SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

4.5  

SATYA PAVAN GANDHAM

Abstract Classics Inspirational

"పట్టణంలో పెద్దాయన ! - 4"

"పట్టణంలో పెద్దాయన ! - 4"

6 mins
371


" పట్టణంలో పెద్దాయన ! - 3 " కి

కొనసాగింపు...

" పట్టణంలో పెద్దాయన ! - 4 "


అలా నేను నా రెండో కొడుకు ఇంటికి వెళ్ళగానే,

గుమ్మం దగ్గరే నిలబెట్టి నా రెండో కోడలు అడిగిన మొట్ట మొదటి మాట ...

" అదేంటి అప్పుడే వచ్చేశారు ... !

ఇంకా నెల కాలేదుగా ? "

ఆ మాటతో నా మనసు ఒక్కసారిగా చివుక్కు మంది.

ఇంతలో లోపలి నుండి నా రెండో కొడుకు వచ్చి...

"అదేంటే ...

వచ్చిన మా నాన్నను గుమ్మం దగ్గరే నిలబెట్టేసి ,

ఏంటా ఆ మాట ! " అంటూ వాడు కోడలిని కసురుకోగానే

ఆమె మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది.

ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యంగా ఆ గుమ్మం వద్దే నిలబడి చూస్తున్న నన్ను...

" లోపలికి రండి నాన్న !

దాని సంగతి మీకు తెలిసిందే కదా ...

కొంచెం వాళ్ల ఇంట్లో వాళ్ళతో ఏవో చిన్న గొడవలు ఉంటే ,

ఇంకా అదే ఆలోచనలో ఉన్నట్టు ఉంది.

మీరేం అవేం పట్టించుకోకండి ! " అంటూ నా చేతిలో ఉన్న ఆ బట్టల సంచి తీసుకుని నన్ను లోపలికి తీసుకుని వెళ్ళాడు.

కాసేపు అలా సేద తీరిన తర్వాత ...

" ఇంత సడెన్ గా అన్నయ్య ఇంటి దగ్గర నుండి రావడానికి కారణం ఏంటి నాన్న ?

కబురు పెడితే నేనే వచ్చి , మిమ్మల్ని తీసుకుని వచ్చేవాడిని కదా !" అంటూ రెండోవాడు అడిగినా...

నేను అక్కడ జరిగిన అసలు విషయం చెప్పకుండా కప్పిపుచ్చుతూ...

"వాళ్ళు ఉద్యోగం విషయంలో చాలా బిజీ గా ఉంటున్నారు రా !

పిల్లలేమో స్కూళ్లకు వెళ్లిపోతున్నారు !

నాకా అక్కడ ఏమీ తోచడం లేదు !

ఇక్కడైతే మీ పిల్లలను ఇంకా స్కూల్లో వేయలేదు గా...

మీరు లేకపోయినా ..

వాళ్ళతో అయితే కాసేపు కాలక్షేపం అవుతుందనీ

అక్కడ నుండి ..." అంటూ నా మాట పూర్తయ్యే లోపు...

" అయ్యో ... అవునా మావయ్య గారు !

ఈ మధ్య మేము కూడా వర్క్ విషయంలో బిజీగా ఉంటున్నాం...

అందుకని, పిల్లల్ని ఏదైనా చైల్డ్ కేర్ లో జాయిన్ చేయిధ్దామని అనుకుంటున్నాం !!

అప్పుడు మీకు ఇక్కడ కూడా కాలక్షేపం అవ్వదు గా మరి !" అంటూ కొట్టకుండానే దెబ్బ తగిలేట్టు నవ్వుతూ సమాధానం చెప్పింది.

దానికి రెండోవాడు ...

"అబ్బా ... !

అది ఇంకో వారం తర్వాత కదా !

అప్పుడు చూద్దాం లే, దానికెందుకంత తొందర ! " అంటూ ఆమె మీద చిరాకు పడడంతో, ఆమె మళ్ళీ మూతి బిగించుకొని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది.

అలా ఓ రెండు రోజులు అక్కడ రెండో కోడలితో కొంచెం భారంగానే గడిచింది.

కానీ, వాళ్ల పిల్లలతో కాలక్షేపం వలన ఆ భారం నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదు.

కానీ ఆ మరుసటి రోజు ఉదయం నేను లేచేసరికి...

మా రెండోవాడికి , కోడలికి పెద్దగా మాటల యుద్ధం జరుగుతుంది.

నిజానికి, ఆ శబ్దానికే నాకు మెలకువ వచ్చింది.

" ఏమిటా ? "

అని నేను కొంచెం కంగారుగా అటుగా వెళ్ళేసరికి

మా వాడు...

" నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదు...

తీసిన నగలు ఎక్కడ పెడతావో నీకే తెలీదు.

అదేమైనా చిన్నా చితక వస్తువా !

బంగారపు నెక్లెస్ ..,

కొనే వరకూ పట్టుకుని చంపేశావు.

తీరా ఇప్పుడేమో వస్తువు అంటే జాగ్రత్త లేకుండా పోయింది !! " అంటూ కోడలిని తిడుతున్నాడు.

"అదేంటి ?

మీరు ప్రతిదానికీ నన్నే అంటారు.

ఇక్కడే పెట్టాను అని అంటున్నానుగా

వస్తువులంటే మీకేనా బాధ్యత, నాకు లేదా ?" అంటూ ఆమె కూడా ధీటుగానే సమాధానం చెప్తుంది.

ఇంతలో అక్కడికి వెళ్ళిన నేను

వాళ్ల గొడవకి అడ్డు పడుతూ...

"ఏమైంది రా ! " అంటూ మా వాడి వైపు చూస్తూ అడిగాను

దానికి నా కొడుకు

" ఏం లేదు నాన్న ...

తన బంగారపు నెక్లస్ ఒకటి కనిపించడం లేదు...

ఇదేమో ఇక్కడే పెట్టాను అంటుంది !

కానీ ఎంత వెతికినా కనిపించడం లేదు." అంటూ జరిగిన విషయం చెప్పాడు.

చెప్తూనే వాడు కూడా కొంచెం ఆందోళనలో కనిపించాడు.

దానికి నేను

"ఇక్కడే పెడితే ఎక్కడికి పోతుంది లేరా !

ఇక్కడే ఎక్కడో ఉంటుంది లే.

ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకుని, కాస్త సరిగ్గా వెతుకమ్మా ... !!" అంటూ నాకున్న పెద్దరికంతో నా కోడలిని చూస్తూ ఓ చిన్న సలహా ఇవ్వబోయాను.

ఆ నా మాటలో ఆమెకు ఏం తప్పు కనిపించిందో ఏమో?

"ఇక్కడే పెట్టానని ఇందాకటి నుండి వాగుతున్న కదా !

నాకంత మతి మరుపేమీ లేదు !

అయినా అందరూ నాకు చెప్పే వాళ్ళు అయిపోయారు.

ఇన్ని రోజులు భద్రంగా ఉన్న వస్తువు ఇప్పుడు ఒక్కసారిగా ఎలా మాయమవుతుంది ?

ఇంట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ల పనే అయ్యుంటుందని నా అనుమానం !" అంటూ నన్ను దొంగను చేస్తూ, నన్నే ఉద్దేశించి అంది ఆ మాటలు.

ఆమె మాటలకు నా రెండో కొడుక్కి ఒక్కసారి కోపం కట్టెలు తెంచుకుని

" ఏం వాగావే ?"

అంటూ ఆమె పై చెయ్యి ఎత్తబోయాడు...

పక్కనే ఉన్న నేను వాడ్ని అడ్డుకుని...

"ఉరుకోరా !

ఎంటా కోపం !

తనేదో చిన్న పిల్ల ,

తెలిసో తెలియకో మాట్లాడింది...

అంత మాత్రం దానికే నా ముందే అలా ఆమె మీద చెయ్యి ఎత్తుతావా ?" అంటూ నేను వాడిని గదిమాను.

దాంతో వాడు కొంచెం శాంతించి తగ్గినా...

" ఇది చిన్న పిల్ల ఏంటి నాన్నా ...!

ఒళ్లంతా కొవ్వు పట్టి, నోటికొచ్చినట్లు వాగుంతుంటే ! "

అంటూ ఆమెపై కల్లెర్ర చేస్తూ, పళ్ళు నూరుతూ కొప్పడుతూ తిడుతున్నాడు.

అప్పటికి వరకూ కోపంతో రగిలిపోయిన ఆమె కూడా ఒక్కసారిగా ఏడుస్తూ...

" నేనన్న దాంట్లో తప్పేం ఉంది?

ఉన్నవి రెండు గదులు, ఈ గదిలో ఎంత వెతికినా దొరకలేదు.

ఇక మిగిలింది ఆ పక్క గదే కదా అక్కడ కూడా వెతికితే ,

ఏమో అక్కడే ఉండచ్చేమో?

ఒక్కసారి అక్కడ కూడా వెతికితే తెలుస్తుందిగా...

దొరకకపోతే అప్పుడే నన్ను చావ గొట్టండి !

పైగా మావయ్యగారు పిల్లాడిని ఆడిస్తానని మన బెడ్ రూం లోకి వచ్చారు. అప్పుడు నేను వంట గదిలో బిజీ గా ఉన్నాను. మీరు బయటకి వెళ్ళారు. అందుకే ఆ అనుమానంతోనే అడుగుతున్నా..." అంటూ నా బంగారపు నగ నేనే తీసుంటానన్న అనుమానం వ్యక్తం చేసింది.

"నీకు ఎన్ని సార్లు చెప్పినా ...

మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావే !"

అంటూ మళ్ళీ ఆమె మీదకి చెయ్యి ఎత్తబోయాడు వాడు...

మళ్ళీ నేను అడ్డుకుని,

"ఊరుకో వెధవ !

ఆవిడ అన్న దాంట్లో తప్పేం ఉంది.

" తన పాతివ్రత్యం నిరూపించుకోవడానికి సీత దేవి కూడా అగ్ని ప్రవేశం చేసింది. మానవ మాతృలం మనమెంత రా ! "

ఆవిడ అన్నట్టు గానే ఒకసారి చూస్తే ఏమైంది ?" అంటూ వాడికి నేను సర్ది చెప్పాను.

దీంతో వాడు నా కోడలి వైపు కోపంగా చూస్తూ...

" నువ్వన్నట్టుగానే అక్కడికి వెళ్లి వెతుకుదాం...

ఆ నగ అక్కడ లేకపోతే ...

అప్పుడు నీ సంగతి చూస్తా !" అంటూ ఆవేశంగా నా రూంలోకి వెళ్ళాడు.

వాడితో పాటు మొహం రాల్చుకుంటూ నా కోడలు

వాడి వెనుకే వెళ్ళింది.

నేను మాత్రం అసలేం జరుగుతుందో అర్థం కాక, 

అక్కడి నుండి మెల్లగా హాల్లొకి వచ్చి ఆలోచిస్తున్నాను.

అలా వాళ్ళు నా గదిలోకి వెళ్ళిన కాసేపటికి

"నేను చెప్పా కదా !

ఇప్పుడేం అంటారు చెప్పండి !

ఇందాక నా మీద ఎత్తిన చెయ్యి ఇప్పుడు ఆయన మీద ఎత్తగలరా !" అంటూ నా కోడలు గట్టి గట్టిగా మరింత పెద్దగా అరుస్తుంది.

ఆ అరుపులకి ఆలోచనలో నుండి బయటికి వచ్చి ఉలిక్కిపడ్డ నేను ఆ గదిలోకి వెళ్ళి చూడగా,

" నా కొడుకు చేతిలో ఆ పోయిన బంగారపు నగ,

కింద ఓపెన్ చేసి చెల్లా చెదురుగా ఉన్న నా బట్టలతో బ్యాగు.

నిప్పుల కొలిమిలా కల్లేర్ర జేస్తూ నా వైపు చూస్తున్న నా కోడలు మొహం

తన తండ్రే తన ఇంటి దొంగ అయ్యాడా అన్నట్టు చూస్తున్నా నా కొడుకు ముఖభావం ! " నాకేం అర్థం కావడం లేదు.

"ఇది...

ఇది...

నా బ్యాగ్ లోకి..." అంటూ నేను తడబడుతూ మాట్లాడుతుంటే,

" ఇక చాల్లే ఆపండి మీ నాటకాలు ...

ఇంత వయసొచ్చింది కొడుకు ఇంట్లో దొంగతనం చేయడానికి సిగ్గు లేదు !

ఈయన వచ్చినప్పటి నుండే ఈ ఇంట్లో మన ఇద్దరికీ పడడం లేదని ఎన్ని సార్లు చెప్పినా విన్నారా మీరు ? " అంటూ నన్ను దూషిస్తూ నా కొడుకుని కడిగేయడం మొదలు పెట్టింది నా కోడలు

నన్నేం అన్నా అడ్డు పడే నా కొడుకు ఆమె మాటలకు ఈసారి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు.

బహుశా నేను దొంగతనం చేశానని వాడు కూడా నమ్మిన్నట్టు ఉన్నాడు.

నిశబ్దంగా నడుచుకుంటూ బయటకి వెళ్ళిపోయాడు.

కానీ, నా కోడలు మాత్రం తన నోటికి అడ్డు అదుపూ లేకుండా పోయింది. నన్ను ఏకధాటిగా ఏకిపారేస్తూనే ఉంది.

" ఇంత జరిగినా ఇంకా ఈ ఇంట్లో ఉండడానికి సిగ్గుండాలి!" అంటూ ఆమె కరుగ్గా ఓ మాట అనేసి నా ముందు నుండి వెళ్ళిపోయింది.

దాంతో చేసేదేం లేక,

చిందర వందర గా ఉన్న నా బట్టల బ్యాగు సర్దుకుని, 

దొంగ తనం చేసి దొరికిపోయిన ఓ దొంగలా వాళ్ల ఇంటి నుండి కూడా బయటకు వచ్చేసాను.

                     *********

" నాకు ఇక్కడ అర్థం కాని విషయాలు ఏంటంటే ?

ఎవరూ లేక వాళ్లింట్లోనే తింటున్న నాకు ఆ నగతో పని ఏముంది ?

అంత సంపాదించి , ఉన్నదంతా కొడుకులకి ఇచ్చేసి, నా జీవితం చివరి దశలో అయ్యో రామా అంటూ అనుకోవాల్సి వయసులో డబ్బు మీద ఆశ ఇంకా ఎందుకు ఉంటుంది ?

నాకు తెలియకుండా నా బ్యాగులోకి ఆ నగ ఎలా వస్తుంది. ఒకవేళ తీసిన వాడిని అయితే, నా కొడుకు కోడలిని అటువైపు వెళ్లకుండా అడ్డు పడేవాడిని, చివరగా ఏదో కారణం చెప్పి ఆ ఇంట్లో నుండి బయట పదేవాడిని కదా ?

అసలు ఆ నగ నా బ్యాగులోనే ఉందని నా కోడలు అంతా కచ్చితంగా ఎలా చెప్పగలిగింది ? "

నాకొచ్చిన ఈ ఆలోచనలు అన్నీ, నా రెండో కొడుక్కి వచ్చి ఉంటే ....

ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేది కాదేమో?

అంటూ ఆ పెద్దాయన హోటల్ యజమానితో చెప్తూ కన్నీరు పెట్టుకుంటుంటే,

ఆ హోటల్ యజమానికి, అక్కడున్న సిబ్బందికి, వాళ్ళతో పాటు నా కళ్ళు కూడా చెమ్మగిల్లాయి.

అవును...

ఆ పెద్దాయన చెప్పిన దాని బట్టి, తన కొడుకు ఒక్కసారి ఆయన గురించి ఆలోచించి ఉంటే తెలిసేది,

ఇదంతా ఆ అతని భార్య ఒక పథకం ప్రకారం చేసి, తన తండ్రిని ఇంట్లో నుండి వెళ్ళిపోయేట్టు చేసిందని !

ఇక ఆ పెద్దాయన తన మూడో కొడుకు ఇంటికి వెళ్ళాడా ?

లేక, అక్కడ కూడా ఇలాంటిది ఏదోకటి జరుగుతుందని భావించి రోడ్డున పడ్డాడా ?

తర్వాతి భాగం " పట్టణంలో పెద్దాయన ! - 5 " లో తెలుసుకుందాం.

నా రచనలను ఆదరిస్తున్న పాఠకులందరికీ నా kkహృదయ పూర్వక కృతజ్ఞతలు.

రచన: సత్య పవన్



Rate this content
Log in

Similar telugu story from Abstract