ఉదయబాబు కొత్తపల్లి

Comedy Inspirational Children

4  

ఉదయబాబు కొత్తపల్లి

Comedy Inspirational Children

సుభాషిణి– స్వభాషాభిమానం (హాస్య

సుభాషిణి– స్వభాషాభిమానం (హాస్య

6 mins
507


సుభాషిణి – స్వభాషాభిమానం (హాస్య కథ)


సినిమా థియేటర్ ముందు ఆగిన ఆటో నుంచి బాబిగాడిని  తీసుకుని దిగింది సుభాషిణి. వెనుకనే సుబ్బారావు కూడా దిగి ఆటో కి డబ్బులు ఇచ్చే ‘’సుబ్బు ‘’అంటూ ఆమె వైపు తిరిగి కొయ్యబారి పోయాడు.


 మండుటెండలో కూడా వెయ్యి వోల్టుల బల్బులా వెలిగిపోతోంది సుభాషిణి ముఖం.


థియేటర్ కు ఎదురుగా రోడ్డుకి అటువైపు ఉన్న ఆడిటోరియం గేటు కట్టబడిన బ్యానరే అందుకు కారణం.


‘’స్వాగతం ! సుస్వాగతం! సాహితీ బంధువులకు, స్వభాషాభిమానం గల ఆంధ్రులందరికీ ‘తెలుగు జాతి మనది’ సాహితీ సంస్థ స్వాగతం పలుకుతోంది.’’


చింపిరి  జుట్టుకు  ప్రతిరూపంలా ముఖం చేసుకుని బాబి గాడితో అటుగా  నడుస్తున్న భార్యను  ఎదురు ప్రశ్న వేయలేక అనుసరించాడు సుబ్బారావు- ఎత్తుగా ఉన్న ప్యాంటు జేబు తడుముకుని సంతృప్తిగా తలాడిస్తూ.


 బాబిగాడు  మాత్రం ఆగలేకపోయాడు.


‘’ అమ్మా... చిరంజీవి అంకుల్ సినిమా అన్నావ్ ?’’


వాడిని అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది’’ అంకుల్ అనకూడదు అని చెప్పానా? చిరంజీవి మావయ్య సినిమా రేపు  కూడా ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం ఈ వేళ మాత్రమే ఉంటుంది. రేపు తప్పకుండా నీకు మావయ్య సినిమా చూపిస్తాను’’ అంది ఆడిటోరియం లోకి వెళ్తున్న ఇద్దరు ముగ్గురు ఆమె వింతగా చూసి గబగబా వెళ్ళి పోయారు.


మరో రెండు నిమిషాల్లో కూల్ డ్రింక్ లో స్ట్రా పర్సనాలిటీతో ఒకతను గబ గబా వచ్చాడు.


‘’ రండి మేడం రండి. మీరు మా కార్యక్రమానికి రావడం మా అదృష్టం. ప్లీజ్ వెల్కమ్’’ అంటూ రాజభటునిలా  ఆమెకు దారి చూపిస్తూ ముందువరుసలో సీట్లు చూపించాడు.


 200 మందికి సరిపోయే విశాలమైన హాల్లో ఓ వంద కుర్చీలు వేశారు. పుచ్చకాయ గింజల్లా అక్కడ అక్కడ కొందరు కూర్చుని ఉన్నారు.


‘’ మీ పేరు?’’ సీట్లో కూర్చోబోతూ అడిగింది సుభాషిణి అతన్ని.


‘’ చిత్తం. చిట్టి వడియం . మా అమ్మకి ఎంతకూ పిల్లలు  కలగకపోతే ఆ పేరు పెట్టుకుంటానని మొక్కుకుందట. ఇహిహి ...” అన్నాడు అనవసరంగా నవ్వుతూ. ‘’


‘’ఆవిడ ఇప్పుడు ఏం చేస్తున్నారు?’’


‘’ వంటలు చేసినన్ను ఇంతవాడిని చేసి  ఈ మధ్యనే పోయిందిలెండి ‘’ఆన్నాడతను.


‘’మన భాష పట్ల నిజంగా అభిమానం ఉన్న వారేనా?’’ అడిగింది సుభాషిణి  సూటిగా అతన్ని.


‘’ వై నాట్? ఎందుకు అలా అడిగారు?’’ భుజాలు ఎగరేస్తూ అడిగాడు చిట్టివడియం.


‘’నిజమైన భాషాభిమానం గలవాడు ఒక్క ఆంగ్ల పదం కూడా ఉపయోగించకుండా మాట్లాడాలి. నన్ను ‘మేడం’ అంటూ సంబోధించి.’ ప్లీజ్ వెల్కమ్’ అన్నారు. ఇదేనా మీ భాషాభిమానం?’’ ఆమె కళ్ళలో ఎర్రజీరలు తొంగి చూశాయి. క్రమంగా ఆమె శ్వాస దీర్ఘంగా తీయసాగింది. ఆమెకు కోపం వచ్చి బీపీ పెరిగితే అంతేమరి.


 అది తెలిసిన సుబ్బారావు వెంటనే తన బ్యాగ్ లోంచి ‘మాజా’ కూల్ డ్రింక్ తీసి  ‘’చల్లని పానీయాలు తీసుకో సుబ్బు’’ అంటూ ఓపెన్ చేసి ఇచ్చాడు.


 అప్పటికి అది తాగి ఆమె శాంతించింది.


‘’ఓహ్ ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం! మీతో మాట్లాడిన రెండు నిమిషాల్లోనే నా లోపాలని గుర్తించగలిగిన మీరు మా సభకు  రావడం నిజంగా మా సంస్థ తీసుకున్న పూర్వజన్మ పుణ్యం’’ అంటూ ఎవరో పిలవడంతో అటు పరిగెత్తాడు చిట్టివడియం. ‘’సంస్థకు పూర్వజన్మ ఏమిటి రా వెధవ?’’ అనుకుని సుభాషిణి చూడకుండా తల బాదుకున్నాడు సుబ్బారావు.


 సుభాషిణి సర్దుకుని  కూర్చుంది. పక్క సీట్ లో బాబి గాడు. ఆ పక్క సీట్ లో సుబ్బారావు.


 మరో పది నిమిషాల్లో ఏకంగా మరో ఇద్దరు రావడంతో సభ ప్రారంభమైంది. అదృష్టం కొద్దీ మొదటి రెండు వరుసలు  పూర్తిగా నిండాయి.


 స్వాగత కార్యక్రమం పూర్తయ్యాక ‘’ఈనాడు మా కార్యక్రమంలో ప్రధాన అంశం - తెలుగు భాష ఔన్నత్యం. దీనిపై ప్రసంగించేందుకు గుంటూరు నుంచి తెనాలి శ్రీనివాస్ గారు. శ్రీకాకుళం నుంచి పార్వతీపురం పద్మావతిగారు,  చిత్తూరు నుంచి తిరుపతి వెంకటేశం గారు విచ్చేసారు.  ముందుగా తెనాలి శ్రీనివాస్ గారు తెలుగు భాష ఔన్నత్యం గురించి ప్రసంగిస్తారు’’ అంటూ వారికి మైక్ అందించాడు చిట్టివడియం.


మన ఊర్లో తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడేవారు దొరకలేదా నాయన నీకు! ఖర్మ! అనుకుంటూ మరోసారి తల పట్టుకున్నాడు సుబ్బారావు.


‘’ సభా సరస్వతికి నమస్కారం!’’ అంటూ ముందు వరుసలో కూర్చున్న సుభాషిణి వైపు చూస్తూ, లాల్చీ పైన మెడ చుట్టూ చుట్టుకున్న శాలువా సవరించుకోవడం చూసిన సుబ్బారావుకు కర్తవ్యం గుర్తుకు వచ్చింది. వెంటనే ప్యాంటు జేబులో పెట్టుకున్న కాగితాల దొంతరలను బయటకు తీసి మెరుపు వేగంతో, ఒక్కొక్కటి సభలో ఉన్న అందరికీ పంచి పెట్టి తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. భాషాభిమానం ప్రేక్షకులంతా ప్రసంగం వినడం మానేసి తమ చేతికి వచ్చిన కాగీతంలో ఏముందో చదవ సాగారు.


‘’ ప్రియమైన పాఠకులకు! నా భార్య పేరు సుభాషిణి. ఆమెకు మాతృభాష అంటే పంచప్రాణాలు. ఆ అభిమానంతో సాహితీ  కార్యక్రమానికి ఆమె హాజరు అవుతూ ఉంటుంది, వేదిక  మీద వక్తలు మాట్లాడేటప్పుడు ఆమెలో క్రమేపి ఆవేశం పాలపొంగు లా పెరిగిపోతుంది. ఆ  ఆవేశంలో దీర్ఘ శ్వాసలు తీస్తుంది. ప్రసంగిస్తున్న వక్తలు ఎవరైనా ఆంగ్ల పదాలు వాడితే ఆమె రాక్షసి లా మారుతుంది. అందుచేత ఆసమయంలో ఆవేశాన్ని నియంత్రించేందుకు తన చేతివేళ్ళని, కాలి వేళ్ళని లెక్క పెట్టుకుంటుంది. అయినా  తన ఆవేశం నియంత్రించుకోవడం వీలుకాకపోతే పక్కన ఉన్న వాళ్ళ కాలి వేళ్ళు చేతి వేళ్లు పట్టుకుంటుంది. అందుచేత దయచేసి ఆమెను ఎవరూ అపార్థం చేసుకోవద్దని మనవి.


ఇట్లు


సుభాషిణి భర్త


ఇక్కడ ప్రేక్షకులంతా మెరుపుతీగలా ఉన్న సుభాషిణి వచ్చి  తమను  ఎప్పుడు తాకుతుందా అని ఎదురు చూపులు చూస్తుంటే అక్కడ తెనాలి శ్రీనివాస్ తన ప్రసంగాన్ని సుభాషిణిని చూస్తూనే కొనసాగిస్తూనే ఉన్నాడు.


‘’ నేను తెలియక తప్పు చేశాను. మా అబ్బాయిని  ఇంగ్లీష్ మీడియం లో చేర్చాను. వాడి మాతృ భాష తెలుగే. అయితే వాడికి తెలుగు అక్షరం ముక్క రాదు. నా పనులు మానుకుని వాడికి తెలుగు నేర్పుకునే పరిస్థితి. అందుకే నా తప్పును తెలుసుకుని మా పాపను  తెలుగు మీడియం లో చేర్పించాను. తెలుగు భాష ఔన్నత్యం అంత గొప్పది అని సభాముఖంగా తెలియజేస్తున్నాను.


 మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోయెకంటే  మన ఆంధ్రదేశంలోని ప్రతీ  తెలుగింటి ఆడపడుచు తన పిల్లలకు మాతృభాష పట్ల అభిరుచి  కలిగించే కథలు, పొడుపు కథలు, పద్యాలు, గేయాలు, రామాయణ మహాభారత, భాగవతాదులను  చిన్నప్పుడే వారికి తీరిక వేళల్లో నేర్పే ప్రయత్నం చేస్తే మన మాతృభాష తెలుగు – మృత  భాష కాదు సరికదా, అమృత భాష అవుతుంది. సాక్షాత్తూ మెగాస్టార్ చిరంజీవి గారి సోదరి ఈ కార్యక్రమానికి వచ్చి నా ప్రసంగం వినడం నా అదృష్టం.’’ అనగానే సుభాషిణీ తన సీట్లోంచి లేచి హాలంతా పరికిస్తూ చిరంజీవి గారి చెల్లెలు ఎవరు వచ్చారా అన్నట్లుగా చూస్తుండగానే, చేతిలో ఉన్న పర్సు  కింద పడడంతో వంగి తీసుకుంది. హాల్లో ప్రేక్షకులంతా ఆమె చిరంజీవి చెల్లెలు అనుకుని, తమకు ఆమె గౌరవ వందనం చేసిందని భావించి చప్పట్లు కొట్టారు. వారందరూ ఎందుకు కొట్టారో తెలియకపోయినా తానూ చప్పట్లు కొడుతూ కూర్చుంది సుభాషిణి.


అంతలో చిట్టివడియం చెవిలో  తెనాలి శ్రీనివాసు ఏదో చెప్పాడు.


 వెంటనే మైకు అందుకుని ‘మేడం’ అనబోయి ఆమెకు కోపం వస్తుంది అని గ్రహించి,’’ అమ్మా! ఈ అంశంపై మీ స్పందన తెలియ చేయమని కోరుతున్నాను’’ అన్నాడు సుభాషిణిని  ఉద్దేశించి.


 అసలే శ్రీనివాసు ప్రసంగం విని ఉత్తేజితురాలైన  సుభాషిణి క్షణం ఆలోచించకుండా స్టేజీ ఎక్కి మైకు పుచ్చుకుంది. ‘’ప్రేక్షకులకు అభివాదాలు! ఐదు నిమిషాలపాటు ఒక్క ఆంగ్ల పదమూ కూడా ఉపయోగించకుండా తెలుగులో  అనర్గళంగా మాట్లాడి ఎన్నో బహుమతులు అందుకున్న సుభాషిణి మీ ముందు నిలబడి మాట్లాడుతోంది. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తప్పు చేశాను అన్నారు. ఆయన తప్పు ఏమీ  చేయలేదు.’’


 తెనాలి శ్రీనివాసు నోట మాట రాలేదు. సాక్షాత్తు చిరంజీవిగారి చెల్లెలు  నోటివెంట తన  పేరు ఉచ్చరించబడటంతో అతని కళ్లు చెమర్చాయి. ఆనందబాష్పాలు రాలుస్తూ ఆమె ఏం మాట్లాడుతోందో  వినకుండానే చప్పట్లే.. చప్పట్లు.


అవి విన్న  సుభాషిణి మరింత  ఉత్సాహంగా కొనసాగించింది.


‘’వారు  నిజమైన భాషాభిమానం గల  ఆంధ్రుడు. అందుచేతనే పనులు మానుకుని తన కుమారునికి తెలుగును బోధిస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా ప్రతి ఇంటి ఆడపడుచు తన బిడ్డకు మాతృభాష పట్ల అభిరుచిని  కలిగించి నేర్పించిన నాడు మన తెలుగు భాష ఔన్నత్యం మరింత ఇనుమడిస్తుంది అని నొక్కి వక్కాణిస్తూ ముగిస్తున్నాను. జై తెలుగు జాతి మనది! జై జై తెలుగు జాతి మనది!!


*********


సీన్ కట్ చేస్తే!


 ఇప్పుడు సుభాషిణి బాబి గాడికి తెలుగు నూరిపోసే ప్రయత్నం చేస్తూ వంట ఇంట్లో కుస్తీ పడుతోంది.


 కారణం! బాబి గాడికి తిండి పిచ్చి. ఏదో ఒకటి తిండి  లంచం పెడితేనే  గానీ పొరపాటున కూడా పుస్తకం ముట్టడు. అందుకని చేగోడీల పిండి తడిపింది. దానిని శ్రద్ధగా అందంగా అక్షరమాల లోని అక్షరాల ఆకారాలు వచ్చేలా మారుస్తున్నాడు సుబ్బారావు.


 సుభాషిణి కష్టపడి వేయించినంత సేపు పట్టలేదు’’ అ ‘ నుండి ‘ ఱ ‘ వరకు అన్ని వచ్చేసాయమ్మా...’’ అని వేయించినవి వేయించినట్టుగా తినేసాడు. పైగా ‘’ అమ్మ, అక్క, అత్త అలాంటి పదాలు కూడా నేర్చేసుకుంటాను. చేసి పెట్టవే’’అని గారం  చేశాడు.


‘’ నా బాబే... నా బుల్లి నందమూరి తారకరామారావే,,, అలాగే నాన్నా...అలా  చూస్తారేం?  కాస్త వేగంగా చేయండి’’ అంది భర్తను హుంకరిస్తూ.


‘’ఆ, ఆ ఇప్పుడే మొదలెట్టారు కదరా. అప్పుడే రెండక్షరాల పదాలు ఎలా వచ్చాయి ?’’అడిగాడు సుబ్బారావు


‘’మా బడి లో వాక్యాలు కూడా నేర్చేసుకున్న నాన్న. పైగా అ, ఆ లు  ఒక్కొక్క అక్షరమే. అక్క, అమ్మ అంటే మూడు ముక్కలు తినవచ్చు ఒక్కసారిగా’’ అన్నాడు తండ్రి చెవిలో రహస్యంగా.


కొడుకు  తెలివితేటలకు ముక్కు మీద కాలి బొటనవేలు వేసుకున్నాడు సుబ్బారావు.


 ‘’ఏమిటా వెర్రి చేష్టలు? మీరేమన్నా వటపత్ర సాయి అనుకుంటున్నారా? ఇది అయిన  వెంటనే హల్వా చేయాలి.. తొందరగా కానివ్వండి’’ అంది సుభాషిణి.


‘’అదెందుకే?’’ అడిగాడు సుబ్బారావు.


‘’ హల్వా ముక్కలు కోసి అంకెలు  నేర్పాలి నా కొడుక్కి. వాటిని తింటూ అంకెలు  కూడా నేర్చేసుకుంటాడు నా బిడ్డ’’ అంది సుభాషిణి.


*******


‘’అమ్మా!  సరిగ్గా సమయానికి తీసుకువచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే మీ బిడ్డ మీకు దక్కే వాడు కాదు.’’ అన్న డాక్టర్ మాటలకు సుభాషిణి  కొంగు నోట్లో కుక్కుకుంది.


‘’ ఎలాగైనా నా బిడ్డను బ్రతికించండి డాక్టర్!’’ గుడ్లనీరు కుక్కుకుంటూ.


‘’ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదమ్మా! అయినా వాడి మాట మీరు వినడం ఏమిటమ్మా? మీ మాట వాడు వినాలి గానీ, వాడి మాట మీరు వినడం ఏమిటమ్మా? వాడు  తెలుగు చదువుకుంటాను అన్నాడని అడ్డమైన గడ్డి చేసి పెట్టారు. అజీర్తితో సెలైన్ పెట్టించుకునే  స్థాయికి వచ్చాడు వాడు  మీ భాషాభిమానం చల్లగుండా... ఇకనైనా నా సలహా పాటించండి.వాడి పడ్డాతే మీరూ పాటించండి. ‘ పెడితే చదువుతా’ అంటాడు వాడు.’ నేను చెప్పినట్లు చదివితేనే తినడానికి పెడతా’ అనండి మీరు. ‘రెండు పెడితే నాలుగు చదువుతాను’ అంటాడు వాడు. ‘నాలుగు చదివితే ఒకటి పెడతాను’ అనండి మీరు. ఒక్కగానొక్క కొడుకని గారం చేస్తే పిల్లలు ఇలాగే తయారవుతారు. అవసరం అయినప్పుడు దండించాలి. ప్రేమను  పండించాలి. మీరు ఏం చేసినా మీ బాబు ఉన్నతిని కోరే కదా... చేసేది. అప్పుడే మీ బాబు తో పాటు మీ  భాషాభిమానం బ్రతికేది. ‘’అని  హృదయానికి సూటిగా హత్తుకునేలా చెప్పాడాయన.


******  


ఇప్పుడు సుభాషిణి సాహిత్య కార్యక్రమాలకు వెళ్లడం మానుకుంది. సినిమా హాళ్ళల్లోనూ,  థియేటర్స్ లోనూ కాగితాల పంచే బాధ సుబ్బారావుకు తప్పింది.


సమాప్తం  


Rate this content
Log in

Similar telugu story from Comedy