Venkata Rama Seshu Nandagiri

Others

4.5  

Venkata Rama Seshu Nandagiri

Others

మొదటి సంపాదన

మొదటి సంపాదన

2 mins
1.0K


సుధ తిరుపతి సంస్కృత కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటర్ రెండు సంవత్సరాలు అక్కడే హాస్టల్ లో ఉండే చదువుకుంది. డిగ్రీ చివరి సంవత్సరం చదివే స్నేహితులు చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ కళాశాలల నుండి సంస్కృతం పేపర్లు తీసుకువచ్చి దిద్దేవారు. వాళ్ళు సుధ మీది అభిమానంతో తనకు కూడా పేపర్లు ఇచ్చి దిద్దమన్నారు. ఆవిధంగా సంవత్సరమంతా పేపర్లు దిద్దిన సుధ తనకు వచ్చే డబ్బులు జాగ్రత్తగా దాచుకుంది.


డబ్బులు మూడు వేలు పోగయ్యే సరికి సంతోషంగా తల్లికి ఫోన్ చేసి చెప్పి "అమ్మా నీకు పంపించనా. ఇంట్లో అవసరముంటుందేమో కదా." అని అడిగింది.


తల్లి టీచర్ గా ప్రైవేట్ స్కూల్ లో ఉద్యోగం. తండ్రి కూడా ఒక ప్రైవేట్ ఆఫీసు లో గుమాస్తా. వాళ్ళు కష్టపడి తనని, చెల్లిని చదివిస్తున్నారు. అందుకే తల్లిని అలా అడిగింది సుధ.


అయితే తల్లి " అమ్మా సుధా, మన మధ్యతరగతి కుటుంబాలలో డబ్బు అవసరం లేని రోజు ఉండదు. కానీ, ఇది నీ మొదటి సంపాదన. ఒక పక్క చదువుకుంటూ, వేరొక వైపు కష్టపడి పేపర్లు దిద్ది సంపాదించావు. నీ ఈ మొదటి సంపాదన నీకు కలకాలం జ్ఞాపకం ఉండాలి. ఉగాది వస్తోంది. ఆ రోజు నీ పుట్టినరోజు కదా. వీలైతే తెల్సిన పెద్దవారితో వెళ్ళి నీకు నచ్చిన వస్తువేదైనా కొనుక్కోమ్మా." అని చెప్పింది.


"ఫర్వాలేదా అమ్మా. లేకపోతే వచ్చే నెల హాస్టల్ ఫీజు కి ఉంచేస్తానులేమ్మా. ఇప్పుడు నాకేం వద్దు." అంది సుధ.


అమ్మ , నాన్న తమ కోసం ఎంతో కష్టపడుతున్నారని, వారికి ఎలాగైనా సహాయం చేయాలని ఆ అమ్మాయి ఆరాటం. కానీ తల్లి ఒప్పుకోలేదు.


"లేదమ్మా సుధా. నాకు ప్రస్తుతం డబ్బు అవసరం లేదు. నామాట విని కొనుక్కోమ్మా." అని నచ్చచెప్పింది.


"నాన్న ఏమంటారో!" సందేహాన్ని వ్యక్తం చేసింది.సుధ.


"ఇదుగో. నాన్న ఇక్కడే ఉన్నారు. మాట్లాడు." అని

అతని చేతికి ఫోన్ ఇచ్చిందామె.


"ఏంటమ్మా సుధా. అమ్మ చెప్పింది కదా. కొనుక్కోమ్మా. నేను మాత్రం వద్దంటానా తల్లీ. నీ పుట్టినరోజు నాడు నీకు నచ్చింది కొనుక్కోమ్మా."


అని తండ్రి కూడా చెప్పేసరికి సుధ కి చాలా సంతోషంగా అనిపించింది.


ఇంతలో చెల్లి సుమ ఫోన్ తీసుకుని "అక్కా నాక్కూడా పనికొచ్చేది కొను." అంటూ నవ్వింది.


"అలాగేనే. నాదగ్గర ఉంటే నీకూ ఉన్నట్లేగా." అంది సుధ మనస్ఫూర్తిగా.


"ఊర్కెనే అన్నానక్కా. నీక్కావలసిందే కొనుక్కో." అని మరి కాసేపు మాట్లాడింది సుమ.


ఉగాది రెండు రోజులు ఉందనగా సుధ ఫోన్ చేసి "అమ్మా! ఆ డబ్బులకి పావుతులం బంగారు గొలుసు వచ్చిందమ్మా. మా స్నేహితురాలు జయ వాళ్ళమ్మగారు కొనిపెట్టారు. " అని ఆనందంగా చెప్పింది సుధ. ఇంట్లో అందరూ ఆ మాట విని ఎంతో సంతోషించారు.


(మూడు వేలకి బంగారమా అని ఆశ్చర్య పోకండి. 20 సంవత్సరాల క్రితం సంఘటన ఇది.😊)


                     .....సమాప్తం....


Rate this content
Log in