Surekha Devalla

Inspirational

4.6  

Surekha Devalla

Inspirational

ఆత్మీయబంధం

ఆత్మీయబంధం

4 mins
1.8K


బంధానికైనా పునాది ఏంటి ?? ఆ బంధం చివరి వరకు శాశ్వతంగా ఉండాలంటే ఏం చేయాలి???ఎలా ఉండాలి?? అసలు ఈ బంధం అంటే ఏంటి??


నా దృష్టిలో బంధం అంటే ఒక విడదీయలేని , వీడలేని అపురూప సాన్నిహిత్యం.. ఆ బంధం రక్తసంబంధీకుల మధ్య మాత్రమే కాదు , ఒక్కోసారి ఎదుటివారు ఎవరో తెలియకపోయినా ఆ బంధం ముడిపడుతుంది..దాన్ని విధిరాత అనాలేమో మరి..


ఏ బంధానికైనా పునాది నమ్మకం ,ప్రేమ అని బలంగా నమ్ముతాను నేను.. ఆ బంధం ఎలా ఉండాలంటే ఎదుటివారి మౌనాన్ని కూడా అర్థం చేసుకునేలా ఉండాలి..


నా పేరు అశ్విని.. పెళ్ళయి నాలుగు నెలలయింది.. కొత్త కాపురం..కొత్త బాధ్యతలు.. కొత్త పనులు.. అన్నీ కొత్తగా ఉన్నాయి. కానీ బాగున్నాయి..


పుట్టింటి వారికి ,అత్తింటి వారికి టాటా చెప్పి మాదైన ఒక లోకాన్ని సృష్టించుకున్నాం వేరింటి కాపురంలో..


ఇక్కడ మళ్ళీ కొత్త ఊరు ,కొత్త భాష..మావారి జాబ్ నిమిత్తం జిల్లానే కాదు ,రాష్ట్రం కూడా వదిలి పెట్టి రావలసి వచ్చింది.. 


బెంగళూరు నాకు చాలా నచ్చింది.. మా క్కింట్లో ఉండేవాళ్ళు తెలుగువాళ్ళే కావడం నా అదృష్టం..


ఈయన ఆఫీసుకి వెళ్ళిపోయాకా చాలా బోర్ వచ్చేది..


పక్కింటికి నేనే వెళ్ళి పరిచయం చేసుకున్నా..తెలుగువాళ్ళు అనేసరికి మనసాగలేదు , వాళ్ళేమైనా అనుకోనీ అని నేనే వెళ్ళి పలకరించా..


అందరూ బాగానే మాట్లాడారు.. అక్కడ ఒక బామ్మగారు ఉన్నారు.. అందరికంటే ఆవిడ చాలా బాగా మాట్లాడారు.. ఆ మాటల్లో ఆప్యాయత ,ప్రేమ కనిపించాయి..మా అమ్మమ్మ గుర్తొచ్చింది నాకు..


నాకు అమ్మమ్మ దగ్గరలేని లోటు ఈ బామ్మగారి వల్ల తీరింది..


వీళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చి సంవత్సరం అయ్యింది అంట..ఇంతకముందు హైదరాబాద్ లో ఉండేవారంట

బామ్మగారి కొడుకు, కోడలు ఇద్దరూ జాబ్ చేస్తారు..అందుకే వాళ్ళిద్దరూ ఎప్పుడూ బిజీ ఉంటారు..వాళ్ళకి ఒక అబ్బాయి..ఫోర్త్ స్టాండర్డ్ వాడు..


బామ్మగారికి ఒక స్నేహితురాలు ఉన్నారు కౌసల్య అని..ఆవిడ మహారాష్ట్రలో ఉంటున్నారంట వాళ్ళబ్బాయితో..ఆవిడ రెండు వారాలకొకసారి ఉత్తరం రాసేవారు..


"ఈకాలంలో కూడా ఉత్తరాలేంటి "అని వాళ్ళ మనవడు ఏడిపించేవాడు..


"అందులో ఉండే ఆత్మీయత నీకేం తెలుసురా పిల్లకాకి" అనేవారు బామ్మగారు..


బామ్మగారికి చదువురాదు ,అందుకనే మనవడి చేత చదివించుకునేవారు బ్రతిమిలాడి..వాడేమో పేద్ద ఫోజ్ కొట్టేవాడు చదవడానికి..


నేను పరిచయం అయ్యాకా నాతో చదివించుకునేవారు ఒకసారి కాదు ,మళ్ళీ ఉత్తరం వచ్చేవరకు రోజుకొకసారైనా.


ఆ స్నేహితులిద్దరి ఆత్మీయ బంధం నాకు చాలా అపురూపంగా అనిపించేది..


ఎప్పుడైనా ఒకసారి నాతో ఉత్తరం రాయించి పోస్ట్ చేయించేవారు..


"వచ్చేనెల నేను ఊరు వెళ్ళి ఇరవై రోజుల తర్వాత వస్తా" అని చెప్పాను బామ్మగారికి..

ఆవిడ చాలా దిగులుపడిపోయారు..

బామ్మగారు ,నేనో పని చెప్తా చేస్తారా అడిగాను..

చెప్పమ్మాయి అన్నారు బామ్మగారు..

"నేను మీకు రాయడం ,చదవడం నేర్పిస్తా ,,నేను చెప్పినట్లుగా విని మీరు నేర్చుకోవాలి" అన్నాను..


బామ్మగారు కొద్దిసేపు మౌనంగా ఉండి సరే అన్నారు..


నాకు చాలా సంతోషంగా అనిపించింది... ఈవయసులో నాకు చదువేంటి అనే రొటీన్ డైలాగ్స్ అననందుకు..


ఆ క్షణం నుండే చదువు మొదలు పెట్టేశాం..బామ్మగారు చాలా ఫాస్ట్ లెర్నర్..ఒకసారి చూపిస్తే వెంటనే నేర్చుకుని రాసేయడమే కాదు ,మర్చిపోయేవారు కూడా కాదు..


ఆవిడకి చదువు మీద ఉన్న శ్రద్ధ ,ఆసక్తి చూసి చాలా ఆశ్చర్యం అనిపించేది..నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ఆవిడకి ఎప్పటినుంచో చదువుకోవాలనే ఆసక్తి ఉంది కానీ ,అడగలేకపోయారు..ఇప్పుడు అవకాశం వచ్చేసరికి వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకున్నారు..


నేను వెళ్ళే సమయానికి అక్షరాలతో పాటు ,గుణింతాలు కూడా నేర్చేసుకున్నారు..కొన్ని పదాలు నేర్పించి ,నా దగ్గర ఉన్న ఒక తెలుగు పుస్తకం ఇచ్చి చదవడం ప్రాక్టీసు చేయమని ఊరికి వెళ్ళిపోయాను.

౦౦౦౦౦౦

నేను వచ్చేసరికి పదాలు రాయడం వచ్చేసింది..


చదవడం కూడా చాలా వరకు వచ్చేసింది.. అక్కడక్కడా మాత్రమే తప్పులు వస్తున్నాయి..


మరో నెల గడిచేసరికి బామ్మగారికి చదవడం ,రాయడం చాలా బాగా వచ్చింది..


వాళ్ళ ఫ్రెండ్ రాసిన ఉత్తరం తనే చదువుకున్నారు..అది చదివాక ఆవిడ సంతోషం చెప్పనలవి కాదు.. ఆ ఆనందంతో ఏడ్చేసారు కూడా.. ఓదార్చడం నా వంతయింది..


బామ్మగారు కూడా వాళ్ళ ఫ్రెండ్ కి ఉత్తరం రాయడం మొదలుపెట్టారు.. ఆ ఉత్తరాలలో నా గురించి కూడా ఉండేది..


ఇద్దరూ నన్ను పొగుడుతూ ,థాంక్స్ చెప్తూ ఉండేవారు..

రెండు సంవత్సరాలు గడిచాయి..నేను నెల తప్పాను..ఇక మా సంతోషానికి అవధులు లేవు..

బామ్మగారు అయితే అసలు వదలట్లేదు..ఎంత గారాబం చేశారో నన్ను.. ఎన్ని రకాల వంటలు చేసి తినిపించేవారో..


ఆ ప్రేమానుబంధం చెప్పడానికి కూడా రావడంలేదు..

నేను డెలివరీకి వెళ్ళాను..బామ్మగారిని విడిచి వెళ్ళడానికి మనసు రాలేదు.. ఇద్దరం ఒకరికొకరం ఓదార్చుకున్నాం..

మావారు ఏడిపించారు సరదాగా మమ్మల్ని ఇద్దరినీ...

౦౦౦౦౦

అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం నేనూ బామ్మగారు..


డెలివరీ డేట్ దగ్గరకు వచ్చింది.. పదిరోజుల నుండి ఫోన్ చేయలేదు బామ్మగారికి.. చుట్టాల హడావిడి వల్ల.. ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు.. మావారితో కూడా తిన్నారా ,బావున్నారా అని తప్ప వేరే ఏం మాట్లాడటానికి ఉండేది కాదు..


డెలివరీ అయ్యింది.. పండంటి పాప పుట్టింది..ఈ సంతోషకరమైన విషయం చెప్దామంటే బామ్మగారు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారంట.. 


పాపకి మూడవ నెల వచ్చాకా బెంగళూరు వెళ్ళాను..

నన్ను పాపని చూడటానికి వచ్చిన బామ్మగారి కొడలిని ఆవిడ గురించి అడిగాను..ఆవిడ కొంచెం ఇబ్బందిగా చూసి రెండు ఉత్తరాలు నా చేతిలో పెట్టి పక్కన కూర్చున్నారు. 


బామ్మగారు ఇక మనకి లేరమ్మా,సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చి నెలక్రిందటే చనిపోయారు అన్నారు..


నేను షాకయ్యాను..


నన్ను ఓదార్చడం వారివల్ల కాలేదు..


చాలాసేపటి తర్వాత వణుకుతున్న చేతులతో ఒక ఉత్తరం ఓపెన్ చేశాను...


ఒక ఉత్తరం బామ్మగారు కౌసల్య(ఫ్రెండ్) గారికి రాసింది..


"కౌసల్యా ,నువ్విక లేవని నాకు అర్ధం అయ్యింది.. ఎలా అంటావా , నీ చేతిరాతని , అందులోని ఆత్మీయత ని గుర్తించలేననుకున్నావా..పోయిన వారం నీ దగ్గర నుండి వచ్చిన ఉత్తరంలో ఆ విషయం తెలిసింది.. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు కదా..నా చుట్టూ ఎంతమంది ఉన్నా నా మనసు నీ చుట్టూ ,నీ దగ్గర నుండి వచ్చే ఉత్తరం చుట్టూ తిరుగుతూ ఉండేది..

నువ్వు లేవనే విషయాన్ని నా మనసు అప్పుడే గ్రహించింది..నాకు ఆహ్వానం పలకడానికి నాకంటే ముందుగా వెళ్ళి నాకోసం ఎదురుచూస్తున్నావు కదా..

నేను తొందరలోనే నిన్ను చేరుకుంటాను..మిగతా విషయాలు అక్కడే మాట్లాడుకుందాం..ఉంటాను మరి" అని ఉంది..


నాకు ఏడుపాగలేదు ఆ ఉత్తరం చదివి.. అందరూ నన్ను ఓదార్చారు..


కొద్దిసేపు ఆగి రెండో ఉత్తరం తెరిచాను..అందులో....


"అమ్మూ ,ఎలా ఉన్నావు రా...నువ్వు వచ్చేసరికి నేను ఉండకపోవచ్చు.. నిన్ను ,నీ బిడ్డని చూడాలని ఉన్నా ,,,నా స్నేహితురాలిని తొందరగా చేరుకోవాలనే అభిలాష నన్ను స్థిమితంగా ఉండనీయడం లేదు..అవును రా కౌసల్య చనిపోయింది..మేమిద్దరం ఎక్కడున్నా మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి.. నీవల్లే చదువుకోవాలనే నా కోరిక తీరింది..ఆ ఋణం తీర్చుకోలేనిది..


నేను లేనని మనసు కష్టపెట్టుకోకు..ఎప్పుడూ నవ్వుతూ ,నవ్విస్తూ ఉండాలి ఎప్పటిలా..

అప్పుడే ఎక్కడున్నా నా ఆత్మ సంతోషిస్తుంది..ఉంటాను మరి".


బామ్మగారి చివరి ఉత్తరం .....


నా మనసు బరువెక్కింది..


ఆ స్నేహితుల అనుబంధానికి మనస్పూర్తిగా నమస్కారం చేశాను..


బామ్మగారు పోయి ఆరు సంవత్సరాలయింది..ఆ రెండు ఉత్తరాలు నా దగ్గరే ఉన్నాయి భద్రంగా ఇప్పటికీ..

చూడకపోయినా కూడా కౌసల్య గారి మీద కూడా అంతులేని అభిమానం.


తను చనిపోతే ,ఆ విషయం స్నేహితురాలికి తెలిస్తే తట్టుకోలేదని తను రాసినట్లుగా ఉత్తరాలు రాయమని కొడుకు దగ్గర మాట తీసుకుని చనిపోయారు..


ఒకరిపై ఒకరికి ఉన్న ఆ ప్రేమ మనసును తట్టి కంటనీరు తెప్పిస్తుంది నాకు ఆ ఉత్తరాలు చదివినప్పుడల్లా..


అయిపోయింది..


చదివిన వారందరికీ ధన్యవాదాలు అండీ.



Rate this content
Log in

Similar telugu story from Inspirational