Phanikiran AK

Drama

5.0  

Phanikiran AK

Drama

తొలి అడుగు

తొలి అడుగు

6 mins
794


స్వప్న, సంధ్య... ఇద్దరు మంచి స్నేహితులు... 

ఇరుగు పొరుగు వారవడం వల్ల.. వాళ్ళ స్నేహం పసివయసు నుంచే మొదలై వారితో పాటే పెరిగి పెద్దయ్యింది. 


ఒకే కాలేజి లో చదువు పూర్తి చేశారు.


స్వప్న ఒక ప్రైవేట్ ఫర్మ్ లో ఉద్యోగం చేస్తోంది..


ఇంట్లో ఉండి ఇంటి పని అంటూ మనల్ని మనం పనిమనుషులుగా మార్చుకోవడం అంతా నాన్సెన్స్ అనేది స్వప్న అభిప్రాయం. 


అందరూ ఉద్యోగాలు చేస్తే కుటుంబ వ్యవస్థ ను సవ్యంగా నడిపేదెవరు... పైగా అవసరం లేకపోయినా స్త్రీ ఉద్యోగం చేస్తే నిజంగా ఉద్యోగం అవసరం ఉన్నవాళ్లు పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనేది సంధ్య ఆలోచన. 


"నీవన్నీ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు" అని సంధ్య ను ఎద్దేవా చేస్తుంది స్వప్న.. 


"పాత చింతకాయ పచ్చడే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెబుతోంది " అంటూ రిటార్ట్ ఇస్తుంది సంధ్య. 


వీరిద్దరి అభిప్రాయాలూ వారి వారి కోణాల లో నిజమే అయినా వారిద్దరి వాదనలలో తల దూర్చి తల బొప్పి కట్టించుకోవటం అనే ప్రక్రియ కు ఇరువురి పెద్దలూ దూరంగా వుంటారు. 


వారిద్దరి వివాహము కొద్ది నెలల తేడాలో జరిగింది. 


ఇద్దరూ వేరు వేరు ఊళ్ళు కావడం వల్ల పండగలకు, విశేషమైన వాటికి ఇద్దరు ఒకేసారి వస్తే కలుసుకోవడమే కానీ తరచూ కలిసే అవకాశం ఉండేదికాదు. 


సంధ్య ఉత్తరాలు రాస్తే..... స్వప్న మాత్రం మెసేజ్ పెట్టేది నీలాగా ఉత్తరాలు రాసే ఓపిక నాకు లేదు అంటూ.. 


"పోనీలే . కనీసం రాసిన ఉత్తరం చదువుతున్నావుగా అది చాలు " అనేది సంధ్య. 


"ఇంత పాజిటివ్నెస్ ఏమిటే బాబు " అంటూ స్వప్న ప్రశ్నిస్తే.. 


"మనసుని బాధపెట్టే నెగెటివ్నెస్ కంటే మనసుని సంతోష పెట్టే పాజిటివ్నెస్ మంచిదేగా " అనడం సంధ్య అలవాటు . 


ప్రతి దానిలో ఆపోజిట్ గా ఉండే వీరిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఎలా ఏర్పడిందో అని అందరూ ఆశ్చర్య పోతుంటారు. 


ఇలా కాలం గడుస్తున్నవేళ... స్నేహితులు ఇద్దరు తల్లి కాబోతున్న శుభవార్తను ఓకేసారి తెలియచేయడంతో ఇరువురి ఇళ్లల్లో సంతోషం చిందులు వేయడం మొదలయింది..


ఏడవ నెల రావడంతో, తన ఉద్యోగానికి శెలవు పెట్టి పుట్టింటికి వచ్చింది స్వప్న. ..


సంధ్యను కూడా పుట్టింటికి తీసుకొచ్చారు తల్లితండ్రులు. 


ఇక ఇద్దరికీ ఇలాగైనా కొద్దిరోజులు కలిసి కబుర్లు చెప్పుకునే అవకాశం దొరికిందని సంతోషపడిపోయారు స్నేహితులిద్దరూ. ..


-----౦౦౦౦౦౦౦౦౦-----


ప్రయాణ బడలిక తీరాకా ఓ రోజు సాయంత్రం , తమకు గురువు, మాతృసమానురాలు అయిన తమ కాలేజీ ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్ళారు స్వప్న, సంధ్య ఎలాగూ సాయంత్రం నడకకు వెళుతున్నాం కదా అని. 


"అబ్బబ్బా..ఏంటో ఈ పిల్లలు..పెంపక లోపమో లేక లోకం తీరే అంతో అర్ధం కావటం లేదండీ..ఎక్కడ చూసిన అత్యాచారాల

వార్తలే...పిచ్చెక్కిపోతోంది.." అంటూ అప్పుడే బయట నుండి ఇంట్లోకి అడుగుపెడుతూ భర్తతో చెప్పడం మొదలుపెట్టారు అనసూయాదేవిగారు.


"ఇంతకీ ఏమైంది మేడం"


ఆ ప్రశ్నకు తలతిప్పి చూసిన అనసూయాదేవికి సోఫాలో కూర్చుని ఉన్న తన ప్రియశిష్యురాళ్ళు స్వప్న, సంధ్యలు కనపడేసరికి ఆశ్చర్యం,

ఆనందం కలగలసిన భావం ముఖంపై ప్రతిఫలిస్తుండగా. ...


"అరె స్వప్న, సంధ్య...మీరు ఎప్పుడొచ్చారు" అని అడుగుతూ వారి వద్దకు వచ్చింది మేడం.


"పిల్లలు వచ్చి చాలా సేపయ్యింది..నీకోసమే ఎదురు చూస్తున్నారు" అంటూ నాలుగు కాఫీ గ్లాసులను ట్రే లో పెట్టుకొని వంట ఇంటిలోంచి

బయటకు వచ్చారు రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి, అనసూయాదేవి గారి భర్త జగన్నాధ౦ గారు.


ఆయన్ను చూసి సంధ్య లేవబోతుంటే, 


వారించి అందరికి కాఫీ గ్లాసులు ఇచ్చి తాను ఒకటి తీసుకుని అనసూయాదేవిగారి పక్కన కూర్చున్నారు. 


"థాంక్యూ సర్ ఫర్ దిస్ కాఫీ" చెప్పింది సంధ్య కమ్మని కాఫీ వాసనను, దాని రుచిని ఆస్వాదిస్తూ..


"సంధ్యా....నీకు ఎన్నిసార్లు చెప్పాను..నన్ను బాబాయిగారు అని పిలవమని" చిరుకోపంతో అన్న జగన్నాధం గారిని చూసి,


"ఆవిడని మేడం అని పిలుస్తున్నాము...మిమ్మల్ని సార్ అని పిలవడమే బాగుంటుంది" అంది స్వప్న


"ఇదుగో అమ్మాయిలూ...మీ గురుశిష్యులు ఒకరిని ఒకరు ఎలా పిలుచుకుంటారో నాకు సంబంధం లేదు..మీరు మాత్రం నా కూతుళ్లు...నేను మీ

బాబాయిని అంతే'" డిక్లేర్ చేశారు జగన్నాధ౦ గారు.


అనసూయా దేవి చిరునవ్వుతో చూశారు వారి వైపు. ..


ఆ దంపతులకు పిల్లలు లేరు. ..ఆవిడ, ఆయన వారిద్దరిని తమ పిల్లల్లాగే చూస్తారు. ..


"అది సరే..ఇంతకీ నన్ను తాత అని పిలిచే వాళ్ళు వచ్చేది ఎప్పుడు" అడిగారు జగన్నాధంగారు.


"డాక్టర్ జనవరి ఒకటి అని డేట్ ఇచ్చారు" చెప్పింది సంధ్య


"శుభం..కొత్త సంవత్సరం నాడు ఓ కొత్త అధ్యాయం మొదలవుతుంది అన్నమాట" అన్నారు ఆయన.


"అది సరే సంధ్యా..మీ ఇద్దరు ఎందుకొచ్చారు...అసలే ఏడవనెల కూడాను" అన్నారు మేడం.


"భలేవారు మేడం..శిష్యులు గురువు కోసం రావాలి...అదే పద్ధతి" అంది సంధ్య


" అది ఉత్తప్పుడు...ఇలాంటప్పుడు కాదు" మందలింపుగా అన్నారు ఆవిడ


"ఎప్పుడైనా పద్దతి పద్దతే గా" అంది స్వప్న.


"ఏం పద్దతో..అమ్మ చెప్పింది మీ రాక గురించి...నేనే మర్చిపోయాను...ఈ మధ్య రోజుకో గోల..గొడవ..విసుగొస్తోంది కాలేజీకి వెళ్ళాలంటే" అన్నారు మేడం.


ఆవిడ ఓ ప్రైవేట్ కాలేజీ కి ప్రిన్సిపాల్ గా చేస్తున్నారు. 


"ఏమైంది మేడం" అడిగింది సంధ్య.


"ఏంటో తప్పు అర్ధం చేసుకోలేని పిల్లలదో లేక అర్ధం అయ్యేలా చెప్పలేని తల్లి దండ్రులదో , లేక ఆకర్షణలకు లోను చేసే ఆధునిక ప్రపంచానిదో అర్ధం కావటం లేదు" నిస్పృహగా అన్న అనసూయ గారిని ఆశ్చర్యంగా చూశారు స్నేహితులు ఇద్దరు.


"అదేంటి మేడం...అలా మాట్లాడుతున్నారు...మీ శిష్యులు ఈ రోజు మంచి స్థితిలో ఉన్నారంటే అందుకు మీరేగా కారణం...అలాంటిది మీరిలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది" అంది స్వప్న.


"ఏ చేయమంటావు...స్నేహం పేరుతో జరిగే మోసాలు, ప్రేమ పేరుతో జరిగే అత్యాచారాలు, పసిపిల్లలు, పెద్దవాళ్ళు అన్న బేధం లేకుండా ఆడది అంటే చాలు అన్నట్లు ఉన్న తీరు, రక్షణ లేని జీవితాలు చూస్తుంటే మన౦ సమాజంలో ఉన్నామా, అరణ్యాలలో ఉన్నామా అని అనుమానం వస్తోంది" అన్నారు మేడం


"నిజమే మేడం..అసలు ఆడపిల్లను కనాలంటేనే భయమేస్తోంది" అంది స్వప్న.


"బాగుంది...ఊరి చివర రోడ్డు మీద...రోడ్డు సరిగా లేనందున ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయని ఊరే దాటనని భీష్మించుకుని కూర్చుందిట నీలాంటిదే ఒకతి...అలా ఉంది నువ్వు చెప్పేది" అంది సంధ్య


"అంటే ఏంటి" చిరుకోపంతో అడిగింది స్వప్న


"లేకపోతే ఏంటి...ప్రమాదం ఎందుకు జరుగుతోందో తెలుసుకుని దాన్ని సరిచేయడానికి ప్రయత్నించకుండా , ఆ మూర్ఖురాలికి తందానా అనడం తప్పేగా...ఇలాగే మన తల్లిదండ్రులు ఆలోచిస్తే ఈరోజు మనముండే వాళ్లమా" అడిగింది సంధ్య


"అంటే ఏంటి నీ ఉద్దేశ్యం....నా ఆలోచన తప్పనా" కోపంగా అడిగింది స్వప్న.


నవ్వింది సంధ్య తన స్నేహితురాలి కోపం చూసి. 


"స్వప్నా...మనిషి ఆదిమానవుడిగా అడవులలో తిరిగిన నాటి నుండి నేటి ఆధునిక మానవుడిగా మారినంత వరకూ స్త్రీ పై బల నిరూపణ అనేది జరుగుతూనే ఉంది...దానికి స్త్రీయే కారణం కావడం ఇంకా బాధపడవలసిన విషయం" నిట్టూరుస్తూ అంది సంధ్య.


"అదేంటమ్మా...స్త్రీని అంత మాట అన్నావు..అంటే పెంపక లోపం స్త్రీదే అంటావా" అన్నారు జగన్నాధం గారు ఆశ్చర్యంగా..


ఆయనకు సంధ్య గూర్చి, ఆ అమ్మాయి ఆలోచనా సరళి గురించి బాగా తెలుసు. .కారణం లేకుండా తొందరగా మాట అనడం అనేది తను చేయదు. 


"స్త్రీది తప్పు అనట౦ లేదు సార్...క్షమించ౦డి బాబాయి గారు...స్త్రీని, మాతృస్థానాన్ని కించేపరిచే ఉద్దేశ్యం తో అనలేదు. ...స్త్రీయే తొలిగురువు...కానీ ఆ గురువు తొలి అడుగునే తప్పుగా వేయించట౦ వల్లనే ఈ పరిస్థితులు" అంది సంధ్య


"అంటే" ఒకేసారి అన్నారు అనసూయా జగన్నాధ౦ గార్లు.


"ఆడ మగ మధ్య ఉన్న బేధాన్ని తొలిగా చెప్పేది స్త్రీయేగా...కాదంటారా" అ0ది సంధ్య


"అంటే నువ్వు పెద్దల పెంపకాన్ని, పురాణాలను తప్పు పడుతున్నావా" అడిగింది స్వప్న


అప్పుడే వారి మాటలను తానూ వినాలన్నట్టు, వారి సంభాషణ తనకు ఆశక్తి ని కలిగిస్తున్నట్టు కాలం కానీ కాలం లో ప్రకృతి కూడా సిద్ధం అయినట్టుగా బయట ఆకాశం మేఘావృతం కావడం మొదలుపెట్టింది . 

"పెద్దల పెంపకాన్ని తప్పు పట్టటం లేదు...పురాణాలను కించపరచడం లేదు...నాకు అంత పురాణ జ్ఞానం కూడా లేదు...కానీ నాకు తెలిసినంత వరకూ ఏ పురాణం పురుషుడే ఆధిక్యుడు అని చెప్పలేదు....శక్తి లేనిదే లోకం లేదన్నారు...ప్రకృతి లేనిదే పురుషుడు లేదంది పురాణం..ఇద్దరికీ సమస్థానం ఇచ్చింది....ఇక పెద్దల పెంపకం అంటావా....లోపాలను సరిదిద్దాల్సిన పెద్దలే ఆ లోపాలను అసలైన అంశాలుగా, అసలైన వాటిని లోపాలుగాను పరిగణిస్తూ పిల్లల ను పెంచితే..ఇదిగో నేటి సమాజంలో మనం చూస్తున్న పరిస్థితులే కనబడతాయి" అంది సంధ్య


"అంటే పుట్టగానే ఆడా ,మగ అంటూ చెప్పడం తప్పంటావా" ప్రశ్నించింది స్వప్న


అనసూయా జగన్నాధ౦ గార్లు సంధ్య వైపు ఆశక్తిగా చూశారు ఏ జవాబు చెప్తుందా అని.


"పుట్టగానే ఆడ మగ అంటూ చెప్పడం సహజ ప్రక్రియ...కానీ పెంపకంలో మాత్రం స్త్రీ బలహీనతను పదేపదే ప్రస్తావించడం, మగాడి బలాన్ని ఆకాశానికి ఎత్తేయడం ఎంతవరకూ సమంజసం నువ్వే ఆలోచించు" అంది సంధ్య


"నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి అని చెప్పకూడదంటావా" అడిగారు అనసూయగారు.


"నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు...అది ప్రకృతే వారికి తెలియ చేస్తుంది...కానీ నువ్వు స్త్రీవి, శారీరకంగా బలహీనురాలివి అని పదేపదే చెప్తూ, మానసికంగా బలవంతురాలైన స్త్రీని బలహీనురాలిని చేయాలనే పెంపకం, నువ్వు మగాడివైనా ,బలవంతుడివైనా మానసికంగా బలహీనుడివి అని పదేపదే ఎందుకు చెప్పదు" అడిగింది సంధ్య.


ఆ ప్రశ్నకు ముగ్గురూ ఆలోచనలో పడ్డారు


"అసలు నువ్వు అమ్మాయివి, నువ్వు అబ్బాయివి అని కాక ముందుగా నువ్వు మనిషివి అని ఎందుకు చెప్పరు " ప్రశ్నించిన సంధ్యను నిర్ఘాంతపోయి చూశారు ముగ్గురు .


"ఏనాడైనా, ఎవరైనా, ఎపుడైనా, నువ్వు మగాడిగా పుట్టడానికి ముందు మనిషిగా పుట్టావు ...ఆ తర్వాతే నువ్వు మగాడివి అని చెప్పి పెంచారా ...లేదే ...పుట్టిన క్షణం నుండి వాడికేం మగపిల్లాడు, మగమహారాజు, నువ్వు మగాడివిరా అంటూ అనుక్షణం తొలిగురువైన తల్లి తన బిడ్డను, తన మరో బిడ్డయిన ఆడపిల్ల ముందే ఆకాశానికి ఎత్తేస్తుంటే పెరిగి పెద్దయిన వాడు ఎలా ఉంటాడు.

నువ్వు మగాడి కంటే ముందు మనిషివి, మానవత్వానికి ప్రతిరూపానివి అని, స్త్రీ కూడా నీలాగే మనిషని చెప్పి పెంచితే బహుశా నేటి సమాజంలో కొంత మేరైనా మగాడి అకృత్యాలు తగ్గేవేమో" అంటూ ముగించిన సంధ్యను అప్రతిభులై చూశారు ముగ్గురూ .. 


తన ప్రశ్నల్లోనూ, తన వాదనలోను నిజం లేకపోలేదు ..కానీ ఎంత ఆధునికతను ఆపాదించుకున్న ఇంకా మగాడు మహారాజే అనే ఈ సమాజం ఈ వాదనని అంగీకరిస్తుందా ..దాని ఆచరణకు ప్రయత్నిస్తుందా. ..వారి ఆలోచనలు ఇలా సాగుతుంటే. ...


సంధ్య నెమ్మదిగా లేచి నుంచుంది. ..


"అమ్మా సంధ్యా" అని పిలిచిన మేడం వైపు చిరునవ్వుతో చూసిన సంధ్య,

"ఎవరో రావలి , ఏదో చేయాలి అని చూడడం అవివేకం...త్వరలోనే తల్లి స్థానాన్ని పొందబోతున్న నేనే పుట్టే బిడ్డ మగవాడైతే బిడ్డకు తొలి గురువుగా తొలి అడుగు నేనే వేస్తాను . ...రాబోయే తరానికి స్త్రీ అంటే ఇలా ఉంటుంది అని ప్రదర్శన శాలలో చూపించే దుస్థితి నుంచి తప్పించే యజ్ఞానికి నేనే తొలి జ్యోతిని వెలిగిస్తాను. .నాతో చేయి కలిపే వారెవరో, నా అడుగును అనుసరించే వారేవరో కాలమే నిర్ణయిస్తుంది. " అంటూ ముందుకు అడుగు వేసిన సంధ్య చేతిని పట్టుకుంటూ. ..


"చిన్ననాటి స్నేహితురాలిగా నీ తొలి జ్యోతికి నేను మరో జ్యోతిని జత చేస్తాను...నీ అడుగుకు నే తొలి వారసురాలిని అవుతాను," అంటూ తనూ లేచి ఆ దంపతుల వద్ద శెలవు తీసుకొని ఆ ఇద్దరూ బయటకు వెళుతుంటే...


"అమ్మా సంధ్య..మరి పుట్టేది ఆడపిల్ల అయితే"అడిగారు జగన్నాధ౦ గారు...


ఆ ప్రశ్నకు ఆగి, వెనక్కు తిరిగి 


"ఆడపిల్ల అయితే మృగాళ్ళను వేటాడే వేటగత్తె ను చేస్తాను" అని స్నేహితురాలితో కలిసి అడుగు బయటకు వేసింది సంధ్య.


వారి నిర్ణయానికి , సంకల్పానికి ప్రకృతి సైతం తన మద్దతుని తెలుపుతున్నట్టుగా చినుకులనే అక్షింతలుగా రాలుస్తూ తన ఆశీసులు అందించటం మొదలు పెట్టింది. ..


ఆ దృశ్యాన్ని చూసిన మేడం దంపతులు, చెరో గొడుగు తీసుకుని, ఆ స్నేహితులిద్దరికీ పడుతూ, 


"మీ అడుగుకు బాసటగా మేము నిలుస్తాము...మీ యజ్ఞం సఫలం కావడానికి మా వంతు కృషి చేస్తాము, " అని మనసులోనే ప్రతినబూనుతూ,భావి తరానికి మానవత్వాన్ని అందించడానికి కదిలిన ఆ స్నేహితురాళ్ళను విజయోస్తు అని దీవిస్తూ వారితో పాటు అడుగు ముందుకేసారు.


---------౦౦౦౦౦౦౦౦౦---------Rate this content
Log in

Similar telugu story from Drama