మిస్టరీ(చిన్న కథ)
మిస్టరీ(చిన్న కథ)
మిస్టరీ (చిన్న కథ)
------------------------
డి౼మార్ట్ లో వెహికల్ పార్క్ చేసి,లోపలికి దారి తీస్తుండగా ఒకమ్మాయి హెల్మిట్ పెట్టుకుని టి.వి.ఎస్ జూపిటర్ కొత్త బండి నా వెహికల్ పక్కనే పార్క్ చేసింది,నేను ఎగా,దిగా ఆ అమ్మాయి వైపు,బండి వైపు చూసి,కొంత దూరం వెళ్ళాక మరోసారి చూసి లోపలికి వెళ్ళాను.
గ్లాసులు,స్టాండులు అమ్మే సెక్షన్ దగ్గర,మంచి చాకు ఒకటి తీసుకున్నాను.దాన్ని పట్టుకుని లోపలంతా తిరుగుతున్నాను.నాది ఈఊరు కాదు,కన్స్ట్రక్షన్ పనిమీద ఆరునెలలు ఈ ఊర్లో ఉండవల్సి వచ్చింది.ఒక రూమ్,హాల్ ఉన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాను.రోజూ ఫ్రూయిట్స్ కోసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని ప్రత్యేకంగా చాకు కొనడానికి వచ్చాను.
నేను లోపల డి౼మార్ట్ లో తిరుగుతుండగా,ఎవరో ముగ్గురు,నలుగురు నన్ను వెంబడిస్తున్నట్టు అనిపించింది.తెల్సిన వాళ్ళైతే పలకరిస్తారు. శత్రువులైతేనే ఇలా చేస్తారు.నా జీవితంలో శత్రువులు ఎవరూ లేరు,ఉండరు కూడాను.ఎవరబ్బా!!!అనుకుంటూ ఒక కంట కనిపెడుతున్నాను.
బెడ్ షీట్స్ సెక్షన్ దగ్గర ఒక బెడ్ షీట్,రెండు కర్చీపులు తీసుకుని,బట్టలు అరేసు కోవడానికి నైలాన్ తాడు తీసుకుని బయటికి వచ్చేసి,నా వెహికల్ పక్కన ఆ అమ్మాయి బండిని,దూరంగా కన్పించిన ఆమెను మరోసారి చూసి,తటపటాయిస్తూ బయటికి వెళ్ళిపోయాను.
నేను నా ఇంటికి చేరిపోయి,రూమ్ లో బట్టలు ఆరేసుకోవడానికి తెచ్చుకున్న ప్లాస్టిక్ తాడు బ్యాగ్ లోంచి తీసి పొడవు సరిపోతుందా?లేదా?అని సరి చూసుకుంటున్నాను. ఈలోగా కిటికీ నుండి ఎవరో చూస్తున్నట్టు అన్పించింది. నేను అటు చూడకుండా,గబుక్కున తలుపు తీసి,సందులోకి వెళ్లి,పరుగెత్తి రెండంగల్లో ఓ అబ్బాయిని చేయి పట్టుకుని ఇంటి ముందు గుమ్మం దగ్గరకి లాక్కొచ్చాను.
"గంట క్రితం నన్ను డి౼మార్ట్ లో వెంబడించిన నలుగుర్లో నిన్ను చూసినట్టు అన్పిస్తుంది.ఎవరు నువ్వు!?సరిగ్గా సమాధానం చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను"అని దవడ మీద ఒకటి పీకాను.
"ఏమీ లేదండి,ఊరకనే!!"అంటూ చేయిని అడ్డం పెట్టుకుంటున్నాడు. ఈలోగా నా అసిస్టెంట్ ఏదో పని మీద నా ఇంటికి వచ్చాడు,ఇదంతా చూసి గబగబా దగ్గర్లోనే ఉన్న పోలీస్ స్టేషన్లో తనకి తెలిసిన హెడ్ కానిస్టేబుల్ కి ఫోన్ చేసాడు.
నేను మరో రెండు పీకి,వాడి చేయిని గట్టిగా పట్టుకున్నాను పారిపోకుండా,ఈలోగా "మీరుండండి సార్!నేను పట్టుకుంటాను"అని నా అసిస్టెంట్ ఆ అబ్బాయి చేయిని తీసుకున్నా
డు.
ఈలోగా బైకు వేసుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చారు. ఆ కుర్రాడ్ని పట్టుకుని,బైకు మీద ఎక్కించుకుని,"మీరు మా వెనుక రండి సార్"అంటూ అతన్ని తీసుకుపోయారు.
"ఇలాంటి సమయాల్లో మీరు ఒంటరిగా ఉండటం ప్రమాదం సార్,ఎవరూ లేకపోతే,ఏదొకటి చేసి పారిపోతారు.ప్రమాదం తప్పింది.అసలు!వాడెవడో!రండి సార్,స్టేషన్ కి వెళ్దాం" అన్నాడు నా ఆసిస్టెంటు.
ఇద్దరం స్టేషన్ కి వెళ్ళాం
అక్కడికి వెళ్ళేసరికి మిగతా ముగ్గురితో పాటు,నా వెహికల్ పక్కన పార్క్ చేసిన ఆ అమ్మాయి స్టేషన్లో ఉన్నారు.నాకేమి అర్ధం కాలేదు.ఒక చిక్కుముడిలా కన్పించింది. ఇదేమిటో తెలిసేదాకా నాకూ ఆశ్చర్యం గానే ఉంది.
హెడ్ కానిస్టేబుల్ నాలుగు పీకి,బెదిరించాక విషయమంతా చెప్పాడు."ఈయన మా రష్మీ వంక ,బండి వంక ఎగాదిగా చూస్తూ,డి౼మార్ట్ లో కన్పిస్తే మాకు ఫోన్ చేసి చెప్పింది.రష్మీ నా చెల్లెలు,మిగతా ముగ్గురు నా ఫ్రెండ్స్,అందుకే అనుమానమొచ్చి ఫాలో అయ్యాం,డి౼మార్ట్ లో చాకు,కర్చీపులు,తాడు కొన్నాక మా అనుమానం నిజం అనుకున్నాం,బయటి కొచ్చాక కూడా ఆయన అలాగే మరోసారి చూస్తే,ఏదో చెయ్యడానికి ప్లేన్ వేస్తున్నాడనిపించింది.అందుకే!ఒకరం కూడా వెంబడించి,ఇల్లు పట్టుకుని కిటికీలోంచి చూసాను,ప్లాస్టిక్ తాడు తీస్తుంటే ఈయన ఎవరో డేంజర్ మనిషి అన్పించింది,ప్రియాంక రెడ్డి ని ఇలాగే అత్యాచారం చేశారు కదండీ!మా చెల్లి భయపడి ఫోన్ చేసింది"అన్నాడు.
ఉష్!నేను క్షణకాలం అయోమయం అయిపోయాను.ఈమధ్య మా అబ్బాయికి టి.వి.ఎస్ జూపిటర్ కొందామనే ఆలోచన్లతో తిరుగుతున్నాను.ఈ అమ్మాయి దగ్గర చూశాక,కలర్ కూడా నచ్చి,ఇదే కొనాలనే నిర్ణయం తీసేసుకున్నాను.అయితే!రేటు ఎంతైంది అని అడగటానికి తటపటాయించి,అడక్కుండా వెళ్ళిపోయాను.
ప్రియాంక రెడ్డి అత్యాచారం గురించి ట్రెండింగ్ ఉన్న ఈ టైం లో,అలా చూడ్డం ఇంత పని చేస్తుందనుకోలేదు!!!
౼
౼ఉండవిల్లి.ఎమ్
03౼12౼2019
7pm
(ఈరోజు అనగా 03౼12౼2019 న జరిగిన సంఘటన పేపర్ న్యూస్౼25 సంవత్సరాల యువతిని,ఆమె చిన్ని బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు,ప్రకాశం జిల్లాలో...)