మహిళామణులు
మహిళామణులు


యత్ర నార్యాస్తు పూజ్యంతే తత్ర దేవతా రమంతే, అని ఆర్యోక్తి. అనగా ఏచోట స్త్రీలు పూజింప బడతారో, ఆచోట దేవతలు కొలువుంటారు అని అర్థం.
పురాణాల ప్రకారం స్త్రీ ఆదిశక్తి. ఆమెను సృజించిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే ఆమె శక్తిని తాళలేక పోయారు. శివుని త్రినేత్రంతో ఆమెను భస్మంచేసి, ఆ భస్మమును మూడు భాగాలుగా విభజించి మరల ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ మువ్వురిలో సరస్వతిని బ్రహ్మ, లక్ష్మీ దేవిని మహా విష్ణువు, పార్వతిని మహాదేవుడు వివాహం చేసుకున్నారు. మహావిష్ణువు లక్ష్మిని వక్షస్థలంలో నిలిపితే మహాదేవుడు పార్వతికి అర్థభాగమిచ్చాడు. బ్రహ్మ తన వాక్కు నందు సరస్వతికి శాశ్వత స్థానం కల్పించాడు.
ఈ విథంగా స్త్రీలకు సమున్నత స్థానాలను కల్పించారు నాడు దేవతలు. మెలమెల్లగా పురుషులు తాము శారీరకంగా బలవంతులమని, స్త్రీలు తమపై ఆధారపడి ఉన్నారని భ్రమ కలిగిస్తూ వారిపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించ సాగారు. కాల, మాన, పరిస్థితుల దృష్ట్యా అదే కొనసాగి స్త్రీ ఒక దశలో బానిసగా, విలాస వస్తువుగా భావింపబడింది. తర్వాత ఎంతో పోరాటం చేసి, తన శక్తి సామర్థ్యాలతో తన స్థానాన్ని సాధించుకున్నా కొందరు మహిళలు ఇప్పటికీ వివక్షకు గురౌతూనే ఉన్నారు.
కొందరు మహిళలు సమయానుకూలంగా, అనేక రంగాలలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు స్త్రీల ఔన్నత్యాన్ని చాటుతూనే ఉన్నారు.
వేదకాలంలో, స్త్రీలు వేదాధ్యయనమునకు అర్హులు కారన్న వాదం నడుస్తున్న సమయం లోనే గార్గి, మైత్రేయి, ఘోష వంటి 24 మంది స్త్రీలు వేదాలు వల్లించినారు.
అలనాటి తెలుగు వనితలలో ఝాన్సీ రాణి, రాణీ రుద్రమ దేవి తమ వీరత్వాన్ని చాటిచెప్పారు. మొల్ల, గంగాదేవి, అవంతీసుందరి, తరిగొండ వెంగమాంబ, తాళ్ళపాక తిమ్మక్క, దార్ల సుందరీమణి, ముద్దు పళని, రంగాజమ్మ వంటి వారు రచనలలో తమకు తామే సాటి అనిపించుకున్నారు.
ఆంగ్లేయుల పాలనను వ్యతిరేకించిన మహిళలలో సరోజినీ నాయుడు, విజయలక్ష్మీ పండిట్, దుర్గాబాయి దేశ్ ముఖ్, కమలా నెహ్రూ కస్తూరిబా గాంధీ వంటి ఎందరో ప్రముఖులు ఉన్నారు.
స్వతంత్ర దేశాలు ఏర్పడిన తర్వాత మొదటి మహిళా ప్రధాన మంత్రిణులుగా రాణించిన వారు శ్రీమతి ఇందిరా గాంధీ, సిరిమావో బండారు నాయికే, మార్గరెట్ థాచర్, గోల్డామీర్ లు.
మొదటి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు పేరొందినారు.
స్త్రీలు వివిధ రంగాల్లో క్రీడా రంగం, సినీ రంగం, సేవారంగం, వైద్య రంగం, విద్యా - వైజ్ఞానిక రంగం ఇలా ప్రతి చోటా తమ సత్తాను చాటుతూనే ఉన్నారు.
అయినప్పటికీ స్త్రీలను అణచి వేయాలని వారి ప్రతిభను అణగ దొక్కాలని కొన్ని దుష్ట శక్తులు యత్నిస్తూనే ఉన్నాయి. స్త్రీల అభ్యున్నతిని సహించలేని కొందరు దుష్టులు చేసే పనులవి.
అయితే కొందరు పురుషులు, స్త్రీలకు అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా నిలిచిన వారూ ఉన్నారు. కుటుంబం లోని తండ్రి, అన్నదమ్ముడు, భర్త, ఇతర సభ్యుల రూపంలో ఇటువంటివారు తోడ్పాటు నందిస్తారు. అప్పుడు ఆ ఇల్లే స్వర్గసీమ అవుతుంది.
నాకు తెలిసిన విషయాలను మన సభ్యులు అందరితో పంచుకోవాలనిపించి రాశాను.
మహిళా మణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.