ఉదయబాబు కొత్తపల్లి

Abstract Drama Inspirational

3  

ఉదయబాబు కొత్తపల్లి

Abstract Drama Inspirational

నీ తోడు కావాలి (కథ)

నీ తోడు కావాలి (కథ)

8 mins
260


నీ తోడు కావాలి (కథ) - కొత్తపల్లి ఉదయబాబు 

( పత్రిక - మన మాసపత్రిక ఆగష్టు 2010 సంచికలో ప్రచురింపబడిన కధ )


‘’5000 కి మాట్లాడుకుని మూడు వేలు ఇస్తాను అంటే ఎలా సార్? నేను కేవలం ఈ వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నదాన్నే. 5000 ఇవ్వండి. ‘’ లెక్క పెట్టిన డబ్బును తిరిగి నిర్వాహకుని చేతికి అందిస్తూ అంది ఆమె.


‘’అది కాదు మేడం. కలెక్షన్ పూర్తిగా రాలేదు. ఇస్తానన్న దాతలు పూర్తిగా ఇవ్వలేదు. ఈసారికి దీంతో సరిపెట్టుకొండి ’’ అన్నాడు అతను.


‘’సారీ సర్. మాకు పని దొరికేది ఈ సీజన్లోనే. ఈ కార్యక్రమాలలో సంపాదించుకున్న సొమ్ముతోనే ఏటికేడాది సంసారం నడుపుకోవాలి. మీరు అన్యధా భావించవద్దు. ఎలాగైనా 5000 ఇప్పించండి. మీకు రావాల్సిన రావాల్సినవి ఎలాగూ ఉన్నాయి కాబట్టి మరోసారి మీరు నన్ను ఉపయోగించుకోవాలంటే ఇవ్వక తప్పదు. నా పరిస్థితి అర్థం చేసుకోండి. ప్లీజ్’’ అందామె.


‘’అది కాదు మేడం. మీకు ఇందాక స్టేజి మీద రెండు వేల రూపాయలు బహుమతిగా వచ్చింది కదా. దానితో మీ 5000 మీకు ముట్టినట్టే కదా.’’


ఆమె సూటిగా చూస్తూ అనుమానంగా అడిగింది.


‘’ఇది మీకు వచ్చిన ఆలోచనేనా? ఎవరైనా ఇచ్చిందా ?’’


‘’ ఆ! నేను ఇచ్చాను. ఏమిటి? ఇందాకట్నుంచి చూస్తున్నాను. నువ్వు ఎంత అడిగితే అంత ఇచ్చేయాలా? ఆర్టిస్టు అన్నాక ఆమాత్రం సరిపెట్టుకోలేవా? అతను డబ్బు వసూలు అవ్వలేదని చెబుతున్నాడు గా’’ అని ఆమెను గదమాయించి -


‘’ ఏరా రాఘవ! ఆమె అలా దబాయిస్తుంటే నీళ్ళు నముల్తావెంటీ? ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పక’’ అని నిర్వాహకుడు రాఘవను ఉద్దేశించి తల ఎగరేసి మాట్లాడుతున్న ఆ వ్యక్తిని చూస్తూనే ఆమె కోపోద్రిక్తురాలైంది .


 


అతను తనతో నటించే హీరో ’ రమేష్’


‘’ హూ ఆర్ యు టు టెల్ లైక్ దట్? అలాంటి సలహా ఇవ్వడానికి సిగ్గులేదూ? సాటి మనిషివై ఉండి, అందునా లేడీ ఆర్టిస్టు సాధకబాధకాలు తెలిసి కూడా అలాంటి సలహా ఇస్తావా? బహుమతిగా వచ్చిన సొమ్మును బాడుగ సొమ్ముతో కలుపుతారా ఎవరైనా? ఏది ఎవరినైనా రమ్మను. వచ్చి న్యాయం చెప్పమను. ‘’ అందామె తోక తొక్కిన త్రాచులా.


 


‘’ ఓకే మేడం . సారీ ఫర్ ద ట్రబుల్ గివెన్ టు యు. నేను వాళ్ళ దగ్గర నుంచి తర్వాత కలెక్ట్ చేసుకుంటాను. ముందు మాట్లాడుకున్నట్టుగా ఐదు వేలు ఇస్తాను. తీసుకు వెళ్ళండి’’ అన్నాడు- రాఘవ లాల్చీ జేబులోంచి డబ్బు తీస్తూ.


‘’ ఏంటి నువ్వు ఏమైనా గొప్ప నటివి అనుకుంటున్నావా? నీ చరిత్ర ఎవరికీ తెలియదనుకున్నావా? ఏదో కాస్త పేరున్న దానివి కదా, మంచి పాత్ర ఇస్తే ఇంకా బాగా పేరు తెచ్చుకుంటావని అని కదా నీ పేరు నేనే సుజెస్ట్ చేశాను తెలుసా. సిగ్గు లేదూ అని నువ్వు నన్ను అడుగుతున్నావా? నేను తలుచుకుంటే అంగుళం ఇక్కడినుంచి కదలగలవా? ఒరేయ్ నువ్వు డబ్బులు ఇవ్వకురా. ఏం చేస్తుందో చూద్దాం’’ అన్నాడు రమేష్. అవతల అవతల వాళ్ళ బలహీనత మీదకి దెబ్బ కొడితే మన గెలుపు ఖాయం అనేది బలహీను మనస్కుల లక్షణం. ఆ కోవకు చెందినవాడు రమేష్.


 ఆమె ఒక అడుగు ముందుకు వేసి పకపకా నవ్వింది. రాఘవ ఇచ్చిన డబ్బు తీసుకుని లెక్క పెట్టుకొని సంతృప్తికరంగా దాన్ని భద్రపరుస్తు అంది.


 


“ ఏమిటి చరిత్రల దాకా వెడుతున్నావ్? చరిత్రలు ఉన్న వాళ్ళే రంగం మీదకు వస్తారు. లేనివాళ్లు ఎప్పుడూ తెర వెనకాలే ఉంటారు. మనం కళాకారులం రమేష్. ఒకరినొకరం అవమానించుకోచడం పద్ధతి కాదు. నువ్వు తలుచుకుంటే అంగుళం ఇక్కడినుంచి కదలలేనా? నేనేమైనా నీ కట్టుకున్న భార్యనా ? చంపేస్తావా ఏమిటి కొంపదీసి నన్ను? ఆడది కోరి వస్తే అనుభవించాలి కానీ బలవంతంగా అనుభవిస్తే ఏమంటారో తెలియదా నీకు?


నీ ఆంతర్యం ఆమాత్రం అర్థం చేసుకోలేనా నేను?


మనం ఎన్నో ఏళ్ల నుంచి కలిసి నటిస్తున్నాం. లేడీ ఆర్టిస్ట్ అంటే కేవలం అందుకే వస్తారనా ఏమిటి మీ ఉద్దేశం? రియల్లీ ఐ పిటి యు రమేష్, ఎనీ హౌ...కఠినంగా మాట్లాడినందుకు మన్నించండి రాఘవగారు. మీరు ఇచ్చిన ఈ డబ్బు వాడుకున్నంత కాలం మీ పేరు చెప్పుకుని మరీ తింటాను. నేను వెళ్తాను.’’ అందామే వెళ్లడానికి వుద్యుక్తురాలు అవుతూ.


 రమేష్ ఆమెను వెటకారంగా చూసి విసవిసా వెళ్ళిపోయాడు.


‘’ ఇంత రాత్రి వేళా! ఇప్పుడు టైము రెండు గంటలు కావస్తోంది. మీరు వెళ్లడానికి ఏ విధమైన ట్రాన్స్పోర్టు దొరకదు . ‘’రాఘవ అన్నాడు.


‘’నాకు తెలుసు సర్..యే లారీ దొరికిన ఎక్కేస్తాను. పర్వాలేదు. నేను ఈ రాత్రి ఈ ఊళ్లో ఎవరి ఇంటికి వచ్చినా ఆ ఇంటి ఆడదాని కంటిమీద కునుకు ఉండదు. అది నాకు ఇష్టం ఉండదు. పోనీ ఈ రాత్రికి ఊర్లో నాకు మీరు ఆశ్రయం కల్పించ గలరా చెప్పండి? ‘’ రాఘవ మాట్లాడట్లేదు.


 


‘’తెల్లవారే వరకు మీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వగలరా? మీ వాళ్ళు ఒప్పుకుంటారా? ‘’


‘’...................................’’


 


‘’మా లాంటి వాళ్ళు వేదిక మీద రంగు వేసుకున్న ముఖాలతో నటిస్తుంటే ఆనందిస్తారు గాని, ఆ రంగు తీసేస్తే వాళ్ళు మనలాంటి వాళ్లే అని ఆలోచించే మానవత్వపు రోజులు ఎప్పుడు మంట కలిసిపోయాయి సార్. నేను ఎలాగోలా వెళ్తాను. నేను లారీయో , రిక్షాయో ఏదో ఒకటి ఎక్కేంతవరకు మీరు తోడు ఉండండి చాలు’’ అంది ఆమె.


 


‘మీకు ఆశ్రయం నేను ఇస్తాను మీకు అభ్యంతరం లేకపోతే ‘’ అప్పటివరకు క్రీనీడలో నిలబడి వేసుకున్న వ్యక్తి రెండడుగులు ముందుకు వేసి అన్నాడు.


 వెలుతురు లో అతను ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతన్ని చూసి ఒక్కసారిగా నిశ్చేష్టురాలు అయిపోయింది ఆమె.


 అతను కరణ్. ‘మహేంద్ర కరణ్ ‘.


‘’మీరు... మీరు... ఇక్కడ?’’


‘’ నేను ఇక్కడ డాక్టర్ గా పనిచేస్తున్నాను అర్చన. నీకు అభ్యంతరం లేకుంటే మా ఇంట్లో ఉండి ఉదయమే వెళుదువు గాని.


‘’ నో కరణ్. నేను మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టలేను. నేను తెల్లవారే వరకు ఇక్కడే ఉండి వెళ్తాను. ‘’


 


‘’ మీరు మరో మాట మాట్లాడితే నా మీద ఒట్టే. ప్లీజ్ రండి. చాలా రోజుల తర్వాత నటనలో మీ విశ్వరూపాన్ని చూశాను. మధురవాణి పాత్ర మీకోసం గురజాడవారు రాశారా అన్నంత అపూర్వంగా నటించారు. అందులకు మీకు కృతజ్ఞతలు. ఇక మా ఇంట్లో - మీరు ఇంటికి వస్తే కునుకు పట్టని ఆడది, అదే మా ఇల్లాలు లేదు నేను పెళ్లి చేసుకోలేదు కాబట్టి. పెద్దావిడ మా అమ్మగారు ఉన్నారు. మీకు ఏమీ భయం లేదు రండి’’ అన్నాడు అతను కలుపుగోలు తనంగా చిరునవ్వుతో.


ముందు అక్కడి నుంచి బయట పడవచ్చు అనే భావంతో ఆమె తన చిన్న బ్రీఫ్-కేస్ అందుకుని రాఘవతో అంది.


‘’ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎంతో సమర్థత కావాలి రాఘవగారు. ఆ నైపుణ్యం మీకు ఉంది. మీరు నటులు కాకపోయినా ఇంత చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసి అటు ప్రజలకు మరుగున పడిపోతున్న నాటకాన్ని- అందులోని ఆనందాన్ని అందజేస్తారు. ఇటు మా వంటి కళాకారులకు ఇలా జీవనోపాధి కల్పిస్తున్నారు. మీ కృషి నిజంగా అభినందనీయం. నేను మిమ్మల్ని బాధించి ఉంటే మన్నించండి. సెలవు’’


అర్చన అన్న మాటలకు రాఘవ ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించాడు. అర్చన చేతిలోని బ్రీఫ్-కేస్ కరణ్ చనువుగా తీసుకుని ముందుకు నడుస్తుంటే ఆమె అనుసరించింది.


 


******


 ‘’అమ్మ పడుకుంది. అందుకే ఇంటికి తాళం వేసి వచ్చాను. ‘’ నెమ్మదిగా శబ్దం రాకుండా తలుపు తాళం తీస్తు అన్నాడు కరణ్.


హాలుకు ఎదురుగా ఉన్న బెడ్ రూమ్ నుంచి సన్నగా గురక వినిపిస్తోంది. ఒక అత్యంత క్షేమకరం ప్రదేశం లోకి వచ్చినట్టు ఫీల్ అయింది అర్చన.


‘’ కూర్చోండి . ఇది మా కుటుంబ ఆల్బం.చూస్తూ ఉండండి.’’ అని ఆల్బం చేతిలో పెట్టి కిచెన్ లోదూరాడుతను.


సరిగ్గా ఐదు నిమిషాలలో పొగలు కక్కుతున్న నెస్-కేఫ్ కప్పుతో వచ్చాడు.


‘’ సూర్యోదయం అవ్వకుండానే నెస్- కేఫ్ ఇస్తున్నాను. తాగి రిలాక్స్ అవ్వండి’’ అన్నాడు కప్పు అందిస్తూ. అర్చన అందంగా నవ్వింది.


‘’మీకు శ్రమ కలిగించాను’’ అంది అర్చన తొలి సిప్ కోసం కప్పును పెదవులకు ఆనించుకుంటూ.


‘’ కొన్ని సేవలు ఆనందాన్ని కలిగిస్తాయి . మరియు కొన్ని సేవలు అనుభూతులను మిగులుస్తాయి. మీరు నాకు రెండో రకం శ్రమ ఇచ్చారు. ఒకనాడు మీరు కన్నెత్తి చూసి పన్నెత్తి పలకరిస్తే చాలు అనుకునే వాడిని. నా ఏకలవ్య ప్రేమ మిమ్మల్ని మా ఇంటికి వచ్చేలా చేసింది. అంటే మీ మీద నా ప్రేమ 100కు 100% నిజం అని అర్థమైంది. ఆనాడే దైర్యంచేసి ఉండాల్సింది, తప్పు చేశాను. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నాడు కరణ్.


 ఆమె కళ్ళు చమర్చ లేదు గాని మనసు ఆర్ద్రం అయింది.


 


‘’నేను ఇంక పడుకుంటాను ‘’ అంది.


‘’ అప్పుడేనా?’’ అని అతను కప్పులతో కిచెన్ లోకి వెళ్ళి టవల్తో తిరిగి వచ్చాడు.


‘’ వేడి నీళ్లు పెట్టాను. బాగా అలిసిపోయి ఉన్నారు . వెళ్లి స్నానం చేసి రండి. హాయిగా నిద్ర పడుతుంది.’’


ఆమె అరమోడ్పు కన్నులతో అతని చూసింది. 


అతను అతని చూస్తున్న కొద్దీ ఆమె గుండె బరువెక్కసాగింది.


‘అమ్మో! అనవసర ఆలోచనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి’ అనుకుని అతను అందించిన టవెల్స్ అందుకుని, బ్రీఫ్ లో ఉన్న నైట్ డ్రెస్ తీసుకుని బాత్రూం లో దూరింది.


పది నిమిషాల అనంతరం ఆమె తేటబడిన ముఖం తో ఆధునిక వనితలా బయటకు వచ్చింది .


అతను సంభ్రమాశ్చర్యాలతో ఆమెను గమనించాడు.


‘’ మీరు ఈ రూమ్ లో పడుకోండి. నేను హాల్ లో పడుకుంటాను.’’ అన్నాడతను


‘’మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదు?’’ అంది అర్చన విద్యార్థినిలా చేతులు కట్టుకుని.


‘’ఉదయం లేచాక చెబుదురు గాని. తలుపులు వేసుకుని పడుకోండి’’ అన్నాడతను.


 తలుపులు వేసుకుని పడుకోవడం మిమ్మల్ని అవమానించినట్టే. గుడ్ నైట్ .’’అందామే బెడ్ రూమ్ లోకి నడుస్తూ.


‘’ గుడ్ నైట్. ఈ పరీక్షలో నేను నెగ్గుతాను. నేను కేవలం ఓడిపోయింది మీ విషయంలోనే’’ అనుకున్నాడు మనసులో కరన్


 


*******


 


 ‘’అర్చన. నైస్ గుడ్ మార్నింగ్ ఇకనైనా లేస్తారా?’’ గది గుమ్మం బయట ‘టక్...టక్’’ అని శబ్దం చేస్తూ వచ్చిన మాటలకు ఉలిక్కిపడిలేచింది అర్చన.


 సమయంచూసింది. బాపురే! ఉదయం 11 గంటలకు కావస్తుంది. గబగబా బాత్రూమ్ లో దూరింది. కేవలం అరగంటలో తయారై హాల్లోకి వచ్చింది.


‘’ అయాం వెరీ వెరీ సారీ. మొద్దులా నిద్ర పోయాను. ఆడదాన్ని అయి ఉండి మీ చేత అన్ని చేయించుకుంటున్నాను. ఐ యాం సో సారీ ఫర్ గివింగ్ ట్రబుల్ టు యు.మరి నేను బయల్దేరతాను ’’గది బయటకు రాగానే వేడివేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన కరణ్ ని చూస్తూనే నొచ్చుకుంటున్నట్టు అంది అర్చనా.


 


‘’మీరు భోజనం చేసి వెళ్లకపోతే నా మీద ఒట్టే!’’ స్థిరంగా అన్నాడు కరణ్.


‘’ మీరు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు. అక్కడ మీకు అలాగే నా కోసం ఒక ప్రాణం విలవిల లాడుతూ ఉంటుంది. ఇప్పటికే ఎంతో ఆలస్యం చేసాను. ‘’


 ‘’అర్చన ప్లీజ్! మీరు భోజనం చేసేస్తే మీ వెంట వచ్చి మిమ్మల్నిమీ ఇంటిదగ్గర దింపి ఆ ప్రాణాన్ని కూడా చూసి వస్తాను. మీరు అనుమతిస్తే.’’


 


‘’నిజం? నిజం గా మా ఇంటికి వస్తారా’’


‘’ వై నాట్! రాకూడదా?’’


‘’ ఎంత అదృష్టం? కాలదన్నుకున్న అదృష్టం కోరి వస్తానంటే అంతకన్నా అదృష్టం మరి ఏముంటుంది? అయితే ఓకే . ఇద్దరం కలిసి భోంచేద్దాం. భోజనం అయ్యాక మళ్ళీ విశ్రాంతి తీసుకుని సాయంత్రం బయలుదేరండి అంటే మాత్రం కుదరదు. అందుకు సరే అంటేనే మరి!’’ అందామే గారంగా.


 ‘’సరే’’ అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచాడు కరన్ . ఆమె అతన్ని అనుసరించింది.


 


*******


 


తనని తనకు పరిచయం చేస్తున్న వ్యక్తిని చూస్తూనే అదిరిపడ్డాడు కరణ్.


‘వీరూ.. సారీ రా! వెరీ వెరీ సారీ. రాత్రి చాలా పొద్దుపోయింది. అది పక్కా పల్లెటూరు కావడంతో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు పాపం ఈయన సాయం చేశారు. అన్నట్టు ఈయన ఎవరో చెప్పగలవా వీరు ?’’అంది అర్చన వీరేంద్ర పక్కన మంచం మీద కూర్చుని తల నిమురుతూ.


‘’మీరొత్తేనే గాని భోజనం సేయనని అట్టాగే ఉండి పోయారమ్మ. ఇంక మీరు సూసుకోండి. ఇప్పటికే మా మావ మూడు సార్లు ఓచ్చి ఎల్లాడు. నేనింక ఎల్తన్నాను’’ అంది ఆయా కాబోలు.


‘’అరే.. ఇంకా భోజనం చేయలేదా.. సారీ రా నాన్న.. వెరీ వెరీ సారీ... ఒక్క నిమిషం’’ అంటూ బెడ్ రూంలోకి వెళ్ళి వచ్చి ఆయమ్మ చేతికి డబ్బులు ఇస్తూ అంది అర్చనా.


‘’ కన్నతల్లిలా నువ్వు నాకు అండగా ఉండబట్టే నేను నాలుగు రాళ్లు సంపాదించగలుగుతున్నాను. అది ఈ నెల జీతం. ఒక వంద ఎక్కువే ఇచ్చాను. అంతా దాచేయక మీ మామ కి సరైన కూడు పెట్టు. నేనొచ్చాగా. నేను చూసుకుంటాలే ‘’అని లచ్చమ్మని పంపేసింది అర్చన.


‘’మీరు... మీరు’’


 వీరేంద్ర కరణ్ ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కరణ్ వీరేంద్రను చూసిన వెంటనే గుర్తు పట్టేశాడు.


‘’అరే! మీరు ఇంకా నిలబడే ఉన్నారా! అదేంటి వీరూ? ఆయన్ని కూర్చోమనకపోయావా? ప్లీజ్ కూర్చోండి!’’ అంటూ కుర్చీ చూపించింది అర్చనా.


 


‘’ నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. మీరు ఎంతో ఉత్సాహంగా ఉండే వారు. మీరు ఇలా...?’ అడిగాడు కరణ్ స్థిరంగా కూర్చుని.


‘’తప్పని తెలిసి చేసే మనిషికి భగవంతుడు తప్పక శిక్ష విధిస్తాడు. నాకీ శిక్ష కావాల్సిందే. ఈ అమృతమూర్తికి ద్రోహం చేద్దామనుకున్నాను. నేను చేస్తున్నది తప్పని తెలుసు. అయినా మగవాడిని అనే అహంకారంతో నన్ను నమ్మి వచ్చిన ఆడదాన్ని ఓడించగలిగిగాననే గర్వం నాకీ శిక్షను విధించింది. నా నమ్మకద్రోహానికి ఈ శిక్ష చాలదు కరణ్. ‘’ అంటూ కరణ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని విలపించసాగాడు వీరేంద్ర.


 


‘’ డాక్టర్ నిన్ను ఉద్రేకపడ వద్దు అని చెప్పాడా లేదా? సరదాగా నవ్వుతూ చక్కగా కబుర్లు చెప్పుకోవాలని గాని జరిగిపోయిన తతంగం అంతా ఎందుకు? నేను రాలేదని భోజనం మానేస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పు?’’ అంటూ అప్పటికే కంచం తో వచ్చిన అర్చన వీరేంద్ర కు భోజనం తినిపింఛసాగింది.


తన కార్యక్రమం ఎంత బాగా జరిగిందో అంతా పూసగుచ్చినట్లు వీరేంద్రకు చెబుతూ, నవ్విస్తూ భోజనం తినిపించింది. వెంటనే టాబ్లెట్లు వేసింది. మరో అయిదు నిమిషాల్లోనే అతను నిద్రలోకి జారుకున్నాడు .


 


‘’సారీ కరణ్ ... మీకు చాలా శ్రమ ఇచ్చాను. రండి హాల్లో కూర్చుని మాట్లాడుకుందాం .ఏం తీసుకుంటారు కాఫీ..... టీ....?’’


 


‘’నాకేమీ వద్దు... మీకు అభ్యంతరం లేకుంటే...?’’


 


 ఇద్దరూ హాల్లోకి వచ్చి ఎదురెదురుగా కూర్చున్నారు.


 ‘’మీ ప్రశ్న నాకు అర్థమైంది కరణ్. మీరు ఏ విధమైన సేవ చేస్తున్నారో ... నేను అదే పడవలో ప్రయాణిస్తున్నాను. వివరంగా చెబుతాను.


మీ ఇంట్లో మీరు ఒక మాట అన్నారు గుర్తుందా!


‘తన కాళ్లమీద తాను నిలబడిన వ్యక్తి ఎవరైనా సరే, తాను బ్రతికి ఉన్నంత వరకు కేవలం తన తల్లి వల్లనే అలా ఉన్నాను అని గుర్తించ గలగాలి అని.’


ఆ శక్తి నాకు నా మాతృమూర్తి ఇచ్చింది. అవును కరణ్. అమ్మ ఒర్పే నాకు రాకుంటే నేను ఈనాడు ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని.


 పుట్టిన పిల్లల్లో నేను ఎంతో అందంగా పుట్టానని, అపురూపంగా పెంచి పెద్దచేసింది. నా ఊహ తెలిసేనాటికే నాన్న పోయారు. అమ్మ మెలకువ గా ఉంది అంటే అస్సలు పనిచెయ్యకుండా ఖాళీగా ఉండేది కాదు. పనిచేసే ప్రతి క్షణానికి ఒక పైసా అయిన రావాలి కష్టపడేది. న్యాయబద్ధంగా ఎలాంటి పనైనా చేయాలి. డబ్బు సంపాదించి నన్ను బాగా చదివించి పెద్ద ఉద్యోగస్తురాలిని చేయాలి అన్న ఉద్దేశంతో, నాకు సంగీతం, డాన్స్ , కరాటే అన్నీ నేర్పించింది.


 మీకు తెలుసుగా! కాలేజీ బ్యూటీ గా మీ కుర్రాళ్ళందరూ నాకు నీరాజనాలు పడుతూ నా ఇంటి చుట్టూ తిరుగుతున్నప్పుడు, వారందరితో లౌక్యంగా ఎంతవరకు ఎలా ప్రవర్తించాలో నేర్పింది. ‘ నన్ను మోసం చేసినా పర్వాలేదు... నిన్ను నువ్వు మోసం చేసుకోకు తల్లి’ అని హెచ్చరించేది అమ్మ.


 


అమ్మను మోసం చేస్తూనే నన్ను నేను సరిపెట్టుకుంటూ సాంస్కృతిక కార్యక్రమాల సెక్రటరీగా ఉన్న వీరేంద్ర ను అభిమానించడం మొదలు పెట్టాను. 


నాలో ఉన్న కళలను గుర్తించి, అతను ప్రోత్సహించడమే అందుకు కారణం. ఎందరో ప్రేమలేఖలు అందుకున్న నేను. నా పట్ల ఆనాటి కాలేజీ హ్యాండ్సమ్ అనిపించుకున్న మీ ఆరాధనను అర్థం చేసుకున్నా, ప్రతిస్పందించ లేకపోయాను. వీరేంద్ర అత్యంత చలాకీతనం ముఖ్యంగా, అతని ధైర్యం అతనంటే ఇష్టపడేలా చేశాయి. నా మనసుకు గేలం వేయగలిగేనని అతడు గుర్తించిన వెంటనే నన్ను ఒక శుభముహూర్తాన తీసుకుపోయాడు. ఇంట్లో డబ్బు నగలతో అతనితో వెళ్ళిపోయాను.


అతను నన్ను నమ్మించి దోచాల్సినవన్నీ దోచుకొని నేను ఆ మత్తులో వుండగానే ‘నీ వాళ్లను కలుసుకోవడానికి ఇది ఉపయోగిస్తుంది. నిజానికి నిన్ను బ్రోతల్ హౌస్ కు ఆమ్మేద్దాం అనుకున్నాను. కానీ నేను అనుభవించిన అందం అలా క్షణక్షణం చిత్రవధ కావడం నాకు ఇష్టం లేదు. ఇంటికి వెళ్లి తప్పు ఒప్పుకొని మీ అమ్మ చేసిన పెళ్లి చేసుకో’ అని ఉత్తరం రాసి తన సెల్ ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు.


 


రెండు గంటలు గడిచి గడవక ముందే అతని నుంచి హృదయవిదారకమైన ఫోన్! ఘోరమైన లారీ యాక్సిడెంట్ లో జరిగే రెండు కాళ్లు నూజ్జు నూజ్జు అయిపోయిన నిస్సహాయస్థితిలో వచ్చింది ఆ ఫోను.


 


 చాలా చాలా హాయిగా నవ్వుకున్నాను. ఆ యాక్సిడెంట్ జరిగి ఉండకపోతే అతను తప్పక నాకు దూరం అయ్యేవాడు. నిష్కల్మషంగా నమ్మినందుకు దేవుడు వాడికి తగిన శిక్ష వేశాడు.


నా తప్పు ఒప్పుకుని అమ్మ ఒడిలో తల పెట్టుకొని మనసారా ఏడవాలని బయలుదేరాను. అప్పటికీ వందకు పైగా మిస్డ్ కాల్స్ వాడి దగ్గర్నుంచి.  


‘’నన్నయినా మోసం చెయ్యి తల్లీ...నిన్ను నువ్వు మోసం చేసుకోకు తల్లి. ఓర్పు సహనం స్త్రీ కి శ్రీరామరక్ష-  అన్న అమ్మ మాటలు పదే పదే గుర్తుకు తెచ్చుకున్నాను.


 అమ్మ తనని తాను పోషించుకోగలదు. కానీ వీరేంద్ర? నేను తప్పు చేయడానికి అవకాశం ఇచ్చాను . అది నా తప్పే ! నా తప్పుకు నేనే శిక్ష విధించుకోవాలి. అందుకే వాడిని క్షమించాను. అతనికి రెండు కాళ్లు లేవు. ఊహించని ఆ ప్రమాదం వల్ల రెండు చేతులు కదులుతాయి కానీ ఏ పని చేయలేవు. అప్పటి నుంచి వాడి కోసం ఈ బతుకు బతుకుతున్నాను.


మధ్యలో వెళ్ళి అమ్మను తెచ్చుకున్నాను . నా తప్పును మన్నించి నా దగ్గర ఉండగలిగింది కానీ నా స్వయంకృతాపరాధాలకి మూగవేదన అనుభవిస్తు నా చేతుల్లోనే మరణించింది. ఆ నాడే మీకునా అంగీకారం తెలిసి ఉంటే నా జీవితం మరోలా ఉండేది. మీతో కలిసి నడిచే అదృష్టం నాకు లేదు కరణ్.’’అందామే నిస్సహాయంగా!


 


‘’నువ్వు నాతో కలిసి నడుస్తానని మాట ఇస్తే... అవకాశం ఉంది అర్చనా..’’


ఆమె సంభ్రమంగా చూసింది.


 


‘’వీరు, మా అమ్మ అలాంటి నిస్సహాయులకు ఒక సంస్థ నెలకొల్పాలని నేను ప్లాన్ సిద్ధం చేసుకున్నాను. మనం చేసిన తప్పుని ‘దిద్దుబాటు’ చేసుకుని ముందుకు సాగడంలో నీ సంపూర్ణ సహకారం నాకు కావాలి..ఏమంటావ్?’’


 అతని రెండు చేతులను తన చేతుల్లోకి తీసుకుని, మాట ఇస్తూ సంతృప్తి నిండిన నాయనాలతో సువర్ణభాండం లభించినంత సంతోషంగా చిరునవ్వు నవ్వింది అర్చన.


 సమాప్తం


Rate this content
Log in

Similar telugu story from Abstract