ఉదయబాబు కొత్తపల్లి

Drama

4.6  

ఉదయబాబు కొత్తపల్లి

Drama

గోదారి (కధ)

గోదారి (కధ)

7 mins
984



2041 వ సంవత్సరం....తెల్లవారుజామున 4 గంటల సమయం.

శుభోదయాన్ని సూచిస్తూ మోగిన ఫోన్ శబ్దం విని ఉలిక్కిపడి లేచాడు కృష్ణ మోహన్.

ఫోన్ రిసీవర్ అందుకున్నాడు బద్ధకంగా.వార్త వింటూనే హతాశుడై మంచం దిగుదామని నేలమీద కాళ్ళు పెట్టేసరికి నేలనంతటినీ తడుపుతూ సన్నని నీటిపొర.

గబగబా భార్య ప్రియంవదను,తల్లిని,పిల్లలిద్దరినీ లేపాడు.


"ప్రియా!ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అపుడే గంట నుంచి ట్రై చేస్తున్నారట.గోదారి ఊళ్ళో ప్రవేశించిందట. నిన్న రాత్రి వరకు ఎటువంటి సూచన లేదు.ఎక్కడా వాన కురిసిన దాఖలాలు లేవు. అటు రాజమండ్రి, ఇటు కొవ్వూరు గట్లు దాటి ఊళ్ళోకి ప్రవహిస్తోందట. నేను వెళ్తాను.వీలైతే అటెండర్ ని పంపిస్తాను .లేకుంటే ఇంటికి తాళం వేసి పక్కింటివారి సాయంతో ఎత్తైన ప్రదేశానికి చేరుకోండి. ఊ... క్విక్.."

అతని మాట పూర్తి కాకుండానే వాకిట్లో జీప్ హారన్ వినిపించింది."వస్తాను ప్రియా.మీరంతా జాగ్రత్త."అతను కదలబోయాడు.

"డాడీ..." అంటూ పిల్లలు అతన్ని కరుచుకుపోయారు.

"మరేం భయం లేదమ్మా...ఇదేమీ వరదప్రభావం కాదు.మీరేం భయపడవద్దు.ఏం జరగదు.మీరు ధైర్యంగా ఉండి అమ్మకి, బామ్మకి సాయంగా ఉండండి.నేను వెళ్లిన వెంటనే ఫోన్ చేస్తాను.అటెండెర్ని పంపిస్తాను. సరేనా!"

ఆగలేనట్టు విసుగ్గా జీప్ హారన్ మళ్ళీ మోగడంతో ఒక్క ఉదుటున వెళ్లి జీపులో కూలబడ్డాడు కృష్ణ మోహన్.

ఎంత ధైర్యం చిక్కబట్టుకున్నా వారు నలుగురు ఒకరినొకరు కరుచుకుపోయి బేలగా, వెళ్తున్న జీప్ వైపే చూస్తూండిపోయారు.

ఆ గదిలో గోదారి గలగలా కిలకిలా నవ్వుతోంది పలుచగా! ********* 


కృష్ణ మోహన్ ఆఫీస్ కు చేరుకున్న వెంటనే మొత్తం రాష్ట్ర సమాచార వ్యవస్థ ను అరగంటలో అప్రమత్తం చేశాడు. తనపై అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి,నీటి పారుదల శాఖ అధికారులకు, రాష్ట్ర మంత్రులకు, అందరికీ సమాచారం క్షణాల్లో అందించి అత్యవసర సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సిబ్బందికి, స్థానిక సంస్థలకు, కలెక్టర్ తరపున ఆయన అనుమతి తో సమాచారం అందించి రంగం సిద్ధం చేసాడు.

ఇంతా చేస్తూనే అతను అనుక్షణం ప్రాజెక్టు లో వాటర్ లెవెల్ గమనిస్తూనే ఉన్నాడు.

అరగంట తరువాత ముఖ్యమంత్రి లైన్ లోకి వచ్చాడు. ఆందోళన గా పరిస్థితి ని గురించి కృష్ణమోహన్ తో సమీక్షించాడు.

"గుడ్ మార్నింగ్ సర్.రాత్రి ఇక్కడ వాతావరణం అంతా పొడిగా ఉంది.శీతాకాలం వెళ్లి వేసవికాలం ప్రవేశిస్తున్న ఈ రోజుల్లో వేసవి గడవడానికి అవసరమైన నీటిని మాత్రమే ఉంచి అదనపు నీటిని వదిలేసామ్. అయితే నీరు లోతట్టు ప్రాంతాల్లో కూడా కేవలం ఒక అడుగుమేర మాత్రమే ప్రవేశించింది. ఆపై నీటి పెరుగుదల ప్రస్తుతం ఆగిపోయింది. ముఖ్యంగా రాజమండ్రి - కొవ్వూరు ల మధ్య పాట రైలు వంతెన -కొత్త రైలు కం రోడ్ వంతెన ల మధ్య ప్రాంతాలలోని ఊర్లలోకి నీరు ప్రవేశించింది.ప్రస్తుత పరిస్తుతులలో నీటిమట్టం పెరగక నిలకడగా ఉంది.ఇక్కడ అన్ని శాఖల అధికారులు అప్రమత్తం అయ్యారు.పరిస్థితి ఎప్పటికప్పుడు మీకు తెలియ చేస్తాను. ఉంటాను సర్.నమస్తే."

"వన్ మినిట్ మిస్టర్.రెండు మూడు గేట్లు ఎత్తేస్తే?" ముఖ్యమంత్రి ప్రశ్నించాడు.

"నో సర్.ఒక్క గేటు ఎత్తివేసినా కొన్ని వేల క్యూసెక్కుల నీరు దిగువకు పోతుంది.ఆ నీరు వృథా అయితే వేసవి లో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమైనంత వరకు నీటి ని వదలకుండా,ప్రజలకు ప్రాణహాని కలుగకుండా ఇక్కడ అందరితోనూ చర్చించి అవసరమైన చర్యలు చేపట్టి మీకు తెలియచేస్తాను సర్.ఉంటాను సర్.నమస్తే."కృష్ణమోహన్ ఫోన్ పెట్టేసి నుదుట పట్టిన చెమట ను తుడుచుకున్నాడు.

అటెండర్ మంగయ్య లోపల కి వచ్చాడు."మంగయ్యా!ఏమిటి కొత్త సమాచారం?""భూగర్భ పరిశోధన విభాగం వారు,మనస్టాఫ్ పోలీసు శాఖ వారు అందరూ మీటింగ్ హాల్లో రెడీ గా ఉన్నారు సర్. మీరు రావడమే తరువాయి."

"చూడు.వాచ్ మాన్ వెంకటేశం ను మా ఇంటికి వెళ్లి అమ్మగారికి సహాయం గా ఉండమను. నువ్ నాతో రా."అతన్ని తన ఎదురుగా ఉన్న ఫైల్స్ తీసుకోమని సైగ చేసి కృష్ణమోహన్ ముందుకు నడిచాడు.మంగయ్య అనుసరించాడు.


*****

కృష్ణమోహన్ ధవళేశ్వరం ప్రాజెక్టు లో ప్రాజెక్టు అధికారి గా పని చేస్తున్నాడు.అతను అక్కడికు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన ఈ పది సంవత్సరాల్లో గోదావరి పుష్కరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలుగని అసాధారణ రీతి లో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు అందుకున్న వాడు.సమయస్ఫూర్తి, చాకచక్యం,ఆలోచన చేస్తూనే తన సిబ్బంది ని నడిపించే చక్కటి అధికారి గా పేరు తెచ్చుకున్నాడు.


2036 వ సంవత్సరం లో కనీవినీ ఎరుగని వరద వచ్చి ఆ ప్రకృతి వైపరీత్యం లో సుమారు పదివేల మంది ప్రాణాలు కోల్పోయి, ఏభై వేలమంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో అతను చూపిన కార్యనిర్వహణా దక్షత యువత ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తి దాయకమైంది.

సత్యసాయి సంస్థలు మొదలుకొని ఎన్నో యువజన సేవాసంస్థలు తమ ఆర్ధిక సహాయాన్ని ప్రకటించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందముగా పాల్గొని తమ సేవలందించాయి.నేత్ర పరీక్షలు, పూర్తి ఆరోగ్య పరీక్షలు, నిరాశ్రయులకు తాత్కాలిక వసతి,ఆహార పొట్లాలు,బియ్యం,దుప్పట్లు, మందులు,పాత బట్టలు...అన్నీ ఎంతో శ్రమకోర్చి ప్రతీ ఒక్కరికీ అందేలా పనిచేయ గలిగాయంటే వాటి కార్యదీక్షకు స్ఫూర్తి కృష్ణమోహనే.

అతని కీర్తి ప్రతిష్టలు భరించలేని ఓ మాజీ రాజకీయ నాయకుడు ఉన్నవి లేనివి చెప్పి తన నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టి అతణ్ణి తక్షణమే అక్కడనుంచి ట్రాన్స్ఫర్ చేయమని కలెక్టర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు సమర్పిస్తే,నగర ప్రజలే కాదు.చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు కూడా ఏక తాటిమీద నిలిచి ఆ రాజకీయ నాయకుడి చేత ప్రజాసమక్షంలో కలెక్టరేట్ ఎదుట బహిరంగ క్షమాపణ చెప్పించడం లో కృతకృత్యులయ్యారంటే కృష్ణమోహన్ ఎంతగా ప్రజాభిమానాన్ని చూరగొన్నదీ అర్ధం చేసుకోవచ్చు.

తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆ రాజకీయ నాయకుడి గూండా నేర చరిత్ర అంతా కూకటి వేళ్ళతో పేకళించి అతన్ని రాజకీయ సన్యాసం చేయించేంత వరకూ పత్రిక లు తమ పత్రికా స్వాతి స్వేచ్ఛ గా వినియోగించుకున్నాయి. ఆ తర్వాత అతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు గ్రహించి సద్దుమణిగాయి.

అంతగా ప్రజామద్దతు కూడగట్టుకున్న అధికారి కృష్ణమోహన్. అందుకే అతని ప్రత్యక్షంలో లేచి నిలబడి గౌరవిస్తారు.పరోక్షంలో హృదయ పూర్వకంగా నమస్కరిస్తారు.

కృష్ణమోహన్ మీటింగ్ హాల్లో కి అడుగు పెట్టేసరికి అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు.

"థాంక్యూ అండ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈ మీటింగ్ కు హాజరైన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను.మనం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించవలసిన సమయం మళ్ళీ ఆసన్నమైంది. ముందుగా వాటెబౌట్ వాటర్ లెవెల్ మిస్టర్ కృష్ణమూర్తి?",అడిగాడు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కృష్ణమూర్తి ని.

"సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలకు ఏ పొజిషన్ లో ఉందొ ఇప్పుడూ అదే పొజిషన్ లో ఉంది సర్.భద్రాచలం, పాపికొండలు,పోలవరం లలో అంతటా వాతావరణం పొడిగా ఉంది సర్.పోలవరం ప్రాజెక్టు లో కూడా వాటర్ లెవెల్ సరిగ్గా ఉండవలసినంత ఉంది సర్. బొంబాయి వాతావరణ పరిశోధన కేంద్రం దగ్గరనుంచి కూడా సమాచారం వచ్చింది సర్.ఎక్కడా వర్షాలు పడిన దాఖలాలు లేవు సర్.శాటిలైట్ సమాచారాన్ని విశ్లేషించి రేపు సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుందని సందేశం పంపారు సర్."

"ఒకే. థాంక్యూ ఫర్ యువర్ ఆటెన్షన్ మిస్టర్ కృష్ణమూర్తి. కీపిటప్."అని భూగర్భ పరిశోధకులకేసి తిరిగి అడిగాడు కృష్ణమోహన్."మిస్టర్ దీపక్ భాటియా.భూమి లోపల ఏమైనా మార్పులు జరుగుతున్నాయంటారా?ఐ మీన్ భూకంపం వచ్చే అవకాశం గానీ...మరేదైనా...?"

"నో సర్.సిస్మోగ్రాఫిక్ సెంటర్ వారి సమాచారం మేరకు అటువంటి అవకాశం ఏదీ లేదు సర్.అంతా సవ్యంగా ఉంది."కృష్ణమోహన్ నవ్వాడు.

"ఒకే. థాంక్యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. మరి ఈ అనుకోని అవంతరానికి కారణం? ఒకసారి మళ్ళీ ఆలోచించండి."చేతిలో పెన్నును నుదుటికి తాకిస్తూ సాలోచనగా ఉన్న కృష్ణమోహన్ ముందు అటెండర్ మంగయ్య గాజుగ్లాసులో సగము వాటర్ పోసి దానిలో అందమైన గుండ్రని,పచ్చని నిమ్మకాయ వేసాడు.కాయబరువువల్ల నీరు సరిగ్గా గ్లాసు అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. దానిపై ప్లాస్టిక్ వాచ్ గ్లాస్ మూతవేసి వెళ్ళిపోయాడు.

సరిగ్గా అప్పుడే గుర్తుకు వచ్చింది బామ్మ చెప్పిన కథ.వెంటనే దీపక్ భాటియా తో అన్నాడు.

"మిస్టర్ దీపక్.మీరు వెంటనే హెలికాప్టర్ లో వెళ్లి గోదావరి బ్రిడ్జి ల రెండింటి మధ్య గల నీటికింద ఉండే ఇసుకను తీసుకురండి. మీకు అవసరమైనవారిని తీసుకెళ్లండి.క్విక్. ముఖ్యంగా బ్రిడ్జి కి ఆపక్కన గాని, ఈ పక్కనగానీ సమీపంలో గల ఇసుక అయితే మరీ మంచిది.జాగ్రత్త.రోప్స్, బాక్స్,బాగ్స్ ...అవసరమైనవన్నీ పట్టుకువెళ్లండి. క్విక్."

అన్నదే తడవుగా దీపక్ భాటియా తనకు అవసరమైన సిబ్బంది తో నిష్క్రమించాడు.

దాదాపు అరగంట తర్వాత...

అతని కి ఎదురుగా బ్యాగ్ లో తడిసిన ఇసుకను ఉంచారు. దానిని ఆదుర్దా గా పరిశీలించిన కృష్ణమోహన్ దీపక్ భాటియానుఅడిగాడు."దీపక్.వెంటనే ఈశాంపిల్ ని టెస్టింగ్ కి పంపించి రిపోర్ట్ తెప్పించండి.క్విక్.గంటలో రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి.""ఓకే సర్."దీపక్ ఉత్సాహంగా వెళ్లి గంట పూర్తి కాకముందే తిరిగి వచ్చాడు రిపోర్ట్ తో సహా.

నేచురల్ గాస్ - నిల్

క్రూడాయిల్ - నిల్

మిగతా వివరాలు చదివాడు గాని అవి అంతగా ప్రాధాన్యం లేనివి.

"మిస్టర్ దీపక్.ఆర్ యూ షూర్ అబౌట్ దిస్ రిపోర్ట్?"

"యస్సార్. అన్నట్లు ఇందాక తీసుకెళ్ళిన శాంపిల్ లో మూడోవంతు ఇవే ఉన్నాయి సర్." అంటూ మంగయ్య కు సైగ చేసాడు దీపక్.

మంగయ్య బాగా బరువున్న ఓ సంచీ మూట విప్పి కృష్ణమోహన్ ముందు టేబుల్ పై కుమ్మరించాడు.

అవన్నీ చిల్లర నాణాలు. చాలా పాతవి, రాగి,అల్యూమినియం,మిశ్రమ లోహాలు నాణాలు. ఐదు పైసలనుండి పదిరూపాయల నాణెం వరకూ ఎన్నో రకాలున్నాయి.దీర్ఘంగా లోపలికి శ్వాస పీల్చి తిరిగి విడుస్తూ తల వెనుక రెండు చేతులు పెట్టుకుని అన్నాడు కృష్ణమోహన్.


"అర్ధమైంది భాటియా.మిస్టర్ కృష్ణమూర్తి.. డియర్ ఫ్రెండ్స్...ఈ సమస్యకు పరిష్కారం దొరికింది.మీరు అత్యవసరం గా చేయాల్సిన పనేమిటంటే...మన నగరం లో సుమారు 20 వాటర్ రిజర్వాయర్లు ఉన్నాయి.వెంటనే అన్నింటినీ వాటర్ తో రీఫిల్ చేయమనండి. గోదావరి మట్టం ఇక పెరగదు. ప్రజలందరికీ వాటర్ ఫ్యూరిఫైయింగ్ యాపరేటస్ కుటుంబానికి ఒకటి చొప్పున పంచిపెట్టమనండి. నీరు కాచుకుని తాగమనండి. గోదావరి పై ఉన్న రెండు బ్రిడ్జి లకు అటూ ఇటూ పూడిక తీయించే ఏర్పాట్లు చేయండి.మీకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుని నన్ను కాంటాక్ట్ చేయండి." అంటూ కృష్ణమూర్తి కి ఆజ్ఞలు జారీ చేశాడు కృష్ణమోహన్.


కృష్ణమూర్తి "థాంక్యూ సర్.చాలా తేలికగా సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు."అంటూనే షేక్ హాండ్ ఇచ్చి కదలబోయాడు.

"మిస్టర్ కృష్ణమూర్తి. గోదారిలో దొరికిన ప్రతీ నాణెమూ ప్రభుత్వ ఖజానాకు జమకావాలి.టేక్ కేర్ అబౌట్ ఇట్."

కృష్ణమోహన్ వైపు మెచ్చుకోలుగా చూసి "తప్పకుండా సర్.ఆ బాధ్యత నాది.థాంక్యూ సర్." అనేసి కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు.

"మాకేమీ అర్థం కాలేదు సర్."అన్నాడు సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్.

"దీన్లో అర్ధం కానిదేముంది సర్?ఇటు చూడండి..." అంటూ గాజుగ్లాసు మూత తీసి అందులోంచి నిమ్మకాయ జాగ్రత్తగా పైకి తీసాడు కృష్ణమోహన్.

"ఇపుడు గ్లాసు లో నీరు ఎలా ఉంది"

"సగానికి"నిమ్మకాయ అందులో వేసాడు కృష్ణమోహన్.

"ఇప్పుడు?"

"అంచులదాకా వచ్చింది సర్."

"ఇందులో మరో గోళీ కాయ వేస్తే?"

"నీరు పొర్లిపోతుంది సర్."

"ఇప్పుడు జరిగిందదే."

"అబ్బే. అర్ధం కాలేదు సర్."

"మీకు 'కాకి - కడవలో నీళ్లు 'కధ తెలుసా సర్?"

"తెలీదు సర్"

"పోనీ పంచతంత్ర కధలు తెలుసా?"

"పేర్లు విన్నాం గానీ చదవలేదు సర్."

"వేమన,సుమతీ,దాశరధీ... శతకాల పేర్లయినా తెలుసా?"

"లేదు సర్. ఎల్.కె.జీ.లో ఏ ముహూర్తాన చేరామో, చదువు పూర్తి అయేవరకు గుండెతో పాటు సమానంగా శ్రమించి ఈ ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డాం గానీ...మాకు బాల్యమే జ్ఞాపకం లేదు సర్.భవిష్యత్ ఉనికి కోసం బాల్యాన్ని పారేసుకున్నవాళ్ళము మేము.మీరు చెప్పిన శతకాలు గానీ,కధలు గానీ మేమెప్పుడూ చదవలేదు సర్. ఎవరైనా పెద్దలు తమ ప్రసంగాల్లో చెబుతుంటే విన్నాం అంతే. పోటీ పరీక్షలు,జి.కె.టెస్టులు,రాంకులు సాధించడం, ఉద్యోగం కోసం పోరాటం ....వీటితోనే జీవితం యజ్ఞం లా మారి బతుకుల్ని సమిధలుగా చేసి బతుకు తున్నవాళ్ళం.నాకే కాదు.ఈనాటి యువతకు మీరన్నవేవీ తెలీనే తెలీదు.చెప్పండి సర్.ఈవేళ అయినా ఆ కధ చెప్పండి సర్"అన్నాడు రణధీర్, సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్.


"ఒక కాకికి దాహమై నీటికోసం వెతుకుతోందట.దానికి ఎక్కడో నీళ్లు అడుగున ఉన్న ఓ కుండా కనిపించిందట. అపుడు కాకి ఆలోచించి అక్కడక్కడా గులకరాళ్లు తెచ్చి ఆ కుండలో వేసిందట.అపుడు నీరు పైకి వచ్చిందట. అది తాగి దాహం తీర్చుకుందట.మా బామ్మ ఈ కథ చెప్పింది.నా చిన్నప్పుడు పంచతంత్ర కథలన్నీ నేను చదివాను కూడా.

ఇక అసలు సంగతి.రోజూ వైజాగ్ నుంచి విజయవాడ వరకు కొన్ని వేలమంది రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు.రైలు గోదావరి బ్రిడ్జిపై వెళ్తున్నప్పుడు తమకు తోచిన చిల్లర నాణాలు నీళ్ళల్లోకి విసిరి గోదావరి తల్లికి నమస్కరించుకుంటారు. ఇది ఈనాటిది కాదు గత 100 సంవత్సరాలకు పైగా జరుగుతూనే ఉంది.దేనికైనా ఒక హద్దు ఉంటుంది కదా.గోదావరి నిండా ఈ చిల్లర నాణాలు ఎక్కువై కాకి కధలో లాగా సరిగ్గా నిన్న రాత్రికి, గ్లాస్ నిండి బయటకు వచ్చిన నీటిలా,గోదావరి నీరు కూడా పొంగి పొర్లి గట్లు దాటి ఊళ్ళల్లో ప్రవేశించింది.అంతే తప్ప ఇందులో మరేమీ ప్రమాదం లేదు."అన్నాడు పకపకా నవ్వేస్తూ కృష్ణమోహన్.


*******


పరిహారం :


"రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నాణాలను జమచేసి మార్గాంతరం కనుక్కున్నందుకే కాదు,చిల్లర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని ఆ సంక్షోభం నుంచి రక్షించినందుకు, ఎప్పటికప్పుడు మీడియా ద్వారా తనదైన శైలిలో ధైర్యవచనాలను ప్రజలకు తెలియచేస్తూ వారిని చైతన్యవంతులను చేయడంలో కృతకృత్యుడైన శ్రీ కృష్ణమోహన్ గారికి రాష్ట్రప్రభుత్వం "నిత్యకృషీవలుడు"అన్న బిరుదుతో సత్కరించింది.

అంతేకాదు.ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాధమిక విద్యా స్థాయిలో పంచతంత్ర కధలు,వేమన, సుమతీ,దాసరధీ శతకాలు నిర్బంధ పఠనాంశాలుగా సిలబస్ లో చేర్చుతున్నట్లు ప్రకటించింది.


తమ మూఢభక్తితో తనను పక్కదారి పట్టించబోయిన లక్షలాదిమంది భక్తుల అమాయకత్వానికి గోదావరి నవ్వుతూనే ప్రవహిస్తోంది.ప్రవహిస్తూనే నవ్వుతొంది.


సమాప్తము



Rate this content
Log in

Similar telugu story from Drama