Surekha Devalla

Drama Tragedy Inspirational

5.0  

Surekha Devalla

Drama Tragedy Inspirational

మరో అవకాశం

మరో అవకాశం

6 mins
567


"ప్లీజ్ డాక్టర్, ప్లీజ్!! ఈ ఒక్కసారికి సహాయం చేయండి" కన్నీళ్ళతో అర్థిస్తూ అడిగింది మహతి.

"ఒక సాటి మనిషిగా ఆలోచిస్తే నువ్వు అడిగినది సమంజసమే. కానీ, ఒక డాక్టర్ గా నా వైద్యవృత్తికే ద్రోహం చేసినట్లు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదా!? " కోపం, ఆవేదన మిళితమైన స్వరంతో అంది స్వరూప.

"మీరు చెప్పింది అక్షరసత్యం. కాదనను. కానీ, మీరు చేస్తున్న పనివల్ల నాలాంటి అమాయకులు ఇకముందు బలికాకుండా ఉంటారు. వాళ్ళనలాగే వదిలేస్తే ఏ ఆడపిల్లనీ వదిలిపెట్టరు. అటువంటి వారిని వారి పాపానికి వారే పోతారు అన్నట్లు వదిలేయడం ఎంతవరకు సబబు " నచ్చచెబుతున్నట్లుగా అంది మహతి.

స్వరూప ఆలోచిస్తున్నట్లు ఉండిపోయింది.

"ప్లీజ్ డాక్టర్, కాదనకండి. వారికి తగిన శిక్ష వేయాలంటే, మీరు నాకు సహాయం చేయకతప్పదు. ఈ విషయం ఎప్పటికీ మనమధ్యే ఉంటుంది." వేడుకుంటున్నట్లుగా అంది మహతి.

"సరే, కానీ,, నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావు. ఒక్కదానివే వాళ్ళని ఎదుర్కోగలవా?" సందేహంగా అడిగింది స్వరూప.

"అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఒప్పుకున్నారు, నాకు అంతే చా..." అంటుండగానే దుఃఖం కంఠానికి అడ్డుపడడంతో ఆగిపోయింది.

స్వరూప తన సీట్ లో నుండి లేచి మహతి దగ్గరకు వచ్చి ఓదార్పుగా మహతి భుజాన్ని తట్టింది.కొన్ని రోజుల క్రితం జరిగిన విషయాలన్నీ గుర్తు వచ్చాయి ఇద్దరికీ.

                          ****

కొన్ని రోజుల క్రితం...

అప్పటివరకు బాగానే ఉన్న మహతి భర్తకు, డాక్టర్లకు సైతం అంతుపట్టని జ్వరమేదో వచ్చింది. ఎంతమందికి చూపించినా తగ్గినట్లే తగ్గి, మళ్ళీ తిరగపెడుతోంది. రోజురోజుకూ మనిషిలో ఓపిక తగ్గిపోయి, మంచం మీద నుండి లేచే శక్తి కూడా లేనట్లు అయిపోయాడు.అతనిది ఏదో చిన్న కంపెనీలో ప్రైవేటు జాబ్ కావడంతో ఉన్నంతలో పొదుపుగా సంసారం లో ఏ లోటూ లేకుండా చూసుకునేది.

ఇప్పుడు అతను లేవలేని స్థితిలో ఉండడంతో ఆ చిన్న ఉద్యోగం పోయింది. పదేళ్ళ కూతురుని భర్తకు తోడుగా పెట్టి తను ఏదైనా పని వెతుక్కోవడానికి వెళ్ళింది మహతి.

రెండు, మూడు ఇళ్ళల్లో వంటమనిషిగా పని దొరికింది. ఒక కుటుంబం భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో ఉదయాన్నే వెళ్ళి వంట చేయాలి..మరొకటి బ్యాచిలర్స్, ఇంకొకరు యాభై ఏడేళ్ళ అతను ఒంటరిగా ఉంటాడు..

ఓ పదిహేను రోజులు బాగానే గడిచాయి.. ఒకరోజు పాప "నేనూ నీతో వస్తా అమ్మా!" అని మారాం చేయడంతో భర్తకు అన్నీ దగ్గరగా అమర్చి, పాపను తీసుకుని పనికి వెళ్ళింది మహతి.అందరూ పాపను ముద్దు చేసేవారు..

వారానికి మూడు, నాలుగు రోజులు పాప వస్తూ ఉండేది మహతితో.అలా వెళ్ళినప్పుడు ఒకరోజు చివరిగా వెళ్ళిన ఇంటిలో వంట చేస్తుండగా పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది..మహతి కంగారుగా ఎక్కడివక్కడే వదిలేసి పరుగున వెళ్ళింది.

"ఏమైందమ్మా?" అనడిగింది పాపను దగ్గరకు తీసుకుని..పాప ఏం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది..

"దేన్నో చూసి భయపడిందేమో.. ఇలా రా బంగారు"అని పిలుస్తున్న మూర్తిని భయంగా చూస్తూ అమ్మను మరింతగా కరుచుకుని పోయింది.

"అంతే అయి ఉంటుంది సార్.." అని పిల్లను కూడా వంటగదిలోకి తీసుకుని వెళ్ళి, పని ముగించుకుని బయటకు వచ్చింది.

గేటు వేసి, తమ ఇంటివైపు దారితీస్తుండగా ఒకమ్మాయి "అక్కా!" అని పిలిచింది.

ఎవరూ.. అన్నట్లు చూసింది మహతి ఆమెవైపు..

ఆమె తటపటాయిస్తున్నట్లుగా చూసింది.

ఈలోగా మూర్తి బయటకు వస్తూ ఉండడంతో ఆమె వడివడిగా వెళ్ళిపోయింది భయపడుతున్నట్లుగా..

ఆమె వైపు చిత్రంగా చూసి ఇంటికి వెళ్ళిపోయింది మహతి.ఆరోజు సాయంత్రం మూర్తి, మహతి వాళ్ళ ఇంటికి వచ్చాడు..అతన్ని తమ ఇంటి దగ్గర చూసి ఆశ్చర్యపోయింది మహతి.

"ఇటువైపు పని ఉండి వచ్చాను..నీ భర్తకు ఆరోగ్యం బాలేదని చెప్పావు కదమ్మా.. ఒకసారి చూసి వెళదామని వచ్చాను. నాకు తెలిసిన డాక్టర్లు ఎవరికైనా సిఫార్సు చేద్దామని.." అన్నాడు.

అతను చూపిస్తున్న ఆ అణువంత ఆదరణకు ఆమె ఉప్పొంగిపోయింది.

"చిన్నూ, నీకోసం చాక్లెట్స్ తెచ్చాను. రా నాన్నా! " అంటూ పిలిచాడు.రాను అన్నట్లు తలూపింది పాప."ఇదిగో నీకోసం బొమ్మ తెచ్చాను.." అంటూ ఓ అందమైన బొమ్మను, చాక్లెట్లను చూపించేసరికి హుషారుగా దగ్గరకు వచ్చింది పాప.

"ఎందుకు సార్,ఇవన్నీ.." మొహమాటంగా అంది మహతి.

"నా మనవరాలిలా అనిపించిందమ్మా, కాదనకు" అన్నాడు.అతని ఆత్మీయతకు కళ్ళు చెమ్మగిల్లాయి మహతికి.

రోజూ మూర్తి తినడానికి ఏదోకటి ఇస్తూ ఉండడంతో పేచీ పెట్టి మరీ వచ్చేది పాప. మూర్తి కూడా ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో తీసుకుని వెళుతూ ఉండేది మహతి.

ఆరోజూ అలాగే పాపను తీసుకుని వెళ్ళింది మహతి.  మూర్తి మీద నమ్మకం కుదరడంతో పనంతా అయ్యేవరకు పాపను గమనించట్లేదు

.పనంతా పూర్తి చేసుకుని పాపకోసం చూస్తే లేదు, మూర్తి కూడా లేడు. ఇద్దరూ బయటకు వెళ్ళారేమో అనుకుని వాళ్ళకోసం ఎదురుచూస్తూ బయట గేటు దగ్గరే నిలబడింది. ఈలోగా ఇంతకుముందు ఓసారి పలకరించిన ఆ అమ్మాయి కనిపించింది..

మహతిని అక్కడ చూసి గబగబా దగ్గరకు వచ్చి "అక్కా,పాపెక్కడ..?" అనడిగింది ఆందోళనగా.ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "సారు తీసుకుని వెళ్ళినట్లున్నారు, వాళ్ళ కోసమే చూస్తున్నా.. ఇంతకీ నువ్వెవరు" అంది మహతి.

"నా గురించి తర్వాత చెప్తాను..పాపను వాడితో పంపకు అక్కా.. నువ్వు కూడా ఇక్కడ పనిచేయకు..అది నీకు చాలా ప్రమాదం" అంది హడావిడిగా..

ఆ మాటలు విని భయపడి "ఏమంటున్నావు నువ్వు..?" అంది వణుకుతున్న స్వరంతో.

"నిజం అక్కా..వాడే కామంతో కళ్ళు మూసుకుని పోయిన పశువు..చిన్నపిల్లలను కూడా వదలకుండా అసభ్యమైన రీతిలో ముట్టుకుంటూ ఏదేదో చేస్తూ ఉంటాడు. అందుకే చెప్తున్నా" అంది ఆ అమ్మాయి..

భయంతో వణికింది మహతి, తన కూతురిని ఏం చేస్తాడో అని.. కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి.

"ఇవ..న్నీ..ఇవన్నీ నీకెలా తెలుసు?" తడబడుతూ అడిగింది మహతి.

"నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ పనిచేసేవారు.. ఆమెకు ఒక పాప, ఎనిమిదేళ్ళు.. మొదట్లో లాలనగా మనవరాలు అన్నట్లు దగ్గరకు తీసుకుని, తర్వాత వాడి వికృత చేష్టలు అన్నీ చూపించాడు..ఆ పసిది చావుబతుకుల మధ్య నాలుగు రోజులు కొట్టుకుని చచ్చిపోయింది..పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా డబ్బుతో అందర్నీ కొనేశాడు..దానితో ఏమీ చేయలేక ఆ పాప తాలూకా వాళ్ళు ఊరొదిలి వెళ్ళిపోయారు.. వీలైనంత తొందరగా ఇక్కడినుండి బయటపడు.." అని గబగబా చెప్పేసి సందు చివరన వస్తూ కనిపించిన మూర్తిని చూసి పారిపోయింది ఆ పిల్ల.

తన కూతురి చేతిని పట్టుకుని వస్తున్న మూర్తికి వడివడిగా ఎదురువెళ్ళి అతని చేతిలో నుండి కూతురిని లాక్కుని దగ్గరకు తీసుకుని "రే...రే.. రేపటినుండి పనిలోకి రానండీ"అని బెదురుగా తడబడుతూ చెప్పేసి పరుగులాంటి నడకతో కూతురిని తీసుకుని వెళ్ళిపోయింది మహతి.

ఆ మర్నాడు భర్త దగ్గర కూతురిని ఉంచి మిగతా ఇళ్ళల్లో పనికి వెళ్ళి వచ్చేలోపు కూతురు కనిపించలేదు.."మూర్తిగారు వచ్చి పాపను తీసుకుని వెళ్ళారు.." చెప్పాడు భర్త.

అది వింటూనే ఒక్కసారిగా నిస్సత్తువ ఆవరించినట్లయ్యి ఉన్నచోటే కూలబడింది..వెంటనే భర్తకు కూడా చెప్పకుండా మూర్తి ఇంటికి పరుగున వెళ్ళింది.

"నా కూతురెక్కడ?" ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా అడిగింది మహతి..

"ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది. చాలా అలిసిపోయినట్లున్నావు, ఇలా కూర్చో,, మాట్లాడుకుందాం" అన్నాడు ఆమెను తినేసేలా చూస్తూ..

ఆ చూపులకు ఒంటిమీద బట్టలు ఉన్నా వివస్త్ర గా ఉన్నట్టు ఫీలయ్యింది..బాధ, ఆవేదన, భయం, కోపం, నిస్సహాయత అన్నీ పోటీపడి ఆమె మీద దాడి చేస్తున్నాయి.. శరీరం అంతా వణుకుతోంది ఆమెకు.

"మాటలతో కాలయాపన ఎందుకులే కానీ, సూటిగా అసలు విషయానికి వచ్చేస్తున్నా.. రాత్రి తొమ్మిది అయ్యేసరికి చక్కగా ముస్తాబై ఇక్కడికి రావాలి..లేదంటే, నీకు నీ కూతురు దక్కదు..ఆ తర్వాత నీ ఇష్టం" అన్నాడు తాపీగా.కాళ్ళకింద భూమి కంపించినట్లు అనిపించింది..

"ఇది.. ఇది మీకు న్యాయం కాదు.. పొట్టకూటి కోసం వస్తే ఇలా చేయమనడం మీకు భావ్యం కాదు.. కూతురిని అన్నారు.. కూతురిని ఈవిధంగా కోరుకోవడం ఏం న్యాయం?? దయచేసి నా బిడ్డను వదిలేయండి..మీ కాళ్ళు పట్టుకుంటాను" అంటూ ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు మూర్తి.

"చూడూ, నేను చెప్పింది చేస్తేనే నీ కూతురు నీ దగ్గరకు వస్తుంది. లేకపోతే, నీ కూతురు ఎక్కడుందో ఈ జన్మలో నువ్వు కనుక్కోలేవు. ఈ వావివరుసలు తో నాకు పనిలేదు.." కర్కశంగా అన్నాడు మూర్తి.

తను ఉన్న పరిస్థితి ఏమిటో బాగా అర్థం అయింది. తప్పించుకోవడం అసంభవం. తన మానప్రాణాల కంటే కూతురి క్షేమం ముఖ్యం అనిపించింది.. కన్నబిడ్డ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది.

పెదవి పలికే మాటకు, చూసే చూపుకు, మనసు పొరల్లో దాగున్న దుర్మార్గానికి సంబంధం లేకుండా ప్రవర్తించే ఇటువంటి వారిని నమ్మినందుకు తననుతానే నిందించుకుంది.

వాడి అరాచకానికి బలయ్యింది. వాడొక్కడే కాదు,వాడి స్నేహితులు మరో ముగ్గురు..రాక్షసత్వానికి ప్రతీక వాళ్ళు.లేచి కుదురుగా రెండు నిమిషాలు కూడా నిలబడలేని పరిస్థితి.. అంతగా హింసించారామెని.

 కూతురిని తీసుకుని బయటకు వచ్చింది. బలవంతంగా అడుగులు వేస్తుంది ఇంటివైపు.. తల్లి స్థితిని చూసి భయపడుతున్న కూతురిని దగ్గరకు తీసుకుని నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఓ క్లినిక్ లోకి వెళ్ళింది. 

అక్కడి డాక్టర్ స్వరూపకు మానవత్వం ఉన్న డాక్టర్ గా మంచిపేరు ఉంది.మహతిని చూసి ఏమీ అడగకుండానే ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. ట్రీట్మెంట్ చేస్తుంటే తన ప్రమేయం లేకుండానే కళ్ళవెంబడి నీళ్ళు కారిపోతున్నాయి. అంత దారుణంగా అత్యాచారం చేశారామెను. గాయాలన్నింటికీ మందు రాసి, ఇంజెక్షన్ చేసి అవసరమైన మందులు ఇచ్చి ధైర్యం చెప్పింది.విరక్తిగా నవ్వుకుంటూ ఇంటికి వచ్చింది. 

నిద్రమాత్రల మత్తులో ఉన్న భర్తని చూసి గుండె బరువెక్కింది..'ఈ జీవితం మోయక తప్పదు. చావలేక బ్రతకాలి. తప్పదు'అనుకుంది.

ఓ రెండు నెలలలో శరీరానికి అయిన గాయాలు పూర్తిగా తగ్గాయి. మనసుకు అయిన గాయానికి మాత్రం మందులేదు. అంతకంతకూ మనోవేదనతో పెరుగుతోంది తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.బయట పనికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కూతురు కనిపించలేదు. భర్తని అడిగితే 'ఇప్పటివరకూ ఇక్కడే ఆడుకుంటూ ఉందే' అన్నాడు కంగారుగా.

"మీరు కంగారు పడకండి, నేను చూస్తాను.."అంటూ భయాన్ని దాచి ధైర్యం చెప్పింది. చుట్టుపక్కల అంతా వెతికినా కనిపించలేదు. ఈలోగా ఫోన్ రింగయ్యింది.

" మరొక్కసారి నువ్వు కావాలి. నీ కూతురు మా దగ్గరే ఉంది. అతితెలివి చూపించకుండా వెంటనే రా!"అని మూర్తి కాల్ చేశాడు.ఈసారి ఏడుపు రాలేదు మహతికి. ఏదో తెలియని తెగింపు వచ్చింది.

వెంటనే డాక్టర్ స్వరూపను కలిసి తను అనుకున్నది చెప్పి, బ్రతిమాలి ఒప్పించింది మహతి. మరో అవకాశం వాళ్ళకు ఇవ్వకూడదు అని బలంగా అనుకుంది.

                      ********

"ఇది నీ చీరకు, జాకెట్టుకు, తలకు రాసుకో.. వాళ్ళు ఓ రెండు గంటలు వరకు స్పృహలో ఉండరు.. అప్పుడు ఏం చేయాలో నేను చూసుకుంటా" అంటూ ఏదో ఇచ్చింది స్వరూప.

సరేనంది మహతి.

స్వరూప చెప్పినట్లుగానే చేసి ఆ నీచుల దగ్గరకు వెళ్ళింది. 

ఒక అసహాయ స్త్రీ ని, అందులోనూ అందంగా ఉన్నామెను తమ గుప్పిట్లో పెట్టుకున్నందుకు పొంగిపోతూ బాటిల్స్ మీద బాటిల్స్ ఖాళీ చేస్తున్నారు.ఆ మత్తులో మహతి దగ్గరకు చేరిన నలుగురూ స్పృహ లేకుండా పడిఉన్నారు. వాళ్ళు అలా పడగానే అప్పటివరకు దాచుకున్న ఫోన్ తీసి స్వరూపకు కాల్ చేసింది. 

ఈలోగా ఇల్లంతా వెతికేసరికి స్టోర్ రూం లో కిందపడి కనిపించింది కూతురు. వెంటనే దగ్గరకు వెళ్ళింది.. ఈలోగా డాక్టర్ వచ్చింది. పాపను చెక్ చేసి ప్రమాదం లేదని చెప్పి, ఆమెను స్నానం చేసి రమ్మని, వేరే బట్టలు ఇచ్చింది. ఆ మందు ప్రభావం తమపైన పడకుండా.మహతి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆఖరి వాడికి ఏదో ఇంజెక్షన్ చేస్తోంది స్వరూప.

"డాక్టర్, అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందా?" ఆందోళనగా అడిగింది మహతి.

"కచ్చితంగా..ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళు నరకయాతన అనుభవించి మరీ ఛస్తారు. ఇంకో పదినిమిషాలలో ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది.ముందుగా నోటిమాట పడిపోతుంది. తర్వాత కాళ్ళు, చేతులు సహకరించవు. మరో గంటకు వాళ్ళ శరీరం వికృతంగా మారి దుర్గంధంతో కూడిన రసి వస్తూ ఉంటుంది. అది విపరీతమైన నొప్పి కలుగచేస్తుంది. 

ఇరవై నాలుగు గంటల్లో బ్రతుకు మీద ఆశ చచ్చిపోయి, మరణం మీద ప్రేమ పెరిగిపోతుంది.మొదటి గంటలోపే ఈ నరకం కంటే చనిపోవడం మేలు అనిపిస్తుంది. కానీ, చావలేరు. మరణం వచ్చేవరకూ ఈ ఇరవై నాలుగు గంటల్లో చిత్రవధ అనుభవించి ఛస్తారు "అంది స్వరూప ఆవేశంగా.

మహతికి సంతోషంతో మాటలు రాలేదు. 

"ఇంతకీ ఈ మెడిసిన్ మీకెలా దొరికింది డాక్టర్?"అడిగింది మహతి.

"నిర్భయ ఘటన జరిగిన సమయంలో ఇటువంటి రాక్షసులను మామూలుగా శిక్షించి వదలకూడదు అనే ఆలోచన వల్ల, నా స్నేహితురాలు ఒకామె ఎవరికీ తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు చేసి కనిపెట్టి, నాకు ఇచ్చింది,, 'రాక్షసత్వం నిండిన నేరస్థులపై ప్రయోగించమంటూ'.

కానీ,నేనే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదంటూ వాదించాను. ఆ మందును నా దగ్గరే పెట్టి దీని అవసరం వస్తే మాత్రం కచ్చితంగా ఉపయోగించమని నాకు ఇచ్చి వెళ్ళింది. అది ఇప్పుడు ఇలా ఉపయోగపడింది"అంది స్వరూప ఉద్వేగంతో.

"మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు డాక్టర్" అంటూ ఆమె కాళ్ళపై పడిపోయింది మహతి.

"ఇది నా బాధ్యత.. ఇటువంటి చీడపురుగులకు మళ్ళీ మళ్ళీ తప్పు చేసే అవకాశం ఇవ్వకూడదు. నేరానికి తగ్గట్లుగా శిక్ష కూడా ఉండాలి. అలా ఉంటేనే నేరం చేయడానికి భయపడతారు. " అని చెప్పి, మహతిని,పాపను తీసుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసేసింది స్వరూప.ఆ తర్వాత ఇరవై నాలుగు గంటలూ ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి నరకయాతన అనుభవించి చనిపోయారు ఆ నలుగురూ.అయిపోయింది.

(ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవడానికి రాసిన మెడిసిన్ ఊహ మాత్రమే.. మళ్ళీ మళ్ళీ తప్పు చేయాలనుకునే నరరూప రాక్షసులకు, ఆడవారిని ఆటబొమ్మలుగా భావించి హింసించే రాక్షసత్వానికి సరైన శిక్ష ఇవ్వాలి అనిపించింది.. ఏమైనా తప్పుగా రాసి ఉంటే మన్నించండి. కల్పిత కథ ఇది. ఓపికగా చదివినందుకు అందరికీ ధన్యవాదాలు అండీ).



Rate this content
Log in

Similar telugu story from Drama