యామిని
యామిని
“ప్రియమైన అమ్మానాన్నలకు నేను ఎంతగా ప్రయత్నించినా ఏమి గుర్తుండటం లేదు
మీరు అనుకున్నట్టు చదవలేక పోతున్నాను నన్ను క్షమించండి. నాకు విరక్తిగా ఉంది పరీక్షలు కూడా బాగా రాయలేదు. అందుకే చనిపోతున్నాను తమ్ముడు బాగా చదువుతాడు వాడికి నా ముద్దులు. నాకోసం బాధపడకండి వచ్చే జన్మలోనూ మీ కూతురు గానే పుట్టి బాగా చదవాలని కోరుకుంటున్నాను.
ఇట్లు
యామిని.”
కన్నీళ్లు తుడుచుకుని, లెటర్ ని జాగ్రత్తగా మడత పెట్టి కిటికీలో దేవుడి బొమ్మ దగ్గర పెట్టింది.నవ్వు మొహం తో ఆఖరి సారిగా ఒక సెల్ఫీ తీసుకుంది. తన నవ్వంటే అమ్మకు బాగా ఇష్టం మరి. నిద్ర పోతున్న తన స్నేహితులకు వినపడకుండా తలుపు తీసి నెమ్మదిగా బయటకు వచ్చింది. మూడు అయితే మళ్లీ గార్డ్ చూసేస్తాడు. ఈలోగానే దూకేయాలి.వారం క్రితం కూడా లెటర్ రాసింది కానీ మనసు మార్చుకుంది. ఈసారి ఆగాలని లేదు యామిని కి. నెమ్మదిగా ఆఖరు అంతస్తుకు చేరుకుంది. చాలా నిశ్శబ్దంగా ఉంది అంతా.
రైలింగ్ పట్టుకుని కిందకి చూసింది. ఒక్కసారి గుండె ఝల్లుమంది.. అమ్మ నాన్న తమ్ముడు అందరూ గుర్తొచ్చారు కానీ భయం బాధ అందరిని చెరిపేసాయి. మనసులో ఒక్కసారి దేవున్ని తలచుకుంది. ఇంతలో దూరంగా చిన్న శబ్దం. తల తిప్పి చూసింది. లెడ్ లైట్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాడు సూర్య. ఎందుకు వచ్చాడు తను.
తాను ఉండేది లేడీస్ హాస్టల్ పక్కనే ప్రహరి అవతల జెంట్స్ హాస్టల్ ఎక్కడా కనబడే అవకాశం లేదు. కానీ పైన మాత్రం చిన్న పిట్టగొడ అడ్డు అంతే పక్కపక్కనే ఉన్నట్టు ఉంటాయి. సూర్య తనకన్నా సీనియర్ చాలా బాగా చదువుతాడు అని లెక్చరర్లు తన క్లాసులోనూ పొగుడుతుంటారు. తను కూడా క్యాంటీన్ దగ్గర చాలాసార్లు సూర్య తో మాట్లాడింది.తన ఫ్రెండ్ లత అన్నయ్య అని పిలుస్తుంది..అందుకే తానూ అలాగే పిలిచింది మొదట. సూర్య మంచి ఇంటిలిజెంట్ కానీ ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చాడు ??
“అయినా తనకు ఎందుకు?” అని మరోసారి మనసులో అనుకుంది .
ఈలోగా సూర్య యే తనను చూసేసాడు .
“హలో యామిని ఒక్క నిమిషం”
తల కొట్టుకుంది ఒక్కసారి. కానీ పక్కకి చూసింది. సూర్య మొహం విచారంగా ఉంది తన మొహం అలా ఉండడం మొదటిసారి చూస్తోంది యామిని. సూర్య చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడని తెలుసు కాలేజ్ వాళ్లే తనని చదివిస్తున్నారు.
“నువ్వు కూడా నాలాగా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చావా?” అడగకూడదనుకుంటూనే అడిగింది .
మౌనంగా తలూపాడు సూర్య
“ఏమైంది?”
“చెప్తా కానీ ముందు నువ్వు ఎందుకు చనిపోదామనుకుంటున్నావో చెప్పు?”
“అమ్మ నాన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నేను చదవలేక పోతున్నాను అసలు ఏది ఎక్కట్లేదు చదివింది గుర్తు ఉండట్లేదు.”
కాసేపు మౌనంగా ఉన్నాడు సూర్య తరువాత నెమ్మదిగా అడిగాడు.
“యామిని నువ్వు ఎలాగూ చనిపోదాము అనుకుంటున్నావు కదా నాకొక్క సహాయం చేయగలవా?”
“ఏం చేయాలి ?”
“మాది చాలా పేద కుటుంబం. నాన్నకు మొన్ననే కిడ్నీలు పాడైనట్టు డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ కు రెండు లక్షలు అవుతుందట. అందుకే ఇక నన్ను చదువు ఆపేసి ఇంటికి వచ్చేయ్ అన్నారు..
అందుకే నేను చనిపోదాం అనుకున్నాను. సరే నువ్వు ఎలాగూ చనిపోదామనుకుంటున్నావు కదా.నీ చేతికి ఉన్న బంగారు గాజులు ,మెడలో నెక్లెస్ నాకు ఇవ్వగలవా.?? అవి మా నాన్న వైద్యానికి సరిపోతాయి .నా చదువు కూడా ఆగదు. నీకు ఎప్పటికి రుణపడి ఉంటాను.”
తెల్లబోయి ఉండిపోయింది యామిని.
కాసేపటికి తేరుకుంది.
అతని పరిస్థితే అలా ఆడిగించింది అని అర్థమైంది
సరే అని తన మెడలో గొలుసు చేతి గాజులు తీసి అతనికి అందించింది.
సూర్య కళ్ళలో వెలుగు..
“ఇంకొక సాయం చేయగలవా?”
“ఏమిటి”
“నీ ఆత్మహత్య ఒక్క రోజు వాయిదా వెయ్యగలవా?”
“ఎందుకు ?”
ఆమె మొఖంలో కాస్త కోపం..
“చెప్తా నువ్వు ఇప్పుడు చనిపోతే అందరికీ వెంటనే తెలిసిపోతుంది. నీ వంటి మీద బంగారం కోసం ఆరా వస్తుంది. అప్పుడు ఇవి నువ్వు నాకు ఇచ్చిన ప్రయోజనం ఏముంది పైగా నా జీవితం కూడా రిస్క్ లో పడుతుంది.”
“కానీ రేపు ఉదయం మా అంకల్ వస్తా అన్నారు.ఆయన వస్తే మళ్ళీ నా మనసు మారుతుందేమోనని భయం కాబట్టి కుదరదు..” అంది .
“సరే ఒకటి చెప్పనా నేను కూడా చిన్నప్పుడు అసలు చదివే వాడిని కాదు ఒకరోజు ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంలో స్వామీజీ నాకు ఒక మంత్రం చెప్పారు దాని ప్రభావం వల్ల నేను ఇప్పుడు బాగా చదువుతున్నాను. నిన్ను ఒక్కసారి అక్కడికి తీసుకెళ్తాను. నీ జీవితం మారిపోతుంది.”
యామిని కి ఎక్కడో చిన్న ఆశ.
“సరే కానీ నీతో ఎలా రావాలి?”
“నేను చెప్తాను నువ్వు మీ అంకుల్ వచ్చినప్పుడు బయటకు వెళ్తారు కదా అప్పుడు అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకుని రాజమహల్ సెంటర్కు రా, నేను అక్కడ ఉంటాను .అక్కడినుంచి నేను తీసుకువెళ్తా. నా దగ్గర బైక్ లేదు కాబట్టి నువ్వే మీ అంకుల్ ని అడిగి బైక్ సంపాదించుకో. అప్పుడే మనం సమయానికి తిరిగి రాగలం. సరేనా.”
కాసేపు ఆలోచించింది యామిని.
“సరే” అంది.
మరుసటి రోజు ఉదయాన్నే అన్నీ అనుకున్నట్టే జరిగి ఆమె రాజమహల్ సెంటర్ వద్ద ఎదురుచూస్తోంది. ఈలోగా అక్కడికి ఆటోలో వచ్చాడు సూర్య. పద వెళ్దాం అన్నాడు. ఇద్దరూ బయల్దేరారు కొంచెం దూరం వెళ్ళారు.
“దాహంగా ఉంది” అంది యామిని.
“ఇక్కడ ఒక తాత కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. చాలా బాగుంటాయి.” అన్నాడు .
ఇద్దరూ తాగాక 100 రూపాయలు ఇచ్చింది.
“చిల్లర లేదమ్మా” అన్నాడతను.
పర్లేదు మళ్లీ వచ్చినప్పుడు తీసుకుంటాను లే అన్నాడు సూర్య .
“నేను మళ్ళీ రానుగా ..అయినా పర్లేదు” అంది ఆమె.
ఆమె ముఖం ఇంకా బాధగానే ఉంది.
ఇద్దరూ బయల్దేరారు.
“నన్ను త్వరగా స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లు” అంది ఆమె .
“ఇంకొంచెం దూరమే .సిటీ దాటగానే ఆశ్రమం” అన్నాడు సూర్య . మరో 5 నిమిషాల్లో ఆశ్రమం చేరుకున్నారు.
బండిని గేటు బయట పార్క్ చేసాడు. ఇద్దరు లోపల
ికి నడిచారు ఆశ్రమం చాలా పెద్దది పెద్ద పెద్దచెట్లు వాటి కింద చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి. ఆశ్రమం నిండా ఎంతోమంది అనాధలు పేదవాళ్లు ,ధనికులు.. హడావిడిగా ఉంది ఆ ప్రాంతం బయట పార్కింగ్ లో కార్లు చూసినప్పుడే అనుకుంది యామిని ఈ స్వామీజీకి ఏదో మహిమ ఉండి ఉండాలి.. అని .
వారిద్దరూ కొంచెం దూరం నడవగానే చెట్టు కింద కూర్చుని దీపం ఒత్తులు చేస్తున్న ఒక వృద్ధురాలిని గమనించింది యామిని.
“ఆమె ఎవరు?” అని అడిగింది.
“ఆమె భర్త చనిపోయాడు, సంతానం లేదు, ఆమె రోడ్డు పక్కన అడుక్కుంటుంటే పోలీసులు తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించారు .. ఆమె ఇలా వత్తులు అమ్ముతూ ఆశ్రమానికి ఎంతో కొంత సాయం చేస్తోంది.”
“అవునా” తన మనసులోనే వృద్ధురాలి ని మెచ్చుకుంది .
ఇంకొంచెం ముందుకు నడిచారు .
అనాధలు వికలాంగులు రోగగ్రస్తులు వారికి సేవ చేస్తున్న వాలంటీర్లు అందరిని చూస్తుంటే మతి పోయింది యామినికి.తానెప్పుడూ చూడని కొత్త ప్రపంచం లా ఉంది.
ఇంతలో మెట్ల దగ్గర నిలబడిన ఒక స్త్రీ యామిని ని ఆశ్చర్యపరిచింది.
ఆమె చాలా అందంగా ఉంది కానీ తల నుంచి వెనక్కి ముసుగు వేసుకుంది.
ఒక ఆరుగు మీద కూర్చుని పెయింటింగ్ వేస్తోంది.
“ఎందుకు ఆమె అలా ఉంది నీకు తెలుసా?”
“ఆమె ఒక ఆసిడ్ దాడి బాధితురాలు అదృష్టవశాత్తు ఆమె వెనక్కి తిరగడం చేత మెడ వీపు భాగం మాత్రమే బాగా కాలిపోయాయి.”
“మరి ఆమె ఎక్కడ ఎందుకు ఉంది?”
“ఆమె ఒకతన్ని ప్రేమించింది. అది నచ్చని తల్లిదండ్రులు ఇంట్లోనుంచి గెంటేసారు.. తర్వాత ప్రేమించిన వ్యక్తే యాసిడ్ దాడి చేశాడు. హాస్పటల్లో ట్రీట్మెంట్ తర్వాత ఇంట్లో కి రానివ్వకపోవడం వల్ల ..ఆమె ఆశ్రమంలోనే ఉంటుంది.”
“సరే ఒక్కసారి నేను తనతో మాట్లాడొచ్చా.?”
“సరే వెళ్ళు” అన్నాడు సూర్య.
యామిని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వచ్చింది.
“నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగొచ్చా?” అంది.
ఆమె కాసేపు విస్తుపోయి చూసి
“సరే అడుగు” అంది నవ్వుతూ .
“మీకు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనిపించలేదా ?”
యామిని ప్రశ్నకు కాసేపు ఆశ్చర్యంగా చూసింది ఆ అమ్మాయి
“లేదు నాకు ఆ అవసరం లేదు నన్ను అమ్మ నాన్న గెంటేసినప్పుడే ఆత్మహత్య చేసుకుని ఉంటే, నేను ప్రేమించిన వాడు దుర్మార్గుడని తెలిసి ఉండేది కాదు, వాడు దుర్మార్గుడని తెలిసాక నేను ఆత్మహత్య చేసుకుంటే నా తల్లిదండ్రులకు నామీద ఇసుమంతైనా ప్రేమ లేదని తెలిసేది కాదు ..అంతేకాదు ఇక్కడికి వచ్చాక నాకు చాలా విషయాలు తెలిసాయి. ముఖ్యంగా ఎందుకు బతకాలో తెలిసింది అందుకే నాకు ఎప్పుడు అలాంటి ఆలోచనలు రాలేదు”
“థాంక్యూ” అని చెప్పి అంతే వేగంగా తిరిగి సూర్య దగ్గరికి వచ్చింది.
స్వామిజీ దగ్గరకు వెళ్లారు ఇద్దరూ.
స్వామీజీ ముందుగా సూర్య ని పలకరించారు.
తర్వాత యామిని కేసి తిరిగి “తల్లి నీకు చదువు బాగా రావడానికి ఒక మంత్రం చెప్తాను సరేనా” అన్నారు.
కాసేపు మౌనంగా ఉంది యామిని
తరువాత అంది “స్వామి నాకు ఏ మంత్రం వద్దు కానీ నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ దర్శనం చేసుకునేలా వరం ఇవ్వండి చాలు.”
ఆశ్చర్యంగా చూసాడు సూర్య .
స్వామీజీ నవ్వి “నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు ఇక వెళ్ళు” అన్నారు.
సెలవు తీసుకున్నారు ఇద్దరూ.
సూర్య బయటకు వచ్చాక అడిగాడు “అదేంటి అలా మాట మార్చేసావు?”
“ఏమీ లేదు నాకు చదువు రాకపోతే నష్టం ఏంటి” అంది.
చిరునవ్వు నవ్వాడు సూర్య.
“సూర్య ,నిజం చెప్పు నువ్వు నన్ను మార్చాలని ఇక్కడికి తీసుకు వచ్చావ్ కదా నెమ్మదిగా అడిగింది?”
ఆమె కళ్ళలో మునుపటి నిరాశ అసలు లేదు ఎంతో చైతన్యం తో వెలుగుతూ ప్రకాశిస్తున్నాయి .
“యామినీ చెప్తా విను రోజు మీ రూమ్ ని శుభ్రం చేసే ఆయా మా పిన్ని.
ఒకరోజు తనకి మీ డస్ట్ బిన్ లో అనుమానాస్పదంగా కనిపించిన ఒక ఉత్తరాన్ని నాకు చూపించింది.
అది నువ్వు రాసిన సూసైడ్ లెటర్ నేను చాలా భయపడ్డాను. ప్రిన్సిపాల్ కి చెబుదామనుకున్నాను కానీ పిన్ని ఉద్యోగం పోతుందని..భయపడ్డా.
ఆరోజు పై అంతస్తు లో ఎదురు చూసా.. కానీ నువ్వు ఆత్మహత్య వాయిదా వేసుకున్నావు. కానీ ఏదో రోజు మళ్లీ ప్రయత్నిస్తావని తెలుసు .అందుకే నీమీద ఒక కన్నేసి ఉంచాం. కెమిస్ట్రీ ఎగ్జామ్ నువ్వు కచ్చితంగా బాగా రాయవు అని తెలుసు. అందుకే ఆరోజు నువ్వు ఎక్కువ భయపడతావని కూడా తెలుసు అందుకే నిన్న నేను మేడ మీదకి వచ్చాను. అదృష్టవశాత్తు నా ప్రయత్నం ఫలించింది.”
యామిని కళ్ల వెంట నీళ్లు ఆమెను మాట్లాడనివ్వలేదు, ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు చెప్పాలి, ఎంత సాయం చేస్తే తీరుతుంది ఈ రుణం, అతని చెయ్యి గట్టిగా పట్టుకుని కళ్ళకద్దుకుంది.
“మీ నాన్న గారికి ఎలా ఉంది ?”
“మా నాన్న గారు చిన్నప్పుడే చనిపోయారు. నాకు నీ బంగారం తో పని లేదు. కానీ కష్టాల్లో ఉన్నవాళ్లు ఇంకో కష్టాల్లో ఉన్న వాళ్ల మాటలే నమ్ముతారు. అందుకే నీకు దగ్గర అవ్వాలనే అలా చెప్పా”
“నువ్వు గ్రేట్ సూర్య .. ఏమీ కాని నాకోసం తపించావు.”
“యామిని నువ్వు నన్ను మొదటిసారి కలిసినప్పుడు అన్నయ్య అని పిలిచావు. ఇక నీకేమీ కాకుండా చూసుకోవడం నా బాధ్యత.మంచి మాటలతో నేను నిన్ను తాత్కాలికంగా మార్చగలను.. కానీ అది ఉపయోగం లేని పని..
ఒంటరితనం అనేది రకరకాల భయాల్ని మన మనసు లోకి తీసుకొచ్చే ఒక పెద్ద దెయ్యం.దాన్ని తరిమెసే ఒకే ఒక్క ఆయుధం ప్రేమ.. నువ్వు చూపించే ప్రేమ ఇంకో కొంతమంది జీవితాలకు వెలుగు ఇవ్వాలి... అదే నేను స్వామిజీ దగ్గర నేర్చుకున్న మంత్రం.”
ఇద్దరు బయలుదేరారు. దారిలో తాత బొండాల బండి దగ్గర ఆగారు.
సూర్య చిల్లర అడగబోయాడు..
“ఇప్పుడా అవసరం లేదులే మళ్ళీ వచ్చినప్పుడు నేనె తీసుకుంటాను” అంటున్న యామిని కళ్ళల్లో ప్రేమ చూసి పొంగిపోయాడు తాత.
***
Please vote me for author of the year 2020 award if u like my story it seems