Surekha Devalla

Inspirational Drama

3.5  

Surekha Devalla

Inspirational Drama

దృష్టికోణం

దృష్టికోణం

3 mins
533


ఏవండీ ,సాయంత్రం మనం గుడికి వెళ్ళాలి. మర్చిపోకుండా తొందరగా రండి" అంది నా శ్రీమతి పూజ.

పేరుకు తగ్గట్లుగా ఆ దేవుడి మీద , పూజలు ,పునస్కారాలు మీద ధ్యాస ఎక్కువ.

నాకేమో వాటిమీద అంతగా ధ్యాస ఉండదు. అంటే నాస్తికుడిని కాదు . దేవుడ్ని నమ్ముతాను కానీ ఈ పూజలు ,హోమాలు పేరుతో చేసే ఈ విధానం నాకు నచ్చదు. కానీ గుడికి వెళ్తే మనసంతా ప్రశాంతంగా అనిపిస్తుంది . ఈ ఫీలింగ్ నాకు ఇష్టం.

పెళ్ళిరోజునాడు నా శ్రీమతి కోరిన కోరికను ఎలా కాదంటాను ,అందుకే తప్పక వస్తానని మాట ఇచ్చాను. అందులోనూ మా మొదటి పెళ్ళిరోజాయే.. 

నా శ్రీమతికి వెళ్ళొస్తానని చెప్పి ఆఫీసుకు బయల్దేరాను. దారిపొడుగునా ఏవో ఆలోచనలు.  

ఒక్కొక్కరికి ఒక్కో వ్యసనం ఉంటుంది. కొంతమందికి తాగుడు , తిరుగుడు లాగా ,,,మరికొంతమందికి అతి భక్తి, మూఢనమ్మకాలు లాగా. మన అదుపులో ఉండని ,నిగ్రహించుకోలేని ఏ విషయమైనా వ్యసనం కిందే లెక్క నా దృష్టిలో. 

అలా నాకు ఆలోచించడం అనే ఒక వ్యసనం ఉంది. ఆ ఆలోచనలు ఎప్పుడూ నా కంట్రోల్ లో ఉండవు..ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది నా మనసు.

ఇలా ఏదో ఆలోచిస్తూ ఉండగానే రెడ్ లైట్ వెలిగింది. ఇక తప్పదుగా ఆగాం అందరం..ఇలా ఆగామో లేదో అలా వచ్చేశారు భిక్షగాళ్ళు ఒక ఐదారుగురు.

చాలామంది రూపాయో ,రెండు రూపాయలో వేస్తున్నారు. అది తమ పుణ్యం అనే అకౌంట్ లో జమ చేసుకుందామనో లేక ఎంతోకొంత ఇచ్చేస్తే వీళ్ళ నస ఉండదు అనే అభిప్రాయమో మరి , వాళ్ళకే తెలియాలి.

నాకు మాత్రం డబ్బులు వేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అనిపిస్తుంది.. అందుకే నేనెప్పుడూ వేయను..

ఈలోగా గ్రీన్ సిగ్నల్ పడింది. బయల్దేరాను నేను నా ఆలోచనలకు విరామం ఇచ్చి..

సాయంత్రం ఆఫీస్ అయ్యే టైం లో పార్టీ అంటూ గోల చేస్తున్న ఫ్రెండ్స్ని చిన్న నవ్వుతో తప్పించుకుని మా శ్రీమతి చెప్పిన టైం కి ఇంటికి చేరుకున్నాను..

తను స్నానం చేసి రెడీ అయ్యి కనకాంబరం రంగు చీర కట్టుకుంది..తనని అలా చూస్తుంటే ముద్దమందారంలా అనిపించింది ముద్దుగా..

నేను కూడా తొందరగా రెడీ అయ్యి వచ్చి , తను ప్రేమగా చేసిన స్నాక్స్ గులాబ్ జామ్ ,మిరపకాయ బజ్జీలు ఆరగించి గుడిదారి పట్టాం..

దర్శనం చేసుకుని కొద్దిసేపు అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం..తర్వాత బయటికి వస్తుంటే గుడి మెట్లకి అటువైపు ,ఇటువైపు భిక్షగాళ్ళు కూర్చున్నారు..నేను కొంచెం చిరాగ్గా మొహం పెట్టుకుని కిందకు వచ్చేస్తున్నా..

ఇంతలో "హాయ్ పూజా ,ఎలా ఉన్నావు ..ఎన్నాళ్ళకు కనిపించావు "అనే కొత్త గొంతు వినిపించేసరికి ఆగాను నేను..

"హాయ్ వెన్నెల ,ఏంటి ఈ సర్ప్రైజ్...నేను బాగున్నా ,నువ్వెలా ఉన్నావు" అంటూ సంతోషంగా పలకరించింది నా పూజ..

"రావే ,దర్శనం చేసుకుని మాట్లాడుకుందాం..బాగున్నారా అండీ.. నన్ను గుర్తుపట్టారా..పూజ ఫ్రెండ్ ని....మీరేమీ అనుకోకపోతే మేము కొద్దిసేపు మాట్లాడుకోమా అండీ ,ప్లీజ్ " అంటూ గడగడా మాట్లాడేసింది..

నేను అన్నింటికీ సమాధానంగా నవ్వి సరే అన్నాను..

వాళ్ళు గుడిలోకి వెళ్ళాక కిందకు వెళ్ళి ఒక పక్కగా నిలబడి అక్కడ భిక్షాటన చేసేవాళ్ళని గమనిస్తూ ఉన్నాను..

వారిలో ఒకామె నన్ను ఆకర్షించింది..భిక్షాటన చేస్తున్నా కూడా ఆమె కళ్ళల్లో ఏదో వెలుగు. మిగతా వారిలో లేని సంతృప్తి ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది.. ఇంకొంచెం ఆసక్తిగా ఆమెను గమనించసాగాను...

ఒక పది నిమిషాలకి ఆమె అక్కడి నుండి లేచింది.. పక్కవారితో ఏదో మాట్లాడి తనకు వచ్చిన డబ్బులు తీసుకుని వెళుతోంది ముందుకు.. నాకెందుకో ఆ డబ్బులతో ఆమె ఏం చేస్తుందో తెలుసుకోవాలనిపించింది..

పూజ ఎలాగూ ఇప్పట్లో బయటికి వచ్చేలా కనిపించలేదు..అందుకే ఆమెను ఫాలో అవుతూ వెళ్ళాను..ఆమె ఒక ఇడ్లీ బండి దగ్గర ఆగి ఐదు పేకెట్లు ఇడ్లీలు తీసుకుంది..

తర్వాత అలా ముందుకు వెళ్ళి ఒక పెద్ద చెట్టు ఉన్న చోట ఆగింది.. చుట్టూ పరిసరాలను గమనించాను..అపరిశుభ్రంగా , మురికి కాలువ లాంటి పరిసరాలతో చూడటానికి కూడా అసహ్యంగా అనిపించేలా ఉంది..

ఆమె అక్కడున్న నలుగురు పిల్లలకు ఇడ్లీలు పెట్టి తానూ తింటోంది..ఆ సమయంలో ఆమె మోమున వెలసిన చిరునవ్వు చాలా అపురూపంగా అనిపించింది..

తనకే దిక్కులేని ఈ ప్రపంచంలోకి నలుగురు పసిపిల్లలను తీసుకుని వచ్చిన ఆమె పై కోపం వచ్చింది నాకు..

అప్పుడే అక్కడికి ఒకతను తూలుతూ వచ్చాడు. 

"ఏంటే కట్టుకున్న మొగుడ్ని నేను డబ్బులడిగితే లేవని , ,అమ్మాబాబు ఎవరో తెలియని ఈ దిక్కుమాలినోళ్ళకి కడుపు నింపుతావా " అంటూ ఇంకా ఏవేవో నోటికొచ్చినట్లుగా వాగుతున్నాడు..

ఆమె అతనితో గొడవ పడుతుంది. ధైర్యంగా నిలబడి ఏదో సమాధానం చెప్తోంది.. కానీ అవేమీ నా చెవుకెక్కలేదు..

అందరికీ కళ్ళు ఉన్నా ,చూసేవారి దృష్టికోణం వేరు..నేను చాలామంది అనాథ పిల్లలను చూస్తూ ఉంటాను..అయ్యో పాపం అనుకుని కొద్దిసేపు జాలిపడి నా పనిలో పడిపోతాను..

కానీ ఆమె చేసేది యాచక వృత్తి అయినా కూడా తనతోపాటు మరో నలుగురిని పోషిస్తుంది తనకి ఏమాత్రం సంబంధం లేనివాళ్ళని..

ఆమెలోని అమ్మతనానికి చేతులు జోడించి వెనుతిరిగాను..

ఇప్పుడు నా దృష్టికోణం కూడా మారింది భిక్షాటన చేసేవారి గురించి.

పూజకోసం గుడివైపు అడుగులు వేశాను ప్రశాంతమైన మనసుతో.

అయిపోయింది.

ఓపికగా చదివినందుకు అందరికీ ధన్యవాదాలు అండీ.. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు..థాంక్యూ.


Rate this content
Log in

Similar telugu story from Inspirational