Kanthi Sekhar

Classics

5.0  

Kanthi Sekhar

Classics

అమ్మ కాలేకపోయిన అమ్మ కథ

అమ్మ కాలేకపోయిన అమ్మ కథ

2 mins
1.3K


అంతు లేని ఐశ్వర్యాలు, ఆలోచించటానికే అలుపొచ్చేంత పాడిపంటలతో తులతూగినా,కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త, కుటుంబం ఉన్నా నేనెప్పుడూ ఒంటరినే అనుకునేదాన్ని కన్నా. రాచపదవి చూసి మర్యాద, పెట్టుగుణం చూసి చుట్టూ చేరే చుట్టాలు ఎన్ని ఉన్నా నువ్వు రాకముందు వరకు ఒంటరిదాన్నేరా చిన్నా.ఏళ్లకేళ్లు నేను మొక్కని దేవుడు , నోచని నోము లేవురా. ఏ దేవుడు నా మొర విన్నాడో, కళ్ళు కాయలు కాచేలా వేచి చూసిన పిలుపు కొన్ని నిముషాల్లో రాబోతుండగా నొప్పి తట్టుకోలేక అచేతనంగా అయిపోయా. ఒక చిన్ని నీలి రంగు బొమ్మలా ఉన్న నీకు ఎంత గొంతురా అనుకున్నా... కెవ్వుమని నీ ఏడుపుకి తెలివి తెచ్చుకుని. లోకమంతా నీ గుండెల్లోనే దాచుకున్నావని తెలియని మామూలు అమ్మని కదా.

నల్ల కలువపూవుల్లా మెత్తని ఒళ్ళు , నిద్రలో కూడా మేఘం మధ్య మెరుపులా మూసిన రెప్పల మధ్య చిన్నగా కనపడే తెల్ల తామరలాంటి కనుపాపలు చూసి మురిసిపోతూ ఎన్ని ఏళ్ళు క్షణాలుగా గడిపేసానో నాన్నా. ఇంత లేడు ఈ పిల్లాడికి ఎన్ని గండాలురా... వీడు రాక్షసులని చంపటం ఏమిటో... కలా నిజమా... అనుకుంటూ ఎన్ని సార్లు అచేతనంగా ఉండిపోయేదాన్నో... ఆడపిల్లల్ని ఆటపట్టిస్తున్నావని, ఇంట్లో వెన్నా పాలు ఎంత ఉన్నా పక్క వాళ్ళ ఇళ్లల్లో దొంగిలిస్తున్నావని ఊరంతా చెప్తున్నా నా బిడ్డవని  వెనకేసుకొచ్చేదాన్ని ... అందరితో పంచుకునిగదా తిన్నావని. ఒకసారి ఊరంతా ఫిర్యాదు చేస్తే ఉండబట్టలేక రోటికి కట్టేసా. చారడేసి కళ్ళు చిన్నవి చేసుకుని జలజలా కన్నీళ్లు కారుస్తుంటే  తల్లడిల్లిపోయా. అల్లరి చేష్టల్లో మన్ను తింటున్నావని చెవి మెలి పెడితే లోకాలన్నీ చూపించావు నీ చిన్ని నోటిలో. అప్పుడు కలా వైష్ణవ మాయా అర్ధం కాక చేష్టలుడిగి ఉండిపోయా. మీ అన్న నిన్ను నల్లవాడివని ఏడిపిస్తే గుండెల్లో పొదువుకుని తెల్ల ఆవుకి నల్ల దూడ కూడా పుడుతుందని ఓదార్చా.ఎదుగుతూ ఎదుగుతూ నీ అల్లరి తగ్గినా నీ రూపం మాత్రం నిత్యమోహనం. ఈ అందం నా రక్తమే అని మురిసిపోయా. నువ్వే నా లోకం నువ్వే నా ప్రాణం మరి.

రాకాసి మూకల నుంచి నిన్ను కాపాడుకుందాం అని బృందావనికి వచ్చేసాము ఊరు వాడా పిల్లా పాపలతో సహా. అక్కడా ఆటుపోట్లే. గోపికల వెంట పడుతూ అమ్మని మర్చిపోతావ్ అనుకున్నా కానీ నీ ఒక్క నవ్వుతో నా అలక అంతా పోగొట్టేసేవాడివి. కాలానికి ఏమి కన్ను కుట్టిందో కానీ నువ్వు నా బిడ్డవే కాదని వేరే ఇంటి దీపానివని నాకు తెలిసిపోయింది. తల్లిప్రేమ ఎవరికైనా ఒకటిగా అని కాలంతో పాటు నన్ను నేను ఓదార్చుకున్నా. ఏళ్ళూ ఊళ్లు అయిపోయాయి. ఒకానొక శుభవేళ నిన్ను తనివితీరా చూసుకున్నా.... నా కన్నతండ్రి బిడ్డలకు తండ్రి అయ్యాడని. నీ ఊసులు గుండెల్లో నింపుకుని మూగబోయిన బృందావనిలో అచేతనంగా రాలిపోతున్నా... నా ఆత్మ నీ చిన్ని లేలేత పాదాలని ముద్దాడాలని. Rate this content
Log in

Similar telugu story from Classics