kottapalli udayababu

Abstract Drama

4  

kottapalli udayababu

Abstract Drama

అంటుమొక్క(కథ)

అంటుమొక్క(కథ)

8 mins
652


అంటుమొక్క (కధ )

                   అనుపమ ఇంతకీ రాకపోయేసరికి చూస్తున్న టీవీ విసుగ్గా అనిపించడంతో దానిని ఆఫ్ చేసేసి టీపాయిమీద ఉన్న ఆల్బమ్ తీసి మొదటినుంచీ చూడసాగింది కౌసల్య.

మొదటిపేజీ నుంచి ఎన్నెన్నో తీపిగుర్తులు. ఆడదాని జీవితంలో ఎన్నెన్నో అధ్యాయాలు. ప్రతీ అధ్యాయంలోను ఒక పాత్ర పోషించాలి. ఇన్ని రూపాంతరాలు పొందేది ఈ ప్రపంచంలో కేవలం ఆడదేనేమో.

ఆలోచిస్తూనే పేజీలు తిప్పుతున్న కౌసల్య ఎదురుగా చిన్ననాటి ఫోటోలు పలకరించడంతో ఈ లోకంలోకి వచ్చింది.

వెల్ బేబీ షో లో మొదటి బహుమతి పొందిన ఛాయాచిత్రం అది.బొద్దుగా బొండుమల్లి రేకుల్లాంటి నేవళంతో బుగ్గలు మెరిసిపోతున్న ఆ ఫోటో అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె ఆ ఫోటో పేజీని సుతారంగా ముద్దాడింది.

అంతలోనే గేటు బయట బైక్ శబ్దం వినబడటంతో ఆల్బమ్ మూసి టీపాయిమీద పెట్టి గుమ్మంలోకి వచ్చి నిలబడింది కౌసల్య.

నందకిశోర్ టి మాట్లాడి అతన్ని పంపేసి గేటు తీసుకుని లోపలికి వచ్చింది అనుపమ.

"ఏమ్మా ఇంత లేటయింది?"

"ఏం లేదు మమ్మీ. రైలు ఆలస్యంగా వచ్చింది. తలనొప్పి గా ఉంది...కొంచెం హార్లీక్స్ ఇవ్వవూ?"

"అలాగే. నువ్ స్నానం చేసిరా.రెండు నిముషాల్లో సిద్ధం చేస్తాను."

"అబ్బా.స్నానం చేసే ఓపిక లేదు. అసలే ఆ డి.టి.పి.పని చేసి బుర్ర వేడెక్కిపోయింది.వెంటనే ఇవ్వు మమ్మీ."గారంగునుస్తూ అడిగింది అనుపమ.

"చూడు.నా అంత ఎదిగిన పిల్లవు. శుచిశుభ్రతల గురించి చెప్పించుకునే వయసు కాదు నీది.ఈ మధ్య నీలో బాగా మార్పు వస్తోంది. లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం, రెండు వారాలకు గాని తలంటుకోకపోవడం, ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోకుండా ఆ బట్టలతోటే ఉండిపోవడం,...ఇవన్నీ చూస్తుంటే నేను పెంచిన నాకూతురేనా ఇలా ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది. కాన్వెంట్ లో చదువుతున్నప్పుడు ఎంతెంత పెద్ద ఇంటి పనులు, ప్రాజెక్టు పనులు ఇచ్చినా నీ మంచి అలవాట్లు చూసి నేను నేర్చుకోవాలి అనేలా ప్రవర్తించిన నువ్వేనా ఇలా...వెళ్ళు. వెళ్లి స్నానం చేసిరా. నా చేత ఎక్కువ వాగించకు."

తల్లి అలా మాట్లాడేసరికి రెండు చేతులు జోడించి నమస్కరించి స్నానాలగదిలో దూరింది అనుపమ. చల్లని నీళ్లు అలసిన శరీరం మీద బొట్లు బొట్లుగా పడుతుంటే శరీరంలో వేడి అంతా దిగిపోయి మబ్బుల్లోని చల్లదనం మనసులోకి పాకినంత హాయిని అనుభవించింది అనుపమ.

"ఎంతసేపు... అతివృష్టి.. అనావృష్టి ను.హార్లీక్స్ చల్లారిపోతోంది."కౌసల్య మాటలు చెవుల్లో పడేసరికి స్నానాలగదిలోంచి బయటకు వచ్చి తల్లి చేతుల్లో కప్పు అందుకుంది అనుపమ.

"గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకో.నీతో మాట్లాడాలి."అంది కౌసల్య.

తల్లికేసి వింతగా చూస్తూ తన గదిలోకి నడిచింది అనుపమ.

అనుపమ నైటీ వేసుకుని వచ్చేసరికి కౌసల్య బోన్సాయ్ మొక్కలకు నీరుపోసి కొమ్మలు కత్తిరిస్తోంది.

కౌసల్య కు మొక్కలంటే పంచ ప్రాణాలు. పట్నవాసంలో అందునా అపార్ట్మెంట్ నాగరికత అభివృద్ధి చెందాక నచ్చిన మొక్కలు నేలలో నాటుకుని చక్కగా పెంచుకుని వాటి ఫలాలు ఆస్వాదించే అదృష్టం ఎలాగూ లేదు.

అందుకే తాను బోన్సాయ్ మొక్కల పెంపకాన్ని ఎంచుకుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎన్నో అంటుమొక్కలను పెంచుతోంది. వాటిని కూతురు తాకినా తిడుతుంది.

ఒక విధంగా తనకంటే అవంటేనే ఎక్కువ ఇష్టమేమో అన్నంత ప్రేమ గా తల్లి వాటిని పెంచడం చూసి అసూయతో ఆ మొక్కల్ని కసితీరా పీకేయాలనిపిస్తుంది అనుపమ కు.

ఆ పని పూర్తిచేశాకా కౌసల్య వచ్చి సోఫాలో కూర్చుంది.

అనుపమ వచ్చి తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది.

"ఇపుడు చెప్పమ్మా. ఏదో మాట్లాడాలన్నావ్?"

"అవును. ముక్కుసూటిగా ఒకటి అడుగుతాను

చెబుతావా?" అండి కౌసల్య.

"అడుగు"

"నందకిశోర్ మీద నీ అభిప్రాయం?"

తల్లి నుంచి ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి సంభ్రమాశ్చర్యాలతో నిటారుగా లేచి కూర్చుంది అనుపమ.

"ఏమిటమ్మా? దేనిగురించి నువ్ ఆడిగావ్?" తాను తప్పుగా విందేమో అన్న భ్రమతో తల్లిని అడిగింది మళ్లీ.

"అదే...నందకిశోర్ మీద నీ అభిప్రాయం ఏమిటీ అని అడుగుతున్నా." స్థిరంగా అడిగింది కౌసల్య.

"అమ్మా.నువ్ ఎంత మంచిదానివి?సరిగ్గా నా మనసు విప్పి నీతో మాట్లాడుదామనుకుంటున్న విషయం కూడా ఇదేనమ్మా."

"అంటే...అంటే నువు నందకిశోర్ ని ఇష్టపడుతున్నావా?"

"అతని గురించి నీతో చెప్పి నీ అనుమతితో మాత్రమే పెళ్లి చేసుకుందామని అనుకున్నానమ్మా."

"అలాగా.మరి అతనికి నీమీద అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నావా?"

"ఓ.అతనికి నేనంటే పిచ్చి ప్రేమ. రోజూ ఉదయం నేను రైలు ఎక్కేవరకు పడిగాపులు కాస్తాడు.మళ్లీ సాయంత్రం నేను రైలు దిగేసరికి నన్నే తీసుకువెళ్లాడానికి సిద్ధంగా ఉంటాడు. నన్ను పైసా తీయనీడు.ఆడపిల్లచేత డబ్బు ఖర్చుపెట్టించేటంత సిగ్గుమాలినవాడిని అనుకుంటున్నావా? అంటాడు.అనుక్షణం నన్ను నవ్విస్తూ ఉంటాడు. నేను విచారంగా ఉండటం తనకు అస్సలు ఇష్టం ఉండదు. ఇపుడు చెప్పు.అతనంటే నీ అభిప్రాయం?" ఎదురు ప్రశ్న వేసింది అనుపమ.

"నీ ప్రశ్నకు రేపు సమాధానం చెబుతాను. అన్నట్టు రేపు రెండో శనివారం. నీకు కూడా సెలవే కదా.రేపు నర్సరీకి వెళ్ళొద్దాం. రెండు మొక్కలు గ్రాఫ్టింగ్ చేయించుకు వద్దాం.సరేనా?"

"అలాగే.కానీ ఇపుడే చెప్పమ్మా.ప్లీజ్" బ్రతిమలాడింది అనుపమ.

"లేదు పిచ్చిమొద్దు.నన్ను బాగా ఆలోచించుకోనీ.నేను ఏంచేసినా నీ మేలు కోరే కదా చేసేది"అంది కౌసల్య చమర్చిన తన కళ్ళ తడి అనుపమ చూడకుండా దాచే ప్రయత్నం చేస్తూ.

"అమ్మా.ఈమధ్య నువ్వన్నట్టు నాలో చాలా మార్పు వచ్చినట్టుంది.ఎందుకో ఎవరో నన్ను నీనుంచి దూరంగా లాక్కుపోతున్నట్టుగా అనిపిస్తోంది. మళ్లీ ఆ లాక్కుపోతున్న హస్తం స్నేహపూర్వకంగానే ఉంది.అయినా సరే.నిన్ను విడిచి నేను బ్రతకలేనమ్మా.నేను బ్రతకలేను."అంతలోనే తల్లి ఒడిలో ముఖం దాచుకుని ఏడవసాగింది అనుపమ.

"ఛ. తప్పుకదూ.ఆడపిల్ల ఎపుడూ ధైర్యంగా ఉండాలి. అలా ఏడవచ్చా?నీకు నేను లేనూ. లే.భోజనం చేద్దాం."అంటూ కూతురి కళ్ళు తుడిచి భోజనాలబల్ల వద్దకు నడిచింది కౌసల్య.

******

మరునాడు ఉదయమే వేరే పనేమీ లేనట్టుగా వచ్చిన నందకిశోర్ ను చూస్తూనే ఒళ్ళు మండిపోయింది. అయినా ఆప్యాయంగా నే మాట్లాడింది కౌసల్య.

గత రెండు సంవత్సరాలు గా అతను అనుపమ స్నేహితునిగా ఇంటికి వచ్చిపోతూనే వున్నాడు.వాళ్లిద్దరూ ఎక్కడెక్కడ తిరిగి వచ్చి , ఆలస్యమైనా 'ఆంటీ ఈపూట నా భోజనం మీ ఇంట్లోనే' అని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. అతని తత్వం తెలిసిన తాను కూడా అలాగే వంటచేసి పెట్టేది.

"మీరొక్కసారి నాన్-వెజ్ చేస్తే తినాలని ఉందాంటీ.మీ వంట అమృతంలా ఉంటుంది.అనూ అదృష్టవంతురాలు."అన్నాడు ఒక రోజు భోజనసమయంలో.

"నువ్వలా చెప్పు నాయనా.అసలే లావెక్కిపోతున్నానని డైటింగ్ పేరుతో అమ్మ నన్ను నియంత్రించేస్తోంది.దానికి మళ్లీ నీ సపోర్టా"అండి అనుపమ చిరుకోపంగా.

"ఆయుటమాత్రం నీ బరువులో ఏ మాత్రం తేడా రాకుండా నీకు కావలసినవన్నీ కొనిపెడుతూనే ఉన్నాగా?"అనేసి నాలిక కరుచుకున్నాడు నందకిశోర్.

తనకేమీ పట్టనట్టుగానే వింది కౌసల్య.

"నీకు నా చేతులతో చేసిపెట్టలేనిది నువ్వడిగిన మాంసాహారం ఒక్కటేనయ్యా.ఎందుకంటే మనిషికి జన్మతః కొన్ని లక్షణాలు, ఆహారపు అలవాట్లు వస్తాయి. చిన్నతనం నుంచి సాకాహారా వాతావరణమే తప్ప మరో వాతావరణం తెలియని నేను ఈవేళ ఆ అలవాటు చేసుకోలేను. ఆ వాసన అంటేనే పడదు నాకు.మళ్ళీ జన్మలో చూద్దాం లే."అంటూ తేలికగా నవ్వేసింది కౌసల్య.

"పోనీ కనీసం అనుపమకైనా అలవాటు చెయ్యండి. నా స్నేహంలో ఆపాటి మంచి లక్షణం నేర్చుకోకపోతే ఎలా? భవిష్యత్తు లో తానూ అలవాటు పడాలిగా."అన్నాడు నందకిశోర్.

"నాకేం ఆ అవసరం లేదు బాబు."అంది అనుపమ సాగదీస్తున్నట్టుగా.

"రేపు పెళ్లయ్యాక అవసరమైతే?"

"అయినాసరే అలవాటు లేని పనులు నేను చెయ్యనయ్యా బాబు.వాడికి కావాలిస్తే ఏ మిలట్రీ హోటల్ కో పోయి తినమంటాను."

"అది నేనే అయితే?" అన్నాడతను అర్ధోక్తిగా.

"నువ్వా?అయితే అపుడు చూద్దాంలే."అంది అనుపమ వెక్కిరించి.

కౌసల్య మధ్యలో అందుకుంది.

"పోనీ నువ్వే నీ అలవాట్లు మార్చుకుని శాకాహారిగా మారిపోవచ్చు గా.?"

"భలేవారు ఆంటీ.మాంసాహారం మీరు తినలేదు గానీ, తింటే అసలు వదిలిపెడతారెంటి? సరిగ్గా వండాలి గాని, వండితే మొత్తం మీరొక్కరే లాగించేస్తారు తెలుసా? అయినా అది మానడం నాకు అసాధ్యం. ఎందుకంటే మా మాంసాహారులకున్న బలహీనత దాన్ని మానలేకపోవడమే.అయినా వాటి ధరలు ఈవేళ మేం కూడా కొనలేని దశకు చేరుకున్నాయంటే మీ శాకాహారులే కారణం అంటారు మావాళ్ళంతా."అని తన జోక్ కి తానే నవ్వేసి అంతలోనే సీరియస్ గా "దయచేసి నన్ను మాత్రం మానమని మీరేనాడు సలహా ఇవ్వకండి ఆంటీ.అయినా ఇక ఆ విషయం వదిలేద్దాం." అన్నాడు నందకిశోర్.

"చూసావా.సరిగ్గా నా దారిలోకే వచ్చావ్."అంది కౌసల్య కూడా.

యధాప్రకారం ముగ్గురి భోజనాలు పూర్తయ్యాయి.

"అనూ.ఏదైనా సినిమాకు వెళదాం"అన్నాడు లేవబోతూ.

"అరె. మేము వేరే కార్యక్రమం నిర్ణయించుకున్నాం నందూ. నర్సరీకి వెళ్లి రావాలి.పైగా నువు డి.టి.పి.పనిలో ప్రూఫ్ కరెక్షన్ ఏదో చేసుకోవాలన్నావ్ కదమ్మా?" అంది అనుపమ నుద్దేశించి కౌసల్య.

"నేనెపుడన్నాను?"అనబోయి తల్లి కంటి సైగ చూసి ఆగిపోయి అంది అనుపమ.

"అవును నందూ. ఈవేళ రేపు నన్ను ఎక్కడికి రమ్మనకు.చాలా ఎక్కువ పని ఉంది ప్లీజ్." అంది కళ్ళతో బ్రతిమలాడుతున్నట్టుగా.

ఏమనుకున్నాడో ఏమో నందకిశోర్ మరేమీ మాట్లాడకుండా.

అతనికి కౌసల్య తో వాదించడం అంటే చాలా ఇష్టం.ఎంతసేపు తన దృష్టితోనే ఆలోచించడం మాని ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే ఫలితము వేరుగా ఉంటుంది అంటుంది.

'నా పరిస్థితి ని బట్టి నేను ఆలోచిస్తాను గాని ఎదుటివాడిలా నేను ఎందుకు ఆలోచిస్తాను...అంటాడతను. వీరిద్దరి వాదన తమాషాగా ఉంటుంది అనుపమ కు.

"ఈవేళ ఎందుకో వాదన కు దిగలేదు గురువుగారు."అంది అనుపమ.

"అదీ ఒకందుకు మంచిదే.పద పద.వెళ్ళొద్దాం."అంటూ తయారవ్వడానికి ఉద్యుక్తురాలైంది కౌసల్య.

********

స్కూటీ దిగి పచ్చని మొక్కలతో కళకళలాడుతూ వికసించిన, విరబూసిన రకరకాల పుష్పాలతో కనువిందు చేస్తూ సువాసనలు వెదజల్లుతున్న నర్సరీ వాతావరణం లో అడుగుపెడుతూనే హాయిగా సుదీర్ఘ శ్వాసలు తీసింది అనుపమ. స్కూటీ పార్క్ చేసి, తాళం వేసి వచ్చిన కౌసల్య అనుపమతో అంది.

"ఈ వాతావరణం ఎంతో బాగుంది కదూ."

"అవును మమ్మీ. ఇలాంటి ఒక పెద్ద నర్సరీ పెంచుకుని మధ్యలో ఒక అందమైన డాబా కట్టుకుందాం మమ్మీ."

ఆమాటలకి పకపకా నవ్వేసింది కౌసల్య.తల్లి ఎపుడూ అంతగా నవ్వడం ఈ మధ్యలో చూడని అనుపమ అడిగింది.",అదేంటి మమ్మీ...ఎందుకు నవ్వుతున్నావ్?"

తెరలు తెరలుగా వస్తున్న నవ్వును ఆపుకుంటూ అంది కౌసల్య" ఇప్పటికే మన అపార్ట్మెంట్ చినసైజు నర్సరీ చేసేశానని నన్ను తిడుతూ ఉంటావు కదా.అందుకని నవ్వొచ్చింది."

ఇంతలో నర్సరీ యజమాని నమస్కరించి సాదరంగా ఆహ్వానించాడు.

కౌసల్య తనకు కావాల్సిన మొక్కల వివరాలు చెప్పింది. అతను వెంటనే కూలీలని పిలిచి పని పురమాయించాడు.

అది తనకేం అవసరం లేనట్టు విశాలంగా ఉన్న ఆ నర్సరీ మొక్కల మధ్య సాధ్యమైనంత ఆనందాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి అన్నట్టు అనుపమ నడవసాగింది.

అనుపమ అలా తిరిగి వచ్చేసరికి కౌసల్య గ్రాఫ్టింగ్ చేయించిన రెండు మొక్కలకు డబ్బు ఇస్తోంది.

"మొక్కల్ని తీసుకుని స్కూటీ ఫుట్ బోర్డ్ మీద పెట్టు.", అనుపమతో అంది కౌసల్య.

"పనివాడిచేత పెట్టిస్తానమ్మా.బరువు ఉంటాయి." అన్నాడు నర్సరీ యజమాని.

"మొక్కలు కొనుక్కోవడమే కాదు.పెంచే బాధ్యత కూడా తెలియాలిగా.పర్లేదు.మాఅమ్మాయి పెడుతుంది లెండి." అంది కౌసల్య.

ఇక తప్పదన్నట్టు వాటిని తల్లి చెప్పిన స్థానంలో అమర్చింది అనుపమ.

*******

ఇంటికి వచ్చాక వాటికోసం అప్పటికే సిద్ధం చేసిన స్థానంలో పెట్టింది కౌసల్య.

" అనూ.ఇకనుంచి దీనిని పెంచే పూచీ నీది.దీని బాధ్యత నీకు అప్పగిస్తున్నాను."అంది కౌసల్య మొక్క చివరను

అనుపమ చేతిలో ఉంచి.

అప్పుడే దానిమీద దృష్టి నిలిపి పరిశీలించిన అనుపమ పకపకా విరగబడి నవ్వసాగింది.

అది మావిడి కొమ్మకు వేపను గ్రాఫ్టింగ్ చేసిన మొక్క.

"ఇదేమిటమ్మా.నీకు మతిగాని పోయిందా? లేక వాడు మర్చిపోయి అలా గ్రాఫ్టింగ్ చేశాడా? మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయడం ఏమిటి వెర్రి కాకపోతే?"

"నువ్వేమైనా అనుకో.నా పిచ్చి నాది.అలా గ్రాఫ్టింగ్ చేస్తే ఏ రకం కాయలు కాస్తాయో చూడాలని నేను ముచ్చటపడిపోతున్నాను తెలుసా?"

"అయితే నువ్వే పెంచుకో బాబు.నేను పడలేను."అంది అనుపమ చిరుకోపంగా.

"నీకు దాని బాధ్యత అప్పగించింది నువ్ తిరిగి నాకు అప్పగిస్తావని కాదు.దాని పట్ల నువ్ ఎంత శ్రద్ధ చూపిస్తావో అని.దాని బాధ్యత పూర్తిగా వహిస్తానని నాకు మాటివ్వాలి" అంది కౌసల్య సూటిగా చూస్తూ.

"ప్లీజ్ మమ్మీ.నాకు ఇష్టం లేదు."

"అలా మనకు.కొన్నింటిని మనకిష్టం లేకపోయినా అనుసరించాల్సివస్తుంది.అన్నట్టు నీతో చెప్పలేదు.నాకు పొరుగూరులోని ఆఫీసుకి వారం రోజులు డెప్యూటేషన్ వేశారు.నిన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్లడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు.అయినా వెళ్లక తప్పదు.అలాగే నామాట విని ఈ ఒక్క మొక్కపట్ల అభిమానం పెంచుకో. నిన్ను మరేమీ కోరను.సరేనా?" అంది కౌసల్య చేయి చాస్తూ.

తల్లి అంతరంగం గ్రహించిన అనుపమ అయిష్టంగానే ఆమె చేతిలో చేయి వేసింది.

*******

కౌసల్య ఆరోజు ఉదయం డెప్యూటేషన్ పై బయల్దేరాల్సిరావడంతో ఉదయమే తయారై వెళ్ళిపోయింది. వెళ్తూ అనుపమ కి ఒక కవరు ఇస్తూ అంది.

"అనూ. పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు చిన్నపిల్లలకు పిచ్చి పిచ్చి పనులు చేయాలనిపించడం సహజం. అలా అనిపించి ఆ పని చేయబోయేముందు ఈ ఉత్తరం చదువు. మర్చిపోకు. "

అనుపమ నిర్లక్ష్యంగా ఆ కవరు ను మంచంమీద పడేసింది.

గబగబా నందకిశోర్ కి ఫోన్ చేసింది.తాను ఈవేళ రాజమండ్రి రావడం లేదని కంప్యూటర్ వర్క్స్ కు ఫోన్ చేశానని, తనతో వివరంగా మనసు విప్పి మాట్లాడాలని, తొందరగా రమ్మని...ఆపైన ఆలోచనలో పడింది.

అమ్మతో తన మనసులో మాట చెప్పేసింది.అమ్మ మరునాడు తన సమాధానం చెబుతానంది.కానీ చెప్పనేలేదు.

తనకు ఏది ఇష్టం లేకపోయినా "నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే."అంటుంది. ఈసారి అదీ చెప్పలేదు.

'ఛ' అమ్మ ఎపుడూ అంతే. మనసు చికాకుగా అనిపించడంతో స్నానాలగదిలో దూరి తనకిష్టమైన పాటలు కూనిరాగం తీసుకుంటూ హాయిగా స్నానం చేసింది. స్నానం చేస్తున్నంతసేపు ఏవేవో అల్లరి ఊహలు.

నందకిశోర్ తన చెవుల వెనుక నుంచి వెచ్చని ఊపిరిలూదుతూ, గుసగుసలాడుతున్నట్టుగా...

తనని ఆక్రమించుకుంటున్నట్టుగా....తాను అందీ అందక ఊరిస్తున్నట్టుగా.

ఒకవేళ అతను తనని కోరరానిదేమైనా కోరితే...?బయట తాను అతనితో ఎంతగా తిరిగినా కేవలం కరచాలనం వరకే పరిమితం చేసింది అతన్ని. ఒకవేళ అతను తనను బలవంతం చేస్తే...?ఉహు.నందు అలా చెయ్యడు. తనకా నమ్మకం ఉంది. కానీ తానే ఎటువంటి వయసు ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడాలి.

అతను ఈమధ్య మనసు విప్పి మాట్లాడటం కన్నా శారీరకంగా కలవడంలోనే ఎక్కువ అభిరుచి చూపిస్తున్నాడు.ఏ విషయం మాట్లాడినా సంభాషణ అక్కడికే తీసుకొస్తున్నాడు. ఏ జంట కనపడిన వారిద్దరి మధ్య 'అది'జరిగుపోయేఉంటుంది అని ఊహించేస్తాడు.

అతనలా మాట్లాడినప్పుడల్లా తనకెంతో ఇబ్బంది గా ఉంటుంది.అందుకే అతన్ని దూరంగా ఉంచే అతని అభిప్రాయం తెలుసుకోవాలి.స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకుంటున్నంతసేపు అనుపమ ఆలోచిస్తూనే ఉంది.

బుర్ర వేడెక్కిఓవడంటి ఫాన్ వేసుకుని మంచం మీద వాలిపోయింది.

నందు ఇంకా రాలేదు.కానీ ఈ పాటికి బయల్దేరి ఉంటాడు.

ఆలోచిస్తూనే అప్రయత్నంగా ప్రక్కకు ఒత్తిగిల్లిన ఆమెకు తల్లి ఇచ్చిన కవరు చేతులకు తగిలింది. కవరు ఇచ్చివెళ్తూ తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి.

వెంటనే ఆలోచించకుండా ఉత్తరం విప్పింది.అందులో-

"అమ్మా అను!

ఆలోచించడం అనేది మానవుడికి దేవుడిచ్చిన వరం.నువు చక్కని ఆలోచనాపటిమ గలదానివి అని నా నమ్మకం.అందుకే నా వాదన విన్నమీదట నువు ఎలా నిర్ణయించుకున్న నీదారికి నేను అడ్డురాను.

నేను వయసు లో ఉండగా ఒకతన్ని ప్రేమించాను. అతను నాకు దూరపు బంధువు అవుతాడు.అతన్ని నమ్మి నా తనువునర్పించాను. ఫలితంగా గర్భవతిని అయ్యాను.అమ్మా నాన్న అతనితో వెళ్ళిపొమ్మని నిష్కర్షగా చెప్పేసారు.సరే అని అతన్ని ఒప్పించి అతనితో బయలుదేరాను.

అతను తన స్నేహితుడు రాజారామ్ ఇంట్లో నన్ను ఆ రాత్రి ఉంచి పరారైపోయాడు.నా నిస్సహాయస్థితిని చూసి రాజారామ్ అతనికోసం వెతికిస్తానని,నన్ను అక్కడే ఉండమని కోరాడు.అంగీకరించాను.అతనిభార్య ఆ సమయంలో ఊళ్ళోలేదు.పురిటికి వెళ్ళింది.

అంతలో నాకు ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం తాలూకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. ఉద్యోగం లో చేరాను.మొదటి జీతం తీసుకున్నాక రాజారామ్ ఇంటినుంచి వచ్చేసాను. వర్కింగ్ ఉమన్స్ హాస్టల్ లో చేరాను.

తరువాత నువ్ పుట్టావ్.నా కలలకు తగ్గట్టుగా నిన్ను పెంచుకున్నాను.నీకు కావలసినంత స్వేచ్ఛ ను ఇచ్చాను.ఎందుకంటే నువు ఏ తప్పు చేసినా 'అమ్మా.ఈవేళ ఈ తప్పు చేశాను.నన్ను క్షమించు.ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను.'అని చెప్పేంత స్వేచ్ఛ. అందుకే నువ్వంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం.

కులాంతర మతాంతర వివాహాలకు నేను వ్యతిరేకిని కాను.నా స్నేహితులలో అలా చేసుకున్నవారిని ప్రోత్సహించాను కూడా.

కానీ ప్రతీ మనిషి కొన్ని ఆహారపు అలవాట్లు, నియమాల మధ్య పుట్టి పెరుగుతాడు. బ్రతుకుతాడు.అవతలివారు తమ అలవాట్లు ఎలా మానుకోలేరో మనమూ అంత తేలికగా ఆ అలవాట్లు నేర్చుకోలేము.

నాకు తెలిసిన ఇలాంటి వివాహ వ్యవస్థ లో ఆడది సర్దుకుపోవాల్సిందే తప్ప మగవాడు ఎట్టిపరిస్థితుల్లోనూ సర్దుకుపోడు. వయసు వేడిలో ఆడది బలవంతంగా చేసుకున్న అలవాట్లు జీవితాంతం శాపంలా వెంటాడి వేధిస్తాయి.భర్తకు వండిపెట్టడం తప్పనిసరై, తాను సర్దుకోలేక అవస్ధ పడుతూనే ఉంటుంది.

వారిద్దరివి వేరు వేరు ఆహారపు అలవాట్లు అనుకుందాం

అంటే ఒకరు శాకాహారి.మరొకరు మాంసాహారి. వారి పిల్లలకు జన్యుశాస్త్రం ప్రకారం తండ్రి కులమే వర్తిస్తుంది. ప్రపంచం అతివేగంగా మారిపోతోంది.మనిషి ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్ళిపోయి అక్కడి ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోతున్నాడు. ఆ అలవాట్లవల్ల లేనిపోని ఒక కొత్త వ్యాధి వచ్చిందనుకో. దానికి మందు కనిపెట్టబడలేదు అనుకో.అనేక కాలుష్యాల మధ్య బ్రతుకుతున్న మనం లేనిపోని ఒక కొత్తసమస్యను సృష్టించుకుని బాధపడే బదులు అసలు దానిజాలికి పోకపోవడమే మంచిది అంటాను నేను.ఇది నా స్వార్ధంగా ఆలోచిస్తున్న విషయం.

ఇంకా చెప్పాలంటే 'అడుసు తొక్కనేల?కాలు కడగనేల?"అన్న సామెతలా.

నా అనుభవాలు నీకు అర్ధం అయ్యేలా చెప్పాలని మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయించాను.

మామిడి పులుపు ఒంటికి మంచిదని, వేప చేదు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా వేపతో మామిడిని ఎందుకు సంకరపరచరు?మనదేశంలో మేధావులకు ఆ ఆలోచన రాకనా?

నా వాదన అర్ధమైందనుకుంటాను. నా కన్నబిడ్డ సుఖం, భవిష్యత్తు నాకు ముఖ్యం.మొన్న నందూ వాదన వైన్ ఉంటావు.తన అలవాట్లు ప్రపంచం తలకిందులు అయినా మార్చుకోలేనని చెప్పాడు. విన్నావుగా.

ఇంత చదివాక నేను నీకు చెప్పాల్సిన పని లెఫు. ఆలోచించుకుని నీకు ఇది మంచిది అనిపిస్తే అలా చెయ్యి. నువు తీసుకోబోయే నిర్ణయం నన్ను బాధించినా పర్వాలేదు. కానీ 'ఎంత పొరపాటు చేసాను?' అని భవిష్యత్తు లో ఏనాడు వెనుదిరిగి నువు బాధపడకూడదు.అదే నా కోరిక.మర్చిపోకు.

ఆశీస్సులతో

సదా నీ సుఖం కోరుకునే

అమ్మ"

ఉత్తరం రెండు సార్లు కాదు. ఇరవైసార్లు చదివింది అనుపమ. ఎందుకో కళ్ళనిండా నీళ్లు తిరిగి జల జలా బుగ్గలమీదుగా జారిపోతూనే ఉన్నాయి.ఎంత సున్నితంగా చెప్పింది 'అమ్మ,'

అంతలో కాలింగ్ బెల్ మోగింది. వచ్చింది నందకిశోర్ అని తెలుస్తోంది.

అనుపమ ఉత్తరం కవరులో పెట్టి ముద్దుపెట్టుకుని తన బట్టల మధ్య జాగ్రత్తగా దాచింది.

ముఖం కడుక్కుని టవల్ తో తుడుచుకుని మనసులో ఏ అలజడి లేకుండా ధీమాగా తలుపువైవు అడుగులేసింది.

సమాప్తం.Rate this content
Log in

Similar telugu story from Abstract