గోరింటాకు (కధ)
గోరింటాకు (కధ)


గోరింటాకు!!! (సరసమైన కథ)
సాయంత్రం 6 గంటలైంది. బయట నుంచి వచ్చాకాస్నానం చేసి భోజనం చేసి, భార్య ఇచ్చిన కమ్మని చిక్కని మజ్జిగ తాగి పడక కుర్చీలో నడుము వాల్చాడు చంద్రశేఖర్.
దబ్బ ఆకులు, శొంఠి పొడుం, కరివేపాకు, పచ్చిమిర్చి వేసిన ఆ కమ్మని మజ్జిగ రుచి అతనికి జిహ్వానందాన్నే కాదు , అద్భుతమైన అనుభూతిని, అందమైన మొదటి రాత్రి అనుభవాన్ని మళ్లీ మళ్లీ వినాలనిపించే లత కంఠస్వరంలా, మళ్లీ మళ్లీ చూడాలనిపించే బాపు బొమ్మలా, మండు వేసవి తర్వాత కురిసే తొలకరిజల్లులా, ఎన్నటికీ మరువలేని జ్ఞాపకాల పుష్పగుచ్ఛంలా అపరిమితమైన ఆనందాన్ని ఈనాటికి మిగుల్చుతూనే ఉంది. ఎందుకంటే యశోద శోభనం గదిలోకి మొదటిరాత్రి పాల గ్లాసు తో రాలేదు.
********
నున్నటి గుండుమీద ధవళ వస్త్రాన్ని నిండుగా కప్పుకొని, చెవుల పక్కనుంచి ఒబ్బిడిగా దానిని పక్కకు తీసుకుని, పండిన నిమ్మపండు దేహాన్ని పూర్తిగా కవర్ చేసుకుంటూ లోపలికి అడుగు పెట్టిన బొమ్మ, చేతిలో గ్లాసు నిండా తెల్లని ద్రవపదార్ధం నురగలతో!
ఆ వెనుకో రెండు చేతులు వెనక్కు పెట్టుకుని పసిపాప నిర్మలమైన బోసినవ్వులా, కన్నెపిల్ల చేయితిరిగి వేసిన అందమైన ముగ్గులా, మూడేళ్లకే ఒళ్ళంతా పరువానికి వచ్చిన కాయల కళ్ళతో ప్రకృతిని వీక్షిస్తున్న హైబ్రిడ్ గున్నమావి చెట్టులా - తొలిసారి ఒక సిద్దాంతాన్ని స్వయంగా తనంతట తాను నిరూపించిన విద్యార్థి సంటుపటిలా లోపలకి అడుగు పెట్టింది 'యశోద'.
బ్రహ్మదేవుడు తన ఆసనంలోని రెండు రేకుల్ని ',యశోద',నయనాలుగా అమర్చాడు. ఆమెలో ప్రత్యేకత అదే!
మయుడు ధర్మరాజు కు నిర్మించి ఇచ్చిన మాయసభ లో
అలంకరణార్ధం తీర్చి దిద్దిన బొమ్మ కాబోలు - ప్రాణం పోసుకుని 'యశోద' యై ఎదుట నిలుచుంది.
"అమ్మాయికి సిగ్గు చాల ఎక్కువ బాబు.నేను పదిసార్లు ఆడిగితేనే పదకొండోసారి సమాధానం చెబుతుంది. ఎలా 'దారి'లోకి తెచ్చుకుంటావో ఏమో.అయినా అన్నీ చెప్పి పంపాననుకో.ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బాబు.ఇది మీ వంశాభివృద్ధికి ఏర్పాటు చేసిన శుభ'కార్యమే' కాదు. మీరు నిత్యము ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలని ఏర్పాటు చేసిన శుభముహూర్తం కూడా .అందుచేత ఒకరి మనసును ఒకరు అర్ధం చేసుకుని మెలగండి.
భవిష్యత్తు మీద నమ్మకం ఏర్పరచుకోండి. నా మాటల్లో అంతరార్థం మీకు అనుభవం లోకి వచ్చాకా అర్ధం అవుతుంది. ఏదో పాతకాలం దాన్ని.చాదస్తం తో ఈ నాలుగు ముక్కలు చెప్పినందుకు ఏమీ అనుకోకు నాయనా.మీ అత్తగారినే దీనికి తోడుగా పంపిద్దును. దీనికన్నా వీళ్ళమ్మకు మరీ సిగ్గెక్కువ. పెళ్లయిన పదేళ్ళకి దీన్ని కనడానికే గుడ్లు తేలేసింది. అనవసరంగా మీ సమయమంతా పాడుచేస్తున్నాను.వస్తాన్నాయనా. అమ్మాయీ..నేను చెప్పిందంతా గుర్తుందిగా"
లొడలొడా వాగేసిన 'యశోద బామ్మ' గారు , కాలిబొటనవేలితో నేలను సున్నితంగా గీతలు గీసున్న యశోద ను పందిరి మంచంమీద కూర్చున్న చంద్రశేఖర్ కు దగ్గరగా తీసుకువచ్చి నిలబెట్టి, ఆమె బుగ్గలు చిదిమి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ నిష్క్రమించింది.
అలా చిదిమినందుకే దానిమ్మపూవులాంటి యశోద చెక్కిళ్లు మంకెన పూవులయ్యాయి.
"తలుపు వేసి వస్తావా...నేను వేసి రానా?"
యశోద మాట్లాడలేదు.
చంద్రశేఖర్ లేచాడు. యశోద చంద్రశేఖర్ వైపు తిరిగింది. వెనుక ఉన్న చేతులలో ఏముందో తెలియకూడదన్నట్టు.
ఆమె వింత ప్రవర్తన కు విస్తుబోతూ అతను వెళ్లి తలుపు వేసివచ్చాడు.
గది గదంతా పందిరి మల్లెల పరిమళంతో ఘుమ్మెత్తిపోతోంది
సహజంగా పెళ్లికూతురు స్నేహితురాళ్లు శోభనంరాత్రి గదిని అలంకరిస్తారు. కానీ చంద్రశేఖర్ కోరికమేరకు అతని స్నేహితులు 'బుర్రలంక' వెళ్లి రెండు బట్టల పందిరిమల్లెలు మాలలుగా కట్టించి తెచ్చి పందిరిమంచాన్ని గదిని అలంకరించారు స్వయంగా.
"పందిరి మల్లెలంటే నీకెందుకురా అంత ఇష్టం?"అని వారడిగిన ప్రశ్నకు మల్లెలు కురిసినట్టే నవ్వాడతను.
"పందిరి మల్లెకు, కన్నెపిల్లకు నాకెందుకో చాలా సారూప్యం కనిపిస్తుందిరా.మగవాళ్లుగా మనలో శారీరక మార్పులు ఆడపిల్లలతో పోలిస్తే నెమ్మదిగానే జరుగుతాయి. కానీ ఆడపిల్ల అలా కాదురా.
12 ఏళ్ల వయసులో మల్లెతీగకున్న పసిరి మొగ్గలా ఉంటుంది. ఉంటుంది.13 ఏళ్ల వయసులో రూపం పెరిగి, పద్నాలుగేళ్ళ వయసులో లావణ్యం సంతరించుకుని. 15 ఏళ్ల వయసులో యవ్వన పరిమళాలు వెదజల్లుతూ వికసించే ఆమె, తన జీవితం ధన్యం అయ్యేంతవరకు మగవాడి నరనరాన మధురమైన భావన నింపి ఆ జీవన మాధుర్యాన్ని అతడికి అందించి కూడా వడులుతుందేమోగానీ వన్నె తరగదు. అందుకే పందిరిమల్లె అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆ నేవళం, కాంతి కిరణం మీద పడితే సజీవత్వంతో మిలమిల మెరిసే నిగారింపు గుణం మల్లెపూవుకు ఉన్నంతగా మరే పూవుకు లేదని ఉద్దేశ్యం .’’
రెండు రోజులుండి వాడిపోయే పువ్వు పట్ల కూడా నీకు ఇంత సున్నితమైన సునిశితమైన భావుకత ఉండబట్టే బంగారంలాంటి అపురూప సౌందర్యరాశి మా సిస్టర్ నీకు దొరికిందిరా. నువ్వు భర్త కావడం ఆమె అదృష్టం. ready to enjoy హ్యాపీ మూమెంట్స్’’ అంటూ అతన్ని భుజం తట్టి వెళ్ళిపోయారు వాళ్ళు.
స్నేహితులు ఎంతో కష్టపడి పందిరి మంచం చుట్టూ దట్టంగా వేలాడ దీసిన మల్లెల మాలలను రెండు చేతులతోనూ యశోద భుజాల మీద పడేలా ముందుకు వేశాడు చంద్రశేఖర్.
‘’ నీకు మల్లెలు అంటే ఇష్టమేనా యశూ...’’
యశోద ఆల్చిప్పల్లాంటి కళ్ళు పైకెత్తింది. ఒత్తైన విల్లు లాంటి కంటిపాపల మధ్య నుంచి సంధించిన బాణంలా వెలువడిన ఆమె కంటి చూపు ఔవునన్న భావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. గదులో ఫ్యాను గాలికి అటూ ఇటూ తిరుగుతున్న క్యాలెండర్లో, బాల కృష్ణుని చేతిలోని వెన్నుపూసంత నిర్మలమైన స్వచ్ఛమైనతెల్లదనాన్ని సంతరించుకున్న యశోద కళ్లను అతను ముద్దాడాడు పెదవులతో.
ఆమె తొలిసారి పూర్తి చేయబడిన వీనలా కంపించింది, ఒక్క క్షణం అతని మెత్తని పెదవుల ఒత్తిడికి.
ఆమె భుజాల మీద వేసిన తన చేతులను క్రమంగా కిందకి జార్చుతూ, వెనుకగా ఆమె దాచుకున్న చేతుల మణికట్టు దగ్గర పట్టుకుని ముందుకు తీసి చూసి ఉలిక్కిపడ్డాడు.
ఆమె రెండు చేతులు నిండా గోరింటాకు.
కుడి అరచేతిలో ‘యశోదచంద్ర’ అని ఎడమ అరచేతిలో ‘ఆయామ్ యువర్స్’ అని వ్రాసి అందమైన ఫినిషింగ్ తో చూడముచ్చటగా ఉంది.
అప్పటికి చాలా సేపు అయ్యింది కాబోలు తడారిపోయి ఉన్నాయి కోమలంగా నాజూకుగా ఉన్న ఆమె చేతి వేళ్ళు. ఆడవారి చేతి వేళ్ళని లేడీ ఫింగర్స్ అని ఎందుకు పోల్చాతో అపుడే అర్ధమైంది చంద్రశేఖర్కి.
అయితే మొదటి సారి అంత దగ్గరగా భర్త పేరుతో జీవితంలోకి ప్రవేశించిన కొద్ది క్షణాలకే ఏ రకమైన శక్తి ఈ ప్రపంచంలో అందించని తాపపు వెచ్చదనంతో తనను చుంబించి తన్మయత్వంలో ముంచి, తద్వారా గుండె వేగాన్ని రక్తపు ఉష్ణోగ్రతను పెంచటం వలన తన చేతుల గోరింటాకు తడి ఆగిపోయిందని యశోద కు మాత్రమే తెలుసు.
‘’ఈవేళ మన శోభనం అని తెలిసే గోరింటాకు పెట్టుకున్నావా?’’ అన్నాడతను నిస్సత్తువగా నిస్పృహ చెందుతూ. ఆమె తల అడ్డంగా ఊపింది.
“ మరి?’
‘’ మీకు మల్లెపువ్వులు అంటే ఎలా ఇష్టమో నాకు గోరింటాకు అంటే అంత ఇష్టం. మీరు చొక్కా, బనీను తీసేయండి. లేకపోతే మీ బట్టలన్నీ పాడైపోతాయి.’’
‘’మరి నీ బట్టలు పాడవవా?’’
‘’ అది మీ చేతుల్లోనే ఉంది’’
‘’అంటే?’’
‘’ ఏమో నాకేం తెలుసు? బామ్మ ‘ నీ బట్టలు ఏమాత్రం గోరింటాకు మరకలతో పాడవకుండా చూసుకో. అలా గోరింటాకు చెదరకుండా శుభకార్యం జరిగితే కుంకుమ పువ్వు లాంటి కూతురో, దబ్బపండు లాంటి కొడుకొ పుడతాడు’ అంది.’’
‘’ అంటే నా చాతుర్యానికి పరీక్ష అన్నమాట. అది సరే. గదిలోకి పాలతో పంపిస్తారు కదా... ఈ మజ్జిగ పంపారు ఏమిటి మీ బామ్మగారు?’’ అడిగాడు చంద్రశేఖర్.
‘’ ఉష్ణం ఉష్ణేన శీతలం అట. పాలైతే వేడి చేస్తాయి. అసలే నిద్ర ఉండదు. అందుచేత శరీరపు చలువదనానికి ఒక సారి ఈ మజ్జిగ తాగి చూడమను. ఇక ఏ రాత్రి మీ ఆయన పాలు అడగడు మజ్జిగ తప్ప’ అని బామ్మ చెప్పిందండి.’’
అతడు టీపాయ్ మీద గ్లాసు తీసుకుని యశోద పెదవులకు తాకించి కొంచెం తాగించి , వెంటనే ఆమెను చూస్తూనే మిగతాది తాగాడు.
జీవితంలో ఎన్నో సార్లు మజ్జిగ - దబ్బాకు వేసింది, పంచదార వేసి లస్సీ గా చేసింది, నిమ్మ మజ్జిగ, ఆలా రకరకాల మజ్జిగ తాగాడు కానీ ఇంత అద్భుతమైన రుచి అతను ఏనాడు ఆస్వాదించలేదూ. కమ్మదనం, ఘాటు, పులుపు, కారం, కరివేపాకు సువాసన కలబోసిన మజ్జిగ తాగిన అతను సురాపానం చేసిన గంధర్వుడి లా ఉన్నాడు.
‘’ అసలు ఈ వేసవి కాలం పెళ్లిళ్లు ఎందుకు చేస్తారో తెలియదు. గదిలో ఫ్యాను విష్ణు చక్రం తిరుగుతూనే ఉన్నా ఎన్ని చెమటలు పడుతున్నాయో చూసావా?’’
అతను తన తెల్లని సిల్కు లాల్చీ తీసేసి లుంగచుట్టి దూరంగా విసిరేశాడు. యశోద అతని మెడ కిందుగా చూసింది.
ఈస్ట్ మన్ కలర్ దేహంలో కష్టించి పని చేయడంలోని ‘చేవ’ తెలిసినట్లుగా కండలు తిరిగిన అతని జబ్బాల పైకి చూస్తే భుజాలు గుండ్రంగా నున్నగా మెరుస్తూ ఉంటే అయస్కాంతాన్ని చూస్తూనే అతుక్కుపోయే లోహపు లక్షణం కలిగినట్లే గా అయ్యింది యశోద మనసు.
‘’మరి బనీను?’’ అన్నట్టు చూసింది యశోద.
అతను బనీను కూడా తీసేసాడు. సింహాచలం సంపెంగ రంగులో ఉన్న అతని విశాలమైన ఛాతి పై అందమైన పార్కులో తీరువుగా, చూస్తుంటేనే దిష్టి తగిలే విధంగా, అత్యంత శ్రద్ధతో పెంచినట్లు ఉన్నాయి అతని వయసు పొగరును తమలో దాచుకున్న రోమాలు.
పందిరి మంచం చుట్టూ కట్టిన పందిరిమల్లె దండలను మొదట్లోకి తుంచి తన శరీరం చుట్టూ చుట్టుకున్నాడు అతను.
ఆమె విస్మయంగా చూసి అడిగింది.’’ ఎందుకలా?’’
‘’ఈ గదిలో ఉన్న ప్రతి పుష్పం మన సంగమానికి సాక్షిగా మిగలడం నాకు ఇష్టం లేదు. మన మధ్య అనురాగపూ అనుభూతిని అవి కూడా పంచుకోవాలని’’ అతను కొంటెగా చూస్తూ అన్నాడు.
‘’ అదెలా?’’ విచిత్రంగా చెరుకు విల్లులాంటి తీరైన కనుబొమ్మలు ఎగుర వేస్తూ అడిగింది యశోద.
‘’ ఇలా ‘’అని చంద్రశేఖర్ సమాధానం నోటితో చెప్పలేదు.
ఆమెను సున్నితంగా రెండు చేతుల మీదుగా ఎత్తుకుని మంచం దగ్గరకు రాగానే, ఆమె శిల్పి చేతిలో రూపం పోసుకుని జీవకళ ప్రతిష్ఠింప చేసుకునే బొమ్మలా, మెత్తని పువ్వులు పరిచినా పానుపు పైకి వెనక్కు నెమ్మదిగా వాలిపోయి గోరింటాకు చెదరకుండా రెండు చేతులు మంచానికి ఇరువైపులా చాచి, అర్ధ నీమీలిత నేత్రాలతో అతన్ని గమనిస్తూ మనోచిత్రం లోని భావాలను మననం చేసుకోసాగింది. ఆ భావాలను నిజం చేస్తూ తనను చుట్టుముట్టిన ఒక్కొక్క మబ్బులు దాటుకుంటూ పూర్ణ చంద్రునిలా ప్రకాసించడం కోసం ‘సంసార రధం’ పగ్గాలను చేతబూని ప్రయాణించడానికి ఉద్యుక్తుడయ్యాడు చంద్రశేఖర్.
********
మరుసటి రోజు ఉదయం గది తలుపులు తెరుచుకుని బయటకు రాగానే బామ్మ యశోదను అడిగింది.
‘’ మీ ఆయన గెలిచాడా ఓడాడ? నిజం చెప్పవే యశూ.’’
‘’ నువ్వే చెప్పుకో’’ యశోద నిర్లక్ష్యంగా చూపు విసిరి అంది బామ్మ గారితో.
ఆమె యశోద రెండు చేతులూ తీసుకుని చూసింది.
‘’సగం గోరింటాకు పాముకు పోయినట్టుగా, కొంచెం ఎండిపోయినట్లుగా , మిగతాది రాలిపోయినట్టు గా ఉన్నాయి చేతులు.
తన శరీరం అంతా కదిలి పకపకా నవ్వి అంది బామ్మ గారు.
‘’ఈ కాలం కుర్రాళ్ళకి దూకుడెక్కువ. ఆడ పిల్లలకు ఓపిక తక్కువ. చూడు తోటకూర కాడల ఎలా వాడిపోయావో? కళ్ళు చూడు... వాడిన కలువపూలల్లా ఎలా ఉన్నాయో? అయ్యో పిచ్చి పిల్లా. మా మొదటి రాత్రి నాడు మీ తాతగారు అయిన పాలన్నీ తాగేసి గుర్రు పెట్ట బోతుంటే మొహం మీద చెంబుడు నీళ్లు చల్లి తెల్లవార్లు నిద్రపోకుండా చేశాను తెలుసా. మా బామ్మ నాకు ఆలాంటి ట్రైనింగ్ ఇచ్చింది. హు. నువ్వు ఉన్నావ్ ఎందుకు?’’
‘’బామ్మా..నువ్వు ఏమన్నావ్? నా బట్టలు గోరింటాకు మరకలు కాకూడదు అన్నావ్... అవునా?’’
‘’ అవును’’
‘’ మరి నా బట్టలు ఎక్కడైనా గోరింటాకు మరకలయ్యాయేమో చూడు?’’ బామ్మ నిశితంగా పరిశీలించింది.
‘’ఔనే యశూ. ఒక్క గోరింటాకు మరక కూడా కాకుండా ఎలా మేనేజ్ చేశావే?’’ అని బుగ్గలు నొక్కుకుంది.
ఒరగా వేసిన గది తలుపు నెమ్మదిగా తీసి చూపుడు వేలుతో లోపలికి చూపించింది యశోద,
చూసిన బామ్మగారు నిశ్చేష్టురాలై యశోద బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది మనవరాలి గడుసుదనానికి మురిసిపోతూ.
మంచం చుట్టూ కట్టిన పందిరిమల్లె దండలన్నింటి మీదా బోర్లా పడుకుని గాఢనిద్రలో ఉన్న చంద్రశేఖర్ అనాచ్చాదిత వీపు నిండా, యశోద చేతుల గోరింటాకు అంటుకున్న ప్రతి చోట ఎర్రగా పండి వింతైన అందంతో గర్వంగా మెరుస్తున్నాయి - ప్రియురాలి చెక్కిలిని మునిపంటితో మృదువుగా కొరికిన ప్రియుడి పంటిగాట్లలా.
*****
అది మొదలు ప్రతి రాత్రి యశోద తన భర్త దగ్గర తాను ఉన్నంతవరకు ‘ఆ’ మజ్జిగ ఇవ్వడం అనేది దేవుని ముందు దీపారాధన చేసేంత పవిత్ర కార్యంగా భావించి చేసింది.
నలభై వసంతాల కాపురంలో ముత్యాల్లాంటి ఇద్దరు బిడ్డలు. ఒక మగ - ఒక ఆడ, కలగడం. భగవంతుని కృప వల్ల రత్నాలవంటి తోడు వారికి దొరకడం, ఎవరి జీవితాలలో వారు స్థిరపడి సుఖంగా సంసారం చేసుకుంటూ సెలవులకు తమ తమ కుటుంబాలతో రిటైర్ అయిన ‘యశోద చంద్రశేఖర్ నివాస్’ కి వచ్చి సరదాగా సంతోషాలతో గడిపి వెళ్ళడం నిజంగా పూర్వజన్మ సుకృతమే అనుకుంటారా దంపతులు. నెల క్రితమే చంద్రశేఖర్ షష్టిపూర్తి కూడా ఎంతో ఘనంగా నిర్వహించి వెళ్లారు పిల్లలిద్దరూ.
మనుమలతో పాటు సమానంగా పరిగెత్తుతూ, క్రికెట్ ఆడుతూ, జాగింగ్ చేస్తూ నిత్యనూతన యవ్వనవంతుడిలా తాను ప్రవర్తించ గలుగుతున్నాడు అంటే అదంతా కేవలం యశోద ‘మజ్జిగ’ వలనే అని అతని విశ్వాసం.
పని అంతా పూర్తి చేసి వచ్చిన యశోద తమలపాకుల చిలకలతో ఐదు వెళ్ళు ముందుకు చాచే సరికి ఈ లోకం లోకి వచ్చాడు చంద్రశేఖర్.
ఈఊట్టు నెరిసినా, వయసు వచ్చినా కళ్ళ కింద నల్లని చారలు గాని, ముఖంలో ముడతలు గాని ఎక్కడ మచ్చుకైనా కనిపించని భర్త మొదటి రాత్రి ‘చంద్రశేఖర్’ అలాగే కనిపిస్తాడు యశోద కళ్ళకు.
‘’ యశోడా.. ఇన్నేళ్లు మన జీవితం ఇంత అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది అంటే నీ వల్లనే.చచ్చి స్వర్గాన ఉన్న మీ బామ్మ గారి చలువ వల్లనే. అయితే ఇన్నేళ్ళూ గోరింటాకు గుర్తులు అరచేతిలో చెరిగి పోయిన మరునాడే మళ్ళీ గోరింటాకు పెట్టేసుకుని నా ముందు మొదటి రాత్రి యశోదలాగే ఇన్నాళ్లూ నువ్వు నిలబడేదానివి. గోరింటాకు అంటే నీకు ఎందుకంత ఇష్టమో ఇప్పుడైనా చెబుతావా?”
చంద్రశేఖర్ కుర్చీలోంచి లేచి ముందుకు వంగి అడిగాడు.
ఆమె వేళ్ళకున్న తమలపాకుల చిలకలను అందుకుంటున్న అతని మోకాళ్ళమీద తల ఆనించి చెప్పసాగింది యశోద.
‘’ ఇందులో దాచడానికి ఏముందండి? ఆడపిల్లగా ప్రకృతి సహజమైన గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. మన చుట్టూ ఎన్నో రకాల చెట్లు మొక్కలు ఉన్నాయి. మనం ఏ డిజైన్ లో పెట్టుకుంటే ఆ రకంగా మన చేతికి అందాన్ని సువాసన మిగిల్చి మరునాడు మట్టిలో కలిసిపోయే గోరింటాకు అంటే మొదట్లో జాలి వేసేది. మొదటి రాత్రి మన ఇద్దరికీ బామ్మ చేసిన బోధ, నాకు గోరింటాకు పెట్టి గదిలోకి పంపడం నన్ను బాగా ఆలోచింపచేసింది. మీ సహజీవనంలో నా భావాలకు ఒక అర్థం ఏర్పడింది. ఈ ప్రపంచంలో ఆలోచనా జ్ఞానం ఉన్న ఏ మానవుడికైనా, ఆలోచించలేని జంతువుకైనా ఆకలి, శారీరక వాంఛ ఒకటే విధంగానే ఉంటాయి. ఆలోచనా జ్ఞానం లేని జంతువులు ఋతు ధర్మాన్ని అనుసరించి బిడ్డలను కని తమ జాతిని అభివృద్ధి చేసుకుంటాయి. కానీ పద్మవ్యూహం లాంటిది జీవితం లో, అనుక్షణం ఎదుర్కునే సమస్యలకు ఒక పరిష్కారం వెతుక్కుంటూ మానవుడు మనుగడ సాగించాలంటే అతనికి పరిపూర్ణ ఆరోగ్యం అవసరం. యవ్వనం ఉన్నంతకాలం గోరింటాకు పెట్టుకున్న చేతుల్లా జీవితం రంగవల్లిలా గడిచిపోతుంది. కానీ యవ్వనం తగ్గి వృద్ధాప్యం లోకి అడుగుపెట్టక, గోరింటాకు తీశాక కూడా దాని సువాసన పోని చేతుల్లా ఆ యవ్వన అనుభవాల అనుభూతులు మనల్ని పునరుజ్జీవింప చేస్తాయి. మీ పందిరిమల్లెలు జీవిత పరమార్థాన్ని తెలుసుకునేందుకు సహకరిస్తే, నా గోరింటాకు ఆ జీవన పరమార్థపు తాత్వికతను అర్థం చేసుకునేందుకు ఉపకరించింది. అందుకే గోరింటాకు అంటే నాకు అంత ఇష్టం. కానీ.. కానీ.. ఈ మధ్యనే నన్ను ఒక అనుమానం వేధిస్తోంది.’’ ఆమె కళ్ళలో గిర్రున తిరిగి నిండు చూసి అతను నివ్వెరపోయాడు.
‘’యశోద. ఏమిటిది?’’ ఆతృతగా అడిగాడు ఆమె తల మీద చేయి వేసి.
‘’ అవునండి. ప్రతి రాత్రి మీకు ‘మజ్జిగ’ ఇచ్చి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ మీద పడి బలవంతంగా కాపురం చేయిస్తున్నానే. మీరు... మీరు... నన్ను ఎక్కడ ఒక శూర్పణఖ లాగా. ఓ హిడింబి లాగా, కామపిశాచి అనుకుంటారేమో అని భయం వేస్తోందండీ..’’
నిండుగా ప్రవహిస్తున్న నది చెలియలికట్ట తేగినట్టుగా జలజలా కారుతున్న ఆమె అశ్రువులు చూస్తూనే కలవరి పోయాడు చంద్రశేఖర్.
‘’యశూ. ఈ వయసులో కూడా నేను ఇలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాణతే అంటే కారణం ఎవరు? నువ్వు-నీ ప్రేమ. నా పట్ల నీ నమ్మకం నీ అనురాగం. భార్యాభర్తలు ఈ వయసులో కూడా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యము ‘కాపురం’ అవసరం. నాకు ఆరోగ్యం, నీకు సౌభాగ్యం ఉన్నంత కాలం ఈ మార్గాన్నిఅనుసరించమనే ఆనాటి మీ బామ్మగారు చేసిన జీవన పాఠం. ప్రకృతి పురుషుల కలయిక ఉన్నంతకాలం ఆరోగ్యమైన సృష్టి జరుగుతుంది. అనవసరమైన అనుమానాలు మానేసి నేను చెప్పినట్టు విను.’’
ఏమిటన్నట్టు చూసింది యశోద. ఆమె కన్నీటిని తుడిచి పడక కుర్చీకి తగిలించిన సంఛీ లోంచి పొట్లం తీసి విప్పాడు. అది పందిరి మల్లెల మాల. వెనక్కి తిరిగిన ఆమె సిగలో దానిని తురమగానే గానే ఆమె మజ్జిగ గ్లాసుతో పడకగదిలోకి నడిచింది.
ఆ మల్లెల సువాసనను ఆఘ్రాణిస్తూ ఆమెను అనుసరించాడు అతను!!!
సమాప్తం.