ఉద్యోగం సంపాదించి మీ ముందు ఒక మంచి స్థితిలో నిలవాలని, నా జీవితం బాగుండాలని ఆకాంక్షించారు.

కానీ, నా ఈ ప్రయాణంలో కొన్ని అనుకోని పరిస్థితులు, మరికొన్ని అనివార్యమైన వ్యాపకాలు, ఇంకొన్ని అనవసరమైన వ్యసనాలు నన్ను మీ నుండి ఇలా శాశ్వతంగా దూరం చేయడానికి భీజం వేశాయి.

నేనొక అబ్బాయిని ప్రేమించాను. తనొక గొప్పింటి అబ్బాయి. ఇలాంటి వాటిని కలలోకి, అసలు నా ఊహల్లోకి కూడా రానివ్వని నేను, ఎందుకో ఆ అబ్బాయి మంచి మనసు చూసి ఇష్టపడ్డాను. అదే విషయం ఆ అబ్బాయికి చెప్తే, ఆ అబ్బాయి కాదన్నాడు. బహుశా మనం ఒక బీదంటి వాళ్ళకి చెందిన వారమని అనుకుంటా అతడు నన్ను రిజెక్ట్ చేయడానికి గల కారణం. ఆ అబ్బాయి అలా కాదనే సరికి కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళాను.

అప్పటివరకూ కాలేజ్ టాపర్ గానున్న నేను, ఎందుకో ఒక్కసారిగా కుప్పకూలాను, నా చదువు సన్నగిల్లింది. అయినా ఆ అబ్బాయి మీద ఇష్టం పోవడం లేదు. నా ఆశయాలు పక్కన పెట్టి చాలా సార్లు పిచ్చి దానిలా తన వెంట పడ్డాను. నన్ను ప్రేమించమని బ్రతిమాలాడాను. అయినా అతడిలో ఏ మార్పు రాలేదు.

ఒకప్పుడు క్లాస్ టాపర్ గానున్న నేను, ఈ మధ్య కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేకపోతున్నాను. మానసికంగా చాలా ఆందోళనకు గురవుతున్నాను. ఇవన్నీ మీకు చెప్పే దైర్యం కానీ, సాహసం కానీ నేను చేయలేకపోతున్నాను.

ఇప్పటివరకూ మన వూరంతా నన్నొక తెలివైన అమ్మాయిగా కీర్తించారు కదమ్మా...! వాళ్ళకి కానీ, మీకు కానీ నా మొహం చూపించడానికి నాకు సిగ్గు గా ఉంది.

అందుకే, ఇప్పుడు నాకొచ్చిన ఈ కస్టమ్ ఎలా చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా ఒక పిరికిదానిలా అర్ధంతరంగా తనువు చాలిస్తున్నాను.

నా చావుకు, ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. అసలు ఎవరికి నా చావుతో సంబంధం లేదు. కేవలం నా ఆలోచనలు, నా కోరికలు నన్ను అంతం చేస్తున్నాయి.

ఆశ పడ్డది నేనే, ఆ అసలు పెంచుకున్నది నేనే!

నన్ను క్షమిస్తారు కదూ!

ఇట్లు,

మీ ...

దివ్య"

                  ****************

లెటర్ చదవడం పూర్తయ్యాక స్వప్నిక ధీనంగా, మరింత జాలిగా ఆ తల్లిదండ్రుల వంక చూస్తుండగా...

వాళ్ళు కూడా స్వప్నిక వైపు చూస్తూ...

"ఆ కాగితంలో మా బిడ్డ ఏం రాసిందో మాకు తెల్వదు కానీ కలెక్టరమ్మా...!,

మా బిడ్డ మాత్రం ఇలాంటాటి జోలికి పోయెటేది కాదమ్మా..!

ఇట్టాంటి సిన్న సిన్న ఇషయాలకి పానాలు తీసుకునేది అంతకన్నా కాదనీ కశ్చితంగా సెప్పగలను కలెక్టరమ్మా! ఎంత కట్టమొచ్చినా ఓర్సుకుంటం తనకి సిన్నప్పటి సంది అలవాటే.

ఈ సార్లు..!

మమ్మల్ని బెదిరించి భయపెడుతున్న తీరు సూత్తాంటే, మా బిడ్డ సావు మీద, మాకేదో అనుమానంగా ఉంది కలెక్టరమ్మా...!" అంటూ ఆ అమ్మాయి తండ్రి స్వప్నిక చేతులు పట్టుకుని తన గోడును వెళ్ళబుచ్చుతుంటే,

"ఇదిగో పెద్దాయన ఏం మాట్లాడుతున్నావ్...!" అంటూ అందులో ఒక కానిస్టేబుల్ వాళ్ళని గదమాయించబోయాడు,

"Let's stop it" అంటూ ఒక్కసారిగా వాళ్ల వైపు తిరిగి, తన కళ్ళెర్రజేస్తూ... గట్టిగా అతనిపై అరిచింది స్వప్నిక.

అసలు బాడీ నీ పోస్ట్ మార్టం చేయకుండా...

దహన సంస్కారాలు చేయమని మీకు ఎవరు చెప్పారు?

అది కూడా వీళ్ళని బలవంతంగా ఒప్పించి...

ముందు బాడీ నీ పోస్ట్ మార్టం కి పంపండి." అంటూ మళ్ళీ ఆ కానిస్టేబుల్స్ నీ హెచ్చరించింది స్వప్నిక.

దివ్య తల్లిదండ్రులను కాసేపు ఓదార్చి, ఈ కేసునీ తానే పర్సనల్ గా తీసుకుంటానంటూ వాళ్ళకి మాటిచ్చి దైర్యం చెప్పింది స్వప్నిక.

ఇక అక్కడ నుండి బయటకు వచ్చి, కార్ ఎక్కుతున్న స్వప్నికతో అక్కడున్న ఒక కానిస్టేబుల్ తనకి దగ్గరగా వచ్చి,

"ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారమ్మా...

మా ఎస్ పి గారు ఈ తంతు వీలైనంత తొందరగా ముగించేయమని చెప్పారమ్మా...!" అంటూ చెప్పడంతో...

స్వప్నిక మరింత కోపోధ్రిక్తురాలై, "ఈ విషయంలో ఎంతటి పెద్ద వాళ్ళున్న వదిలిపెట్టను, ముందు మీ ఎస్పీ నీ నన్ను కలవమని చెప్పండి." అంటూ వాళ్ళకి హెచ్చరిస్తుంది.

పని మీద ఢిల్లీ వెళ్లిన డీజీపీ కి కాల్ చేసి,

జరిగిన విషయమంతా వివరించి చెప్తుంది. ఈ కేసు విషయంలో అతని సహాయం కోరుతుంది.

తర్వాత రోజు డీజీపీ రాగానే, ఇద్దరూ కలిసి ఆ ఎస్పీ ని గట్టిగా మందలించి, అంతా కలిసి ఆ అమ్మాయి ఉంటున్న హాస్టల్ కి వెళ్లి అక్కడ పరిసరాలన్ని కొంతమంది పోలీసుల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

వాళ్ల సెర్చ్ ఆపరేషన్ లో వాళ్ళకి దివ్యకి సంబందించిన కొన్ని నోట్ బుక్స్ దొరుకుతాయి. అవి దివ్య వే అని అక్కడున్న తోటి విద్యార్థినిలు బట్టి కన్ఫర్మ్ చేసుకుంటారు.

కానీ, వాటిలో ఉన్న చేతి వ్రాతకు, అంతకు ముందు స్వప్నిక చదివిన లెటర్ లోనున్న చేతివ్రాత రెండూ వేరు వేరు గా ఉంటాయి. వాటి మధ్య అసలు పోలికే ఉండదు.

మరి ఆ లెటర్ సంగతేంటి..?

అందులో చేతి వ్రాత దివ్యది కాకపోతే, మరి అది ఎవరు రాశారు...?

అసలు ఆమెది ఆత్మహత్యా...? లేక హత్య...?

ఆమె చావుకు ఆమె ప్రేమే కారణమా..? లేక ఇంకేమైనా కారణాలున్నాయా...?

ఈ కేసుని ఆ డీజీపీ మరియు స్వప్నిక ఎలా చేధిస్తారు..?

అసలు దివ్య విషయంలో ఏం జరిగింది..?

తర్వాత భాగం "స్వప్నిక I A S (ఓ వేశ్య కథ) - 5" చూద్దాం.

అప్పటివరకూ మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు మీ సమీక్షల ద్వారా తెలుపగలరు.

                           ********

వివరణ :

పాఠకులందరికీ నా నమస్కారములు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత స్వప్నిక I A S (ఓ వేశ్య కథ) అనే కథను కొనసాగించడానికి పూనుకున్నాను. స్వప్నిక I A S కథ మూడవ భాగముతోనే ముగిద్దామనుకున్నా, ఎందుకో ఈ మధ్య ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు నా మదిని కలిచివేస్తూ ఈ కథను మరింత పొడిగించేలా చేస్తుంది. ముందు మూడు భాగాలను ఆదరించినట్టుగానే పాఠకులందరూ తర్వాతి భాగాలను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

రచన :

సత్య పవన్✍️✍️✍️

           


Rate this content
Log in

Similar telugu story from Crime