Raja Ivaturi

Comedy Children

4.8  

Raja Ivaturi

Comedy Children

జప గాడి బాల్యం

జప గాడి బాల్యం

15 mins
985


జప గాడి బాల్యం 

రాజ మోహన్

"ఒరేయ్ కిట్టూ ఇలా రారా " అంది అమ్మ. అప్పుడే ఫణి గాడితో ఆడుకోవటానికి వెళ్తున్న జప విసుగ్గా చూసాడు. జప వాడి ముద్దు పెరు. వాడికి అలాంటి ముద్దు పేర్లు చాల ఉన్నాయి.

"ఎందుకమ్మా! నేను అర్జెంటు గా ఫణి గాడి ఇంటికి వెళ్ళాలి " అన్నాడు.

"ఒక్క క్షణం ఇలా రారా!"

"హు! నువ్వెప్పుడూ ఇంతే. డిస్టర్బింగ్ చేస్తూ ఉంటావు" అంటూ అమ్మ దగ్గరికి వెళ్ళాడు జప.

"ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా?" అని అడిగింది అమ్మ.

"గుడి కా?"

"కాదు"

"అయితే ఆసుపత్రికా ?"

జప కి తెలుసు. బైటికి వెళ్ళటమంటే గుడికి గాని ఆసుపత్రి కి గాని వెళ్తారని. ఎక్కువగా ఆసుపత్రి కే వెళ్తారు. ఎందుకంటే జప గాడి అవస్తలు అల్లా ఉంటాయి మరి. జప సైకిల్ మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా, ఆఖరికి ఇంట్లో కూర్చుని ఆడుకున్నా అర గంట లో వాడికి రెండు మూడు దెబ్బలు తగులుతాయి. ఇవేమీ కాక పోయినా వాడికి హఠాత్తుగా జ్వరం వచ్చేస్తుంది. లేదా జలుబు చేస్తుంది. ఆసుపత్రికి కి వెళ్ళవలసిందే. ఆస్పత్రి కి వెళ్తే ఇంజక్షన్ భయం జపకి ఉంది. కాని చాలా సార్లు మందులతోనే పనయిపోతుంది.

వైద్యుడిని ని కలవక ముందు తల్లీ కొడుకూ ప్రతి సారీ కనీసం గంట సేపు తమ వంతు కోసం వేచి ఉంటారు. అప్పుడు బావుంటుంది. జప లాంటి పిల్లలకోసం ఆ చిన్న పిల్లల ఆసుపత్రిలో కొన్ని ఏర్పాట్లు చేశారు. జారుడు బల్ల, చిన్న ఉయ్యాల వంటివి, కొన్ని బొమ్మలూ వైద్యుడి గది బైట ఉంటాయి. అక్కడకి వెళ్లి జప ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ వాడికి చాల మంది మిత్రులు కూడా దొరికారు. వాళ్లలో విష్ణు ఒకడు. ఆస్పత్రి కి ఎప్పుడు వెళ్ళినా అక్కడ జపకి విష్ణు కనిపిస్తాడు. వాడికి కూడా జప లాగే ఏదో ఒక ఆరోగ్య సమస్య తరుచూ వస్తూ ఉంటుంది, వాళ్ళమ్మ తో ఇదే ఆస్పత్రికి వస్తూ ఉంటాడు. సాటి బాధితుడి గా వాడితో కిట్టూ కి స్నేహం, వాడిమీద మిగిలిన వారికన్నా ఎక్కువ అభిమానం కలిగాయి. అమ్మా, అత్తా (వాడి అమ్మ) కూడా వారి పిల్లల సమస్యలు ఒకే రకం కావటంతో చాల గాఢ స్నేహితులు అయిపోయారు.


"మావాడు తాళ్ళ నిచ్చెన ఎక్కి ఊగుతూ గోడకి వీపు గీసుకున్నాడండీ. తెలిస్తే తిడతానని రెండ్రోజులు చెప్ప లేదు, చొక్కా కూడా ఆ రెండు రోజులూ విప్పలేదు. ఈ రొజు బలవంతంగా చొక్కా విప్పి చూస్తే వీపంతా ఎర్రటి చారలే. వెంటనే అగ్గగ్గలాడుతూ తీసుకొచ్చాను. ఈసారి మీవాడేం చేశాడూ?"

"మా వాడు టీవీ సినిమా లో చూసినట్టు అక్షయ్ కుమార్ లా తన బొమ్మ తుపాకీ తీసుకుని గాలిలో పక్కకి గెంతి జంప్ చేసి పడిపోయాడండీ! ఇప్పటికి ఇలాంటి విన్యాసాలు ప్రయత్నించి దెబ్బలు తినటం ఐదో సారి. వాడికి. దెబ్బలు తగిలినా వాడికి తప్పు తెలియటం లేదు. ఆ పిచ్చివేషాలు మానటం లేదు ..... "

ఇలా ఇద్దరు తల్లులూ మనసు విప్పి మాట్లాడుకుంటారు.

ఆసుపత్రి ప్రహసనం అలా ఉంటుంది.

ఇక పోతే అమ్మ రోజూ ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటుంది. వారంలో రెండు సార్లు గుడికి వెళ్లి పూజలు చేస్తూ ఉంటుంది. తనకి అమ్మతో వెళ్ళక తప్పదు. అక్కడ తన చేత పాటలు పాడిస్తుంది . తనకి "శ్రీ ఆంజనేయం", "శుక్లాంబరధరం", "సరస్స్వతీ నమస్తుభ్యం" ఇంకా చాలా పాటలూ, పద్యాలూ వచ్చు.కాని ఒక విషయం. గుడి లో పూజారి తాత (ఆయనకి ముప్ఫై ఏళ్ళు!) అందరికీ ఒకటే పొట్లం ప్రసాదంగా ఇచ్చే వాడు గానీ తనకి మాత్రం రెండు పులి హార పొట్లాలిస్తాడు. ఆ పులిహార చింతపండు పులుపుతో చాలా చాలా బావుంటుంది. తను చాలా ఇష్టంగా తినటం చూసి అప్పటినుంచి ఆయన అలాగే రెండేసి ప్రసాదాలు ఇస్తున్నాడు. తిన్న రెండూ కాక ఇంకొకటి ఇంటికి తీసుకెళ్ళమని తాత చెప్తాడు. ఎప్పుడైనా పులి హార చెయ్యకపోతే గారెలు ఉంటాయి. వీటన్నింటి కన్నా జప కి కొబ్బరి అంటే ఇష్టం. ఇంట్లో పూజ కాని హోమం కాని జరిగితే జప కొబ్బరి కాయ కొట్టటానికి పూజ లో ఖచ్చితం గా కూర్చుంటాడు. ఆ తర్వాత పూజ ఎప్పుడు పూర్తవుతుందా కొబ్బరి ముక్కలు ఎప్పుడు తిందామా అని కాసుక్కూచుంటాడు.

తన కాలనీ లో జప కి ఫణి గాడు చాలా గట్టి నేస్తం. ఫణి వీడికంటే ఒకటో రెండో ఏళ్ళు పెద్దవాడు. జప గాడు సైకిల్ తొక్కటం సరిగ్గా రాక పడిపోయి దెబ్బలు తింటే ఫణి గాడు సైకిల్ మీద కాళ్ళు పైకెత్తి నడపటం వంటి విన్యాసాలు చేసి దెబ్బలు తింటూ ఉంటాడు. ఇద్దరూ సాయంత్రం కాగానే దెబ్బలు లేక్కబెట్టుకుంటారు.

జప ఏమి చేస్తున్నా అమ్మ ఎప్పుడూ వాడిని డిస్టర్బింగ్ చేస్తూనే ఉంటుంది గాని పాపం కొంచెం మంచిదే. రాత్రి జప కి ఆయాసం వస్తే పఫ్ ఇస్తుంది వాడికి తరవాత బాగా నిద్ర పడుతుంది. అలాగే వాడికి తిండి తినేటప్పుడు కార్టూన్ షో టీవిలో చూడనిస్తుంది (తర్వాత ఆపేస్తుందని జప వీలైనంత లేటు గా తింటాడు). వాడి కోసం రక రకాల బొమ్మలు కొంటుంది. వాడి దగ్గర యాంగ్రీ బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయో లెక్కే లేదు. ఇంట్లో ఒక బంకరు బెడ్డు (Bunk Bed) ఉంది. జప సెలవు రోజు పొద్దున్నంతా నిచ్చేనెక్కి బంకరుబెడ్డు పైనే చాలాసేపు గడుపుతాడు. అక్కడ గుడ్డతో చేసిన డేరా ఒకటి ఉంటుంది. ఆ డేరా లోపలంతా మొత్తం తన బొమ్మలతో అలంకరిస్తాడు. అందులో యాంగ్రీ బర్డ్స్ ఉంటాయి. డైనొసార్లు ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ లు ఉంటాయి. అన్నింటికన్నా వాడికిష్టమైన రకరకాల కార్లు ఉంటాయి. వాడి భాష లో నైట్ క్వీన్ మేక్వీన్ కారు కూడా ఉంటుంది . ఆ కారు చాలా మంచిది. దానితో మిగతా చెడ్డ కార్లని ఓడించాలి. వాడు ఎన్నో "ప్రీ-హిస్టారిక్ Rocks" డైనోసార్ల కోసం శ్రద్దగా ఏర్పాటు చేసాడు. వాడూ ఫణీ కలిసి డైనోసార్ ఫొస్సిల్స్ కోసం రోడ్డు మీద ఇంకా ఎక్కడెక్కడో "explore" చేసి ఎన్నో ఎముకముక్కలు తెచ్చి పెట్టారు. (అవి ఏ కుక్క వో ఎలకవో తెలియదని అమ్మ అంటుంది). కానీ అమ్మ వాడికి అన్నింటిలో సహాయం చేస్తుంది. వాడికోసం బాణాలు తెచ్చింది. బెలూన్ లు తెచ్చినది. కానీ వాడు అడిగినవి మాత్రం ఇవ్వదు. వాడు యాంగ్రీ బర్డ్స్ అడిగితే వాడికి జాతక కథలు పుస్తకం కొంటుంది.వాడు ట్రాన్స్ఫార్మర్ సీడీ అడిగితే చెప్పులు కొంటుంది (చెప్పులు ఎలాగూ కొంటుంది కానీ ట్రాన్స్ఫార్మర్ అడిగినప్పుడు అదే కొనాలి కదా?. అయినా పరవాలేదు. తనకి సైకిల్ కొంది. నేర్చుకుంటుంటే అంత లావు గా ఉన్నా తనతో పరుగెత్తి సైకిల్ తొక్కటం నేర్పించింది. అందుకే అమ్మతో చాలా ఇబ్బంది గా ఉన్నా తన మీద సానుభూతితో జప ఎలాగో నెట్టుకొస్తున్నాడు.

"ఈ సారి గుడి కీ కాదు. ఆస్పత్రికీ కాదు. మనం హైదరాబాద్ విమానాశ్రయానికి కి వెళ్తున్నాం. ఎందుకో తెలుసా? నాన్న వస్తున్నాడు" అంది అమ్మ.

గుడికి గానీ ఆసుపత్రికి గానీ కాకుండా వేరే చోటకి వెళ్తున్నామని వినగానే జప కి చాలా ఉత్సాహం కలిగింది. పైగా వాడికి నిజమైన విమానం చూడటం చాలా ఇష్టం. తను పెద్దయ్యాక విమానం పైలట్ అవ్వాలని ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నాడు.

"మరి నన్ను విమానం దగ్గర వరకూ తీసుకెళతావా ?" అని అడిగాడు జప.

విమానం నడపాలంటే మొత్తం లోపలంతా చూడాలి కదా! ఫణి గాడి దగ్గర తాను కూర్చునేటంత విమానం ఒకటి ఉంది. అది నడపటం అప్పుడే జప నేర్చేసుకున్నాడు. ఎంత నేర్చుకున్నాడంటే వాడు వచ్చిన ప్రతి సారీ ఫణి ఆ బొమ్మని హడావిడిగా ఇంటిలోపల ఎక్కడో దాచేసేవాడు.

"విమానం దూరం నుంచి చూడచ్చు." అంది అమ్మ . "కానీ నీకు నాన్న వస్తున్నాడంటే ఏమీ అనిపించటం లేదా?"

అప్పుడు తలెత్తి చూసాడు. అమ్మ ముఖం ఒక లాగా ఉంది. ఎప్పుడూ అలా చూడలేదు. ఒక రకం గా చెప్పాలంటే ఎందుకో భయమేసింది. మామూలుగా అమ్మ పక్కన ఉంటె నిశ్చింత గా ఉంటాడు జప. కానీ ఈరోజు అమ్మ ని చూస్తే వేరేగా అనిపించింది. అది భయం కాదనుకుంటా. తనకు తెలియని మరో భావం. అమ్మ ముఖం లో ఏదో వెలుగు కూడా కనిపిస్తోంది కనుక ఇది భయం మాత్రం కాదు. తాను తన రంగు రంగుల సైకిల్ లాంటి ఏదైనా ముఖ్యమైన వస్తువు కొనుక్కున్నప్పుడు కలిగే ఒకరకమైన ఉద్వేగం లా ఉంది.

నాన్న ఎవరో జప కి తెలియదు. జప పుట్టిన మూడు నెలలకే నాన్న ఉద్యోగరీత్యా విదేశం వెళ్ళిపోయాడట. బుల్లి జప ని వదిలి వెళ్ళటం ఇష్టం లేకపోయినా వెళ్లలేక వెళ్లలేక వెళ్ళిపోయాడట. ఎందుకంటే ఉద్యోగం చాలా అవసరం. ఆవిషయం అనుభవం మీద తెలుసుకున్నాడు జప.

ఒక రోజు అమ్మ ఆఫీసు కి రోజూ లాగే వెళ్తుంటే తనని వదిలేసి అమ్మ వెళ్ళిపోతోందని జప ఏడుస్తున్నాడు. రత్నం అత్త ఊరుకోబెడుతోంది. అమ్మ కూడా కన్నీళ్లు దాచుకుంటూ జప వైపు చూడకుండా ఉద్యోగాని కి వెళ్ళిపోయింది. రత్నం అత్త పిట్టలనీ చెట్టుల్నీ వాటి మీద పువ్వుల్నీ చూపించి తనని ఊరుకోబెట్టింది. తర్వాత టీవీ చూపిస్తూ అన్నం పెడుతూ నెమ్మదిగా చెప్పింది "కిట్టూ నువ్వలా రోజూ అమ్మ ఆఫీసు కి వెళ్ళేటప్పుడు ఏడవకూడదమ్మా! అమ్మ ఆఫీసు కి వెళ్ళకపోతే నీకు చాక్లెట్లూ బొమ్మలూ ఎలా వస్తాయి? " అంది.

"డబ్బులు పట్టుకెళ్ళి మన వీధి చివర శేఖర్ షాపు లో బొమ్మలు కొనుక్కోవచ్చు కదా?" అన్నాడు జప.

రత్నం అత్త నవ్వి "డబ్బులు ఎలా వస్తాయి?" అని అడిగింది

పిచ్చి ప్రశ్న! డబ్బులు ఎలా వస్తాయో జప కి తెలుసు. తన ఇంటినుంచి బైటికి వచ్చాక రోడ్డు చివర వరకూ నడిస్తే అక్కడ ఒక అద్దాల గది ఉంది. ఆ గదిలో ఒక వీడియో గేమ్ లాంటి పెట్టె ఉంటుంది. తను చాలా సార్లు అమ్మ తో వెళ్లి ఆ వీడియో గేమ్ టీవీ కింద ఉన్న కంతలో టికెట్ తోసి డబ్బులు తీసుకుని అమ్మ కి ఇచ్చాడు. అమ్మ దగ్గర ఆ టికెట్ ఎప్పుడూ ఉంటుంది. టికెట్ ఒక చిల్లులో పెట్టి ఎంత డబ్బులు కావాలో మీటలు నొక్కి చెప్తే కావలిసంత డబ్బులు వస్తాయి.

కానీ రత్నం అత్త అసలు విషయం చెప్పింది. ఆ వీడియో పెట్టె లో డబ్బులు అమ్మ ఆఫీసు వాళ్ళు వేస్తారంట. ఆ తర్వాతే మనం ఆ టికెట్ పట్టుకెళ్లి డబ్బులు తీసుకోవచ్చట. అందుకని రోజూ ఆఫీసు కి వెళ్ళాలట. అత్త చెప్పింది. ఫణి గాడు కూడా ఇంకో సారి చెప్పాడు .వాళ్ళ నాన్న ఆఫీసు కి వెళ్ళగానే వాళ్ళ బాసు (మా లెక్కల మాస్టారి లాంటి వాడు) పది సార్లు గుండు మీద కొట్టి ఆ తర్వాత పని చెప్తాడంట. ప్రతి దెబ్బ కీ కొన్ని డబ్బులు వస్తాయంట. అందుకని అంకుల్ రోజూ దెబ్బలు తిన్తాడంట. అప్పుడు తెలిసింది జప కి. ఉద్యోగం చాలా అవసరం. అందుకే నాన్న కూడా జపతో ఉండాలని ఎంత కోరికగా ఉన్నా విదేశాలకి వెళ్ళిపోయాడట.

అమ్మ ఆఫీసు కి వెళ్ళేటప్పుడు కొన్నాళ్ళు ఏడ్చాక జప ని ప్లే స్కూల్ లో చేర్పించారు. అక్కడ ఉయ్యాల , జారుడు బల్ల, తూగుడు బల్ల ఇంకా చాలా ఉన్నాయి. కిట్టూ అక్కడ ఆడుకునే వాడు. అయినా బెంగ ఉండేది. జిజ్జ పొసుకోవాలంటే ఎవరికి చెప్పాలన్నా ఇబ్బంది గా ఉండేది. టైము కన్నా ముందు ఆకలేస్తే ఏం చెయ్యాలో తెలిసేది కాదు. అమ్మ ఆఫీసు కి వెళ్తుంటే ఏడుపోచ్చేది కానీ నవ్వుతూ టాటా చెప్పేవాడు. ఎందుకంటే మనకి డబ్బులు కావాలంటే అమ్మ ఆఫీస్ కి వెళ్ళాలి కదా!

ప్లే స్కూల్ లో ఒక ఫ్రెండ్ "కోయా" ఉంది. ఆ అమ్మాయి ఇల్లు ప్లే స్కూల్ కి ఎదురు గానే ఉండేది. అయినా బడికి రాగానే ఒక గంట ఏడుస్తుంది. ఒక రోజు ఆ అమ్మాయికి చెప్పాడు జప "నువ్విలా ఏడవకూడదు. ఇలా ఏడిస్తే అమ్మలూ నాన్నలూ ఆఫీసు కి వెళ్ళరు. ఆఫీసు కి వెళ్ళక పోతే డబ్బులెలా వస్తాయి? డబ్బు లేకపోతే నీకు చాక్లెట్లూ బిస్కట్లూ ఎలా కొంటారు?"

ప్లే స్కూల్ అంటీ ఈ మాటలు విని అమ్మ తో చెప్పింది "మీ వాడు చాల తెలివైన వాడండీ. తను బుద్ది గా ఉండటం కాకుండా పిల్లలకి కూడా బుద్ది చెప్తున్నాడు"

అమ్మ మురిసిపోయింది గానీ "వాడు ఇంట్లో మమ్మల్ని నానా బాధ పెడుతుంటాడండీ. బైట మాత్రం చాలా బుద్ది గా ఉంటాడు" అంది. అయినా తర్వాత ఎందుకో ముద్దు పెట్టుకుంది.

జప ఇంకా ఏదేదో ఆలోచిస్తుంటే "ఏమిట్రా పలకటం లేదు?" అంది అమ్మ.

అమ్మ సంతోషిస్తుందని జప కూడా నాన్న వస్తున్నందుకు చాలా సంతోషం గా ఉందని చెప్పాడు. లేక పోతే అమ్మ తీసుకెళ్ళదేమో! నిజానికి జప కి విమానం చూడాలనే ఉత్సాహం ఉంది తప్ప ఎప్పుడూ చూడని నాన్నని చూడాలంటే ఎలా ఉంటుందో ఊహించలేక పోయాడు. పైగా నాన్నలు వాళ్ళ పిల్లల్ని చితక బాదటం ఎన్నోసార్లు చూసాక నాన్న అనే పదం వింటే భయమే ఎక్కువ ఉంటుంది.

అమ్మ చాలా త్వరగా జప ని తయారు చేసింది. ఆ రోజుకి ఫణి గాడితో ఆటలు పోయాయి . కాని జప ఆ విషయం ఎత్త లేదు. అమ్మ చాలా నిశ్శబ్దం గా వాడికి కొత్త బట్టలు తొడుగుతోంది. ఎందుకో ఏడుపు అణుచుకుంటున్నట్టు ఉంది. జప అర్ధం చేసుకున్నాడు. నాన్న అనే మనిషి ఎంత దుర్మార్గుడో జప కి తెలుసు. ఎప్పుడూ చూడకపోయినా మిగతా పిల్లలతో అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. వంశీ గాడి వంటి మీద వాళ్ళ నాన్న బెల్ట్ తో కొట్టిన దెబ్బలు ఎప్పుడూ కనిపిస్తుంటాయి.

నాన్న ఎలా ఉంటాడో గుర్తు లేకపోయినా నాన్న ఎటువంటి వాడో తెలిసింది కిట్టూ కి. తను బిజీ గా ఆడుకుంటున్నపుడు ఫోన్ వస్తుంది. అమ్మ నాన్నతో మాట్లాడమంటుంది.

అక్కడ ఏదో తెలియని గొంతు తో నాన్న మాట్లాడతాడు. తనని పిచ్చి పిచ్చి పేర్లతో పిలుస్తాడు "జప", "లప", "ఆపటిక", "బుల్లు", "బుచ్చి", "గోపాలా", "లక లకా", "బుల్లు బుచ్చు"..." ఇలా ఎన్ని పేరులో!

"నీకేం కావాలి అంటాడు".

ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ ఫోన్ లో మర్చి పోయి అడుగుతూ ఉంటాడు. తను మొదట్లో సీరియస్ గా అన్ని డైనోసార్ల పేర్లూ, యాంగ్రీ బర్డ్స్ ఇంకా కార్లూ, వీడియో గేమ్స్ అన్నీ చెప్పేవాడు. తర్వాత నాన్న అదే ప్రశ్న అడిగినప్పుడు చిరాకెత్తి చెప్పాడు "ముందు ఇప్పటి వరకూ చెప్పిన బొమ్మలు తీసుకురా"

నాన్న కొంత సేపు ఆగి "అలాగే కపాలా! (ఇది మరో పేరు)" అన్నాడు. కానీ బొమ్మలు ఎప్పటికీ రాలేదు.

ఇప్పుడు ఎట్టకేలకి వస్తున్నాడన్న మాట అనుకుంటూనే అమ్మా జపా ఇద్దరూ ఎయిర్ పోర్ట్ కి బైల్దేరారు.

శంకరంకుల్ ఫణి గాడితో ఎక్కడికైనా వెళ్తుంటే కిట్టూ వెళ్లి మోటార్ సైకిల్ ఎక్కుతాడు . శంకర్ అంకుల్ కనీసం తనని ఒక రౌండ్ తిప్పి తర్వాత తన పని మీద వెళ్తాడు. కానీ అమ్మ వెంటనే తిడుతుంది. నాన్న కి తెలిస్తే చితక్కోడతాడని చెప్తుంది . అంకుల్ ఒక రౌండ్ కి ఓకే కదా! నాన్న కేమిటి సమస్య ? పెద నాన్నయితే ఒక రౌండ్ అడిగితే మూడు రౌండ్ లు కూడా తీసుకెళతాడు. కానీ అమ్మ మళ్ళీ జప నే తిడుతుంది. "వాళ్ళేదో పని లో ఉంటారు. నువ్వలా అడగ కూడదు. నాన్న కి కోపం వస్తుంది" అంటుంది.

రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆడుకుంటుంటే "నాన్న కి నచ్చదు". షాప్ లో ఏదైనా బొమ్మ కొనమంటే "మూడు కంటే ఎక్కువ బొమ్మలు కొంటే నాన్న తిడతాడు". త్వరగా పడుకోకపోతే "నాన్న కి తెలిస్తే ఊరుకోడు". త్వరగా నిద్ర లేవక పోతే "నాన్న కి చెప్తాను".

ఇవన్నీ జప కి బాగా గుర్తు.

ఇప్పుడు నాన్న వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో అందుకే జప కి తెలుసు. అమ్మ గంభీరం గా ఉంటుంటే అందుకే జప ఏమీ మాట్లాడలేదు.

కానీ వాడు వేరేవాళ్ళ నాన్నల నుంచి కొన్ని చిత్రమైన విషయాలు గమనించాడు. అప్పలరాజు ఇంటికి అప్పుడప్పుడు వెళ్తే వాళ్ళ నాన్న వాడితో వేరే విధంగా మాటాడే వాడు."ఏరా అప్పలరాజూ ఇప్పుడు కొట్టిన కట్టెలు వంటకి సరిపోతాయా?" అని అడిగేవాడు. అప్పలరాజు కూడా ఆ ప్రశ్న కి తడుముకోకుండా "శుభ్రంగా సరిపోతాయి నాన్నా" అనేవాడు.

"ఒరేయ్ అప్పలరాజూ! ఆ మేస్త్రి కి ఇంటి వెనక గోడ పూర్తి చెయ్యమని చెప్పావా?" అంటాడు వాడి నాన్న. "ప్లంబర్ కుళాయి బావుచేశానంటున్నాడు సరిగ్గా చేసాడో చూడు" అని పురమాయించే వాడు. వాళ్ళ నాన్న అడిగే ప్రశ్నలన్నింటికీ అప్పలరాజు దగ్గర సరైన సమాధానాలుండేవి. అప్పలరాజుకి తన స్కూటర్ ఇచ్చి పనులు చేసుకు రమ్మంటే వాడు ఏమాత్రం భయపడకుండా సర్రుమని వెళ్లి పని చేసుకు వచ్చేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లిద్దరూ తండ్రీ కొడుకుల్లా కన్నా మంచి స్నేహితులలాగా ఉండేవారు.

మరి లక్ష్మణ్ నాన్న మరోలా మాటాడేవాడు. ఎప్పుడైనా లక్షణ్ రేడియో దగ్గరికి వెళ్తే 'ఒరేయ్ ఆ మీట ముట్టుకుంటే పళ్ళు రాలగొడతా' అని అరిచేవాడు, వాడు బడి నుంచి రావటం ఆలస్యమయితే ఈరోజు పదినిముషాలెందుకు లేటయింది? మళ్ళీ ఇలా జరిగితే తోలు తీస్తాను అనే వాడు. చాలా సార్లు లక్షణ్ ని వాళ్ళ నాన్న స్కేల్ తో కొట్టటం కూడా చూసాడు జప. "బాబోయ్ నాన్నలిలా ఉంటె కష్టమే" అనుకున్నాడు.

ఆలోచనలోనే విమానాశ్రయం వచ్చేసింది. కానీ అక్కడ విమానాలు ఏమీ లేవు. విపరీతం గా జనం . నాన్న ఒక తలుపు నుంచి బైటికి వస్తాడ న్నారు. కానీ చూడటానికి కూడా బోలెడు మంది అడ్డు గా ఉన్నారు. నిల్చుని నిల్చుని కాళ్ళు పీకేసాయి. చాలా సేపటికి పొట్టిగా లావు గా కళ్ళజోడు తో ఒక మనిషి వచ్చాడు. "ఒరేయ్! చెయ్యూపు చెయ్యూపు. అతనే నాన్న" అంది అమ్మ. తను కదలక పోయినా తన చేయి తీసుకుని ఆడించింది.

అయోమయం గా అందరి ముఖాలూ చూసుకుంటూ వస్తున్న నాన్న అనబడే వాడి కళ్ళు తమ ని చూడ గానే మెరిసాయి. తన దగ్గరికి రాగానే "ఓరి ఓరి" అంటూ ఎత్తుకునేసాడు."జప గాడు పెద్దయిపోయాడే" అన్నాడు అమ్మ తో.

ఎవడో కొత్త మనిషి ఎత్తుకుంటే జప కి చాల ఇబ్బంది గా ఉంది. కానీ వద్దని కూడా చెప్పలేక భయం గా చూస్తున్నాడు. "ఒరేయ్ లపాకీ! నీకోసం బొమ్మలు తెచ్చాను" అన్నాడు నాన్న. 'డైనోసార్లు కూడా!' అని నాన్న చెప్పగానే జప కళ్ళు వెంటనే ఆశ్చర్యంతో పెద్దవయిపోయాయి. "ఓర్నితారస్ ఉందా?" అని భయం గానే అడిగాడు.

"అన్ని రకాల డైనోసార్లూ ఉన్నాయి" అని వివరించేసరికి జప ఉత్సాహం తో ఊగిపోయాడు.

"చూపించు" అన్నాడు అసహనం తో.

"ఇప్పుడు కాదురా ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్టెలు తెరుద్దాం" అంది అమ్మ. అమ్మ ఎప్పుడూ ఇంతే!

ఇంటికి వచ్చే వరకూ జప చాలా ఇబ్బంది గా, చికాక్కా ఉన్నాడు . టాక్సీ లో ఉన్నత సేపూ ఉత్ఖంట తో కదులుతూనే ఉన్నాడు. ఇంటికి రాగానే ఒక్కొక్క పెట్టే లోపల వరకూ తీసుకువెళ్తుంటే మనసు ఉగ్గబట్టుకుని నిల్చున్నాడు.

అన్ని సామానులూ లోపల పెట్టాక "కాఫీ తాగుతావా?" అంది అమ్మ నాన్న తో.

"అలాగె. ముందు జప గాడి బొమ్మలు బైటికి తీయాలి" అన్నాడు నాన్న.

అంత వరకూ మళ్ళీ మళ్ళీ అడిగితే అమ్మ తిడుతుందని ఆత్రం అణుచుకుంటున్న జప నాన్నే బొమ్మల మాటెత్తితే ఆశ్చర్యం గానూ ఆనందం గానూ తలెత్తాడు.

అరె! వందసార్లు అడిగించుకుంటే తప్ప ఒక్క చాకోలెట్ కూడా ఇవ్వరు ఈ పెద్దవాళ్ళు.మరి ఈ నాన్న వేరేగా ఉన్నాడు. బహుశా మంచి వాడేనేమో !

తర్వాత ఇక చెప్పలేని అనుభవాలు! నాన్న పెట్టె తెరిచి చూస్తే ఒక పెద్ద పెట్టె లోపలంతా బొమ్మలే! డైనోసార్లు ఎన్నున్నాయంటే తన డేరాలో లో ఒక జురాసిక్ పార్క్ తయారు చేసుకోవచ్చు. చాలా డైనోసార్లు రకరకాలు గా అరుస్తున్నాయి కూడా. కొన్ని కొంచెం దూరం నడుస్తున్నాయి. ఇది కాక ఫాంటమ్ లూ స్పైడర్ మాన్ లూ, ట్రాన్స్ఫార్మర్ లూ, రకరకాల కార్లూ, వాల్ట్ డిస్నీ బొమ్మలూ ఇంకా ఎన్నెన్నో. తను ఫోన్ లో ఒక్కొక్క సారి నాన్నకి చెప్పిన బొమ్మలన్నీఉన్నాయి. ఇంకా ఎన్నో కొత్తవి కూడా ఉన్నాయి.

ఆ రోజంతా నాన్న తన తోనే ఉండి బొమ్మలన్నీ విప్పి తను ఆడుకోవటానికి వీలుగాతయారు చేసాడు. రిమోట్ తో ఎగిరే హెలికాప్టర్ అన్ని భాగాలూ అతికింఛి ఎలా ఎగిరించాలో చూపించాడు. అలాగే నడిచే ట్రాన్స్ఫార్మర్ తయారు చేసాడు. యాంగ్రీ బర్డ్స్ తో పందులని ఎలా షూట్ చెయ్యాలో నేర్పించాడు. రాత్రి కల్లా నాన్న చాలా దగ్గిరయిపోయాడు. ఇంకే అనుమానమూ లేదు. నాన్న మంచి వాడే. మరి శంకర్ అంకుల్ తో బైక్ ఎక్కితే తిడ తాడా? ఏమో! అప్పుడు చూద్దాం . అనుకున్నాడు జప.

కానీ జప కష్టాలు తర్వాత మొదలయ్యాయి.

రాత్రి జప పక్క అత్త దగ్గర వేసింది అమ్మ. తన పక్క అత్తదగ్గరెందుకని ఆశ్చర్యంతో "నేను నీ దగ్గర పడుకుంటా కదా అమ్మా!" అన్నాడు జప.


"నాన్న అలిసిపొయాడు కదా . నువ్వు అత్త దగ్గర పడుకో" అంది అమ్మ.

"నాన్న అలిసిపోతే పడుకుంటాడు. నేను నీ దగ్గర పడుకుంటా కదా!" అన్నాడు జప అయోమయంతో.

"వద్దు నువ్వు అత్త దగ్గర పడుకో" అని కొంచెం గట్టిగా చెప్పింది అమ్మ.

తర్వాత ఎక్కువ మాట్లాడకోడదని జప కి అనుభవం మీద తెలుసు.

వాడికి ఇదంతా నచ్చలేదు. నాన్న దగ్గరకెళ్ళాడు. ఇంకా పూర్తిగా చనువు లేకపోవటం వలన కొద్దిగా జంకుతూ "నాన్నా నీ దగ్గర పడుకుంటా" అన్నాడు. ఇది ఆఖరి ప్రయత్నం.

నాన్న వెంటనే తత్తరపడుతూ "నువ్వు అత్త దగ్గర కదా?" అన్నాడు.

"వద్దు. నాకు నీ దగ్గర పడుకోవాలని ఉంది" అన్నాడు ధైర్యం చేసి.

నాన్న పాపం దీనంగా ఎదో చెప్పబోతుంటే "ఒరేయ్ చెప్పానా? నాన్న కి విశ్రాంతి కావాలి. వెళ్లి అత్త దగ్గర పడుకో" అంది అమ్మ.

"ఇప్పుడు నేను సరిగ్గా నిద్రపోతే పొద్దునే లేచి పోగలను. అప్పుడు రేపు మనం పియానో కోసుక్కోవచ్చు. ఇప్పుడు అత్త దగ్గర బుద్దిగా పడుకో" అన్నాడు నాన్న జప చెవిలో.

ఆ మాట వినగానే జప ఆరోజుకి బుద్ది గా వెళ్లి అత్త దగ్గర పడుకున్నాడు.

మర్నాడు పొద్దున్న లేవగానే వెళ్లి నాన్న కోసం వెతికాడు. ఈ పెద్ద వాళ్ళు ఏదో ఒకటి చెప్పి ఆ తర్వాత మర్చి పోతారు. వాళ్లకి గుర్తు చెయ్యాలి. కానీ వాడు ఊహించని అప్పటికే నాన్న నిద్ర లేచి ఉన్నాడు.

"ఒరేయ్ కపాలా. పద వాకింగ్ కి వెళ్దాం" అన్నాడు.

"అలాగే" ఉత్సాహం గా అన్నాడు జప. కానీ కొంచెం అసహనం గా కూడా ఉన్నాడు. అసలు విషయం మాట్లాడాలి కదా.

"పద. తర్వాత స్నానం చేసి ఇడ్లీ లు తిని మనం షాప్ కి వెళ్ళాలి. పియానో లు రెండు కొనాలి. ఒకటి నీకూ ఇంకోటి అమ్మకీ"

కిట్టూ తనని తానే నమ్మలేక పోయాడు. కనీసం పది సార్లు గుర్తు చేస్తే తప్ప పెద్ద వాళ్ళు ఏదీ గుర్తు పెట్టుకోరు. నాన్నకి తను చెప్పకుండానే గుర్తుందే! భలే! భలే!

నాన్న పియానో కొన్నాడు. తనకి నేర్పించాడు కూడా. అప్పుడే జింగిల్ బెల్ పాట వాయించటం నేర్చేసుకున్నాడు. ఆరోజు కూడా చాలా బాగా నడిచింది. కానీ రాత్రి అమ్మ దగ్గర పడుకోలేదు.మళ్ళీ అత్త దగ్గరే పడుకున్నాడు.

ఒకటి రెండు రోజులనుకున్నది ప్రతిరోజూ అత్తదగ్గరే పడుకోవలసిరావటం జప కి నచ్చలేదు. అమ్మ దగ్గర పడుకోకుండా ఎప్పుడూ లేదు. ఎంత ఆలస్యం అయినా రాత్రి అమ్మ కథ చెప్పేవరకూ తాను పడుకోలేదు. కొన్ని రోజులకి అమ్మ దగ్గర తన స్థానం పోయిందని జప కి తెలిసిపోయింది. ప్రతి రోజూ కొత్త ఆశతో ఎదురు చూసినా తను ఆశించిన మార్పు లేక వాడి లేత మనసు రగిలిపోతూనే ఉంది. అత్త రాత్రి కథలు చెప్తోంది. తనని ముద్దు చేస్తోంది. కానీ అమ్మ ముందు ఇదెంత? ఇప్పుడు అమ్మ ఎప్పుడూ నాన్న తోనే ఉంటుంది. నాన్న కేం కావాలో చూస్తూ ఉండటం తప్ప అమ్మ కి వేరే పని ఉండటం లేదు.

అసలు తన దగ్గర ఉండటం లేదు. ఇంతకు ముందు ఎప్పుడూ డిస్టర్బింగ్ చేస్తోందని విసుక్కుంటూ ఉండే వాడు. ఇప్పుడు అమ్మ తనతో చాలా తక్కువ మాట్లాడుతోంది . కొత్తగా ఏమయ్యిందో ఎప్పుడూ పొద్దున్న కూడా పడుకుంటోంది. నీరసం గా ఉంటోంది. నాన్న కూడా ఎప్పుడూ అమ్మ తో ఉంటాడు. తన దగ్గర అత్త ఉంటోంది. బోరు!

తను అమ్మ వెనకే తిరుగుతూ ఉండేవాడు. తిట్టినా కొట్టినా అమ్మ తన స్వంతం గా ఉండేది. నాన్న కొత్తగా వచ్చాడు. బొమ్మలిచ్చాడు కదా అనుకుంటే అమ్మని నాకు కాకుండా చేసాడు. అమ్మ ఎక్కువగా పడుకోవటం మొదలు పెట్టాకా నాన్న కూడా తనతో ఇంతకు ముందు గడిపినంత సేపు కూడా ఉండటం లేదు. ఏదో తన అవసరాలు గుర్తు పెట్టుకుంటున్నాడు కాని తన తో గడపటం లేదు. తన రావణ్ బొమ్మకి బాటరీ అయిపోతే మర్నాడు పొద్దున్నఅది తన టెంటు లో ఉంది (రాత్రి తను నిద్రపోతుంటే తెచ్చిపెట్టాడట. అత్త చెప్పింది). అలాగే షన్ముఖ్ పుట్టిన రోజు ఉందంటే గిఫ్ట్ లు మర్చిపోకుండా తెచ్చాడు. కొత్త స్కూల్ కి వెళ్ళే రోజు కి అన్ని పుస్తకాలకీ అట్టలు వేసి రెడీ గా ఉంచాడు. కానీ తనకి కథలు ఎవరూ చెప్పటం లేదు.అత్త తప్ప. అన్నం పెట్టటం లేదు. అత్త తప్ప. సైకిల్ తొక్కుతుంటే ఎవరూ చూడటం లేదు. అత్త తప్ప.

చాలా కోపం గా ఉంటోంది. నాన్న మీద చాలా కోపం గా ఉంది. ఏదో చెయ్యాలని ఉంది కానీ ఏమీ చెయ్యలేక పోతున్నాడు. ఇలాగే ఎన్నో నిరాశతో నిండిన రోజులూ వారాలూ గడిచిపోతుంటే నిర్లిప్తంగా జప రోజులు గడిపాడు.

ఒక రోజు పొద్దున్న నిద్ర లేచేసరికి ఇంట్లో ఎవరూ లేరు. అత్త తప్ప.

"అమ్మ ఏదీ?"(నాన్న ఎక్కడున్నాడో అనవసరం) అని అడిగాడు ఆందోళనతో.

"అమ్మ పొద్దున్నే ఆసుపత్రి కి వెళ్ళింది కన్నా"

"ఎందుకు?" (ఆసుపత్రి కి ఎప్పుడూ తను వెళ్ళాలి కదా!)

"నీకో బుల్లి చెల్లి ని తెచ్చుకోవటానికి"

ఓహో ! జప కి తెలుసు. హాస్పిటల్ లో పిల్లలని కొనుక్కుంటారు.కానీ మరీ ఇంత పొద్దున్నే వెళ్లి కొనుక్కోవాలా? అనుకున్నాడు. ఫణి గాడికి ఒక బుల్లి చెల్లి ఉంది. అది తన దగ్గరున్న బార్బీ బొమ్మ కన్నా కొంచెం పెద్ద గా ఉంటుంది. అంత బుల్లి గా ఉండి కాళ్ళూ చేతులూ ఊపుతూ రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటె చిత్రం గా ఉంటుంది. ఫణి గాడు మా చెల్లి ఈరోజు పాకింది, మా చెల్లి అమ్మా అంది అని గొప్పలు చెప్తే ఇంత వరకూ వాడికి చెల్లి ఉంది తనకి లేదని వెలితి గా ఉండేది.

అందుకే వెంటనే ఫణి గాడింటికి పరుగెత్తుకెళ్ళిపోయాడు (ఆపటానికి అమ్మ లేదు కదా! అత్త మాట తనెప్పుడూ వినలేదు). ఇంట్లోకి వెళ్ళగానే ఆయాసం ఆపుకుంటూ "ఒరేయ్ ఫణి! నాకొక చెల్లి వస్తోంది" అన్నాడు.

ఉమా అంటీ (ఫణి గాడి అమ్మ) నవ్వుతూ "అవును కిట్టూ (ఇది తన మరో పేరు) నీకు ఒక చెల్లి వస్తోంది . నువ్వు దాన్ని బాగా చూసుకోవాలి" అంది.

ఆ మాట చెప్తే జప కి చాలా గర్వం గా అనిపించింది . ఒకసారి తనేదో చేస్తే చెల్లి ఏడుస్తోందని ఫణి గాడు జప మీద కోపంగా అరిచాడు 'ఎందుకురా నా చెల్లెల్ని ఏడిపిస్తున్నావు?' అన్నాడు. అప్పుడు శంకరన్కుల్ వచ్చి "నా చెల్లి అనకూడదు రా. మన చెల్లి అనాలి" అని వాడిని సరిదిద్దాడు.

ఇప్పుడు గుర్తొచ్చింది. తను కూడా అలాగే అన్న అవుతాడు కనక చెల్లిని చక్కగా చూసుకుంటాడు మిగతా అన్నల్లాగా.

కాసేపు వాళ్ళు ఆడుకుంటుంటే అత్త వచ్చింది. "కిట్టూ! ఇంటికి రా. అమ్మ చెల్లెలు తో పాటు ఇంటికి వచ్చేసింది"

చెల్లి వచ్చేసిందని తెలియగానే విపరీతమైన ఉత్సాహంతో అన్ని బొమ్మలూ వదిలేసి ఇంటికి వెళ్ళాడు జప.

ఇల్లంతా హడావుడి గా ఉంది. పెద నాన్నా, పెద్దమ్మా కూడా ఉన్నారు. పెద్ద నాన్న అమ్మ రూం కి ఏసీ పెట్టించాడు. అత్త దిష్టి తీస్తోంది. ఇంకా ఏమిటేవిటో చేసారు. అంత హడావుడిలోనూ తనకి చెల్లిని చూడటం కుదరనే లెదు. నాన్న, అమ్మ, పెద నాన్న, పెద్దమ్మ, అత్త చేతుల్లోంచి మారుతోంది తన చెల్లి. ఎన్నెన్నో పలచటి గుడ్డలమధ్య చుట్టిన చెల్లి దూరం నుంచి కొంచెం కూడా కనపడకపోవడంతో జప అలాగే నిరాశగా నిల్చున్నాడు. ఇంతలో పెద్దమ్మ జప వైపు చూసి చూసి "ఒరేయ్ ఇలా రారా. చూడు నీ బుల్లి చెల్లి ని" అంది.

వెంటనే విప్పారిన ముఖంతో దగ్గరికి వెళ్లి చూసాడు జప . కేవలం కొంచెం ముఖం మాత్రమే కనపడుతున్న తన చెల్లి ఒక చిన్న బొమ్మ లాగానే ఉంది. ఎందుకో తెలియకుండా కీచు గొంతుతో దీనం గా ఏడుస్తోంది.

కనుబొమలుగానీ రెప్పలు గానీ లేని దాని కళ్ళు గట్టిగా మూసుకునే ఉన్నాయి. దిక్కు తెలియనట్టు తన బుల్లి కాళ్ళూ చేతులూ ఊరికే కదిపేస్తోంది. ఇంట్లో హడావుడంతా అయ్యేసరికి కొన్ని గంటలు పట్టింది.

వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు.

అమ్మ గదిలో లో చెల్లి పడుకుని ఉంది. గది అంతా చాలా చల్లగా ఉంది. ఎండనుంచి వచ్చిన జపకి ఆ చల్లదనం భలే గా ఉంది. AC ఏర్పాటు చేసి పెద నాన్న భలే చేసాడు. గోడకి తగిలించిన ఒక తెల్ల పెట్టె లాంటి దాని నుంచి చల్లటి గాలి వస్తోంది. అక్కడే చెల్లి పక్కన పడుకుందామనుకుంటుంటే .....

"ఒరేయ్ లే" అని అమ్మ అరుపు విని ఉలిక్కిపడి లేచిపోయాడు జప.

"కిట్టూ వెంటనే లే అక్కడ నుంచి. ఇక్కడ చెల్లి దగ్గర చాల శుభ్రం గా ఉండాలి. అడ్డమైన చోట్లా తిరిగే నీ లాంటి వాళ్ళు రాకూడదు. బుద్దిగా వెళ్ళిపో!" అంది అమ్మ. ఇంతలో నాన్న వచ్చాడు.

"నువ్విక్కడే ఉండి నాకు కాస్త సాయం చెయ్యి. చాలా నీరసం గా ఉంది" అంది అమ్మ నాన్న తో.

జప అక్కడే నిల్చుని చూస్తూ ఉంటె "ఇంకా ఇక్కడే ఉన్నావేమిట్రా. వెళ్ళు. ఇది చిన్న పిల్ల గది. వెళ్ళు వెళ్ళు" అంది అమ్మ.

నాన్న జప వైపు జాలి గా చూసాడు. జప తో ఏదో అనబోతుంటే "ఇక్కడ నా సంగతి చూస్తావా?" అంది అమ్మ మళ్ళీ నాన్న తో.

జప గది నుంచి బైటకి వెళ్ళిపోయాడు. వాడి మనసు రగిలిపోయింది. నాన్నెప్పుడూ అమ్మ దగ్గరే ఉండాలి. ఎప్పుడూ అమ్మ తనతో ఉందనే నిశ్చింతతో ఇన్నాళ్లూ బ్రతికిన తను వంటరి వాడయి పోయాడు. ఎంతో బాధగా వెళ్లి వరండాలో ఉన్న చిన్న మంచం మీద పడుకున్నాడు. వాడికి ఏడుపు వచ్చింది. అలాగే వాడికి నిద్రొచ్చేసింది. ఎంతసేపు పడుకున్నాడో తెలియదు గానీ చాలా చీకటిగా నిశ్శబ్దంగా ఉంటే రాత్రి మొదలయిందని తెలిసి మళ్ళీ అలాగే దిగులుగా పడుకుండిపోయాడు.

ఓ రాత్రి వేళ మెలుకువ వచ్చింది జపకి. అంత నిశ్శబ్దం లో చిన్న గా పక్క గది నుంచి చెల్లి ఏడుపు వినపడుతోంది. "ఓంటిరా పడుకోమ్మా" అంటూ అమ్మ చెల్లిని ఊరుకోబెడుతూండటం వినపడుతోంది. ఇంతలో పక్కన ఎవరో కదులుతూంటే కళ్ళు తెరిచి పరీక్ష గా చూసాడు జప.

నాన్న! తన మీద చెయ్యేసి తన పక్కనే పడుకుని ఉన్నాడు.

అంటే? అమ్మ నాన్నని కూడా బైటికి గెంటేసిందన్న మాట. కొత్తగా నాన్న వచ్చినపుడు తనని బైటికి పంపించినట్టే ఇప్పుడు కొత్తగా చెల్లి రాగానే అమ్మ నాన్నని కూడా పొమ్మందన్న మాట.

ఎందుకో తెలియదు కాని జప కి చెప్పలేనంత సంతోషం కలిగింది. తనకి అమ్మకి దూరం చేసిన నాన్న కూడా ఇప్పుడు అమ్మకి దూరం అయిపోయాడు. ఇప్పుడు తెలుస్తుంది నాన్నకి, ఆ బాధేమిటో!

విజయగర్వంతో చాలారోజుల తర్వాత జప హాయిగా నిద్రపోయాడు.


Rate this content
Log in

Similar telugu story from Comedy