Hitesh Kollipara

Drama Romance

3.7  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 7

లవ్ ఇన్ అమెరికా – 7

7 mins
377


#డబుల్_గేమ్


“....నా ప్రపోజల్ కి మార్గరేట్ ఒప్పుకుంది మగ్”

ఆ మాట తరువాత ఆల్బర్ట్ ఇంకా ఏదేదో చెప్తున్నాడు. కానీ అవేవీ నాకు వినపడట్లేదు. నా కింద నేల చీలిపోతున్న భావన. చెవుల్లో మార్మోగిన ఉరుము శబ్దం తప్ప పంచభూతాలూ స్తంభించిపోయిన అనుభూతి. ఐతే నేను ఇంకా బ్రతికి ఉన్నానని నాకు తెలుస్తుంది. కాకపోతే బ్రతికి ఉన్నానని మాత్రమే తెలుస్తూ ఉంది!!

“ఏంటి మగ్..., మాట్లాడవు?” అన్నాడు ఆల్బర్ట్.   

“......”

“మగ్?...” భుజాలు పట్టుకు కుదిపాడు.

“హో.. గుడ్.. కంగ్రాట్స్... ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు…” కష్ఠం మీద మాట పెగల్చాను.

“యా… ఐ యామ్ సో హ్యాపీ మగ్... ఇదంతా నీవల్లే. నువ్వు షాపింగ్ కి తీసుకెళ్లటం వల్లే. మార్గరేట్ మన్...’’ ఇంకా ఏదో అంటున్నాడు. వినే ఓపికలేదు నాకు - “ఆల్బర్ట్..., ఇక వెళ్దాం...” అన్నాను.

“అప్పుడేనా?... ఇప్పుడేగా వచ్చింది!...”

“వెళ్దాం”

“కాదు మగ్... ఇప్పుడేగా వచ్చింది... కాసేపు ఆగి...”

“ఇప్పుడు నువ్వు వస్తావా నన్ను వెళ్లిపొమ్మంటావా?...” పిచ్చిగా అరిచాను.

హతాశుడయ్యాడు ఆల్బర్ట్. అక్కడున్నవారందరూ వింతగా మావైపు చూశారు. ఐతే అదేమీ పట్టించుకునే స్థితిలో లేను నేను. మనస్సులో ఉప్పొంగుతున్న సంద్రం కళ్లలోకి వచ్చేలోపే వెళ్లిపోవాలి. ఇంకొక్కక్షణం కూడా ఆలస్యం చేయకూడదు. ఏ క్షణమైనా కూలిపోయేలా ఉన్నాను.

“ఓకే.. ఓకే.. మగ్..., ఎందుకు అరుస్తావు?... పదా వెళ్దాం”

ఇద్దరం కార్ లో గెస్ట్ హౌస్ కి తిరుగు ప్రయాణమయ్యాం. అరగంట ప్రయాణం తరువాత గెస్ట్ హౌస్ చేరుకున్నాం. ప్రయాణం చేస్తున్నంతసేపూ ఆల్బర్ట్ మార్గరేట్ గురించి ఏవేవో చెప్తూనే ఉన్నాడు. ఇదివరకు కూడా ఆల్బర్ట్ నాకు తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి చెప్పేవాడు. కానీ అప్పుడు బాధ అనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం బాధ అనిపిస్తుంది. బాధ కూడా కాదు వేధన.

గెస్ట్ హౌస్ రాగానే వేగంగా కార్ దిగాను. “మగ్...” ఆల్బర్ట్ పిలుస్తున్నా వినిపించుకోకుండా రూమ్ కేసి పరిగెత్తాను.

******

దూరం నుంచే రూమ్ బయట డోర్ దగ్గర నాన్న నించుని ఉండటం తెలుస్తుంది. పరుగు ఆపేశాను. నాన్న ఎందుకు అక్కడ ఉన్నారు? అర్ధంకాలేదు. వాచ్ చూస్తే టైమ్ తెల్లవారుఝాము మూడవుతుంది. ఈ టైమ్ లో ఎక్కడికి వెళ్లావు అంటే ఏం చెప్పాలి?...

కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా నాన్నని చేరుకున్నాను.

“నాన్నా... నిద్ర పట్టక... అలా బయటికి” తలొంచుకున్నాను.

“బయటికి?...”

“అంటే..., అది..., బయట కాసేపు నడిస్తే...” నసిగాను.

“హుమ్మ్... అలానేనా వాటర్ ఫాల్స్ దాకా నడుచుకుంటూ వెళ్లావు?” అన్నారు.

చటుక్కున తలెత్తాను. తెలుసన్నట్టు తలూపారు నాన్న.

“అదీ... నాన్నా...”

“ఆల్బర్ట్ ఏమన్నాడు అమ్మా?...”

“మీకు ఆల్బర్ట్ గురించి?...”

“తెలుసురా..., నాకంతా తెలుసు”

ఇక ఆగలేకపోయాను. ఇప్పుడు ఎవరో ఒకరి ఓదార్పు కావాలి నాకు. నాన్న గుండెల మీద వాలిపోయి బరస్ట్ అయిపోయాను. తనివితీరా ఏడ్చాను. నేను శాంతించేవరకూ ఆగారు నాన్న.

“ఆల్బర్ట్ తిరస్కరించాడా అమ్మా?...” తల నిమురుతూ అన్నాడు.

“అసలు నా ప్రేమని చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వలేదు నాన్న. ఆల్బర్ట్ మార్గరేట్ ని ప్రేమిస్తున్నాడు. నేను ప్రేమిస్తున్నా అని చెబ్దామనుకుంటే తన ప్రేమ గురించి చెప్తున్నాడు. ఏం నాన్న..., నన్ను తప్ప అందర్నీ ప్రేమిస్తాడు?. నా ప్రేమని చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వడా? నేను ప్రేమకి అంత పనికిరానిదాన్నా? దుర్మార్గుడు నాన్న ఆల్బర్ట్”

“హ... హ...” చిన్న నవ్వు నవ్వి, “ఒకటి అడుగుతాను చెప్పు?” అన్నారు.

ఏంటన్నట్టు చూశాను.

“మన ఎదురింట్లో ఉండే మార్కెల్ కూడా మీ యూనివర్సిటీనే కదా?”

“ఐతే?”

“నువ్వు తనని ఎందుకు ప్రేమించలేదు?”

నాన్న ఉద్దేశ్యం అర్ధమైంది. ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. లాజికల్ గా ఆ ప్రశ్న కరక్టే ఐనా భావోద్వేగపరంగా కాదు. కనీసం నావరకు కాదు. నేను మాట్లాడలేదు.

“సమాధానం లేదు కదా? ఉండదు. ఎవర్నైనా ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఇందుకు అని చెప్పగలం. కానీ ఎందుకు ప్రేమించలేదు అంటే కారణం చెప్పలేం”

“నేను చెప్పగలను నాన్న..., మార్కెల్ మీద నాకు ప్రేమ కలగలేదు. అదే కారణం”

“అలాగే ఆల్బర్ట్ కి నీ మీద ప్రేమ కలగలేదు అనుకోవచ్చు కదమ్మా?...”

“కానీ నాకు ఆల్బర్ట్ తో ఉన్నంత ఇంటిమసీ మార్కెల్ తో లేదు నాన్న”

“ఆల్బర్ట్ కి నీకన్నా మార్గరేట్ తో ఎక్కువ ఇంటిమసీ ఉండి ఉండచ్చు కదమ్మా?...”

“లేదు నాన్న. ఆల్బర్ట్ కి అన్నీ నేనే. నాతో తన ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటాడు”

“అయ్యుండచ్చు కాదనను. కానీ దానర్ధం వేరేవారితో షేర్ చేసుకోడని కాదుగా?”

ఆల్బర్ట్ నాతో కాకుండా వేరేవారితో కూడా తన భావాలని షేర్ చేసుకుంటాడా?... నాతో సమానంగా, నాకంటే ఎక్కువ ప్రాధాన్యం కలిగిన వ్యక్తులు తన జీవితంలో ఉన్నారా?... ఈ ఆలోచన నాకెప్పుడూ రాలేదు. కానీ నిజమేగా..., ఆల్బర్ట్ చాలా ఎనర్జిటిక్ అండ్ ఎక్ష్ప్రసివ్. ఎంతోమందితో స్నేహం చేస్తాడు. తనకి నేను బెస్ట్ ఫ్రెండ్ నే కావచ్చు. కానీ నేను మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ ని అవ్వాలని రూలేం లేదుగా. దీనికీ నాదగ్గర సమాధానం లేదు. మళ్ళీ మౌనం వహించాను.

“ప్రేమించటం మన చేతుల్లో ఉంది. కానీ ప్రేమించబడటం మన చేతుల్లో లేదు. ఆల్బర్ట్ మీద నీకు ప్రేమ అనే భావన కలిగింది. కానీ అతడికి నీమీద స్నేహం దగ్గరే అది ఆగిపోయింది. ఇద్దరిదీ తప్పులేదు. నిజాలు జీర్ణించుకోవటం కష్టమే. కానీ జీవితం అంటే అంతే”

ఆల్బర్ట్ కి నా మీద ‘ప్రేమ’ అనే భావన కలగలేదా?... మరి ఇందాక అతడి కళ్ళల్లో ఆ మెరుపు?... నా ముఖాన్ని అతడు దోసిట్లోకి తీసుకోవటం?... అదంతా స్నేహమేనా?... ఖశ్చితంగా కాదు! మరెంటి? ఆకర్షణ!? లేదు..., ఆ కళ్ళలో ఆకర్షణ కన్నా ఆరాధనే కనిపించింది.

ఆలోచిస్తుంటే మెదడు బద్దలవుతుందేమో అనిపిస్తుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. అసలు అక్కడి వాతావరణంలో ఊపిరి ఆడట్లేదు.

“నాన్న..., మనం వాషింగ్ టన్ వెళ్లిపోదాం నాన్న. ఇప్పుడే... ఈ క్షణమే... ఇంకొక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను”

“లేదురా..., భరద్వాజ్ గారు రేపు రిసెప్షన్ పెట్టిందే హోలీ పండుగ కలిసివస్తుందని. అందరం కలిసి హోలీ ఆడాలని ఆయన కోరిక. అందుకే ఈ విధంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు వెళ్లిపోతే బాగుండదు”

నేను మాట్లాడలేదు.

“వెళ్ళి పడుకోమ్మా..., ఎక్కువ ఆలోచించకు”

నేను తలూపి రూమ్ లోకి నడిచాను.

నాన్న వెళ్లిపోతున్నవాడల్లా వెనక్కి తిరిగి, “మేఘనా..., ప్రేమలో ఓడిపోవటం బాధగానే ఉంటుంది. కానీ ఆ బాధకు మూల్యం మాత్రం జీవితం కాదు. అది గుర్తుపెట్టుకో” అన్నారు.

నాన్న భావం అర్ధమైంది. ఇంతరాత్రి రూమ్ ముందు ఎందుకు వెయిట్ చేస్తూ ఉన్నారో కూడా అర్ధమైంది. వెంటనే వెళ్ళి నాన్నని కౌగలించుకున్నాను. క్షణంసేపు అలా ఉండి, “మీరు పడుకోండి నాన్న..., నాకు నిద్ర వస్తుంది. రేపు మాట్లాడుకుందాం” అన్నాను.

నుదుటిని ముద్దాడి వెళ్లిపోయాడు నాన్న.

******

హోస్టన్ నుంచి అప్పుడే వాషింగ్ టన్ షిఫ్ట్ అయ్యాం. గ్రోసరీ షాప్ నుంచి తిరిగివస్తూ అమ్మా, నేనూ రోడ్ మీద నడుస్తున్నాం. సాయంత్రం సమయం. అప్పుడే... అక్కడే... రోడ్ పక్కన సందులోపలికి కరెంట్ స్తంభం చాటున... ఇద్దరు వ్యక్తులు... లోకాన్ని మర్చిపోయినట్టు... వారికివారే లోకం అన్నట్టు... ఒకరి కౌగిలిలో ఒకరు... మమేకమై...

“చూడవే వాడు..., సిగ్గులేకుండా ఆ అమ్మాయిని...” - అమ్మ.

తలతిప్పి చూశాను.

“తప్పు అటువైపు చూడకు...”

నేను చూశాను. అతడు తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. నేను చూడటం వాడు చూడలేదు.

క్షణంసేపు చూసి తల తిప్పేశాను. ఐతే నాలో ఉత్సుకత ఊరుకోలేదు. సందు మలుపు తిరుగుతుండంగా మళ్ళీ చూడాలనిపించింది. చూశాను. ఇప్పుడు అమ్మాయి లేదు. వాడు మాత్రమే ఉన్నాడు. నన్నే చూస్తున్నాడు. నేను సందు మలుపు తిరిగుతున్నా అనబోతుండగా నాకేసి కన్ను కొట్టాడు.

‘‘స్టూపిడ్!!...”

“మేఘనా... మేఘనా...”

అమ్మ పిలుపుతో ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. ఎదురుగా కూర్చుని ఉంది. అంటే కల గన్నాను? కానీ కలైనా నిజంగా జరిగింది ఇదే. ఆల్బర్ట్ ని నేను మొదటిసారి చూసింది అలానే. అతడి మీద నా మొదటి అభిప్రాయం ‘స్టూపిడ్’ అనే.

“ఏంటమ్మా?...” మత్తుగా అన్నాను.

“ఇంకా పడుకునే ఉన్నావు?... లే..., లేచి ఈ తెల్ల గౌను వేసుకో. బయట అందరూ హోలీ ఆడుతున్నారు. ఇంకా పడుకుని ఉండటం బాగోదు. ఇవన్నీ భరద్వాజ్ గారి అరేంజ్మెంట్స్. ఇదైన వెంటనే రిసెప్షన్. దానికి కూడా రెడీ అవ్వాలి”

అప్పుడు గమనించాను. అమ్మ కూడా తెల్లటి గౌనులోనే ఉంది. అక్కడక్కడా రంగు మరకలు కూడా ఉన్నాయి. “లేచి ముఖం కడుక్కుని త్వరగా బయటకి రా...” అంటూ లేచి వెళ్లబోయింది. చేయి దొరకబుచ్చుకుని కూర్చోబెట్టాను.

“రాత్రి నాన్నని పంపినందుకు థాంక్స్ అమ్మా...” అన్నాను.

నవ్వింది.

“నిన్న శ్రావ్య ‘వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నారా ఆంటీ’ అని అడిగింది. ‘ఎందుకు?’ అన్నాను. ‘మేఘన అడిగిందిగా’ అంది. అర్ధమైంది. ఎందుకైనా మంచిదని మోరల్ సపోర్ట్ కోసం మీ నాన్నగారిని పంపించా. కానీ ఒకటి..., నువ్వు అలా ఆ అబ్బాయితో అలా ఒంటరిగా అర్ధరాత్రి వాటర్ ఫాల్స్ కి వెళ్ళటం మాత్రం నాకు నచ్చలేదు”

“ఐ యామ్ సారీ అమ్మా...”

నవ్వి వెళ్లిపోయింది అమ్మ.

నేను ఆలోచనల్లో పడిపోయాను. నాకు ఆల్బర్ట్ గురించి ఎప్పుడు కల వచ్చినా నేనూ, ఆల్బర్ట్ మాత్రమే కలిసి ఉన్నట్టు కల వచ్చేది. కానీ ఈసారి ఆల్బర్ట్ వేరే అమ్మాయితో ఉన్న కల వచ్చింది. అంటే అతడు నాకు పూర్తిగా దూరం అయిపోయినట్టు నా మనసు నాకు చెప్పాలని చూస్తుందా? మరి నిన్న అతడి కళ్ళలో నాపై కనిపించిన ఆరాధనా భావం?... ఏమో అంతా గందరగోళం!

ఆలోచిస్తూనే లేచాను. బాత్ రూమ్ వైపు నడుస్తుంటే అప్పుడు వినిపించింది బయటనించి, “నో...” అంటూ సమీపిస్తున్న ఆల్బర్ట్ కంఠం.

వెంటనే వెనక్కి తిరిగాను.

సడన్ గా తలుపు దగ్గర ప్రత్యక్షమయ్యాడు ఆల్బర్ట్. ఎవరో తరుముతున్నట్టు దూసుకు వస్తున్నాడు.

“వాట్?...” నేను అంటుండగానే,“సేవ్ మీ మగ్....” అంటూ వచ్చి నన్ను గుద్దుకున్నాడు.

ఫోర్స్ కి వెనక్కి వెలికిలా కింద పడిపోతూ నేను, అదే ఫోర్స్ కారణంగా నా మీద పడబోతూ అతడూ గాల్లో ఉన్నాము. మేము గాల్లో ఉన్నప్పుడే నాకు జరగబోయే పరిణామం అర్ధమైపోయింది. కింద పడగానే అతడి పెదాలు నా పెదాలని సూటిగా తాకుతాయి.

లేదు అలా జరక్కూడదు..., జరగటానికి వీల్లేదు!

క్షణంలో పదోవంతు సమయంలోనే తలని పక్కకు తిప్పేశాను.

నేను పడ్డాను. అతడు వచ్చి నామీద పడ్డాడు. అనుకున్నట్టుగానే అతడి పెదాలు నన్ను తాకాయి. ఐతే నేను ముఖాన్ని పక్కకు తిప్పేయటంతో నా పెదాల్ని కాకుండా నా దవడ కండరాన్ని తాకాయి.

ఐతే ఇది నాకు అనుకోకుండా జరిగిన పరిణామంలా అనిపించలేదు. ఆల్బర్టే కావాలని కల్పించుకుని చేసిన ప్రయత్నంలా ఉంది. ఎందుకంటే పడినా కూడా ప్రయత్నిస్తే ఆల్బర్ట్ పెదాలు నన్ను తాకకుండా ఆపుకోగలడు. కానీ ఆల్బర్ట్ అలా ఆపుకోకుండా తన పెదాల్ని తాకించాడు. అది కూడా పడితే కలిగే ఒత్తిడికన్నా రెండింతలు ఒత్తిడితో తాకాడు.

అంటే కావాలనే చేశాడు!

కానీ ఎందుకు?

కానీ ఇదే నేను ఆల్బర్ట్ నుంచి అందుకున్న మొదటి ముద్దు!!

“హ్యాపీ హోలీ మగ్...” అన్నాడు ఆల్బర్ట్.

అతడింకా నామీదే ఉన్నాడు. నేను అతడి కళ్లలోకే చూస్తూ ఉన్నాను.

“నిన్నే మగ్... హ్యాపీ హోలీ” మళ్ళీ అన్నాడు.

“ముందు లే...”

“హొ.. సారీ..” అంటూ లేచాడు. “హ్యాపీ హోలీ..” మళ్ళీ చెప్పాడు.

“ఇలా వచ్చి మీద పడిపోయావ్..., కొంచెం కూడా సెన్స్ లేదా?” లేచి నించుంటూ అన్నాను.

“నా తప్పేం లేదు మగ్..., ఇదంతా మీ తమ్ముడి పనే. ఐ వస్ స్లీపింగ్ కోజీలి ఆన్ బెంచ్ ఇన్ ద గార్డెన్ అండ్ దెన్ హి కేమ్ అండ్ స్ప్రింక్డ్ వాటర్ ఆన్ మీ. లేటర్ ఐ కేమ్ టు నో దట్ టుడె ఈజ్ ఫెస్టివల్ డే. బట్ మగ్..., ఐ లవ్ దిస్ ఫెస్టివల్. వెరీ కలర్ ఫుల్!!” నన్ను గుద్దింది అసలు పట్టనట్టు చెప్పుకుపోయాడు ఆల్బర్ట్.

నేను తననే చూస్తూ నించున్నాను. అతడు తెల్ల బట్టలు వేసుకోలేదు గాని రంగులు మాత్రం అంటుకుని ఉన్నాయి. అతడు ఇంకా ఏదో చెప్పబోయాడు. నేను అడ్డుకుని, “నువ్వు బయటకి వెళ్తే నేను పది నిమిషాల్లో వస్తా” అన్నాను.

“కానీ మగ్...”

నేను అతడి మాటలు వినకుండా అతడి వీపు మీద చేతులు వేసి బయటకి నెట్టుకుంటూ వెళ్ళాను. అతడు బిక్కమొహం వేసి ఏదో అనుకుంటూ వెళ్లిపోయాడు. నేను చుట్టూ చూశాను. ఆర్యన్ జాడ అక్కడెక్కడా లేదు.

ఫిక్స్!... ఇదిఆల్బర్ట్ కావాలని చేసిన పనే!!

కానీ ఎందుకు?... ఏమిటి అతడి ఉద్దేశ్యం?... అర్ధంకావట్లేదు. ఆలోచిస్తూనే బాత్ రూమ్ వైపు నడిచాను. అప్పుడు వినిపించింది ‘బీప్’ అని శబ్దం - వాట్సాప్ శబ్దం.

కిందకి చూస్తే నేల మీద ఆల్బర్ట్ సెల్ పడి ఉంది, ఇందాక జరిగిన అలజడిలో జేబులోంచి పడిపోయినట్టు ఉంది.

తీసి మంచం మీద పెట్టబోతూ చూస్తే మార్గరేట్ నుంచి వాట్సాప్ మెసేజ్!

నా కళ్ళు తీక్షణమయ్యాయి.

చూద్దామా?... వద్దా?...

పరుల మెసేజ్ చూడటం తప్పు..., ఐతే మార్గరేట్ మెసేజ్ చూడటం తప్పుకాదు!!

అవును!

వెంటనే మెసేజ్ ఓపెన్ చేశాను.

“బయల్దేరావా?”

పాపం విరహం తట్టుకోలేకపోతున్నట్టు ఉంది!

మరింత కిందకి స్క్రోల్ చేశాను.

“మేఘన చాలా బాధపడి ఉంటుంది” మార్గరేట్ నుంచి మెసేజ్.

నా గురించి?

“చాలా” దానికి ఆల్బర్ట్ రిప్లై.

మొదట్నించి వాళ్ళ కాన్వర్సేషన్ చదవటానికి పూర్తిగా కిందకి స్క్రోల్ చేశాను. మొదటి మెసేజ్ ఆల్బర్ట్ పెట్టాడు. అదీ నిన్న రాత్రి 2:50కి పెట్టాడు. అంటే మేము వాటర్ ఫాల్స్ నుంచి వచ్చేసిన తరువాత.

వాట్సాప్ కాన్వర్సేషన్:

“తను నాకు ప్రపోజ్ చేయబోయింది” – ఆల్బర్ట్.

“చేసిందా?” – మార్గరేట్.

“లేదు. చేద్దామని నన్ను వాటర్ ఫాల్స్ కి తీసుకెళ్లింది”

“నువ్వేమన్నావ్?”

“తనకి చెప్పే ఛాన్స్ ఇవ్వలేదు. ప్రపోజ్ చేసేలోపే నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాను”

“తను నిన్ను గాఢంగా ప్రేమిస్తుంది”

“నాకు తెలుసు”

“మేఘన చాలా బాధపడి ఉంటుంది”

“చాలా”

“నువ్వు ఎలా ఉన్నావ్?”

“ఫీలింగ్ బెటర్”

“బయల్దేరుతున్నావా?”

“లేదు. రేపు”

“ఇప్పుడు వచ్చేయ్ ఆల్బర్ట్”

“లేదు. రేపు బయల్దేరుతా”

కాన్వర్సేషన్ అయిపోయింది.

అంటే నేను ఆల్బర్ట్ ని ప్రేమిస్తున్న విషయం ఆల్బర్ట్ కి తెలుసు!?... కానీ తెలీనట్టు నటించాడు. నేను తనకి ప్రపోజ్ చేయబోతున్నా అని గ్రహించి నన్ను చేయనివ్వలేదు. కానీ ఇప్పుడొచ్చి ముద్దు పెట్టాలని చూశాడు. అంటే నాతో ఆల్బర్ట్ డబుల్ గేమ్ ఆడుతున్నాడా?.. మార్గరేట్, ఆల్బర్ట్ ఇద్దరూ కలిసి ఆడుతున్నారా?... కానీ ఎందుకు??...

నాలో ‘కల’వరం!!



Rate this content
Log in

Similar telugu story from Drama