Vamshi Nellutla

Inspirational

4.8  

Vamshi Nellutla

Inspirational

రైతుబిడ్డ

రైతుబిడ్డ

6 mins
1.7K


పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు రాజయ్య. అతనికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటిని తట్టుకొని తన పిల్లల భవిషత్తు కోసం నిర్విరామంగా శ్రమిస్తున్నాడు రాజయ్య.


రాజయ్య కూతురు దేవి. తను డిగ్రీ చదివింది. మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరిన సంవత్సరానికి ఆమెకు పెళ్లి కుదిరింది. రాజయ్య తన కూతురి పెళ్ళి ఉన్నంతలో అంగరంగ వైభవంగా జరిపించాడు. కూతురు అల్లుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ బెంగుళూరులో స్థిరపడ్డారు.


ఇక రాజయ్య కొడుకు హరి హైదరాబాద్ లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నాలుగేళ్ల తర్వాత హరి తన చదువును పూర్తి చేసుకొని ఊరికి చేరుకున్నాడు. రోజూ తన తండ్రి పొలం పనుల్లో సాయం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లు గడిచాయి.


పెద్ద ఉద్యోగం చేస్తాడనుకున్న కొడుకు ఇంటి వద్దనే ఉండడం చూసి సందేహం కలిగింది రాజయ్య భార్య కాంతమ్మకు.


ఆ రోజు సాయంత్రం తండ్రీ కొడుకులు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చారు.


కాసేపు వాళ్లిద్దరు సేదతీరిన తర్వాత, "ఏరా! హరి! నీ చదువు పూర్తయి నీవు ఊరికొచ్చి రెండు నెలలు గడుస్తున్నాయి. నీవు ఉద్యోగం మాటే ఎత్తడం లేదు. నీవు ఉద్యోగం కోసం ప్రయత్నించడం లేదా! మీ అక్కకు చదువుతున్నప్పుడే ఉద్యోగం వచ్చింది కదా! మరి నీకు రాలేదా! లేక ఎమైనా పై చదువులు చదువుకోవాలని అనుకుంటున్నావా?" అని కొడుకు నిలదీసి అడిగింది కాంతమ్మ.


తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో ఆలోచిస్తూ మౌనంగా కూర్చున్నాడు హరి.


"ఏంట్రా! ఏం మాట్లాడవేం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు" అని గట్టిగా అడిగింది కాంతమ్మ.


"అమ్మా! నాకు ఉద్యోగం వచ్చింది." అని చెప్పడం మెదలుపెట్టాడు హరి.


"చాలా సంతోషం రా ! మరి ఇన్నాళ్లు ఈ సంగతి మాకు ఎందుకు చెప్పలేదు. ఇంతకీ ఉద్యోగం ఎక్కడ? ఎప్పుడు వెళ్లి చేరాలి" అని ఆత్రుతగా అడిగాడు రాజయ్య.


"నాన్న! నాకు హైదరాబాద్ లోనే ఉద్యోగం వచ్చింది. కానీ నాకు ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు" మెల్లగా చెప్పాడు హరి.


"ఏమిటి ఉద్యోగం చేయడం ఇష్టం లేదా! మరి ఏమి చేస్తావు!" అని కోపంగా అడిగింది కాంతమ్మ.


"కాంతం! ఎందుకంత కోపం! వాడికి ఈ ఉద్యోగం చేయడం ఇష్టం లేదంట. వేరొక ఉద్యోగం రాగానే అందులో చేరుతాడులే" అని కాంతమ్మకు చెప్పాడు రాజయ్య.


"లేదు నాన్నా! నాకు ఉద్యోగం చేయాలని లేదు. ఇక్కడే ఉండి వ్యవసాయం చేయాలని ఉంది" అంటూ తన మనసులో విషయాన్ని నెమ్మదిగా చెప్పాడు హరి.


కాంతమ్మకు కోపం మరింత పెరిగింది. రాజయ్యలో మాత్రం ఎటువంటి అలజడి లేదు.


"వేలకు వేలు ఖర్చు పెట్టి, నిన్ను హైదరాబాద్ పంపించి పై చదువులు చదివిస్తే, నీకు ఉద్యోగం వచ్చినా అది కాదని ఇక్కడ పొలం పని చేస్తావా! మతి ఉండే మాట్లాడుతున్నావా నీవు!" అని అడిగింది కాంతమ్మ.


"కాంతం! ఏమిటా మాటలు?" అన్నాడు రాజయ్య.


"అవునండి. ఇదంతా మీరు చేసిన గారాబం ఫలితమే. వాడు ఆడమన్నటల్లా ఆడారు. ఇప్పుడు వాడు ఉద్యోగమే చేయనంటున్నాడు. ఏమి చెప్తారో మీరే చెప్పండి వాడికి" బదులిచ్చింది కాంతం.


"హరీ! ఉద్యోగం చేయడం కంటే వ్యవసాయం చేయడమే కష్టమైన పని. చూడు నీ తోటి వారందరు హాయిగా ఉద్యోగం చేస్తూ, బాగా సంపాదిస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నారు. నీవు అలానే ఉండొచ్చు. మా మాట విని నువ్వు కూడా ఉద్యోగం చేయి" చెప్పాడు రాజయ్య.


"నాన్న! మీరు కూడా అలాగే అంటారేంటి. వ్యవసాయం కష్టమైతే మీరు ఇన్నాళ్ల నుండి ఎలా చేయగలుగుతున్నారు. ఈ వ్యవసాయంలో సంపాదనే లేకుంటే మీరు నన్ను, అక్కను ఇంజనీరింగ్ వరకు ఎలా చదివించారు? అక్కకు పెళ్లి ఎలా చేసారు?" అని అడిగాడు హరి.


"హరీ! వ్యవసాయం అంటే నీవు అనుకున్నంత సులువు కాదు. మిమ్మల్ని చదివించి పెద్ద చేయడానికి మీ నాన్న ఎంత కష్టపడ్డారో నీకు తెలియదు.


వర్షాలు పడక, నీళ్లు లేక పంట పండని రోజులు ఎన్నో ఉన్నాయి. పంట పండి, చేతికి వచ్చే సమయంలో వరదల వల్ల కొన్ని సార్లు పంట నాశనం అయింది. పంట చేతికి వచ్చినా తగినంత గిట్టుబాటు ధర రాని రోజులు కూడా ఉన్నాయి. పంట రుణాలు, వడ్డీలకు డబ్బ్లు తీసుకొనిపంటపై పెట్టుబడి పెట్టినా ఒక్కోసారి రాబడి వచ్చేది కాదు. ఆ అప్పులు తీర్చడానికి ఎంతో కష్టపడ్డాము. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు కూడా లేవు.


ఉన్ననాడు తింటూ లేని నాడు పస్తులుంటూ మీ ఇద్దరిని చదివించాడు మీ నాన్న. మీకు ఏ లోటు రాకుండా ఉన్నంతలో మీ ఇద్దరినీ బాగా చూసుకున్నాడు. మీ భవిష్యత్తు కోసం నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. మనకున్న భూమిలో కొంత అమ్మి మీ అక్క పెళ్లి చేసాడు.


వ్యవసాయం చేస్తూ సులభంగా సంపాదించాడని నువ్వు అనుకుంటావు కాబోలు. మీ నాన్న ఎంతో కష్టపడితే గాని మనం ఈ రోజు ఇలా ఉండగలుగుతున్నాము.


నువ్వెందుకు రా ఈ కష్టాలను కొని తెచ్చుకుంటావు. హాయిగా ఉద్యోగం చేసి, పెళ్లి చేసుకొని ఆనందంగా ఉండు" అని మెల్లగా నచ్చచెప్పింది కాంతమ్మ.


"అమ్మా! నువ్వు చెప్పింది నిజమే. నాన్న ఎన్నో కష్టాలు పడ్డుతూ వ్యవసాయం చేస్తున్నాడు. కానీ అవి కష్టాలని నాన్న ఏనాడు అనుకోలేదు.


మన ఊరిలో ఎంతో మంది తమ పొలాలను వదిలేసి లేక అమ్ముకొని పట్నం వెళ్లి కూలి పని చేసుకుంటు బ్రతుకుతున్నారు. నాన్న మాత్రం కష్టం వచ్చిన ఇష్టంగా ఎదుర్కొని ఇంకా వ్యవసాయం చేస్తూ పంటలు పడిస్తున్నారు. నాన్నే నాకు ఆదర్శం.


ఇక సంపాదన అంటావా! ఉద్యోగం చేస్తే నాకు ఎంత సంపాదన వస్తుందో నేను వ్యవసాయం చేసి కూడా సంపాదించగలను" అని చెప్పాడు హరి.


తల్లి కొడుకుల మాటలను విన్నా రాజయ్య, "హరీ! అమ్మ చెప్పిన మాటలను మరొక సారి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీ జీవితం ఆనందంగా ఉండాలనే మా తపన. ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు కష్టపడాలని కోరుకోరు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలకు రాకూడదని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు.


అందరిలా నీవు కూడా పెద్ద ఉద్యోగం చేసి, బాగా సంపాదిస్తూ హాయిగా ఉండాలని మా కోరిక. చేతికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. మరొక సారి ఆలోచించి నిర్ణయం తీసుకో" అని చెప్పాడు రాజయ్య.


"నాన్న! తాతయ్య కూడా వ్యవసాయం చేసి మీ అందరినీ పెంచి పెద్ద చేసారు. తాతయ్య వారసత్వంగా మీరు కూడా వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నారు. ఇప్పుడు నేను కూడా అదే దారిలో ప్రయాణిస్తానని చెప్తున్నాను. ఇందులో తప్పు ఏముంది!


బాబాయి వ్యవసాయాన్ని వదిలి భూమిని అమ్ముకొని ఊరు విడిచి వెళ్ళిన రోజు, మనం కూడా వెళ్దామంటే మీరు వద్దన్నారు. ఈ వ్యవసాయమే మీకిష్టమని ఇప్పటి వరకు చేస్తున్నారు. మీలాగే నేను కూడా ఈ వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తాను.


అమ్మా! ఉద్యోగం చేస్తూ ఉరుకుల పరుగులతో కాలం గడపాడలి నాకు ఇష్టం లేదు. ప్రశాంతంగా ఈ పల్లెటూరులో ఉంటూ నేను చదివిన చదువును ఉపయోగిస్తూ కొత్త ఆలోచనలతో వ్యవసాయం చేస్తూ హాయిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.


నాన్నా! తాతయ్య కాలంలో ఎక్కువ శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు, మీ తరంలో కొంత మంది వ్యవసాయం వదిలిపెట్టి వేరే జీవనోపాధులను వెతుకున్నారు, మా తరానికి వస్తే వ్యవసయం చేసే వాళ్లు తగ్గిపోయారు. కాలక్రమేణా వ్యవసాయం చేసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.


ఈనాడు రైతులు తమ బిడ్డలు ఉద్యోగం చేయాలని కోరుకుంటూన్నారే తప్ప వ్యవసాయం చేయాలని కోరుకోవడం లేదు. కొన్నాళ్లు పోతే పండించే వాళ్లు లేకపోవడంతో తిండి దొరకడం కష్టం అవుతుంది. ఇదంతా నేను ఊహించో, లేక నా ఆలోచనను సమర్థించుకోవడానికో చెప్పడం లేదు. ఇది నిజం. అందుకే నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను.


నాన్నా! వ్యవసాయం ఎలా చేయాలో మీరు నాకు నేర్పించండి. మీ అనుభవాలను చెప్పండి. వ్యవసాయంలోమెలకువలను నాకు చెప్పండి. మీరు నాకు ట్రైనింగ్ ఇస్తే నేను వ్యవసాయాన్ని చక్కగా చేసుకోగలను అనే నమ్మకం ఉంది" అని వివరంగా చెప్పాడు హరి.


హరి మాటలు విన్న రాజయ్య ఎంతో సంతోషించాడు. కాంతమ్మకు మాత్రం ఆ మాటలు రుచించలేదు. మరొకసారి కొడుకుకు నచ్చజెప్పడానికి ప్రయత్నించింది కాంతమ్మ.


"కాంతం! మన కొడుకు ఆలోచన సరైందే. వాడికి వ్యవసాయం ఇష్టం ఉన్నప్పుడు మనం వద్దు అనకూడదు. అయినా వాడేదో తప్పు చేయట్లేదు కదా!


తల్లిదండ్రులుగా చదువును చెప్పించే వరకే మన బాధ్యత. ఇలాగే సంపాదించు, ఇదే పని చేయి అని తల్లిదండ్రులు శాసించకూడదు. పిల్లలు ఎంచుకున్న దారి మంచిదైతే వారికి ప్రోత్సాహం అందించాలి. అదే తల్లిదండ్రులుగా మన కర్తవ్యం" అని కాంతమ్మకు చెప్పాడు రాజయ్య.


ఆ రోజు నుండి హరి వ్యవసాయంపై తన దృష్టిని పెట్టాడు. ప్రతి రోజు పొలం వద్దకు వెళ్ళి పనులు చూసుకుంటూ ఉండేవాడు. తన తండ్రి వద్ద వ్యవసాయం గురించి శిక్షణ తీసుకున్నాడు.


హరి అగ్రికర్చరల్ ఇంజనీరింగ్ చేసాడు. తాను చదువుకున్న విద్యను ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టడం మొదలుపెట్టాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి వచ్చేలా అడుగులు వేసాడు.


తన భూమిలో వరి, కూరగాయలు, పండ్లు, పత్తి పందించాడు. ఔషదలకు ఉపయోగపడే మొక్కలు పెంచాడు. ఎండిపోయిన ఆకులను, మురిగిపోయిన కూరగాయలను, పళ్లను, భుమిలో పుడ్చి దానిపై పేడ చేర్చి భూమిని ఎప్పటికప్పుడు అనుగుణంగా సిద్ధం చేసుకునేవాడు. కరెంటు తక్కువ ఫేజులో ఉన్నా నడిచేలా మోటర్లు ఉపయోగించాడు. భూగర్భ జలాలను నిల్వ చేసుకునేవాడు. ఇలా ఎన్నో ఆలోచనలతో కొద్ది రోజులోనే సంవత్సరానికి సుమారు పది లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు.


బిటెక్ పూర్తి చేసిన హరి, ఎం.టెక్ అగ్రికల్చర్ పూర్చి చేసి, అందులోనే పి.హెచ్.డి పట్టా పొందాడు. ఏన్నో రకాల ప్రయోగాలు చేసి విజయం పొందాడు.


తన తోటి రైతులకు సైతం చేయూతనిస్తూ వారికి కూడా ఎంతో సహాయం చేసాడు. అంతేకాదు ఎంతో మంది అగ్రికర్చరల్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవాడు.


హరికి జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. విదేశాలకు సైతం వెళ్లి వచ్చేవాడు. ఎన్నో విశ్వవిద్యాలయాలనో గెస్ట్ లెక్చర్లు ఇచ్చేవాడు.


ఎంత ఎదిగినా హరి మాత్రం వ్యవసాయం వీడలేదు. తాను పుట్టి పెరిగిన ఊరికి పేరు తీసుకొచ్చి, అక్కడే ఇళ్లు కట్టుకొని తన తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో ఒక సాధారణ రైతు బిడ్డలా హాయిగా జీవించాడు.


Rate this content
Log in

More telugu story from Vamshi Nellutla

Similar telugu story from Inspirational