మాస్టారు-ఆనందం
మాస్టారు-ఆనందం


"సారూ, ఇదుగోనండీ మీరడిన నెయ్యి, అడగని మల్లెపూలు. పూలు అమ్మగారికి, అమ్మాయిగారికి ఇమ్మని మా యావిడ ఇచ్చిందండీ." అంటూ పిలుపు విని బైటికొచ్చిన మాస్టారి చేతులో పెట్టాడు ఆనందం.
"ఏమోయ్, ఆనందం, చాలా బ్రహ్మానందం గా ఉన్నట్టున్నావ్, ఏమిటి నీ కథ, కథనం! దేనికోయ్ మస్కా!" అంటూ అతను తెచ్చిన పూలపొట్లం తీసుకుని నవ్వారు మాస్టారు.
"నమస్కారం తెలుగు మాస్టారు. మస్కా
కాదండీ బాబూ, చూశారా పెద్దగా చదవుకోని నాలాంటి వారు కూడా చక్కటి తెలుగు
మాట్లాడుతున్నాడంటే అంతా మరి మీ మహిమే." మృదుహాసంతోనే పరిహాసం చేశాడు ఆనందం.
"అడిగిన నెయ్యి, అడగని మల్లెపూలు, పూలు అంటూ భలేగా మాట్లాడుతున్నావు. నాముందా నువ్వు మల్లె మొగ్గలు తెచ్చి, పిల్లిమొగ్గలు వేసేది"
అన్నారు మాస్టారు.
"అయ్యో అదేంలేదు సారూ! ఇవి ఇంట్లో కాసిన మల్లె మొగ్గల మాల, ఇది కూడా ఇంట్లోనే కాసిన నెయ్యి, అని తెచ్చాను సారూ." అంటూ ఒక కేన్ కూడా చేత పెట్టాడు ఆనందం.
"ఆనందం, మంచి సమయానికిచ్చి పరమానంద
పరచావయ్యా. ఇంటికి పెద్దవారు వస్తున్నారు "
సంతోషం వ్యక్తపరచారు మాస్టారు.
"ఏంటి సార్, దాస్తున్నారు! పెద్దవారా, వచ్చేది
పెళ్ళివారా!" నవ్వాడు ఆనందం.
"నీ నోటి వాక్యాన, ప
్రస్తుతానికి పెద్దవారు, అన్నీ కుదిరితే పెళ్ళివారేనోయ్." అంటూ నవ్వారు మాస్టారు.
"సార్ చెల్లెమ్మ పెళ్ళికి పాలు, పెరుగు, నెయ్యి నేనే ఇస్తాను. మీరెవరికీ మాటివ్వకూడదు మరి. నా మాటంటే మాటే." అన్నాడు ఆనందం.
మర్నాడు మామూలుగానే పాలు పోయడానికి వచ్చిన ఆనందాన్ని చూసి మాస్టారు, "ఒరేయ్ ఆనందం, పరమానందభరితమైన విషయం రా. అమ్మాయి పెళ్ళి కుదిరింది. పెళ్ళివారికి అంతా సాంప్రదాయబద్ధంగా చేయాలట. నేతిమిఠాయిలే కావాలట. రెండు నెలలే సమయముంది. చేస్కోరా పండగ." అన్నారు నవ్వుతూ.
"నిజంగా పండగనే సార్. నా కాడి నెయ్యి సాలక గుత్తకి తీస్కోవాల మావోళ్ళ దగ్గర. అయినా పర్లేదు సార్. నే జూస్కుంటా అయ్యన్నీ. మీ పన్లు మీరు కానీండి. వస్తానిక. నమస్తే సారూ. ఇగ మస్తే మనకి." అంటూ వెళ్ళబోయాడు ఆనందం.
"ఏమో నీకు మిఠాయిలు, నెయ్యి, పెరుగు అప్పచెప్పాను. అప్పగింతల సమయం వరకు ఆ వస్తువుల విషయంలో బాధ్యత నీదే మరి." అన్నారు మాస్టారు.
"ఏం పర్లేదు సారూ. ఏ మాటా రాదు. మంచివారికి మంచే జరుగుతుంది సారూ. వస్తాను సారూ" అంటూ ఆనందం ఎంతో ఆనందభరితుడై వెళ్ళి పోయాడు.
.......సమాప్తం......