Hitesh Kollipara

Drama Romance

4.2  

Hitesh Kollipara

Drama Romance

లవ్ ఇన్ అమెరికా – 6

లవ్ ఇన్ అమెరికా – 6

8 mins
602


#ఏమవుతుంది?


మర్నాడు ఉదయం శ్రావ్య - అదే భరద్వాజ్ అంకుల్ కూతురు పెళ్ళికి న్యూయార్క్ వెళ్ళటానికి ఇంటిల్లిపాదిమీ రెడీ అవుతున్నాము. నిన్న అమ్మ అన్న మాటలతో నేనే ఆల్బర్ట్ కి ప్రపోజ్ చేయాలని నిశ్చయానికి వచ్చాను. న్యూయార్క్ పెళ్లి మంటపమే అందుకు వేదికగా ఫిక్స్ చేశాను. ఒకపక్క అమ్మకి సాయం చేస్తూనే మరోపక్క గుమ్మంకేసి ఆల్బర్ట్ కోసం దృష్టినిలిపాను. ఇంకో అరగంటలో న్యూయార్ ఫ్లయిట్ ఉంది. కానీ ఇంకా ఆల్బర్ట్ జాడ లేదు. నాకు ఫోన్ చేయాలనిపించలేదు. నిన్న మాల్ నుంచి లిట్రల్ గా గెంటినంత పని చేశాడు ఆల్బర్ట్. అదీ దానికోసం. తరువాత నేను మెసేజ్ చేశాక వస్తానని రిప్లై ఐతే ఇచ్చాడు గాని కనీసం తరువాత తిరిగి ఫోన్ కూడా చేయలేదు. అలాంటివాడికి నేనెంటి ఫోన్ చేసేది? కానీ ఒకవేళ ఆల్బర్ట్ రాకపోతే?... నేను ఆలోచనల్లో ఉండగానే బయటనించి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆర్యన్ –

“సిస్... ఆల్బర్ట్ వచ్చాడు...” అన్నాడు.

నేను చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేసి బయటకి పరిగెత్తాను.

అమ్మ తమ్ముడికేసి ఒక సీరియస్ లుక్ ఇచ్చి నాతోపాటు బయటకి వచ్చింది.

“వాడెందుకు వచ్చాడు?” అమ్మ నాతో అంది.

“అదెందుకు వచ్చింది?” నేను అంటూ ఆల్బర్ట్ కార్ కేసి నడిచాను.

“హాయ్ మగ్..., గుడ్ మార్నింగ్!” కార్ లోంచి దిగుతూ అన్నాడు ఆల్బర్ట్.

“హాయి మేఘన్..., యు లుక్ స్టన్నింగ్ ఇన్ దిస్ అటైర్” తను కూడా దిగుతూ అంది మార్గరేట్.

పొడుగాటి లెహంగా ధరించి దాని మీద రాళ్ళు పొదిగిన కాషాయరంగు బ్లౌజ్ వేశాను నేను. దానికి సహజమైన ఇండియన్ మేకప్ యాడ్ చేసి చూడగానే ఎవరైనా స్టన్నింగ్ అనకపోతే వారికి టేస్ట్ లేదనేవిధంగానే తయారయ్యాను. ముఖ్యంగా ఆల్బర్ట్ స్టన్ అవ్వాలనేదే నా ధ్యేయం. నేను మార్గరేట్ కాంప్లిమెంట్ కి ఓ స్మైల్ విసిరి నీ సంగతేంటి ఆల్బర్ట్ కేసి చూశాను.

ఐతే ఆల్బర్ట్ మాత్రం కనీసం రికగ్నైజ్ కూడా చేయనట్టు, “హేయ్ మగ్..., మార్గరేట్ కూడా మనతోపాటు వస్తుంది. తనకి ఇండియన్ వెడ్డింగ్ చూడాలని కోరిక అంట. నిన్న నువ్వు మెసేజ్ చేసినప్పుడు తనకి చెప్పాను. వస్తానంది. రమ్మన్నాను” అన్నాడు.

బాధనిపించింది. కానీ బయటపడకుండా తలూపాను. ఇంతలో అమ్మ పిలిచింది.

“వాడిని ఎందుకు పిలిచావు?...” వెళ్ళగానే అడిగింది. 

“ఊరికే..., మన స్టయిల్ ఆఫ్ వెడ్డింగ్ చూపిద్దామని”

ఏమనుకుందో ఏమో, “సరే..., కానీ నీ కారణంగా అక్కడ ఎటువంటి రచ్చా జరక్కూడదు” అంది.

నేను తలూపాను.

అందరం కలిసి ఎయిర్పోర్టు చేరుకున్నాం. వాషింగ్ టన్ నుంచి న్యూయార్క్ కి నాన్స్టాప్ ఫ్లయిట్ ఐతే గంటా ఐదు నిమిషాలు ప్రయాణసమయం. లక్కీగా అందరికీ అందులోనే టికెట్స్ దొరికాయి. త్రీ-సీటర్ ఉన్నవైపు మధ్యలో ఆల్బర్ట్, అతడి చెరోపక్క నేను, మార్గరేట్ కూర్చునే విధంగా సీటింగ్ వచ్చింది. అది నాకు నచ్చలేదు. వాళ్ళిద్దరికి మధ్యలో నేను కూర్చునే విధంగా సీటింగ్ మార్చమని నేను ఫ్లయిట్ అట్టెండెంట్ ని రిక్వస్ట్ చేశాను.

“గంటలో న్యూయార్క్ చేరిపోతాం..., అవసరమా సీటింగ్ మార్పు?” అన్నాడు ఆల్బర్ట్.

“నాకు ఈ సీట్ కన్ఫర్ట్ బుల్ గా లేదు”

నేను రిక్వస్ట్ చేసిన అరగంటకి సీట్ మార్చింది ఫ్లయిట్ అటెండెంట్. కాకపోతే ఆల్బర్ట్ ని అంతేవుంచి నా ప్లేస్ లో మార్గరేట్ ని, మార్గరేట్ ప్లేస్ లోకి నన్నూ మార్చింది.

తింగరి మొహంది!

మార్గరేట్ నవ్వటం నా దృష్టిని దాటిపోలేదు. కాకపోతే అది నిజంగా నవ్విందా లేక నా ఊహా అనేదే స్పష్టత లేదు.

ఫ్లయిట్ న్యూయార్క్ చేరుకుంది. అక్కడినుంచి మళ్ళీ రెండుగంటల కార్ ప్రయాణం తరువాత సిటికి దూరంగా ఒక గెస్ట్ హౌస్ లాంటి దానికి చేరుకున్నాం. అక్కడే పెళ్లి జరిగేది.

******

నిజానికి దాన్ని గెస్ట్ హౌస్ అని పిలుస్తున్నారు గాని నిజానికి అది ఒక మాన్షన్ హౌస్ లా ఉంది. పెళ్లి, విడిది అన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. భరద్వాజ్ అంకుల్ వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఉన్న లీడింగ్ కమ్యూనిటిలో డబ్బున్నవాళ్లు. ఐతే డబ్బున్న పొగరు ఏమాత్రం చూపించరు. పైగా నాన్న మంచితనానికి మిత్రులు కూడా. మేము ఇక్కడికి వచ్చిన కొత్తల్లో వాళ్ళే మాకు కుదురుకునేవరకూ సాయం చేశారు. అంకుల్ కూతురు శ్రావ్య కూడా మంచిదే.

మేము లోపలికి వెళ్ళగానే, “మీరు ఇంత గొప్పగా మ్యారేజ్ చేసుకుంటారా?” ఆశ్చర్యంగా నోరు తెరిచింది మార్గరేట్. గొప్పగా అంటే ఇంత ‘రిచ్’గానా అని తన అర్ధం అని విప్పిచెప్పకుండానే అర్ధమైంది నాకు.

“నాక్కూడా షాకింగ్ గానే ఉంది” అన్నాడు ఆల్బర్ట్.

నేను మాట్లాడలేదు. స్టేజ్ మీదకి వెళ్ళి పర్సనల్ గా శ్రావ్యకి విషెస్ చెప్పి మళ్ళీ వీళ్ల దగ్గరికి వచ్చాను.

“మీ ఇండియన్స్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకునేంత డబ్బున్నోళ్ళు ఐతే పేదోళ్ళు అయినట్టు జాబ్స్ కోసం మా దేశానికి ఎందుకు రావటం?...” నిజానికి మాములుగానే అడిగినట్టు అంది మార్గరేట్.

ఐతే అసలే చిరాకుతో ఉండటం, పైగా అదిక్కడ ఉండటం ఇష్టం లేని నేను నేను అదిచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు.

“చూడు మార్గరేట్..., నేను నిన్ను పిలవలేదు. ఐనా వచ్చావు. సరే. కానీ గౌరవాన్ని కాపాడుకోకుండా ఇలా పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడేటట్టు ఐతే నిర్మొహమాటంగా వెళ్లిపోవచ్చు” నెమ్మదిగానే అన్నా దృఢంగానే అన్నాను.

నెత్తుటిచుక్క లేదు మార్గరేట్ మొహంలో. ఆల్బర్ట్ ఐతే కొంచెం అనీజీగా కదిలాడు. ఐతే నేను ఇద్దర్నీ పట్టించుకోదలుచుకోలేదు. ఇంతలో అమ్మ పిలిస్తే వెళ్ళాను. నేను వెళ్ళగానే,

“హా..., ఇదిగో మా అమ్మాయి మేఘన. ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది” అంటూ అక్కడే ఉన్న ఆంటీకి (ముఖం గుర్తుంది గాని పేరు గుర్తులేదు) పరిచయం చేసింది.

“నమస్తే ఆంటీ” అన్నాను.

ఆంటీ నవ్వింది.

“మేఘా..., వెళ్ళి చీర కట్టుకో. ప్రెజెంటేషన్ ఇవ్వాలి” అంది అమ్మ.

నేను సరే అన్నట్టు తలూపి అక్కడి నుండి కదిలాను.

“మొన్నే ఇండియాలో మేఘన నాన్నగారు ఆయన తమ్ముడి ద్వారా రెండు కోట్లు పెట్టి స్థలం కొన్నారు” ఛేంజింగ్ రూమ్ కి వెళ్తుంటే అమ్మ మాటలు లీలగా వినిపించాయి.

ఐతే అవేవీ పట్టించుకోకుండా రూమ్ కెళ్ళి చీర మార్చుకుంటూ ఆలోచనల్లో పడిపోయాను. బహుశా మార్గరేట్ ని అలా అని ఉండాల్సింది కాదు. పాపం హర్టైనట్టు ఉంది. సారీ చెప్పాలి అనుకున్నాను. అనుకున్నంతలోనే మరో ఆలోచన కూడా వచ్చింది. అవునూ…, ఎప్పుడూ లేంది అమ్మ ఎందుకు ఆస్తుల గురించి మాట్లాడుతున్నట్టు?... అసలు భారతీయులు ఎప్పుడెప్పుడు ఆస్తుల విషయం ప్రస్తావనకి తెస్తారు?... ఒకటి పంపకాలప్పుడు. రెండు సంబంధాలు చూసేటప్పుడు. ఎంత ఎక్కువ ఆస్తి ఉంటే అంత గొప్ప సంబంధం వస్తుందని నమ్మకం. అంటే ఇప్పుడు అమ్మ కూడా?!... హమ్మ మమ్మీయో... ఎంత ప్లాన్ వేశావ్? గుండాగిపోయింది ఒక్కక్షణం. ఇంటికి వెళ్ళగానే కడిగేయాలి అనుకున్నాను. ఈ ఆలోచనలతోనే చీర కట్టుకున్నాను. సెట్ అయిందా లేదా అన్న పట్టింపు లేదు. ఆల్బర్ట్ గుర్తించని అలంకరణ సెట్ ఐతే ఏంటి అవకపోతే ఏంటి?!...

అమ్మని చేరుకుని నాన్నని పిలిచి కుటుంబంతో సహ స్టేజ్ ఎక్కి ప్రెజంటేషన్ ఇచ్చి ఫోటోలు దిగాము. అయ్యాక ఇందాక ఆల్బర్ట్ వాళ్ళని వదిలేసిన చోటుకి వెళ్ళాను. చూస్తే అక్కడ వాళ్ళు లేరు. మొత్తం వెతికాను. చివరికి ఎంట్రన్స్ దగ్గర కనిపించాడు ఆల్బర్ట్. కాకపోతే అటువైపుకి తిరిగి ఉన్నాడు. వెళ్ళి వెనుక నుంచే భుజం మీద చేయి వేశాను. ఇటు తిరిగాడు.

“వావ్... మగ్... యు… యు లుక్... యు లుక్…” నా నిలువెల్లా చూస్తూ ఆగిపోయాడు.

ఆల్బర్ట్ నాకు కాంప్లిమెంట్ ఇవ్వబోతున్నాడు!? దెబ్బకి చిరాకంతా ఎగిరిపోయింది నాలో.

“ఉమ్... సే… ఐ లుక్?...” ముఖాన్ని చాటంత చేసుకుని అన్నాను.

“ఉమ్... యు… యు… వేర్ డిడ్ యు గో?” తమాయించుకుంటూ అన్నాడు.

యు లుక్ మ్యాగ్నిఫిషియంట్ ఆర్ బ్యూటిఫుల్ అని ఏదో అనబోయాడు. కానీ అనలేదు. ఎందుకు ఆల్బర్ట్..., ఎందుకు బయటపడటానికి సంకోచిస్తున్నావు? అర్ధంకాలేదు. ఐతే అతడి కళ్ళలో నా అందాన్ని మెచ్చిన మెరుపు నాకు తెలుస్తూనే ఉంది.

“ఎక్కడికి వెళ్లావు?” మళ్ళీ అడిగాడు.

“అది నేను అడగాలి. నువ్వేంటి ఇక్కడ ఉన్నావ్? మార్గరేట్ ఏది?” ఎదురు ప్రశ్నించాను.

“మార్గరేట్ వాషింగ్ టన్ వెళ్లిపోయింది”

“ఏంటి?...” ఆశ్చర్యంగా అన్నాను.

“యా..., తనకేదో అర్జెంట్ అని ఇంటినించి కాల్ వస్తే వెళ్లింది”

“నేను ఇందాక అలా మాట్లాడినందుకు హార్ట్ అయిందా?”

“లేదు. నిజంగానే ఏదో అర్జెంట్ అంట... అందుకు.... వెళ్ళక....” ఆల్బర్ట్ ఎటో చూస్తూ నసుగుతూ అన్నాడు.

లేదు. మార్గరేట్ హార్ట్ అయింది. అది తెలుస్తూనే ఉంది. అతిధితో నేను సరిగా బిహేవ్ చేయలేదు. తప్పు చేశాను. వెంటనే సారీ చెప్పాలని నిర్ణయించుకున్నాను.

“నీ ఫోన్ ఇవ్వు ఆల్బర్ట్..., వెంటనే తనకి సారీ చెప్పాలి” తన ఫోన్ లాక్కుంటూ అన్నాను.

నా ప్రయత్నాన్ని సఫలం కానివ్వలేదు ఆల్బర్ట్. “లేదు మగ్. ఇప్పుడు కాదు. తరువాత మాట్లాడుదువు. నేను మాట్లాడిస్తా కదా?...” చేతిలోని సెల్ ని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుంటూ అన్నాడు.

నిజమే అనిపించింది. ఇది ఫోన్ లో కాకుండా డైరెక్ట్ గా సారీ చెప్పాల్సిన విషయం. మాట్లాడకుండా ఉండిపోయాను. ముఖం చిన్నబోయింది.

“ఇంతకీ పెళ్లి ఎప్పుడు?” టాపిక్ మార్చాడు ఆల్బర్ట్.

“పెళ్ళేంటి?”

“మనం పెళ్లికేగా వచ్చింది..., ఉంగరం ఎప్పుడు తొడిగేది?”

“పెళ్లి ఎప్పుడో అయిపోయిందిగా..., పైగా ఉంగరం కాదు తాళి కడతారు”

“వాట్?...” నోరు తెరిచాడు ఆల్బర్ట్.

“అవును. పెళ్లి మార్నింగే అయిపోయింది. ముహూర్తం ఉదయం 6:02కి” నవ్వాను.

“మరి మనమెందుకు వచ్చాం?”

“భోజనం చేయటానికి!”

“భోజనం చేయటానికా!...” తల గోక్కుంటూ అన్నాడు.

మళ్ళీ నవ్వాను. ఆల్బర్ట్ మరోసారి నన్ను పరిశీలనగా చూడటం మొదలెట్టాడు. ఐతే వెంటనే స్పృహలోకి వచ్చినట్టు, “నువ్వు ఇంతవరకు నాకు కొత్తజంటని పరిచయం చేయలేదు. పద చేయి...” అంటూ ముందుకు నడిచాడు.

నాకర్ధమైంది. నేను చీర కట్టుకోవటంతో ఆల్బర్ట్ అలజడికి గురవుతున్నాడు. నగ్నంగా చూసినా అలజడికి గురవను అన్నోడు అలజడికి గురవుతున్నాడు. నాక్కూడా అదే కావాలి. అతడు ‘నా అలజడి’ లో ఉన్నప్పుడే నేను అతడ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలి. వెంటనే ఒప్పేసుకుంటాడు. నాకు ఇంకోటి కూడా అర్ధమైంది. అమ్మాయిలు చీర కడితే ఇండియా అబ్బాయిలే కాదు అమెరికా అబ్బాయిలు కూడా పడిపోతారని!

ప్రపంచంలోని ఆనందం అంతా నాదే అన్నట్టు నేనూ అక్కడ్నించి కదిలాను.

*******

“సో ఆల్బర్ట్..., నువ్వు కూడా ఈ రాత్రికి ఇక్కడే ఉంటున్నావ్ గా? రేపు ఫంక్షన్ కి అటండ్ అవుతున్నావ్ గా?” స్టేజ్ మీద ఆల్బర్ట్ ని అడిగింది శ్రావ్య.

“ఫంక్షనా?... ఏం ఫంక్షన్? నాకేం తెలీదు” అన్నాడు ఆల్బర్ట్.

నేను అతడి డొక్కలో పొడిచి, “అవును శ్రావ్యా..., ఆల్బర్ట్ కూడా ఉంటున్నాడు. రేపు అటండ్ అవుతాడు” శ్రావ్యతో అన్నాను.

ఇద్దరం స్టేజ్ దిగేశాం.

“రేపు ఫంక్షన్ ఏంటి?” అడిగాడు ఆల్బర్ట్.

“రేపు రిసెప్షన్...”

“మరి ఈరోజు?”

“ఈరోజు పెళ్ళైంది అంతే...”

“ఏంటో...” చేతులు గాల్లోకి లేపాడు.

నేను మళ్ళీ నవ్వాను.

“మరి ఇప్పుడు ఏం చేద్దాం?”

“భోంచేద్దాం” అంటూ ముందుకు నడిచాను.

ఆమ్మ, నాన్న, తమ్ముడు ఎవరి గోలలో వాళ్ళున్నట్టున్నారు నన్ను పట్టించుకోలేదు. దాంతో నాకు ఆల్బర్ట్ కి ఇండియన్ డిషెస్ ఒకటొకటి పేరు చెప్తూ తినిపించే అవకాశం దొరికింది. కొన్ని కారం ఎక్కువ ఉంటుంది తినద్దన్నా వినకుండా తిన్నాడు ఆల్బర్ట్. ఏమాటకామాటే చెప్పుకోవాలి, ఆల్బర్ట్ మంచి తిండి పుష్టి కలవాడు. నాకన్నా ఎక్కువ తిన్నాడు. అదే తేడా చేసింది. కారం వద్దు తినద్దంటున్నా వినకుండా తినటంతో బాత్ రూమ్ కి మూడుసార్లు లెఫ్ట్ అండ్ రైట్ కొట్టాడు. అది చూస్తూ నాకు నవ్వాగలేదనేది నిజం.

ఆల్బర్ట్ బాత్ రూమ్ యుద్దం ముగిసేసరికి రాత్రైపోయింది. రాత్రి బసకి మాకు రూమ్స్ ఉన్నాయి. ఐతే ఆల్బర్ట్ బయటివ్యక్తి అవటంతో అతడికి రూమ్ లేదు. నా రూమ్ లో ఉండటానికి కుదరదు. పైగా నా రూమ్ లో నాతోపాటు నా మరో ఇద్దరు కజిన్ సిస్టర్స్ కూడా ఉంటారు.

“ఆల్బర్ట్..., నువ్వు బయట ఎక్కడైనా ఉండే చోటు వెతుక్కోవటానికి ఎవర్నైనా సాయం పంపమంటావా?” ఆల్బర్ట్ తో అంది మా అమ్మ.

దానర్ధం నువ్వు బయటే ఉండాలి అని.

“పర్లేదు ఆంటీ..., ఐ కన్ మ్యానేజ్” అన్నాడు ఆల్బర్ట్.

“ఆర్ యు షూర్?” నేను.

“యా... యా…” అంటూ బయట లాన్ వైపు నడిచాడు ఆల్బర్ట్.

******

ఆల్బర్ట్ ఒంటరిగా లాన్ లో బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు. నేను వెళ్ళి చేయి వేసేటప్పటికి ఒక్కసారిగా ఉలిక్కిపడి నావైపు తిరిగాడు. అప్పుడు సమయం రాత్రి రెండుగంటలు. నేను ఇంకా చీరలోనే ఉన్నాను.

“ఏమైంది ఆల్బర్ట్ నీ కళ్ళకి?” అతడి కళ్ళు ఎరుపు తేలి ఉన్నాయి. ఆల్బర్ట్ నావైపుకి తిరగ్గానే అవే దృష్టిలో పడ్డాయి.

“నువ్వా..., యు స్కేర్డ్ మీ” పాపం నిజంగానే భయపడినట్టున్నాడు.

“నీ కళ్ళు ఏంటి అలా ఉన్నాయి?” మళ్ళీ అన్నాను.

“మరి?..., నువ్వు చెక్కగా రూమ్ లో పడుకున్నావ్. నేను ఇలా మంచులో నిద్రలేకుండా ఉంటే కళ్ళు ఎలా ఉంటాయి?”

“అందుకేగా నీకోసం వచ్చాను...”

“వద్దు మగ్..., యు గో స్లీప్. ఐ వస్ జోకింగ్. ఐ కన్ మ్యానేజ్”

“లేదు. ఇక్కడ దగ్గర్లో వాటర్ ఫాల్స్ ఉందంట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. అందుకే వచ్చాను”

“మరి ఆంటీకి తెలిస్తే?”

“అమ్మకి తెలీదు. టు హవర్స్ లో వచ్చేద్దాం. నేను సాయంత్రం నుంచీ అరేంజ్ చేస్తున్నాను. ఎవరికీ తెలిసే అవకాశం లేదు”

“కానీ వెహికల్ ఉండాలి కదా?...”

“అది కూడా రెడీ...” కార్ కీస్ చూపిస్తూ అన్నాను.

“లెట్స్ గో దెన్”

ఇద్దరం బయల్దేరాం. నేను రూట్ చెప్తే ఆల్బర్ట్ జి‌పి‌ఎస్ సెట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు. సాయంత్రమే శ్రావ్యని కనుక్కుని ఉంచాను. చాలా రొమాంటిక్ ప్లేస్ అంది. ఇప్పుడు అక్కడే ఆల్బర్ట్ కి ప్రపోజ్ చేయబోతున్నాను. నా కడుపులో బటర్ ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్!!

తొందరగానే వాటర్ ఫాల్స్ చేరుకున్నాం. నిజంగా చాలా రొమాంటిక్ గా ఉంది. రాత్రి అవటంతో ఫాల్స్ కి రంగురంగుల లైటింగ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన స్పీకర్స్ లోంచి రొమాంటిక్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఆ మ్యూజిక్ జలపాతపు హోరులో కలిసి వింత అనుభూతిని కలగజేస్తుంది. అక్కడక్కడా కపుల్స్ ఉన్నారు. కానీ కావాల్సినంత దూరం ఉండి ప్రైవసీ కూడా ఉంది.

“సో బ్యూటిఫుల్..., మగ్..., ఊ....” అరుస్తూ అన్నాడు ఆల్బర్ట్.

“ఇక్కడి నుంచి పడిపోతే ఏంటి పరిస్తితి ఆల్బర్ట్?” కిందకి చూస్తూ అన్నాను నేను.

“డోంట్ బీ స్కేర్డ్ మగ్..., జస్ట్ ఎంజాయ్… ఊ.... ఊ....” అరుస్తూనే ఉన్నాడు.

అతడు ఆనందంగా ఉన్నాడు. ఇదే మంచి సమయం చెప్పేయాలి. అతడికేసి చూశాను. అతడు నాకు వెన్ను చూపిస్తూ అటువైపుకి తిరిగి ఉన్నాడు. నేను వెంటనే వెళ్ళి వెనుకనుంచి అతడ్ని హత్తుకుపోయాను.

“ఏంటి మగ్..., భయమేస్తుందా?” అంటూ నావైపుకి తిరిగాడు ఆల్బర్ట్.

ఇది భయమా?... నా కౌగిలి భయంలా ఉందా?... నేను మాట్లాడలేదు. అతడి కళ్లలోకే చూస్తూ నించున్నాను. అతడికర్దమైనట్టు ఉంది అతడూ మౌనమైపోయాడు. నా కళ్లలోకే చూస్తూ నించున్నాడు. అతడి కళ్ళలో అదే మెరుపు - సాయంత్రం చూసిన మెరుపు. అప్పటికే కురుస్తున్న మంచు, జలపాతం కారణంగా నేను పూర్తిగా తడిచిపోయాను. ఐనా అక్కడి గాలికి నా పైట ఎగురుతుంది. నా ముంగురులూ ఎగురుతున్నాయి. అతడు నా ముఖాన్ని దోసిట్లోకి తీసుకున్నాడు. నేను కళ్ళు మూసేశాను. అతడి పెదాల కోసం నా పెదాలు ఆత్రంగా వణుకుతున్నాయి.

ఇలా ఎంతోసేపు లేము...

“దిస్ ఈజ్ నాట్ హ్యపనింగ్ మగ్...” అంటూ వెనక్కి నడిచాడు ఆల్బర్ట్.

నాకర్ధంకాలేదు.

“ఏమైంది?’’ అన్నాను.

“నేను నీకు ఒకటి చెప్పాలి...”

“నేనూ నీకు ఒకటి చెప్పాలి..., సరే ముందు నువ్వు చెప్పు”

“నేను..., నేను..., నిన్న నా ప్రపోజల్ కి మార్గరేట్ ఒప్పుకుంది మగ్...” అన్నాడు ఆల్బర్ట్.

అప్పుడే నా చెవుల్లో ఆకాశంలో ఉరుము ఉరుమిన శబ్దం. అతడి చెప్పింది వినపడింది కానీ దాని తరువాతే అంతా నిశబ్దమైంది. జలపాతపు హోరు మూగబోయింది. రంగురంగుల దీపాలు ఆరిపోయాయి. గాలి కూడా ఆగిపోయింది. ప్రకృతి అంతా స్తంభించిపోయిన అనుభూతి.

నేను శిలలా బిగుసుకుపోయాను. నా శరీరం లోపల ఏదో అవుతున్న ఫీలింగ్.

నాకు ఏమవుతుంది??...Rate this content
Log in

Similar telugu story from Drama