Rama Seshu Nandagiri

Abstract

2.5  

Rama Seshu Nandagiri

Abstract

అమ్మ ప్రేమ

అమ్మ ప్రేమ

3 mins
24.3K


"హాయ్" స్నేహితులందరూ కూర్చొని ఉన్న చోటికి వచ్చి అందరినీ ఒకేసారి పలుకరిస్తూ వచ్చి కూర్చుంది ఇందు.

"ఏంటే, ఇంతాలస్యం?" అడిగింది రమ.

"ఏంలేదు, ఇంటికి చుట్టాలొచ్చారు. వాళ్ళు వెళ్ళాక బైల్దేరాను. అదీ ఆలస్యం." అంది ఇందు.

"ఏంటీ, పెళ్ళి చూపులా!" ఆరాగా అడిగింది జయ.

"చుట్టాలంటే పెళ్ళి చూపులనా అర్థం. ఇంకెవరూ రాకూడదా!" చురుగ్గా చూసింది ఇందు.

"ఈవిడ గారికి పెళ్ళి చూపులు అయినప్పటి నుండి అదే ధ్యాస." వెటకరించింది సుమ.

"పోండే, నేనేమైనా తప్పుగా అన్నానా. మీకెవరికీ పెళ్ళి చూపులు కావా, పెళ్ళిళ్ళు జరగవా." మూతి ముడిచింది జయ.

"అమ్మా తల్లీ, మాకూ అన్నీ జరుగుతాయి, తల్లులం కూడా అవుతాం. సరేనా." అంది రమ చేతులు జోడించి.

ఆమె మాటలకు అందరూ నవ్వేశారు. ఇందు, జయ, రమ, సుమ చిన్నప్పటి నుండి స్నేహితులు. నలుగురు ఈ మధ్యనే డిగ్రీ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అందరికీ ఇళ్ళల్లో పెళ్ళి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారంతా ఆదివారం కావడంతో బీచ్ లో కలుసుకున్నారు.

"తల్లులం అంటే గుర్తు వచ్చింది, మే నెల లో రెండవ ఆదివారం నాడు కదూ మదర్స్ డే." అడిగింది జయ.

"ఏం అమ్మ కేమైనా కొందామనా." అడిగింది సుమ.

"కాదే, మామూలుగా అడిగాను. అయినా అది విదేశీ సంస్కృతి. విదేశాల్లో ఎక్కువ శాతం తల్లిదండ్రులకి దూరంగా ఉంటారు, కాబట్టి వాళ్ళు ఆ పేరుతో ఆ రోజు కలుస్తారు. ఆ రోజే అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అంతా కలిసి ఒక చోట చేరేది." అంది జయ.

వెంటనే మిగిలిన వాళ్ళు చప్పట్లు కొట్టారు.

"సూపర్ జయా, నీకు జ్ఞానం బాగా పెరిగింది సుమీ." అంది రమ నవ్వుతూ.

"పోండే, నేనేమన్నా వెటకారం చేస్తారు." అంది చిరు కోపంతో.

"లేదే బాబూ నిజమే. నువ్వన్నది అక్షర సత్యం. సృష్టి లో తీయనిది అమ్మ ప్రేమ. ఆమె ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకో లేనిది. నవ మాసాలు మోసి, అన్ని రకాల సేవలు చేసి‌ మన నుండి ఎటువంటి ప్రతిఫలాన్ని కోరనిది అమ్మ ప్రేమ." అంది రమ. "ఏంటో అందరికీ జనరల్ నాలెడ్జ్ బాగా పెరిగిపోయింది. అందరూ ఇంటర్వ్యూలకి వెళ్తున్నారా ఏంటి?" అడిగింది ఇందు.

"చాల్లేవే. అమ్మ గురించి మాట్లాడడానికి పుస్తకాలు చదవాలా. అది అన్నది నిజమేగా. ఇన్ని సేవలు చేసే అమ్మకు ప్రతిగా ఏమివ్వగలం? అమ్మ ఋణాన్ని తీర్చు కోవడానికి మన జీవిత కాలం సరిపోతుందా! ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం? అమ్మకు మన చేతనైన సేవ చేయడం తప్ప, ఏమీ చేయలేం. ఆమెకి సేవ చేసే భాగ్యం కలిగించమని ఆ దేవుని వేడుకో వడమే మనం చేయ గలిగినది." అంది సుమ.

"నిజమే సుమా. అటువంటి తల్లి కి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవడం మన కర్తవ్యం. మన జీవితంలో తొలి స్పర్శ తల్లిది. ఆమె తరువాతనే మన జీవితంలో ఎవరు ప్రవేశించినా. భర్త, భార్యా, పిల్లలు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు ఆమె తరువాతనే. చివరికి తండ్రి కూడా ఆమె ద్వారానే పరిచయం." అంది ఇందు.

"సరిగ్గా చెప్పావు ఇందూ. ఇంతటి అనుబంధం పెనవేసుకొని ఉన్న తల్లి ని ప్రేమ, పెళ్లి పేరుతో దూరం చేసుకోవడం ఎంతటి అవివేకం! ఎటువంటి బంధమైనా తల్లీ పిల్లల మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఇవ్వకూడదు. చదువు, ఉద్యోగం పేరుతో కొన్ని వేల మైళ్ళ దూరాన ఉండవచ్చు. కానీ మానసికంగా ‌తల్లికి, పిలిస్తే పలికే లాగా ఉండాలి." అంది రమ.

"అవును. ఏ‌ బంధమైనా జీవితం లో కోల్పోతే తిరిగి పొందగలం. కానీ అమ్మ అనే పేగు బంధం మళ్ళీ పుట్టినప్పుడు మాత్రమే పొందగలం. కాబట్టి అమ్మ ఎప్పుడూ ఆనందంగా ఉండేలా ప్రయత్నం చేద్దాం." దృఢంగా పలికింది జయ.

"సరిగ్గా చెప్పావే. ఈ ప్రపంచం లో తల్లి ప్రేమ ను పొంది, ఆమె విలువను తెలుసుకోలేక దూరంగా ఉంచే వాళ్ళున్నారు. పురిటిలో ఉండగానే ఆమె ప్రేమకు దూరమై అలమటించే వారున్నారు. అటువంటి వారికి తల్లి ప్రేమ అపురూపమైన వరం. వాళ్ళని తలుచుకుంటే జాలి కలుగుతుంది. బాధ అనిపిస్తుంది." బాధ పడుతున్నట్లుగా ‌అంది ఇందు.

"అంతేనే. కొన్నిసార్లు మన దగ్గర ఉన్న వస్తువు లేకపోతే కానీ దాని విలువ తెలిసి రాదు. ఏ వస్తువునైనా కష్టపడి సంపాదించ వచ్చు. కానీ తల్లిని, ఆమె ప్రేమను కోల్పోతే తిరిగి పొందలేం. మనం మరణించిన తర్వాత మళ్ళీ జన్మించి నప్పుడే తల్లి ని, తల్లి ప్రేమను పొంద గలిగేది. కాబట్టి తల్లి మనసు కష్ట పెట్టే ముందు కాస్త ఆలోచించాలి." అంది సుమ.

"అమ్మ మన నుండి కోరుకొనేది స్వచ్ఛమైన చిరునవ్వు, చల్లని పలకరింపు. ఈ రెండూ మనకు ఖర్చు లేనివి కానీ ఆమెకు విలువైనవి. అమ్మ మనం కోరుకున్న వాటిని మనకు అందివ్వ డానికి ఎన్నో త్యాగాలు చేసి ఉంటుంది. కానీ నోరు విడిచి ఇది కావాలని ఏనాడూ అడగదు. మనమే మనకు వీలైనంతలో తను సంతోషంగా ఉండగలిగేలా చూడాలి." అంది రమ‌ సాలోచనగా.

"అబ్బో, చాలా ‌టైమైంది. లేవండి. కబుర్లలో సమయం తెలియ కుండానే గడిచిపోయింది." హడావిడిగా లేస్తూ అంది ఇందు.

"నీవల్లే కదే ఈ టాపిక్ మొదలైంది." అంది జయ తను కూడా లేచి నవ్వుతూ.

"నేనా, ఏం నేనేమన్నాను?" అంది ఆశ్చర్యంగా ఇందు.

"తమరు ఆలస్యంగా రావడం, జయ కామెంట్, దానిపై రమ వివరణ, మదర్స్ డే టాపిక్....వెరసి ఈ ఆలస్యానికి కారణాలు." సుమ నవ్వుతూ అంది.

"సరే, సరే, పదండే బాబూ, అమ్మ తిడుతుంది." అంటూ జయ బైటికి దారి తీసింది. అందరూ ఆమెను అనుసరించి ఇంటి దారి పట్టారు.



Rate this content
Log in

Similar telugu story from Abstract