Kanthi Sekhar

Inspirational

4.1  

Kanthi Sekhar

Inspirational

ఆడపిల్ల

ఆడపిల్ల

2 mins
621


"అసలు ఈ ఆడపిల్ల అనే మాటనే నిషేధించాలి. తెలుగు లో 221 పర్యాయపదాలు ఉంటే అమ్మాయి అనగానే ఆడపిల్ల అనేస్తారు ఎందుకో. ..

ఎప్పటికైనా ఇంకో ఇంటికి వెళ్లాల్సినదానివి అని చిన్నప్పటి నుంచి నూరిపోస్తారు ఎందుకో. .. ఒక్క ఏడడుగులతో పుట్టిన దగ్గర నుంచి ఉన్న బంధాలు అన్నీ వదులుకుని మేమే ఎందుకు వెళ్ళాలి. ..పెళ్లయ్యాక శివుడు హిమాలయాల్లో విష్ణువు పాలసముద్రం లో ఇల్లరికం ఉన్నారు కానీ మామూలు ఆడపిల్లకి ఈ కొంచెం ఇష్టం కొంచెం కష్టం మజిలీ ఎందుకో. ..ఒక్క పెళ్లి అనే రెండు అక్షరాలు నా ఇష్టాలు అలవాట్లు ఇంటి పేరు కలలు అన్నీ ఎందుకు దూరం చేస్తాయి. .. ఈ పధ్ధతి పెట్టినవాడికి కూతురు ఉండి ఉండదు. ..ఒక పాతికేళ్ళు అన్నీ మాములుగా చేసి పెళ్లయ్యాక ఆశలకు ఎదుగుదలకి ఎందుకు ముసుగులు వేసుకోవాలో. .." ఆలోచనలతోనే మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీయటానికి ఉపక్రమించాను. 

ఫోన్ మోగటం తో నిద్రా భంగం ఐంది. తల తిరిగిపోతోంది కానీ తప్పక లేచాను. ప్రవీణ్ ఫోన్. అంతకుముందే మూడు మిస్ కాల్స్ ఉన్నాయి. లిఫ్ట్ చేసి మాట్లాడాను. మామూలప్పుడు ఐతే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఒక అష్టోత్తరం చదివేవాడు కానీ ఈ రోజు ఏ కళనున్నాడో మామూలుగానే మాట్లాడాడు. "అమ్మ చెప్పినట్టు చేయటానికి ట్రై చేయి. పెద్ద వాళ్ళ మాట కూడా వినాలి కదా. ఇప్పుడు నేను కూడా జాబ్ లో రిస్క్ జోన్ లో ఉన్నా. నువ్వేమో పిల్ల కోసం అంటూ ఇంట్లో కూర్చుని తింటున్నావు. .. ఒక వేళ ఇంకో ఆడపిల్ల అంటే ఇంకా ఖర్చు. ఎవరో తెలీకుండానే తొందరగా డెసిషన్ తీసుకోవాలి. మనం ఏమీ ముసలి వాళ్ళం కాదు మళ్ళీ పిల్లలు పుట్టరు అనుకోవటానికి. అయినా ఒక ఆడపిల్ల ఉందిగా అసలు పిల్లలు లేకుండా లేరుగా. .. మళ్ళీ ఆడపిల్ల ఐతే పెంచాలి చదివించాలి అన్ని రకాలుగా కాపాడుకోవాలి పెళ్లి చేయాలి పురుళ్ళు పుణ్యాలు. .. ఎన్ని ఖర్చులు ఎన్ని టెన్షన్స్ ...నాకు ఇప్పుడు ఓపిక లేదు. .."

"హ్మ్మ్" అనేసి ఫోన్ పెట్టేసా.

"సాయంత్రం రెడీ గా ఉండు.. హాస్పిటల్ కి వెళదాం..." తన మెసేజ్. తల తిరిగిపోతోంది. అయినా పిల్ల స్కూల్ నుంచి వచ్చే టైం అవ్వటం తో లేచి స్నాక్స్ రెడీ చేశా. స్కూల్ నుంచి వస్తూనే నా కాళ్ళను అల్లుకుపోయింది నా బంగారం. పాలు తాగి నాతో కబుర్లు మొదలుపెట్టింది. "అమ్మా... ఈ రోజు ప్లే గ్రౌండ్ దగ్గర రోహిత్ గాడు ఒక చిన్న కుక్క పిల్లని ఏడిపించాడు అమ్మా... వాడిని దాని మమ్మీ కుక్క కరిచేసింది తెలుసా..." కళ్ళు చక్రాల్లా చేస్కుని చెబుతోంది నా కూతురు. "ఒక జంతువుకి తన పిల్లల మీద ఉండే జాగ్రత్త మనిషినైనా నాకు లేకుండా పోతోందా..." ఆలోచనలతోనే పనులు చేసుకుని ప్రవీణ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నా.

అరగంటలో డోర్ బెల్ రింగ్ ఐంది. వెళ్లి చూస్తే పక్కింటాయన భుజం ఆసరాగా గాయాలతో ప్రవీణ్. మెల్లగా తీసుకొచ్చి సోఫా మీద పడుకోబెట్టాం ."బండి స్కిడ్ అయ్యి గోతిలో పడిపోయా. ఫోన్ కూడా పగిలి పోయింది. దారిలో శ్రీరామ్ గారే బ్యాండేజ్ వేయించి తీస్కొచ్చారు ." చెప్పుకుంటూ పోతున్నాడు ప్రవీణ్. కొంచెం కూడదీసుకున్నాక ఇద్దరికీ కాఫీ చేసి ఇచ్చా. శ్రీరామ్ గారికి థాంక్స్ చెప్పి పంపించాక అడిగాడు..." ఇంతకీ ఏం ఆలోచించావు..." అంటూ. ..

"ఇపుడు హాస్పిటల్ కి వెళ్ళావు చాలదా..." విసురుగా అనేసి వంటింట్లోకి నడిచా.

నన్ను వెంబడించి వచ్చిన నా కూతురు ఎరుపెక్కిన కళ్ళతో అడిగింది నన్ను. " అమ్మా డాడీ తో ఎందుకు గొడవ పడతావ్... అసలే ఆయ్ వచ్చింది కదా డాడీ కి. మందు రాయి తనకి తొందరగా. తగ్గిపోతే మళ్ళీ డాడీ నేను నువ్వూ ఆడుకోవచ్చు ఎంచక్కా..." అంటూ దాని విక్స్ బాక్స్ తీసుకొస్తున్న పాప ని చూసి ఇద్దరం మామూలు అయిపోయి నవ్వుకున్నాం.

మా నిర్ణయం ఏమయి ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా . ..:)

****

అమ్మాయి అనే మాట లోనే అమ్మ ఉంటుంది. ఆడపిల్లని కాపాడటం అంటే అమ్మ ని గౌరవించటమే. 


Rate this content
Log in