వ్రతభంగం
వ్రతభంగం


సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. శాస్త్రి గారు అప్పుడే సాయం కాలం సంధ్యావందనం పూర్తి చేసుకుని ఇంటిలోకి వస్తున్నారు. ఇంతలోనే "ఆమ్మో!" అంటూ కిందికి వాలిపోయాడు ఆయన ఆఖరి కొడుకు.
"ఓం నమశ్శివాయ! ఏమైంది బాబూ!" అంటూ శాస్త్రి గారూ, "అయ్యో నా కొడుక్కి ఏమయ్యింది?" అని ఆయన అర్ధాంగి సుమతి రెండు వైపుల నుంచి వచ్చారు.
శాస్త్రి గారు తనకి తెలిసిన చికిత్స చేశారు గానీ ఏమీ అంతు చిక్కటం లేదు.
"శంకరా! వెళ్లి వైద్యుడిని పిలుచుకురా" అన్నారు పెద్ద కొడుకుతో.
అదే మాట కోసం ఎదురు చూస్తున్నశంకరం హుటాహుటిగా పక్కూరికి పరుగు పెట్టాడు. వారున్న పల్లెటూరికి పక్కనున్న మరో చిన్న పల్లె కీఒకడే వైద్యుడు. ఆయన కూడా మందుల కోసమో మరి దేనికో పట్నం గానీ వెళ్తే మరి ఎవరూ లేనట్టే.
అదృష్టవశాత్తూ ఆయన (వైద్యుడు) తన ద్విచక్రవాహనం తొక్కుకుంటూ శంకరం తో పాటు వచ్చాడు.
"నమశ్శివాయ!" అని ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు.
పిల్లాడిని పరీక్షించాక వైద్యుడి ముఖం కొంత ఆందోళన కనిపించింది.
"మరేం పరవా లేదాండీ" అని అడిగింది సుమతి.
"ఆ ఈశ్వరుడి దయ వలన అంతా బావుంటుంది. చూడు శంకరా! ఈ మందులు కొని తీసుకురా. ఆ మందులు వాడితే కుర్రాడికి నయమవుతుంది" అన్నాడాయన.
"హమ్మయ్య. అంతా ఆ శివుడి దయ." అంది సుమతి.
మందుల కోసం బయలుదేరుతున్న శంకరంతో "ఒరేయ్! ఇప్పుడెటూ పొద్దు పోయింది. రేపు వెళ్లి మందులు తీసుకురా. ఈ రోజు శుక్రవారం. లక్ష్మి ని బైటికి పంపకూడదు" అంది సుమతి.
"మీ లక్ష్మి దేవి సంగతి అటుంచండి. శివుడాజ్ఞ అయినా సరే నా వైద్యానికి మీరు రొక్కం ఇచ్చేవరకూ కదిలేది లేదు. అక్షరాలా ఏభయ్యి రూకలు" అన్నాడు వైద్యుడు కటువుగా.
అతను అంత మొరటుగా మాటాడేసరికి ఆశ్చర్యంతో "ఓం నమశ్శివాయ. అయ్యా ధన్వంతరి గారూ!మీరింత పరుషంగా మాటాడటం ఎప్పుడూ వినలేదు" అన్నారు శాస్త్రి గారు.
"క్షమించండి. నేనుండేది పక్కూరు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఎప్పుడు డబ్బులు తీసుకోను. కుర్రాడు చెప్పగానే ఉరుకుల మీద వచ్చాను కదండీ. పరమేశ్వరుడి దయ వలన మీకే అనర్ధం కలగదనే ఆశిస్తాను" అన్నాడు వైద్యుడు.
"శివుడాజ్ఞ లేనిదే ఏమీ జరగదు లెండి. ఓం నమశ్శివాయ. సుమతీ. ఆయనకి తాంబూలంతో రొక్కం ఇచ్చెయ్యి" అన్నారు శాస్త్రి గారు.
డబ్బు చేతికి అందాక సుమతి ని ఆశీర్వదించారు వైద్యులు.
"మంచి ఉపకారమే చేశారయ్యా. శుక్రవారం పూట అయ్యగారింట్లో వ్రతభంగం చేయించారు." అన్నాడు శాస్త్రి గారి పొరుగాయన.
"ఎంత మాట. మీరిలా అన్నారు కదా. ఆ శివుడిదయ వలన నాకు చాతనయిన ఉపకారం చేస్తాను. శంకరా!ఎటూ వ్రతం చెడింది కనుక మందులు తీసుకురా. నేను పాళ్ళు ఎలా వేసుకోవాలో చెప్పి ఇంటికి బైలు దేరతాను" అన్నాడు ధన్వంతరి.
"చేసారులే మహా ఉపకారం" అని గొణుక్కుంటూ శంకరం సుమతి దగ్గర డబ్బు కోసం చేయి చాచాడు.
"ఇంకెక్కడి డబ్బు నాయనా! వైద్యుల కిచ్చేసాం కదా! రేపు కరణం గారిని అడిగి తెచ్చుకుందాం"అంది సుమతి.
అంతా చూస్తున్న వైద్యుడు "సరేలే. ఆ శివుడి దయ వలన నా దగ్గరున్నాయి. ఇదుగో నాయనా వంద. ఏభై మందులకు సరిపోవు. రేపు కరణం గారి దగ్గర తీసుకున్నాక నా డబ్బులు జమ చేసేయ్" అన్నాడు.
"అంతా శివార్పణం ధన్వంతరి గారూ! పరమేశ్వరుడు మీకు మేలు చేయు గాక" అన్నారు శాస్త్రి గారు చిరునవ్వుతో.
అంతా ఈశ్వరమయం!