కన్నంతమాత్రాన!!!
కన్నంతమాత్రాన!!!


కన్నంత మాత్రానా...!!!(కథ )
ఇంటర్వల్ లో ఒక్కసారిగా హాలులో లైట్లు వెలిగాయి. సీట్లో సరిగా సర్దుకుని కూర్చుని తెలిసున్నవారు ఎవరైనా వచ్చారేమోనని చుట్టూ కలియచూశాను.
ముందు సీట్లో అమ్మాయి భుజం చుట్టూ చేయి వేసిన అబ్బాయి ఉలికిపడి లేచి తలవంచుకుని వేగంగా బయటకు వెళ్లిపోయాడు, ఆ అమ్మాయి లేచి లేడీస్ టాయిలెట్ వైపు నడిచింది. ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది.
ఆ అమ్మాయి ఎపుడు తిరిగివస్తుందా అని ఎదురుచూశాను. వస్తూనే తన సీట్లో కూర్చోబోతూ యధాలాపంగా నావైపు చూసింది.అనకొండను చూసినంతగా అదిరిపడింది.
''ఆంటీ...మీరా!'' అనబోయింది. నేను అంతకన్నా ఆశ్చర్యంలో ఉన్నాను.
అంతలో ఆ అబ్బాయి వేగంగా వచ్చి ముఖం కనబడనీయని ప్రయత్నం చేస్తూ ఆమె తన చేతుల్లో తనతో తెచ్చిన పోట్లాలు ఉంచడంతో ఆమె చటుక్కున సీట్లో కూర్చుండి పోయింది.
మరో రెండు నిముషాల తర్వాత 'ఇపుడే వస్తాను' అనేసి 'ఎగ్జిట్' వైపు ఆ అమ్మాయి వెళ్లిపోవడం గమనించాను. మరో పది నిముషాల్లో ఆ అబ్బాయి కూడా వెళ్లిపోయాడు.
ఆ అమ్మాయి ఎవరో కాదు.
పదవ తరగతి చదువుతున్న నా కూతురు మధురిమా ట్యూషన్-మేట్ గోవర్ధిని.
*************
మావారు వూరికి చివర తౌడు ఫాక్టోరీలో పనిచేస్తున్నారు.
మాకు ఒక పాప, బాబు. పాప మధురిమా పదవతరగతి చదువుతోంది. బాబు ఏడవ తరగతి చదువుతున్నాడు. ఆయన తెచ్చే గొర్రెతోక జీతంతో ఇల్లు పొదుపుగా గడుపుకోస్తూ, వీలయినంత పాప, బాబు ల పేర ఆదా చేస్తూ ఆయన భార్యగా నా విధి సంతృప్తి కరంగా నిర్వహిస్తున్నాననే నా నమ్మకం.
ఆర్ధిక స్తోమత అంతగా లేకపోవడం వల్ల పిల్లలిద్దరినీ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం లో చదివిస్తున్నాను.
పదవతరగతి కావడం వల్ల మధురిమకు ప్రైవేట్ పెట్టించాను. అదే ట్యూషన్ సెంటర్ లో ఓవర్ధిని కూడా చదువుతోంది. వాళ్ళది చాలా డబ్బున్న కుటుంబం అని విన్నాను . చాలా ఖరీదైన దుస్తులు వేసుకువస్తుంది. వల్ల ఫాదర్ టెండర్ బిజినెస్ చేస్తారట.
ఎదుటివారిని ఆకర్షించడం కోసం అన్నట్టుగా గారంగా మాట్లాడుతుంది గోవర్ధిని. మగపిల్లలను కవ్వించడం కోసమే అన్నట్టుగానే ఉంటాయి ఆమె చూపులు.
మధురిమతో మొట్టమొదటిసారి గోవర్ధిని మా ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు ఎటువంటి స్నేహాలు పడుతోందో తెలుసుకోవడం కోసం ఆప్యాయంగా మాట్లాడాను.
అదే నేను చేసిన తప్పు అనిపించింది.
ఆ అమ్మాయి ప్రతీరోజు ట్యూషన్ కు వెళ్ళే వంకతో మా ఇంటికి వచ్చేది. ఆచాకా ప్రతీ క్షణం నన్ను, నా ప్రతీ కదలికనీ గమనించేది.
నేను మధురిమను తయారుచేస్తున్నంతసేపూ నాకు తోచిన మంచి విషయాలు చెబుతూ ఉండటం నాకు అలవాటు. భయం చేతనో, తప్పదనో మధురిమా అన్నీ వింటుంది...ఆచరిస్తుంది కూడా.
నేను మధురిమాను అడుగుతూ ఉంటాను.'ఏరా కన్నమ్మా... అమ్మ క్లాస్ పీకుతోందేమిటి అనుకుంటున్నావా' అని
''అమ్మా. నువు ఎంచెప్పినా ఏం చేసినా నా మంచికోసమే కదా... నాకది క్లాస్ పీకడం ఎలా అనిపిస్తుంది?'' అంది ఒకసారి.
పుత్రికోత్సాహంతో నా కూతురిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను.
అది ఆ గోవర్ధిని కళ్ళలో పడనే పడింది.నేను, మధురిమా ఎక్కడున్నా అక్కడకి బిర బిరా వచ్చేస్తుంది గోవర్ధిని.
''ఏమిటే...అలా కొయ్యబొమ్మలా ఉండిపోయావు?'' అడిగింది మధురిమ.''నువ్వు ఎంత అదృష్టవంతురాలవే.'' అంది.
ఎందుకో ఆ అమ్మాయి కళ్ళు చమర్చాయి. అది కనిపించనీయకుండా ''సారీ ఆంటీ. ట్యూషన్ కి ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని మీ అనుమతి తీసుకోకుండా మీ బెడ్రూం లోకి వచ్చేశాను. వెరీసారీ. రావే తొందరగా.''అని మధుని చేయి పట్టుకుని తీసుకుపోయింది.
నేను బెడ్ మీద కూలబడ్డాను. ఆ అమ్మాయి నాకు సారీ చెప్పడానికి కారణం ఉంది.
మా ఇంటికి వచ్చిన మొదటి రోజుల్లో నేను ఎంతో అందంగా పద్ధతిగా సర్దుకున్న ప్రతీ బొమ్మను దాని స్థానం లోంచి తీసి అటూ ఇటూ తిప్పి చూసేస్తూ ''ఈ బొమ్మ బాగుందే...ఎక్కడ కొన్నారు?'' అంటూ చూపించిన ప్రవర్తనకి నాకు వొళ్ళు మండుకొచ్చి 'కయ్' మన్నాను. నా పద్ధతి, అభిమతం వివరించి చెప్పాను. అప్పటినుంచి నేను, నా ఇల్లు ఆ అమ్మాయికి అపురూప వస్తువులమైపోయామ్.
విశాలమైన పెద్ద కళ్ళతో, సూటిగా గుచ్చుకునే చూపులతో నన్ను, నా చేతలను పరిశీలిస్తుంది.
''ఎందుకలా పరిశీలిస్తావ్?'' అడిగేసానోసారి.
''ఏమీ లేదు ఆంటీ ..ఏమీ లేదు.'' తలదించుకుంది.
''పర్వాలేదమ్మా. చెప్పు.నేను ఏమీ అనుకోను'' అన్నాను అనునయంగా.
''మీరు యే అలంకరణ లేకుండానే ఇంత అందం గా ఉంటారు. అందమైన రూపం-రూపానికి తగ్గ మాట-మాటలకు తగ్గ మీ వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టం. అందుకే మిమ్మల్ని ఎంత సేపు చూసినా తనివితీరదు.'' అంది గోవర్ధిని.
'' పిల్లలకు టీనేజ్ అత్యంత కీలకమైనది. ఈ విద్యార్ధి దశలో ఎంత ఎక్కువ విజ్నానాన్ని గ్రహించి మీ బుర్రలో భద్రపరచుకుంటే అంత మంచిది. అందుచేత సమయం వృద్ధాచేయకుండా అన్నీ పరిశీలిస్తూ ఉండాలి. తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. నన్ను చూసి నీ సమయం వృధా చేసుకుంటావేందుకు చెప్పు ?'' అని తేలికగా నవ్వేశాను.
ఆ తర్వాత ఆ అమ్మాయిలో కొంచెం మార్ప్ వచ్చింది. పదో రాంక్ దాటి ఉండే ఆ అమ్మాయి చదువులో పదిలోపు రాంక్ లోకి రావడమే దానికి కారణం. ఆమెలో ఆ మార్పుకు చాలా సంతోషించాను.
కానీ ఇంతలో ఇదేమిటి?
ఏది ఏమైనా రేపు ఆ అమ్మాయి ఇంటికొచ్చినప్పుడు విషయం తేల్చేయాలి అనుకున్నాను.
************
నేను ఊహించినట్టుగానే మరునాడు గోవర్ధిని ట్యూషన్కు వెళ్ళేటప్పుడు మధురిమ కోసం రాలేదు.
ఉదయం పిల్లలనీ, ఆయన్ని పంపించి, బట్టలన్నీ ఉతికి అఆవేశాకా mమధురిమా పుట్టిన రోజు డ్రెస్ మీద మగ్గం వర్క్ చేస్తున్న పని మొదలు పెడదామని అనుకున్నంతలో తలుపు చప్పుడైంది. వెళ్లి తీశాను.
ఎదురుగ గోవర్ధిని.
''స్కూల్ కు వెళ్లలేదా? ఏమిటి ఇలా వచ్చ్చావ్?'' అడిగాను పదునైన స్వరంతో.
గోవర్ధిని బెరుకు కళ్ళతో చూసింది.
''ఆంటీ.. మీకు ఓ విషయం చెప్పుకోవాలి. దయచేసి కోప్పడకండి. ఈ విషయంలో మీరు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు'' అంది కన్నీళ్లతో.
ఒక్క క్షణం ఆలోచించి ''లోపాలకి రా...!'' అన్నాను.
హలో కూర్చున్నాకా '' ఇప్పుడు చెప్పు...'' అన్నాను తీక్షణంగా.
ఇంతకాలం నా కూతురితో తిరిగిన అమ్మాయి ఈమేనా అనిపించింది. ''మీరలా సూటిగా చూస్తే నాకు భయం ఆంటీ. మీతో మనసు విప్పి చెప్పుకోలేను.'' అంది కన్నీళ్లు బుగ్గలమీద జారిపోతుండగా.
విషయం రాబట్టడం కోసమైనా తప్పదు కదా, అని కంఠం లో మృదుత్వం పలికిస్తూ ''పర్వాలేదు. భయపడకు. చెప్పమ్మా..'' అన్నాను లాలనగా.
ఒక్కసారిగా కుర్చీలోంచి లేచి నా కాళ్ళముందు నేలమీద కూలబడి వెక్కి వెక్కి ఏడవసాగింది గోవర్ధిని.
నాకు చాలా చిరాకనిపించింది.కారణం పట్టుమని పదహారేళ్లు లేని ఆ ఆపెళ్ళికాని అమ్మాయి శరీరాన్ని ఒక కుర్రాడి చేతులు తడిమాయి అని కంపరంగా అనిపించింది. అయినా సహనంగానే భరించాను.
''చూడు వర్ధినీ. విషయం చెప్పకుండా ఇలా బాధపడటం లో అర్ధం లేదు. వెళ్లి ముఖం కడుక్కురా''అన్నాను.
తనను తాను సంబాళించుకుని 'సారీ ఆంటీ' అని వెళ్ళి ముఖం కదుక్కు వచ్చింది.
''ఈవిషయం ఇంట్లో తెలిస్తే నన్ను చంపేస్తారు ఆంటీ. మధు పట్ల మీరు చూపించే అమ్మ ప్రేమ అంటే నాకు ఎంతో ఇష్టం. జ్నానమ్ వచ్చాకా మా అమ్మ ఒక్కరోజు నాతో అలా ప్రవర్తించింది లేదు. ఎంతసేపు నగలు, చీరలు, షోకులు, చేతిలో పుష్కలంగా డబ్బు ఉంచుకోవడం - వీటికే ప్రాధాన్యత ఇస్తుంది. నాకు ఖరీదైన బట్టలు కొంటుంది. రకరకాల డ్రెస్సింగ్ సెట్స్ కొంటుంది. వారానికోసారి తనతో 'బ్యూటీ పార్లర్'కు తీసుకువెడుతుంది.
'వద్దమ్మా...నాకిష్టం లేదు. క్లాసులో అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు.' అన్నాను.
' నోరుమూసుకో. మన స్టేటస్ కి తగ్గట్టు వుండాలి. తెలిసిందా?' అని తిట్టింది.
అలా రోజూ నలుగురిలో ప్రత్యేకంగా కనబడేలా తయారు చేసి పంపిస్తుంది. ట్యూషన్ అయిపోయాకా మధురిమాను మీ ఇంటి దగ్గర దించి వెళ్తుంటే నెలరోజులనుంచీ ఒక అబ్బాయి నావెంట పడుతున్నాడు.
ఒకరోజు నా సాయికిలుకు అడ్డంగా వచ్చి సైకిలు ఆపుచేసి ''నువ్వు నాకు నచ్చావ్. మనిద్దరం కలిసి 'టిఫిన్' చేద్దాం వస్తావా...'' అన్నాడు.
''రాను'' అన్నాను.''నువు రాకపోతే ఈ కత్తితో పుడుచుకుని చచ్చిపోతా'' అని చాకు చూపించి బెదిరించాడు.
అలా పదిరోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నాను. నిన్న వుడాయమ్ 'రోజూ దాటవేస్తున్నావేంటీ? నువు నన్ను ప్రేమించడం లేదా?'' అని అడిగాడు.
నేను సమాధానం చెప్పలేదు. ''ఈవేళ కనుక నువు రాకపోతే 'నా చావుకి కారణం నువ్వే' అని కాగితం రాశి పెట్టి చచ్చిపోతా'' అని జేబులోంచి అలా రాసిన కాగితం విప్పి చూపించాడు.
ఏంచేయాలో అర్ధం కాక 'సరే..పద' అన్నాను.
''ఇపుడు కాదు. మధ్యాహ్నం శ్చూలు ఎక్కోట్టి వచ్చేయ్యి. సినిమాహాల్లో టిఫిన్ చేద్దాం అన్నాడు.''
''సినిమాహాల్లో టిఫినేంటి?'' అని అడిగాను అర్ధం కాక.
''యాహూ '' అని అరిచి '' సినిమాహాల్లో కాంటీన్ ఉంటుందిలే'' అనేసి వెళ్లిపోయాడు.
హాల్లో లైట్లు తీసెయ్యగానే నా భుజం చుట్టూ చేయివేశాడు. నాకు ఒక పక్క కంగారూ, భయం. ఒళ్ళంతా చమటలు పట్టేశాయి. ఏవేవో చెయ్యబోయాడు. ప్రతీసారి అతని చేయి తీసేసే ప్రయత్నం చేశాను. నాకేన్నో విధాలా నచ్చచెప్పాలని చూశాడు.
నా ముఖం తనవైపుకు తిప్పుకుని బలవంతంగా ముద్దులు పెట్టుకున్నాడు. 'ఇదే ఇదే టిఫిన్ అంటే. నువ్వే చెయ్యనివ్వడం లేదు' అన్నాడు.
నా అదృష్టం బాగుండి ఇంతలో లైట్లు వెలిగాయి. అతను గబగబా బయటకి వెళ్లిపోయాడు. నేను టాయిలేట్ కి వెళ్ళి వస్తూ మిమ్మల్ని చూశాను. నా పైప్రాణం పైనే పోయింది . అతను వచ్చాకా 'ఇపుడే వస్తాను' అని చెప్పి పారిపోయి ఇంటికి వచ్చేశాను.
ఈ వేళ ట్యూషన్ కి వెళ్తే ఖచ్చితంగా వెంటపడి అడుగుతాదని భయపడి అమ్మకు 'కడుపు నొప్పిగా ఉం
ది...మాత్రలు తెచ్చుకుంటాను' అని చెప్పి మీ దగ్గరకు వచ్కాను. ఇదీ ఆంటీ ఒట్టుగా జరిగింది. ఈ సమస్యను మా అమ్మతో చెప్పుకునే ధైర్యం నాకు లేదు. మీరైతే అర్ధం చేసుకుంటారని మీతో చెప్పుకుంటున్నాను.'' అంది దోసిలిలో ముఖం దాచుకుని ఏడుస్తూ.
''నా కళ్ల పడ్డావు కాబట్టి నా ముందు పెట్టావు. లేదంటే వాడు ఎలా అంటే అలా చేసేదానివే కదా?'' అన్నాను తీవ్ర స్వరంతో.
'' ప్లీజ్ ఆంటే. నేను చేసింది తప్పే. నన్ను క్షమించండి.'' అంది వెక్కుతూ.
నాలో కోపాన్ని అణుచుకునేందుకు 5 నిముషాలు మౌనంగా ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాను.
"అదికాదమ్మా! నిన్ను బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు. నీలో లొంగిపోయే బలహీనత చూసి వాడు నిన్ను వశపరచుకుని మరో పది మంది స్నేహితులకి చెబుతాడు.అపుడు నీ పరిస్థితి ఏమిటి? మగవాడి లొంగిపోయే బలహీన మనస్తత్వం ఆడదానికి ఉన్నంతసేపు మోసపోయిన ఆడవాళ్లు వెలిసిపోయిన బొమ్మల్లా సమాజంలో ఉంటూనే ఉంటారు. స్త్రీ తన ఆత్మాభిమానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చంపుకోకూడదు.అదే సమయంలో ఆత్మస్థైర్యం పెంచుకోవాలి.నీ సమస్యకు రెండే పరిష్కారాలు. నిన్ను నేను నమ్ముతున్నాను. వాడి ఫోన్ నెంబర్ ఇచ్చాడా?"
చేతిలో ఉన్న నోట్స్ ఆఖరి పేజీ తీసి చూపించింది గోవర్దిని.
"నీ వెనుక నేనుంటాను.నేను చెప్పినట్టు భయపడకుండా చేస్తావా?"అడిగాను భరోసా ఇస్తున్నట్టుగా.
"తప్పకుండా ఆంటీ" తడిసిన గవ్వల్లాంటి విశాలమైన కళ్ళతో తలూపింది గోవర్దిని.
***********
తలుపులు తాళం వేసి ఆమెను తీసుకుని తిన్నగా పబ్లిక్ టెలిఫోన్ బూత్ కు వచ్చాను.
దారిలో ఆ అమ్మాయిని తరచి తరచి అడిగినమీదట అతను ఒక బంగారం షాపు ఓనర్ కొడుకు అని తెలిసింది. అతనితో ఏం మాట్లాడాలో, వారు అన్నదానికి ఎలా రియాక్ట్ అవ్వాలో రెండు మూడు రకాలుగా చెప్పి అతనికి ఫోన్ చేయించాను.
''ఏంటి డాళింగ్. అలా మధ్యలో వదిలేసి వెళ్లిపోతే ఎలా? నా చావు కళ్ల చూడాలని ఉందా నీకు?'' అన్నాడట.
''తెలిసిన ఆయిదా కనిపించారు. మా పేరెంట్స్ కి చెబుతారని భయపడి ఇంటికి వచ్చేశాను. అది సరేగానీ... మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? నువ్వు సరే అంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చేస్తాను.'' అని నేను చెప్పమన్నట్టే చెప్పింది గోవర్ధిని.
''నీకు నగలేమైనా ఉన్నాయా?''''అవన్నీ మా డాడీ లాకరు లో ఉంటాయి,''
''మరి...డబ్బు?''
'' నా ఫీజులన్నీ మా డాడీ స్వయంగా కడతారు. నా బట్టల విషయం అమ్మ చూసుకుంటుంది. అయినా బంగారం కొట్టు ఓనర్ గారి అబ్బాయివి. నువు తలుచూ కుంటే నాకు అవన్నీ అమర్చడం ఎంతసేపు?'
'''అయితే ఈ సాయంత్రం ఏదైనా లాడ్జి లో 'భోజనం' చేద్దాం. నువు నాకు నచ్చితే అపుడు ఆలోచిస్తా.''
''మరి నాకోసం చచ్చి[పోతానన్నావ్?''
'' నువు సాయంత్రం రాకపోతే ఆ పనే చేస్తా.''
'' నిజంగానా? సరే. నీ మాటలన్నీ రికార్డ్ చేశాను. పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాను. అక్కడకు వచ్చేయ్యి.''
దాంతో కాళ్ళబేరానికి దిగాడు.
'' మళ్ళీ నాజోలికి వస్తే?'' '' నువు రానంటే నీవెంట నేనెందుకు పడతాను? నువు ఒప్పుకున్నావ్ కాబట్టి నేను అవకాశం తీసుకున్నాను.''
అర్ధం అయిందా అన్నట్టు గోవర్ధినికేసి చూశాను.
''అంటే మళ్ళీ ఇంకో అమ్మాయివెంట ఇలాగే పడతావన్నమాట. నీలాంటివాళ్లని వూరికె వదలకూడదురా. నీ సెల్ నెంబర్, నీ మాటల రెకార్డింగ్ కాపీ మీ నాన్నకు, పోలీసులకు పంపిస్తున్నాను. సిద్ధంగా ఉండు.''
''మా అమ్మమీద ఒట్టు. నేను మరో ఆడపిల్ల జోలికి వెళ్ళను ప్లీజ్. అయినా నువు కావాలని డబ్బుకోసం నన్ను బెదిరిస్తున్నావేమో. నామాటలన్నీ రికార్డ్ చేసావనీ నమ్మకం ఏంటి? అయినా ఈ బ్లాక్మెయిలింగ్ ఏమిటి?''
వాడి పొగరు ఇంకా చావలేదనిపించింది నాకు. ఇక లాభం లేదు అనుకుని ఫోన్ నేను అందుకున్నాను.
''పదినిముషాల్లో ఇక్కడకి వస్తే అన్నీ సాక్ష్యాలు చూపిస్తాను. వచ్చావా సరే సరి. లేదా నిన్ను ఎంచెయ్యాలో నాకు తెలుసు.'' అన్నాను.
''మధ్యలో నువ్వేవరు?'' ''ఇంతవరకు నువ్వు ఏడిపించావే వాళ్ళ అమ్మని.''వాడు భయపడిపోయినట్లున్నాడు.
'' సారీ ఆంటీ. ఇంకెప్పుడూ అలా చెయ్యను. మా అమ్మమీద ఒట్టు. నన్ను వదిలేయ్యండి ప్లీజ్. మా నాన్నకి చెబితే నా చెమడాలు తీసేస్తాడు. ప్లీజ్ ఆంటీ . '' అని ఏడ్చినంత పనిచేశాడు.
'' ముందు నువ్వు ఈ పబ్లిక్ టెలిఫోనే బూత్ దగ్గరకు రా. లేదా నేను నీ షాపు కు రానా?''గదమాయించాను.
''వస్తున్నానాంటీ...వచ్చేస్తున్నా .ప్లీజ్.అంతవరకు మీరు అక్కడే ఉండండి.''ఎనిమిదినిముషాల్లో సైకిల్ మీద వచ్చేశాడు.
సైకిల్ ని నేలమీదకు అలాగే వదిలేసి అటూ ఇటూ చూసి నెమ్మదిగా దగ్గరగా వచ్చి గోవర్ధిని చూసి ''సారీ ఆంటీ. ఇంకెప్పుడూ మీ అమ్మాయి జోలికి రాను. నన్ను నమ్మండి.'' అన్నాడు నాకాళ్లమీద పది చటుక్కున లేచిపోయి.
'' నా కాళ్ళ మీద కాదు. మా అమ్మాయికి సారీ చెప్పి కాళ్లమీద పడు.'' అన్నాను మరింత కఠినంగా.
''సారీ సిస్టర్. నన్ను క్షమించు,'' అన్నాడు గోవర్ధిని కాళ్ల ముందు.
అపుడు పైకి లేపి కాలరు పుచ్చుకుని 'నిన్న టిఫిన్ చేశావ్. ఈవేళ సిస్టర్ అయిపోయిందా?'' అని చెయ్యెత్తాను. వాడు తప్పించుకుని నేలమీద పడేసిన సైకిల్ తీసుకుని పరుగో పరుగు.''చూశావా. అందితే జుట్టు...అందకపోతే కాళ్ళు. ఇదే మగాడి నైజం. అర్ధమైందా?'' అన్నాను గోవర్ధినితో.
'' మీరుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు ఆంటీ...'' అంది ఆరాధనాభావంతో చేతులు జోడించిన గోవర్ధిని.
''అపుడే పూర్తవలేదు పద. '' అని ఆమె వెన్ను తట్టి రెండో పరిష్కారం దిశగా కదిలాను ఆమెతో.
*******
మేము గోవర్ధిని ఇంట్లో అడుగు పెట్టేసరికి వాళ్ల అమ్మగారు టీవీ చూస్తున్నారు.
గోవర్దిని నన్ను ఆమెకు పరిచయం చేసింది. ఆవిడ నన్ను చూస్తూనే నొసలు చిట్లించి టీవీ వాయువు ముఖం తిప్పుకునే అడిగింది
"ఏమిటి ఇలా వచ్చారు?"
ఆవిడ నన్ను కనీసం కూర్చోమనలేదు.నేనే ఆమె ఎదురుగా కూర్చుని జరిగినదంతా చెప్పాను, మేము వాడితో ఫోన్ మాట్లాడిన విషయం తప్ప.
అంతే.ఆవిడ పెనం మీద ఆవగింజలా ఎగిరిపడింది.
"మా పిల్ల బాగోగులు మేము చూసుకోగలం.అయినా మీరెవరు మా ఇంటికి వచ్చి మా పిల్లమీద నేరాలు చెప్పడానికి?ఏదో మా అమ్మాయి కాస్త అందంగా ఉంటుంది. కాబట్టి వెనకాల పది ఉంటాడు.డానికే మీరు మా ఇంటికి వచ్చి రాద్ధాంతం చెయ్యాలా?
అయినా నీకేం పోయేకాలమే? బయట తప్పుడు పనులు అన్ని చేసి వచ్చి అలగాజనాన్ని ఇంటిమీదకు దెబ్బలాటకు తీసుకొస్తావా. ఆ పోయేదేదో ఆ వెధవతోనే పోకపోయావా పీడా పోయేది!శని విరగడైపోను. అటు మీ నాన్న, ఇటు నువ్వు నన్ను ఏడిపించుకు తింటున్నారు.నా వెధవ బతుక్కి సుఖం లేకుండా చేస్తున్నారు. ఇదంతా నా ఖర్మ."అని నుదురు కొట్టుకుంది చేత్తో.
"అది కాదమ్మా.మీరూ..."
"అనవసరంగా నువు మాట్లాడకు. వెంటనే వెళ్ళు ఇక్కడనుంచి.నా కూతుర్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు"దాదాపుగా అరిచినంత పనిచేసింది ఆవిడ ఏకవచన ప్రయోగం చేస్తూ.
నేను ఆవేశపడలేదు. ఆవిడ మనస్తత్వం అంచనా వేసుకుంటూ గోవర్దినికి చెప్పి బయటకు వచ్చేసాను.
అంతే.ఆ మరునాటినుంచే నేను మళ్ళీ గోవర్ధినిని ఆ ఊళ్ళో ఉండగా చూడలేదు.
**********
దాదాపు పన్నెండేళ్ల తరువాత-
మధురిమ ఎమ్.బి.ఎ. పూర్తిచేసి ప్రయివేట్ సెక్టార్లో ఉద్యోగం చేస్తోంది. అల్లుడు సాఫ్ట్-వేర్ ఇంజనీరు. కొత్తగా పెళ్లి అయిన ఆరునెలల తరువాత మొదటిసారి హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వచ్చాము నేను, ఆయన.
సుల్తాన్ బజార్ లో నేను మధురిమ షాపింగ్ చేస్తుండగా "అరె.ఆంటీ మీరు... మీరేనా?" మధురిమను చూసి నన్ను గుర్తుపట్టి ఆప్యాయంగా భుజం మీద చేయివేసి అడుగుతున్న గోవర్ధినిని గుర్తుపట్టలేకపోయాను.
గోవర్దిని అరవిరిసిన ముద్దమందారంలా ఏ భేషిజము, కృతకము లేకుండా నేవళం గా కనిపిస్తోంది.మరీ మరీ చూడాలనిపించేలా ఉంది.
తాను ఆంధ్రాబ్యాంక్ లో కాషియర్ గా చేస్తోందట.వాళ్ళాయన జీ.పి.ఓ.లో పనిచేస్తున్నారట. ఇద్దరు పిల్లలట. వాళ్ళ నాన్నగారు టెండర్ బిజినెస్ దెబ్బ తినడంతో మానసిక వేదనతో గుండెపోటు వచ్చి మరణించారట. వాళ్ళ అమ్మగారు తనదగ్గరే ఉంటోందట.
ఒక్కసారి ఇంటికి వచ్చివెళ్ళమని బలవంతం చేసింది గోవర్దిని.
సరేనని నేను, మధురిమ తనతో వాళ్ళ ఇంటికి వచ్చాము.
నేనే లక్ష్మీరాజ్యం గారిని పలకరించాను.
ఆవిడ నిలువెల్లా కదిలిపోయి "నన్ను క్షమించండమ్మా. మిమ్మల్ని చాలా ఘోరంగా అవమానించాను."అంది రుద్ధమైన కంఠంతో.
"అయ్యయ్యో...ఎంత మాట!మీరు అలా అనకూడదు"అన్నాను
" లేదమ్మా. ఈవేళ నా బిడ్డ జీవితం బాగుంది అంటే కారణం మీరు.కన్నంతమాత్రాన అందరూ అమ్మలు కాలేరు.కన్న బిడ్డ సమస్య తెలుసుకుని, దానిని సకాలంలో గుర్తించి, పరిష్కరించి, కన్నబిడ్డ కు బంగారు భవిష్యత్తు ఇవ్వగలిగిన అమ్మే నిజమైన అమ్మ. అటువంటి అమ్మకు ప్రతిరూపం మీరు. నా బిడ్డను మీ బిడ్డగా భావించి నావరకూ రాకుండానే నా బిడ్డ సమస్యను పరిష్కరించారు.దానికి మీరు నూరిపోసిన ఆత్మ విశ్వాసం వల్లనే అది చక్కని ఉద్యోగం సంపాదించుకుని, చల్లగా కాపురం చేసుకుంటోంది.లేదంటే దాని బ్రతుకు నాశనం అయిపోయేది."అందామె నాచేతులు పట్టుకుని కన్నీళ్ళతో.
"మీరు అనవసరంగా బాధ పడుతున్నారు.అవన్నీ మరిచిపోయి ఈరోజునుంచి మీకు ఇద్దరు కూతుళ్లు అనుకోండి.నేను మూడు నెలలపాటు ఇక్కడే ఉంటాను.మీరు ఆపుడపుడూ మా ఇంటికి వస్తూ ఉండండి.నేను వస్తుంటాను.సరేనా?"అన్నాను ఆమె కన్నీళ్లు తుడిచి.
"తప్పకుండా"అని ఆమె నన్ను మృదువుగా కౌగిలించుకుంది.
" ఆంటీ. అమ్మ చెప్పింది అక్షరాలా నిజం.ఒక దీపం మరో దీపాన్ని వెలిగించడం అంటే ఇదే. దానికి మీరు నిలువెత్తు సాక్ష్యం.అటువంటి మీకు ఈ చిరుకానుక అందజేసేలా చేయమని ఆ భగవంతుని రోజూ ప్రార్ధించుకుంటాను.ఇన్నాళ్లకు ఆ దేవుడు నా మొర ఆలకించాడు.మీరు మధురిమకే కాదు.నాకు కూడా అమ్మే!"అంటూ వద్దన్నా ఒక బంగారపు ఉంగరాన్ని నా చేతి వేలికి తొడిగి నమస్కరించింది.
నేను చిరునవ్వుతో ఆమె తల నిమిరి తృప్తిగా ఆశీర్వదించాను.
సమాప్తం.