లవ్ ఇన్ అమెరికా – 12
లవ్ ఇన్ అమెరికా – 12
#ప్రయాణం_మొదలు
అయిదురోజుల తరువాత:
స్పృహ వచ్చి కళ్ళు తెరిచాను. బెడ్ మీద ఉన్నాను. ఎదురుగా అమ్మానాన్న నించుని ఉన్నారు. వాళ్ళ పక్కన మార్గరేట్ ఉంది. వీళ్ళకి కొంచెం దూరంలో ఇద్దరు పోలిసులు నించుని ఉన్నారు.
“వి బిలీవ్ యు ఆర్ అల్ రైట్ మేడమ్?” నేను కళ్ళు తెరవగానే ఒక పోలీసు ఆఫీసర్ ముందుకొచ్చి అన్నాడు.
కళ్ళు ఆర్పాను.
“మిమ్మల్ని ఆరోజు ఎటాక్ చేసింది ఇతడేగా?” ఓ ఫోటో చూపిస్తూ అడిగాడు.
తలూపాను.
“వి ఆర్ వెరీ సారీ ఫర్ వాట్ హెపెండ్ టు యు మేడమ్. ఇతడు మిమ్మల్నే కాదు మరో పదహారుమందిని కూడా రేప్ చేశాడు. బట్ మీరు లక్కీ..., ఆ పదహారుమందిని రేప్ చేశాక చంపేశాడు. కానీ మేరీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సాయంతో సకాలంలో వచ్చి మిమ్మల్ని కాపాడగలిగాం”
“ఆంటీ మేరీ ఎలా ఉంది?” వెంటనే అడిగాను.
“ఆమె ఇప్పుడు కోమాలో ఉన్నారు. నీ పక్క వార్డ్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది. వాడు ఆమెని కొట్టి నీ వెంటపడ్డాక ఆమెకి స్పృహ వచ్చింది. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో రక్తం పోతున్నా తన గురించి పట్టించుకోలేదు. దాంతో కోమాలోకి వెళ్లిపోయింది” నాన్న చెప్పారు.
“దేవుడా!!...” కళ్ళు మూసేసుకున్నాను.
ఐతే వెంటనే తెరిచి, “మీరు సకాలంలో రాలేదు ఆఫీసర్స్!” పోలీసులకేసి తీక్షణంగా అన్నాను.
“యా…, బట్… యెస్…. వి ఆర్ రియల్లీ సారీ మేడమ్. వి ఫైల్డ్ ఇన్ అవర్ డ్యూటి”
“మీరు ఇప్పుడే కాదు ఎప్పుడో మీ డ్యూటిలో ఫెయిల్ అయ్యారు. అదే మీరు మీ డ్యూటిని సక్రమంగా చేసుంటే ఆ పదహారుమంది కూడా చనిపోయి ఉండేవారు కాదు”
పోలీసులు ఇద్దరూ మాట్లాడలేదు. నాకు వాదించే ఓపిక లేదు.
రెండుక్షణాల తరువాత ఆ పోలీస్ ఆఫీసరే, “మీ నుంచి ఈ స్టేట్మెంట్ మీద ఒక సిగ్నేచర్ కావాలి” అంటూ పాడ్ నా చేతిదగ్గర పెట్టాడు.
నేను సంతకం పెట్టాక ఇద్దరూ వెళ్ళిపోయారు.
మార్గరేట్ కేసి చూశాను. నా కళ్ళలో భావాన్ని అర్ధం చేసుకున్నట్టు తలూపింది మార్గరేట్.
అలా ఊపుతున్నప్పుడు ఆమె కళ్ళలో నీళ్ళు. అవే నా కళ్ళలో కూడా. నేను మళ్ళీ కళ్ళు మూసేశాను.
మరో అయిదురోజుల తరువాత:
(ఆల్బర్ట్ : 1994-2020)
ఆల్బర్ట్ సమాధి ముందు నించుని ఉన్నాను.
నా మనస్సు నిర్మలంగా ఉంది. మెదడులో ఎలాంటి ఆలోచనలూ లేవు. విచిత్రంగా కన్నీళ్లు కూడా రావట్లేదు. ఇప్పటికీ అరగంట నించి అలాగే నించుని ఉన్నాను. నా మెడని తాకుతున్న అక్కడి చల్లని గాలి ఆరోజు డాన్స్ చేసినప్పుడు నా చెవుల్లో మోగించిన ఆల్బర్ట్ ఊపిరి యొక్క శంఖపు హోరుని తలపిస్తుంది. మరో అరగంట అలానే ఉన్నాను. చివరిగా భారతీయ విధానంలో నమస్కారం చేసి అక్కడ్నించి కదిలాను.
ఐతే ఆ క్షణమే నాకు అర్ధమైపోయింది..., ఆల్బర్ట్ తోనే కాదు, అమెరికాతోనూ నాకు శాశ్వతంగా రుణం తీరిపోయిందని!!..
మూడు సంవత్సరాల తరువాత:
కేఫ్ కాఫి డే, బెంగళూరు – ఇండియా.
సమయం సాయంత్రం ఆరున్నర.
“సో..., ఇదీ నా కథ” నా ఎదురుగా కూర్చున్న అభిషేక్ కేసి చూస్తూ అన్నాను.
దీర్ఘంగా నిట్టూర్చాడు అతడు. అడుగున మిగిలిన ఆ కొంచెం కాఫిని కూడా పీల్చేసి గ్లాస్ ని టేబుల్ మీద పెట్టాడు.
“మీరు ఇంకా ఆల్బర్ట్ ని ప్రేమిస్తున్నారా?” అడిగాడు.
“ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడంకన్నా చిన్న ఉదాహరణ ద్వారా చెప్తే మీకు బాగా అర్ధమవుతుంది”
“చెప్పండి?”
“రేపు ఒకవేళ మనకి పెళ్లైతే..., పెళ్లయ్యాక ఆల్బర్ట్ బ్రతికివస్తే...., ఆ క్షణమే అతడితో వెళ్లిపోతా”
నవ్వాడు.
“ఇదంతా మీకు చెప్పటానికి కారణం ఊహించగలరనే అనుకుంటున్నా..., భార్యాభర్తలు అన్నాక దాపరికాలు ఉండకూడదు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో. అందుకే చెప్పాను. అలాని ఇది తప్ప ఇంకేం ప్రేమ కథలూ లేవా అంటే.., ఉన్నాయి. ఊహ తెలిసినప్పటినుంచి చదువు ముగిసేవరకు ప్రతి తరగతి గదిలోనూ ఓ ప్రేమ కథ ఉంది. కానీ ఏ తరగతి గదిలో మొదలైంది ఆ తరగతి గదిలోనే ముగిసిపోయింది. ఇది మాత్రం మనసులో నిలిచిపోయింది”
“నాకు అర్ధమవుతుంది”
“సరే ఇప్పుడు మీరు చెప్పండి..., నన్ను పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టమేనా?” అడిగాను.
“ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం కన్నా యాక్షన్ ద్వారా చెప్తే మీకు బాగా అర్ధమవుతుంది”
“చెప్పండి?”
ఒక్క ఊదుటున లేచాడు అతడు. నేనూ అప్రయత్నంగా లేచాను.
“ఐతే వెళ్దామా?” అన్నాడు.
“ఎక్కడికి?” ఎక్కడికో అర్ధంకాలేదు.
“మన నిశ్చితార్దానికి ఉంగరాలు కొనాలి కదా?... అసలు అందుకేగా మనం కలవాలి అనుకొంది?... ఇప్పటికే చాలా ఆలస్యమైంది”
నవ్వాను.
బిల్ పే చేసి బయటికి వచ్చాం. అభిషేక్ బైక్ స్టార్ట్ చేయగానే నేను వెళ్ళి వెనుక కూర్చున్నాను. ఇందాక విడివిడిగా కేఫేకి వచ్చిన మేము ఇప్పుడు జంటగా ప్రయాణం
మొదలుపెట్టాం.
ఇదీ నా ‘లవ్ ఇన్ అమెరికా’ కథ... అభిషేక్ కి అంతా చెప్పాను గాని ఆ చీకటిరాత్రి ఫ్రీవేలో జరిగింది మాత్రం చెప్పలేదు. కారణాలు అనవసరం. చెప్పదలుచుకోలేదు అంతే. తప్పొప్పుల మీమాంశ లేదు. ప్రతిఒక్కరి జీవితంలో జీవిత భాగస్వామితో కూడా పంచుకోలేనివి కొన్ని ఉంటాయి. నావరకు నాకు అలాంటివాటిలో ఆ అమావాస్య రాత్రి జరిగింది ఒకటి. పైగా ఈ విషయం అమ్మ, నాన్న, నాకు తప్ప కనీసం తమ్ముడికి కూడా తెలీదు. కాబట్టి అభిషేక్ దగ్గర దాచటం తప్పుగా భావించట్లేదు. కానీ రేపెప్పుడైనా అభిషేక్ కి తెలిసి అడిగినా అవును అంటాను తప్ప మరింకేం మాట్లాడను. ఐతే తదనంతర పరిణామాలు ఎదుర్కోవటానికి మాత్రం సిద్దమే, అవి ఏవైనా సరే!!..
అన్నట్టు అభిషేక్ ఎవరో చెప్పలేదు కదూ?..., ఏ న్యూయార్క్ పెళ్లి మంటపంలో ఐతే ఆల్బర్ట్ కి నా ప్రేమ విషయం చెప్పి ముడివేసుకుందాం అనుకున్నానో ఆ మంటపంలోనే ఈ అభిషేక్ తో నాకు ముడిపడింది. అప్పుడు ముఖం గుర్తుండి పేరు గుర్తులేదన్న ఆంటీ కొడుకే ఈ అభిషేక్. దైవనిర్ణయమో, యాదృచ్చికమో..., ఆ న్యూయార్క్ పెళ్లి మంటపంలోనే నా పెళ్ళికి భీజం పడింది. ఐతే నేను అనుకున్న వ్యక్తితో కాదు, దైవం నిర్ణయించిన వ్యక్తితో!!..
బెంగళూరు సాయంత్రపు వాతావరణం అద్భుతంగా ఉంది. బైక్ సైడ్ మిర్రర్ లో చూస్తే అభిషేక్ ముఖం ఆహ్లాదంగా ఉంది. అతడ్ని కరుచుకుని కూర్చోవాలని ఉంది. కానీ తటపటాయింపు. నా మనసు గ్రహించినట్టున్నాడు, “పెళ్లవుతేనే వాటేసుకోవాలని ఏం లేదు..., పెళ్ళికి ముందు కూడా వాటేసుకోవచ్చు” అన్నాడు అభిషేక్.
వెంటనే వాటేసుకున్నా.
నవ్వాడు అభిషేక్. సైడ్ మిర్రర్ లో నాకు కనిపించింది.
మా బుజ్జి!... ఎంతబాగా నవ్వాడో!!... అప్పటికప్పుడు మనస్సులోనే దిష్టి తీసేశా.
మా అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
******అయిపోయింది******
రచయిత మాట:
పాఠకులకి నమస్కారం...
కథ వ్రాసి చాలా రోజులు అయింది. కొంతమంది మిత్రులు కూడా అడిగారు ఏంటి ఈ మధ్య నీ నుంచి ఏ కథ గాని నవల గాని లేదు ఏంటి అని. నిజానికి నేనూ అదే అనుకుంటున్నా ఏదొకటి వ్రాయాలి అని. ఆలోచిస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి గాని కానీ టైప్ చేయట్లేదు. ఇక లాభం లేదని ఒకమంచి సమయాన(ముహూర్తం ఏం చూడలేదు లేండి) ఫేస్బుక్ లో రేపట్నుంచి మినీ నవల పోస్ట్ చేస్తున్నా అని ప్రకటించేశా.
అదే ‘లవ్ ఇన్ అమెరికా’ గా మీ ముందుకు వచ్చింది.
నిజానికి నేను ఏ కథ ఐనా నవల ఐనా పూర్తిగా అయ్యాక గాని పోస్ట్ చేయటమో లేక ఎవరికైనా పబ్లిషర్ కి పంపటమో చేస్తాను. అలా ఐతే చివరిగా ఒకసారి చూసుకుని ప్లాట్ లో లూప్ హోల్స్ ఉంటే సరిచేసుకోవచ్చు. స్క్రీన్ ప్లే, నేరేషన్ ఇంకా చిక్కగా రాసుకోవచ్చు. కానీ ఇది నేను అనౌన్స్ చేసే ముందు కనీసం హెడ్డింగ్ కూడా పెట్టలేదు. కనీసం ఎప్పుడూ వ్రాసుకునే బుల్లెట్ పాయింట్స్ కూడా వ్రాసుకోలేదు. ఐనా ధైర్యం చేసి అనౌన్స్ చేసేశా. జస్ట్ టు ఛాలెంజ్ మైసెల్ఫ్.
సరే రాద్దాం అనుకున్నాం. కానీ ఏం వ్రాయాలి?.. ఆలోచిస్తే ఎప్పుడో అనుకున్న పాయింట్ – ‘అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది గాని అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని తప్ప ప్రపంచంలో అందర్నీ ప్రేమిస్తాడు’ – అని. దాన్నే డెవలప్ చేయాలి అని నిర్ణయించుకున్నా. ఆలోచిస్తే అబ్బాయి ప్లే బాయ్ టైప్ కాబట్టి అమెరికాలో కథ జరుగుతున్నట్టు వ్రాస్తే బావుంటుంది అనిపించింది. అలా నా కథ ఇండియా నుంచి అమెరికా షిఫ్ట్ అయింది.
ఇప్పుడు ఏ పర్సన్ లో వ్రాయాలి?.. అని ఆలోచన. ఇక్కడ కూడా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఫస్ట్ పర్సన్ లో వ్రాయాలి అని నిర్ణయించుకున్నా. అది కూడా అమ్మాయి కోణంలో, అమ్మాయి చెప్తున్నట్టు వ్రాయాలి అని ఫిక్స్ అయ్యా. ఇంతవరకు నేను ఫస్ట్ పర్సన్ లో కథలు వ్రాసాను గాని నవల ఐతే వ్రాయలేదు. అమ్మాయి కోణంలో ఐతే అసలు వ్రాయలేదు. ఇందులో సఫలం అయ్యాననే భావిస్తున్నాను.
సరే వ్రాద్దాం అని వర్డ్ ఓపెన్ చేశా. వరుసగా మైండ్ లో సీన్స్ అనుకుంటూ వస్తున్నా(ఇప్పుడు కూడా నేను పాయింట్స్ నోట్ చేయలేదు). అలా మొదటి సీన్ వ్రాసా. నా నవల లక్ష్యం అబ్బాయి మీద అమ్మాయికి గల భావావేశాన్ని చూపించటం. అందుకే నేరేషన్ లో descriptive part ఎక్కువ అవుతున్నట్టు అనిపించినా లెక్క చేయకుండా వ్రాసుకుంటూ వెళ్లిపోయా. జనరల్ రీడర్ బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. ఐనా దానికి కూడా సిద్దమయ్యా.
ఇక కథలో లైవ్లినెస్ ఉండాలని పాత్రలు అన్నీ తెలుగులోనే మాట్లాడుతాయి అని ముందే ప్రకటించినా అక్కడక్కడా కొన్ని డైలాగులు ఇంగ్లిష్ లో వ్రాయటం జరిగింది. ముఖ్యంగా హీరోవి. ఇక లాజిక్స్ మిస్ అవకూడదని రేపిస్ట్ అయితేనేమీ, హీరోకి జబ్బు ఐతే నేమి అన్నీ హింట్స్/ఎస్టాబ్లిష్ చేస్తూనే వచ్చాను. ఎందుకంటే జనరల్ వి ఓకేగాని ముఖ్యమైన సీన్స్ establish కాకుండా రాకూడదు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్.
ఇక రెస్పాన్స్ గురించి ఐతే రచయిత మిత్రుల నుంచి రెస్పాన్స్ బానే వచ్చింది. వారి సూచనలు కూడా అందుకున్నాను. ఐతే వారికి ధన్యవాదాలు మాత్రం చెప్పట్లేదు. ఆప్తులకి ధన్యవాదాలు ఎందుకు చెప్పటం? :) ఐతే ఒకరి రెస్పాన్స్ గురించి మాత్రం కశ్చితంగా ప్రస్తావించాలి. ఎన్నో హిట్ సినిమాలకు కథ/మాటలు అందించిన Divakara Babu Madabhushi సర్ నా కథకి కామెంట్ చేయటం ఈ కథ ద్వారా నేను సాధించిన గొప్ప విజయంగా భావిస్తున్నాను. వారికి నా ప్రణామాలు. వారి ఆశీస్సులు సదా నాపై ఉంటాయని ఆశిస్తున్నాను.
మరో మంచి కథతో త్వరలో మీ ముందు ఉంటానని...
మీ హితేష్ కొల్లిపర.