Rama Seshu Nandagiri

Drama

4  

Rama Seshu Nandagiri

Drama

వ్యాపారం

వ్యాపారం

6 mins
1.0K


రామాపురం లో కృష్ణయ్య అనే వ్యాపారి ధర్మం గా, న్యాయం గా వ్యాపారం చేసి ఊరిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను చేసే బట్టల వ్యాపారం అతనికి విపరీతమైన లాభాలు తెచ్చి పెట్టక పోయినా అతనికి లోటు లేకుండా జరుగుబాటు అయ్యేది. ఊరందరితో మంచిగా ఉంటూ తన కుటుంబాన్ని ఏ లోటూ లేకుండా పోషించుకొనే వాడు.


కృష్ణయ్య కు ఇద్దరు కొడుకులు. వారిద్దరినీ చదువు అయిపోగానే తనతో పాటు వ్యాపారం చూసుకుంటూ మెళకువలు నేర్చుకో మన్నాడు. అతని మాట ప్రకారం కొడుకులు అతని తో పాటు వ్యాపారం చూసుకో సాగారు.


వ్యాపారం చక్కగా సాగుతోంది. బిడ్డలు ప్రయోజకులు కాగానే వారిద్దరికీ పెళ్ళిళ్ళు కూడా చేసేశాడు కృష్ణయ్య. అందరూ కృష్ణయ్య ని అదృష్టవంతుడనేవారు. ఇటు ఇంట్లోనూ, అటు‌

వ్యాపారం లోనూ కృష్ణయ్య మాటకు ఎదురు లేదు. అంతా సవ్యంగానే సాగిపోతోంది.


కొన్నాళ్ళు గడిచిన తర్వాత పెద్ద కొడుకు మోహన్ తండ్రి చెప్పిన తీరున నడుచుకుంటూ వ్యాపారం చక్కగా చేయ‌సాగాడు. కానీ చిన్న కొడుకు ప్రసాద్ కి డబ్బులు బాగా సంపాదించాలని, తనదైన రీతిలో వ్యాపారం చేయాలని కోరిక. అందుకే ధైర్యం చేసి ఒకరోజు తండ్రి తో ఇలా అన్నాడు.


"నాన్నా, నేను అన్నయ్య తో ‌కలిసి వ్యాపారం చేయాలని అనుకోవడం లేదు. నేను విడిగా వ్యాపారం చేస్తాను. నా వాటా నాకు ఇచ్చెయ్యండి."


తండ్రి అతని మాటలకు ఆశ్చర్యపోయాడు. "ఏమైందిరా. చక్కగా కలిసి చేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా." అని అడిగాడు.


"లేదు నాన్నా, నాకు కుదరదు. అన్నయ్య నేను చెప్పినట్లు చేయడు. నాకు వాడు చెప్పినట్లు నచ్చదు. " అన్నాడు చిరాగ్గా.


"పెద్దోడా," తండ్రి పిలుపు విని "ఏం నాన్నా" అంటూ

వచ్చాడు మోహన్.


"వీడేదో అంటున్నాడు. వేరే వ్యాపారం పెడతాడంట. నీతో కలిసి చేయడంట. నీవేమంటావురా.?" కృష్ణయ్య మోహన్ ని అడిగాడు.


"నాదేముంది నాన్నా ‌ మీరెలా అంటే అలాగే." అన్నాడు మోహన్.

"ఏరా మరి‌ వాడికేం ఫర్వాలేదు అంటుంటే నీకేమైంది. వ్యాపారం ఒకటేనా, అన్నీ పంచేయాల్నా" అడిగాడు కృష్ణయ్య.


"నేనేం వేరుపోతాననలేదు. వాడెలాగూ ఇక్కడ చే‌స్తున్నాడు. నేను పట్నంలో చేస్తే బాగుంటుంది కదా. అక్కడ లాభాలు బాగుంటాయి అని అనుకున్నా. కాదంటే మీ ఇష్టం. ఒక పని కి ఇద్దరు అవసరమా అని".నసిగాడు ప్రసాద్.


కొడుకు మాటల్లో కొంత నిజం ఉంది అన్పించింది కృష్ణయ్య కు. "సరే, చెప్పావుగా, ఆలోచిద్దాం." అని ఊరుకున్నాడు కృష్ణయ్య.

వారం గడిచినా తండ్రి ఏంమాట్లాడక పోవడం ప్రసాద్ ని కలవర పెట్టింది. మరొక వైపు భార్య నస. ఈ ఆలోచన రావడానికి కారణం భార్య పద్మ. వాళ్ళన్నయ్య పట్నం లో వ్యాపారం చేస్తుంటాడు.


పట్నం లో సరదాగా తనవాళ్ళతో ఉండొచ్చని, వేరు కాపురం పెట్టొచ్చని ఆశ పడింది. కానీ భర్త కలిసే ఉంటామని చెప్పడం విని గదిలోకి రాగానే నిలదీసింది. ఒకేసారి వేరు వ్యాపారం, కాపురం అంటే నాన్న ఒప్పుకోడనీ, తర్వాత మెల్లగా కాపురం కూడా పట్నం లో పెట్టొచ్చు అని నచ్చ చెప్పాడు.


ఆ మరుసటి రోజు తండ్రి పిలిచి తన ఇష్ట ప్రకారం కానిమ్మని, వివరాలన్నీ సేకరించి చెప్తే దానిని బట్టి చేద్దామని ప్రసాద్ కి చెప్పాడు


"నాన్నా, పద్మ అన్న పట్నం లో వ్యాపారం చేస్తున్నాడు. అతను నాకు సహాయం చేస్తాడు." అన్నాడు ప్రసాద్..


"అయితే ముందుగానే ఏర్పాటు చేసుకున్నావా." తీక్షణంగా అడిగాడు కృష్ణయ్య.


"అదేం లేదు నాన్నా." నీళ్ళు నమిలాడు ప్రసాద్.


" సరే. అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎంత కావాలో చెప్పు. ఇస్తాను. కానీ నేను ఇచ్చేది అప్పు గానే. 3 నెలలు సర్దుకోవడానికి అవకాశం ఇస్తున్నాను. తర్వాత నుండి ప్రతి నెలా అసలు, వడ్డీ కడుతూ ఉండాలి. " అన్న తండ్రి మాటలు విని


"అదేంటి నాన్నా, నా వాటా డబ్బు కాదా నాకిచ్చేది? అప్పు గా ఇస్తావా?" ఆశ్చర్యంగా అడిగాడు ప్రసాద్.


"అవునురా.. నేనున్నంత వరకు ఆస్తి పంచేది లేదు. ఉన్న వ్యాపారం పెంచాలని అనుకుంటున్నాను. కలిసి ఉంటే అందరం కలిసి కష్టపడి వ్యాపారం పెంచుకుందాం. కాదంటే కొంత డబ్బు అప్పుగా ఇస్తాను. వ్యాపారం పెట్టుకో. నీ వాటా నేనిచ్చినప్పుడే ఇస్తాను. ఇప్పుడేం లేదు." ప్రశాంతంగా చెప్పాడు కృష్ణయ్య


ప్రసాద్ కి నోట మాట రాలేదు. 'ఇదేమిటి నాన్న ఇలా మాట్లాడుతున్నాడు. ఈ సలహా ఎవరిచ్చారు. అన్న ఇచ్చాడా.' ఆలోచన ‌సాగడం లేదు. ఏంచేయాలో పాలు పోవడం లేదు. అమ్మ నడుగుదామనుకుంటే లాభం లేదు. నాన్న వ్యాపారానికి సంబంధించిన సలహాలు అమ్మ చెప్తే వినడు. భార్య కి ఏం చెప్పాలి. ఈవిషయం తెలిస్తే అత్తవారింట నవ్వులపాలవుతాడు. తనకి నాన్న మాట వినక తప్పదు. అలా ఆలోచిస్తూ ఉండగా

నాన్న మాటలు గట్టిగా వినపడ్డాయి.


"చూడు, నాకు తెలుసు ఏం చేయాలో. నీ సలహా అడగలేదు. నీకైనా ఇష్టమైతే ఉండు. వాడిలాగా వేరుగా చేసుకుంటానంటే వాడిలాగే నీకూ ఇస్తాను. వ్యాపారం చేసుకో. అనవసరమైన సలహాలు ఇవ్వకు."


"లేదు నాన్నా. నేను నీతోనే ఉంటాను. తమ్ముడికి అప్పు ఏమిటి అని నా అభిప్రాయం. ఇంకేం కాదు. సరే నీ ఇష్టం. " మోహన్ మాట నిరాశగా ధ్వనించింది.


విషయం అర్ధమైంది. ఇది పూర్తిగా నాన్న అభిప్రాయం. అయినా ఆయన ఒకళ్ళు చెప్తే వినే రకం కాదు. పాపం అన్న. వాడు జీవితాంతం నాన్న వెనక ఉండాల్సిందే. వాడు ధైర్యం చేయలేడు అనుకుంటూ తన ఏర్పాట్లు తాను చేసుకోసాగాడు.


కొన్ని రోజుల తర్వాత బావమరిది సహాయం తో అతని లాగే పట్నం లో కిరాణా దుకాణం పెట్టుకున్నాడు. తండ్రి అప్పుడు కూడా అనుభవం లేని పని అని వెనక్కి లాగాడు. కానీ ప్రసాద్ విన లేదు. బావమరిది భరోసాతో చేయగలనని ధీమాగా చెప్పాడు.


మొదట్లో వ్యాపారం చక్కగా సాగింది. రోజూ ఇంటికి రావడం కుదరదని బావమరిది ఇంట్లో ఉండి పోయేవాడు. కొన్నాళ్ళ తర్వాత తనకి ఇబ్బంది గా ఉందని భార్యని కూడా తీసుకెళ్లి పట్నం లోనే కాపురం పెట్టాడు. తండ్రి ఏమీ అనలేదు. తల్లి అనబోతే మాట్లాడనివ్వలేదు.


అలా పద్మ, ప్రసాద్ ల పట్నం కాపురం మొదలైంది. మొదట్లో సరదాగా ఉన్నా రాను రాను‌ ప్రసాద్ దుకాణం లోనే ఎక్కువ సేపు ఉండి పోవడం తో పద్మకి తోచేది కాదు. అన్న ఇంటికి మొదట్లో బాగానే తిరిగేది. కానీ వదిన కూడా అన్నతో పాటు దుకాణానికి వెళ్ళి పోవడం మొదలు పెట్టింది. ఇంకా తను ఎక్కడికి వెళ్తుంది.

వదిన తో ఆ మాటే అంటే తనని కూడా దుకాణానికి వెళ్ళమని సలహా ఇచ్చింది. పద్మ ఒకటి రెండు సార్లు వెళ్ళింది. కానీ తనకి నచ్చ లేదు.


ప్రసాద్ కి దుకాణం లో కూడా అరుపులు అడిగేవాళ్ళు ఎక్కువ అయ్యారు. అదే విషయం బావమరిది కి చెప్పాడు.

"బావా, మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేదే అరువు కోసం. డబ్బులు ఉంటే మనం ఎందుకు, మోర్ లాంటి పెద్ద షాపులకు వెళ్తారు. ఇవ్వు ఫర్వాలేదు. కానీ ఇచ్చే వాళ్ళా, కాదా అన్నది చూసుకోవాలి. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవ్వొచ్చు. ఇబ్బంది లేదు. ప్రతి నెలా జీతాలలో కట్టేస్తుంటారు." అని కొంత భరోసా ఇచ్చాడు.


బావమరిది ఇచ్చిన భరోసా తో మెల్లగా అరువులు ఇవ్వడం మొదలు పెట్టాడు ప్రసాద్. ఇప్పటికి నాలుగు నెలలైంది దుకాణం పెట్టి. సాఫీగా సాగుతోంది. నాన్న అడిగినట్లు మూడు నెలల తర్వాత కాకుండా రెండు నెలల నుండి డబ్బు పంపడం మొదలు పెట్టాడు ప్రసాద్.


ప్రసాద్ వ్యాపారం మొదలు పెట్టాక ఒకసారి ఊరు వెళ్లి తన వ్యాపారం గురించి చాలా గొప్పగా చెప్పాడు. తండ్రి అంతా విని "మంచిది. ఇంకా ముందు కూడా ఇలాగే జాగ్రత్త గా చేసుకో." అని

అన్నాడు. తల్లి, అన్న, వదిన చాలా సంతోషించారు. పద్మని కూడా తీసుకుని రమ్మని చెప్పారు.


ఈవిధంగా మరో ఆరు నెలలు గడిచాయి. ఖాతాదారులు మెల్లిగా ఆలస్యం చేయడం మొదలు పెట్టారు. ప్రసాద్ కి ఇబ్బంది మొదలైంది. తండ్రి కి డబ్బు పంపిస్తే తనకు చాలా కష్టమయ్యేది. పంపక పోతే మాట వస్తుంది అని పంపి తాను నెలంతా ఇబ్బంది పడేవాడు. పండుగ నెల వస్తే చాలా మంది ఖాతాదారులు పద్దు చెల్లింపు వెనక పెట్టే వారు


ఒకసారి బావమరిది తో చెప్తే "మీ ఏరియా లో నేను అడిగితే మర్యాద గా ఉండదు. మీరే కొంచెం గట్టిగా చెప్పండి." అని తప్పించుకున్నాడు.


ప్రసాద్ కి ఏమీ పాలుపోలేదు. ఆనెల తండ్రి తో పండుగ నెల అవసరముందని చెప్పి తప్పించుకున్నాడు. మెల్లగా ఖాతాదారుల వలన ఇబ్బందులు పెరుగుతూనే వచ్చాయి. కొంత మంది ఇల్లు మారిపోయిన వాళ్ళు, ట్రాన్స్ఫర్ అయి వెళ్ళి పోయిన వాళ్ళతో మరింత న‌ష్టం పెరిగి లక్ష రూపాయల నష్టానికి దారి తీసింది.


ఈ విషయం లో బావమరిది నుండి ఎటువంటి సహాయం లేక పోయింది. తండ్రి కి తెలిస్తే, ఏం చెప్పాలో అర్థం కావడంలేదు.

"ఇన్నాళ్లు వ్యాపారం చేశారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, తెలుసుకోలేరా. అందరికీ అప్పులిచ్చి ఇప్పుడు నన్నడిగితే నేనేం చేయగలను " అన్న బావమరిది మాటలకు చాలా బాధ పడ్డాడు.


ఇప్పుడు ఆలోచిస్తే నాన్న అన్న మాటలకు అర్థం ఇప్పుడు బోధ పడింది. తనకు బట్టల దుకాణంలో అనుభవముంది. తమది చిన్న ఊరు. ఎవరెలాంటి వారో నాన్నకు బాగా తెలుసు. సాధారణంగా బట్టల దుకాణంలో ఎవరూ అరువు పెట్టరు. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు అయితే తప్ప. అది కూడా నాన్నే ఎక్కువగా చూసుకొనే వాడు. అన్నయ్య కూడా తనకి బాగా తెలుసున్న వాళ్ళే అయినా నాన్నని అడగకుండా ఇచ్చేవాడు కాదు. అంతా అరువు లేని వ్యాపారం కావడంతో నష్టాలు ఎప్పుడూ రాలేదు. అయినా నాన్నకి ఉన్న అనుభవం ముందు తనెంత. ఇవన్నీ గుర్తుకు వచ్చి చెమటలు పట్టాయి ప్రసాద్ కి.


అదే సమయంలో నాన్న అనుకోకుండా రావడంతో ఒక్కసారి ఊపిరి ఆగినంత పనైంది. కానీ ఎప్పటికైనా చెప్పక తప్పదు. మహా అయితే నాలుగు మాటలు అంటాడు. పడక తప్పదు. కనీసం సలహా ఇస్తాడు కదా. అనుకొని ధైర్యం చేసి నాన్నకి ప్రస్తుత పరిస్థితిని వివరించాడు ప్రసాద్.


అంతా మౌనంగా విన్న కృష్ణయ్య "సరే, ఈ రోజు నేను పనిమీద వెళ్తున్నాను. మరో రెండు రోజుల్లో వస్తాను. అధైర్య పడకు." అని వెళ్ళి పోయాడు.


నాన్న ఏమీ అనక పోవడం ఆశ్చర్యంగా అన్పించింది. అన్నట్టుగానే రెండు రోజుల తర్వాత వచ్చాడు. రాగానే దుకాణానికి వచ్చాడు. అలా పదిహేను రోజుల పాటు వ్యాపారం మొత్తం తనే చూసుకుంటూ, తనని వసూళ్లకు పంపాడు. ఊరు వదిలి వెళ్లి పోయిన వాళ్ళవి తప్ప చాలా మందివి వసూలు అయ్యాయి. తాను ఇంటికి వెళ్ళడం తో మొహమాటానికి కొందరు ఇచ్చేశారు. దుకాణంలో నాన్న, వారిని అడిగిన తీరుకు మరికొంత మంది ఇచ్చేశారు. ఈవిధంగా చాలా మటుకు వసూళ్లు కావడంతో కాస్త గట్టున పడినట్లైంది. 


పద్మ మామగారి రాకతో భయపడింది. వ్యాపారం సరిగా లేదని వెనక్కి వచ్చేయ మంటారేమో నని. కానీ ఆయనే నిలబడి వ్యాపారాన్ని ఒక దారికి తేవడం తో చాలా సంతోషించింది.


దుకాణం అంతా చూసి కావాల్సిన కొన్ని వస్తువులు తెప్పించి మళ్లీ కొత్త కళ తెప్పించాడు. మెల్లగా ఖాతాదారులు పెరిగి మళ్లీ పూర్వస్థితికి వచ్చింది దుకాణం.


కృష్ణయ్య ఊరెళుతూ మధ్యలో వస్తూంటానని దుకాణం జాగ్రత్త గా చుసుకోమని చెప్పి వెళ్ళాడు.‌ ప్రసాద్ కి చాలా సంతోషంగా అన్పించింది. తండ్రి తననేమీ అనకపోవడం, పైగా తనకి సహాయం చేయడం చాలా ధైర్యాన్నిచ్చింది. అప్పటి నుండి

జాగ్రత్తగా దుకాణం చూసుకుంటూ కొంచెం కొంచెం గా అభివృద్ధి చేసుకున్నాడు. కాస్త కుదుట పడ్డాక భార్యతో కలిసి ఊరెళ్ళాడు. ఇంట్లో అందరూ ఎంతో సంతోషించారు.


అన్నతో కూర్చుని వ్యాపార విషయాలు మాట్లాడుతూ "అన్నా, నాన్న చెప్పింది నిజమే. మనకు అనుభవం ఉన్న వ్యాపారం చేయాలి కాని అనుభవం లేని పని లో వేలు పెడితే ములిగి పోవడం ఖాయం. నా పరిస్దితి అదే అయ్యింది. నాన్న కలగ చేసుకోకుంటే నేను మునిగిపోయే వాడిని. అంతేకాకుండా కొంత డబ్బు మదుపు కూడా పెట్టి నన్ను కాపాడాడు." అన్నాడు‌ ప్రసాద్.

"చిన్నా, అది నీ డబ్బేరా. నువ్వు మొదట్లో పంపిన డబ్బును జాగ్రత్త చేసి అదే నీ వ్యాపారం లో పెట్టుబడి గా పెట్టారు. నిన్ను ప్రతి నెల డబ్బు కట్టమన్నందుకు తిట్టుకొని ఉంటావు. కానీ నీ అవసరాల కోసమే. నువ్వు దాచలేవని నాన్న నీ దగ్గర తీసుకుని దాచారు. అదీ నీ కోసమే." చెప్పడం ముగించాడు మోహన్.


అంతలో అక్కడికి వచ్చిన తండ్రిని చూసి "నన్ను క్షమించండి నాన్నా." అన్నాడు ప్రసాద్.


"అరే, ఇప్పుడేమయ్యింది. మనకి పట్నం లో కూడా‌ ఇప్పుడు దుకాణం ఉంది. ఒకవిధంగా నువ్వు చేసింది మంచి పనే. కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోను. అయినా ఇప్పుడేం ఇబ్బంది లేదు. ఏ సహాయం కావాలన్నా నేను, అన్న ఉన్నాం. ధైర్యంగా వ్యాపారం చేసుకో." అన్న తండ్రి మాటలకి ప్రసాద్, పద్మ కూడా ఎంతో ఆనందించారు. మొత్తం ఇల్లు ఆనందం తో కళ కళ లాడింది


                           🌸🍀🌼🍀🌼Rate this content
Log in

Similar telugu story from Drama